Monday, April 15, 2024

కొండారెడ్డి బురుజు చరిత్ర

కొండారెడ్డి బురుజు కథ
°°°°°°°°°°°°°°°°°°°°°°°
✍️తంగెళ్ళశ్రీదేవిరెడ్డి 

రాయలసీమ ముఖద్వారం......
చరిత్రకు నిలువెత్తు దర్పణం....
చారిత్రక నిర్మాణ వారసత్వం.....
కొండారెడ్డి బురుజు...!

ఈ బురుజు చాలా సినిమాల్లో కనిపిస్తుంది. ప్రత్యేకించి కథానాయకుడు తన పొగరును పౌరుషాన్ని చూపెడుతూ తొడగొట్టి సవాల్ చేయాలి అంటే అందుకు కొండారెడ్డి బురుజు అడ్డా గావలసిందే. అప్పుడే సీన్ పండుతుంది. సినిమా జయపజయల మీద ప్రభావం చూపిస్తున్న ఈ బురుజుని ఎప్పుడు ఎవ్వరు నిర్మించారు అని చెప్పడానికి కచ్చితమైన శాసనాలు...లిఖిత ఆధారాలు లభ్యం కావడం లేదు.
పరిశోధకులు నేటికిని అన్వేషిస్తూనే ఉన్నారు.

#History_of_south_India 

ఈ బురుజు నిర్మాణం విషయమై ఒక చరిత్రకారుల్లో విభిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే సామాన్య ప్రజల్లో గందరగోళం నెలకొని ఉన్నది. ఈ బురుజును కృష్ణరాయల కాలంలో వారి వంశస్థులు నిర్మించినట్టుగా కొందరు చరిత్రకారులు ఆధారాలు చూపెడుతున్నారు. ఈ ఆధారాలను మరికొందరు చరిత్ర కారులు తోసి పుచ్చుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే..... 1503 నుండి 1509 వరకు కందనవోలు ప్రాంతాన్ని కృష్ణరాయల సోదరుడు తుళువ వీరనరసింహరాయలు పాలిస్తున్న సమయంలో ఈ నిర్మాణం జరిగి ఊండవచ్చనేది ' History of south india ' గ్రంధం ప్రకారం ఒక అంచనా. ఎందుకంటే వారి పాలనా సమయంలోనే ఇప్పటి కర్నూలు కందనవోలు ప్రాంతంగా చరిత్రలో కనిపిస్తుంది. కాగా కందనవోలు పేరు కనిపించినంత మాత్రానా అది ఆధారం కాదు అనేది వాదన.

#పేరు_కారణంగానే...

నిర్మాణ శైలి , పురావాస్తు శాఖ అంచనా, వీటి ఆధారంగా కొండారెడ్డి బురుజు 500-600 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. ఈ కాలానికి సంబందించిన చరిత్రలో వివిధ కోటలు, వాటి నిర్మాణం వెనుక కథలు, చాలా వివరించబడ్డాయి. కానీ ఆ చరిత్రలో ఎక్కడా కూడా "" కొండారెడ్డి బురుజు "" పేరు కనబడదు. ఈ పేరు కారణంగానే బురుజు చరిత్రపై గందరగోళం నెలకొని ఉన్నదని చరిత్ర కారులు ఏక త్రాటి మీద అభిప్రాయపడ్తున్నారు.

#శ్రీకృష్ణదేవరాయలు

1509 నుండి 1529 వరకు శ్రీకృష్ణదేవరాయలు
తన స్వర్ణ యుగాన్ని కొనసాగించిన తర్వాత ...రాయల సోదరుడు పినతల్లి కుమారుడు అచ్యుతరాయలు విజయనగర సామ్రాజ్య సింహాసనాన్ని అధిష్టించి 1529 నుండి 1542 వరకు పాలన కొనసాగించాడు. ఈ పాలనా సమయంలో కందనవోలు ప్రాంతంలో తమ యుద్దతంత్రంగా శతృ దుర్భేద్యంగా ఒక కోటను నిర్మించారనేది కూడా ఒక అంచనా..! 

ఆనాటి పాలనా వైభవం ఆధారంగా తుళువ వంశస్థులే ఈ కట్టడాన్ని నిర్మించారు అని చరిత్రకారులు ఖచ్చితంగా నిర్దారణ చేయలేదు కానీ ఒక ప్రాథమిక అంచనాకు మాత్రం వచ్చారు. ఈ ప్రకారం....
విజయనగర సామ్రాజ్య పాలకులు శత్రువులను గమనించేందుకు వీలుగా ఈ బురుజును ఎత్తుగా కట్టుదిట్టమైన వ్యూహ రచనగా నిర్మించారు
ఈ కోటతో పాటుగా మరో మూడు కోటలను కూడా ఈ రాజులు నిర్మించారు.కొండారెడ్డి బురుజు ఒక్కటే ఇప్పటికీ చెక్కు చెదరక పటిష్టంగా వుండగా మిగతా మూడు శిథిలం అయ్యాయి.వీటిలో ఒకటి ఎర్రబురుజు. ఇది విక్టొరియా ధియేటర్ పక్కన ఉంటుంది. మరొకటి కుమ్మరి వీధి దగ్గర వున్న రామానాయుల బురుజు..ఇంకొకటి సాయి ఆలయం పక్కన వున్న బురుజు. మొత్తం ఈ నాలుగు కోటలు కందనవోలు పట్టణానికి నలుదిశలా నిర్మించారు. 

#కొండారెడ్డి_ఎవ్వరు?

మరి రాయల కాలంలో నిర్మించిన కోటకు కొండారెడ్డి బురుజు అనే పేరు ఎందుకు వచ్చిందనేది వివరిస్తే....ప్రచారంలో చాలా కథలు ఉన్నాయి. ఈ కథలకు కూడా అధారాలు లేవు. కాని కర్నూలు అలంపూరు గద్వాల పరిసర ప్రాంతాల్లో ఈ కథలు బలమైన జన ప్రాచుర్యాలు.

▪️ప్రచారంలో ఉన్న ఒక కథ ప్రకారం రాయలకాలంలో సామంతులుగా పాలనలు కొనసాగిస్తున్న పాలెగాళ్ళలో చివరి వాడు కొండారెడ్డి.ఇతడు నందికోట్కూరు పక్కన పాతకోట పాలెగార్ . ఇతడి కాలం నాటికి కర్నూలు ప్రాంతాన్ని బీజాపూర్ సుల్తాన్ అబ్దుల్ వహబ్(1602-1618). పాలిస్తున్నాడు. ఈ సుల్తాన్ ను కొండారెడ్డి ధిక్కరించాడు. ఈ కారణంగా కొండారెడ్డి మీద సుల్తాన్ దాడి చేసి ఓడించి ఈ కోటలో వున్న చెరసాలలో బంధించాడు. కొండారెడ్డి అదే చెరసాలలో తనువు చాలించాడు కాబట్టి ఆ కోటను అప్పటి నుండి కొండారెడ్డి కోటగా పిలుస్తూ వచ్చారనేది ప్రతీతి.

▪️ఆంగ్లేయులు భారతదేశాన్ని పాలిస్తున్న సమయంలో కర్నూలు పక్కన అలంపురంలో కొండారెడ్డి అసామి ఉండే వాడు. అతడు పరమ దేశభక్తుడు. ముందుండి ప్రజల్లో జాతీయభావాలను పెంపొందించడం మొదలెట్టాడు. ఆ కారణంగా ఆంగ్లేయులు అతడిని కోటలో బంధించి చిత్రహింసలకు గురి చేసారు. అయినా కొండారెడ్డి మారలేదు. ఆంగ్లేయుల హింసలకు అక్కడే మరణించాడు. అందుకే ఆ కోటకు కొండారెడ్డి కోట అనే పేరు వచ్చింది. అదే కాలక్రమంలో కొండారెడ్డి బురుజు అయ్యింది అనేది మరొక కథనం.

▪️ఇదే క్రమంలో కర్నూలు పక్కన కల్లూరులో కొండారెడ్డి అనే ఒక వీరుడు ఉండేవాడు. అంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటం చేసేవాడు. ఆంగ్లేయులు దోచుకున్న సొమ్మునే తిరిగి తన అనుచరులతో కలిసి దొంగతనం చేసి, ప్రజలకు పంచేవాడు . అతడిని దొంగగా చిత్రిస్తూ ఆంగ్లేయులు పట్టి కోటలో బందించారు. ఇట్లా కొండారెడ్డిని బంధించడం వల్ల స్థానిక ప్రజలు కోటను కొండారెడ్డి కోటగా పిలిచారు. ఇది కాల క్రమంలో కొండారెడ్డి బురుజుగా పేరు గాంచిందనేది మరికొందరి వివరణ.

▪️మరొక గాథ ప్రకారం కర్నూలు దగ్గర పాణ్యం ప్రాంతంలో కొండారెడ్డి అనే అసామి ఉండేవాడు. బీద సాదలను ఆదరించేవాడు. పాణికేశ్వరస్వామిని ఆరాధించేవాడు. ఈ క్రమంలో తురక రాజులు ఆ ప్రాంతంలోకి ప్రవేశించి హిందూ స్త్రీలను చెరబడుతూ, మత మార్పిడులకు తెగబడ్డారు. అది నచ్చని కొండారెడ్డి తురకలను ఎదురిస్తూ.... పాణికేశ్వరస్వామిని తలుచుకుని దొరికిన తురకల చేతులు నరికి వేస్తాడు.
భీభత్సం గమనించి సాహెబ్ అనే తురకరాజు తన సైన్యంతో వచ్చి కొండారెడ్డిని బంధించి తీసుకు వెళ్లి కోటలో శిరిచ్చేధనం గావిస్తాడు. అప్పటి నుండి కోట కొండారెడ్డి బురుజుగా పిలవబడింది.

#జానపద_గేయాల్లో

భళా భళా భళా భళా
కోట బురుజులు నీకు కిరీటమయ్యే
కోట రాళ్లు నీకు పానుపులయ్యే
కోట బయట కోలాటం
కోట లోపల నీ చెలగాటం
కోటమీద వాలింది గద్ద
నీ నెత్తురుకు మరిగి....
కోట అంచుల జారింది
నీ నెత్తురు కత్తులు దిగి....
వీర వీరా భళా వీరా
కొండారెడ్డి కోడె వీరా

నంద్యాల ప్రాంతంలో ఆకుతోట వీరస్వామి పాడిన ఈ పాటలో కొండారెడ్డి ఎవ్వరో తెలియదు. కానీ బురుజులు కోటలు పదాల ఆధారంగా కొండారెడ్డి బురుజుకు సంబంధించిన పాట కావొచ్చు అనేది స్పష్టమౌతున్నది.

#సొరంగమార్గం

కర్నూలు నుండి 52 కి.మీ దూరాన ఉన్న గద్వాల కు ఈ బురుజు నుండి సొరంగ మార్గం ఉన్నది. తుంగభద్రా నది ప్రాంతం నుండి ఈ సొరంగమార్గం ఉన్నట్టుగా తెలుస్తున్నది.

గద్వాల పాలకుల్లో ఒకరైన నల్లా శోభనాద్రి లేదా పెదసోమ భూపాలుడు లేదా రాజా సోమశేఖర ఆనందరెడ్డి నిర్మించిన గద్వాల్ కోటకు ఈ సొరంగ మార్గం అనుసంధానం అయి వున్నది. శోభనాద్రి వారిని ప్రజలు సోమనాద్రిగా పిలుచుకునేవారు.నేటికినీ ఇదే పేరు స్థిరమై వున్నది. వీరి కాలం 1663 నుండి 1712 వరకు కొనసాగింది.

ముస్లిం దురాక్రమణదారుల నుండి తప్పించుకోవడం కోసం 17వ శతాబ్దంలో శోభనాద్రి ఈ సొరంగాన్ని విరివిగా ఉపయోగించేవాడుగా తెలుస్తున్నది..

అయితే కొన్ని ప్రతికూల పరిస్థితుల కారణంగా 1901 లో ప్రభుత్వం ఈ సొరంగ మార్గాన్ని మూసివేసినది.

#ధన్యుడు_కొండారెడ్డి

కోట ఎవ్వరు నిర్మించినప్పటికీ కొండారెడ్డి పేరు కోటకు స్థిరపడిపోయింది. ఆ కొండారెడ్డి ఎవ్వరు అయినప్పటికీ అతడు కారణజన్ముడే. అందుకే అతడి పేరు తరతరాల్లో నిలిచిపోయింది. కాగా నిజమైన ఆ కొండారెడ్డి ఎవ్వరు అనేది ప్రచారంలో ఉన్న జానపద కథలు గాథలు గేయాలను అనుసరించి, పరిశోధకులు చరిత్రకారులు ఖచ్చితంగా నిర్దారణ చేయకపోయినా ఒక అంచనాకు వచ్చినా ప్రజల సందేహాలు నివృత్తి అవుతాయనేది వాస్తవం.

No comments:

Post a Comment