Monday, April 15, 2024

దేవిరెడ్డి బంగ్లా " గ్రామం (దేవిరెడ్డి గూడెం )

" దేవిరెడ్డి బంగ్లా " గ్రామం (దేవిరెడ్డి గూడెం ) 
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
✍️తంగెళ్ళ శ్రీదేవిరెడ్డి

నల్గొండ జిల్లా నారాయణ్ పూర్ మండలం దేవిరెడ్డి బంగ్లా. దేవిరెడ్డి గూడెం అని కూడా పిలుస్తారు. రెడ్లపేర్లతో తెలుగు ప్రాంతాల్లో వేలకొలది గ్రామాలు ఉన్నాయి. వివిధ కాలాల్లో కొందరు రెడ్లు నిర్వర్తించిన
న్యాయం , కొనసాగించిన ధర్మ పాలన, చేసిన త్యాగాలు, గ్రామ నిర్మాణాలకు దోహదపడ్డాయి. ఈ క్రమంలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, భూదానశీలి, మద్ది నారాయణరెడ్డి గారు తన తాత దేవిరెడ్డి గారి పేరు మీద " దేవిరెడ్డి గూడెం " నిర్మించారు.

తెలంగాణలో ప్రముఖ విద్యాసంస్థగా పేరొంది, ఐఏఎస్ ఎపిఎస్ లను డాక్టర్లను ఇంజనీర్లను తయారుచేసిన చౌటుప్పల్ సర్వేల్ గురుకుల పాఠశాల కోసం 45 ఎకరాలు దానంగా ఇచ్చిన మద్ది నారాయణరెడ్డి .... దేవిరెడ్డి గ్రామ నిర్మాణం కోసం 120 ఎకరాలు కేటాయించారు. ప్రస్తుతం ఇక్కడ 80 వరకు కుటుంబాలు నివసిస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లా, మునుగోడు మండలం వెల్మకన్నె గ్రామం మద్ది నారాయణరెడ్డి సొంత ఊరు . వీరు స్వతహాగా 400 పై చిలుకు ఎకరాల భూస్వామి. తల్లి తరుపున 120 ఎకరాలు, భార్య తరుపున 100 ఎకరాలు సంక్రమించాయి. తల్లిదండ్రులకి ఒక్కటే కొడుకు కావడంతో మొత్తం 600 లకు పైగా ఎకరాల ఆసామీ అయ్యాడు. మొత్తం భూమిలో 550 ఎకరాల వరకు
 వివిధ సందర్భాలు పురస్కరించుకుని దాన ధర్మాలే చేసాడు.

▪️దేవిరెడ్డిగ్రామం వెనుక కథ

వెలమకన్నె గ్రామానికి చెందిన మద్ది నారాయణరెడ్డి మొదటి నుండి సామజిక సేవలు దానధర్మాలు కొనసాగిస్తూ వస్తున్నాడు. అమ్మమ్మ గారి ఊరుతో కూడా వీరికి అనుబంధం ఉన్నది. తాతగారి గారి ఆస్తి తన వాటగా 120 ఎకరాలు సంక్రమించిగానే ఒక ప్రయోజనార్థం ఉపయోగించాలి అనుకున్నాడు.

గ్రామంలో ఇండ్లు లేని పేదలు ఆరుబయట తాత్కాలిక గుడిసెలు వేసుకుని నివసించడం, వారి ఇబ్బందులు, గ్రామాలను వదిలి వెళ్తున్న పరిస్థితులు చూసాడు. వాళ్ళకోసం ఇంటికి ఇంత స్థలాన్ని కేటాయిస్తూ తాత గారి పేరు మీద గ్రామం నిర్మించాలి అనుకున్నాడు. తన సంకల్పానికి శ్రీకారం చుట్టాడు. అదే ఇప్పుడు దేవిరెడ్డి గూడెం.

సహకారం : సోదరుడు Narsimha Reddy Manne గారికి ధన్యవాదములు

No comments:

Post a Comment