Monday, April 15, 2024

రేనాటి చంద్రుడు - బుడ్డా వెంగళరెడ్డి

బుడ్డా వెంగళరెడ్డి
(1823-1900)
( రేనాటి చంద్రుడు -అపర దానకర్ణుడు )
°°°°°°°°°°°°°°°°°°°°°°°°
✍️తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

అరెరేరే...
పైటాలా_మాయిటాలా
మా కథలన్ని నీ పేరు దలిసే 
మనుషుల్లో బుట్టిన మారాజువయ్యా 
మా ఊర్లే బుట్టిన మొనగాడివయ్యా 
నల్లపురెడ్డి ఎంకటమ్మ
పుణ్యమూర్తుల కన్నబిడ్డవి
మా పాలిట కన్నతల్లివి -
నీ కొట్టుడిళ్ళుకు సిలుకు లేదు
నీ చేతికి ఎముక లేదు  
తువ్వాలు గట్టిన రెడ్డి బిడ్డా
సక్కదనాల దేవుడు బిడ్డా 
నీ బెట్టిన బువ్వ నా గడప దలుస్తున్నది 
తల్లే నిండా అన్నమ్ము బెట్టి 
మా ఆకలి తీర్చిన 
బుడ్డా ఎంగలరెడ్డి......
నీ అన్నదమ్ముళ్ళం మేము
నీ అక్క జెల్లెల్లం మేము
ఉయ్యాలవాడ దన్నెమయ్యింది
సూర్య చంద్రుల తేజము నీది
జనులెల్లా మొక్కే రూపం నీది
నీ పేరు చెప్పి బుడ్డ సేన్లల్లా
జొన్న సేన్లల్లా దాన కర్ణుడి బిడ్డలమంటాము
సంచులు నింపి దీవించమంటాము 

అంటూ కోవెలకుంట్ల ప్రాంతంలో #బుడిగేజంగాల #ఓబుళన్న ఆగకుండా గొంతెత్తి పాడుతుంటే దానధర్మాలతో దీనజనులని బతికించిన బుడ్డా వెంగళరెడ్డి కళ్ళముందు కనిపిస్తాడు.
"పాడెక్కడ నేర్చుకున్నావు ఓబుళయ్యా?"అని అడిగితే
"తాతల కాలం నుండి పాడుతున్నాం. ఎంగలరెడ్డి దాన కర్ణుడు. సావలేదు. మా మనసులల్ల బతికే ఉండడు. ఆకలైనప్పుడు అన్నంల.. దూప అయినప్పుడు నీళ్లల్లా కనిపిస్తానే ఉంటాడు...." అని చెపుతుంటే బుడ్డా వెంగళరెడ్డి ఉదార విశాల మనసు
జీవం పోసుకుని సాక్షాత్కారిస్తుంది.

కులమతాలకు అతీతంగా పేదల నిరుపేదల అభాగ్యులను ఆడుకున్న వెంగళరెడ్డి వంటి వ్యక్తులు యుగానికి ఒక్కరు!
 
#పరిచయం :

బుడ్డా వెంగళరెడ్డి జన్మదినం గురించి చరిత్ర కారుల్లో స్పష్టత లేదు.
జనవరి 1 వ తారీఖు,1840 అని కొందరు
జనవరి 1 వ తారీఖు 1822 అని కొందరు,
అభిప్రాయపడుతుండగా, వారసులు మాత్రం 1823 మే నెల అని చెబుతున్నారు.

కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ గ్రామంలో నల్లపురెడ్డి, వెంకటమ్మ దంపతులకు వెంగళరెడ్డి జన్మించాడు. వెంగళ్ రెడ్డి తండ్రి నల్లపురెడ్డి 1500 ఎకరాల భూస్వామి. బీద సాదలను ఆదరించేవాడు. పండిన పంటలో సగభాగం దానధర్మలకు పోయేది.తల్లి వెంకటమ్మ కూడా పుణ్యమూర్తి. అడిగిన వాళ్ళకు కాదనకుండా ధాన్యం కొలిచేది. అందరూ ఆమెను వెంకమ్మగా పిలిచేవాళ్ళు. తల్లిదండ్రుల నుండి ఆస్తితో పాటుగా దాన గుణాన్ని కూడా పొందాడు వెంగళ్ రెడ్డి.

వెంగళ్ రెడ్డి కాలం నాటికి తెల్లదొరల రాజ్యం సాగుతున్నది.దేశంలో పరిస్థితులు విపత్కరంగా ఉన్నాయి. సీమ ప్రాంతంలో పాలెగాళ్ళు వ్యవస్థ కొనసాగుతున్నప్పటికి బ్రిటిష్ ఆధిపత్యంలో కూడు గూడు చదువు అన్నింటికీ భారతీయులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మొదటి నుండి వెంగళ్ రెడ్డి కుటుంబం ఉయ్యాలవాడ గ్రామానికి చుట్టపక్కల గ్రామాలకు పెద్దదిక్కులా కొనసాగింది.

" తెల్లోడి పీడ అంతంత గాదయ్యా
  ఎంగల్రెడ్డి పంపిన జొల్ల 
  తల్లిదండ్రుల మాట తీరు
  ఎంకమ్మ నడిపిన పుణ్యాల బాట " 

జానపదుల పాడుకునే ఈ పదాల ఆధారంగా తల్లిదండ్రుల దాన ధర్మాలే వెంగళ్ రెడ్డికి ఆదర్శం అని.... ముఖ్యంగా తల్లి ప్రభావం వెంగళ్ రెడ్డి మీద ఎక్కువగా ఉన్నది అని కూడా అర్థం అవుతున్నది. 

వెంగళ్ రెడ్డి ప్రాథమిక విద్య వరకు చదువుకున్నాడు.
కానీ అపారమైన మేధా సంపత్తు వీరి సొంతం. న్యాయ పరమైన సలహాలు సందేహాలు కోసం గ్రామస్థులు వెంగళ్ రెడ్డిnని ఆశ్రయించే వాళ్ళంటే వీరి లోక పరిజ్ఞానం అర్థం చేసుకోవచ్చు 

#కరువు_కాలంలో_ప్రాణదాత

1832-1833 సంవత్సరాల్లో గుంటూరు ప్రాంతాలలో సంభవించిన డొక్కల కరువును నందన కరువు లేదా గుంటూరు కరువు అని పిలుస్తారు. ఈ గుంటూరు డొక్కల కరువు సమయంలో సి.పి.బ్రౌన్, ఏనుగుల వీరాస్వామయ్య కోమలేశ్వరం శ్రీనివాస పిళ్ళై తదితరులు తమకు తోచినంత వరకు ప్రజలకు అన్నవస్త్రాలు ఇచ్చి ఆదుకున్నారు.

అట్లాంటి కరువే 1866లో సీమ ప్రాంతంలో సంభవించింది. ఇదికూడా డొక్కలకరువు. ప్రజలు తిండి దొరకక చర్మం తొడిగిన అస్తిపంజరాలుగా మారిపోయారు. ఈ పరిస్థితిలో ఎవ్వరైనా కడుపు నిండా అన్నం తిన్నారు అంటే, ఆ వ్యక్తిని చంపి కడుపులో ఉన్న అన్నాన్ని తినే దుస్థితి దాపురించింది. ఈభయంకర కరువు పరిస్థితిలో ప్రజలు తిండి దొరకక అల్లాడుతుంటే ప్రభుత్వం కూడా నిస్సహాయంగా మారిపోయిన పరిస్థితిలో బుడ్డా వెంగళ్ రెడ్డి అన్నదాతగా నడుం బిగించాడు.

మొదట ఉయ్యాలవాడ గ్రామస్తులు, తర్వాత చుట్టుపక్కల గ్రామస్తులు అన్నం కోసం వెంగళ్ రెడ్డిని ఆశ్రయించే వాళ్ళు. క్రమంగా వీరి దానధర్మాల గురించి
ఆ నోటా ఈ నోటా దిశ దిశలో వ్యాపించింది. కరువుతో అల్లాడుతున్న ప్రజలు కర్నూలు కడప,అనంతపురం, బళ్ళారి, చిత్తూరు,జిల్లాల నుండి గుంపులు గుంపులుగా ఉయ్యాలవాడ చేరుకుని వెంగళ్ రెడ్డి ఆశ్రయించసాగరు.

వెంగళ్ రెడ్డి ఊరు జాతర అయ్యింది. ఎవ్వరిని వెంగళ్ రెడ్డి కాదనలేదు.వారి ఆకలిని అర్థం చేసుకున్నాడు. వాళ్ళ కాలే కడుపులకు తన ఇంటి గంజి నీళ్లు ఆసరా కావాలి అనుకున్నాడు. అందుకే ప్రజలు అక్కడే మకాం వేయగా ఇంట్లో ఉన్న ధాన్యాన్ని వాళ్ళ గంజి కోసం వినియోగిస్తూ వచ్చాడు.రోజు రోజుకు జనాలు పెరుగుతూనే ఉన్నారు. ఊరు సరిపోక పొలిమేరలు కూడా నివాసాలు అయ్యాయి. అట్లా ప్రతిరోజూ పది పెండ్లిళ్ల ఎతు జనాలు వెంగళ్ రెడ్డి అన్నదానం మీద ఆధారపడ్డారు. అయినప్పటికీ వెంగళ్ రెడ్డి వెనకడుగు వేయలేదు. చేతులు ఎత్తేయలేదు. ఓపికగా మానవీయతతో చాలాకాలం అన్నదానాన్ని కొనసాగించి వేలాది కుటుంబాల ప్రాణాలు నిలబెట్టాడు..

పూటకు ఎనిమిది నుండి తొమ్మిది వేల మందికి తక్కువ కాకుండా తిండి పెట్టారని తెలుస్తున్నది. వెంగళ్ రెడ్డి ఉదారతకు తగ్గట్టుగా వంటమనిషి గంగన్న కూడా ఓపికగా ఉండేవాడు. అందుకు మెచ్చిన వెంగళ్ రెడ్డి గంగన్నకు బంగారు కడియం కానుకగా తొడిగి సత్కరించారు. ఈ విషయం గురించి జానపదులు కొన్ని కథల్ని అల్లుకుని చెప్పుకుంటున్నారు.

ఇట్లా తన ఆస్తినంతా ప్రజల కోసం ధారపోసాడు. తిండి గింజలు అయిపోయాక చివరకు అప్పులు కూడా చేసి ప్రజలను ఆదుకోవడం జరిగింది. అందుకే..దీనజనుల పాలిట ఆపద్భాంధవుడు అయ్యాడు. ఎందరో ప్రాణాల్ని కాపాడిన మహా దాతగా చరిత్రలో మిగిలిపోయాడు.
ఈ విషయాలు జానపదుల పాటల్లో అంతర్లినంగా వినిపిస్తుంది.

" ఆస్తుల దేముంది
 పానాలు గొప్పవి అన్నావు
 ప్రజలు బతకని తానా
 ఆస్తులు ఎందుకు అన్నావు
 మన్ను బుక్కిన జనాలకు
 పరమాన్నం బెట్టి పరమాత్మ అయినావు
 మరువదు నేల నిన్ను
 మా తండ్రి బుడ్డా ఎంగల్రెడ్డి.....
 దుడ్లు లేకుంటే ఏముంది
 మనసున్నోడు ఉన్నాడు
 మన కోసం ముప్పు తిప్పలు పడ్తడు
 పూటకింత పెడ్తాడు
 సల్లంగా బతుకు తండ్రీ
 మా దీవెన్లు అందుకుని....

#విద్యాదానం

బుడ్డా వెంగళ్ రెడ్డి గారు అన్నదానానికే కాదు, విద్యాదానానికి కూడా పెట్టింది పేరుగా నిలబడ్డాడు. 
కరువు కాటకాల నుండి ప్రజలు కోలుకున్న తర్వాత ఉయ్యాలవాడలో పాఠశాలను నెలకొల్పాడు. శివరామశాస్త్రి అనే పండితుడిని ఉపాధ్యాయుడిగా నియమించి, ఆ పండితుడిని కుటుంబాన్ని పోషించాడు.

#సత్కారాలు

బుడ్డా వెంగళ్ రెడ్డికి దైవభక్తి ఎక్కువ. శివుడిని ఆరాధించేవాడు. పండితులను గౌరవించేవాడు.
ఈ క్రమంలో ప్రతి సంవత్సరం శివరాత్రి నాడు ఉయ్యాలవాడ అగస్తేశ్వర దేవాలయంలో పెద్ద ఎత్తున ఉత్సవాలు జరిపించేవాడు., పండితులను సత్కరించి, నగదు బహుమానాలు అందజేసేవాడు. నిరుపేద పండితులకు వీరి కానుకలు ఎంతో ఉపకరించేవి. మరునాడు గ్రామ ప్రజలకు అన్నదానాలు చేసేవాడు 

#సంతానలేమి

మనుషుల్లో దేవుడిగా బతికి ఉన్న రోజుల్లోనే కీర్తంపబడుతూ జన నీరజనాలు అందుకున్న వెంగళ్ రెడ్డిని సంతాన సమస్య పీడించింది. సంతానం కోసం పూజలు వ్రతాలూ నోములు జరిపించాడు.కానీ ఎందుకో మరి ఏ దేవుడు కూడా అతడి మొర ఆలకించలేదు.
 సంతానం కోసం తపిస్తూ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు.. కానీ ఒక్క భార్యకు కూడా సంతానం కలుగలేదు. చివరకు తన తమ్ముని కుమారుడుని దత్తత తీసుకుని తన వారసుడుగా ప్రకటించుకున్నాడు. ప్రస్తుతం వీరి వారసుడు #బుడ్డా_విశ్వనాథ్_రెడ్డి కుటుంబం ఉయ్యాలవాడలో నివసిస్తున్నది.

గుడులు గోపురాలు ఎందుకు నీకు
రామా రామా శ్రీరామా
నీ ఇల్లే దేవులం
కృష్ణా రామా పరమాత్మా
సంతానం చింత పడబోకు రామా
ప్రజలెల్లా బిడ్డలే కదా
శివ శివ హరి
బుడ్డా ఎంగలరెడ్డి సరి

ఈ పదాల్లో వెంగళ్ రెడ్డికి సంతాన భాగ్యం లేకపోవడం
స్పృశించబడింది. బుడ్డా వెంగళ్ రెడ్డిని దేవుడిలా ఆరాధించిన ప్రజలు,అతడి జీవితంలోని ప్రతి ఘట్టాన్ని కథగా పాటగా మలుచుకున్నారు అనేది సత్యం.

#సేవలకు_గుర్తింపు

వెంగళ్ రెడ్డి సేవలను అప్పటి మద్రాసు ప్రభుత్వం 
గుర్తించి గౌరవించింది. స్వయంగా విక్టోరియా రాణి బంగారు పతకాన్ని బహూకరించింది. 1877 జనవరి 1వ తేదీన ఢిల్లీలో జరిగిన సన్మానసభలో ఈ పతకాన్ని వెంగళ్ రెడ్డి అందుకున్నారు.

"1866వ సంవత్సరంలో సంభవించిన క్షామకాలమందు, నిరాధారముగా నుండిన, తన స్వదేశస్థుల పట్ల జరిపించిన ఉత్కృష్ట ఔదార్యమునకు గాను, హర్ మైజెస్టి రాణిగారి వల్ల చేయబడిన శ్రేష్టమైన గణ్యతకు ఆనవాలుగా బుడ్డా వెంగళరెడ్డిగారికి బహుమానమివ్వబడినది."
అని బంగారు పతకముపైఅంగ్లంలో చెక్కబడింది.
ఈ పతకం భద్రత కోసం ఉయ్యాలవాడలో పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయబడింది.

ముఖ్యంగా మూడు సార్లు వెంగళ్ రెడ్డి బ్రిటిష్ ప్రభుత్వం నుండి బహుమానాలు అందుకున్నాడు.

1) మొదటి సారి విక్టోరియా రాణి వెంగళ్ రెడ్డిని మద్రాసు పిలిపించి నగదు బహుమానం అందించింది. ఆ నగదును మద్రాసు నుండి కడప వచ్చేసరికే దాన ధర్మాలతో అయిపోగొట్టాడు.
2) అది తెలిసి వజ్ర వైడూర్యాలతో పొదిగిన ఆభరణం బహుకరించబడింది. ఆ ఆభరణాన్ని కూడా దాన ధర్మాలకు ఉపయోగించాడో లేదా దొంగలు ఎత్తుకు పోయారో తెలియదు. వెంగళ్ రెడ్డి ఆ విలువైన ఆభరణం గురించి మాట్లాడ లేదు కాబట్టి దాన ధర్మాలకే ఉపయోగించడని అంటారు.
3) ఇక మూడవసారి బంగారు పతకం. ఇప్పటికీ ఈ వారసుల వద్ద పతకం ఉన్నది.

#పదవులు

బ్రిటిష్ ప్రభుత్వం బుడ్డావెంగళరెడ్డి దాతృత్వానికి మెచ్చి పదవులు కూడా అప్పజెప్పింది.

▪️ ప్రభుత్వ ప్రొవిన్సియల్ జ్యూరీ సభ్యునిగా
నియమించింది. ఈ ప్రకారం ప్రాంతీయ దేశియ సంబంధమైన ఆహార ఉత్పత్తులపై నిర్ణయాధికారం.

▪️ మద్రాసు గవర్నరు కౌన్సిల్ గౌరవ సభ్యుడు  

#జానపద_కళలలో

సీమ ప్రాంతంలో జానపదులు బుడ్డా వెంగళ్ రెడ్డి జీవితాన్ని పాటలుగా పద్యాలుగా పాడుకుంటున్నారు. కథలుగా గాథలుగా చెప్పుకుంటున్నారు.

నిరుపేద బ్రాహ్మణుడు మజ్జిగ దానం అడగడం, అతడికి ఏకంగా భోజనమే తయారు చేయించి పెట్టడం.......

పాత చీర దానం అడిగిన ఒక బిచ్చగత్తెకు ఇంట్లో పాత చీరలు లేవని తన భార్య చెప్పగా , అది నచ్చని వెంగళ్ రెడ్డి బిచ్చగత్తెకు పెట్టెలోని పట్టుచీర దానం ఇవ్వడం....

 ఒక పేద బ్రాహ్మణుడు తన యింటిలో జరగబోయే శుభకార్యం కోసం ధన సహాయం అర్థించినప్పుడు, వెంగళ్ రెడ్డి అంగీలో చేయిపెట్టి ఒక నోటు తీసి ఇవ్వగా, చిన్నమొత్తానికి ఆ బ్రాహ్మణుడు నొచ్చుకోగా, "ప్రాప్తం అంతే ఉన్నది" అని, ప్రాప్తన్ని నిరూపించిన కథ....

దారిదొంగలను మార్చిన కథ....

పేద వారి పెండ్లిళ్లకు తాళి మెట్టెలు చేయించిన కథ....

రకరకాల అన్నదానం కథలు, వాటిలో కరువు రాక్షసితో వెంగళ్ రెడ్డి కొట్లాడిన కథలు ....

అంటరాని వాళ్ళకు చదువు చెప్పించిన కథలు....

వెంగళ రెడ్డి గొప్పగుణానికి నిదర్శనాలుగా నిలుస్తున్నాయి.

#శివైక్యం 

మహాదాత..... కరువు చీకట్లపై సమరం చేసిన రేనాటి చంద్రుడు.... బుడ్డా వెంగళరెడ్డి గ డిసెంబరు 31, 1900 తేదీన శివైక్యం పొందారు.
మనిషిగా కొన్నాళ్ళు....
యశస్సుగా వెయ్యేళ్ళు....

____________________________________________
ఆధారం :

1)కోవెలకుంట్ల ప్రాంతానికి చెందిన జానపద కళాకారుడు గుడ్డి ఓబుళన్న నుండి పాట 
2) బుడ్డా విష్ణునాథ్ రెడ్డి గారి దృశ్య మాలిక
3) బుడ్డా వెంగళ్ రెడ్డి చరిత్ర

No comments:

Post a Comment