Tuesday, April 16, 2024

పొనకా కనకమ్మ ( భారత స్వాతంత్ర సమరయోధురాలు)

పొనకా కనకమ్మ (1892-1968)
( భారత స్వాతంత్ర సమరయోధురాలు -త్యాగ శీలి)
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
వ్యాసకర్త : తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

సేవ చేయాలి అనుకుంటే మనసు ఉండాలి....
దానధర్మాలు కూడా చేయాలి అనుకుంటే ఆ మనసులో మానవీయత పుష్కలంగా ఉండాలి....
సేవతో దానధర్మాలతో సర్వస్వం దేశానికి అంకితం చేయాలి అనుకుంటే.....మనసు, మానవీయతలతో పాటుగా త్యాగనిరతి ఉండాలి!
అప్పుడే దేశంలో దీన ప్రజల కన్నీళ్ళు.... కష్టాలు....వ్యథలు..... హృదయాన్ని సూటిగా తగులుతాయి ! 
ఇవన్నీ పరిపూర్ణంగా కలిగి దేశం కోసం జీవితాన్ని అరించిన ఆదర్శ మహిళ పొనకా కనకమ్మ! 
#వివరాల్లోకి_వెళ్తే.....

" ఈ తరానికి పెద్దగా పరిచయం లేని మహిళ " అని చెప్పేకంటే -- " గొప్ప త్యాగం చేసి కూడా చరిత్రలో పెద్దగా పేరు సంపాదించుకోలేకపోయిన మహిళ పొనకా కనకమ్మ " అని చెప్పడం సమంజసంగా ఉంటుంది. స్వతంత్ర భారతావని కోసం కలలు కంటూ..... ఆ కలలు సాకారం దాల్చడం కోసం ప్రాణాలను ఫణంగా పెట్టి .....భావితరాల కోసం  
పోరాటం చేసి... తనది అనేది ఏమిలేదు..... తన ప్రాణమే దేశంగా జీవించిన త్యాగశీలి పొనకా కనకమ్మ.

స్త్రీలు గడప దాటని కాలంలో..... పురుషాధిక్యత సమాజంలో స్త్రీల అభిప్రాయాలకి ఆదర్శాలకు గుర్తింపు లేని కాలంలో..... పురుషులతో పాటు సమానంగా పోరాట పటిమను ప్రదర్శించిన అతికొద్ది మహిళల్లో కనకమ్మ ఒకరు !
వీరు ఆంధ్రప్రదేశ్‌ రాష్టం,నెల్లూరు జిల్లా,పొట్లపూడిలో
అమ్మమ్మ గారి ఇంట 1892 జూన్ 10 వ తేదీన కనకమ్మ జన్మించారు. 
వీరి తల్లిదండ్రులు మినగల్లు గ్రామ వాస్తవ్యులు మరుపూరు కొండారెడ్డి, కావమ్మ దంపతులు. కనకమ్మ జన్మించే నాటికే కొండారెడ్డి భూస్వామి.

ఆనాడు భూస్వామ్య కుటుంబాల జీవనశైలిలో స్త్రీలు గడప దాటక పోవడం, బయటకు వస్తే పరదా పద్దతి పాటించడం ఒక సంప్రదాయం. కానీ కనకమ్మ సాధారణ భూస్వామ్య వనితగా జీవించలేదు. పరదా పద్దతిని పక్కకు పెడుతూ 14 ఏండ్ల ప్రాయంలోనే జనంలోకి వచ్చింది.

#ప్రేరణ

ఇంటి నిండా నౌకర్లు, ధాన్యం బస్తాలు, వచ్చిపోయే అతిథులు, బంధువులు, బయటకు వెళ్తే లభించే ఎనలేని గౌరవం, కొనసాగే దానధర్మాలు,ఇది కనకమ్మ కుటుంబ వైభవం. ఈ పరిస్థితుల్లోనే తమను ఆశ్రయిస్తున్న వారిలో పేదలను గమనించింది. అంటరాని తనాన్ని గమనించింది. ఇంటికి వచ్చిన వారి సంభాషణల్లో బయట సామజిక రాజకీయ పరిస్థితుల్లో బ్రిటిష్ దొరల ఆగడాలను తెలుసుకుంది. బ్రిటిష్ వారికి ఎదురు తిరిగిన పోరాటయోధులు గురించి తెలుసుకుంది. ఇదే క్రమంలో.... తన పుట్టకముందే బ్రిటిష్ వారితో పోరాటం చేసిన భారతీయ వీరుల కథలు పెద్దల ద్వారా తెలుసుకుంది. ఇంట్లోనే ఉండి ప్రపంచాన్ని చూసిన కనకమ్మ మనసులో తాను పోరుబాటలో పయనించాలనే ఉత్సాహం కలిగింది. 

#బాల్యవివాహం 

బాల్యంలోనే పరిపక్వత కనబర్చిన కనకమ్మ ఆలోచనలు, అభిప్రాయాలు, పిల్ల ఆలోచనలుగానే భావించారు పెద్దలు. ఇటువంటి పరిస్థితుల్లో కనకమ్మకు 9 ఏండ్ల ప్రాయంలో మేనమామ పొనకా సుబ్బిరామిరెడ్డితో వివాహం జరిగింది. వివాహం తర్వాత కనకమ్మ జీవితం పొట్లపూడికి మారింది. అమ్మమ్మ గారు అప్పటికే 150 ఎకరాల భూస్వాములు. అక్కడ కూడా పరదా పద్దతితో పాటుగా, వచ్చిపోయే రకరకాల మనుషులు అనివార్యంగా కనిపించారు. ముఖ్యంగా గ్రామంలో హరిజనుల పరిస్థితి దారుణంగా కనిపించింది. మేనమామ సుబ్బిరామిరెడ్డి ఆదర్శ భావాలతో మెలుగుతూ దీనజనుల కోసం తన వంతుగా అప్పటికే కృషి చేస్తున్నాడు. ఈ విధంగా ప్రజల కోసం..... సమాజం కోసం.... ఏదో చేయాలనే కనకమ్మ ఆలోచనలకు మేనమామ సహకారం తొడయ్యింది.

#స్వచ్ఛంద_సేవకురాలిగా
1906 నుండే కనకమ్మ సమాజ సేవలో భాగస్వామ్యం అయ్యింది. స్వచ్చంద సేవకురాలిగా తానే సేవకార్యక్రమాలను రూపొందిస్తూ ముందుకు నడిచింది. అనతి కాలంలోనే సమాజంలో ఒక గుర్తింపు తెచ్చుకుంది.
అంటరానితనం అమానుషం, స్త్రీ విద్య, జాతీయ సమైక్యత, ఈ అంశాలు అలంబనగా కనకమ్మ ప్రయాణం మొదలయ్యింది. బాల్యంలోనే వివాహం జరగడం మూలాన పెద్దగా చదువుకునే అవకాశం లేకపోయింది. అయినప్పటికీ స్వయం కృషితో తెలుగు భాషలో ప్రావీణ్యం సంపాదించుకుంది. ఆ తర్వాత ,ఆంగ్ల, సంస్కృతాలను నేర్చుకుని సంస్కృతంలో పాండిత్యాన్ని సాధించింది.

#బిపిన్_చంద్రపాల్_ఆశీర్వాదం 

1907లో వందేమాతరం ఉద్యమంలో భాగంగా తెలుగు ప్రాంతానికి వచ్చాడు బిపిన్ చంద్రపాల్. వీరికి కనకమ్మ గురించి తెలిసింది. ఒక సామాన్య స్త్రీ దేశం కోసం జాతీయ భావాలతో ముందుకు నడవడం వారికి ఆశ్చర్యం వేసింది. వెంటనే స్వయంగా పొట్లపూడి బయలుదేరి వెళ్ళాడు. కనకమ్మతో భేటీ అయ్యాడు. ఆరోజు మొత్తం అక్కడే గడిపాడు. స్వతంత్ర భారతం కోసం మరింత ముందుకు నడవాలని ఆమెకు తన ఆశీర్వాదం అందించాడు.

#సుజన_రంజని_సమాజం

▪️ఆనాటి జాతీయోద్యమ పోరాటం మరింత బలపడాలంటే, అందరు ప్రజలు ఆ పోరాటంలో భాగస్వామ్యం కావాలంటే , సగటు భారతీయ ప్రజల్లో ముందుగా చైతన్యం రావాలి అని కనకమ్మ గుర్తించింది. ఈ క్రమంలో భారతీయుల్లో ఒకరైన హరిజనులు తోటి భారతీయుల చేతే వెలివేయబడటం ఆమె సహించలేకపోయింది. మనలోనే ఐక్యత లేనప్పుడు దాస్య శృంఖలాలు దేశాన్ని మరింత పరాధీనత పాలు చేస్తాయని లేత ప్రాయంలోనే అభిప్రాయ పడింది.

 ▪️ " దేశ ప్రజలే నీకు అంటరాని వారుగా కనిపిస్తున్నప్పుడు .... విదేశీయులకు నీవు బానిసగా కనిపించవా? దేశంలో మనుషులంతా ఒక్కటే! ఒక్కటిగా ముందుకు కదిలితేనే బానిస సంకెళ్లు చేధించుకోగలుగుతాము " అంటూ ముందుగా తమ గ్రామంలోనే ప్రచారం మొదలెట్టింది. గ్రామంలో హరిజనుల అభివృద్ధి కోసం పాటుబడటం ఆరంభించింది. ఇందులో భాగంగా పొట్లపూడి గ్రామంలో హరిజనుల కోసం 1913లో తన 21 ఏండ్ల వయసులో " సుజన రంజని సమాజం" స్థాపించింది.

▪️హరిజనులకు విద్య - హరిజనులతో సహపంక్తి భోజనం - హరిజనుల ఆలయ ప్రవేశం - సుజన రంజని సమాజం ముఖ్య ఉద్దేశ్యాలు. ఈ క్రమంలో కొందరి నుండి కనకమ్మకు విమర్శలు వ్యతిరేకతలు తప్పలేదు. ఆటంకాలను ఆమె లెక్కచేయలేదు. అనుకున్న దారిలో అడ్డగిస్తున్న వాళ్ళను తప్పుకుంటూ ముందుకు నడిచింది.

▪️1919 లో పొట్లపూడిలో హరిజన బాలుర వసతి గృహాన్ని ఏర్పాటు చేసింది.

▪️కనకమ్మ హరిజనులను ఆదరించడం కొందరు బంధువులకు కుటుంబ స్నేహితులకు మింగుడు పడలేదు. ఈ క్రమంలో కనకమ్మను నిలదీశారు. భర్త సుబ్బిరామిరెడ్డికి ఫిర్యాదులు చేసారు. పెండ్లిళ్లు పేరంటాలకు కనకమ్మను ఉద్దేశ్య పూర్వకంగా విస్మరించారు. అయినప్పటికి కనకమ్మ ఎవ్వరికి భయపడలేదు. తన అడుగులను వెనక్కి వేయలేదు. తన వేగాన్ని మరింత పెంచింది.ఇదే 
కనకమ్మను ధీర వనితగా తీర్చిదిద్దగలిగింది.

#సాహిత్య_సృజన

1917 నుండి తన 25 ఏట నుండి కనకమ్మ సాహిత్యాన్ని సృజంచడం మొదలెట్టింది. కేవలం సమాజ ఉద్దరణ, సంస్కరణాభిలాష, కనకమ్మ రచనల ముఖ్య ఉద్దేశ్యం. సమాజాన్ని మేలుకొలిపే కవితలు, సాహిత్య వ్యాసాలు, ఆమె నుండి వెలువడ్డాయి.
వీరి రచనలు అనసూయ ,గృహలక్ష్మి , హిందూ సుందరి ,భారతి ,జమీన్ రైతు మొదలైన పత్రికలో ముద్రింప బడేవి.

#వక్తగా_కనకమ్మ

1917 లో నెల్లూరులో కొండా వెంకటప్పయ్య అధ్యక్షతలో ఐదవ ఆంధ్రమహాసభ జరిగింది. 
ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని పెంపొందించడానికి, తమిళుల ఆధిపత్యాన్ని అడ్డుకోవటానికి ప్రారంభమైన ఆంధ్రమహాసభ ఉద్దేశ్యాలు అప్పటికే కనకమ్మను ప్రభావితం చేసాయి. ఈ సభలో కనకమ్మకు ప్రసంగించే అవకాశం సంపాదించుకుని, వక్తగా అందరినీ ఆకట్టుకుంది.

#బాలికా_విద్య_కోసం 

ఒక్క హరిజనుల కోసమే కాదు, సమాజంలో అనేక కుటుంబాల్లో చదువుకోవాలని ఆశ ఉన్న ఆడపిల్లల కోసం పాటు బడటం మొదలెట్టింది.ఆడపిల్లల చదువుకోసం, వారి ఆర్థిక స్వాతంత్య్రం కోసం
శక్తి వంచన లేకుండా కృషి చేసింది. ఇంటింటికి తిరిగి ఆడపిల్లల్ని చదివించాల్సిందిగా ప్రచారం చేసింది. బాలికల విద్యపై అవగాహన కోసం కరపత్రాలు ముద్రించి పంచింది. అవగాహనా తరగతులు నిర్వహించింది.. ఈ పరిస్థితిలో తమ బిడ్డల్ని కనకమ్మ చెడగొడుతున్నడని భావించిన కుటుంబాలు లేకపోలేదు. అటువంటి కుటుంబాలను ఓపికగా కలిసి స్త్రీ విద్య ఆవశ్యకతని వివరించి చాలా వరకు మార్పు తీసుకు రాగలిగింది కనకమ్మ. 

#వివేకానంద_గ్రంధాలయం

ఆడపిల్లలు ఒక్కటే కాదు, స్త్రీ పురుష బేధం లేకుండా యువత చైతన్యవంతం అయితే జాతీయ భావాలు పెంపొందించబడుతాయని, తద్వారా భారతదేశం స్వాతంత్రము సంపాదించు కోగలుగుతుందని భావించింది. ఆ రోజుల్లో ఆంగ్లేయుల ఆధిపత్యం కారణంగా చాలా గ్రామాలకు దినపత్రిక కూడా వెళ్ళేది కాదు. దేశంలో ఏం జరుగుతుందో సరైన సమాచారం తెలిసేది కాదు. ఈ నేపథ్యంలో కొందరు సంఘ సేవకులతో కలిసి తమ పొట్లపూడి గ్రామంలో 
వివేకానంద గ్రంథాలయం ఏర్పాటుకు కృషి చేసింది.
తర్వాత పందొరువు , కండ్రిగ, కొత్తూరు, మొదలైన గ్రామాల్లో గ్రంధాలయాలు నిర్వహించడంలో విజయం సాధించింది.

#జాతీయ_పాఠశాల

ఆ రోజుల్లో స్త్రీ విద్యపై అనేక ఆంక్షలు ఉండేవి. అట్లాగే ఆంక్షలు లేకపోయినప్పటికీ చాలా కుటుంబాల్లో పురుషులు కూడా విద్యకు దూరంగా ఉండేవాళ్ళు.. ఈ క్రమంలో స్త్రీ పురుషులు చదువుకుంటేనే సమాజం చైతన్యవంతం అవుతుందని భావించిన కనకమ్మ పొట్లపూడి గ్రామంలో జాతీయ పాఠశాల ఒకటి ఏర్పాటు కావడం కోసం పాటుబడింది.

#ఆరోగ్య_సేవా_కార్యక్రమాలు

పొట్లపూడి, ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఆరోగ్య సదుపాయల కోసం కూడా కనకమ్మ కృషి చేసింది. ఆ రోజుల్లో వైద్యం కోసం కిలోమీటర్లు వెళ్ళాల్సి వచ్చేది. ఈ క్రమంలో మధ్యలోనే కొందరి ప్రాణాలు పోయేవి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలకు కనీసం ప్రాథమిక వైద్య సదుపాయమైనా ఉండాలని ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు కృషి చేసింది.

#తుపాకుల_శిక్షణ

బాలగంగాధర్ తిలక్ స్వరాజ్యం నా జన్మహక్కు నినాదం కనకమ్మను అతివాద విప్లవ భావజాలం వైపు నడిపించింది. భారత స్వతంత్ర పోరాటంలో విప్లవ పంథా అనివార్యం అనే ఆలోచన అతివాదుల్లో కలిగింది. ఈ పరిస్థితుల్లో అతివాద భావాలతో ఉన్న కనకమ్మ రహస్య విప్లవోద్యమం నడిపింది. నిషిద్ద విప్లవ సాహిత్యాన్ని యువతకు చేరవేసింది  
ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఒక సైన్యాన్ని సొంతంగా తయారు చేసింది. ఇందులో భాగంగా తన సైన్యానికి తుపాకుల పేల్చడంలోరహస్యంగా శిక్షణ ఇప్పించింది.తుపాకులను సరఫరా చేసింది.
ఇందుకోసం పెన్నానది ఒడ్డున పల్లిపాడు వద్ద 13 ఎకరాల భూములను కొనుగోలు చేసింది.

#కస్తూరిదేవి_విద్యాలయం

▪️ఆరోజుల్లోనే బాలికా విద్య ప్రాధాన్యతను గుర్తించిన కనకమ్మ నెల్లూరులో కస్తూరిదేవి పేరిట విద్యాలయాన్ని
నెలకొల్పాలని 1923 నుండి ప్రయత్నాలు చేసింది 1927 లో ఆమె ప్రయత్నం ఫలిస్తూ పాఠశాల భవనానికి పునాదిరాయి పడింది. 
▪️1929 లో స్వతంత్రోద్యమంలో భాగంగా నెల్లూరు వచ్చిన గాంధీజీ దంపతులు కస్తూరిదేవి బాలికల పాఠశాల శాశ్వతభవనానికి శంకుస్థాపన చేసారు.
తర్వాత ఈ విద్యాలయాన్ని కనకమ్మ 23 ఎకరాల
విస్తీర్ణంలో సువిశాలంగా మార్చారు.

▪️బాలికల విద్య కోసం కనకమ్మ ప్రయత్నాలు తరతరాలకు ఆదర్శం. వారి కృషి ఫలితంగా కస్తూరిపాఠశాల నుండి ఈనాడు ఎందరో సరస్వతి పుత్రికలు బయటకు వచ్చారు.

#మహాత్మాగాంధీ_అనుచరురాలిగా

▪ కనకమ్మకు గాంధీ అడుగుజాడలే జీవితం అయ్యాయి. ఆమెలో సహజంగా సేవగుణం వున్నది. దానికి తోడు గాంధీ సిద్దాంతాలు తోడయ్యాయి.
ఈ క్రమంలో ️1920 సెప్టెంబరు 4 న మొదలై 1922 ఫిబ్రవరిలో ముగిసిన సహాయ నిరాకరణ ఉద్యమంలో
గాంధీ పిలుపు మేరకు ఉత్సహంగా పాల్గొన్నది.

▪️ఖాదీ... నినాదం స్వాతంత్య్ర ఉద్యమానికి కొత్త ఊపిరి ఇచ్చింది. భారతీయులు విదేశీ వస్ర్తాలను బహిష్కరించి స్వదేశీ వస్త్రాలనే ధరించాలని గాంధీజీ ఇచ్చిన పిలుపుతో దేశ వ్యాప్తంగా ఆదరణ పొందిన ఖాదీ ఉద్యమంలో భాగంగా 1921లో కనకమ్మ చరఖా చేపట్టింది. గ్రామాల్లో పర్యటించి ఖాదీ ప్రచారం చేసింది. స్వదేశి చేనేత కేంద్రం ఎందరినో ప్రభావితం చేసింది. ఈ క్రమంలో దేశభక్తులైన నాయకులు గ్రామీణ ప్రాంతాల్లో ఖాదీ పరిశ్రమలు నెలకొల్పి ఎందరికో ఉపాధి అవకాకాశాలు కల్పించారు. కనకమ్మ ఖాదీ పరిశ్రమల ఏర్పాటులో గ్రామీణలకు ఆర్ధిక సహకారం అందించింది. తాను స్వయంగా ఖాదీ పంచను నేసి, గాంధీకి కానుకగా పంపింది.

▪️చతుర్వేదుల కృష్ణయ్య ,దిగుమర్తి హనుమంతరావు గార్లు నెల్లూరు దగ్గర పల్లిపాడులో 
సత్యాగ్రహ ఆశ్రమం ఏర్పాటు చేసే ఉద్దేశ్యంగా సన్నాహాలు చేసారు. 1921 ఏప్రిల్ 7వ తేదీన గాంధీజీ ఆశ్రమం ప్రారంభించడానికి పల్లెపాడు గ్రామం సందర్శించాడు.

కనకమ్మ గారు తన వంతు సహకారంగా తాను విప్లవ సైన్యం కోసం కొనుగోలు చేసిన 13 ఎకరాల భూమిని ఆశ్రమం ఏర్పాటుకు దానంగా ఇచ్చివేశారు. తర్వాత గాంధీ భావజాలాన్ని ఒంటబట్టించుకుని విప్లవ కార్యక్రమాలకు స్వస్తి పలికి శాంతియిత పోరాటం వైపు మొగ్గుచూపారు. అదే సమయంలో తన ఒంటి మీద ఉన్న బంగారు ఆభరణాలను కూడా విరాళంగా ఇచ్చింది కనకమ్మ.

ఆ తర్వాత ఆమె తన జీవితం చివరి వరకు కూడా బంగారం ధరించలేదు. సహజంగా భూస్వాముల ఇంట్లో పుట్టి, భూస్వాముల ఇంటికే కోడలిగా వెళ్లిన కనకమ్మకు చిన్నప్పటినుండి బంగారు ఆభరణాలు ఆడంబరతలో భాగంగా కాకుండా అలంకరణలో భాగంగా ధరించే అలవాటు ఉండేది. కానీ ఆ అలవాటును ఆమె ఉద్దేశ్య పూర్వకంగానే దూరం చేసుకుంది.

▪️గాంధీ నేతృత్వంలో భారత జాతీయ కాంగ్రెసు జరిపిన అహింసాయుత సత్యాగ్రహం ఉప్పు సత్యాగ్రహం. ఉప్పు పన్నును ధిక్కరిస్తూ గాంధీ....,1930 మార్చి 12 నుండి 1930 ఏప్రిల్ 6 వరకు, 384 కిలోమీటర్ల దూరం, వేలమంది సత్యాగ్రహులతో ఈ ఉద్యమం నడిపాడు. కనకమ్మ ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలోనూ పాల్గొనడమే కాదు ...... మహిళల్ని తన వెంట నడిపించింది.

#జైలు_శిక్ష

▪️పొట్లపూడిలో కనకమ్మ ఇల్లు స్వాతంత్ర సమరయోధులకు , దేశభక్తులకు, సంఘ సంస్కర్తలకు,
జాతీయ నాయకులకు, కవులకు,కళాకారులకు , విప్లవకారులకు , ఉద్యమ కేంద్ర బిందువుగా మారడం బ్రిటిష్ ప్రభుత్వానికి నచ్చలేదు.

▪️కనకమ్మ గాంధీ సిద్దాంతాలు పాటించడం, గాంధీజీ పిలుపు అందుకుని ఉద్యమాల్లో పాల్గొనడం, అంతేకాకుండా మరెందరినో గాంధీ మార్గం వైపు ప్రేరేపించడం కూడా బ్రిటిష్ ప్రభుత్వానికి మింగుడు పడలేదు. ఈ క్రమంలో పల్లెపాడులో 1930 లో జరిగిన ఉప్పుసత్యాగ్రహం కార్యక్రమంలో భారీ ఎత్తున జనాన్ని సమీకరించి పాల్గొన్నది. ఇందుకు ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన అభియోగం కింద బ్రిటిష్ ప్రభుత్వం కనకమ్మను 1930 జూలై 27 న అరెస్టు చేసి జైలుశిక్ష విధించింది. నెల్లూరు ,రాయ వేలూరు జైళ్లలో లో 6 నెలలు కారాగారం అనుభవించింది.

▪️1932, మే 24 న మద్యం దుకాణాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న కనకమ్మ రెండవసారి అరెస్టు అయ్యింది. 18 నెలలు జైలు శిక్ష అనుభవించి , అనారోగ్యం కారణంగా 1933 లో విడుదల అయ్యింది.

#జమీన్_రైతు_సంఘం 

▪️1928 -30 ప్రాంతంలో నెల్లూరులో జమీందారుల చర్యలకు వ్యతిరేకంగా రైతు ఉద్యమం జరిగింది.ఉద్యమానికి బాసట అందిస్తూ కనకమ్మ రైతుల పక్షం వహించింది. జమీన్ రైతు సంఘాన్ని ముందుకు నడిపించింది. 

▪️రైతులకు సంఘీభావంగా ఒక పత్రికను తీసుకురావాలనే మేధావుల ప్రయత్నానికి తన అండదండలు అందించింది. ఈ క్రమంలో నెల్లూరు నుండి 1928 లో ఎన్. వెంకట్రామానాయుడు సంపాదకుడిగా" జమీందారీ రైతు " పేరుతో పత్రిక ప్రారంభమైనది. క్రమంగా జమీన్ రైతుగా మారిన ఈ పత్రికలో రాజకీయ, సామాజిక వార్తలు, కథలు, కవితలు, వ్యాసాలు,పద్యాలు, నవలలు కూడా ప్రచురించింది.

"రైతుల పక్షాన నిలబడి, రైతుల సముచిత హక్కులకై జమీందారులను సంప్రదించి, జామిందారులు రైతులకు వ్యతిరేకత కనబర్చినప్పుడు ఆందోళనలు చేసి, రైతుల హక్కులు సాధించడం ముఖ్యోద్దేశంగా" ఈ పత్రిక వారపత్రికగా అన్ని వర్గాలను అలరించింది.

పత్రిక కారకురాలు కనకమ్మ మీద జామిందారులు కక్ష పెంచుకున్నారు. ముఖ్యంగా వెంకటగిరి జమీందార్ కనకమ్మను శత్రువుగా భావించి ఆమె ఆర్థిక మూలాల మీద దెబ్బవేయడం మొదలెట్టాడు. అయినప్పటికీ కనకమ్మ భయపడలేదు. మరింత పదునుతో ముందుకు నడిచింది 

#కుటుంబం

▪️కనకమ్మ సుబ్బిరామిరెడ్డి దంపతుల కుమార్తె వెంకటసుబ్బమ్మ .వీరు కూడా తల్లి కనకమ్మ బాటలో నడిచిన సామజిక కార్యకర్త. సంఘ సేవకురాలు.సంఘ సంస్కరణ అభిలాష ఉన్న ఉత్తమ రచయిత్రి.
సమాజ ఉద్దరణ ధ్యేయంగా వెనక బడిన స్త్రీల అభివృద్ధి కోసం తల్లి అండదండలతో ‘’పారిశ్రామిక శిక్షణా కేంద్రం ‘’ ఏర్పాటు చేసి ఎందరో మహిళలకు ఉపాధి కలిగించింది. 

#ఆధ్యాత్మికత

 విధి వక్రించి కనకమ్మ కూతురు వెంకట సుబ్బమ్మ ఆకస్మికంగా కాలం చేసింది. కూతురు మరణం కనకమ్మను తీవ్రంగా కృంగ దీసింది. ఆ విషాదం నుండి బయటపడలేని పరిస్థితులు దాపురించాయి. ఈ పరిస్థితిలో పూర్తిగా మనశాంతిని కోల్పోయిన కనకమ్మకు భగవాన్ రమణ మహర్షి గురించి తెలిసింది. వెళ్లి దర్శనం చేసుకుని , వారి బోధనలకు ప్రభావితురాలై శిష్యురాలుగా మారింది. తర్వాత 
అన్నారెడ్డి పాలానికి చెందిన ఆధ్యాత్మిక గురువు రామయోగి వారిని కనకమ్మ తన ఆధ్యాత్మిక గురువు
స్వీకరించింది. వీరి జీవిత చరిత్రను తెలుగు ఆంగ్ల భాషల్లో రాసి తన భక్తిని చాటుకుంది.

#జంట_మహిళాకవులు

పొనకాల కనకమ్మ - ద్రోణంరాజు లక్ష్మీబాయమ్మలు ఆనాటి సమాజంలో జంట కవయిత్రులుగా సంస్కరణ సాహిత్యాన్ని సృజించి సమాజాన్ని అలరించారు. వీరి కలయికలో భగవాన్ రమణ మహర్షి మీద ఆధ్యాత్మిక తాత్విక గ్రంధాలు వెలువడ్డాయి. ఈ గ్రంధాల్లో 
1 ) ఆరాధన 2) నైవేద్యం ముఖ్యమైనవి. మరో ముఖ్య గ్రంధం......జ్ఞాన నేత్రం. భగవద్గీత సారాంశమే ఈ గ్రంధం.   

#గౌరవ_పురస్కారాలు

▪️దేశభక్తి పెంపొందించడంలో సాహిత్యం ద్వారా సహకరించిన కనకమ్మ సాహిత్యానికి గృహలక్ష్మి స్వర్ణ కంకణం లభించింది.

▪️మద్రాస్ ఆంధ్రమహిళాసభ రజతోత్సవాలలో సంస్థ అధ్యక్షురాలు శ్రీమతి దుర్గాబాయి దేశముఖ్ గారు కనకమ్మ గారిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. కనకమ్మ సేవలు కొనియాడుతూ వెండిపళ్ళెం కానుకగా ఇచ్చి గౌరవించారు .

#జీవితచరిత్ర

కనకమ్మ గారి స్వీయ జీవిత చరిత్ర 
’’కనక పుష్యరాగం" ‘. ఈ గ్రంధంలో తన జీవితంలో అన్ని ఘట్టాలను స్పృశించింది కనకమ్మ. ఈ గ్రంధాన్ని డాక్టర్ కపిల పురుషోత్తం గారు 2011లో ఆవిష్కరించారు. 
 
#రాజకీయాల్లో 

స్వాతంత్య్రం అనంతరం సాధారణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో కొనసాగింది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి ఉపాధ్యక్షురాలిగా,అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వహించారు. కానీ ఆమెకు రాజకీయాలు మింగుడు పడలేదు. అందుకే కొన్నాళ్లకే రాజకీయాలు విరమించుకుని, సొంత గ్రామానికి చేరుకుంది.

#కనకమ్మ_జీవితంలో_ముఖ్యంశాలు

▪️1916 లో ఆరంభమైన హోంరూల్ ఉద్యమం గురించి తెలుగు ప్రాంతాల్లో ప్రచారంచేయడంకోసం ఒక శాఖను ఏర్పాటుచేయడం జరిగింది. దానిని హోంరూల్ లీగ్ శాఖ అంటారు. నెల్లూరు ప్రాంతంలో హోంరూల్ ఉద్యమానికి కనకమ్మ ఆధ్వర్యంలో పొట్లపూడి కేంద్రం అయ్యింది.

▪️1919 లో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పొట్లపూడి వచ్చి కనకమ్మను కలిశారు.

▪️విప్లవ కణిక అని దేశనాయకుల చేత అభివర్ణించబడింది.

#మరణం

కనకమ్మ వంటి మహిళలు అరుదుగా ఉంటారు. తన మొత్తం ఆస్తిని ప్రజల కోసం ధారపోసిన కనకమ్మకు నెల్లూరు ప్రజలు ఎప్పటికీ రుణపడి వుంటారు. తన జీవితం చివరి వరకు ప్రజల యోగక్షేమాలే తన ఊపిరిగా బతికిన కనకమ్మ ......1963 సెప్టెంబర్ 15 న తన తన 71 ఏట శాశ్వతంగా కన్నుమూసారు. ఒక తరం తారై రాలిపోయి, రేపటి తరానికి ఆదర్శమయ్యింది.

No comments:

Post a Comment