Tuesday, April 16, 2024

వీరనారి గున్నమ్మ

వీరనారి గున్నమ్మ

వ్యాసకర్త : తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

జనాల్లో గూడుకట్టుకుంటున్న దైన్యం...
సొంతనేలను ఆక్రమించిన పరాయి సైన్యం... 
అయినా చెదరని గుండెల నిండా ధైర్యం...
ఆమె...
మట్టిబిడ్డ
రైతుల గుండె గొంతుక 
వీరనారి... గున్నమ్మ,!
▪️వివరాల్లోకి వెళ్తే....

భారతదేశంలో బ్రిటిష్ పరాయి పాలన కొనసాగుతున్న సమయంలో, భారతీయుల్లోనే రెండు వర్గాలు ఉన్నాయి.
మొదటిది బ్రిటిష్ వ్యతిరేకుల వర్గం.
 రెండవది బ్రిటిష్ సానుకూల వర్గం ..
ఈ సానుకూల వర్గంలో కొందరు జమిందార్లు, తహసిల్దార్లు, మునసుబ్లు, కర్ణాలు , వర్తకులు, అధికారులు, వారి అనుచరులు ఉండేవారు. వీళ్ళు బ్రిటీషర్లకు తొత్తులుగా వ్యవహరిస్తూ ప్రజలను రైతులను ఇబ్బందులకు గురిచేసేవారు. ఈ పరిస్థితిని కొందరు దిగమింగు కుంటే మరికొందరు ఎదిరించి నిలిచేవాళ్ళు.

స్వేచ్ఛ స్వతంత్రం హక్కులు కాలరాయబడుతున్న సమయంలో పోరాటం బుహుముఖలుగా విస్తరించింది. కొందరు పోరాట వీరులు బ్రిటిష్ వారిని ప్రత్యక్షంగా ఎదిరిస్తూ జాతీయస్థాయి పోరాటాలు చేశారు. మరికొందరు గ్రామస్థాయిలో బ్రిటిష్ వారికి బలంగా బలగంగా కొనసాగుతున్న జమీందారీ వ్యవస్థపై తిరుగుబాటు చేసి భారతీయ శక్తితో తెల్లదొరల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు . పోరాటం 
ఏ రూపంలో జరిగినా .... ఆ పోరాట వీరుల్లో కొందరి పేర్లే బయటకు వినిపిస్తుంటాయి. రచయితలు వ్యాసకర్తలు కొందరి గురించే మళ్లీమళ్లీ రాస్తుంటారు. కానీ ఈ ప్రపంచానికి పెద్దగా తెలియని వీరులు....వీరనారీమణులు....ఎందరో ఉన్నారు. వారిలో ఒకరు గ్రామస్థాయిలో రైతుల తరుపున పోరాటం చేసిన వీరనారి గున్నమ్మ...! 

▪️ ఉత్తరాంధ్ర ఉక్కుపిడికిలి గున్నమ్మ

శ్రీకాకుళం జిల్లా, మందస సంస్థానం గుడారి రాజమణిపురం గ్రామం ( జీఆర్ పురం )గున్నమ్మ స్వస్థలం. సామాన్య రైతు కుటుంబానికి చెందిన గున్నమ్మ ఒక అంచనా ప్రకారం 1914 ప్రాంతంలో జన్మించింది.రాజమణిపురం గ్రామం గున్నమ్మ స్వస్థలం కాబట్టి ఈ ఊరును ప్రస్తుతం వీరగున్నమ్మపురంగా పిలుస్తున్నారు..

 పది సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే గున్నమ్మకు 1924లో మాధవయ్యతో బాల్య వివాహం జరిగింది. అప్పట్లో ఉపాధి కోసం స్థానికులు చాలామంది రంగూన్ ( బర్మా) వెళ్లేవాళ్లు.. ఇదే బాటలో మాధవయ్య కూడా రంగూన్ వెళ్ళాడు. గ్రామంలో కరువు కాటకాలు తాండవిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మాధవయ్య తిరిగి వచ్చాడు. కానీ కరువు అతడిని నిలవనీయలేదు. ఒకవైపు భార్య గున్నమ్మ మూడు నెలల గర్భవతి.... మరోవైపు బతకలేని పరిస్థితి. అందుకే మాధవయ్య మళ్ళీ రంగూన్ బాట పట్టాడు. కానీ రంగూన్ వెళ్లిన కొంత కాలానికే మాధవయ్య ఆకస్మికంగా కాలం చేసాడు. అర్థంతో గుండమ్మ జీవితంలో యుద్ధం మొదలైంది.
బతుకు ఒక ప్రశ్నగా మారింది. ఈ గందరగోళ సమయంలోనే గ్రామంలో రైతు పోరాటమారంభమైంది. 

జీవితానికి బాసట లేదు. భయపడి వెనకడిగిస్తే భవిష్యత్తు లేదు. తెగించి ముందుకు నడిస్తేనే తాను.... తన పుట్టబోయే బిడ్డ బతకగలరు... అంటూ ఆలోచన చేసిన గున్నమ్మ రైతులకు బాసటగా నిలిచింది.

▪️జమీందార్ జగన్నాథరాజు వైఖరి  

1940 ప్రాంతంలో మందసం జమీందారుగా జరన్నాథరాజు మణిదేవ్ కొనసాగుతున్న సమయం. వీరు బ్రిటిష్ పాలనకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు . బ్రిటిష్ వారి మెప్పు పొందేందుకు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఈ క్రమంలో బ్రిటిష్ వారి ఆగడాలని ఎదుర్కోకుండా వారికి వత్తాసు పలుకుతున్నాడు.
ఈ నేపథ్యంలో గుడారి రాజమణీపురము పరిధిలో 
రైతులు పండించే పంటలో మూడో భాగాన్ని కప్పం కింద బ్రిటిష్ ప్రభుత్వానికి చెల్లించాలనే నిబంధన విధించారు. ఈ అన్యాయాన్ని గ్రామరైతులు మొదట సహించినప్పటికీ తర్వాత ఎదుర్కొన్నారు.
స్థానిక రైతులు అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవిస్తారు కాబట్టి , తమకు పన్ను నిరాకరించడం వలన అటవీ ఉత్పత్తులను తెచ్చుకునేందుకు బ్రిటిష్ పోలీసులు అడ్డుకోవడం మొదలెట్టారు. ఇందుకు పోలీసులకు జమీందారు అండదండలు సంపూర్ణంగా లభించాయి. ఈ పరిస్థితి రైతులకు జమీందారుకు మధ్య దూరం పెంచింది. అయినప్పటికీ జమీందారు అటవీ ఉత్పత్తులపై ఆజ్ఞలు విధించారు. జమీందారు వైఖరి పట్ల ప్రజల్లో నిరసన పెరిగింది .క్రమంగా పోలీసులకు, రైతులకు మధ్య పోరాటానికి దారితీసింది. పోరాటం మెల్లగా ఉద్యమరూపం దాల్చింది.ఎన్‌ జి రంగా, టంగుటూరి ప్రకాశం పంతులు, సర్దార్‌ గౌతు లచ్చన్న, గానుగుల తరణిచారి, బెందాళం గవరయ్య, సర్దార్‌ పద్మనాభం తదితర కిసాన్ నాయకులు ఈ రైతు ఉద్యమానికి బాసటగా నిలబడ్డారు.
ఈ విధంగా శ్రీకాకుళం జిల్లాలో తొలి ఉద్యమ గ్రామం గుడారి రాజమణీపురము పేరు చరిత్రలో లిఖించబడింది. 

▪️ కిసాన్ మహిళా అధ్యక్షురాలిగా గున్నమ్మ ....

1940 మార్చి 27, 28 తేదీలలో పలాసలో అఖిల భారత కిసాన్ మహాసభలు జరిగాయి. రైతు నాయకులు ప్రసంగాలతో రైతులను ఉత్తేజితులు చేశారు. సామాన్య రైతులకు ప్రసంగించే అవకాశం కల్పించారు.ఈ సభలో పాల్గొన్న గున్నమ్మ కూడా ప్రసంగించింది. తర్వాత కిసాన్ స్థానిక మహిళా అధ్యక్షురాలిగా గున్నమ్మను ప్రకటించారు. 

కిసాన్ సభల స్ఫూర్తితో.... కిసాన్ నాయకుల అండదండలతో రైతులు చైతన్యవంతం అయ్యారు. మార్చి 30 వ తేదిన మందస కొండల్లోని రుక్కమెట్ట అడవికి వెళ్లి వంద ఎడ్ల బండ్లపై కలపను తీసుకురావడానికి రైతులు సిద్ధపడాలని గున్నమ్మ పిలుపునిచ్చింది. 
ఈ పిలుపు అందుకుని చుట్టుపక్కల గ్రామాల రైతులు జమీందారు ఆజ్ఞలను ధిక్కరించి రైతులు అడవిలో కట్టెలు కొట్టారు.

ఇది జమీందారుకు కోపం వచ్చింది. తన మాటను ధిక్కరించినందుకు ఆగ్రహోదగ్రుడయ్యాడు .దివాను రామకృష్ణదేవ్‌ ద్వారా ఫారెస్ట్‌ రేంజర్‌ కృష్ణచంద్రరాజుకు హుకుం జారీ చేశాడు. వెనువెంటనే జిల్లా కలెక్టర్‌, పోలీస్ స్టేషన్ , మెజిస్ట్రేట్‌లకు సమాచారం వెళ్ళింది . 
వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులను, వారి ఎడ్ల బళ్లను ఆపేందుకు జమిందారి తరుపున పోలీసు బృందం ఉద్యమ గ్రామం వైపు బయలుదేరింది..కాగా గున్నమ్మ నాయకత్వంలో రైతులు చాకచక్యంగా కలపను తీసుకుపోయారు.
ఇందుకు అదే మార్చి 30న రాత్రి రాజమణిపురంలో అభినంద సభ ఏర్పాటుచేసి గున్నమ్మ ధైర్యసాహసాలను కిసాన్‌ నాయకులు ప్రశంసించారు.

▪️గున్నమ్మ వీర మరణం....
ఆరోజు....
1940 ఏప్రిల్ ఒకటవ తేది.
తనకు ఎదురు తిరిగిన రైతుల చర్యలను జమీందారు తట్టుకోలేక పోయాడు. తన ఆధీనంలో ఉన్న యంత్రంగాన్ని రైతులను నిలువరించాల్సిందిగా ఆదేశించాడు..జిల్లా ఎస్‌పి, సబ్‌కలెక్టర్‌, పోలీస్‌ సర్కిల్‌, సోంపేట మెజిస్ట్రేట్‌ లు తమ బలగాలతో జమిందారు ఆదేశాల ప్రకారం ముందుకు కదిలారు. పోలీసు బలగం వస్తున్నదని తెలిసి....రైతులు తమ హక్కులను ప్రశ్నించడం కోసం ఏకమై ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. వాళ్ల చేతుల్లో కర్రలు ఈటలు బరిసెలు గొడ్డళ్ళు ఉన్నాయి. వాళ్లలో గున్నమ్మ కూడా ఉన్నది ..చేతిలో గొడ్డలితో రౌద్రంగా నిలబడి ఉన్నది.

రాజపురం పొలిమేరల్లో బ్రిటిష్ పోలీసులకు, రైతులకు వాగ్వాదము జరిగింది. ఈ సందర్బంగా నిండు గర్భవతి గున్నమ్మ ప్రభుత్వానికి జమీందారుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ... ధైర్యంగా ముందు వరసలో నిలబడింది. క్షణక్షణం వేడెక్కుతున్న అక్కడ పరిస్థితిని చూసి ఏదో విపత్తు కచ్చితంగా జరగవచ్చని భయంతో కొందరు వెనకడుగు వేస్తే , మరికొందరు బిక్కుబిక్కుగా నిలబడి ఉంటే, గున్నమ్మ మాత్రం వెనకడుగు వేయలేదు. 

పోలీసులు దౌర్జన్యంగా గ్రామంలో కొందరు రైతులకు బేడీలు వేసి పోలీసు జీపు ఎక్కించారు.
చూస్తుండగానే పరిస్థితి చేయి దాటింది. గున్నమ్మ పోలీసు జీపుకు అడ్డంగా నిలబడింది. పోలీసులు ముందుగా హెచ్చరిక జారీ చేశారు. అయినప్పటికీ రైతులు లెక్క చేయలేదు.
పోలీసులు తుపాకీలతో బెదిరించారు. అప్పుడు కొందరు భయపడ్డారు. బతుకు జీవుడా అంటూ పక్కకు జరిగారు. కానీ గున్నమ్మ వెనుకడుగు వేయలేదు. ఆమెతో పాటు ఇంకొందరు ఆయుధాలతో నిలబడి ఉన్నారు. పోలీసులు తుపాకులు చూపెడుతూ భయపెడుతూనే ఉన్నారు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఒక దశలో పోలీసులు జీపు దిగి గున్నమని పక్కకు నెట్టేసే ప్రయత్నం చేశారు. కానీ గున్నమ్మ పోలీసుల మాట వినలేదు. పోలీసుల జీపు ముందుకు కదలకుండా అడ్డంగా నిలబడింది. 
చివరకు పోలీసులు విచక్షణ కోల్పోయి కాల్పులు జరిపారు. ఆయుధాలతో రైతులు తెగబడ్డారు. గుండమ్మ తన ప్రతాపాన్ని చూపించింది. కానీ 
 పోలీసు తూటాలు తగిలి గున్నమ్మ అక్కడికక్కడే నెలకొరిగింది.

 వెచ్చని ఆమె నెత్తుటి ధారలతో నేల తడిసి ముద్దయింది . రైతు ఉద్యమంలో గున్నమ్మ అసువులుబాసింది. ఆమెతో పాటుగా మరో నలుగురు గుండ బుదియాదు, గొర్లే జగ్గయ్య, కర్రి కళియాడు, గుంట చిననారాయణలు 
 కూడా నేలకు ఒరిగారు. ఇద్దరు పోలీసులు కూడా మరణించారు. ఒక్కసారిగా వాతావరణం ఉద్విగ్నంగా మారిపోయింది. గ్రామాలు భయకంపితం అయిపోయాయి. మరో 15 రోజుల వ్యవధిలో 15 మంది గాయపడిన రైతులు మరో ఏడుగురు పోలీసులు మరణించారు.

ఈ విధంగా రైతు హక్కుల కోసం కూలిన శరీరాలు అమరాన్ని లిఖించుకుంటూ శ్రీకాకుళం జిల్లా రైతాంగ ఉద్యమాల చరిత్రలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాయి.

▪️ గున్నమ్మ స్మారకార్ధం
ప్రస్తుతం గుడారి రాజమణీపురము గ్రామానికి వెళ్ళే ముఖద్వారంలో ఆమె పేరున సింహద్వారాన్ని ఏర్పాటు చేసారు. మృతిచెందిన చోట జ్ఞాపక చిహ్నం నిర్మించారు. దీన్ని అప్పటి గవర్నర్ కుముద్ బెన్‌జోషి 10/ 9/ 1988 ప్రారంభించడం జరిగింది.

No comments:

Post a Comment