Monday, April 15, 2024

శ్రీ మూలాంకురేశ్వరీదేవి (మూల గూరమ్మ )(కొండవీటి రెడ్డిరాజుల కులదైవం )

శ్రీ మూలాంకురేశ్వరీదేవి (మూల గూరమ్మ )
(కొండవీటి రెడ్డిరాజుల కులదైవం )
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
వ్యాసకర్త : తంగెళ్ళశ్రీదేవిరెడ్డి 

నమో మహాదేవీ.. నమో సదా బాంధవి 
నమో నిత్య శుభంకరీ... నమో రణ భయంకరీ 
నమో కుల రత్నాకరీ.... నమో వంశ ప్రభాకరీ 
నమో జ్వాలా ప్రకాశినీ... నమో లీలా విలాసినీ 
నమో మాతా మూలాంకురేశ్వరీ 
జయోస్తుతే నమో నమః

కొండవీటి రెడ్డిరాజుల కులదైవం మూలాంకురేశ్వరీదేవీ. జన నానుడిలో 
మూల గూరమ్మ లేదా గురమ్మ. ఈ అమ్మవారు గుంటూరు జిల్లా నర్సరావుపేట తాలూకా 
ఫిరంగిపురం మండలం అమీనాబాద్ దగ్గర కొండ మీద కొలువై ఉన్నది. కొండవీడుకు ఫిరంగిపురం ఐదు కిలోమీటర్ల దూరం. రెడ్డి రాజులకు ఈ ఫిరంగిపురం గ్రామం ఫిరంగుల తయారీ రవాణా కేంద్రముగా ఉండేది. ఈ క్రమంలో రెడ్డి రాజులు ఆ ప్రాంతాన్ని తరచూ పర్యటించేవాళ్ళు. 

👉చరిత్ర :

కొండవీటి రెడ్డి రాజులు 

ప్రోలయ వేమారెడ్డి 1325 నుంచి 1353 వరకు
అనపోతారెడ్డి 1353 నుంచి 1364 వరకు
అనవేమారెడ్డి 1364 నుంచి 1386 వరకు
కుమార గిరిరెడ్డి 1386 నుంచి 1402 వరకు
పెదకోమటి వేమారెడ్డి 1402 నుంచి 1420 వరకు
రాచవేమారెడ్డి 1420 నుంచి 1424 వరకు

1 ) అనవేమారెడ్డి కాలంలో : 

చరిత్ర ప్రకారం క్రీ.శ. 1364 నుంచి 1386 వరకు కొండవీడును పాలించిన అనవేమారెడ్డి ఈ ఆలయ నిర్మాత. అనవేమారెడ్డి తన పాలనా కాలంలో
తనకు చేకూరిన విజయాలకి చిహ్నంగా క్రీ.శ. 1377 లో తమ ఏలుబడిలో ఉన్న అమీనాబాదులో కొండ ప్రాంతాన్ని ఎంచుకుని ఈ ఆలయం నిర్మించాడు.


ఆలయం, అమ్మవారి విగ్రహం కూడా చిన్నవిగా ఉంటాయి. కానీ వైభవం గొప్పదిగా విలసిల్లింది. ఆలయం కట్టించినప్పుడు అమ్మవారి
నిత్య ధూప దీప నైవేద్యాల కోసం వడిదరము , మూలగూరు , అమ్మనవల్కలూరు అను మూడు గ్రామములను పంటభూములను దానం ఇచ్చాడు అనవేమారెడ్డి. 

2 ) కుమారగిరి రెడ్డి / కాటయవేమారెడ్డి కాలంలో :

1386 నుంచి 1402 వరకు పాలన సాగించిన 
కుమారగిరిరెడ్డి కాలంలో మహామంత్రిగా సైన్యాధిపతిగా కాటయవేమారెడ్డి ఉన్నాడు. వీరు స్వయానా రెడ్డిరాజుల బావమరిది. ధీశాలి ధైర్యశాలి ఐన కాటయవేమారెడ్డిని 1394 -95 ప్రాంతంలో తూర్పు దండయాత్రలకు పంపిస్తాడు కుమారగిరిరెడ్డి. 
ఆ సమయంలో బావమరిది సమేతముగా మూల గూరమ్మను దర్శించుకుని ఆయుధ పూజలు నిర్వహిస్తాడు కుమారగిరిరెడ్డి. కాటయవేమారెడ్డి రాజమహేంద్రవరం జయిస్తాడు. ఈ క్రమంలో 1395 నుండి 1414 వరకు రాజమహేంద్రవరాన్ని పాలిస్తాడు కాటయవేమారెడ్డి.

ఈ విషయం జానపదుల గాథల్లో 
" బామ్మర్ది కాటయ వేముడు ఖడ్గం వహించినాడు. కుమారగిరి భూపాలుడు ధర్మం నడిపించినాడు. మూల గురమ్మ ముచ్చట తీరగా యుద్ధ రంగనా విజృంభించినారు. రాజమహేంద్రవరమున 
రాజాధిరాజు కాటయవేముడు కదిలొచ్చినాడు "
అంటూ నేటికిని వినిపిస్తున్నది. 

రాజమహేంద్రవరంలో ప్రస్తుతం దేవిచౌకుగా పిలవబడే ప్రాంతంలో కొర్లమ్మపేటలో గుడి నిర్మించి మూలగురమ్మ ప్రతిరూపాన్ని ప్రతిష్టించాడు కాటయవేమారెడ్డి. ఈ మూల గూరమ్మనే జన వ్యవహారంలో మూలకూరమ్మగా , కొర్లమ్మగా పిలవబడి నేడు దేవిచౌక్ ప్రాంతంలో కొర్లమ్మపేటగా స్థిరపడినది. 

1410 లో వేయించిన అఘోబిల శాసనం ప్రకారం.... కొర్లమ్మపేట మూలగురమ్మ అమ్మవారికి కాటయవేమారెడ్డి కొమరగిరి గ్రామాన్ని దానం చేసినట్లు తెలుస్తున్నది . 

ప్రస్తుతం రాజమండ్రి వాసులు తమ గ్రామదేవతగా కొర్లమ్మ తల్లిని ఆరాధిస్తున్నారు. ప్రతి ఉగాది ముందువచ్చే అమావాస్య రోజున అమ్మవారి జాతర జరుగుతుంది. 

1953 లో వచ్చిన గోదావరి భీకర వరదలు కారణంగా కొర్లమ్మ అమ్మవారి ఆలయం పూర్తిగా కొట్టుకుపోయింది. ఈ పరిస్థితిలో అమ్మపేట మొదటి వీధిలో చిన్న గుడిని నిర్మించి అమ్మవారి విగ్రహాన్ని పునః ప్రతిష్ఠించడం జరిగింది. 

3) పెదకోమటి వేమారెడ్డి కాలంలో :

1402 నుంచి 1420 వరకు పాలించిన పెదకోమటి వేమారెడ్డి అమీనాబాద్ మూలగురమ్మ అమ్మవారి కోసం మరో రెండు గ్రామాల పంట భూములను దానం ఇచ్చినట్టుగా జానపదుల గాథలు తెలియ జెప్తున్నాయి. కానీ శాసన ఆధారాలు మాత్రం కనిపించడం లేదు. వేమారెడ్డి భార్య సూరాంబ. ధాన్యకటకం ప్రభువు గన్న భూపాలుని కూతురు. అమీనాబాదులో సంతాన సాగరం అనే చెరువును తవ్వించింది.

4) రాచవేమారెడ్డి కాలంలో 

1420 - 1424 వరకు పాలించిన రాచ వేమారెడ్డి 
 కొండవీటి రాజుల్లో చివరి వాడు. వీరు అమీనాబాద్ కొండ సమీపంలో తల్లి సురాంబ తవ్వించిన చెరువు నుండి "'జగనొబ్బ గండ - కాలువ తవ్వించాడు." ఈ చెరువును పూర్వం సంతాన సాగరం అని పిలిచేవాళ్ళు ప్రస్తుతం ఇది " మల్కా చెరువు" గా పిలవబడుతున్నది. 

👉శాసన ఆధారాలు : 

అమీనాబాద్ మూలగూరమ్మ దేవాలయం దగ్గర కొండ మీద ఏటవాలుగా ఉన్న ఒక ఫలకం మీద చెక్కబడిన జారుడు బండ శిలా శాసనం ద్వారా " ఆది పరాశక్తి స్వరూపమే మూలాంకురేశ్వరీదేవి. రెడ్డి రాజుల కులదైవమై విలసిల్లుతున్నది " అనే విషయం స్పష్టం అవుతుంది. 1402 నుంచి 1420 వరకు పాలన చేసిన పెదకోమటి వేమారెడ్డి ఈ శాసనము వేయించాడు. 
ముఖ్యంగా ఇక్కడ అనేక శిలాశాసనాలు దొరికినప్పటికీ.... పోషణ, భద్రత, కరువై స్థానభ్రంశం చెంది పరిష్కరింపబడలేదు అని స్థానికుల ద్వారా తెలుస్తున్నది. 

శాసనాలను పరిష్కారకర్త వేటూరి ప్రభాకరశాస్త్రి తన శృంగారశ్రీనాథంలో " శాసనము సమీపమందుకు పోయి పరిశీలించి వచ్చితిని..... రెండు సీస పద్యములను ఒకరిచే చెక్కబడినవే . పెదకోమటి వేమారెడ్డి నాటివే. అనవేముని ధర్మమును చెప్పునవే . కావున శాననములో పద్యములు పెదకోమటి కాలములో రచింపబడి చెక్కబడినవి..." అని పేర్కొన్నారు. 

ఆ పద్యమిది : 

శాకాబ్దములు సహస్రమును యిన్నూట తొంబై యెనిమిదియు ననుభవ్య సంఖ్య గలిగియొప్పారెడు నలవత్సరంబున మాఖమాసము పున్నమాదినమున విశ్వోత్తరుండైన వేమభూపాలుండు దన కులస్వామిని కమృత కిరణ రేఖావతంస మూల గూరమ్మకు నఖిల జగన్మాత కంగరంగ భోగసంసిద్ధికై ధారపోసి యిచ్చి గ్రామములు మూడు కోట భూమి యందు వడిదరము మూలగూరమ్మన పల్కలూరు దానఖచరేంద్ర దాచంద్ర తరకముగ.

1996లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి వెలువడిన రాజమండ్రి చరిత్రలో అమ్మవారి ప్రస్తావన ఉన్నది. 
 
👉గురమ్మ పేరు మీద :

కళింగ నుండి కటక్ వరకు మూలగురమ్మ కరుణా కటాక్షాలతో దండయాత్రలు నిర్వహించి జైత్రయాత్రలు నిర్వహించాడు కాటయవేమారెడ్డి. తర్వాత ఇదే బాటలో వీరభద్రారెడ్డి , దొడ్డారెడ్డి విజయ దుందుభి మోగించారు. ఈ క్రమంలో మద్యాంధ్ర, ఉత్తరాంధ్ర రెడ్లకు, ప్రస్తుతం ఒరిస్సాలో స్థిరపడి నివసిస్తున్న రెడ్లకు, ఈ దేవత పేరు మీద గురువారెడ్డి,గురువులు రెడ్డి, గురువు నాయుడు, గురయ్యరెడ్డి , గురుమూర్తిరెడ్డి, గురమ్మ ,, గురుదేవి , గురువయ్య, గురయ్య, గురప్ప, అని పేర్లు పెట్టుకోవడం ఒక ఆచారంగా కొనసాగుతూ వస్తున్నది. 
👉కాలక్రమేణా 

అనవేమారెడ్డి మొదలుకుని రాచవేమారెడ్డి వరకు రెడ్డి రాజుల వారసులు ఈ అమ్మవారిని తమకు జయాన్ని చేకూర్చే కులదేవతగా కొలవడం మొదలెట్టారు. ఈ రెడ్డి రాజులు యుద్దాలకు బయలుదేరుతున్నప్పుడు మూలగూరమ్మకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించేవాళ్ళు. 

పూర్వం రాజ్యంలో "మూలగూరమ్మ పంటదేసటి రెడ్లను కాపాడే తల్లిగా " బాగా పేరెన్నికయ్యింది. కానీ ఇప్పుడు గ్రామదేవతగా అందరి దేవతగా పూజలు అందుకుంటున్నది. 

రెడ్డి రాజుల పతనం తర్వాత ఆలయాన్ని పట్టించుకునే వాళ్ళు కరువై ఆలయ పంట భూములన్నీ హరించుకుపోయాయి. అమ్మవారికి నిత్య ధూప దీప నైవేద్యాలకు లేమి ఏర్పడింది. రెడ్డి రాజుల వైభవంతో పాటుగా అమ్మవారి వైభవం కూడా కనుమరుగయ్యింది. శతాబ్దాల కాలం అమ్మవారు అనామకులుగా మిగిలిపోయారు. అందుకే నేటికిని మూల గూరమ్మ అమ్మవారి గురించి జిల్లాలోనే చాలా మందికి తెలియదు. 

సుమారు నాలుగు దశాబ్దాల కిందటి 1978 ప్రాంతం నుండి అమ్మవారి వైభవం మళ్ళీ మొదలయ్యింది. శంకరమంచి రాధాకృష్ణమూర్తి ఆలయ అర్చక బాధ్యతలను స్వీకరించారు . ఆలయ ట్రస్టు చైర్మెన్‌గా శ్రీ పెద్ది అక్కయ్య నియమింపబడ్డారు . 

👉సకల దేవతల ధామం :

కొండ క్రింద ఎడమవైపు శ్రీ పోలేరమ్మ తల్లి కొలువై ఉంటుంది. తర్వాత మూలగూరమ్మ అమ్మ వారి దర్శనం కోసం మెట్లు ఎక్కుతుంటే వరుసగా విఘ్నేశ్వరుని మందిరం, సుబ్రహ్మణ్యంస్వామి, అయ్యప్ప స్వామి, ఆలయాలు వస్తాయి. ఈ మందిరాలు తర్వాత నిర్మించబడినవి తప్ప రెడ్డి రాజులకు సంబంధం లేదు. 

ఇక్కడ ఉన్న శివాలయం మాత్రం ప్రాచీనమైనది. శైవమతాన్ని అవలంబించిన రెడ్డి రాజులే ఈ ఆలయాన్ని కూడా అమ్మవారికి తోడుగా నిర్మించి ఉంటారనేది కథనం. 

ఆంజనేయస్వామి కూడా కొలువై ఉంటాడు. నవగ్రహ మండపం ఉంటుంది. ఈ మండపానికి ముందు యజ్ఞ వాటిక ఉంటుంది. పూర్వపు రాజులు ఇక్కడ అనేక యాగాలు చేసేవారుగా జానపద కథనాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ ఇక్కడ యజ్ఞాలు జరుగుతూ వుంటాయి .

అక్కడే చిన్న గుడిలో అమ్మవారు కొలువై ఉంటారు. విశాలమైన నేత్రాలు , పచ్చని ముఖం, అమ్మవారి ప్రత్యేకత. 

👉అమ్మవారి మహిమలు

ప్రతి పర్వదినం సందర్భంగా ఇక్కడ పెద్దఎత్తున ప్రత్యేక పూజలు జరుగుతాయి. అట్లా 2001 సంవత్సరంలో దసరా ఉత్సవాలు జరుగుతున్నప్పుడు, ఒక 14 ఏళ్ళ అమ్మాయి యజ్ఞమండపం దగ్గర నుండి పొరపాటున జారి ఎనభై అడుగుల కిందకి పడిపోయింది. అంత ఎత్తుమీదనుంచి పడిపోయినా ఆ అమ్మాయికి చిన్న గాయం కూడా కాలేదు . మూలగూరమ్మ అమ్మవారి దయవల్లనే ఆ అమ్మాయి క్షేమంగా బతికి బట్ట కట్టగలిగిందని అందరూ విశ్వసించారు. అది మొదలు అమ్మవారి మీద జనాలకు మరింత భక్తి ప్రపత్తులు పెరిగాయి అనేది వాస్తవం. 

మిత్రుల్లారా వీలుంటే మూలగూరమ్మను దర్శించుకోండి 
నమో నారాయణీ నమోస్తుతే
___________________________________________
ఆధారం : 
1) ఉత్తరాంధ్ర రెడ్డి జాతి ఆణిముత్యాలు ప్రత్యేక సంచిక లో ""రెడ్డి రాజుల కులదైవం మూలమూరమ్మ"" వ్యాసం అక్టోబర్ 2020
వ్యాసకర్త : జాతీయ రెడ్డి జే ఏ సీ కార్యవర్గ సభ్యులు త్రినాద్ రెడ్డి
2 )P S M లక్ష్మి కథా నాటక రచయిత్రి గారి భక్తి పర్యటన సమాచారం, సంచిక పత్రిక- ఆగస్టు 2018 
3 ) గుంటూరు వాస్తవ్యులు రమణారెడ్డి గారు ఇచ్చిన సమాచారం. 
4) వేటూరి ప్రభాకరశాస్త్రి శృంగారశ్రీనాథం అనుబంధం పుట -19

No comments:

Post a Comment