Saturday, July 6, 2019

ఒడిబియ్యం - పరమార్థం

వొడి బియ్యం... పరమార్థం
°°°°°°°°°°°°°°°°°°°✍️తంగెళ్ళశ్రీదేవిరెడ్డి
#తెలంగాణ :
🌱తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల్లో ''ఒడిబియ్యం''  సంప్రదాయం ఒకటి. ఇక్కడి ప్రాంతీయ పండుగలు పబ్బాలు, ఆచార వ్యవహారాలు, వీటితో పాటుగా భాష.. యాస.. మాండలికాలు విభిన్నమైనవి. కాబట్టే ప్రత్యేక అస్తిత్వాన్ని సంపాదించుకుని ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న తెలంగాణ జీవనశైలిలో ఆడబిడ్డలకు ఉన్నతమైన స్థానం ఉన్నది.
🌱తెలంగాణలో పెళ్లయిన ఆడపడుచులకు
'' వొడిబియ్యం '' పెట్టడం అనేది తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. ఈ విధానాన్ని
''వొడి నించడం '' లేదా '' వొడి నింపడం '' అనికూడా అంటారు.ఆడబిడ్డలు సుమంగళిగా  ఉన్నంత కాలం పుట్టింటి నుండి పసుపు కలిపిన వొడిబియ్యాన్ని తీసుకువెళ్లి , అత్తింట్లో ఒక మంచిరోజు చూసి ఉడకబెట్టి, భోజనానికి చుట్టుపక్కల మత్తైదువలను బొట్టుపెట్టి పిలవడం అనేది అనాదిగా వస్తున్న సంప్రదాయం.  🌱శుభప్రదమైన పసుపు కుంకుమ, గాజులు,  పూలు పండ్లు, తమలపాకులు వక్కలు,  ఖర్జురాలు,  వెల్లుల్లిపాయలు, కొత్తబట్టలు,  కొబ్బరిగిన్నెలు, ఇవన్నీ వొడి నింపే బియ్యంలో ఉంటాయి. మంగళహారతులు ఉంటాయి.  బియ్యానికి కొలతలు ఉంటాయి. ముత్తయిదువుల సమక్షంలో ఈ తంతు కన్నుల పండుగలా జరుగుతుంది.  భార్యాభర్తల్ని ఆశీర్వదిస్తూ కొనసాగే ఈ సంప్రదాయం విశిష్ఠత గురించి ఇతర ప్రాంతాలవారికి తెలిసినా తెలియక పోయినా.... తంతు పద్దతిని చూసి పరమార్థాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతయినా ఉన్నది. అంతేతప్ప ఒక ప్రాంతం సంస్కృతీ సంప్రదాయాలను పనిగట్టుకుని కించపర్చాల్సిన అవసరం లేదు.
🌱గృహప్రవేశం, బారసాల / తొట్లె పండుగ, తోబుట్టువుల పెండ్లిళ్లు జరిగినప్పుడు ఇంటి ఆడబిడ్డలకు ఒడిబియ్యం పోయడం అనేది ఒక శుభ ప్రదమైన ఆనవాయితీగా వస్తున్నది.
🌱పెళ్లయిన ఏడాదిలోపు బియ్యం పెట్టడాన్ని దక్షిణ తెలంగాణలో శ్రావణపట్టి అంటారు. ఈ తంతు అతి ముఖ్యమైంది. ఆతర్వాత ఏడాదికి మళ్ళీ బియ్యం పెడుతారు. తర్వాత 5, 9, 11 సంవత్సరాల్లో పెడుతుంటారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఆడబిడ్డలు లేని తల్లిదండ్రులు దేవతలకు, వరుసైన ఆడపిల్లలకు వొడినింపుతారు.
🌱ఆడపిల్ల అమ్మవారి స్వరూపంగా భావిస్తారు కాబట్టి,పండుగలు పర్వదినాల సమయంలో తెలంగాణ ప్రజలు దేవతలకు కూడా ఒడిబియ్యం సమర్పించుకుంటారు. దేవతలు నిత్య ముత్తయిదువలు కాబట్టి తమ ఇంటి ఆడపిల్లలకు నిత్య సౌభాగ్యం ప్రాప్తిస్తుంది అనేది ఇక్కడ నిక్షిప్తమై ఉన్న విశ్వాసం.
🌱సిరిసంపదలను కాకుండా  ముత్తయిదువతనాన్ని
ఆశిస్తూ కొనసాగేది  '' వొడి బియ్యం '' సంప్రదాయం.
ఈ సంప్రదాయానికి శాస్త్రీయంగా కూడా అర్థాలు పరమార్థాలు పొందుపరచబడ్డాయి. పెద్దబాలశిక్ష వంటి గ్రంధాల్లో కూడా వొడిబియ్యానికి వివరణ ఇవ్వబడింది. కాగా ప్రస్తుతం నేను జనసామాన్యంలో చెలామణిలో ఉన్న ''వొడి బియ్యం '' పరమార్థాన్ని సేకరించి తెలియజెప్పడానికి సంతోషిస్తున్నాను.
👉వొడి అంటే పిల్లలు సేదతీరే / ఆడిపాడే తల్లి ఉయ్యాల. తల్లికి వొడి నించడం అంటే పిల్లాపాపలతో చల్లగా జీవించమని ఆశీర్వదించడం. అట్లాగే.. మొగుడు పెళ్ళాలు ఇద్దరికీ కలిపి వొడిబియ్యం పెడతారు కాబట్టి కలకాలం కలిసి జీవించండి అని ముక్కోటి దేవుళ్ళ సాక్షిగా ఆశీర్వదించడం కూడా !
ఈ అర్థాన్ని నేను సేకరించిన ఈ పాటలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది.. 👇

హారతి గైకొనుమా... సీతమ్మ తల్లీ..
మంగళ హారతి గైకొనుమా... సీతమ్మ తల్లీ..
ఒడినిండి నీకు వరాలు కురువంగా..
సూర్య చంద్రులు నీకు సంతానం అవ్వంగ..
మళ్ళీ రావే తల్లీ ఒడిబియ్యం పిలువంగా...

#ఆంధ్రప్రాంతం

🌱ఆంధ్ర ప్రాంతంలో కొన్ని కులాల్లో వడికట్టు బియ్యం సంప్రదాయం ఉన్నది. వడికట్టు బియ్యంతో  పెళ్లి తరువాత ఒక మంచిరోజున  ఉండ్రాళ్ళు చేసి చుట్టుపక్కల వాళ్లకు పంచుతారు...
🌱ఆంధ్రప్రాంతంలో సారె పెట్టడం అంటారు. సారెలో చలివిడి ప్రధానంగా ఉంటుంది.

#రాయలసీమ

🌱  చిత్తూరు ప్రాంతంలో తక్కువే  అయినప్పటికీ మిగిలిన రాయలసీమ ప్రాంతంలో చాలా చోట్లా  ఒడిబియ్యం ఆచారం ఉన్నది. ఇక్కడ కేవలం పుట్టింటి వాళ్ళే కాదు....చుట్టు పక్కల వాళ్ళు కూడా వారి వారి ఇళ్ళకు తీసుకెళ్ళి ఒడిబియ్యం పోస్తారు.
కనీసం 5 ఇళ్ళు ఐనా ఈ తంతులో ఉండేట్టుగా చూసుకుంటారు.
🌱  సీమసంస్కృతిలో  ఆడపడుచులకు పుట్టింటి నుండి లభించే అపురూపమైన గౌరవం, కానుక ఈ #ఒడిబియ్యం. చిత్తూరుకు అంతగా పరిచయం లేకపోయినప్పటికీ  ఈ సంస్కృతి  పరమార్థం తెలుసుకుని  కొందరు ఈ సంస్కృతిని పాటించడం మొదలెట్టారు.

#ముక్తాయింపు

🌱మొత్తానికి ఒకరి సంస్కృతి సంప్రదాయాలను గౌరవించాల్సిన అవసరం ప్రతి ఒక్కరి కర్తవ్యం. కొన్ని పద్ధతులు పట్ల కొందరికి విశ్వాసం ఉండకపోవచ్చు.  అయినప్పయికి సమాజానికి హాని కలిగించని ఇతరుల విశ్వాసాల్ని మన్నించగలగాలి ! అట్లాగే తెలంగాణ ప్రజలు తిండికి లేక 'ఒడిబియ్యం ' రూపంలో బియ్యాన్ని స్వీకరిస్తారని కొందరు మూర్ఖులు టీవీ డిబేట్లల్లో  వెటకారం చేయడం సంస్కారం కాదు.

4 comments:

  1. చక్కని వ్యాసం రాసారు శ్రీదేవి గారూ. Thank you.

    బోనాల పండుగ రంగం చెప్పే ముందట మాతంగికి ఒడి బియ్యం పోస్తారు. అలాగే కొన్ని జాతర్లలో అమ్మవారికి కూడా ఒడి బియ్యం సమర్పించడం ఆనవాయితీ.

    ReplyDelete
  2. >>>తెలంగాణ ప్రజలు తిండికి లేక 'ఒడిబియ్యం ' రూపంలో బియ్యాన్ని స్వీకరిస్తారని కొందరు మూర్ఖులు టీవీ డిబేట్లల్లో వెటకారం చేయడం సంస్కారం కాదు.>>>

    ఒళ్ళోపోసే బియ్యం తిని ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతారు. వెటకారం చేయడానికి కూడా అర్ధం ఉండాలి. అక్కచెల్లెళ్ళు లేని వాళ్ళుకూడా ఇటువంటి మాటలు అనకూడదు.

    ReplyDelete
    Replies
    1. పర్వతనేని వెంకట కృష్ణ అంతమాట అనలేదు లెండి. జొన్నలు రాగులు మాత్రమే పండే ప్రాంతాలలో వరి అన్నం తినే భాగ్యం ఏడాదికి ఒక్కసారయినా దక్కాలని ఈ ఆచారం పెట్టారని ఆయన కనిపెట్టిన సొంత థియరీ. సొంత ఛానెల్ ఉందికదాని ఏదో మాట్లాడాడు, ఇగ్నోర్ చేయడం బెస్ట్.

      Delete
    2. సొంత ఛానలా! అంతలేదండి. అసలు ఇప్పుడు లేడు ఆ ఛానల్ లో. పంపించేశారు.

      Delete