Monday, April 15, 2024

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జానపద గీతాలు

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జానపద గీతాలు
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
పరిచయం : తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

భారత స్వాతంత్రోద్యమ తొలితరం ఉద్యమ వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి గురించి కోవెలకుంట్ల ప్రాంతంలో జానపదులు పాడుకునే పాటలు.

గేయం 1
గానం : జానపద గేయబ్రహ్మ శ్రీ మునెయ్య
1.
సైరా నరసింహారెడ్డి... రెడ్డి
 నీ పేరే బంగారు కడ్డీ....రెడ్డి
 అరెరె రాజారావు రావు బహదూర్ నారసింహారెడ్డి
 ఏయ్ బంగారుకడ్డీ నారసింహారెడ్డి
అరెరే ములుకోల కట్టి చేతిలో ఉంటే మున్నోటికి మొనగాడు...
 రెడ్డి మాటలు ఏగాలోరా రండి శూరులారా // సైరా //

 2.
గడ్డమానము రెడ్డిమనము 
 కోవెలకుంట్లలోనా గొంతుకోసిరి ఫజాను తీసిరి
అరెరే దొరల పేరుతో గడ్డను దోచిన దొంగల ధనమంతా
 పేదసాధలకు పంచినాడు రా నారసింహారెడ్డి // సైరా //

 3.
బుగ్గమీసము దువ్వినాడురా నారసింహారెడ్డి
 బండి ఎక్కి దండు ముందర నడిచినాడురా నారసింహారెడ్డి
 నొస్సోం కోటను ముట్టడించెరా
 తెల్లోల్లందరి గుండెలదిరేరా కదిలిన దండు జూసి
 // సైరా //

4.
నరసింహ అని రణములోన దూకే రెడ్డి
ఎయ్ తెల్లోల్లందరి కుత్తుకలన్నీ కోసినాడురా రెడ్డి
 ఏయ్ తోవనీయని తెల్లసర్కరు నరికిన దండంత
 గడ్డ కోసము సావో బతుకు తెలుసుకున్నారంత
// సైరా //
--------------------------------------------------------------------------
గేయం 2

1) పల్లవి : 
అదుగో వచ్చే, ఇడుగో వచ్చే నరసింహారెడ్డి
పళపళ పళపళ కేకవేసెరా నరసింహారెడ్డి
చంద్రాయుధమూ చేతబట్టెనే నరసింహారెడ్డి

చరణం : 
ఆవుల మందలో పులి దుమికిన చందము దుమికినడూ
కరువు వచ్చినా కొలమొచ్చినా ఆదరించే రెడ్డీ
అట్టివక్క మన రెడ్డిమాటనూ చిన్న చెయ్యరాదూ
నాలుగు గ్రామాల మందిగా తాము లేచినారు.
--------------------------------------------------------------------------
గేయం 3
సేకరణ : తూమాటి దోణప్ప

2)దొరవారి నరసింహ్వరెడ్డి!
నీ దొరతనము కూలిపోయె
నరసింహ్వ రెడ్డి! || దొర ||

రేనాటి సీమలోనా రెడ్డిళ్ళ కులములోనా దొరవారీ వమిశానా ధీరుడే నరసింహ్వ రెడ్డి
కొయిల్ కుంట్ల గుట్టలెంటా కుందేరూ
వొడ్డూలెంటా
గుర్రమెక్కీ నీవు వస్తే కుంపిణీకీ గుండె
దిగులూ || దొర ||
కాలికీ సంకెండ్లు వేసీ చేతీకీ బేడీలు వేసీ
పారాతో పట్టి తెచ్చీ బందికానులొ పెట్టిరీ
||దొర ||
కండ్లకూ గంతాలు గట్టీ నోటినిండా బట్లు
పెట్టీ
నిలువునా నీ తలా గొట్టీ కోటా బురుజుకూ
గట్టీరీ || దొర ||
కాసిలోనా తల్లికేమో చావు సుద్దీ తెలిసినాదీ కన్న కడుపే తల్లటించే గంగలోనా గంగ గలిసే || దొర ||

No comments:

Post a Comment