Monday, April 15, 2024

రాజబహదూర్ వెంకటరామిరెడ్డి

రాజ బహదూర్ వెంకటరామిరెడ్డి (1869- 1953)
( రెడ్డి హాస్టల్ వ్యవస్థాపకుడు - సంఘ సేవకుడు )

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
✍️తంగెళ్ళ శ్రీదేవిరెడ్డి

బాల్యం మొత్తం బాధల బరువులు....
కష్టాలు కన్నీళ్లు వెన్నంటి నడిచిన వేదనలు...
అయినా సడలని ఆత్మ విశ్వాసంతో 
జీవితాన్ని పునర్నిర్మించుకున్నాడు..
అతడు
రాజ బహదూర్ వెంకట్రామిరెడ్డి!

// పరిచయం//

 తెలంగాణ చరిత్రలో పరిచయం అవసరం లేని పేరు రాజ బహదూర్ వెంకట్రామిరెడ్డి. వీరి అసలు పేరు పాశం వెంకట్రామిరెడ్డి. వీరి జీవిత చరిత్రను రాస్తూ సురవరం ప్రతాపరెడ్డి గారు వెంకట్రామిరెడ్డి బాల్యాన్ని గురించి రాస్తూ .... "' బాల్యాన్ని పూరి గుడిసెలో గడిపి, బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయి, భవిష్యత్తులో అత్యున్నత స్థాయికి ఎదిగిన అమెరికా ప్రెసిడెంట్ అబ్రహం లింకన్ వంటి మహనీయులతో పోల్చారు. ఆర్థిక పరిస్థితి మినహా తల్లి లేని మిగతా కష్టమంతా ఒకటే అని అభిప్రాయపడ్డారు.

// బాల్యం //

వెంకట్రామిరెడ్డి తల్లి బారమ్మ ( భారతమ్మ), తండ్రి కేశవరెడ్డి.పూర్వ పాలమూరు జిల్లా గద్వాల సంస్థాన వాస్తవ్యుడు కేశవరెడ్డి. గద్వాల చుట్టు 7 - 8 గ్రామములకు వీరు పటేలుగా కొనసాగేవాడు. కేశవరెడ్డి గారు ఆ కాలములోనే ధనికుల్లో ఒకడిగా ఉండేవాడు. గోపాలుపేట సంస్థానము వారికి వీరు సుమారు 60 వేలకు పైగా అప్పు కూడా ఇచ్చి ఉన్నారు . కాని అప్పు వసూలుకాక కేశవరెడ్డి నష్టపోయాడు.. 

ఇదే పూర్వ పాలమూరు జిల్లా వనపర్తి సంస్థానములో ఒక గ్రామం రాణిపేట ( రాయణి పేట ). ఈ గ్రామమే వెంకటరామారెడ్డి గారి అమ్మమ్మ గారి ఊరు. అమ్మమ్మ కిష్టమ్మ, తాత రాయిరెడ్డి. వీరికి శాయిరెడ్డి ( విలియం వహబ్ ) ,పరకాలరెడ్డి
బారమ్మ ( భారతమ్మ ),జానమ్మ సంతానం. వెంకట్రామిరెడ్డి ఇదే గ్రామంలో జన్మించాడు. సురవరం ప్రతాపరెడ్డి చెప్పిన ప్రకారం వెంకట్రామిరెడ్డి అసలు జన్మదిన తేదీ తెలియదు. కాని వారి ఉద్యోగపు కవిలెలో, వారుజనన తేది 19 అర్ది బెహిష్త్ 1276 ఫసలి " అని ఉన్నది. ఆ ప్రకారం వారి పుట్టిన తేదిన
ఆగస్టు 22, 1869 గా మనం చెప్పుకుంటున్నం.

వెంకట్రామిరెడ్డి పుట్టిన మూడు రోజులకు తల్లి బారమ్మ మరణించింది. తర్వాత బారమ్మ గారి చెల్లెలు జానమ్మను కేశవరెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. వెంకట్రామిరెడ్డి మాత్రం అమ్మమ్మ కిష్టమ్మ దగ్గర పెరిగాడు.

// వనపర్తి సంస్థానాధీశులతో బంధుత్వం //

 వెంకట్రామిరెడ్డి అమ్మమ్మ కిష్టమ్మ ఎవ్వరో కాదు ,1835 - 1866 వరకు వనపర్తి సంస్థానమును పరిపాలించిన సనై రాజా రామేశ్వర రావు బహద్దరుగారి సొంత చెల్లెలు. సంస్థాన పరిపాలకుల్లో వీరు మొదటి రామేశ్వరరావు.వీరి సతీమణి రాణి శంకరమ్మ
 పేరు మీదే వనపర్తి సమీపంలో శంకరంపేట ఏర్పడింది.

//విలియం వహబు //

 వెంకట్రామిరెడ్డి మేనమామ విలియం వహబు పేరును గురించి చాలమందికి చాలా సందేహాలు కలుగుతాయి. అతని అసలు పేరు శాయిరెడ్డి అయినప్పటికీ విలియం హవాబుగా ఎందుకు పిలువబడ్డాడు ? సురవరం ప్రతాపరెడ్డి చెప్పిన వివరాలను మనం గమనిస్తే విలియం వహాబ్ మేనమామ ప్రధమ రాజారామేశ్వర గారిలో ఆంగ్ల సంస్కృతి ప్రభావం విపరితంగా ఉండేది . వీరు తన మేనల్లుడు శాయిరెడ్డి తో పాటుగా మరో ఆరుగురు రెడ్డి బాలురను తన వద్ద ఉంచుకొని వారికి ఒక ఇంగ్లీషు ఫాద్రిగారి చేత విద్యాభ్యాసం చెప్పించేవారు. ఆ ఇంగ్లీష్ ఫాద్రి గారు తన వద్ద చదువుకుంటున్న పిల్లలను పేర్లతో సంభోదించడం కోసం తన సౌలభ్యం కోసం విలియం, హెన్రీ,ఛార్లస్ , ఏడ్వర్డ్ , మొదలగు మారు పేర్లు పెట్టారు.ఈ ఇంగ్లీషు పేర్లకు ఆనాటి నిజాం ఏలుబడి ప్రభావం చేత ముసల్మాను పేర్లగు వహబు అనే తోక గూడా జతై అవే స్థిరపడిపోయాయి.  

// వనపర్తిలో విద్యాభ్యాసం // 

 తనకు 9 సంవత్సరాల వచ్చేవరకు రాణిపేటలో ఖాన్లీ (ప్రైవేటు) బడిలో భారత భాగవతాలు చదువుకున్నాడు. తర్వాత సమీపంలో ఉన్న వనపర్తి వెళ్లి చదువుకున్నారు. తన మేనమామ గారికి మేనమామ అయిన రాజా రామేశ్వరరావు గారి రెండవ దత్తపుత్రుడు ద్వితీయ రాజా రామేశ్వరరావు బహదూర్, వెంకట్రామారెడ్డికి సహధ్యాయిగా ఉండేవాడు. ఇద్దరూ తెలుగుతో పాటుగా ఉర్దూ భాషను అభ్యసించారు.

తొమ్మిదవ సంవత్సరము నుండి 12 వ సంవత్సరము వరకు ఉర్దూలో “పహిలీ ", ఫార్సీలో "కరీమా" పూర్తి చేసాడు . వీరికి చదువు చెప్పే మౌల్వీసాహేబు చాలా కఠినంగా ఉండేవాడు. పాఠం చదవడంలో ఏమాత్రం తప్పులు దొర్లినా గోరంట బరిగేతో వీపుల మీద వాతలు పడేలా కొట్టేవాడు. ఇటువంటి కఠినమైన తట్టుకుంటూ వనపర్తిలో విద్యాభ్యాసం కొనసాగించాడు వెంకట్రామిరెడ్డి.

// రాయిచూర్ లో విద్యాభ్యాసం //

విలియం హవాబ్ రాయచూరులో సదరు మొహతెమీం (జిల్లా పోలీసు అధికారి)గా నియమించబడ్డాడు. వారు తన కుమారునితో పాటుగా తన మేనల్లుడు వెంకాట్రమ రెడ్డిని వనపర్తి నుండి రాయచూరుకు తీసుకువెళ్ళాడు. అక్కడ ఊర్దూ,ఫార్సీ, తెలుగు భాషలలో విద్య కొనసాగించాడు. .ఉర్దూ విద్యకై ఒక మౌల్వీనీ, తెలుగు చెప్పుటకై ఒక భట్రాజును, విలియం హవాబ్ నియమించాడు. 
రాయచూర్ నాలుగు సంవత్సరాలు వరకు ఉన్నాడు. ఈ సమయంలోనే వెంకట్రామారెడ్డి కి కన్నడ, మరాటీ, భాషలు కూడా అలవడ్డాయి. ఇట్లాంటి సమయంలోనే మేనమామ విలియం హవాబ్ అకాల మృత్యు వాత బడ్డాడు. అప్పటికి వెంకట్రాంరెడ్డి వయసు 16 సంవత్సరాలు. మేన మామ మరణంతో చదువు మధ్యలోనే ఆగిపోవలసి వచ్చింది. వెంకట్రామారెడ్డిని గ్రామానికి తీసుకెళ్లి వ్యవసాయం చేయించాలని అనుకున్నారు. చదువుకోవాలని ఆశలున్న వెంకట్రామిరెడ్డి మనసు అల్లకల్లోలం అయింది. ఇటువంటి పరిస్థితుల్లో వెంకట్రామిరెడ్డి జీవితం అనూహ్యంగా మలుపు తిరిగింది

▪️ముద్గల్ ఠానా అమీన్ గా..

విలియంవహబ్ గారికి అత్యంత సన్నిహితుడైన సీనియర్ అమిన్ గా పనిచేస్తున్న నాజర్ మహమ్మద్ ఖాన్, వహబ్ స్థానములో రాయచూరుజిల్లా పోలీసు అధికారిగా వచ్చాడు . అతడు వహాబ్ గారి కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చి, వెంకట్రామారెడ్డిని చేరదీశాడు. అతని చొరవతో వెంకట్రామారెడ్డి హైదరాబాద్ చేరుకున్నాడు. తర్వాత కొంత కాలానికి నెలకు ₹20 జీతంతో లింగుసూగూరు జిల్లా ముద్గల్ ఠానా అమీన్ గా 1886లో నియామకం పొందాడు. అప్పుడు వెంకట్రామారెడ్డి వయసు అక్షరాల 17 సంవత్సరాలు మాత్రమే.

// కవిగా వెంకట్రామారెడ్డి //

సురవరం ప్రతాపరెడ్డి గారు వెంకట్రామిరెడ్డి గారిలో మరో కోణాన్ని ఆవిష్కరణ చేస్తూ.. " ఒకా నొక సమయంలో వెంకట్రామారెడ్డి కవితలు రాసేవాడు " అనే విషయం ప్రస్తావించాడు .ఈ విషయం ప్రపంచానికి తెలియదు అని కూడా చెప్తూ, కవితలు లభ్యం కాలేదు అని కూడా చెప్పాడు. కాకపోతే వెంకట్రామారెడ్డి ఎవరి ప్రేరణతో కవితలు రాశాడో మాత్రం వివరించాడు.

వెంకట్రామారెడ్డి అమీన్ గా పనిచేసే దగ్గర తహసీల్దారుగా వచ్చిన “మౌల్వీ షాబా ఖీసాబ్", ​మేనమామ విలియంవహబ్ గారికి పాత మిత్రుడు.అప్పటికి వెంకట్రామారెడ్డి 17 - 18 సంవత్సరముల యువకుడు. తహసిల్దార్ వృద్ధుడు. ఈ కారణంగా తహసిదారుకు వెంకట్రామారెడ్డికి మధ్య గురు శిష్యులు అనుబంధం ఏర్పడింది.ఈ క్రమంలో ఉర్దూ ఫార్సీలో మరింత ప్రవీణత కలుగుటకై వెంకట్రామారెడ్డికి పాటలు బోధించేవాడు. కవితలు చదివి వినిపించేవాడు. కచేరీలకు తన వెంట తీసుకు వెళ్ళేవాడు.ఉర్దూ వాజ్మయములోని ప్రసిద్ధకవుల గ్రంథాలను తెచ్చి ఇచ్చేవాడు. ఆ విధంగా క్రమంగా వెంకట్రామారెడ్డిలో కవితా పఠనం మాత్రమే కాదు కవితలు రాయడం కూడా అలవడింది

//శాంతిభద్రతలు - మతసామరస్యం //

కొంతకాలం తర్వాత వెంకట్రామారెడ్డికి ముద్గల్ నుండి రాయచూరు జిల్లాలోని యాద్గీరు బదిలీ అయ్యింది. అక్కడ 
వరదారావు అనే తహసీల్దారు వద్ద వెంకట్రామారెడ్డి న్యాయశాస్త్రము అభ్యసించాడు. వకీల్ పరీక్ష కూడా రాశాడు కానీ ఉత్తీర్ణుడు కాలేకపోయాడు. ఇది నా ఉండగా యాద్గీరు కలరా వ్యాపించి ప్రాణ నష్టం ఆరంభమైంది. హిందువులు గ్రామ దేవత మారేమ్మను శాంతి పరిచే ఉద్దేశంతో జంతుబలితో పూజలు ప్రారంభించారు. హిందువులు కట్టెలతో కొన్ని బొమ్మలు తయారు చేసుకున్నారు. ముస్లింలు ఆ కట్టెలను విరగొట్టేశారు. ఇంకేముంది? మత ఘర్షణలు ప్రారంభమయ్యాయి. ఈ పరిస్థితుల్లో వెంకట్రామారెడ్డి చాకచక్యంగా ప్రవర్తిస్తూ ఇరువురు మత పెద్దలతో చర్చించి శాంతిభద్రతల్ని నెలకొల్పాడు.. ఈ సందర్భాన్ని పరిష్కరించుకొని జిల్లా తాలూగ్దారు నిజాం రాష్ట్ర జిల్లా పోలీసు ప్రధాన శాఖకు ఉత్తరం రాస్తూ వెంకట్రామారెడ్డి తన విధి నిర్వహణలో చూపించిన చతురతను ప్రశంసించడం జరిగింది.తర్వాత యాద్గీరు నుండి వీరు కల్వకుర్తి తాలూకాకు, తర్వాత నాగర్ కర్నూల్ కు, మహబూబునగర్ జిల్లా కోయిలకొండకు మార్చబడ్డారు . తర్వాత కాలక్రమంలో తాను చదువుకున్న వనపర్తి లోను వెంకట్రామిరెడ్డి తన ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు.

యాద్గీరులో చూపించిన చతురత
 వెంకట్రామారెడ్డి ఉద్యోగ జీవిత మొత్తం కొనసాగింది. మత సామరస్యం కోసం.... శాంతి భద్రతల కోసం.. అనుక్షణం అప్రమత్తంగానే ఉన్నాడు.


// అంకిత భావం కలిగిన ఉద్యోగిగా //

 కల్వకుర్తి తాలూకాలోని డాకాలను దొంగల గుంపులను సమూలంగా అణచివేసారు.
 నాగర్ కర్నూల్ మహబూబ్నగర్ జిల్లాల్లో దొంగలకు దడ పుట్టించాడు.

నిజామాబాద్ జిల్లాకు కోర్టు ఇన్ స్పెక్టరుగా వెళ్లిన సమయంలో బ్రిటిష్ సైన్యానికి సంబందించిన పరివర్తన తప్పిన డగ్లసు అనే సోల్జర్ ను పట్టించి 
ఇండియా ప్రభుత్వమునుండి 11 రూపాయల బహుమతి అందుకున్నాడు..

 నిజామాబాదులో పనిచేస్తున్నప్పుడే గంగన్న అనే ఒక అనాధ బాలుడిని చేరదీసి జీవితం ప్రసాదించాడు.

 కరీంనగర్ జిల్లాలో పనిచేసేటప్పుడు అక్కడ దొంగల బెడద ఎక్కువగా ఉండేది.దొంగల భయంతో ప్రజలకు కునుకు పట్టేది కాదు.ఈత చాపలు అల్లి అమ్ముకునే వడ్డే జాతి వారు ఈ దొంగతనాలకు పాల్పడేవారు కానీ దొరకపోయేవారు. కానీ వెంకట్రామారెడ్డి చాకచక్యంగా ప్రవర్తించి దొంగల్ని పట్టుకొని రెండు వేల రూపాయలను ప్రభుత్వానికి అప్పగించాడు. ప్రభుత్వ నుండి 50 రూపాయలు విలువ చేసే గడియారం నజరానగా పొందాడు 

//నగర కొత్వాల్ గా వెంకట్రామిరెడ్డి //

హైద్రాబాదు నగరకొత్వాలు పదవిలో మొదటి నుండి ముస్లింలే కొనసాగారు . ఈ క్రమంలో వెంకట్రామారెడ్డి తొలి హిందువుగా 13 వ నగర కొత్వాల్ (హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌) గా 1920లో నియమించబడి సంచలనం సృష్టించారు.
పనిచేసిన ప్రతి చోటా చూపించిన సామర్థ్యం తెగువ అంకితభావం నిజాం దృష్టిని ఆకర్షించింది. కాబట్టే ప్రత్యేక శ్రద్ధతో వెంకట్రామారెడ్డి నియామకాన్ని ప్రోత్సహించాడు నిజాం .

నగర కొత్వాల్ గా కొనసాగుతూనే ఇతర ప్రభుత్వశాఖల నుండి కూడా ప్రజలకు సేవలు అందించాడు. వాటిలో మచ్చుకు గమనిస్తే....

నగర పోలీస్ కమీషనర్‌గా, ఎక్స్-అఫీషియో క్యాడర్‌లో బల్దియాకు కూడా నాయకత్వం వహించాడు. బల్దీయ అనగా మునిసిపల్ పరిపాలన అని అర్థం.

నగరంలో శాంతి భద్రతలు రక్షణా చర్యలు నిమిత్తం ప్రత్యేక సిబ్బందిని నియమిస్తూ " కందిల్ " వ్యవస్థను ప్రవేశపెట్టాడు. వీధి దీపాలను ప్రవేశపెట్టాడు. అందిల్ అంటే వీధి దీపాల వ్యవస్థ. దీన్ని ప్రస్తుతం స్ట్రీట్ లైట్స్ అంటున్నారు

 నగర వీధులు పరిశుభ్రంగా ఉండటం కోసం ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాడు.

నగర పురపాలక సంఘంలో సభ్యులయ్యారు.పురపాలక సంఘ ఉపాధ్యక్షులు అయ్యారు. వీరి చొరవతో నగరములో మురికినీటి కాలువల పునర్నిర్మాణము ప్రారంభమయ్యింది

నగరంలో ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు ప్లేగు నివారణ సంఘములో సభ్యులుగా చేరి, రోగులకు ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి చికిత్సలు చేయించి, ఆస్పత్రికి పంపించి, అనేక సేవలు చేశారు. ప్లేగు వ్యాధి కారణంగా కొందరు జనాలు భయంతో నగరాన్ని వదలి వెళ్తున్న వాళ్లకి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాడు .

విక్టోరియా మెమోరియల్ ఆర్ఫనేజ్ (అనాథ శరణాలయము) కార్యనిర్వాహక వర్గములో ముఖ్య సభ్యులై అనాధ పిల్లలను చేరదీశాడు .

కొలతలను తూకములను సంస్కరించు సంఘములో సభ్యులై అవినీతి జరగకుండా అరికట్టాడు.

నగరాభివృద్ధిశాఖ, (ఆరాయి షెబల్ద) లో సభ్యులై,
 రోడ్ల విస్తరణలో భాగంగా ఇండ్లు పడగొట్టాల్సి వచ్చినప్పుడు, అందుకు ఒప్పుకోని ఇంటి యజమానులతో మాట్లాడి, న్యాయస్థానాలతో పని లేకుండా సమస్యను పరిష్కరించాడు.

సర్ఫెఖాస్ గౌరవ కమిటీలో ముఖ్య సభ్యులుగా , కేసుల పరిష్కారములలో ప్రభుత్వానికి సహాయపడ్డాడు.
 
నజంజమాయత్ (సైన్య శాఖ) విచారణ సంఘములో , దిక్కు లేని పిల్లల (లావారస్) విచారణ సంఘంలో మానసిక వైద్యశాల పాలక వర్గంలో,సీతారాం బాగు దేవాలయము అభివృద్ధి కమిటీలో, సమర్థవంతంగా పనిచేశాడు.ఇంకా జూడిషియల్, రెవిన్యూ , మునిసిపల్ , పోలీసు ట్రైయినింగు అభ్యర్థులను పరీక్షించు పరీక్షకులుగా పని చేసాడు . మరెన్నో సంస్థల్లో శాఖలో తనదైన ముద్ర చూపించాడు 

నగర కొత్వాల్ గా కొనసాగుతున్నప్పుడే రాజా శివరాజబహద్దరు ఎస్టేటును ధర్మబద్దంగా పరిపాలించాడు. సంస్థాన ప్రభువు రాజా శివరాజ బహద్దరు గారు “ధర్మవంత". బిరుదుతో బిరుదమునకు తగినట్లే దానధర్మాలు చేసి , అప్పుల పాలై , కాలధర్మం పొందాడు. రాజా వారికి వారసులు లేరు.సంస్థానమునకు వారసులు ఎవ్వరో నిర్ణయించే వరకు సంస్థాన పాలనా పగ్గాలను కమిటీ అధీనములో ఉంచారు. కమిటీ అధ్యక్షులుగా ' వెంకట్రామారెడ్డి గారు ధర్మదృష్టితో పరిపాలించాడు అప్పులన్నీ చెల్లించి, కమిటీ సమయం ముగిసేనాటికి సుమారు 5 లక్షలు సంస్థానం ఖాజానాలో నిలువ ఉంచారు. ఈ కాలంలో గౌరవార్థము నెలకు 110 రూపాయలు వీరికి ఇవ్వబడ్డాయి..

//రెడ్డి హాస్టల్ వ్యవస్థాపకుడిగా.... //

బాల్యంలో ఎదురైన కష్టనష్టాలను ఎదుర్కొని, తెలివిగా ఉద్యోగం సంపాదించుకొని, తెలంగాణలో దాదాపుగా అన్ని జిల్లాల్లో పనిచేసి, కుల మతాలకు అతీతంగా ప్రజల అభిమానాన్ని చూరగొని, సమర్థవంతమైన ఉద్యోగిగా ప్రభుత్వ మన్ననలు అందుకుని, జీవితాన్ని తీర్చిదిద్దుకున్న వెంకట్రామారెడ్డి ..... తన సంఘ సేవలో భాగంగా రెడ్డి హాస్టల్ స్థాపించి చరిత్రలో ఘనంగా నిలబడిపోయాడు.

 హాస్టల్ స్థాపన వెనక ఉన్న కారణాలను గమనిస్తే....అప్పట్లో హైద్రాబాదు నగరములో ఒకే హిందూ హోటలుండెది.అక్కడ భోజన వసతుల సౌకర్యం సరిగా లేకుండెది.నగరంలో చదువుకునే విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. సరైన వసతులు లేని హోటల్ కారణంగా ఇబ్బందులు పడేవారు.. వెంకట్రామారెడ్డి ఇది గమనించి, గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణానికి చదువు నిమిత్తం వచ్చే పేద నిరుపేద యువత కోసం ఒక వసతి గృహం ఏర్పాటు చేయాలనే ఆలోచనకి వచ్చాడు.

ఇట్లుండగా వనపర్తి మహారాజు , వెంకట్రామారెడ్డి సహాధ్యాయి, బంధువు, రెండవ రాజా రామేశ్వరరావు బహదూర్ గారి రెండవ కూతురు యువరాణి జానమ్మ వివాహం సిర్నాపల్లి యువరాజు రాజా రామలింగారెడ్డికి ఇచ్చి వివాహము జరప నిశ్చయమైనది. 1916 లో జరిగిన ఈ పెళ్లికి అతిరథ మహారథులు వచ్చేశారు. వెంకట్రామారెడ్డి కూడా ఆ వివాహానికి హాజరై వివాహానికి విచ్చేసిన అతిరథ మహారథులతో సమావేశమై.... " ఇంతమంది రెడ్డి రాజులు, జమీందారులు, ధనికులు, ఉండి కూడా, మన పేద నిరుపేద విద్యార్థులకు సహాయం చేయలేకపోతున్నామా అంటూ ఆలోచన చేశాడు. భావితరాలకు విద్య అవసరాన్ని గుర్తించి విద్యాసౌకర్యాలు ఏర్పాటు చేయుట కోసం తనదైన అభిప్రాయాన్ని వినిపించాడు. స్పందించిన పెద్దలు వెంటనే తన వంతు సహాయాన్ని అందించారు 

పింగళి వేంకట రామిరెడ్డిగారు 20.000 
వనపర్తి మహా రాజుగారు 25.000
 గద్వాల మహారాజు గారు 30,000
 పింగళి కోదండ రామిరెడ్డిగారు 4000
 గోపాలుపేట రాణీగారు 4000
దోమకొండ సంస్థానాధీశ్వరులు రాజారాజేశ్వరరావు 4000
రాజా సురభి వేంకటలక్ష్మారావు బహద్దరు జటప్రోలు రాజు గారు l000
చందాలు వేసారు. వీరందరితో పాటు పెళ్ళికి వచ్చిన దేశ్ముఖ్ లు , జాగీర్దారులు , భూస్వాములు, పటేండ్లు, మొదలుగు వారు తమ శక్తి కొలది ఉదారముగా చందాలు వేసారు.

వసూలైన మొత్తాన్ని వెచ్చించి వెంకటరామిరెడ్డి హైదరాబాదులో 1918లో ఒక అద్దె ఇంట్లో రెడ్డి హాస్టల్ ని ప్రారంభించాడు. రాజా మురళీధరు గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవము జరిగింది. ఐదు మందితో ప్రారంభమైన రెడ్డి హాస్టల్ ఏడాది గడవక ముందే 55 మందికి పైగా చేరింది. దినదినాభివృద్ధి చెందిన రెడ్డి హాస్టల్ నిర్మాణానికి తర్వాత కాలంలో సొంత స్థలాన్ని కూడా కొనుగోలు చేయడం జరిగింది.

▪️వదంతులు 

అభివృద్ధి చెందుతున్న రెడ్డి హాస్టల్ గురించి కొన్ని వదంతులు కూడా బయలుదేరాయి. రహస్యంగా ఆయుధాలు తెప్పించి విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారని పుకారు బయలుదేరింది. మతసామరస్యం దెబ్బతినే పరిస్థితులు ఏర్పడ్డాయి
 తనిఖీలు కూడా జరిగాయి. ఏమి దొరకపోవడంతో అంతా పుకారేనని తేలిపోయింది.

▪️రెడ్డి హాస్టల్ అనుబంధంగా... 

రెడ్డి హాస్టల్ కి అనుబంధంగా ఒక గ్రంథాలయం ఏర్పాటు చేశారు. ఆ కాలంలోనే 11000 గ్రంథాలను సేకరించారు.

రెడ్డి హాస్టల్ కి అనుబంధంగా కూరగాయల సాగు నిమిత్తం హుస్సేన్ సాగర్ దగ్గర ఒక ఎకరం స్థలంలో " రెడ్డిబాగ్" ను ఏర్పాటు చేశారు. సెలవు దినాల్లో విద్యార్థులు అక్కడికి వెళ్లి తోట పనులు చేసేవారు.

విద్యార్థుల శారీరక శ్రమ కోసం ఒక వ్యాయామశాలను , దేశభక్తి జాతీయ భావాలు పెంపొందించడం కోసం స్కౌట్ శాఖను ఏర్పాటు చేశారు. రెడ్డి హాస్టల్ విద్యార్థులకు ఆరోగ్య పరిరక్షణ నిమిత్తం ప్రత్యేక వైద్య విభాగము కూడా
 ఏర్పాటు చేశారు.హాస్టలులో " విద్యార్థి యువజన సంఘం " కూడా స్థాపించి వారం చర్చాసభలు (Debates) ఏర్పాటు చేసి సందేహాలు నివృత్తి చేసుకునే, సమస్యలు చెప్పుకునే వెసులుబాటు కల్పించారు .

 రెడ్డి వసతి గృహంలో దిక్కుమక్కు లేని పిల్లల కోసం "అనాధలయము " విభాగం కూడా ఏర్పాటు చేశారు

సురవరం ప్రతాపరెడ్డి గారు రెడ్డి హాస్టల్ కి దశాబ్దానికి పైగా కార్యదర్శిగా కొనసాగారు. స్వచ్ఛందంగా వేతనంలేని సేవలందించారు 

▪️రెడ్డి హైస్కూల్

 రెడ్డి వసతి గృహము ఏర్పాటుచేసిన ఉత్సాహంతో వెంకట్రాం రెడ్డి గారు ప్రత్యేక ఆసక్తితో 
 " రెడ్డి హైస్కూలు"ను కూడ స్థాపించడం జరిగింది. ఈ పాఠశాల రెండేండ్ల వరకు బాగానే నడిచింది. కానీ ఆ తర్వాత పాఠశాల నడపడం కష్టతరమైపోయింది. కాబట్టి ఆపాఠశాలను తీసి వేసి కేవలము వసతి గృహం పైనే తన దృష్టిని కేంద్రీకరించాడు..


// రెడ్డి హాస్టల్ స్ఫూర్తిలో...బొమ్మగాని ధర్మ భిక్షంగౌడ్ ...//

 పేరుకు రెడ్డి హాస్టల్ అన్నారే కానీ అందులో 30% ఇతర కులాలకు సీట్లు కేటాయించారు. హైదరాబాదుకు చదువు నిమిత్తం వచ్చే ఇతర కులాలు మతాల్లోని పిల్లలు ఇబ్బంది పడకుండా రెడ్డి హాస్టల్ ఉపయోగపడుతూ వస్తున్నది. తెలంగాణ సాయుధ పోరాట వీరుడు బొమ్మగాని ధర్మ బిక్షం గౌడ్ కొన్నాళ్ళు రెడ్డి హాస్టల్ లో ఉండే చదువుకున్నారు. రెడ్డి హాస్టల్ అనేది కేవలం చదువు కోసం మాత్రమే కాకుండా విద్యార్థుల్లో ఐక్యమత్యాన్ని దేశభక్తిని పెంపొందించడంలో ఒక శిక్షణాలయం అని ధర్మబిక్షంగౌడ్ అభిప్రాయపడ్డట్టు వారి జీవిత చరిత్రలో రాసి ఉన్నది. ధర్మ బిక్షం గౌడ్ గారు కేవలం రెడ్డి హాస్టల్ లో ఉండి చదవడమే కాదు రెడ్డి హాస్టల్ స్ఫూర్తితో నల్గొండ జిల్లాలో రెడ్డి హాస్టల్ పేరుతోనే మరో హాస్టల్ కూడా స్థాపించారు. వీరు గౌడ్ హాస్టల్ అని కూడా పేరు పెట్టుకునే అవకాశం ఉన్నది . కానీ రెడ్డి హాస్టల్ అని పేరు పెట్టుకోవడం లోనే రెడ్డి హాస్టల్ క్రమశిక్షణ మనకు ఇక్కడ అర్థమవుతున్నది.

//బాలికా / స్త్రీ విద్యను ప్రోత్సహిస్తూ...//

అప్పట్లో హైదరాబాదులో మాతృభాష తెలుగులో విద్యను బోధించే ప్రభుత్వ బాలికల పాఠశాల లేకపోవడంతో, తెలుగు మాతృభాషగా కలిగిన ఆడపిల్లలు ఇబ్బంది పడేవారు. బాలికా విద్యను ఆశించిన మాడపాటి హనుమంతరావు గారు, వెంకట్రామారెడ్డి గారు, ఇద్దరూ కలిసి హైదరాబాదులో తెలుగు మాధ్యమంలో నారాయణగూడాలో బాలికల ఉన్నత పాఠశాల స్థాపించారు. కానీ ఈ పాఠశాలలో తెలుగు మాధ్యమంగా ఉన్నందున ఉస్మానియా విద్యాపీఠం వారు ఈ పాఠశాలకు అనుబంధ అనుమతులు ఇవ్వలేదు. ఈ పరిస్థితుల్లో పూనేలో
మహిళా విద్యా పీఠము అనుబంధంగా ఈ బాలికల పాఠశాల నడిచింది. ఈ పాఠశాల పాలకవర్గానికి వెంకట్రామిరెడ్డి అధ్యక్షుడయ్యాడు. అప్పటికి అద్దె భవనంలో పాఠశాల నడుస్తున్నది. వెంకట్రామిరెడ్డి తన ఉదార స్వభావంతో బాలిక పాఠశాలకు సొంత భవనం ఉండవలెనని ఆలోచించి, బాలికా విద్యను ఆశిస్తూ, 35 వేల రూపాయలు విరాళాలు సేకరించి, నారాయణగూడలోనే ఒక సొంత భవనాన్ని బాలిక పాఠశాల కోసం నిర్మించడం జరిగింది.

▪️పాఠశాలల అభివృద్ధిలో....

ఎక్సెల్ సియర్ మిడిల్ పాఠశాల,రిఫాహోఅం పాఠశాల.,బాలికా పాఠశాల (గొల్లఖడి )పరోపకారిణీ బాలికా పాఠశాల (సికింద్రాబాదు) వంటి తదితర పాఠశాల అభివృద్ధిలో వెంకటరామరెడ్డి కీలకపాత్ర వహించాడు.

, ▪️RBVRR బాలికల వసతి గృహం 

 బాలికా విద్య ఆవశ్యకతను గుర్తిస్తూ ...గ్రామీణ ప్రాంతాల నుంచి చదువుకోవడం కోసం హైదరాబాదు వచ్చే బాలికలకు కూడా " రెడ్డి వసతి సదుపాయం" ఉండాలని ఆశిస్తూ..... రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి (RBVRR )బాలికల వసతి గృహాన్ని 
1933 సంవత్సరంలో స్థాపించడం జరిగింది 

▪️RBVRR మహిళా కళాశాల

రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి మహిళా కళాశాల, హైదరాబాద్, లాభాపేక్ష లేని విద్యాసంస్థగా ...స్త్రీ విద్యను ప్రోత్సహిస్తూ... 1954లో వెంకట్రామారెడ్డి పేరు మీద స్థాపించబడింది. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఈ విద్యాసంస్థ అనుబంధంగా పనిచేస్తున్నది. ఎంబీఏ ప్రవేశపెట్టిన మొదటి మహిళ కళాశాల గా గుర్తింపు పొందింది.

▪️ఇతర రాజా బహదూర్ వెంకటరామరెడ్డి కళాశాలలు

RBVRR మహిళా ఫార్మసీ కళాశాల

RBVRR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

//శిశువుల సంరక్షక శాసనము //

రాజా బహద్దరుగారికి అనాథ బాలబాలికలపై... వృద్దులపై... రోగ పీడితులపై.... జంతువులపై... దయ జాలి ప్రేమ. వీరు " జంతు హింసా నివారణ సంఘం"లో సభ్యులుగా చేరి జీవ కారుణ్యం గురించి ప్రజలకు అవగాహన కల్పించాడు . కొత్వాల్ గా పనిచేస్తున్న రోజుల్లో అనాథ శిశువుల కేసులను అనేకం గుర్తించడం జరిగింది. అనాధ పిల్లలను ధనవంతులు దత్తత తీసుకోవడం, వాళ్ళని తమ శాశ్వత బానిసలుగా మలుచుకోవడం, వెంకట్రామారెడ్డి గమనించాడు.ఈ క్రమంలో నిజాం శాసనసభలో “శిశువుల సంరక్షక శాసనము"ను పట్టుబట్టి మరీ చేయించారు. అనాధ పిల్లల కోసం అనాధాశ్రమాలు ఏర్పాటు కావడం కోసం శ్రమించారు.

//సంఘసంస్కరణ //

 వెంకట్రామా రెడ్డి గారికి వృద్ధులపై అనాధ పిల్లలపై జంతువులపై ప్రేమ ఏ విధంగా ఉన్నదో హరిజనులపై అభిమానం ఆ విధంగానే ఉన్నది. ఆనాటి సమాజంలో మూఢనమ్మకాలు విపరీతంగా ప్రబలి ఉండేవి. నిన్న వర్గాల్లో ఈ మూఢాచారాలు మరి ఎక్కువగా ఉండేవి. గమనిస్తే...కొందరు హరిజనులు తమ ఇంటి ఆడపిల్లలను వయసు రాగానే “ముకళీలు" "బసివిరాండ్రు" వంటి దురాచారాలకు బలి చేసేవారు. ఈ కళంకాన్ని రూపుమాపడంలో తన వంతు కృషిగా ఆనాటి హరిజన నాయకులకు వెంకట్రామారెడ్డి గారు ముందుండి సహకరించారు.

బాల్య వివాహాలను వ్యతిరేకించారు.
వితంతు వివాహాలను ప్రోత్సహించారు.
రెడ్డిహాస్టలులో ఒక విద్యార్థి వితంతు వివాహం చేసుకోవడానికి సిద్ధమైనప్పుడు, వెంకట్రామారెడ్డి దగ్గరుండి ప్రోత్సహించాడు. ఈ విషయం సురవరం ప్రతాపరెడ్డి గారు స్వయంగా పేర్కొన్నారు.
వితంతు వివాహాల గురించి నిజాం శాసనసభలో వెంకట్రామారెడ్డి పట్టుబట్టి శాసనం చేయించారు.

// సత్కారాలు పురస్కారాలు//

 పోలీసు శాఖలో పని చేస్తూ సర్వ సమాజం పట్ల బాధ్యతగా ప్రవర్తించిన వెంకట్రామారెడ్డి గారు బ్రిటిష్ ప్రభుత్వం నుండి....నిజాం ప్రభుత్వం నుండి... సగౌరవ సత్కారాలు పురస్కారాలు అందుకున్నారు

" రాజ బహదూర్ వెంకటరామిరెడ్డి OBE " అంటూ వెంకట్రామిరెడ్డి పేరుని రాస్తుంటారు. వీరి ఇంటి పేరు పాశం వారు. కానీ రాజ బహదూర్ గా ప్రసిద్ధుడయ్యాడు.

▪️ రాజ బహదూర్

ఏడవ నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్
తన 35 వ జన్మదినోత్సవం సందర్భంగా 1921లో వెంకట్రామిరెడ్డి సేవల్ని గుర్తిస్తూ “రాజా బహద్దూర్" అనే గౌరవ బిరుదు ఇచ్చి సత్కారం చేశారు.. 

 ▪️OBE (Order of the British Empire)

 నిజాం ప్రభుత్వానికి బ్రిటిష్ ప్రభుత్వానికి సత్సంబంధాలు కొనసాగేవి. ఈ క్రమంలో పాలన వ్యవస్థలో భాగంగా , ఉద్యోగ నిర్వహణలో వెంకట్రామిరెడ్డి సామాజిక న్యాయ సంబంధిత సేవలు బ్రిటిష్ ప్రభుత్వానికి కూడా అనివార్యంగా కొనసాగాయి. ఇందుకు ప్రతిఫలంగా బ్రిటిష్ ప్రభుత్వం 1930లో వెంకట్రామారెడ్డికి ఓబీఇ "ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్" గౌరవం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా బ్రిటిష్ ప్రభుత్వం నుండి ప్రకటించిన ఉత్తరాన్ని సురవరం ప్రతాపరెడ్డి గారు తెలుగులోకి అనువదించారు. ఆ ఉత్తర యధాతధ సారాంశం ఈ విధంగా ఉన్నది.

రాజా బహద్దరు గారికి
ఓ, బి, ఇ. బికుదము ప్రసాదింపబడిన సందర్భములో పంపబడిన లేఖయొక్క అభి ప్రాయము

గేట్ బ్రిటన్, ఐర్లండ్, .బ్రిటిషు సామ్రాజ్యముల) యొక్క చక్రవర్తియు, ఇండియా చక్రవర్తి యు, అయిప అయిదవ జార్జి, మా ప్రియమైన విశ్వాసపాత్రుడైన రాజు బహద్దరు వేంకట రామా రెడ్డికి వ్రాయుట యేమనగా: –

మేము నిన్ను మాయొక్క , ఉత్తమమైన ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ ( ఓ. బి. ఇ. } యొక్క అధికారిగా నిర్ల యించుటకు నిశ్చయించినాము. కావున ఇందుమూలముగా మిమ్ములను పై వర్గములో చేర్చి గౌరవించుచు పైబిరుదమును దానికి సంబంధించిన గౌరవము వహించుటకు అధికార మిచ్చుచున్నాము.

మా ముద్రతో, మా సంతకముతో - ఈ 15 డిసెంబరు 1930 నాటి తేదీన మాయొక్క. 21 న పరిపాల నా సంవత్సర మున నియ్యబడినది.

▪️చక్రవర్తి గారి రజితోత్సవ పతకము.6 మే 1935 న అందుకున్నారు

▪️లార్డు ఇర్విన్ వైస్రాయిగారు బంగారు గుండీలు ఉద్యోగ నిర్వహణలో అంకితభావానికి గుర్తుగా అందజేశారు 

▪️బీదరు యువరాజు నవాబ్ ఆజుంజాబహద్దరుగారిచే వజ్రాల గుండీలు వెంకట్రామిరెడ్డిని ఉత్తమ ఉద్యోగిగా కీర్తిస్తూ బహుకరించబడ్డాయి.

▪️1918 - 1919 సంవత్సరాల్లో ఇన్ ప్లూయంజా జ్వరాల విపత్తులో ప్రాణాలకు తెగించి ప్రశంసనీయమైన సేవలు జేసినందుకు వెంకట్రామా రెడ్డి గారు నిజాం ప్రభుత్వం నుండి బంగారు పథకాన్ని అందుకున్నారు.

 ఇంకా ఇటువంటి ఎన్నో మరెన్నో సత్కారాలను
 వెంకట్రామా రెడ్డి గారు అందుకున్నారు.

//వెంకట్రామిరెడ్డి పేరు మీద అవార్డు //

తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీకి తెలంగాణ ప్రభుత్వం రాజా బహదూర్ వెంకటరామ రెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీగా పేరు మార్చింది .

వెంకట్రామారెడ్డి పేరు మీద ట్రస్టును ఏర్పాటుచేసిఉన్నది. ఈ ట్రస్ట్ ద్వారా హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో తమ విధుల్లో ప్రతిభ కనబర్చిన పోలీస్ అధికారులకు రాజాబహద్దూర్ వెంకట రామారెడ్డి అవార్డును అందజేస్తున్నారు.

//ఇద్దరు నిజాం రాజుల పాలనలో...//

రాజ బహదూర్ వెంకట్రామారెడ్డి గారి జీవితం, ఉద్యోగం, ఇద్దరు నిజాం నవాబుల పాలనకు మధ్య ఒక వారధిలా కొనసాగింది. వీరి జీవిత చరిత్ర రెండు తరాల చరిత్రను అనుసంధానం చేస్తూ, ఏకకాలంలో ఇరువురి పరిపాలన విధానాల్ని అవగతం చేసుకునే అవకాశం ఇస్తున్నది. అరుదుగా ఉండే ఇటువంటి జీవిత చరిత్రలో ఉదాత్తమైన చరిత్ర వెంకట్రామారెడ్డి గారిది.

ఆరవ నిజాం నవాబ్ మహబూబ్ ఆలీఖాన్ ( పరిపాలన కాలం 1869 – 1911)
ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్
( పరిపాలనా కాలం 1911 - 1948 )
 రాజ బహదూర్ వెంకట్ రామారెడ్డి
 (ఉద్యోగ కాలం 1886 -1934)

▪️దృక్పధం కలిగిన అధికారి

వెంకట్రామిరెడ్డి నిబద్ధత కలిగిన ఉద్యోగి. దయా గుణం కలిగిన సంఘసంస్కర్త. బంధుమిత్రులను ఆదరించిన మానవీయుడు. ప్రభుత్వ పోలీసు శాఖలో ఆరవ నిజాం కాలం 1886 నుండి, ఏడవ నిజాం కాలం 1934 వరకు , అంటే 48 సంవత్సరాలు పనిచేశాడు. నగర కొత్వాలుగా 1920 నుండి 1934 వరకు 14 సంవత్సరాల సేవలందించాడు. 1934లో పదవీ విరమణ పొందాడు. ఉద్యోగ పదవీకాలం ముగిసిన తర్వాత నిజాం ప్రైవేట్ ఎస్టేట్
 " సర్ఫ్-ఎ-ఖాస్ " ప్రత్యేక అధికారిగా నియమించబడ్డాడు.
సమాజ సేవలో నిబద్ధుడై పని చేశాడు.

// కుటుంబం //

17 - 18 సంవత్సరాల వయసులోనే వెంకట్రామారెడ్డికి రాయణి పేట గ్రామానికి చెందిన రంగమ్మతో వివాహం జరిగింది. మొదటి భార్య మరణించడంతో వీరు రెండవ వివాహం చేసుకున్నారు.
మొదటి భార్య కుమారుడు రంగారెడ్డి.పూనాలో . మెట్రికు వరకు చదువుకున్నాడు.. ఉర్దూలో మంచి పాండిత్యం ఉండేది . నిజాం ప్రభుత్వ ఆబ్కారీశాఖలో డిప్యూటీ కమిషనరు పదవిలో కొనసాగాడు. రంగారెడ్డి గారికి సంతానం లేదు .

రాజాబహద్దరుగారి రెండవ భార్యకు ఇద్దరు సంతానం. కుమారుడు వెంకటలక్ష్మారెడ్డి , కూతురు నరసమ్మ. లక్ష్మారెడ్డి పూనాలో విద్యాభ్యాసము ముగించిన తర్వాత ఇంగ్లాండులో బారిష్టర్ చదువు కొనసాగించాడు . స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, మద్రాసులో కొంతకాలం శిక్షణ పొంది, హైదరాబాద్ హైకోర్టులో సర్కారీ వకీలుగా (కౌన్సిల్ గా) పనిచేసాడు.తర్వాత జడ్జిగా కొనసాగాడు   

లక్ష్మారెడ్డి గారు ఇంగ్లాండు అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు యిద్దరు కుమార్తెలు, ముగ్గురు కుమారులు .
20 సంవత్సరాలకు పైగా లక్ష్మారెడ్డి వైవాహిక జీవితం ఆనందంగా గడిచింది. ఆ తర్వాత భార్య మరణించింది. కుమార్తెలు ఒకరు లాయరు మరొకరు డాక్టర్.

వెంకటలక్ష్మారెడ్డి బారిస్టర్ చదువు కోసం భారతదేశం నుండి ఇంగ్లాండ్ కు సముద్ర ప్రయాణము చేసిన మొదటి వారిలో ఒకరు అని సురవరం ప్రతాపరెడ్డి పేర్కొన్నారు. మరొకరు పింగళి వెంకట్రామారెడ్డి గారి తమ్ముళ్ళుగా కూడా సురవరం ప్రతాప్ రెడ్డి తెలిపాడు.

 // కాలధర్మం//

పేద నిరుపేదల కోసం రెడ్డి హాస్టల్ వ్యవస్థాపకుడుగా, బాలికా విద్య ప్రోత్సాహకుడిగా, సంఘ సేవకుడిగా, మతసామరస్యం పాటిస్తూ, శాంతి భద్రతలు కాపాడుతూ , నిరాడంబరతకే మారుపేరుగా బతికిన వెంకటరామిరెడ్డి 1953 లో కాల ధర్మం చెందారు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ఆధారం :
1.రాజా బహద్దరు వేంకటరామారెడ్డి జీవితచరిత్ర , గ్రంథకర్త : సురవరం ప్రతాపరెడ్డి
 2.ప్రజల మనిషి బొమ్మగాని ధర్మ బిక్షం
 సంపాదకులు ఎస్వి.సత్యనారాయణ, ప్రభాకర్ గౌడ్



No comments:

Post a Comment