Tuesday, April 16, 2024

గార్లపాటి రఘుపతిరెడ్డి( 1927 -2020 )(తెలంగాణా విముక్తి పోరాటయోధుడు )

గార్లపాటి రఘుపతిరెడ్డి
( 1927 -2020 )
(తెలంగాణా విముక్తి పోరాటయోధుడు )
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
పోరుబాటల్లో నడిచి
ఉద్యమాల పొలికేకల్లో ధ్వనించి....
పల్లెతల్లిని విడిచి 
నిర్భందాల సంకెళ్లను సహించి....
ఉరికంభాన్ని ముద్దాడి వచ్చిన ఉద్యమబాలుడు 
గార్లపాటి రఘుపతిరెడ్డి !
//వివరాల్లోకి వెళ్తే....//

ఉమ్మడి నల్లగొండ జిల్లా రామానుజాపురం రఘుపతిరెడ్డి స్వగ్రామం. వీరు 1927 ప్రాంతంలో జన్మించారు . వీరి తండ్రి గార్లపాటి నారాయణరెడ్డి , గ్రామ వతందార్‌ గా పనిచేసేవాడు (గ్రామ పోలీస్‌ పటేల్‌).
ప్రాథమిక విద్యను శాలిగౌరారం, నల్గొండ ప్రాంతాల్లోను, తరువాత హైదరాబాదు నారాయణగూడలోని కేశవ మెమోరియల్ హైస్కూలులోను రఘుపతిరెడ్డి చదివాడు.

 //క్విట్ ఇండియా ఉద్యమంలో //

భారత్ చోడో ఆందోళన్ /ఆగస్టు ఉద్యమం/ అని కూడా పిలుచుకునే క్విట్ ఇండియా ఉద్యమం లో 
1942 ప్రాంతంలో కేశవ మెమోరియల్ స్కూల్ లో చదువుతున్న రోజుల్లో రఘుపతిరెడ్డి పాల్గొన్నాడు. 15 - 16 ఏళ్ల వయసులో ఉన్న రఘుపతిరెడ్డి తోటి విద్యార్థులతో కలిసి ఉద్యమంలో దూసుకుపోయాడు.

// తెలంగాణ స్టూడెంట్ యూనియన్ ఉద్యమంలో //

నిజాం రాజరిక పరిపాలన కింద తెలంగాణ ప్రాంతం సామాజిక ఆర్థిక రాజకీయ అణిచివేతల్ని ఎదుర్కొంటున్న సమయంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం నిజం వ్యతిరేక ఉద్యమాలతో రగిలిపోయింది. ఈ క్రమంలో విద్యార్థులు నిజాం రాజ్యాన్ని భారత ప్రభుత్వంలో కలపాలని హైదరాబాదు స్టూడెంట్ యూనియన్ తరపున ఉద్యమం చేశారు. పరిస్థితి చేయిదాటింది. విద్యార్థులను అణచివేయడానికి పోలుసులు లాఠీచార్జీ, టియర్ గ్యాస్, రబ్బరు బుల్లెట్లను ప్రయోగించారు. అంతా అల్లకల్లోలం అయింది. ఈ పరిస్థితి రఘుపతిరెడ్డిలో సమరోత్సాహం నింపింది. కచ్చితంగా ఉద్యమంలో పాల్గొని తెలంగాణ కోసం పోరాడాలని గట్టిగా నిశ్చయించుకున్నాడు. 

స్థిరమైన నిర్ణయం రఘుపతి రెడ్డిని హైదరాబాదులో నిలబడనీయలేదు. చదువు మానేసి గ్రామానికి వెళ్ళిపోయాడు. అప్పటికి అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటాలు జరుగుతున్నాయని అతనికి తెలుసు. కాబట్టి తనకు అందుబాటులో ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరి, పార్టీ నిర్వహించే ఉద్యమాల్లో పాల్గొన్నాడు. కాగా అక్కడ ఉద్యమకారులపై పోలీసుల దాడులు విపరీతమయ్యాయి. ఉద్యమాలు జరిపే పరిస్థితి లేకుండా పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో రఘుపతి రెడ్డి మళ్ళీ హైదరాబాదుకు వచ్చి చదువు కొనసాగించాడు.

// తెలంగాణ పోరాట ఉద్యమంలో//

కాలక్రమంలో తెలంగాణ ప్రాంతంలో నిజాం వ్యతిరేక పోరాటాలు ఎక్కువయ్యాయి. గ్రామాలు పోరాటాలతో అట్టుడికి పోతున్నాయి. స్టేట్ కాంగ్రెస్, ఆర్య సమాజ్, కమ్యూనిస్టు ఆంధ్ర మహాసభలు నిజం వ్యతిరేక పోరాటాన్ని ఎవరికి వారే కొనసాగిస్తున్నారు. ఆంధ్ర మహాసభ గ్రామాలలో సంఘాలు ఏర్పరిచి చురుకుగా పనిచేస్తున్నది.

నవయువకుడిగా హైదరాబాద్ నుండి రామానుజాపురం వచ్చిన రఘుపతిరెడ్డి.ఆంధ్ర మహాసభ కార్యక్రమాల పట్ల ఆకర్షితుడయ్యాడు.
 గ్రామాల్లో రాత్రిపూట జనాల్ని పోగుచేసి ప్రదర్శించే నిజాం వ్యతిరేక ,వెట్టి చాకిరి వ్యతిరేక, బుర్రకథలు గొల్ల సుద్దులు రఘుపతి రెడ్డిని బాగా ఆకట్టుకున్నాయి. 
ఇక చదువు ఉద్యోగం ఇవేమీ ఆలోచన చేయలేదు. సంఘంలో చేరాడు.తర్వాత సాయుధ దళంలో చేరి, చురుకుగా పనిచేయడం మొదలెట్టాడు.

అడ్డగూడూర్, కంచనపల్లి, అమ్మనబోలు, మోత్కూర్
వంటి గ్రామాలలో దళ ప్రచారం సాగించాడు. అంతేకాదు ఆకస్మిక దాడులకు పాల్పడి పటేల్, పట్వారిల వద్ద ఉండే భూములు, వెట్టిచాకిరీ తాలూకూ ఒప్పంద పత్రాలను స్వాధీనం చేసుకుని తగలబెట్టడం, వాళ్లదగ్గరున్న బర్మా తుఫాకీలను లాక్కొని పారిపోవడం వంటి సాహసోపేతమైన చర్యలకు పాల్పడ్డాడు

//తెలంగాణ ట్వెల్వ్‌ //

1948 సెప్టెంబర్ లో నిజాం నవాబు భారత ప్రభుత్వానికి లొంగిపోయిన తర్వాత కొందరు సాయుధ పోరాట నాయకులు పోరాటాన్ని తిరిగి కొనసాగిస్తూ అజ్ఞాతవాసంలోకి వెళ్లారు. మరికొందరు పోరాట నాయకులు అరెస్టయి జైలకు పంపించబడ్డారు తెలంగాణ ప్రాంతాన్ని సైనిక గవర్నర్ పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నది. పోరాట ప్రాబల్యం ఉన్నచోట భారత్ పోలీసులు క్యాంపులు వేసుకొని పోరాట వీరుల్ని నిలువరిస్తున్నారు..నిజాం రాజ్ ప్రముఖ్ గా నియమించబడ్డాడు. కమ్యూనిస్టులు ఎందరో తమ రాజకీయ అవసరాల కోసం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రజలు కూడా ఇక తమ దైనందిక జీవితాన్ని ప్రారంభిస్తూ కమ్యూనిస్టులకు మద్దతు పలకడం ఆపేసారు.

ఈ పరిస్థితిలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అక్కినెపల్లి, షా అబ్దుల్లాపురం గ్రామాల్లో జరిగిన అల్లర్లలో దొరల, రజాకార్ల హత్యలు జరిగాయి. ఈ కేసులో నిందితులుగా _ 1.గార్లపాటి రఘుపతిరెడ్డి
 2. జనార్ధన్ రెడ్డి, 3నంద్యాల శ్రీనివాస్ రెడ్డి(నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే), 4.దూదిపాల చినసత్తిరెడ్డి, 5.ఎర్రబోతు రాంరెడ్డి, 6.దాసరి నారాయణరెడ్డి, 
7.మేర హనుమంతు, 8.మాగి వెంకులు, 9.వడ్ల మల్లయ్య, 10.మిర్యాల లింగయ్య, 11.కల్లూరి ఎల్లయ్య, 12.గులాం దస్తగిరి లను అదుపులోకి తీసుకున్నారు. వీళ్లంతా 14- 20 సంవత్సరాల లోపు వల్లే. అప్పటికి గార్లపాటి రఘుపతి రెడ్డి వయసు 19- 20 సంవత్సరాలు.

అరెస్ట్ చేయబడ్డ రఘుపతి రెడ్డి 
ఖమ్మం కాన్సంట్రేషన్‌ క్యాంపులో చిత్రహింసలకు గురయ్యాడు. తర్వాత నల్లగొండలో స్పెషల్‌ ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేసి వారం రోజులపాటు రరఘుపతిరెడ్డితో పాటు ఇతరుల మీద విచారణ కొనసాగించారు. దొంగ సాక్ష్యాలను ప్రవేశపెట్టారు. కమ్యూనిస్టు నాయకులపై నిషేదాజ్ఞలు అమలులో ఉన్నాయి. గ్రామాలకు గ్రామాలు వణుకుతున్నాయి. ఈ స్థితిలో దోషుల తరుపున డిఫెన్స్‌ లాయర్‌ వాదించే పరిస్థితి కూడా లేదు. 

 1948 అక్టోబరులో ప్రత్యేక ట్రైబ్యునల్‌ అక్కినేపల్లి, షా అబ్దుల్లాపూర్ హత్యలకేసు విచారణ జరిపి
 గార్లపాటి రఘుపతి రెడ్డితో పాటుగామరో 11 మంది సాయుధ పోరాట వీరులకు ఉరిశిక్ష విధించింది.మొత్తానికి రఘుపతి రెడ్డితో పాటుగా ఇతరులకు అందరిని చెంచలగూడ జైలుకు పంపారు.l

1951 జనవరి 21, 22న వారిని ముషీరాబాద్‌ జైల్లో ఉరితీసేందుకు ఆదేశాలు జారీ అయ్యాయి.

కాగా 1950 లో తెలంగాణ పోరాట వీరులు జైల్లో మగ్గుతున్నారని తెలిసి , వాళ్ల కథనాల్ని వ్యాసాలుగా ప్రచురించాలని సంకల్పించి, టైమ్స్ పత్రికకు చెందిన ఒక మహిళా జర్నలిస్టు జైలుకు వెళ్లి అక్కడ పోరాట ఖైదీలతో మాట్లాడింది. ఆ సమయంలోనే ఉరిశిక్ష పడ్డ 12 మంది బాల వీరులు ఆమె దృష్టికి వచ్చారు.

 ‘తెలంగాణ ట్వల్వ్‌’గా కథనాన్ని రూపొందించి ,
16 - 17 సంవత్సరాల వయసున్న ఎర్రబోతు రామిరెడ్డి ఫోటో సేకరించి అంతర్జాతీయ కథనాన్ని ప్రచురించింది.

"బాలుడికి ఉరిశిక్ష " ( Execution of a boy ) శీర్షికతో వచ్చిన తెలంగాణ ట్వల్స్ వ్యాసం జాతీయ అంతర్జాతీయ మానవతావాదుల్ని కదిలించింది
 జెకోస్లోవేకియా రాజధాని ప్రాగ్‌లో అంతర్జా తీయ యువజనోత్సవాలు జరుగుతున్నాయి. ఆ ఉత్సవాలకు ప్రపంచం నలుమూలల నుండి దాదాపు 
పది వేలమంది హాజరయ్యారు. ఎర్రబోతు రాంరెడ్డి గురించిన కీలకమైన వ్యాసం ప్రచురింపబడిన పత్రికను ప్రదర్శిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. 
బాలుడుకి ఉరిశిక్ష వేయడాన్ని ముక్త కంఠంతో ఖండించారు . ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు జరిగాయి. అన్ని వైపుల నుండి నిరసన సెగలు తగులుతూ ఒత్తిడి పెరగడంతో అప్పటి నెహ్రూ ప్రభుత్వం అప్పీలుకు అవకాశం కల్పించింది.

అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రఘుపతిరెడ్డి పాటుగా మిగతా వారు హైకోర్టుకు
అప్పీల్‌ చేశారు. పేరు పొందిన ఆ కేసును వాదించేందుకు ఇంగ్లండ్‌కు చెందిన ప్రఖ్యాత న్యాయవాది డీఎన్‌ ప్రిట్‌ విచ్చేశారు.
ముంబై నుంచి లతీఫ్‌, గణేష్‌ అనే లాయర్లను కమ్యూనిస్టు పార్టీ రప్పించింది. 

 తీర్పు అమలుకు 14 గంటల ముందు నాటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్‌.. ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మారుస్తూ ఆదేశాలు జారీచేశారు. అనంతరం గుల్బర్గా, చంచల్‌గూడ జైళ్లలో తొమ్మిదేళ్లు శిక్ష అనుభవించారు. 1956లో కొందరు, 1958 లో కొందరు జైలు నుంచి విడుదలయ్యారు.

 ఈవిధంగా ఉరి కొయ్యలను ముద్దాడిన ఉద్యమ బాలుడిగా రఘుపతిరెడ్డి చరిత్ర సృష్టించాడు 

// కమ్యూనిస్టు సభ్యత్వం వదులుకుంటూ //

1960లో భారత కమ్యూనిస్టు పార్టీ రెండుగా చీలిపోయింది. పార్టీ చీలికను జీర్ణించుకోలేని రఘుపతి రెడ్డి 1964లో పార్టీ సాధారణ సభ్యత్వాన్నీ వదులుకున్నారు.
కానీ వామపక్ష భావజాలాన్ని మాత్రం వీడలేదు. ‘‘కమ్యూనిస్టుగానే నా జీవితం ముగుస్తుంది’’ అని స్వీయరచనలో రాసుకున్నాడు రఘుపతిరెడ్డి.
 
//కుటుంబం //

రఘుపతి రెడ్డి భార్య శకుంతలమ్మ 1985 లో 35 ఏళ్ల క్రితమే మృతిచెందారు. ఈ దంపతులకు నర్మద, నరోత్తంరెడ్డి, విజయకుమార్‌ రెడ్డి సంతానం వున్నారు.

//జీవిత చరిత్ర //

తన సుధీర్ఘ ఉద్యమజీవితం, ఉద్యమం చివరి దశలో ఉరిశిక్ష, అనూహ మలుపులతో ఉరిశిక్ష రద్దు కావడం, వంటి జీవితంలో కీలకమైన అంశాలతో రఘుపతి రెడ్డి గారు తన జీవిత చరిత్ర రాసుకోవడం జరిగింది.. "ఉరికంబం ఎక్కబోతూ తిరిగొచ్చిన...." పేరుతో వెలువడిన ఈ పుస్తకం 2019, సెప్టెంబర్ 11న తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో జరిగిన ‘తెలంగాణ సాయుధపోరాటం’ వార్షికోత్సవ సభలో అవిష్కరించబడింది. 

//సౌమ్యవాద స్వప్నికుడి మహాప్రస్థానం //

రక్తంలో ఇన్‌ఫెక్షన్‌ సమస్యతో కొన్ని రోజులు మంచానికే పరిమితమై, స్థితి విషమించడంతో పరిస్థితి నల్లగొండ జిల్లా రామానుజపురంలోని స్వగృహంలో జులై 26, 2020 న పరిపూర్ణమైన 93 ఏళ్ల వయసులో రఘుపతి రెడ్డి గారు శివైక్యం పొందారు..

నిజాం రాచరిక పాలన నుంచి హైదరాబాదును విముక్తి చేసేందుకు పాఠశాలస్థాయిలోనే సాయుధ పోరాట ఉద్యమంలో పాల్గొని ఉరిశిక్ష ఖరారై చివరి క్షణాల్లో రాద్దయిన వారిలో ఒకరైన రఘుపతిరెడ్డి మరణ వార్తను పత్రికలు ---
"సాయుధ పోరాటంలో ఉరికంబాన్ని ముద్దాడి వచ్చిన యోధుడు" గా పతాక శీర్షికలు రాసాయి..

వ్యాసకర్త : తంగెళ్ళ శ్రీదేవిరెడ్డి

No comments:

Post a Comment