Monday, April 15, 2024

కొత్తూరు సుబ్బారాయుడు ఆలయం


బీరం చెన్నారెడ్డి
[కొత్తూరు సుబ్బారాయుడి ఆలయ నిర్మాణ కారకుడు]

✍️తంగెళ్ళశ్రీదేవిరెడ్డి 

▪️వివరాలు :

కొత్తూరు గ్రామం, పాణ్యం మండలం, కర్నూలు జిల్లా...! 
శివపార్వతుల తనయుడు సుబ్రహ్మణ్యస్వామి ఇక్కడ సుబ్బారాయుడుగా వెలసినం దున ఈ గ్రామాన్ని "సుబ్బరాయుడు కొత్తూరు" (ఎస్.కొత్తూరు) అని పిలుస్తారు..

15 వ శతాబ్దం... అంటే సుమారుగా 500
ఏళ్ళ క్రితం నిర్మించబడిన 
మహిమాన్వితమైన సుబ్రహ్మణ్యస్వామి ఆలయ నిర్మాణం వెనుక ఒక సాధారణ రైతు బీరం చెన్నారెడ్డి గారి పాత్ర ఉన్నది. ఈ పాత్ర సాక్షాత్తూ సుబ్రహ్మణ్యస్వామి సంకల్పంగా 
ఆలయ చరిత్ర చెబుతున్నది. గ్రామ చరిత్ర కూడా ఇదే చెబుతున్నది. 

ఇక్కడ ఆలయం ఎందుకు నిర్మించబడింది ?
నిర్మాణం వెనుక కారణాలు ఏమి?

వీటి నేపథ్యంలో ఇక్కడ ఒక అద్భుతంగా జరిగినట్టుగా ఆలయ చరిత్రను అనుసరించి 
స్థానికులు కథలు కథలుగా చెప్పుకుంటారు.
శ్రీవల్లీదేవీ సమేతంగా వెలసిన సుబ్రహ్మణ్యస్వామి
మహిమలు ఇతర ప్రాంతాలకు పాకడంతో వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులు కూడా ఆలయ చరిత్ర గురించిన కథనాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. 

▪️ఆలయ చరిత్ర - బీరం చెన్నారెడ్డి కథనం 

చరిత్ర -

14 వ శాతబ్దంలో అంటే రెడ్డిరాజుల పాలనాకాలానికి అటు ఇటుగా 500 ఏళ్ళ క్రితం.....కొత్తూరు గ్రామంలో బీరం చెన్నారెడ్డి అనే ఒక ఆసామి ఉండేవాడు. వ్యవసాయం జీవనాధారంగా కాలం గడిపేవాడు. ఈ క్రమంలో కాలం కలిసి రాక తీవ్ర మైన ఆర్థిక ఇబ్బందులతో సతమతం అయ్యాడు.
తట్టుకోలేని కష్టాలు తన జీవితాన్ని కుటుంబాన్ని వేధిస్తున్న పరిస్థితుల్లో దిక్కుతోచని వాడయ్యాడు. తనను ఏదో గ్రహ పీడ వేదిస్తున్నాడని భావించాడు. ఈ క్రమంలో సమస్యలు గట్టెక్కే మార్గం కోసం తమకు బాగా తెలిసిన ఒక బ్రాహ్మణుడిని ఆశ్రయించాడు. అయ్యవారు లెక్కలు వేసి చూసి -
" మాఘ శుద్ధ షష్ఠి రోజున పొలం దున్నితే కష్టాలు తొలగుతాయి " అని సూచించాడు.

బ్రాహ్మణుడి మాటలు చెన్నారెడ్డిలో ఆశను కలిగించాయి. అయ్యవారి సూచన పాటిస్తే తన పీడనలు తొలగి జీవితం సంతోషమయం అవుతుందని నమ్మాడు. ఆ ప్రకారం మాఘ శుద్ధ షష్ఠి రోజున తన కాడెద్దులను నాగలికి కట్టి పొలం దున్నడం ప్రారంభించాడు.

పొలాన్ని కొంతమేర దున్నిన తర్వాత నాగలికి అత్యంత బలంగా ఒక రాయి అడ్డు తగులుతుంది. చెన్నారెడ్డి ఆగిపోతాడు. నాగలికి ఏం అడ్డు తగిలిందో అతడికి అర్థం కాదు. ఎందుకంటే తాను ప్రతి ఏటా పొలం దున్నుతూ వస్తున్నాడు. ఎప్పుడూ రాయి అడ్డు తగలలేదు. మరి ఇప్పుడేంది ఇట్లా అనుకుంటూ ఏం అడ్డు తగిలిందో చూడబోతాడు.
అంతలో మెరుపుల ధాటి భీకరంగా మొదలవుతుంది ఆ మెరుపుల కాంతి తట్టుకోలేక చెన్నారెడ్డి కంటిచూపు కోల్పోతాడు. 

సంఘటన జరిగిన కాసేపటి చుట్టు పక్కల రైతులు విషయాన్ని గ్రహించి చెన్నారెడ్డిని సమీపిస్తారు. చెన్నారెడ్డి జరిగిన సంగతి వివరిస్తాడు. రైతులు ఇక ఆలస్యం చేయకుండా నాగలిని వెనక్కులాగి చూస్తారు.

ఇంకేం...అక్కడ పన్నెండు శిరస్సుల నాగేంద్రుడి విగ్రహం చెక్కిన పెద్ద రాతి ఫలకం ఒకటి బయట పడుతుంది. ఆ తరువాత సుబ్రహ్మణ్యేశ్వస్వామి
ఒక బాలుడు రూపంలో కనిపించి - 
విగ్రహానికి మూడు రోజుల పాటు తనకు క్షీరాభిషేకం చేయాలని వివరిస్తాడు. గ్రామస్థులు ఆ ప్రకారమే చెన్నారెడ్డి పొలంలో బయటపడ్డ నాగేంద్రుడికి పాలాభిషేకాలు చేస్తారు. విచిత్రంగా ఆ మూడు రోజులు తర్వాత చెన్నారెడ్డికి చూపు వస్తుంది.

మహిమను గుర్తించిన గ్రామస్థులు చెన్నారెడ్డిని కారణజన్ముడిగా భావిస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి గుడి కట్టాలని కూడా నిర్ణయించుకుంటారు. 
అనుకున్న ప్రకారం స్వామివారి స్వయంభు విగ్రహాన్ని అక్కడే నేలమీద పెట్టి గుడి నిర్మాణం ప్రారంభిస్తారు.

కాగా ఇక్కడి ఆలయానికి పై కప్పు ఉండదు. ఇందుకు గల కారణాన్ని స్థలపురాణం స్పష్టంగా వివరిస్తున్నది.

ఆలయ స్థలపురాణం :

సుబ్రహ్మణ్యస్వామి విగ్రహం చెన్నారెడ్డి నాగలికి తగలాగానే వెలువడిన మెరుపులు 
సాధారణమైనవి కాదు సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వస్వామికి సంబంధించినవి. ఆ ప్రకారం -
 
" ఆకాశంలో 12 తలల నాగుపాము రూపం
 దివ్య తేజస్సుతో ప్రత్యక్షమౌతుంది. ఆ తేజస్సుకు చెన్నారెడ్డి తన చూపును కోల్పోయాడు. తర్వాత 
ఒక బాలుడు ప్రత్యక్షమై తాను సుబ్బరాయుడినని సాక్షాత్తూ సుబ్రహ్మణ్యేశ్వస్వామి ప్రతిరూపాన్ని అని మూడు రోజుల పాటు తనకు క్షీరాభిషేకం చేస్తే చెన్నారెడ్డికి చూపు వస్తుందని చెబుతాడు " అని స్థలపురాణం చెబుతున్నది.

ప్రచారంలో ఉన్న జానపద కథలు కూడా ఇదే చెబుతున్నాయి.

స్వప్న దర్శనం :

సుబ్రహ్మణ్యస్వామికి గుడి కట్టాలని గ్రామస్థుల నిర్ణయం తర్వాత చెన్నారెడ్డికి స్వప్న దర్శనం జరుగుతుంది.

" రాత్రి రోకలిపోటు తరువాత నిర్మాణం మొదలుపెట్టి, తెల్లవారు జామున కోడి కూతకు ముందే గుడి నిర్మాణం పూర్తి చేయాలి...లేదంటే ఏడుగురు బలి కావాల్సి వస్తుంది " అని హెచ్చరిస్తాడు.విషయాన్ని చెన్నారెడ్డి గ్రామస్థులకు తెలియజేస్తాడు. ఆ ప్రకారం గ్రామస్థులు ఒక మంచిరోజు చూసుకుని గుడినిర్మాణం ప్రారంభిస్తారు.

స్వామివారి స్వయంభు విగ్రహాన్ని అక్కడే భూమి మీద పెట్టి గుడి నిర్మాణం ప్రారంభిస్తారు. కానీ కోడి కూతలోగా ప్రహరీ మాత్రమే పూర్తవుతుంది. స్వప్న దర్శనంలో స్వామి వారి హెచ్చరిక ప్రకారం గ్రామస్తులు గుడి నిర్మాణం ఆపేస్తారు.పైకప్పులేని ఆలయం సిద్ధమౌతుంది. అదివరకు కొత్తూరుగా పిలిచిన గ్రామాన్ని, గుడి నిర్మాణం తర్వాత ఆ సుబ్బరాయుడు కొత్తూరుగా పిలవడం ప్రారంభం అయ్యింది . 

▪️విభిన్నమైన ఆచారాలు 

కొత్తూరు ఒక చిన్న గ్రామం. కానీ సుబ్రహ్మణ్యస్వామి సుబ్బారాయుడుగా వెలసి గ్రామానికి ప్రాముఖ్యతను ఆపాదించి పెట్టాడు.

గ్రామంలో ఆదివారం అందరూ సెలవు దినంగా పాటిస్తారు. ముఖ్యంగా ఆదివారం నాడు రెండు ఆచారాలు ఖచ్చితంగా పాటిస్తారు.
1 )మాంసాహారం ముట్టకపోవడం,
2) ఎవ్వరైనా మరణిస్తే అంత్యక్రియలు నిర్వహించకపోవడం  

ఈ రెండు ఆచారాలు పూర్వం నుండి ఆచరిస్తూ వస్తున్నారు.ఇందుకు కారణాలు గమనిస్తే సుబ్రహ్మణ్యస్వామికి ఇష్టమైన రోజు ఆదివారం. అందుకే నియమం పాటిస్తారు.

అట్లాగే - కాలక్రమంలో ఆదివారం నాడు సుబ్బారాయుడిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరిగిపోయింది. గ్రామం అతి చిన్నది. కాబట్టి వచ్చిన భక్తులకు అసౌకర్యం కలిగించకుండా అంత్యక్రియలను వాయిదా వేసుకుంటారు.

▪️బీరం చెన్నారెడ్డి చరిత్ర - వంశీయులు 

బీరం చెన్నారెడ్డి శివభక్తుడు. బాల్యం నుండి శివారాధన పారాయణుడు.చెన్నారెడ్డి శివభక్తి గ్రామాన్ని సుభిక్షంగా ఉంచుతున్నదని ప్రజలు భావించేవాళ్ళు. ఈ విధంగా చెన్నారెడ్డి పెరిగి పెద్దవాడు అయ్యాడు. ఒక ఇంటి వాడు అయ్యాడు.
కొన్నాళ్లకి చెన్నారెడ్డికి దైవ పరీక్షలు కష్టాల రూపంలో మొదలయ్యాయి. ఆనాటి చెన్నారెడ్డి కష్టాలు, ఇప్పడు భక్తుల కష్టాలను కడతెర్చే ఆలయ నిర్మాణానికి కారణభూతం అయ్యింది.

బీరం చెన్నారెడ్డి వంశీయులు గురించి మాట్లాడితే వంశాభివృద్ధి జరిగి కొత్తూరు, ఆ పరిసర ప్రాంతాల్లో బీరం వంశీయులు ఎక్కువగా కనిపిస్తున్నారు. 

 ▪️బీరం చెన్నారెడ్డి వంశీయులు

 కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికీ,శివాలయానికి ధూప దీప నైవేద్యాలు సమర్పణకై తమ సొంత భూమిని కేటాయించారు. చెన్నారెడ్డి వంశీయుడైన బీరం శివరామిరెడ్డి ఆలయానికి కొన్నాళ్ళు చైర్మన్ గా వ్యవహరించారు. తర్వాత బీరం చెన్నారెడ్డి వంశీకులకు దేవస్థానం అభివృద్ధిలో తగిన విధంగా ప్రాధాన్యత లేకపోవడం విచారకరం.
----------------------------------------------------------------
ఆధారం :
సుబ్బారాయుడి ఆలయ చరిత్ర
కొత్తూరు గ్రామ చరిత్ర

No comments:

Post a Comment