Monday, April 15, 2024

కొవ్వూరి గంగిరెడ్డి

కొవ్వూరి గంగిరెడ్డి (1926 -2004)
(వ్యాపారవేత్త - పేదల పెన్నిధి )
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
✍️తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

ఎదగాలని...ఎదిగి బతకాలని ఓ ఆరాటం!
గెలవాలని... గెలిచితీరాలని ఓ పోరాటం!
సాధించాలని...సాధించి నిలబడాలని ఓ సంకల్పం !
ఏదో చేయాలని...ఎందరికో చేయూత నివ్వాలని
ఓ దృక్పధం !
కృషిని చమురుగా నమ్ముకుని
తన ఆశయాలకు ఆకృతి అందించిన 
రైతుబిడ్డ ...
కొవ్వూరి గంగిరెడ్డి! 

#వివరాల్లోకి_వెళ్తే.....

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా ఆరవల్లి గ్రామంలో వెంకటరెడ్డి సూరమ్మ దంపతులకు 1926 , ఫిబ్రవరి 7 వ తేదీన కొవ్వూరి గంగిరెడ్డి జన్మించారు. వీరి తండ్రి వెంకటరెడ్డి ఒక సామాన్య రైతు. వీరిని గ్రామస్తులు వెంకన్నా అని పిలుచుకునే వాళ్ళు. బతికి ఉన్నన్ని రోజులు వెంకన్న గ్రామస్థులతో ఆత్మీయంగా మెలిగాడు. వెంకన్న ఒక్కడే కాదు అతడి కుటుంబం గ్రామంలో అందరికీ కావాల్సిన కుటుంబం.

#ఆరవల్లి_ప్రత్యేకత

ఆరవల్లిలో రెడ్డి కులస్థులు ఎక్కువ. వీళ్లల్లో చాలామంది ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి వస్తుంటారు. గంగిరెడ్డి కూడా ఒకప్పుడు వలస వెళ్లినవాడే. సమీప భీమవరం పరిసర ప్రాంతాల్లో సంస్థలు నెలకొల్పి ప్రజలకు ఉపాధి కలిగిస్తున్న
" రెడ్డి అండ్ రెడ్డి " యాజమాన్యం ఆరవల్లికి గర్వకారణం. సినీ దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి ఇక్కడి వాళ్ళే. ప్రతి ఏటా ఇక్కడి రెడ్లు వేమన జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ మిగతా రెడ్లకు ఆదర్శంగా నిలుస్తుంటారు.

#రంగూన్_ప్రస్థానం

గంగిరెడ్డిది మొదటినుండి కష్టపడే మనస్తత్వం. తన 11 ఏండ్ల వయసులో కుటుంబ సంపాదన కోసం ఉపాధి వెదుక్కుంటూ బర్మా రాజధాని రంగూన్ వెళ్లడం ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. రంగూన్ లో 1940 వరకు ఉండి తిరిగి భారతదేశానికి తిరిగి వచ్చాడు. తర్వాత తన 20 ఏండ్ల ప్రాయంలో 1946లో తిరిగి రంగూన్ వెళ్లి లేబర్ కాంట్రాక్టర్ గా జీవితం ఆరంభించాడు.
తను ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు కేవలం ఆ ఉద్యోగ ధర్మమే తన జీవితం కాదు, తన ఇష్టాఇష్టాలకు కూడా విలువ అందిస్తూ విశాలంగా బ్రతకడం గంగిరెడ్డికి అలవాటు. బర్మాలో గంగిరెడ్డి జీవితం ఇట్లాగే కొనసాగింది. ఈ క్రమంలో అక్కడి సమాజంలో కలిసిపోయాడు. అక్కడి రెడ్డి సమాజంలో తన ఉనికి చాటున్నాడు. ఈ క్రమంలో రంగూన్ రెడ్డి యంగ్ మెన్ అసోసియేషన్ కార్యదర్శిగా 1950లో ఎన్నికయ్యాడు. 
1950 నుండి 1959 వరకు తన బాధ్యతలను అంకితభావంతో నిర్వర్తించాడు.

#గోదావరి_వరదలు [ 1953 ]

1947 స్వాతంత్ర్యం తర్వాత గోదావరి నదికి 11 సార్లు పెద్ద వరదలు వచ్చాయి. 1953, 1986ల్లో వచ్చిన వరదలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. 1953 లో 30లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. పరిసర ప్రాంతాలను లంక గ్రామాలను వణికించే ఈ వరదల తర్వాత ప్రజాజీవనం కోలుకోవడానికి చాలా సమయమే పడుతుంది. 1953 వరదలు సమయంలో ఆస్తుల్ని కోల్పోయి అభాగ్యులుగా మిగిలిపోయారు ప్రజలు. ఈ విపత్కర పరిస్థితుల్లో గంగిరెడ్డి నడుం బిగించాడు.
 అప్పటికి రంగూన్ లో ఉంటున్న గంగిరెడ్డి నాయకత్వంలో వరద బాధితులకు అందడం కోసం గట్టి ప్రయత్నం చేసాడు. ప్రయత్నం ఫలించి "రెడ్డి యంగ్ మెన్ అసోసియేషన్ " తరుపున వరద బాధితులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందింది. ఆ రోజుల్లో లక్ష రూపాయలు అంటే అది భారీ మొత్తం.

#గంగిరెడ్డి_దృక్పథం

▪️ప్రజా సంక్షేమంలో లాభాపేక్ష ఉండకూడదు.
▪️ఉండి కూడా చేయి అందివ్వక పోవడమే పతనం.
▪️వెళ్ళగలిగి కూడా వెనకడుగు వేయడం ఓటమి.
▪️చేసే పనిలో అంకితభావం లేకపోవడమే భారీ నష్టం.

#వ్యాపారరంగంలో

జీవితంలో ఒడిదుడుకులు తెలిసిన మనిషిగా..... బతుకు దెరువులో బాధల్ని అధిగమించిన అనుభవంతో సొంత దేశంలో వ్యాపారం మొదలెట్టి ఎందరికో ఉపాధి కలిపించాలి అనేది గంగిరెడ్డి ఆలోచన. ఈ ఆలోచనను తోటి వాళ్ళతో తరుచూ పంచుకునే వారు కూడా. ఈ క్రమంలో 1960 లో రంగూన్ నుండి భారతదేశానికి తిరిగి వచ్చిన గంగిరెడ్డి, అనుకున్న ప్రకారం వ్యాపార రంగంలో అడుగుపెట్టాడు. మొదట ఆరవల్లి దగ్గర మంచిలిలో చక్కెర కార్మాగారంలో భాగస్వామ్యం తీసుకున్నాడు. తర్వాత విశాఖపట్నంలో వి. బీ. వి. రెడ్డి సారధ్యంలో నడుస్తున్న " ధనరెడ్డి అండ్ కంపెనీ షిప్పింగ్ ఏజెన్సీ " లో ఎగుమతి దిగుమతి వ్యాపారరంగంలో భాగస్వామ్యం అయ్యాడు. అనుకున్నట్టుగానే ఈ రెండు చోట్లా గంగిరెడ్డి తరుపున ఎందరో ఉపాధి పొందారు.
విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాలలో కొవ్వూరి గంగిరెడ్డి , V.B.V. రెడ్డి అంటే తెలియని వాళ్ళు లేరు.
ఎందరో జీవితాలు అక్కడ నిలబడ్డాయి. వ్యాపారం చేస్తున్నాను అనే ఆలోచనతో కాదు, ఇక్కడ ప్రజలు బతుకుతున్నారు అనే అంశానకి కట్టుబడి వ్యాపారం కొనసాగించిన హృదయశీలి గంగిరెడ్డి.

#రాజకీయరంగంలో

1983 లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించడంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాడు గంగిరెడ్డి. ఎన్టీఆర్ తో వీరికి ప్రత్యేక అనుబంధం ఉన్నది. నమ్మకానికి నమారుపేరైన గంగిరెడ్డి గారికి ఎన్టీఆర్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారు. ఈ క్రమంలో 1984 మే 27, 28, 29... పోర్టు జింఖానా మైదానం, విశాఖపట్నంలో జరిగిన మహానాడు కార్యక్రమాలకు ఆహ్వాన సంఘం చైర్మన్ గా గంగిరెడ్డిని ఏరికోరి నియమించడం జరిగింది. అంకితభావానికి మారుపేరైన గంగిరెడ్డి, మహానాడును జయప్రదం చేయడంలో కీలక పాత్ర పోషించారు. అంతేకాదు రాజకీయంగా అనేక విషయాల గురించి ఎన్టీఆర్ గంగిరెడ్డితో ప్రత్యేకంగా మంతనాలు జరిపేవాడు. దేశవిదేశాలకు గంగిరెడ్డిని తన వెంట తీసుకువెళ్ళడానికి ఎన్టీఆర్ ఆసక్తి చూపే వారువంటే, గంగిరెడ్డి నిజాయితీ నిబద్దతలను అర్థం చేసుకోవచ్చు.
రాజకీయాలు పక్కకు సేవా హృదయం కలిగిన గంగిరెడ్డికి సామాజికంగా గొప్ప పేరు ఉంది. ఈ పేరు ఎందరికో రాజకీయ లబ్దిని సమకూర్చి పెట్టింది కూడా.

#పదవులు

▪️1980 లో విశాఖపట్నం స్టీవెడోర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగారు.

▪️1986 లో విశాఖపట్నం నగర తెలుగుదేశం అధ్యక్షులుగా ఎంపికయ్యారు.

▪️1995 లో విశాఖపట్నం పట్టణ అభివృద్ధి అథారిటీ [ V.U.D.A] చైర్‌పర్సన్‌గా పనిచేశారు.

▪️1997లో వుడా చైర్మన్ గా పనిచేశారు.

#కుటుంబం

గంగిరెడ్డి భార్య లక్ష్మి. అనుకూలవతి. ఈ దంపతులకు నలుగురు సంతానం. ఇద్దరు కుమారులు... కొవ్వూరి సత్యనారాయణరెడ్డి, కొవ్వూరి శ్రీనివాసరెడ్డి. ఇద్దరు కుమార్తెలు.... సూర్యకుమారి, కమలకుమారి. కుమారులు ప్రస్తుతం తండ్రి స్థాపించిన వ్యాపారాలు కొనసాగిస్తూ తండ్రి బాటలో పయనిస్తున్నారు.

#ప్రజాసేవలో

అనుకున్నది సాధించడం కన్న ఊరికి గర్వకారణం అయితే, ఆ ఊరికి సేవ చేయడంలో నిజమైన విజయం ఉంది. నిజమైన తృప్తి ఉంది. గంగిరెడ్డి గారు ఈ విషయంలో పరిపూర్ణ విజయాన్ని సొంతం చేసుకున్నారు.
▪️వివిధ సంస్థలకు, దేవాలయాలకు, శరణాలయాలకు విరాళాలు ప్రకటించడంలో గంగిరెడ్డిది పెద్దచేయి.
▪️ఆయా ప్రాంతాల్లో నిర్మించిన రెడ్డి సంఘం భవనాలకు తన చివరి రోజులవరకు సహకారం అందిస్తూ వచ్చారు.
▪️తన సొంత ఊరు ఆరవల్లిలో తన ఊరి ప్రజల కోసం అన్ని సదుపాయలు ఉన్న రెండంతస్తుల కల్యాణమండపం కట్టించారు.
▪️పేదల చదువులకు, పెండిళ్లకు, వీరు అందించిన గుప్త దానాలకు లెక్కలేదు.
▪️1985 వ సంవత్సరంలో విశాఖపట్నంలో వేమన
ఐఐటి నెలకొల్పారు.
▪️లెక్కలోకి రాని మరెన్నో సేవాకార్యక్రమాలు చేపట్టారు.

#ప్రేమసమాజం_కోసం

అనాథాశ్రమాలు, వృద్ధాప్య సంస్థలు, వీధి బాలల రక్షణ, మరెన్నో సామాజిక సేవా కార్యక్రమాలకు విశాఖపట్నం ప్రేమ సమాజం ప్రసిద్ది.
విశాఖపట్నం డాబా గార్డెన్స్ లో "ప్రేమసమాజం" 1930 సంవత్సరంలో స్థాపించబడింది.అంకిత భావంతో పనిచేసే సిబ్బందితో కొనసాగుతున్న
ఈ ప్రేమసమాజానికి కొవ్వూరి గంగిరెడ్డి లక్షలాది రూపాయలు విరాళం ప్రకటించారు.
 
#ఆరవల్లి_ప్రజల_అభిమానం 

 కొవ్వూరి గంగిరెడ్డి గారు మా ఆరవల్లి గ్రామం నుంచి వ్యాపారనిమిత్తం విశాఖపట్నం వెళ్లి ప్రముఖ వ్యాపారవేత్తగా స్థిరపడి వేలాదిమందికి ఉపాధికల్పించి , రాజకీయ నాయకునిగా విశాఖ నగరాన్ని అభివృద్ధి చేసి నేడు భౌతికంగా లేకపోయినా అందరి మనస్సులో మంచి స్థానం సంపాదించుకున్న ఆయన మావూరి వ్యక్తి అని గర్వంగా గుర్తుచేసుకుంటాం .వారితో మా అనుబంధం , వారి ప్రేమానురాగాలు, వారి ఆశీస్సులు మాకు సదా మధుర జ్ఞాపకాలు ! 

#కాలధర్మం 

11 డిసెంబర్ 2004 న తన వయసు 78 సంవత్సరాల వయసులో గంగిరెడ్డి కాలధర్మం చెందారు.ఉన్నంతలో ఇతరులకు తోడ్పడటమే జీవితంగా బతికిన గంగిరెడ్డి ఎందరికో ఆదర్శ ప్రాయుడు.

No comments:

Post a Comment