Tuesday, April 16, 2024

గంగసాని ఆండాలమ్మ

గంగసాని ఆండాళమ్మ
( 1919-2000)
( సాయుధ పోరాటానికి ఆయుధ సేకరణ చేసిన ధీరురాలు )
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
వ్యాసకర్త : తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

-ఆస్తులు అంతస్తులు కాదు, ప్రజాజీవనంలో సంక్షేమం ముఖ్యం....
-గడిలో దొరసాని జీవితం కాదు, ఎండల్లో బగ్గుల్లో దీనుల జనుల గొడుగై నిలబడటం ముఖ్యం....
- నౌకర్ల మధ్య టూగు టుయ్యాలలు కాదు, మమత ఒక్కటి స్ఫూర్తిగా బీదసాదల సాదుకోవడం ముఖ్యం....
ఆమె....
ఒక వీరనారి....
గంగసాని అండాలమ్మ...!

లాలించే చేతులు ఆయుధాలు స్పృశించిన వేళ 
ఆమె త్యాగం... ధైర్యం.... తెగింపు... సాయుధ చరిత్రలో ఒక అధ్యయనం అయ్యింది...
కానీ
నిజమైన వీరత్వపు అడుగులకు బాటలు ఎవ్వరు వేశారు?
ముందుండి నడిచిన ధీరులను వెనక్కి నెట్టింది ఎవ్వరు?
మరుగున పడిన చరిత్రలో మకుటం లేని నాయకురాలు ఆండాళమ్మ....! 

▪️పరిచయం :

జనగామ ప్రాంతంలో లేవిగల్లాకు వ్యతిరేకంగా ఉద్యమించి రైతాంగాన్ని పోరాటబాట పట్టించిన చైతన్యశీలి.... సాయుధపోరాట పునాదుల్లో భాగస్వామ్యం వహించిన విప్లనాగ్ని....
ఆర్యసమాజ్ నాయకుడుగా 
కాంగ్రెస్ నాయకుడిగా
తర్వాత కరుడుగట్టిన కమ్యూనిస్టుగా 
నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఆంధ్రమహాసభలో తన వంతు పాత్ర నిర్వర్తించి.... జనగామ ప్రాంతం శాసనసభ్యులుగా పనిచేసిన ప్రజలమనిషి గబ్బేట గోపాల్రెడ్డి ( గంగసాని ) జీవన సహచరి ఆండాళమ్మ.

▪️జననం - విద్యాభ్యాసం

నల్లగొండ జిల్లా బొందుగుల గ్రామ వాస్తవ్యులు 
బొందుగుల వెంకట్రామారెడ్డి, వెంకటనర్సమ్మ దంపతులకు 1919 లో అండాలమ్మ జన్మించారు.

కొలనుపాక గ్రామంలో ఉర్దూ మీడియంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. తర్వాత ఆనాటి కాల పరిస్థితుల్లో ఇంటి వద్ద నుండే ఉర్దూ లోనే HSC పరీక్ష రాసి ఉత్తిర్ణత సాధించింది.

▪️వివాహం - సంతానం 
గంగసాని గోపాల్ రెడ్డితో ఆండాలమ్మకు మేనరిక వివాహం జరిగింది. 
గోపాల్ రెడ్డికి స్వయానా అక్క కూతురు ఆండాలమ్మ. ఇద్దరూ ఒకరిని ఒకరు ఎంతో ఇష్టపడ్డారు. బయటకి చెప్పుకోకపోవడం వల్ల ఆలస్యంగా వీరి పెండ్లి 1938 లో జరిగింది.గోపాల్ రెడ్డి అన్న మంగారెడ్డి గారు ఇరువురి ఇష్టప్రకారం ముందుండి ఆర్యసమాజ్ ప్రకారం వివాహం జరిపించారు.

▪️నిజాం వ్యతిరేక పోరాటంలోకి....

పెళ్లయిన ఆరు రోజులకు కాంగ్రెస్ పార్టీకి చెందిన సత్యాగ్రాహిగా గబ్బేట గోపాల్ రెడ్డిని నిజాం సర్కారు అరెస్టు చేసింది. అరు నెలలు గోపాల్ రెడ్డి గారు జైల్లో ఉండిపోయారు.

ముఖ్యంగా భర్త అరెస్టుతో అండాలమ్మ బాధ పడలేదు. అందోళన చెందలేదు. జైలు నుండి తన భర్త ఎప్పుడు బయటకి వస్తాడో తెలియని పరిస్థితుల్లో ప్రజల కోసం.... ప్రజలు కోరుకున్న రాజ్యం కోసం..... శ్రమిస్తున్న భర్త ఆశయాలను నెరవేర్చడానికి నడుం బిగించింది. ఇందుకు పెండ్లికి ముందు వున్న పోరాట నేపథ్యం అండాలమ్మకు ఉపకరించింది.ధైర్యంగా ఆనాటి రాజకీయ సామాజిక పరిస్థితుల్లో నిజాం వ్యతిరేక పోరాటంలో అడుగు పెట్టింది.

▪️గ్రంధాలయోధ్యమంలో

అండాలమ్మ చదువుకుంటున్న సమయంలో కొలనుపాకలో గ్రంధాలయోధ్యమం జరిగింది.
బహిరామియా గ్రంథాలయం 1921 ఏప్రిల్ 6 న కొలనుపాకలో స్థాపించబడింది.ఇది తెలంగాణలో మొదటి గ్రంధాలయం .ఈ గ్రంధాలయం అనుబంధంగా తర్వాత జరిగిన గ్రంధాలయోధ్యమాలలో ఆండాళమ్మ పాల్గొన్నది. ఫలితంగా పలుచోట్లా గ్రంధాలయాల స్థాపన జరిగింది.

తెలుగు వారి చరిత్రను వివరించే పుస్తకాలను తెలుగు భాషలోనే రచించి, వాటిని గ్రంథాలయాలలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో జరిగిన గ్రంథాలయ ఉద్యమంలో అండాలమ్మ పాల్గొన్నారు.అక్కడే అండాలమ్మకు పుస్తకాలు చదివే అలవాటుతో పాటుగా పోరాట నైజం ఏర్పడింది. ఈ నైజమే పెళ్లయిన వెంటనే భర్త అరెస్టు అయినప్పుడు మనో నిబ్బరాన్ని అందించింది. భర్త ఆశయాల కోసం ముందుకు నడిపించింది. ఇదే తర్వాత కాలంలో భర్త అండదండలతో సాయుధ పోరాటానికి కావలసిన ఆయుధాల సేకరణ వరకు నడిపించింది.

▪️కుటుంబంపై నిషేధం - జైలు జీవితం 

ఆనాటి సామాజిక రాజకీయ పరిస్థితుల్లో నిజాం సర్కారు గంగసాని కుటుంబం కొనసాగిస్తున్న ప్రభుత్వ వ్యతిరేక చర్యలపై గర్రుమంది.. గ్రామాన్ని ఏక త్రాటి మీద నడిపిస్తూ సర్కారును దిక్కరిస్తూ ముందుకు సాగడాన్ని జీర్ణించుకోలేక పోయింది. ఈ క్రమంలో 1940 లో ...." గబ్బేట గ్రామానికి చెందిన గంగసాని కుటుంబం అత్యంత ప్రమాదకరమైనది " గా ప్రకటిస్తూ గబ్బెట గ్రామంలో కేవలం గంగసాని కుటుంబం లక్ష్యంగా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసింది. గంగసాని కుటుంబం గ్రామం దాటి వెళ్ళకూడదని నిషేదాజ్ఞలు జారీ చేసింది.

ఈ పరిస్థితిలో గోపాల్ రెడ్డి అండాలమ్మ దంపతులు పోలీసుల కళ్ళు గప్పి మారువేషంలో విజయవాడ నగరం చేరుకున్నారు. అప్పట్లో తెలంగాణ హైదరాబాద్ రాజ్యంగా కొనసాగుతుండగా.... విజయవాడ బ్రిటిష్ ఇండియాలో అంతర్భాగంగా ఉన్నది. విజయవాడ కేంద్రంగా తెలంగాణ ప్రాంతానికి సంబందించిన కమ్యూనిస్ట్ కార్యకలాపాలు కొనసాగేవి.
గోపాలరెడ్డి దంపతులు విజయవాడ చేరుకున్నాక భద్రతా కారణాల దృష్ట్యా వేర్వేరుగా జీవించడం మొదలెట్టారు. ఆండాళమ్మ తెనాలిలో ఉండగా, గోపాల్ రెడ్డి గారు విజయవాడలోనే కమ్యూనిస్ట్ పార్టీ నుండి వెలువడుతున్న ప్రజాశక్తి పత్రికలో ఎడిటోరియల్ బోర్డులో చేరారు.

నిజాం ప్రభుత్వంతో బ్రిటిష్ ప్రభుత్వానికి స్నేహపూర్వక సంబంధ బంధవ్యాలు ఉన్నాయి. కాబట్టి గోపాల్ రెడ్డి దంపతులపై నిఘా వేసిన నిజాం సర్కారు బ్రిటిష్ ప్రభుత్వ సహకారం కోరింది. ఈ పరిస్థితిలో ఆంధ్రప్రాంతంలో తెలంగాణ యాస మాట్లాడుతున్న అండాలమ్మను బ్రిటిష్ ఇండియా పోలీసులు అనుమానస్పదంగా భావిస్తూ అరెస్టు చేశారు. విచారణ తర్వాత ఆమెను గంగసాని ఆండాళమ్మగా నిర్దారిస్తూ జైలుకి పంపారు. అప్పటికి ఆమె గర్భవతి.

▪️జైలులోనే ప్రసవం - ప్రజా ఉద్యమాలు 

ఆండాళమ్మ జైలులోనే తన మొదటి సంతానానికి జన్మ ఇచ్చింది. ఆ తర్వాత జైలు నుండి విడుదలై గబ్బేటకు చేరుకుంది. అక్కడ కొన్నాళ్ళు ఉండి, ఆ తర్వాత మళ్ళీ మెల్లగా ప్రజా ఉద్యమాల్లో పాల్గొనడం మొదలెట్టింది.ప్రజా ఉద్యమాల్లో పాల్గొనే సమయంలో అండాలమ్మ తన కుమారుడిని భద్రత కోసం పార్టీ వాళ్ళకు అప్పగించి వెళ్ళేది.
గోపాల్ రెడ్డి మాత్రం విజయవాడలోనే ఉండిపోయారు. తర్వాత ఆండాళమ్మ కూడా ప్రజా ఉద్యమాలు జరుపుతూనే విజయవాడ చేరుకుంది. 

▪️ఆయుధ సేకరణలో

1946 ప్రాంతంలో తెలంగాణ పోరాట వీరులకు ఉద్యమకారులకు తప్పనిసరిగా ఆయుధాలు అవసరం ఏర్పడింది. ఆయుధాలు మహారాష్ట మద్రాసు ప్రాంతాల్లో దొరుకుతాయి. ఆండాళమ్మకు ఉర్దూ మీద మంచి పట్టు ఉన్నది. ఈ కారణంచేత స్త్రీల మీద ఎవ్వరికీ అనుమానం రాదనే ఉద్దేశంతో గోపాల్ రెడ్డి తన భార్య అండాలమ్మ ఆయుధాలు సేకరించడం కోసం కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రమహాసభ నుండి నియమించాడు.

ఆయుధాలు సేకరించడం , నాణ్యత తనిఖీ, ఇవన్నీ కొనసాగించడానికి అప్పట్లో ఒక స్క్వాడ్ ఉండేది. ఇందులో సభ్యులు అందరూ ఆయుధ నిపుణులు. స్క్వాడ్ నాయకత్వంలో అండాలమ్మ రహస్యంగా ఆనాటి బొంబాయి మద్రాసు నగరాలకు వెళ్ళి ఆయుధాలు తీసుకువచ్చేది. నిపుణులు మారువేషాల్లో సాధారణ ప్రజలుగా ఎవ్వరికి అనుమానం రాకుండా ఆమెను అనుసరించే వాళ్ళు.
సేకరించిన ఆయుధాలను విజయవాడకు చేర్చేది. అక్కడి నుండి తెలంగాణ ప్రాంతానికి సరఫరా అయ్యేవి.

సాయుధ పోరాటం 1947 సెప్టెంబర్ నెలలో ప్రారంభం కాగా, అందుకు కావాల్సిన శక్తివంతమైన వందలాది ఆయుదాలను 1946 నుండి సేకరించి తన స్త్రీశక్తిని నిరూపించింది అండాలమ్మ. 1946 నుండి 1952 వరకు విజయవాడలోనే గడిపి ఉద్యమానికి సహకరించిన అండాలమ్మ దళాల్లో మాత్రం పని చేయలేదు. దళాలకు కావాల్సిన ఆయుధాలను మాత్రం సమాకూర్చింది.

▪️పోరాటాల పుట్టినిల్లు గంగసాని కుటుంబం

ఊరు గడప గడపను తట్టిలేపి ఊరునే ఉద్యమం చేసింది వీరి కుటుంబం. ఊరి పేరునే ఇంటిపేరుగా మలుచుకున్న త్యాగధనులు వీరు....! 
 తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర వహించిన ఈ గంగసాని కుటుంబమే ఒక పెద్ద చరిత్ర.

గంగసాని రాంచంద్రారెడ్డి, రంగమ్మ గార్లు ఇంటి పెద్దలు.
కుటుంబంలో పెద్దవాడు మంగారెడ్డి....గ్రామ దొరగా, ప్రజలమనిషిగా, నిజాం వ్యతిరేకిగా, ఆంధ్రమహాసభ చురుకైన కార్యకర్తగా కొనసాగాడు. మంగారెడ్డి పెద్ద కొడుకు తిరుమలరెడ్డి దేవరుప్పల చీఫ్‌ దళకమాండర్‌గా పనిచేస్తూ నిజాం సర్కారు చేతిలో హత్యకు గురయ్యాడు. రెండవ కొడుకు మోహన్‌రెడ్డి దళకమాండర్‌గా పనిచేసాడు. మూడవ కొడుకు సత్యపాల్‌రెడ్డి కొరియర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.

మంగారెడ్డి తమ్ముడు గోపాల్ రెడ్డి.ఉద్యమ ప్రవాహమై సాగినవాడు.ఆస్తిని ఉద్యమం కోసం పేదల కోసం ధారపోసి మధ్యతరగతి జీవితం గడిపిన వాడు.

గోపాల్‌రెడ్డి భార్య ఆండాలమ్మ. ఆయుధ సేకరణ, కీలక నాయకుల రహస్య స్థావరాల ఏర్పాటులో సమర్థవంతంగా పనిచేసింది.

▪️అండాలమ్మ కుటుంబం

గోపాల్‌రెడ్డి అండాలమ్మ దంపతులకు ఆరుగురు సంతానం. నలుగురు మగపిల్లలు....రఘుపాల్‌, మనోహర్‌, రవీందర్‌, సంపత్‌ లు.
ఇద్దరు ఆడపిల్లలు.... హేమలత, ప్రేమలతలు . వీరిలో రఘుపాల్‌ సీపీఐ(ఎం) పార్టీలో ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు.

▪️గ్రామ సర్పంచ్ గా - 

ఆండాలమ్మ పోరాట కాలం నుండి భర్త సహకారంతో ప్రత్యక్ష రాజకీయ ఉద్యమాల్లో పాల్గొంటు వచ్చింది. తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన సాయుధ పోరాటానికి ఆయుధాలు బాధ్యతగా సమీకరించింది. పోరాటం విరమణ తర్వాత సాధారణ జీవితంలోకి వచ్చాక గబ్బేట గ్రామ సర్పంచ్‌గా కొంతకాలం పనిచేసింది శక్తి వంతమైన మహిళా నాయకురాలిగా తన జీవితం చివరి వరకు ప్రజల కోసం సేవలు అందిస్తూ వచ్చింది.

▪️పుస్తక అభిమానిగా

ఆండాళమ్మకు మొదటి నుండి పుస్తకాలు చదివే అలవాటు ఉండేది. మహనీయుల చరిత్రలు, పోరాట గాథలు , ఆధ్యాత్మిక గాథలు , ఈ పుస్తకాల్లో ఉండేవి. ఆమె పుస్తక పఠనం ప్రత్యేకంగా ఉండేది. ఒక స్థలాన్ని ఎంచుకుని , అక్కడ సుఖాసనం వేసుకుని కూర్చొని, ముందు ఒక చిన్న బల్లమీద పుస్తకం ఉంచుకుని చదివేది.

▪️ఆఖరి మజిలీ

త్యాగం తన ఊపిరిగా...
విలువలు తన హృదయ నాదంగా...
అంకితభావాన్ని ఆరో ప్రాణంగా....
మంచితనం మానవతను లోకమంతా పంచి స్ఫూర్తి నదిలా ప్రవహించిన అండాలమ్మ 2000 సంవత్సరం ఈ లోకాన్ని దాటుకుని వెళ్ళిపోయింది.

▪️రికార్డు కానీ చరిత్ర

సాయుధ పోరాటానికి ఆయుధాలు అందించే క్రమంలో ప్రాణాలకు తెగించి శక్తి వంచన లేకుండా పనిచేసిన ఆండాళమ్మ చరిత్రకు సాయుధ పోరాట చరిత్రలో సరైన స్థానం దక్కక పోవడం విచారకరం.
ఎందరో వీరులు మరుగున పడిపోయారు. వీరత్వం తెలియని వాళ్ళు వీరులుగా కొనియాడబడుతున్నారు.
__________________________________________
వ్యాస సహకారం : గంగసాని రఘుపాల్ రెడ్డి
( ఆండాలమ్మ కుమారుడు )

No comments:

Post a Comment