Monday, April 15, 2024

చింతలపూరి రాంరెడ్డి

చింతలపూరి రాంరెడ్డి (రేణికుంట )
( 1903 - 1948)
(తెలంగాణ సాయుధ పోరాట వీరుడు )
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
వ్యాసకర్త : తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

కాగడా తానై... కారుమబ్బులు తొలగించి -
ప్రచండం తానై... ప్రతాపాలను రగిలించి -
ఉద్యమం తానై... ఉరికొయ్యలను ప్రేమించి -
అతడు.. 
చింతలపూరి రామిరెడ్డి !

"రామా రామిరెడ్డి..... 
మా చింతలపూరి రామిరెడ్డి...
నీ కొడుకు రంగారెడ్డి... 
యుద్దాన ఎదురొడ్డి... "

అంటూ జానపదులు నేటికిని పాటలుగా పాడుకునే తెలంగాణ సాయుధ పోరాట వీరుడు చింతలపూరి రామిరెడ్డి.... రేణికుంట రామిరెడ్డిగా ప్రసిద్ధి చెందాడు. 

👉ప్రజా బంధువులు :

తెలంగాణ రాష్ట్రం పోరాటాలకు పెట్టిది పేరయిన 
నల్లగొండ - భువనగిరి దగ్గర రేణుకుంట వీరి స్వగ్రామం. ఇక్కడ పూర్వం నుండి పేరెన్నిక గల భూస్వామ్య కుటుంబంలో 1903 లో జన్మించాడు. నిజాం సర్కర్ హయాంలో తెలంగాణ ప్రాంతంలో గ్రామాలు దొరల ఏలుబడిలో కొనసాగుతుండేవి. దొరల్లో చిన్న దొరలు - పెద్ద దొరలు ఉండేవారు. రామిరెడ్డి కుటుంబం చిన్న దొరలుగా పరిగణించబడింది. మొత్తం దొరల సమూహాన్ని నిజాం ప్రభువు తన బలగంగా భావించేవాడు. కాగా ఈ క్రమంలో కొందరు దొరలు నిజాం రాజరికానికి వ్యతిరేకంగా ప్రజా బంధువులుగా మారి ప్రజా పోరాటాలు మొదలెట్టారు. ఇటువంటి ప్రజా బంధువుల్లో రామిరెడ్డి కుటుంబం ఒకటి. 

👉గ్రామరక్షణ దళాలు :

రామిరెడ్డికి చిన్నప్పటి నుండి అభ్యుదయ భావాలు ఎక్కువ. ఈ క్రమంలో మొదట్లో సంస్కరణాభిలాషిగా ఆంధ్రమహాసభ ప్రేరణతో చైతన్యం పొందాడు. మహాసభలో ఒక సభ్యుడుగా అడుగు పెట్టి సంఘం కోసం పనిచేయడం మొదలెట్టాడు. 

1939-1945 మధ్య కాలంలో నిజాం ప్రభుత్వం పన్నులు పెంచి ప్రజలను పీడిస్తున్న సమయంలో ప్రజా పక్షం వహించి ప్రశ్నించడం మొదలెట్టాడు. 

తర్వాత తెలంగాణ సాయుధ పోరాట కాలంలో... 1944లో రజాకర్ల నుండి ప్రజలను కాపాడడానికి ఆరుట్ల రామచంద్రారెడ్డితో కలసి గ్రామరక్షక దళాలను ఏర్పాటు చేసాడు. రజాకార్లు గ్రామాల్లోకి ప్రవేశించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఈ కాలంలో తన దళాలతో కలిసి రజాకార్లను గడగడా వణికించాడు. 

రజాకార్లతో అప్పటికే ఆధునిక ఆయుధాలు ఉన్నాయి. కాగా రామిరెడ్డి దళం కర్రలు గుత్పలు పారలు నుండి పోరాటాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలో తన దళానికి నాటు తుపాకులు సమకూర్చుకోవడంలో రామిరెడ్డి ప్రాణాలకు తెగించి శ్రమించాడు. 

గ్రామ రక్షణ దళాలకు తానే స్వయంగా ఆయుధ శిక్షణ ఇచ్చాడు. ప్రత్యక్షంగా పరోక్షంగా శత్రువును పసిగట్టడంలో రామిరెడ్డి దిట్ట. ఇందుకు అవసరమైన పరిజ్ఞానం రామిరెడ్డికి జన్మతా సొంతం. దళం సభ్యులకి ఈ విషయమై ప్రత్యేక తరగతులు నిర్వహించి నేర్పించాడు. 
కోవర్టుల్ని కూడా నియమించుకున్నాడు. 

👉వీరుల విస్మృతి బాధాకరం :

తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర అనగానే ఏ కొందరి పేర్లో గుర్తుకు వస్తాయి. చరిత్రలో కూడా ప్రముఖంగా ఆ కొందరికే ప్రాధాన్యత దక్కింది. కానీ చింతలపూరి రామిరెడ్డి ప్రత్యక్ష పోరాటం చేసినప్పటికీ.... ప్రాణాలకు తెగించి సర్కారుకు సవాలుగా మారినప్పటికీ....మరణించేవరకు పోరాటమే ఊపిరిగా బతికినప్పటికీ.... 
చరిత్రలో పెద్దగా స్థానం దొరకలేదు. సందర్భాను సారంగా వారి పేరును చరిత్రలో ఒకరిద్దరు పేర్కొన్నారు తప్ప వారు చేసిన పోరాటం గురించిన వివరాలు ఎవ్వరూ పెద్దగా పొందుపరచబడలేదు. ఇది బాధాకరమైన విషయం. 

👉ఉద్యమ గేయాల్లోను విస్మరించారు :

తెలంగాణ ఉద్యమ చరిత్రను ...ముఖ్యంగా మలి విడత ఉద్యమచరిత్రలో భాగంగా వచ్చిన గేయసాహిత్యాన్ని గమనిస్తే...తెలంగాణ పోరాట వారసత్వంగా కొందరి పేర్లే ప్రముఖంగా వినిపించాయి.
వాళ్ళల్లో -
ఆదివాసీల అడుగుజాడ కొమరంభీం,బహుజన రాజ్యం ఆశాజ్యోతి సర్వాయిపాపన్న , కాకతీయ ప్రతాపరుద్రుడిని ఎదురించిన సమ్మక్క సారలమ్మలు ,సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య , దేశ్ముఖ్ అనుచరుల దురాగతానికి బలైన షేక్ బందగీ ,భూమి హక్కుని ప్రశ్నిస్తూ ...ఆంధ్రమహాసభ కార్యకర్తల అండదండలతో దొరకు వ్యతిరేకంగా ముందుకు నడిచిన చాకలి ఐలమ్మ , వీళ్ళను మాత్రమే ఉద్యమ కవులు పోరాట వారసత్వంగా స్మరించుకున్నారు. కానీ రామిరెడ్డి వంటి వీరుడు చరిత్ర పుటల్లో ఎక్కడో మరుగున పడిపోయాడు. 

ఉద్యమ కవిత్వాలు రాసిన కవులు రామిరెడ్డి వంటి వీరులను ఉద్దేశ్యపూర్వకంగా స్మరించుకోలేదా? లేకా వాళ్ళు వీరులు కాదని భావిస్తూ పక్కకు పెట్టారా? లేకా తెల్వక తలుచుకోలేదా ? లేకా తెలిసీ మా వాళ్ళు కాదు కదా అనుకున్నారా? ఇవన్నీ మిలియన్ డాలర్ల ప్రశ్నలు. 

పోరాటం నడిపించిన - 
పోరాటం ప్రారంభించిన -
పోరాటానికి పునాదులు వేసిన -
పోరాటానికి సూత్రాలు రచించిన - 
రామిరెడ్డి వంటి వీరుడిని .... ఎందుకు చరిత్ర మరిచిపోయింది? పొరపాటు ఎక్కడ జరిగింది? 

👉పోరాట వీరుడికి వందనాలు :

తన ఇంటినే ఉద్యమ కేంద్రంగా మార్చుకున్న రామిరెడ్డి, సామాన్యుడిని సైతం సాయుధ వీరుడుగా మార్చాడు. తన ఇంట్లోనే రహస్యంగా సమావేశాలు ఏర్పాటు చేసి, అంటరాని తనానికి వ్యతిరేకంగా అందరినీ ఇంట్లోకి ఆహ్వానించాడు. దళం అంటే కుటుంబం అని భాష్యం చెప్పిన రామిరెడ్డి పోరాటానికి బంధుమిత్రులు కూడా సై అన్నారు. 

👉పరిశోధన జరగాలి :

ముఖ్యంగా సాయుధపోరాట కాలంలో పోరాటస్పృహను కలిగించిన....అందుకు బాటలు వేసిన చింతలపూడి రామిరెడ్డి వంటి వీరులు ఎందరినో వెలికి తీయాల్సిన అవసరం వున్నది.వారి పోరాటాన్ని త్యాగాన్ని ధర్మాన్ని పాఠ్యాంశాలుగా వినిపించాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా రామిరెడ్డి వంటి ఎందరో వీరులు సాయుధ చరిత్రలో విస్మరణకు గురి అయ్యరనేది వాస్తవం. 
కందిమళ్ళ ప్రతాపరెడ్డి గారు సాయుధ పోరాట చరిత్ర ఇంకా అసంపూర్ణమే అన్నారు. ఆ అసంపూర్ణత పూరించబడాలంటే పెద్ద ఎత్తున పరిశోధన జరగాలి.
 
👉వీరుడి మరణం:

రామిరెడ్డి మరణ ఘట్టం ఒక మహాసంగ్రామం !
1947-1948 సంవత్సర కాలాల్లో నిజాం ప్రయివేటు సైన్యం రజాకార్ల అకృత్యాలు మితిమీరి పోయాయి. ఈ అకృత్యాలమై తన తిరుగుబాటును ధైర్యంగా ప్రకటించుకున్నాడు రామిరెడ్డి. ఈ నేపథ్యంలో నిజాం సర్కారుకు సింహ స్వప్నంగా మారాడు. తమకు తలనొప్పిగా తయారైన రామిరెడ్డి మీద సర్కారు ఓ కన్నేసింది. అయినప్పటికీ రామిరెడ్డి భయపడలేదు.
ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు మరింత పదును పెంచాడు. కాగా సర్కారుకు తనమీద గురి పెరిగాక తన కార్యకలాపాలను అడవుల నుండి మొదలెట్టాడు. సర్కారుకు దొరకకుండా చుక్కలు చూపించాడు. ఇటువంటి పరిస్థితితుల్లో ఒకరోజు - 

అది.... 
1948 మార్చి 2 వ తారీఖు. 
రామిరెడ్డి తన గ్రామం రేణికుంటలో ఉన్నాడు. కార్యాచరణ గురించి దళం సభ్యులతో మాట్లాడుతున్నాడు. 

రామిరెడ్డిని పట్టించి నిజాం మెప్పుపొందాలని... తద్వారా సర్కరునుండి తాయిలాలు పొందాలని.... కాచుకుని కూచున్న తహసీల్దారుకు , రామిరెడ్డి గ్రామంలోకి ప్రవేశించిన సమాచారం అందింది. ఈ విషయం రామిరెడ్డి నియమించుకున్న కోవర్టులు కూడా పసిగట్టలేక పోయారు. మొత్తానికి తహసీల్దారుకు సమయం అనుకూలంగా మారింది. ఆలస్యం లేకుండా అదే అదనుగా రజాకర్లకు వార్తను చేరవేసాడు. ఇంకేముంది? ఆ సమయం కోసమే ఎదురు చూస్తున్న రజాకార్ సైన్యం ఆకస్మికంగా రేణికుంట బయలుదేరింది. రామిరెడ్డి నామరూపాలు లేకుండా మట్టుపెట్టాలని నిర్ణయించుకున్నారు కాబట్టి సైన్యం ఆషామాషీగా లేదు. ఎనిమిది లారీల్లో బయలుదేరి వున్నది. 

ఎదురుతిరిగే దళాన్ని సమూలంగా కాల్చి చంపి, ఆ తర్వాత ఒక్కరు కూడా మిగలకుండా రేణికుంట గ్రామాన్ని పూర్తిగా తగుల బెట్టాలి అనేది రజాకార్ల పన్నాగం . . ఈ క్రమంలో వాళ్ళతో మరతుపాకులు మెషీన్ గన్నులు భారీ ఎత్తున వున్నాయి. 

గ్రామ బురుజు మీద నుండి ఎల్లవేళలా పరిస్థితుల్ని కనిపెట్టుకుని వుండే రామిరెడ్డి దళ సభ్యుడు ఒకరు.... గ్రామాన్ని చేరుకుంటున్న రజాకార్ల సైన్యాన్ని పసిగట్టాడు. గ్రామాన్ని అప్రమత్తం చేస్తూ బురుజు మీద గంట మోగించాడు. ప్రమాద సంకేతం రామిరెడ్డికి చేరింది. అప్పటికి పరిస్థితి పూర్తిగా చేయి దాటి పోయింది. విపత్తులా దూసుకు వస్తున్న రజాకార్ల సైన్యాన్ని చూసి రామిరెడ్డి పోరాటానికి సిద్దమయ్యాడు. పారిపోయి ప్రాణాలు కాపాడుకోవాలని ప్రజలు సూచించినప్పటికి 
రామిరెడ్డి ఎవ్వరి మాట వినలేదు. పైగా పెద్దఎత్తున పొంచిఉన్న ప్రమాదాన్ని అంచనా వేసాడు. ప్రజలను పారిపోయి ప్రాణాలు కాపాడుకోమని ఆదేశించాడు. 

రామిరెడ్డి సూచనతో ప్రజలు భయతో గ్రామం చుట్టూ సహజ సంరక్షణగా వున్న గుట్టల్లోకి పారిపోయి ప్రాణాలు కాపాడుకున్నారు.  

విజయమో వీరస్వర్గమో.... రామిరెడ్డి ముందు నిలబడి తన వెనుక సైన్యాన్ని నడిపించాడు. వెంటే కుమారుడు రంగారెడ్డి కూడా ఉన్నాడు. రజాకార్లని ఎదుర్కోవడానికి అనువైన చోటుగా ఒక మిద్దె ఎక్కి చండ ప్రచండుడై అరవీర భయంకరుడై నిలబడ్డాడు. 
చూస్తుండగానే రజాకార్లు గ్రామాన్ని చేరుకున్నారు. 
ప్రశాంతంగా ఉన్న గ్రామంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. 
రామిరెడ్డి తుపాకీ ఎక్కుపెట్టాడు. తొలి తూటా గురి చూసి వదిలాడు. 

అటు రజాకార్లు - 
ఇటు రామిరెడ్డి దళం -
పోరాటం మొదలయ్యింది. 

వెనకడుగు లేకుండా..... ఏమాత్రం జంకు లేకుండా... తన దళంలో వున్న 16 మంది సభ్యులతో 15 తుపాకులతో రజాకర్లతో పోరాటానికి తెగబడ్డాడు రామిరెడ్డి.రెండు గంటల పాటు జరిగిన భీకర పోరాటంలో 40 మంది రజాకర్లు చనిపోయారు.రామిరెడ్డి దళంలో ఒక్క సభ్యుడు మాత్రమే చనిపోయాడు.ఇది రజాకర్లకు అవమానంగా తోచింది.

రామిరెడ్డి పోరాట పటిమను రజాకార్లు తట్టుకోలేకపోయారు.ఒక్క రజాకార్లే కాదు, రజాకర్ సైన్యాన్ని రెచ్చగొట్టి తీసుకొచ్చిన తహసిల్దారు కూడా తట్టుకోలేక పోయాడు. దొంగ చాటుగా నక్కి పోరాటాన్ని గమనిస్తున్న వాడల్లా.... రామిరెడ్డిని దొంగచాటుగా చంపి నిజాం మెప్పు పొందాలనుకున్నాడు.అందుకు అనువైన సమయం కోసం ఎదురు చూడటం మొదలెట్టాడు. 

చూస్తుండగానే రామిరెడ్డికి సంబందించిన తుపాకుల్లో మందుగుండు దాదాపు అయ్యిపోయింది.ఇదే అదనుగా తహసిల్దారు నిలబడి రామిరెడ్డి వున్న మిద్దెకు వెనక వున్న చింతచెట్టు ఎక్కి ...అక్కడి నుండి పిరికిగా రామిరెడ్డిపై వీపు భాగంపై కాల్పులు జరిపాడు. ఆ మోసపూరిత దెబ్బలకు రామిరెడ్డి భారీ శరీరం నెమ్మదిగా కుప్పకూలడం 
మొదలెట్టింది. 

రామిరెడ్డిపై కాల్పులు జరగగానే దళసభ్యులు ఒక్కసారిగా బలం తగ్గినట్టుగా వణికిపోయారు. అది గమనించిన రజాకార్ల సైన్యం దళాన్ని చుట్టుముట్టి పట్టుకుని వరుసగా నిల్చోబెట్టి క్రూరంగా కాల్చి చంపింది.

అప్పటికి కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నాడు రామిరెడ్డి.అయినప్పటికీ పరిస్థితుల పట్ల స్పృహ కోల్పోలేదు. తన మరణం తర్వాత తన కొడుకు రంగారెడ్డి శతృవుల చేతికి చిక్కకూడదని భావించాడు. 
అంతే !
మరణం కళ్ళముందు తచ్ఛర్లాడుతుంటే.... 
శత్రువు వికటాట్టహాసం గుండెను తొలుస్తుంటే... 
ఆఖరి శ్వాసను బలవంతంగా ఆపుకుంటూ... కొడుకును కూడా కాల్చి చంపాడు. తర్వాత ప్రాణాన్ని నెమ్మెదిగా మృత్యు దేవతకు అప్పగించాడు. 

ఆ తర్వాత అనుకున్న ప్రకారం రజాకర్లు గ్రామాన్ని నిర్ధాక్షిణ్యంగా తగుల బెట్టారు.కాలిన శవాలను గుట్టలుగా లారీల్లో తరలించారు.
ఒళ్ళు గగుర్పొడిచే రామిరెడ్డి వీరత్వం ...
కఠిన శిలను సైతం కరిగించే రామిరెడ్డి అమరత్వం...
ప్రజలు మరిచిపోలేదు. నేటికిని పాటలుగా పాడుకుంటున్నారు. కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. 

👉విగ్రహమై

పోరుబాటైనావు రామిరెడ్డీ...
త్యాగధనమైనావు ఎదురొడ్డీ..
రజాకర్ గుండాలను తరిమికొట్టి...
వీరుడవైనావు తుపాకి పట్టి...
పోరాటకథల్లో నీ పేరు తలిచి...
నిలుపుకుంటాము నిన్ను మా గుండెలు తెరిచి...
అంటూ ప్రజలు రామిరెడ్డిని ఊర్లో విగ్రహంగా నిలబెట్టుకుని తమ అభిమానాన్ని గుండెల నిండుగా చాటుకున్నారు.

No comments:

Post a Comment