Monday, April 15, 2024

భూదాన్ రామచంద్రారెడ్డి

భూదాన్ రామచంద్రారెడ్డి
( భూదానశీలి )
-----------------------------------------------------
వ్యాసకర్త : తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

సాయుధ పోరాటం అనంతరం ఆరంభమైన భూదానోద్యమంలో చైతన్యవంతమైన పాత్ర పోషించిన భూదాన్ రామచంద్ర రెడ్డి సాయుధపోరాటంలో ఉన్నాడా? లేడా?
అవును....
సామాజిక కార్యకర్తగా దానశీలిగా చరిత్రను అలరించిన భూదాన్ రామచంద్రారెడ్డి గారు సాయుధ పోరాటంలో ఉన్నాడా లేదా అనేది ఇప్పుడు కొందరు విమర్శకులకు తలెత్తిన సందేహం. వీరి సందేహం ఖచ్చితంగా నివృత్తి కావలసిందే. 

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మట్టిమనుషులు మేల్కొన్న పోరాటం. ప్రజా బంధువులుగా....అట్టడుగు వర్గాల బాంధవులుగా..... ముందుండి పోరాటం నడిపిన మహనీయులు చిరస్మరణీయులు. మరి ఈ వరుసలో భూదాన్ రామచంద్రారెడ్డి ఉనికి గురించి విమర్శకులకు సందేహం ఎందుకు వచ్చింది..?

నేను రాస్తున్న " రెడ్లచరిత్ర సంస్కృతి సంప్రదాయాలు " లో భాగంగా సాయుధ పోరాటంలో పాల్గొన్న రెడ్ల వివరాలను సేకరించాను. మొత్తం 400 లకు పై చిలుకు రెడ్ల వివరాలు ఒక చోట రికార్డు చేసాను.ఈ వరసలో విదిరే ( భూదాన్ ) రామచంద్రారెడ్డి గారి పేరు కూడా ఉన్నది. ఇది చదివిన సందర్బంగా కొందరు విమర్శకులకు రామచంద్రారెడ్డి గారి
పేరు ఉండటం గురించి ప్రశ్న తలెత్తింది.

" పోరాటం తర్వాత నిరుపేదల కోసం భూదానం చేసిన గొప్ప మహనీయుడు.... సాయుధ వీరుడు కాదు కదా!? " అనే సందేహం వెలిబుచ్చారు. చరిత్రలో కూడా పోరాటం నేపథ్యంలో వీరి పేరు కనబడదు. కాబట్టి సందేహంలో తప్పులేదు.

👉వివరణ - సందేహ నివృత్తి

తెలంగాణ రాష్ట్రం నల్లగొండ జిల్లా ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలంలో 1905 జూలై 13 న
భూదాన్ రామచంద్రరెడ్డి జన్మించాడు. అంటే సాయుధపోరాటం కాలం నాటికి వీరి వయసు 42 ఏండ్లు. పరిపక్వమైన వయసు. దళాలను ముందుకు నడిపించగల శక్తి యుక్తులు కలిగిన వయసు. ఈ సమయంలో వీరు ఎక్కడ ఉన్నారు?

పూణేలోని ఫెర్గూసన్ లా కాలేజీలో 1935 - 1938 లో న్యాయశాస్త్రం అభ్యసించిన రామచంద్రారెడ్డి గారు, తర్వాత కొన్నాళ్ళు న్యాయవాదిగా కొనసాగాడు.

 ఉద్యమాల ఖిల్లా ప్రసిద్ధి పొందిన నల్లగొండ జిల్లాలో మొదట సాయుధరైతాంగ_పోరాటం, ఆతర్వాత భూదానోద్యమం జరిగాయి.ఈ రెండు పరస్పర విరుద్ధమైన ఉద్యమాలు. సాయుధ పోరాటానికి రావి నారాయణరెడ్డి అధ్యక్షత వహించారు. భుదానోద్యమానికి వెదిరె రామచంద్రారెడ్డి ఆధ్యులుగా ఘనత సాధించారు. ఇక్కడ విశేషం ఏమంటే ఈ నాయకులు ఇద్దరూ బావా -బావమరుదులు.
రామచంద్రారెడ్డి చెల్లెలు సీతాదేవిని 
రావి నారాయణరెడ్డి వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో తన బావగారు రావి నారయణరెడ్డి గారి ఉద్యమం ప్రభావం రామచంద్రారెడ్డి గారి మీద అనివార్యంగా ఉన్నది.

మొదట ఉద్దేశ్య పూర్వకంగా న్యాయవాద వృత్తి నుండి తప్పుకున్నాడు. తర్వాత హైదరాబాద్ లో నిజాం సర్కారులో రెవున్యూ ఆఫీసర్ గా బాధ్యతలు చేపట్టాడు. కానీ ఈ ఉద్యోగంలో కూడా ఇమడలేక పోయాడు.

▪️కారణాలు:

నిజాం కాలంలో రైతుల నుండి " లేవి గల్లా " వసూలు అనేది అధికారిక దోపిడీ. వాస్తవానికి ఇది ప్రభుత్వ ఆదాయ మార్గం . కానీ ఇప్పటి దళారీ వ్యవస్థలా ఆనాడు దోపిడీ వ్యవస్థ పెట్రేగిపోతూ రైతులను నానా ఇబ్బందులకు గురించేసేది.

పంట నష్టం కాలంలో.... కాలం కరుణించని కరువు కాలంలో కూడా " లేవి గల్ల" బలవంతంగా వసూలు చేయబడేది.

ఈ పరిస్థితుల్లో రెవిన్యూ అధికారిగా ఉన్న రామచంద్రారెడ్డి మీద ప్రభుత్వం ఒత్తిళ్ళు ఉండేవి.
కానీ రామచంద్రారెడ్డి గారు ఆనాటి ప్రభుత్వ ఒత్తిడి తట్టుకోలేక పోయాడు. చూస్తూ చూస్తూ కరువుకు అల్లాడుతున్న రైతుల నుండి లేవిగల్ల వసూళ్లకు పాల్పడలేక
పోయాడు.వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసాడు.
తర్వాత సామాజిక సంస్కరణల కోసం పనిచేయడం ప్రారంభించాడు.

" చిన్న ఉద్యోగం కాదు. అధికారి ఉద్యోగం. ఇంకొన్నాళ్లు కొనసాగితే హైకోర్టు జడ్జి అయ్యేవాడు " ఇంట్లో అందరూ అనుకున్నారు.

రామచంద్రారెడ్డి కుటుంబానికి సంబందించి మొత్తం తొమ్మిది మంది తోబుట్టువులు, తన తొమ్మిది మంది సంతానం, ఇంత పెద్ద కుటుంబ పెద్దగా అయన రాజీనామా సాహసంతో కూడుకున్నది.

పోరాటంలో అందరూ త్యాగధనులే . కొందరు కుటుంబాలు వదులుకుంటే, కొందరు జీవితాలు వదులుకున్నారు. కొందరు ఉద్యోగాలు వదులుకుంటే కొందరు ఆస్తిపాస్తులు వదులుకున్నారు.
మరి ఉద్యోగం త్యజించిన రామచంద్రారెడ్డి త్యాగం పోరాటంలో భాగమే కదా!?
పోరుబాట నడవక పోయినా నిజాంకు వ్యతిరేకంగా వ్యవహరించడం
అంటే పోరాటంలో భాగస్వామ్యం వహించడమే కదా !?

, ▪️భూమి సేకరణ

సాయుధ రైతాంగ పోరాటంలో భూమిని సేకరించి, నిరు పేదలకు పంచాలనే సంకల్పం ఊపిరి పోసుకుంది.
భూదాన ఉద్యమంలో సామరస్యంగా శాంతియుతంగా , భూస్వాముల నుండి భూమిని సేకరించాలనే దృక్పథానికి బీజం పడింది. ఈ క్రమంలో సాయుధపోరాట కాలం నుండి భుదానోద్యమం వరకు వారిధిగా కొనసాగిన రామచంద్రారెడ్డిలో " భూదానం " ఆలోచన సాయుధ పోరాట కాలంలో ఉద్భవించినదే అని చెప్పవచ్చు. ఎప్పుడైతే రైతుల కోసం ఉద్యోగం వదులుకున్నాడో అప్పుడే సమాజ సంస్కరణ అతడి అభ్యుదయం అయ్యింది అని వేరే చెప్పవలసిన పనిలేదు.

మొత్తానికి భారతదేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రాంతంలో ఆచార్య వినోభాభావే ప్రారంభించిన భూదాన్ ఉద్యమంలో భాగంగా 1951 వ సంవత్సరంలో నిరుపేదలకు భూమిని దానం చేసిన మొదటి భూస్వామి వేదిరే రామచంద్రారెడ్డి.
వినోభా భావే తన మొదటి ప్రయత్నంగా వెదిరె రామచంద్రారెడ్డిని నిరుపేదల కోసం 80 ఎకరాల భూమి అవసరం అవుతుందని, పెద్ద మనసుతో భూమిని దానం చేయమని అభ్యర్థించగా.....వెంటనే స్పందించిన రామచంద్రారెడ్డి.... తన తండ్రి నరసారెడ్డి జ్ఞాపకార్థం వందెకరాల భూమిని దానంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు సభాముఖంగా ప్రకటించారు.

అయితే 1951 నాటికి కూడా సాయుధపోరాటం నాల్గవ దశ కొనసాగుతున్న విషయం విమర్శకులు గుర్తించాలి. 1948, సెప్టెంబర్ 17 న తెలంగాణకు విముక్తి లభించినప్పటికీ కమ్యూనిస్టుల్లో ఒక వర్గం తిరిగి అడవుల్లోకి వెళ్లి భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాన్ని ప్రారభించడం సాయుధపోరాటంలో భాగమే.

భూస్వామి రామచంద్రారెడ్డి తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం మరెందరో భూస్వాములకు ఆదర్శంగా నిలిచింది.భూదాన్ రామచంద్రారెడ్డిగా చరిత్రకు ఎక్కాడు. వారి గ్రామం భూదాన్ పోచంపల్లిగా స్థిరపడిపోయింది.
మొత్తానికి భూదాన్ రామచంద్రారెడ్డి సాయుధపోరాటంలో త్యాగధనుడు 🙏🏿

వర్ధిల్లు వెయ్యేళ్ళు....
____________________________________________వ్యాసం నిర్మాణంలో తోడ్పడిన భూదాన్ రామచంద్రారెడ్డి కోడలు వెదిరె లక్ష్మి గారికి హృదయ పూర్వక ధన్యవాదములు

No comments:

Post a Comment