Monday, May 18, 2020

కవిత్వం

బిడ్డా
°°°°°°✍️తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

 బిడ్డా
ఏడేండ్లకే మనువొచ్చి
ఎన్ని తిప్పలు  పడ్డానో...
బొమ్మలాడుకునే వయసులో
అమ్మను కాబోతూ
ఎన్ని అవస్థలు పడ్డానో...

నా  బాల్యం కోల్పోవడంలో
నాకు చింత లేదు కానీ
నీ బాల్యాన్ని బాధ పెట్టానేమో బిడ్డా !
అవును...
నీవు కడుపులో పడ్డప్పుడు కూడా
నాకు సుఖం లేదు
కట్టెల మోపులు ఎత్తుతూ 
కడవ నీళ్లు మోస్తూ
భారం పిండం మీద పడొద్దని
నన్ను నేను ఎంత కాపాడుకున్నానో...

నెలలు నిండి
జొన్నసేను కూలి పోతూ
ఎప్పుడు ఎక్కడ కాన్పు అవుతుందో
తెల్వక
పాత గుడ్డలు వెంట పెట్టుకుని తిరిగాను...
నీ మాయి మట్టిపాలు కావొద్దని
నా డబ్బిగిన్నెను నమ్ముకున్నాను...

మట్టి పనికి పోయి
మధ్యాన్నం పాలివ్వడానికి
వొచ్చినప్పుడు
చిలుకలు కట్టిన ఉయ్యాలలో
నీవు ఆకలితో ఏడుస్తుంటే -
ఆడిస్తున్న అవ్వ
ఏడవద్దు ఏడవద్దు ఎర్రి నాగన్నా
అని పాడుతుంటే -
పాలు నిండిన రొమ్ములు
నా రైకను తడిపి సలుపుతుంటే -
పేగు అర్లి నేను
ఎంత దుఃఖించానో  బిడ్డా... !!

పచ్చి బాలెంతకు పని చాతగాక
చెంబు మీద సాకుతో దాపుకు ఎల్లి
అలసట తీర్చుకుంటున్నప్పుడు -
కనిపెట్టిన యజమాని
గుడ్లెర్ర జేసీ
పండ్లు పట పట కొరికినప్పుడు -
సల్లబడిన నెత్తురుతో
గజ గజ వణుకుతూ
నన్ను నేను ఎంత బలవంతంగా
ఓర్చుకున్నానో బిడ్డా... !!

చూస్తుండగానే వయసును
దిగమింగుతూ
కాలం ఎల్లిపోయింది -
బతుకంతా పోరాడి అలసి పోయాను -
రెక్కలు తెగి కూలిపోయాను -
నా ఆకలి చంపుకుని నీ ఆకలి తీర్చిన
అమ్మకు ఇప్పుడు గంజినీళ్ళు లేవు -
ఇదేం కర్మ బిడ్డా?

సాకుతావు అనుకున్నోడివి
సతాయిస్తున్నావు...
దెబ్బపడకుండా పెంచుకున్నోడివి
గుండెలమీద తన్నుతున్నావు...
సాలెకు నిన్ను ఈడ్చుకు పోతుంటేనే
నా ప్రాణం విలవిలలాడి
వలవలా ఏడ్చాను కదా
ఇప్పుడేంది బిడ్డా
కనికరం లేకుండా నన్ను ఈడ్చి పడేస్తున్నావు?

నేను నీకు బరువయ్యానా?
ఇంకా బతికున్నందుకు
నీ శత్రువును అయ్యానా?
కొంచం దయజూపు బిడ్డా..  !
కన్న పాపానికి కరుణ జూపు బిడ్డా.. !
ఊరు పొమ్మంటుంటే
కాటికి కాలుజాపుకున్నాను
పోయేవరకైనా నా పొత్తిళ్ళని
యాది జేసుకో !

నీవు నన్ను కాదనుకున్నా
నీవే కావాలి అనుకుంటున్నానురా బిడ్డా...
నీమీద కోపం రావడం లేదు గానీ
శోకం ముంచుకొస్తున్నదిరా  బిడ్డా...
ఇప్పుడు
నా జీవం కొట్టుమిట్టాడుతున్నది
ఆఖరి కోరికను అడుగుతూ
యమధర్మరాజు బయలుదేరి ఉన్నాడు...
ఏం అడుగుతాను బిడ్డా
నాకేం కోరికలు ఉన్నాయి?
నా కొడుకు సల్లగా బతకాలి తప్ప !!