Tuesday, January 29, 2019

భండారు అచ్చమాంబ

తొలి తెలుగు కథా రచయిత్రి
భండారు అచ్చమాంబ
°°°°°°°°°°°°°°°సేకరణ :తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

మొన్నటి వరకు తెలుగులో తొలి కథగా గురజాడ అప్పారావు రాసిన 'దిద్దుబాటు' పేరును చదువుకున్నాము.ఈ కథ ఆంధ్రభారతి పత్రికలో ఫిబ్రవరి 1910 సంచికలో అచ్చయ్యింది.కానీ ఇప్పుడు అదే స్థానంలో అతడి కంటే ఎనిమిదేండ్లకు ముందే
' ధన త్రయోదశి ' పేరుతో కథ రాసిన అచ్చమాంబ పేరును  చదువుకుంటున్నాము. ఈ కథ
'హిందూ సుందరి ' పత్రికలో 1902 నవంబర్ సంచికలో అచ్చయ్యింది.ఈ పత్రికను ఆ రోజుల్లో మహిళల కోసం ప్రత్యేకంగా సీతారామయ్య గారు ప్రారంభించారు.
👉స్త్రీ ఆత్మ స్థయిర్యానికి...
స్త్రీ మానసిక వికాసానికి...
నిలువెత్తు సమాధానం అచ్చమాంబ !
సంకల్పం ఉంటే సాధించలేనిది ఏమీ లేదు...మనో ధైర్యం ఉంటే ఆటంకాలు ఒక లెక్క కానేకాదు... అని నిరూపించిన ఉదాత్తమైన మహిళ అచ్చమాంబ !
వీరు 1874లో కృష్ణా జిల్లా నందిగామ తాలూకా పెనుగంచిప్రోలులో సంప్రదాయక ఉన్నత కుటుంబంలో జన్మించారు.వీరి తండ్రి కొమర్రాజు వెంకటప్పయ్య. తల్లి గంగమాంబ . వెంకటప్పయ్య మునగాల సంస్థానంలో దివానుగా పనిచేసేవాడు. సేవానిరతి.. దాన ధర్మాలు..సాహితీ ప్రియత్వం ఇతడిలో పుష్కలంగా ఉండేవి. ఇవే లక్షణాలు తర్వాతి కాలంలో అచ్చమాంబ అందిపుచ్చుకున్నది.
👉అచ్చమాంబ 6 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే తండ్రి మరణించడంతో కుటుంబం పరిస్థితి తలకిందులు అయ్యింది.అప్పటికి అచ్చమాంబకు 3ఏండ్ల తమ్ముడు ఉన్నాడు. అతడు ఎవ్వరో కాదు తర్వాతి కాలంలో తెలుగు భాషను ఉద్ధరించిన ఘనుడు విజ్ఞాన చంద్రికా మండలి స్థాపకుడు తెలుగులో మొట్టమొదటి విజ్ఞాన సర్వస్వ నిర్మాతగా చరితార్థుడు చరిత్ర పరిశోధనలు పరిచయం చేసిన ఆదర్శప్రాయుడు గొప్ప సాహితీవేత్త ఉత్తమ విజ్ఞానవేత్తగా ఖ్యాతి గడించిన కొమర్రాజు లక్షణారావు.
👉తల్లి గంగమాంబ  తన ఇద్దరు పసిపిల్లలను తీసుకుని తన సవతి సోదరుడైన భండారు మాధవరావు ఇంటికి వెళ్ళింది.అతడిది నందిగామ తాలూకా కంచెల గ్రామం. కాగా నల్లగొండ జిల్లా దేవరకొండలో ఉండేవాడు  నిజాం సర్కారులో ఇంజనీరుగా పనిచేసేవాడు .వివాహితుడు.మీనాక్షి అని అచ్చమాంబ కంటే కొంచం చిన్నదయిన కూతురు కూడా ఉండేది.  విశాల హృదయంతో భర్తను కోల్పోయి వచ్చిన అక్కను ఆశ్రయం ఇచ్చి ఆదుకున్నాడు మాధవరావు. అయితే దురదృష్టవాశాత్తు అతడి భార్య చనిపోగా. మేనకోడలు అచ్చమాంబను పెళ్లిచేసుకున్నాడు. అప్పటికి అచ్చమాంబ వయసు పదేండ్లు మాత్రమే.
👉ఊహ తెలిసినప్పటినుండే చదువు మీద ఆసక్తి ఉన్న అచ్చమాంబకు పెళ్లినాటికి కూడా అక్షరం ముక్కరాదు. పైగా ఆడపిల్ల గడప దాటి బయటకు వచ్చినా తప్పు పట్టే సమాజం ఉన్నది. తోడుగా కట్టుబాట్లు ఎక్కువగా ఉన్న కుటుంబం. అయినప్పటికీ ఆమె నిరాశ చెందలేదు. తన ఆశ కోసం తన మనో బలాన్ని ఆయుధంగా మలుచుకున్నది.ఈ పరిస్థితిలో  తమ వద్దే ఉంటూ చదువుకుంటున్న తమ్ముడు ఆమెకు చీకటిని పారద్రోలే గురువై కనిపించాడు.అందుకే లోలోపల  పట్టు పట్టింది. ఇంకేం?  తమ్ముడు చదువుతున్నప్పుడు పక్కనే కుర్చూని వింటూ తన వినికిడి శక్తి ద్వారా వాగ్దేవిని వశపరుచుకున్న మానస పుత్రికగా  తనను తాను పునర్నిర్మించుకోగలిగింది. .కాబట్టే తొలి తెలుగు కథకు పట్టపురాణియై సాహితీ చరిత్రలో తన స్థానాన్ని పరిపుష్టం చేసుకున్నది. ఆధునిక తెలుగు సాహిత్యంలో కథాప్రక్రియ ఆరంభం కాని దశలోనే కథకు శ్రీకారం చుట్టిన కారణజన్మురాలు అచ్చమాంబ. నాకు తెలిసీ ఊకొట్టె కథలు ప్రాచీనకాలం నుండి ప్రచారంలో ఉన్నాయి కాబట్టి, ఆ ప్రభావంతో కథారచనకు వీరు ప్రయోగం చేసి ఉంటారనేది నా అంచనా.
👉భర్త ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాలు తిరగవలసి వచ్చేది.ఈ క్రమంలో అతడికి నాగపూర్ బదిలీ అయ్యింది. అతడు తన భార్యా కూతురితో పాటుగా అక్క గంగమాంబను మేనల్లుడిని తన వెంటే తీసుకు వెళ్ళాడు.
👉వివిధ ప్రాంతాలు తిరగడం వల్ల తెలుగు భాషతో పాటుగా సంస్కృతం, హిందీ, మరాఠి, గుజరాతీ భాషల్లో అతి తక్కువ సమయంలోనే మంచి పట్టు సాధించగలిగింది అచ్చమాంబ. అంతేకాదు, సమాజాన్ని అవగాహన చేసుకుంది. తన ఆలోచనలకు పదును పెట్టింది. స్త్రీ విద్య కోసం తపించింది .స్త్రీ సమస్యల కోసం పోరాటం చేయాలని సంకల్పించింది కూడా. ఇందుకు భర్త తోడ్పాటును అందించాడు. ఫలితంగా 1902లో మచిలీపట్నంలో 'బృందావనం స్త్రీల సమాజం ' పేరిట ఒక స్త్రీ సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఇదే తెలుగు ప్రాంతంలో తొలి స్త్రీ సంఘం. తర్వాత వివిధ ప్రాంతాలు తిరిగి చాలా చోట్ల సంఘాలను ఏర్పాటు చేసి, స్త్రీ చైతన్యానికి తన వంతు కృషి సలిపింది.
👉 సవతి కూతురు మీనాక్షికి కూడా 10 ఏండ్లకే పెండ్లి అయ్యింది.కానీ  ఆ పిల్లకు  ఆవెంటనే మొగుడి చనిపోయాడు.అస్థితిలో మీనాక్షి పరిస్థితి అచ్చమాంబని తీవ్రంగా కలిచి వేసింది.ఓదార్పుతో పాటుగా ఆ పిల్లకు ఆత్మ విశ్వాసాన్ని నూరిపోసింది. అప్పటికి అచ్చమాంబకు కూడా ఇద్దరు పిల్లలు పుట్టారు. 
👉 ఈ దశలోనే ఒకటి రెండు సంవత్సరాల కాలంలోనే ఆమె తన రచనా వ్యాసంగాన్ని కొనసాగించింది. ఆమె రాసిన కథలు గమనిస్తే.... 👇

1)  ధనత్రయోదశి  ( హిందూసుందరి పత్రిక, 1902)
2)  గుణవతియగు స్త్రీ (తెలుగుజనానా పత్రిక )
3)  లలితా శారదులు
4)   జానకమ్మ   (తెలుగు జనానా, 1902 మే)
5)  దంపతుల ప్రథమ కలహము (హిందూసుందరి, 1902   
                                                  జూన్)
6)   సత్పాత్ర దానము   (హిందూసుందరి, 1902)
7)   స్త్రీవిద్య (హిందూసుందరి, 1902)
8 )   భార్యా భర్తల సంవాదము (హిందూసుందరిపత్రిక1903
                                               జూలై)
9)     అద్దమును సత్యవతియును  (హిందూసుందరి 1903)
10)    బీద కుటుంబము (సావిత్రి పత్రిక 1904)
11)    ప్రేమా పరీక్షణము
12)   ఎఱువుల సొమ్ము బఱువుల చేటు
                 &
13)   ప్రేమ పరీక్షణము (1898 - అలభ్యం)
14)    ఎరువుసొమ్ము పరువు చేటు (1898 - అలభ్యం)
15)    క్రోషో అల్లిక మీద పుస్తకం (అలభ్యం)
16)    ఊలు అల్లిక మీద పుస్తకం (అలభ్యం
అబలా సచ్చరిత్ర రత్నమాల (రెండు భాగాలు) (చారిత్రక మహిళల జీవితాలు మృధుమధుర శైలిలో వర్ణితాలు ఇందులో ఉన్నాయి.)
17)ఒక శతకం  (అలభ్యం)
                  &
   అబలా సచ్చరిత్ర రత్నమాల (రెండు భాగాలు)
        తమ్ముడు కొమర్రాజు లక్ష్మణరావు  సమాచారాన్ని  సేకరించి సహకారం అందివ్వగా  అచ్చమాంబ ఈ అబలా సచ్చరిత్ర రత్నమాల అనే గ్రంథాన్ని తీర్చిదిద్దగలిగింది.
  ఈ  1000 సంవత్సరాల కాలంలో ప్రసిద్ధికెక్కిన భారత స్త్రీల కథలు ఉన్నాయి. . ఈ గ్రంథాన్ని కందుకూరి వీరేశలింగం పంతులు తమ చింతామణి ముద్రణాలయంలో ప్రచురించాడు.
👉అచ్చమాంబ స్త్రీల కోసం పాటుపడినప్పటికీ ఆమెది తిరుగుబాటు మనస్తత్వం కాదు. భర్త చాటున నిలబడి, భర్త ప్రోత్సాహంతో ముందుకు నడిచింది. భర్త కూడా ఆమెను  ప్రాణ స్నేహితుడిగా అర్థం చేసుకున్నాడు. తమ్ముడి అండదండలు ఆమె సాహిత్య ప్రస్థానాన్ని పరిపుష్టం చేసాయి.
👉జీవితం అందంగా  ఆనందంగా సాగుతున్న సమయంలో ఆమె ఇద్దరు పిల్లలు మరణించారు.ఆ దుఃఖం ఆమెను కలిచి వేసింది. ఈ విషాదాన్ని జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఆమె అనాధ పిల్లలను చేరదీసింది.
👉1902లో కాంగ్రేస్ సమావేశాలు అచ్చమాంబలో స్వాతంత్ర భావజాలాన్ని రేకెత్తించాయి. జాతీయతను ప్రేరేపించాయి.ఆ సమావేశాల్లో పాల్గొనాలని ఉవ్విళ్లూరింది. అప్పుడు ఆమె మధ్యప్రదేశ్ లోని  బిలాస్పూర్ లో ఉన్నది. సరిగ్గా ఇదే సమయంలో అక్కడ ప్లేగు వ్యాధి ప్రబలింది. ఆ వ్యాధి గ్రస్తులకు ఆమె భర్త ఉద్యోగ ధర్మంలో భాగంగా సేవా కార్యక్రమాలను చేపట్టాడు. వద్దన్నా వినిపించుకోకుండా ఆ సేవల్లో ఆమె స్వచ్ఛందంగా పాలు పంచుకునే ప్రయత్నం చేసింది. కాని దురదృష్టవశాత్తు అదే ప్లేగు ఆమెకు సోకింది.
👉 ప్లేగు వ్యాధితో బాధ పడుతున్న అచ్చమాంబ కాళ్లకు  మేజోళ్ళు వాడాల్సి వచ్చింది. వాడకపోతే ప్రమాదం ప్రమాదం పెరిగే పరిస్థితి. ఆ కఠిన సమయంలోనూ  ఆమె తన వ్యక్తిత్వాన్ని అభిమానాన్ని కోల్పోలేదు. తాను  ధరించబోయిన మేజోళ్ళ మీద విదేశీ గుర్తులు ప్రాణం పోయినా పరవాలేదు అంటూ తన దేశభక్తిని చాటుకుంది. చివరకు ప్లేగు ముదిరి 1905 జనవరి 18న  బిలాస్పూర్ లో తన 31వ ఏట మరణించింది. బతికింది కొన్నాళ్లే అయినా జన్మకు సార్థకత సాధించుకున్న అచ్చమాంబ 1901 -1905 మధ్య కాలంలో అంటే కేవలం నాలుగేళ్ళ కాలంలోనే తరతరాల చరితలో మిగిలిపోయే ఘనతను సాధించగలిగింది.
👉 తెలుగు సాహిత్యంలో 'కొమర్రాజు అచ్చమాంబ' అనే మరొక పేరు కూడా వినబడుతుంది. ఈమె మన భండారు అచ్చమాంబ కాదు. మన అచ్చమాంబ మరణించిన సంవత్సరానికి కొమర్రాజు లక్షణారావుకు జన్మించిన మరొక ఆణిముత్యం. అంటే మన అచ్చమాంబకు మేనకోడలు అన్నమాట !

Monday, January 28, 2019

కదిలే బొమ్మల కథలు

 టి .వి.రమణారెడ్డి(1921-1974)

బక్క పలుచగా పొడవుగా  గాలి వీస్తే ఎగిరిపోయే పర్సనాలిటితో పాత తరం ప్రేక్షకుల్ని తన నటనతో కడుపుబ్బ నవ్వించిన రమణారెడ్డి ...

తెలుగు ప్రజలకు సంపూర్ణ  నవ్వుల రసాన్ని అందించిన హాస్యపు విరిజల్లు !వీరి పూర్తి పేరు తిక్కవరపు వెంకటరమణారెడ్డి.హాస్య నటుడిగా ప్రపంచానికి పరిచయం అయిన వీరు , ఒక  నిర్మాతగా కూడా తన  సత్తా చాటుకున్నారు. కాని వీరి ఆసక్తి హాస్యం మీదే ! టి సుబ్బిరామిరెడ్డి వీరి సమీప బంధువు.
        వీరి మొదటి సినిమా 1951 లో ' మాయపిల్ల 'తో  ఆరంభమైన సినిమా ప్రస్థానం 1974 వరకు కొనసాగింది.సినిమాల్లోకి రాక ముందు వీరు నెల్లూరులో శానిటరి ఇన్స్ పెక్టర్ గా పని చేయడం జరిగింది.సినిమాల మీద ఆసక్తితో మద్రాసు రైలు ఎక్కినప్పటికీ....స్వతహాగా వీరికి మ్యాజిక్ అంటే ఎంతో ఇష్టం.కాబట్టి మ్యజిక్ ప్రదర్శనని  నటుడిగా తీరిక లేని సమయాల్లో సైతం కొనసాగించేవాడు.ఈ ప్రదర్శన ద్వారా వచ్చే డబ్బుల్ని 'సేవా సంఘాలకు ' విరాళంగా అందించేవాడు.
  సినిమాల్లో గొప్ప హాస్యాన్ని పండించే రమణారెడ్డి , నిజ జీవితంలో  మాత్రం మౌనంగా గంభీరంగా ఉండేవాడు.ముఖ్యంగా తన నటనతో అందరినీ నవ్వించే రమణారెడ్డి జీవితంలో తనని మాత్రం  ఆరోగ్య సమస్య కారణంగా  నవ్వించుకోలేకపోయాడు.వాస్తవానికి మొదటి నుండి  అనారోగ్యం రిత్యా బక్క పలుచగా ఉండే రమణారెడ్డికి నటన పరంగా అదే గొప్ప క్వాలిఫికేషన్ అయ్యిందని చెప్పవచ్చు. మొత్తానికి అనారోగ్యంతోనే  వీరు కలధర్మం పొందారు.వీరి స్వస్థలం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జగదేవిపేట.

▪️డా. ఎం .ప్రభాకర్ రెడ్డి (1935-1997)

విలక్షణ నటుడిగా తనదైన ప్రతిభను చాటుకున్న మందడి ప్రభాకర్ రెడ్డి...తెలుగు ప్రేక్షకుల్ని గొప్పగా అలరించిన గొప్ప నటుల్లో ఒకరు. విలన్ గా...క్యారెక్టర్ ఆర్టిస్టుగా  ...తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్న ప్రభాకర్ రెడ్డి 1960 నుండి 1988 వరకు తీరిక లేకుండా నటనా యాత్ర కొనసాగించాడు.472 సినిమాల్లో నటించాడు.వీరు స్వతాహాగా ఒక డాక్టరు.ఉస్మానియా  నుండి ఎం.బి.బి.ఎస్ పట్టా పొందారు. వీరు మంచి రచయిత కూడా.వీరు కథల్ని సమకూర్చిన అన్ని సినిమాలు మంచి విజయాలు సాధించాయి. వీటిలో పచ్చని సంసారం , గృహప్రవేశం , ధర్మాత్ముడు , కార్తీకదీపం , పండంటి కాపురం , గాంధి పుట్టిన దేశం మొదలగుణవి ఇప్పటికీ ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి వీరి స్వస్థలం నల్లగొండ జిల్లా తుంగతుర్తి దగ్గర ఏటూరునాగారం.

✍️తంగెళ్ళ శ్రీదేవిరెడ్డి

ఆత్మకూరు

పూర్వ పాలమూరు జిల్లా 

తెలంగాణ అమరులు

కొండేటి వేణుగోపాల్ రెడ్డి :(1987-2010)

తెలంగాణ కోసం జరిగిన బలిదానాల్లో అమరులు ఎందరో ! ఎవ్వరి త్యాగం వృధా కాలేదు. వారి త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు స్వయం పాలనలో నిన్నటి వేదనల గాయాలను మానుపుకుంటున్నది.కానీ గర్భశోకాన్ని మిగుల్చుకున్న తల్లుల గాయలకు మాత్రం చికిత్స లేదు.ఇది జీవితకాల గాయం ! ముగింపులేని కన్నీటి గేయం ! ఈ వరుసలో అమరత్వాన్ని తన బతుకు వాకిట నిలుపుకుని....తన ఆయుష్షును త్యాగాల జెండాకు కట్టిన  మనరెడ్డి బిడ్డ  కొండేటి వేణుగోపాల్ రెడ్డి.
       ఉస్మానియా విశ్వవిద్యాలయం సాక్షిగా ఠాగూర్ ఆడిటోరియం సమీపంలో   వేణుగోపాల్ రెడ్డి తన శరీరాన్ని సంకల్పం కోసం నిప్పుల కొలిమిని చేసుకున్నాడు.ఎం.సి.ఎ  చివరి సంవత్సరం చదువుతున్న ఈ కాపుబిడ్డ ఉడికిన నెత్తుటితో  తల్లి తెలంగాణ కోసం యమపాశాన్ని స్వీకరించి ....నేను సైతం అంటూ ప్రాణమొక్కటి అర్పించాడు.మరణించేనాటికి 23 ఏండ్ల వయసు వున్న ఈ యువకిరణం ప్రాంతం కోసం తన చావుతో వెలుగుల్ని పూయించాలనుకుందే తప్ప...కన్న వారి రేపటి తెలవారని బతుకుల గురించి ఆలోచించలేదు.మరి ఇంతటి త్యాగానికి సిద్దపడి బతుకును బుగ్గిపాలు చేసుకున్న  ఈ అమరుడికి తెలంగాణ అమరుల  వరుసలో  తగిన ప్రాధాన్యత లభించడంలేదు.ముఖ్యంగా ఇతడు చనిపోయిన చోట విగ్రహం ప్రతిష్టించే ఆలోచన ఇటు పాలక వర్గంలో గానీ...రెడ్డి వర్గాల్లో గానీ ...విద్యార్థి  వర్గాల్లో గానీ లేదు.ఇది బాధాకరమైన విషయం.
     హైదరాబాద్  ఉప్పల్ కు దగ్గరగా నాచారం లో నివాసం వుంటూ ఘట్ కేసర్ 'లలిత పి .జి. డిగ్రీ కాలేజ్ ' అనే ప్రయివేటు కళాశాలలో  చదువుకునే వేణుగోపాల్ రెడ్డికి మొదటినుండి కూడా తెలంగాణ అంటే వీరాభిమానం.ప్రత్యేకరాష్ట్రం తన బంగారు కలల్లో ఒకటిగా తన మిత్రులతో సంభాషించేవాడు. ముఖ్యంగా  'మన తల్లి దండ్రులు మన జీవితాల గురించి ఎన్ని కలలు కంటారో అట్లాంటి కలనే తనదిగా ' ఈ రెడ్డిబిడ్డడు పదే పదే మిత్రులతో చెప్పుకోవడం వెనుక...ఇంత కఠినమైన నిర్ణయం వుంటుందనేది ఎవ్వరూ ఉహించనిది.
   19 జనవరి 2010 రోజు తన స్నేహితులతో కలిసి ఉస్మానియ  విశ్వవిద్యాలయానికి వచ్చిన వేణుగోపాల్ రెడ్డి ....ఆ రోజు  సాయంత్రం  5:10 కి  తన సోదరుడు శ్రీనివాస్ రెడ్డికి ఫోన్ చేసి ' ఇంటికి రావడం ఆలస్యమౌతుందని '  మాత్రం చెప్పాడు. ఆ తర్వాత అతడి ఫోన్ స్విచ్ అఫ్ అయ్యింది.ఆరోజు చివరి సారిగా అతడ్ని అక్కడే గార్డెన్ లో చూసినట్టుగా అతడి స్నేహితుల్లో ఒకరైన రవిందర్ పేర్కొనడం జరిగింది.తర్వాత అతడు ఇంటికి వెళ్ళలేదు. ఇంటికి రాని సోదరుడి కోసం శ్రీనివాస్ రెడ్డి రాత్రంతా ఎదురుచూసాడు.స్నేహితుల ఇంటికి వెళ్ళాడేమో అని భ్రమ పడ్డాడు. కాని పొద్దుటే మార్నింగ్ వాక్ కు వచ్చిన వాళ్ళకు ...నల్లగా మాడిన శరీరరం ఒకటి టాగూర్ స్టేడియం వద్ద కనిపించడం కలకలం రేపింది.
  ' జై తెలంగాణ ' అంటూ సూసైడ్ నోట్ రాసిన వేణుగోపాల్ రెడ్డి మరణం  వెనుక కొన్ని అనుమానాల్ని కూడా సన్నిహితులు వెలిబుచ్చారు. తెలంగాణ ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంటూ...తెలంగాణ రాష్టాన్ని చూడాలని కలలు కంటూ...తెలంగాణకై ఉద్యమ దళాల వెంట గ్రామాలు కూడా సంచరిస్తూ...ఉద్యమ సైనినుకుల్ని తయారు చేయడంలో చురుకైన పాత్ర వహిస్తూ...నరనరాన ప్రాంతీయాభిమానాన్ని నింపుకున్న వేణుగోపాల్ రెడ్డి తన ఆశయాన్ని అభిమతాన్ని అంత సులువుగా వదులుకుని ఎట్లా వెళ్ళిపోగలిగాడు అనేది సన్నిహితుల సందేహం !  వేణుగోపాల్ రెడ్డి స్వస్థలం నల్లగొండ జిల్లా.ఈ జిల్లాలో ఒక ప్రాంతానికి  త్యగధనుడి పేరు పెట్టాల్సిన అవ్వసరం ఎంతయినా  ఉన్నది
   వేణుగోపాల్ రెడ్డీ....
   నీవు కూలిన పర్వతానివి...
   కానీ అందుకోలేని శిఖరాగ్రానివి !
   నీవు నేలరాలిన తారవి...
   కానీ తట్టుకోలేని మహోజ్వల కాంతివి !
   నీవు విరిగిన కొమ్మవి...
   కానీ పెకిలించలేని మహావృక్షానివి !
   జోహార్ ..అమరుడా...జోహార్  !!

✍️తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

ఆత్మకూరు

పూర్వ పాలమూరు జిల్లా 

పోరాట వారసత్వం

కుర్రారం రామిరెడ్డి :

👊🏾 వీరుడా రామిరెడ్డి..
కుర్రారం కరవాలమా రామిరెడ్డి...!
ధీరుడా రామిరెడ్డి....
నల్లగొండ గుండె సప్పుడే నువ్వు రామిరెడ్డి...!
పౌరుశాల నడిగడ్డవే రామిరెడ్డి...
త్యాగాల ముద్దుబిడ్డవే రామిరెడ్డి...!🙏
17 .10. 1948  .
నిజాం నియంతృత్వపాలన నుండి సర్దార్ వల్లభాయ్ పటేల్ సాక్షిగా తెలంగాణకు విముక్తి లభించిన రోజు !ఇది విలీనమా? విమోచనమా? అంటూ సాహిత్యకారులు విమర్శకులు మేధావులు కొందరు లేవనెత్తారు.ఇది అప్రస్తుతం.కాగా విమోచనానికి సరిగ్గా నాలుగు రోజుల ముందు ఒక రెడ్డిబిడ్డ పులిబిడ్డై రజాకర్ల మీద తెగబడ్డాడు.ఉగ్గుపాలతోనే వీరత్వాన్ని ఒంటబట్టించుకున్న మన కాపుబిడ్డకు తెలంగాణ చరిత్రలో తగినంత ప్రాధాన్యత లేదు.ఇది బాధాకరమైన విషయం.గుత్ప ఎత్తితేనే చాలు వీరులుగా కొనియాడుతూ  జేజేలు పలికే తెలంగాణ ముద్దుబిడ్డల్లారా ఈ వీరుడిని మరిచారు ఎందుకు? మరుగున పడవేసారు ఎందుకు?
   నల్లగొండ జిల్లా భువనగిరి తాలూకా కుర్రారం గ్రామ వాస్థవ్యుడైన రామిరెడ్డి ఒక దొరబిడ్డ.విద్యావంతుడు.రైతు కుటుంబంలో ఉదయించిన తెలంగాణ అభిమన్యుడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థుల వందేమాతరం పిలుపు అందుకుని తన చదువుకు స్వస్తి చెప్పి ఉద్యమంలోకి వెళ్ళాడు.  ఈ క్రమంలో అంధ్రమహాసభ ఆహ్వానంతో తెలంగాణ ప్రజా చైతన్యానికై నాయకత్వ బాధ్యతను భుజాన వేసుకుంటూ గెరిళ్ళా దళాలను రూపొందించి స్వయంగా శిక్షణలు ఇచ్చాడు.
   రామిరెడ్డి అంటే ఒక నడిచే వేల సైన్యం ! ఒక సింహస్వప్నం ! అతడి శక్తిని యుక్తిని పసిగట్టిన రజాకర్లకు అతడి పేరు చెబితేనే హడలు పుట్టేది. నియంతలైన దొరలకు గుబులు పుట్టేది.ప్రజాబంధువైన రామిరెడ్డి రజాకర్ల కదలికలపై ఓ కన్నేసి వుంచేవాడు.వాళ్ళను మప్పించి వాళ్ళ స్థావరాలపై దాడిచేసి వాళ్ళ ఆయుధాలను ఎత్తుకెళ్ళేవాడు.ప్రజలను పీడించే రజాకర్లు అంటే రామిరెడ్డి 'చంపడానికి అర్హమైనవాడు 'గా అర్థాన్ని మారుస్తూ...తనకు అదును దొరికి నప్పుడల్లా వాళ్ళతో పోరాటం చేసి మొత్తం 100 మందిదాకా రజాకర్లను మట్టుబెట్టాడు.ఇది అతడికి శతృవులను ఎంత పెంచిందో...ప్రజల అండదండలను కూడా అంతే పెంచింది.
  ఇట్లాంటి పరుస్థుతుల్లోనే రజాకర్ల నాయకుడు ఖాసిం రజ్వి మార్చి నెల 9,1948 నాడు  ఒక ప్రకటన చేసాడు.అది ఏందంటే ...భారత్ యూనియన్ లో హైదరాబాద్ చేరదని, అది స్వతంత్ర్యదేశంగా మనుగడ సాగిస్తుందని  ,ఒకవేళ బారత్ సైన్యం తమ ప్రకటనని బేఖాతరు చేస్తూ హైదరాబాద్ లోకి ప్రవేశిస్తే నరమేధం తప్పదు అని ! కాగా ఇది లెక్క చేయని భారత్ యూనియన్ సైన్యం సెప్టెంబర్ 13 .1948 నాడు హైదరాబాద్ లోకి ప్రవేశించింది.ఇది తెలిసి రజాకర్లు గ్రామాలపై విరుచుకుబడ్డారు.కనిపించిన వాళ్ళను కనిపించినట్టే కాల్చి పారేయసాగారు.కత్తులతో నరకసాగారు.ఇట్లాంటి పరిస్థితుల్లో మన రామిరెడ్డి ...రజాకర్ల కంచుకోట అయిన జనగామ దగ్గర వున్న నాగపురి స్థావరంపై దాడి నిర్వహించాడు.రామిరెడ్డి శక్తి తెలిసిన రజాకరులు  అతడిని ఎదుర్కోలేని పిరికి వాళ్ళయి  లొంగినట్టుగా  నటించారు.తర్వాత గోడ రంధ్రం లోంచి గురి చూసి రామిరెడ్డిని కాల్చే ప్రయత్నం చేసారు . రజాకర్ల కుట్రకు రామిరెడ్డు తొడల్లోకి తూటాలు దూసుకుపోయాయి.అయినా భయపడని రామిరెడ్డి రజాకర్లని ఎదుర్కునే ప్రయత్నం చేసాడు.వాళ్ళతో శక్తి కూడదీసుకుని పోరాడుతూ...వాళ్ళను చెదరగొడుతూ..కొడగండ్ల దాకా వెళ్తాడు.రక్తం దారెంబడి స్రవిస్తున్నా శతృవులకు చిక్కకూడదనే అతడి సంకల్పం అతడ్ని భీకరుడిగా మార్చింది..గాయపడీ సైతం పులిలా లంఘిస్తున్న రామిరెడ్డి విశ్వరూపం రజాకర్ల వెన్నులో వణుకు పుట్టించింది.దీంతో శతృవులకు  దొరక్కుండా తనని తాను కాపాడుకున్న రామిరెడ్డి... గాయాలపాలై కొడగండ్లలోనే ఉండిపోతాడు.అట్లా మూడురోజులు ఉంటాడు.అప్పుడే నిజాం భారత సైన్యానికి లొంగిపోతూ హైదరాబాదును భారతదేశంలో విలీనం చేస్తాడు.అట్లా తెలంగాణ ప్రాంతం స్వతంత్ర్య రాష్ట్రమయ్యిది.గాయపడిన రామిరెడ్డి చావుబతుకుల్లో ఉండగా భారత యూనియన్ మిలటరి చొరవ తీసుకుని హైదరాబద్ లోని ఉస్మానియా ఆసుపత్రికి చేరుస్తుంది.కాని వీరుడు రామిరెడ్డి  సెప్టెంబర్ 18 న అమరుడయ్యాడు.అప్పుడు అతడి వయసు కేవలం 28 ఏండ్లు.
    ప్రజల కోసం  ...ప్రాంతం కోసం...అమరుడైన రామిరెడ్డిని మన తెలంగాణ ఉద్యమ కవులు పోరాటవారసత్వపు వరుసలో స్మరించక పోవడం అనేది రెడ్డి బంధువులు ఆలోచించాల్సిన విషయం.
కుర్రారం చుట్టు పక్కల ప్రజలు  మాత్రం నేటికినీ రామిరెడ్డిని కథల రూపంలో పాటల రూపంలో స్మరించుకుంటున్నారు. ఈ పాటల్ని సేకరించి రికార్డు చేయాల్సిన అవసరం కూడా ఎంతయినా ఉన్నది

✍️తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

ఆత్మకూరు

పూర్వ పాలమూరు జిల్లా 

సాయుధ పోరాట చరిత్ర లో చింతలపూరి రాంరెడ్డి

పోరాట వారసత్వం 
 
తెలంగాణ ఉద్యమ చరిత్రను ...ముఖ్యంగా మలి విడత ఉద్యమచరిత్రలో భాగంగా వచ్చిన గేయసాహిత్యాన్ని గమనిస్తే...తెలంగాణ పోరాట  వారసత్వంగా కొందరి పేర్లే ప్రముఖంగా వినిపించాయి.వాళ్ళల్లో ఆదివాసీల అడుగుజాడ కొమరం భీం,బహుజన రాజ్యం ఆశాజ్యోతి సర్వాయిపాపన్న , కాకతీయ ప్రతాపరుద్రుడిని ఎదురించిన సమ్మక్క సారలమ్మలు ,సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య , దేశ్ ముఖ్ దురాగతానికి బలైన షేక్ బందగీ ,భూమి హక్కుని ప్రశ్నిస్తూ ...ఆంధ్రమహాసభ కార్యకర్తల అండదండలతో దొరకు ఎదురు తిరిగిన చాకలి ఐలమ్మ , వీళ్ళను మాత్రమే ఉద్యమ కవులు పోరాట వారసత్వంగా స్మరించుకున్నారు. కానీ ఎందరో వీరులు ఇక్కడ విస్మరణకు గురి అయ్యరనేది వాస్తవం.  కవిత్వాలు రాసిన కవులు అగ్రకులాలకు సంబంధించిన వీరులను అమరులను ఉద్దేశ్యపూర్వకంగా స్మరించుకోలేదా? లేకా వాళ్ళు వీరులు కాదని భావిస్తూ పక్కకు పెట్టారా? లేకా తెల్వక తలుచుకోలేదా ?లేకా తెలిసీ మా వాళ్ళు కాదు కదా అనుకున్నారా? ఇవన్నీ మిలియన్ డాలర్ల ప్రశ్నలు.ఈ క్రమంలో  కులమతాలకు అతీతంగా పోరాటవీరులకు...అమరులకు...పేరుపేరున వందనాలు ! ఊరూరా విగ్రహాలు అవుతున్న పైన చెప్పిన వీరులతో పాటుగా  పోరాట చరిత్ర మరిచిపోయిన  మన రెడ్డి వీరులకు కూడా  అభివoదనాలు !  ముఖ్యంగా సాయుధపోరాటానికి ముందు పోరాటస్పృహను కలిగించిన....అందుకు బాటలు వేసిన వీరులు ఎందరినో వెలికి తీయాల్సిన అవసరం వున్నది. అట్లాగే కందిమళ్ళ ప్రతాపరెడ్డి గారు సాయుధ పోరాట చరిత్ర ఇంకా అసంపూర్ణమే అన్నారు.  ఆ    అసంపూర్ణత పూరించబడాలంటే పెద్ద ఎత్తున పరిశోధన జరగాలి. అప్పుడు ఇంకా ఎందరో వీరులు బయటకు వస్తారు.


👉రేణికుంట రామిరెడ్డి

పోరాటాలకు పెట్టిది పేరయిన నల్లగొండ జిల్లా భువనగిరి తాలూకా రేణికుంట గ్రామానికి చెందిన రామిరెడ్డి ఒక సామాన్య రైతుబిడ్డ.వీరి ఇంటిపేరు చింతలపూడి.ఆంధ్రమహాసభ  ప్రేరణతో చైతన్యం పొందిన రామిరెడ్డి నిజాం అకృత్యాలమై తన తిరుగుబాటును ధైర్యంగా ప్రకటించుకున్నాడు.1944లో రజాకర్ల నుండి దేశ్ ముఖ్ ల నుండి ప్రజలను కాపాడడానికి  గ్రామ రక్షక దళాలను ఏర్పాటు  చేసి...ముందుండి పోరాడి అమరుడైన వీరగాథ ఈ రామిరెడ్డిది.కాని ఈ వీరుడు చరిత్ర పుటల్లో ఎక్కడో మరుగున పడిపోయాడు.1948 మార్చి 2 న నిజాం రజాకర్ల  సైన్యం రామిరెడ్డి మట్టుపెట్టాలని నిర్ణయించుకుని రేణికుంట గ్రామాన్ని చుట్టు ముట్టింది. వాళ్ళతో మరతుపాకులు మెషీన్ గన్నులు వున్నాయి.8 లారీల సైన్యం వున్నది. గ్రామ బురుజు మీద నుండి ఎల్లవేళలా పరిస్థితుల్ని కనిపెట్టుకుని వుండే రామిరెడ్డి దళ సభ్యుడు ఒకరు విషయాన్ని రామిరెడ్డికి చేరవేయగానే...రామిరెడ్డి నిజాం సైన్యాన్ని చూసి పారిపోకుండా పోరాటానికి సిద్దమయ్యాడు.ప్రజలు మాత్రం భయతో  గ్రామం చుట్టూ సహజ సంరక్షణగా వున్న  గుట్టల్లోకి  పారిపోయి  ప్రాణాలు కాపాడుకున్నాయి .విజయమో వీరస్వర్గమో అని ప్రజలకు ధైర్యం  చెప్పి.. తన దళంలో వున్న 16 మంది సభ్యులతో 15 తుపాకులతో రజాకర్లతో పోరాటానికి తెగబడ్డాడు రామిరెడ్డి.ఈ భీకర పోరాటంలో 40 మంది రజాకర్లు చనిపోయారు.2 గంటల పాటు జరిగిన పోరాటంలో రామిరెడ్డి దళంలొ ఒక్క సభ్యుడు మాత్రమే చనిపోయాడు.ఇది రజాకర్లకు అవమానంగా తోచింది.రామిరెడ్డి పోరాట పటిమను వాళ్ళు తట్టుకోలేకపోయారు.దీంతో రజాకర్ సైన్యాన్ని రెచ్చగొట్టి తీసుకొచ్చిన తహసిల్దారు రామిరెడ్డిని దొంగచాటుగా అయినా చంపి నిజాం మెప్పు పొందాలనుకున్నాడు.అప్పటికి రామిరెడ్డికి సంబందించిన తుపాకుల్లో మందుగుండు దాదాపు అయ్యిపోయింది.ఇదే అదనుగా తహసిల్దారు రామిరెడ్డి వున్న మిద్దె కు వెనక వున్న చింతచెట్టు ఎక్కి ...వెనక నుండి పిరికిగా రామిరెడ్డిపై కాల్పులు జరిపాడు. వీరుడిపై కాల్పులు జరగగానే సభ్యులు అంతా పారిపోవడం మొదలెట్టారు. సైన్యం వాళ్ళను పట్టుకుని వరుసగా నిల్చోబెట్టి క్రూరంగా కాల్చి చంపింది.అయితే వీరుడైన రామిరెడ్డి తన మరణం తర్వాత తన కొడుకు రంగారెడ్డి శతృవుల చేతికి చిక్కకూడదని భావిస్తూ తను చనిపోతూ కొడుకును కూడా కాల్చి చంపాడు.తర్వాత రజాకర్లు గ్రామాన్ని నిర్ధాక్షిణ్యంగా తగుల బెట్టారు.కాలిన శవాలను గుట్టలుగా లారీల్లో తరలించారు.రామిరెడ్డి వీరత్వం  ...అమరత్వం...ప్రజలు పాటలుగా పాడుకున్నారు.కథలుగా చెప్పుకున్నారు. మరి ఈ అమరుడిని మనం కూడా పాటై తలుచుకుందాం...

     పోరుబాటైనావు రామిరెడ్డీ...
     త్యాగధనమైనావు ఎదురొడ్డీ..
     రజాకర్ గుండాలను తరిమికొట్టి...
     వీరుడవైనావు తుపాకి పట్టి...
     పోరాటకథల్లో నీ పేరు తలిచి...
     నిలుపుకుంటాము నిన్ను మా గుండెలు తెరిచి...

✍️తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

ఆత్మకూరు

పూర్వ పాలమూరు జిల్లా 

స్మరణీయులు

▪️గంగుల శాయిరెడ్డి :(1890-1975) 

హలమే కలమై అక్షర సేద్యం చేసిన కాపుబిడ్డ.సాలు సాలును తన గుండె గొంతుకగా వినిపించిన మట్టిమనిషి. కృషీవలుడి తలపాగై వెలుగొందిన భూమిపుత్రుడు.ఓ రైతు గర్జన.ఓ సహిత్య స్పూర్తి.వీరి స్వస్థలం పూర్వ నల్లగొండ జిల్లా ఇప్పటి వరంగల్ జిల్లాలో భాగమైన జీడికల్లు గ్రామం.

▪️జి.పుల్లారెడ్డి (1921-2007)

గునమపల్లి పుల్లారెడ్డి ....మిఠాయిల వ్యాపారంతో స్వీట్ల పుల్లారెడ్డిగా ప్రఖ్యాతి గాంచాడు. 1948 లో కర్నూల్ లో చిన్న బండిమీద ప్రారంభం అయిన వీరి వ్యాపారం ' కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు..' మాటను ఋజువు చేస్తూ ఈనాడు ప్రపంచస్థాయిని అందుకున్నది. వీరు అరెస్సెస్ ప్రముఖులు.హిందూనేత. సామాజిక కార్యకర్త.అంకితభావానికి  మారుపేరుగా ...క్రమశిక్షణకు అస్సలు పేరుగా...నిరాడంబరతకు నిజ రూపంగా ...వీరి జీవితం ఆదర్శప్రాయం.త్యాగం.. సేవ..కృషి...వీరి వ్యక్తిగత నిఘంటువులో మొదటి అక్షరాలు. వీరి స్వస్థలం కర్నూలు జిల్లా.

▪️హెచ్.ఎం. రెడ్డి (1892-1960)

వీరి పూర్తిపేరు హనుంతప్ప మునియప్పరెడ్డి. 1931లో తొలి తెలుగు మాటల సినిమా 'భక్త ప్రహ్లాద  'ను తెర మీదకు తీసుకు వచ్చిన సృష్టికర్త.కదిలే బొమ్మలకు మాటలు నేర్పిన   సినీమాంత్రికుడు.తొలి తెలుగు టాకీకి మాత్రమే కాదు...తొలి తమిళ టాకీ ' కాళిదాసు ' కు  కూడా ప్రాణం పోసిన మన రెడ్డిబిడ్డ.సినిమా మాటల చరితకు ఆద్యుడు.పులిమీసాల చిత్రగర్జన. వీరి స్వస్థలం బెంగుళూరు.

▪️బి.ఎన్.రెడ్డి (1908-1977)

వీరి పూర్తి పేరు బొమ్మిరెడ్డి నరసింహ్మారెడ్డి .తెలుగు  చిత్ర సీమలో ' మల్లీశ్వరి ' కళాఖండానికి ఊపిరిపోసిన మందారమాల.దర్శకుడిగా నిర్మాతగా కళామతల్లికి ఎనలేని సేవలు అందించి....దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తొలి దక్షిణ భారతీయుడిగా చరిత్ర సృష్టించిన రెడ్డికుల రతనం. వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల తాలూకా కొత్తపల్లి వీరి స్వగ్రామం.

▪️బి.ఎన్ రెడ్డి (1912-2004)

వీరి అస్సలు పేరు బొమ్మిరెడ్డి నాగిరెడ్డి. బొమ్మిరెడ్డి నరసింహారెడ్డికి స్వయాన తమ్ముడు.ఇద్దరు అన్నాదమ్ముళ్ళు బి.ఎన్ రెడ్డిలుగానే ప్రపంచానికి పరిచయం అయ్యారు. వీరు కూడా దర్శకుడు ..నిర్మాత. తెలుగు సినిమా ఆణిముత్యాలు 'మాయాబజార్ ' ' మిస్సమ్మ ' ' గుండమ్మ కథ 'లకు ప్రాణదాత. విజయవాహిని స్టూడియో  నిర్మించి ఎందరికో  బతుకుదెరువు చూపించాడు.వీరు మంచి వ్యాపారవేత్త.హైదరాబాదులో వున్న ప్రస్తుత 'బి.ఎన్ .రెడ్డి కాలనీ ' వీరి పేరు మీదిదే.

▪️నీలం సంజీవరెడ్డి (1913-1996)

భారత 6 వ రాష్టపతిగా పనిచేసిన రెడ్డిజాతి గర్వకారణం. వీరు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా, లోక్‌సభ సభాపతి గా, ఆంధ్ర రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, సంయుక్త మద్రాసు రాష్ట్రంలో మంత్రిగా, కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడిగా వివిధ పదవులను అధిరోహించి, ప్రజల మన్ననలను పొందిన తిరుగులేని  రాజకీయవేత్త. వీరి స్వగ్రామం అనంతపురం జిల్లా ఇల్లూరు.

 ▪️✍️డా.తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

ఆత్మకూరు

పూర్వ పాలమూరు జిల్లా 

చరిత్రలో మహిళలు

▪️నాయకురాలు నాగమ్మ...

మంత్రాంగం నడిపిన మహాదేవివ్యూహ ప్రతివ్యూహల ఊటబావి...

సాగిన యుద్దతంత్రం...దూసిన వీరఖడ్గం...

ఎదురులేని రాజనీతి-తిరుగులేని  కలహప్రీతి-

పల్నాటి యుద్దం! మహాభారత కురుక్షేత్రంతో సమానంగా భీకరంగా కొనసాగిన మహాయుద్దం! ఇది జరిగి 900 ఏండ్లు గడుస్తున్నా ఆ పౌరుషాల నెత్తుటి మరకలు ఇంకా తడి ఆరలేదు.యుద్దంలో ప్రధాన భూమికల్ని పోషించిన....బ్రహ్మనాయుడు నాగమ్మల పేర్లు ఇంకా పలనాటి గడ్డలో చెవుల్ని గింగురు మనిపిస్తున్నాయి.ఆ గుర్రపు డెక్కల చప్పుడులు అక్కడి గుండెల్ని ఇంక వణికిస్తున్నాయి. ఆ కత్తుల కోలాటపు శబ్ధాలు అక్కడి మట్టిలో ఇంకా దుమ్ములేపుతూ భయపడుతున్నాయి.

నా....గ...మ్మ....!
పలనాడు మరిచిపోని  పేరు !
కదన రంగం కోరుకునే పౌరుషత్వపు సెలయేరు !
ప్రపంచ  స్థాయిలో  తన  సమర్థతను అప్రతిహతంగా చాటుకున్న  ధీశాలి ! రాజ్యమో... రణరంగమో..రక్తపాతమో...   పౌరుశత్వమే ప్రాణవాయువుగా చెలరేగిన శక్తిశాలి ! రాజ్యపాలనలో వ్యక్తిగా కాదు.. వ్యవస్థగా తనదైన ముద్రను వేసిన అమర ఖ్యాతి ! యుక్తికి పర్యాయపదంగా మిగిలి పోయిన తొలి మహిళా మంత్రి.
       బాల వితంతువు. అయినా ఆత్మస్థయిర్యం కొరవడని నిప్పుల కొలిమి. స్వశక్తితో అత్యున్నత స్థాయికి ఎదిగిన ధీరోదాత్త .చండ ప్రచండమై చరిత్రను అలరించిన సమరభేరి!
            నాగమ్మ   మహా మంత్రిగా రాజ్యాన్ని, రాజును, ప్రతిభావంతగా నడిపించింది.యుద్దానికి సారధ్యం వహించి ప్రత్యర్థి వర్గాన్ని హడలెత్తింది. గెలుపు సింహాసనాన్ని  సాధించిపెట్టి  దిగ్విజయ పతాకై రెపరెపలాడింది. అపర చాణక్య మేధా సంపన్నురాలుగా రణస్థలిలో  సైనిక బలగానికి తానే దివిటీ అయ్యింది.
         11వ శతాబ్ధకాలంలో స్త్రీ జాతి పరిస్థితి అస్తవ్యస్తంగా వున్న ఆనాటి సామాజిక పరిస్థితుల్లో  ఆమె తెగువగా చొరవ చూపింది. సామాన్య కుటుంబం నుండి వచ్చిన ఒక సాధారణ స్త్రీ.... రాజ్యపాలన అవగాహనలేని  కుటుంబం... పైగా బాల వితంతువు....ఇట్లాంటి  పరిస్థితుల్ని ఎత్తుగడలతో జయించి  మంత్రిస్థాయికి ఎదగడం  అనేది అంత ఆషామషి కాదు.కలలు  నిజం చేసుకోవడం అంటే  అదొక నిర్విరామ యజ్జం. కాబట్టే  స్త్రీజాతికే మణిదీపంలా బాసించింది.
        తెలివైన   నాగమ్మను గుర్తించిన మంత్రి గోపన్న తన పర్యవేక్షణలో నాగమ్మ చదివించాడు. చదువుతో పాటుగా సాముగరిడీలు, ధనుర్విద్య, అశ్వ శిక్షణలో ప్రావీణ్యం పొందింది.  సంగీత  పరిజ్జానాన్ని సంపాదించుకుంది.సంస్కృతాంధ్ర, కన్నడ, తమిళ భాషలలో పాండిత్యం సాధించింది. రాజనీతి, తత్వశాస్త్రాలని కూడా అధ్యయనం చేసింది.
        నాగమ్మ  బాల్య జీవితాన్ని గమనిస్తే .... నాగమ్మ తండ్రి రామిరెడ్డి .కరీంనగర్‌ జిల్లా, పెగడపల్లి మండలం, అరవెల్లి గ్రామం వీరి స్వస్థలం.అయితే  ఇతడు తన    కుటుంబంతో సహా ఆ ప్రాంతంలో నెలకొన్న కరువు కాటకాలు...మశూచి మహమ్మారి కారణంగా  కాలక్రమంలో  తనబావమరిది మేకపోతుల జగ్గారెడ్డి వుంటోన్న పల్నాడులోని జిట్టగామాలపాడు గ్రామానికి వలస  వచ్చాడని చరిత్ర చెబుతుంది. అక్కడే  స్వంత అత్త కొడుకు బావ సింగారెడ్డితో చిన్న తనంలోనే ఆమెకు వివాహం జరిగింది. అప్పడు వయసు 7 ఏండ్లు. తండ్రి  రామిరెడ్డి  సోదరి కొడుకే ఈ  సింగారెడ్డి.  వివాహమైన మూడు రోజులకే సింగారెడ్డి మరణించడంతో నాగమ్మ జీవితం కన్నీటిమయం అవుతుంది.
         కూతురు బతుకు  రామిరెడ్డిని కృంగదీస్తుంది.అయినా జీవన సమరంలో రామిరెడ్డి  రాజీ పడుతూ తనదైన జీవితాన్ని భారంగా   గడుపుతున్న తరుణంలో ...  రామిరెడ్డి భూమిలో చెరువు తవ్వించే ప్రయత్నం చేస్తుంది బ్రహ్మనాయుడి రాజ్యం . ఈ ప్రయత్నాన్ని అడ్డుకుంటాడు రామిరెడ్డి. ఇందుకు బ్రహ్మనాయుడు ఆగ్రహిస్తాడు. అదును చూసి తన మనుషుల చేత ఒకానొక రోజు నిద్రలో ఉన్న రామిరెడ్డిని తాళ్ళతో మంచానికి కట్టివేయించి  పొందుగుల అడవుల్లోకి తీసికెళ్ళి హత్య చేయిస్తాడు.ఇట్లా  యుక్తవయస్సు నాటికే తండ్రినీ, బాల్యంలోనే భర్తను  కోల్పోయిన నాగమ్మ గుండెను రాయి అవుతుంది. సుకుమారం ఆమె నుండి వీడిపోతుంది. కటువుతనంతో రాటు తేలుతుంది.
          ఒంటరిదైన నాగమ్మ  ప్రజల మద్య తిరుగుతూ ....వారి మధ్య తగాదాలు పరిష్కరిస్తూ ....అనతి కాలంలోనే  ప్రజల మనిషిగా గుర్తింపు పొందుతుంది. ఇట్లా ఉండగా  ఓ రోజు నల్లమల అడవుల్లో వేటకు వెళ్లిన బ్రహ్మనాయుడు అనుచరుడు  అనుగురాజు, ఆయన సేన, పరివారం తిరుగు పయనమై అలసిపోతారు. నాగమ్మ వారికి స్వయంగా జిట్టగామాలపాడులో సేద దీరేందుకు చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తుంది. తాగునీరు, భోజన వసతి కల్పిస్తుంది.నాగమ్మ సేవలకు  రారాజు ఆనందించి, ఏదైనా వరం కోరుకోమని అడుగుతాడు.  ప్రజా బంధువుగా  ' ప్రజలకు  మేలు తలపెట్టాలనే ఉద్దేశ్యం’తో... తనకు      ఏడు ఘడియలపాటు మంత్రి పదవి ఇమ్మని’ అడుగుతుంది.అందుకు  సమ్మతించిన  అనుగురాజు నాగమ్మకు ఇష్టమైన సమయంలో మంత్రి పదవి స్వీకరించే అవకాశం కల్పిస్తూ ‘రాజపత్రం’ రాసి ఇచ్చి వెళ్తాడు.ఆ విధంగా నాగమ్మ రాజ్యపాలనలో  భాగస్వామ్యం అయ్యి తన వీరత్వాన్ని చాటుకుంటుంది. బ్రహ్మనాయుడి మీది ద్వేషంతో...ప్రతీకారంతో.. కయ్యానికి కాలుదువ్వుంది. యుద్దంలో బ్రహ్మనాయుడిని చిత్తగా ఓడిస్తుంది.ఓటమి పాలైన బ్రహ్మనాయుడు గుత్తి  దగ్గరున్న కొండ బిళంలోకి వెళ్ళిపోయాడని.....నేటికినీ అతడు సజీవంగా వున్నాడని....తపస్సు చేసుకుంటున్నాడని వదంతులు వున్నాయి. కాగా నాగమ్మ మాత్రం యుద్దం తర్వత తిరిగి తన స్వగ్రామైన కరీంనగర్ జిల్లా వచ్చింది.అక్కడే తన ప్రజాసేవ కొనసాగిస్తూ తనువు చాలించింది

✍️తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

ఆత్మకూరు

పూర్వ పాలమూరు జిల్లా 

చరిత్రలో మహిళలు

ఆరుట్ల కమలాదేవి (1920_2001)
..........................
✊తెలంగాణ వీరనారి...
రోషమున్న పోరుదారి...
బందూకు ఎత్తిన మగువ...
నిజాంను ఎదురించిన తెగువ...
ఎర్ర మందారం 
తరతరాలకు చెదరదు ఈ శౌర్య సిందూరం🤜
   
     తల్లిదండ్రులు పెట్టిన పేరు రుక్మిణి.  11 సంవత్సరాల వయస్సులో మేనమామ కుమారుడు ఆరుట్ల రామచంద్రారెడ్డితో వివాహం జరిగింది. వివాహం సమయంలోనే ఈమె పేరు కమలాదేవిగా మార్చబడింది.
           చదువుకోవాలన్న వీరి తపనను  అత్తింటివాళ్ళు ఆదరించగా....వివాహం అనంతరం హైదరాబాదులోని ఆంధ్రా గర్ల్స్ హైస్కూలులో విద్యనభ్యసించింది. ముఖ్యంగా వీళ్ళది విప్లవ భావజాలం వేళ్ళూనుకుపోయిన కుటుంబం. దీంతో ఉద్యమాల ఉగ్గుపాలు తాగిన కమలమ్మ  సంఘహితానికై జరిగిన  ఉద్యమాల్లో  భర్తతో పాటు పాల్గొంది. అలనాడు  ప్రజల అండదండ అయిన ఆంధ్రమహాసభలకు  హాజరై ఉత్తేజాన్ని పొందింది.
       పీడనలా పీడకలా ....దుస్థితిలా దుస్సత్యంలా...తన దురాగతాలతో చెలరేగిపోయిన  నిరంకుశ నిజాం విమోచనోద్యమంలో నిర్భయంగా పాల్గొన్నది. సంకెళ్ళు నాకు గడ్డి పరకలు అంటూ అరెస్టు కాబడి జైలుకు కూడా వెళ్ళింది.సాహసంతో వ్యూహంతో 1946-48లో రజాకార్ల దురాగతాలను ఎదుర్కోడానికి మహిళా గెరిల్లా దళాన్ని ఏర్పాటుచేసింది.నిజాం తోక ముడవడంలో తనదైన పాత్రవహించింది.
        ప్రజాసేవకు ఉద్యమం ఉదయమై నడిపించగా....ఆ అనుభవాల  విప్లవ చురకత్తియై రాజకీయంలోకి అడుగు పెట్టి  1952 ఎన్నికలలో భువనగిరి నుంచి హైదరాబాదు శాసనసభకు ఎన్నికైనది. ఆ తర్వాత వరుసగా 3 పర్యాయాలు ఆలేరు నుంచి కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎనికై విజయ భావుటా ఎగురవేసింది.
        శాసనసభలో కమ్యూనిస్టు పార్టీ ఉప నాయకురాలిగా.... పుచ్చలపల్లి సుందరయ్య చికిత్సకోసం విదేశాలకు వెళ్ళినప్పుడు ప్రతిపక్ష నాయకురాలిగా....సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించింది.
    వీరి స్వగ్రామం నల్లగొండ జిల్లా ఆలేరు తాలూకా మంతపల్లి.

✍️తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

ఆత్మకూరు

పూర్వ పాలమూరు జిల్లా 

కుప్పాంబిక (తొలి తెలుగు కవయిత్రి )

▪️కుప్పాంబిక (తొలి తెలుగు కవయిత్రి )

మగడి శక్తిని మించి గెలిచి....చరిత ఘనతకు ఎదురు నిలిచి....పౌరుషత్వం పొంగిపొరలగా....కదన రంగమున కత్తి దూసిరి.....కవన రంగమున కలము దూసిరి...పుణ్య భూమిలో ఈ ధీర మహిళలు పుట్టి గెలిచిరి.......

     తెలంగాణ ఆడబిడ్డ, పాలమూరు ముద్దుబిడ్డ , కుప్పాంబిక తొలి తెలుగు కవయిత్రిగా వెలుగులోకి వచ్చారు. ఈ విషయాన్ని  ప్రపంచ తెలుగు మహాసభల వేదికపై తెలంగాణ సాహిత్య వైభవంలో భాగంగా చాటి చెప్పడం జరిగింది.
         సాహిత్య చరిత్ర పరిశోధకుడు సంగిశెట్టి శ్రీనివాస్ వెలుగులోకి తెచ్చిన ఈ కుప్పాంబిక కాకతీయుల కాలం నాటి కవయిత్రి.తెలుగులో తొలి తెలుగు ద్విపద రామాయణం రాసిన గోన బుద్దారెడ్డి ముద్దుల కూతురు. రుద్రమకు చతురంగ బలమై వెన్నంటిన గోన గన్నారెడ్డి చెల్లెలు.కుప్పాంబిక భర్త గుండనాథుడు. భర్త మరణానంతరం బూదపురంలో ఈమె శివాలయాన్ని  'గుండేశ్వరాలయం ' గా నిర్మించింది.
     మహబూబ్‌నగర్ జిల్లాలోని ఈ బూదపూరం  (బుద్దాపురం)  వద్ద  క్రీ.శ. 1276లో తన భర్త చనిపోయినప్పుడు వేయించిన శాసనాన్ని బట్టి ఆమె 1230లో జన్మించినట్టుగా... తండ్రి నుంచి సాహిత్య వారసత్వం పొందినట్టుగా..., భర్త మల్యాల గుండనాథుని ఆస్థానంలోని కవుల స్ఫూర్తితో ఆమె సాహిత్యానికి మెరుగులు దిద్దుకున్నట్టుగా పరిశోధకులు భావిస్తున్నారు.ఆ బూదపూరమే ఇప్పటి  భూత్పర్.
         కృష్ణదేవరాయల  ఆస్థాన అష్టదిగ్గజ కవుల్లో ఒకరైన అయ్యలరాజు రామభద్రుడు సంకలనం చేసిన ఓ గ్రంథంలో కుప్పాంబిక పద్యం ఒకదాన్ని  పేర్కొనడాన్ని పరిశోధకులు గుర్తించారు.
       . బాల్యం నుంచి యవ్వనదశకు చేరుకున్న తనపై మన్మథుడు కురిపించే బాణాలు పెంచే మోహాన్ని తన స్నేహితురాళ్ళతో కూడా చెప్పుకోలేకపోవడం గురించి 13 వ శతాబ్దంలోనే  పద్య రూపంలో కుప్పాంబిక గొప్పగా రాశారు .
           అయ్యలరాజు సంకలనంలోని కుప్పాంబిక పద్యం ఇలా ఉంది   👇
   వనజాతాంబకుడేయు సాయకములన్ వర్జింపగా రాదు, నూ
తన బాల్యాధిక యౌవనంబు మదికిన్ ధైర్యంబు రానీయద
త్యనురక్తిన్ మి.ముబోంట్లకున్ దెలుప నాహా! సిగ్గుమైకోదు పా         
వన వంశంబు స్వతంత్రమీయదు చెలీ! వాంఛల్ తుదల్ముట్టునే
          ఇట్లా  16 వ శతాబ్దం నాటి మొల్ల....తాళ్ళపాక తిమ్మక్క....వీరిద్దరి కంటే రెండు వందల ఏండ్లకు ముందే కవిత్వం రాసిన కుప్పాంబికే తొలి తెలుగు కవయిత్రి .  ముఖ్యంగా తాళ్ళపాక తిమ్మక్క లేదా తాళ్ళపాక తిరుమలమ్మను తొలి తెలుగు కవయిత్రిగా తెలుగు సాహిత్యం  మొన్నటి వరకు పేర్కొనడం జరిగింది.వీరు తాళ్ళపాక అన్నమాచార్యుల వారిఇల్లాలు, మొదటి భార్య. ఈమె నన్నయ భారతము ఆధారముగా 1163 పాదాలతో సుభద్రా కల్యాణము అనే ద్విపద కావ్యము

✍️తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

ఆత్మకూరు

పూర్వ పాలమూరు జిల్లా 

Sunday, January 27, 2019

స్మరణీయులు

▪️బుడ్డా వెంగళరెడ్డి :(1822_1900)

పేద ప్రజల ఆశాజ్యోతి. ధర్మానికి మారు పేరు.  దాన గుణానికి నిజం పేరు. అపర అన్నపూర్ణగా  పేరు గడించిన కాపోళ్ళ ముద్దుబిడ్డ !వీరి గురించిన అనేక జానపద గాథలు అనేకం రాయలసీమ ప్రాంతంలో ప్రచారంలో ఉన్నాయి.1866 లో కర్నూలు ప్రాంతంలో సంభవించిన ' డొక్కల కరువు ' జన జీవనాన్ని అతలాకుతలం చేసింది. ప్రజలను  జీవకళేబరాలుగా మార్చిన ఈ కరువు రక్కసి వెంగళ్ రెడ్డిని తీవ్రంగా కలిచివేసింది.  తినడానికి తిండిలేక...తాగడానికి నీళ్ళులేక ...ప్రజలు అల్లల్లాడిపోతున్న ఈ పరిస్థితిలో వెంగళ్ రెడ్డి ఆపన్న హస్తమయ్యాడు. బతకాలన్న ఆశతో మట్టిని జల్లించుకు తింటున్న ప్రజలకు ఆపద్భాందవుడై తోడుగా నిలిచాడు.కండ కరిగి ఎముకల గూడుల్లా మరుతున్న ప్రజల కోసం తన సర్వస్వాన్ని ధారపోసాడు. ఎక్కడివాళ్ళక్కడ శవాల గుట్టలై పేరుకుపోతుంటే...ఆ దుస్థితిని తప్పించేందుకు తన ఆస్థి అంతా కరిగిపోగా అప్పుల చేయడం మొదలెట్టాడు. అట్లా మూడునెలలకు కరువు ప్రాంతాన్ని ఆదుకునే ప్రయత్నాన్ని నిష్కల్మషంగా కొనసాగించాడు.వీరి త్యాగనిరతిని గమనించిన అధికారులు విక్టోరియారాణి నేతృత్వంలో వెంగళ్ రెడ్డిని ప్రశంసిస్తూ 20 తులాల బగారు పథకాన్ని  బహుకరించారు. ఈ పథకం ముందు భాగంలో ఆంగ్లం లోనూ...వెనక భాగంలో తెలుగులోనూ...వీరి గొప్పతనం గురించి రాయబడి వున్నది.వీరి స్వస్థలం కర్నూలు జిల్లా కోవెలకుంట్ల పక్కలో ఉన్న ఉయ్యాలవాడ గ్రామం. వీరి తండ్రి నల్లపరెడ్డి.తల్లి వెంకమ్మ.


▪️ఉయ్యాలవాడ నరసింహ్మారెడ్డి : (వీరి జననం గురించి ఇతమిద్దమైన కాలం తెలియదు.మరణం 1847 )

1857  మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధానికి పదేళ్ళ ముందే, బ్రిటిషు దుష్టపాలనపై  తెగువతో ఆత్మాభిమానంతో అచంచలమైన దేశభక్తితో ఎదిరించి తిరుగుబాటు చేసిన అచ్చ తెలుగు  రెడ్డి బిడ్డ ! 1846 జూన్ నెలలో మొదలైన నరసింహారెడ్డి తిరుగుబాటు 1847 ఫిబ్రవరిలో ఆయన మరణంతో ముగిసింది. వీరి మరణం ఉరి ! దేశం కోసం...తనను నమ్మిన ప్రజల కోసం పోరాటం ప్రాణత్యాగం చేసిన ఉయ్యాలవాడను కొందరు వ్యతిరేకులు దొంగగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాని వేలాది ప్రజల క్షేమం కోసం మేల్కొన్న ఈ వీరుడు భారతమాత ముద్దుబిడ్డ.! భారతీయుల సొమ్మును  ఆంగ్లదొరల నుండి లాక్కుని తిరిగి భారతీయులకే పంచి పెట్టిన ఘనాపాటి !రాయలసీమలో రాయలకాలం నుండి పాలెగార్ లు ప్రముఖమైన స్థానిక నాయకులుగా ఉండేవారు.స్థానికంగా వీళ్ళు అధికారాల్ని కలిగి ఉండేవాళ్ళు. సంఘంలో వీరిది గౌరవ స్థానం. అట్లాంటి వారిలో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి ఒకరు. కంపెనీ దొరతనము ఎదిరించి వీరమరణం పొందిన రెడ్డి జాతి వజ్రకిరీటం.. ఈయన పాలెగార్ మనవడు.వీరిగురించిన అనేక జానపద కథలు...పాటలు ...రాయలసీమ ప్రాంతంలో బహుళ ప్రచారంలో ఉన్నాయి. వీరి స్వస్థలం కర్నూలు జిల్లా రూపనగుడి. వీరి తండ్రి పెద మల్లారెడ్డి

▪️గోన గన్నారెడ్డి (1262-1296)

తెలంగాణ పేరు చెప్పగానే గుర్తుకువచ్చే పౌరుషాగ్ని కాకతీయ రుద్రమ ! ఈ రుద్రమ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే   సింహగర్జన  గోన గన్నారెడ్డి.శక్తికి మారుపేరు.యుక్తికి అస్సలు పేరు. యుద్ద తంత్రం తెలిసిన వీర ఖడ్గం. పాలనా మంత్రాంగం తెలిసిన రాజకీయ రథచక్రం. ఇతడి చూపులే నిఘా నేత్రాలు. ఇతడి మెదడే మహా నిఘంటువు. వీరి తండ్రి గోన బుద్దారెడ్డి.ఇతడు రుద్రమదేవి తాతగారు రుద్రదేవుడికి సామంతరాజు.వివరాల్లోకి వెళ్తే రుద్రదేవుడు పాలమూరు పాలిస్తున్న  'కందూరు ' చోడులను ఓడించి  అక్కడ బుద్దారెడ్డిని  రాజుగా నియమించాడు. అతడు వర్తమానపురం బుద్దాపురంలను  జనరంజకంగా పాలించాడు. అయితే సంతానం లేని బుద్దారెడ్డి కి 50 ఏండ్ల వయసులో సంతానం కలుగుతుంది. వీళ్ళే తొలి తెలుగు కవయిత్రి కుప్పాంబిక....గోన గన్నారెడ్డి...విఠల్ రెడ్డి. కాని వయసు పైబడటంతో పిల్లల భవిష్యత్తు అతడ్ని భయపెడుతుంది.అప్పుడు తన తమ్ముడు లకుమారెడ్డి కి పిల్లల భాద్యత అప్పగించి తృప్తిగా కళ్ళు మూస్తాడు. దుర్మార్గుడైన లకుమారెడ్డి  సింహాసనం మీద కన్నేస్తాడు.కాలక్రమంలో గణపతిదేవుడు రాజ్యాన్ని రుద్రమకు అప్పగించినప్పుడు....విద్యాభ్యాసానికై  ఓరుగల్లు చేరిన గన్నారెడ్డి , ఆమెకు నమ్మిన బంటుగా మారుతాడు.ఆమె చేసిన ఎన్నో యుద్ధాల్లో తనదైన పాత్రను పోషించి ఆమె గెలుపుకు కారకుడవుతాడు. రుద్రమతో సమానమైన తెలివితేటలకు ....యుద్దనైపుణ్యానికి...అపర చాణిక్యానికి... గన్నారెడ్డి తిరుగులేని సారథి.రుద్రమ చొరవతో తన రాజ్యాన్ని తిరిగి దక్కించుకున్న  రాజనీతిజ్ఞుడు. వీరి రాజ్యం వర్థమానపురం.... ప్రస్తుతం నాగర్ కర్నూల్ పక్కన వున్న నందివడ్డేమాన్. ఒకప్పటి వర్థమానపురమైన  ఈ నందివడ్డేమాన్ చరిత్ర ఈ విధంగా ఘనమైనది.

✍️తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

ఆత్మకూరు

పూర్వ పాలమూరు జిల్లా 

స్మరణీయులు

▪️కె.వి. రెడ్డి (1912_1972)

 వీరి పూర్తి పేరు కదిరి వెంకటరెడ్డి. వీరు అనంతపురం జిల్లా తాడిపత్రి వాస్తవ్యులు.
దర్శకుడుగా  నిర్మాతగా రచయితగా
సినిమా పరిశ్రమకు ఎనలేని కీర్తిని అపాదించి
'దర్శకులపతి ' గా మిగిలిపోయిన ఘనుడు.

▪️రావి నారయణరెడ్డి : (1908_1991)

ప్రజాసేవకు  జీవితాన్ని ధారపోసిన  కమ్యూనిస్టు యోధుడు.సాయుధ పోరాట సమర సేనాని. 7 వ నిజాం ప్రభువు ఉస్మాన్ అలీ ఖాన్ కు వ్యతిరేకంగా  పోరు జెండా ఎత్తి మట్టి మనుషుల మహాసంగ్రామాన్ని నడిపిన ధీశాలి!
నల్గండ జిల్లా భువనగిరి తాలూకా బొల్లేపల్లి వీరి స్వస్థలం.

▪️సురవరం ప్రతాపరెడ్డి (1896_1953)

'గోలుకోండ 'పత్రికతో నిజాం ను వణికించిన నిప్పుకణం.తెలంగాణ గుండె కోతను అక్షరమై వినిపించిన ప్రజా బంధువు .ఆత్మగౌరవ పతాక. సాహితీ మహోన్నత శిఖరం .వీరు పూర్వ  మహబూబ్ నగర్ జిల్లా గద్వాల సంస్థానం ఇటిక్యలపాడు వాస్తవ్యులు.

▪️రాజ బహదూర్ వెంకటరామిరెడ్డి(1869_1953)

ఎందరో జాతి రత్నాలను దేశానికి అందించిన  ' రెడ్డి వసతి గృహం....' వ్యవస్థాపకుడు. ఇస్లామిక్ నిబంధనలతో ఉన్న నిజాం సంస్థానంలో ' కొత్వాల్ అఫ్ హైదరాబాద్ ' గా  కొనసాగిన
శక్తిశాలి.పూర్వ మహబుబ్ నగర్ జిల్లా వనపర్తి సంస్థాన రాణిపేట వీరి స్వగ్రామం.

▪️కొండా వెంకట రంగారెడ్డి (1889_1970)

స్వాతంత్ర్య సమర యోధుడు. సంయుక్త
ఆంధ్రప్రదేష్ తొలి తరం రాజకీయ నాయకుడు.వీరి పేరు మీదే ఇప్పటి 'రంగారెడ్డి   ' జిల్లా ఏర్పడింది.హైదారబాద్ జిల్లా పెద్ద మంగళారం వీరి స్వస్థలం.

▪️జార్జిరెడ్డి (1947_1972)

తెలంగాణలో విప్లవ వాద విద్యార్థి సంఘానికి నాయకుడు.ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తొలితరం ఉద్యమ రథసారథి. ఇండియన్ చెగువేరాగా ప్రసిద్ది పొందాడు. వీరి తండ్రి రఘునాథరెడ్డి చిత్తూరు వాస్తవ్యులు.వీరి తల్లి గారిది కేరళ రాష్ట్రం.

▪️డా.సి. నారయణరెడ్డి (1931_2017)

అత్యున్నత జ్ఞానపీఠ పురస్కారాన్ని అందుకున్న సాహిత్య మహోన్నత పర్వతం. సాహిత్యమే జీవితంగా బతికిన గురుతుల్యులు.ఆచార్యులుగా ఉద్దండుల్ని తయారు చేసిన నిత్య చైతన్య స్రవంతి.వీరి స్వస్థలం కరీం నగర్ జిల్లా హనుమాజీ పేట.

▪️బద్దం ఎల్లారెడ్డి (1906_1979)

తెలంగాణ సాయుధ పోరాటంలో రగల్ జెండా ఎత్తాడు.భూస్వామ్య కుటుంబంలో జన్మించినప్పటికీ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం శ్రమించాఢ్.కరీం నగర్ జిల్లా గాలిపల్లి వీరి స్వస్థలం.

✍️తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

ఆత్మకూరు

పూర్వ పాలమూరు జిల్లా 

వర్ణమాలలో రెడ్డి

రెడ్డి ఆణిముత్యాలు
°°°°°°°°°°°°°°°°°°°°సేకరణ :తంగెళ్ళశ్రీదేవిరెడ్డి
39: డా.బెజవాడ గోపాలరెడ్డి (7-81907 - 9-3- 1997
అతడు 
నిరాడంబరుడు....!
స్వచ్ఛంగా నిగర్వి..... !
తరతరాలు గుర్తుంచుకునే స్వాతంత్ర్య సమర సేనాని ....!
అడుగుజాడై నిలిచిన సారస్వత వారసత్వం.... !
తిరుగులేని రాజకీయవేత్త.... !
పదకొండు భాషల్లో ప్రావీణ్యం సంపాదించుకున్న ప్రతిభాశాలి ...!
అన్నింటికీ మించి ధీశాలి !!
           రాజకీయం అంటే పదవులు పొంది మిన్నకుండటం కాదు.... అంకిత భావంతో  బాధ్యతలను నిర్వర్తించడమే అని క్రమశిక్షణతో  చాటి చెబుతూ....  పరిపాలనాదక్షుడుగా వివిధ హోదాల్లో  తనదైన ముద్ర వేసిన గోపాలరెడ్డి,
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంగ్రామంలో జన్మించాడు. వీరి తండ్రి పట్టాభిరామిరెడ్డి, తల్లి సీతమ్మ.
          శాంతి నికేతన్ లో  1924-27  ప్రాంతంలో విశ్వకవి  రవీంద్రనాథుడి  కవిత్వానికి ఆకర్షితుడు అయ్యాడు. కవీంద్రుడే ఆదర్శంగా తన కలానికి పదును పెట్టాడు.అప్పటికి దేశంలో జతీయోద్యమ తీవ్రత బలంగా ఉన్నది. ఈ  క్రమంలో
ఒక చేత్తో  జాతీయోద్యమం....రెండో చేత్తో సాహితీసేద్యం  గోపాలరెడ్డిని పరిపూర్ణంగా తీర్చిదిద్ద గలిగాయి.   జాతీయోద్యమంలో పాల్గొని చెరసాల జీవితం  కూడా గడిపాడు. ఇక్కడ జీవిత పాఠాలు బాగా ఒంటబట్టించుకున్నాడు. ఆ తర్వాత చురుకైన యువకుడిగా రాజాజీ మంత్రివర్గంలో సంయుక్త  మదరాసు రాష్ట్రంలో మంత్రి అయ్యారు.
       వీరి వివాహం  తిక్కవరపు రామిరెడ్డిగారి కుమార్తె లక్ష్మీకాంతమ్మతో జరిగింది. వారికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
      పదవులు వీరిని వెదుక్కుంటూ రాగా.... కర్నూలు రాజధానిగా ఏర్పడిన ఆంధ్రరాష్టానికి  1955లో ముఖ్యమంత్రిగా అతి పెద్ద బాధ్యతను భుజస్కంధాల మీద వేసుకున్నారు.  1956లో విశాలాంధ్ర ఏర్పడినపుడు హైదరాబాదు రాజధానిగా ఉపముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇంట గెలిచాక రచ్చ గెలిచిన తీరున  1956  తర్వాత  జవహర్‌లాల్ నెహ్రూ సారధ్యంలో  రెవిన్యూ మంత్రిగా  చేశారు. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖను నిర్వహించారు. ఆ తర్వాత ఐదేళ్ళపాటు ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా వ్యవహరించారు. 186 నెలలు నిర్విరామంగా వివిధ రాజకీయ పదవులు నిర్వహించారు.  
         వీరి సాహితీ ప్రస్థానాన్ని గమనిస్తే సాహితీ రంగంలో వీరు ఉద్దండులు . 1946లో  తెలుగుభాషా సమితి అధ్యక్షులుగా  నియమించబడ్డారు. ఇక్కడ అక్షరానికి అదనపు గౌరవం దక్కేలా కృషిచేశారు.  1957 నుండి 1982 వరకు ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీకి అధ్యక్షులుగా 25 సంవత్సరాలు  పనిచేశారు. ఇది వీరి జీవితంలో ఒక గొప్ప కీర్తి బావుటా ! 1963 -71వరకు  ఎనిమిదేళ్ళు జ్ఞానపీఠ అధ్యక్షులుగా విశిష్ట సేవలు అందించారు. 1978 నుండి కేంద్ర సాహిత్య అకాడమీ కార్యనిర్వాహక సభ్యులుగాను కొనసాగారు.
            రాజకీయం చేతిలో ఖడ్గం అయితే.... సాహిత్యం తలమీద కిరీటంగా బతికిన గోపాల్ రెడ్డి  తన జీవిత కాలంలో రవీంద్రుని గ్రంథాలను తెలుగులోకి అనువదించడం ఒక యజ్ఞంలా సుదీర్ఘంగా కొనసాగింది. అట్లా ఒక అనువాద రచయితగా ముద్ర పడిపోయారు. కాగా అక్షరాలు ఒద్దికగా కూర్చడం అలవాటు అయిన గోపాల్ రెడ్డి, తన
డెబ్బయివ ఏట స్వతంత్ర రచనలు మొదలుపెట్టారు. ఈ  నేపథ్యంలో  1978లో తొలి స్వీయ కవితాసంపుటి వెలువరించారు.
❤ ఆమె/ఆమె జాడలు/ఆమె నీడలు/ఆమె తళుకులు/ ఆమె చెరుకులు/ గా ఆమె పంచకం వెలువరించిన గోపాల్ రెడ్డి సాహిత్యం   అత్యంత సున్నితమైనది  మృదు భావ సహితమైనది.  చెప్పాలంటే వీరి రచన ఒక పూబాల....!      కాలవాహిని/ సాహిత్య సుందరి / వచనకవితా సంపుటాలుకూడా వీరు  ప్రకటించారు. వీరి '' ఆమె నవ్వింది'' రచన ఒక అద్వితీయ ప్రయోగం. 
       ఇట్లా సాహితీ రాజకీయ రంగాలలో తనకంటూ  తిరుగులేని విశిష్ట స్థానాన్ని సంపాదించుకొని 90 వసంతాల   నిండు జీవితాన్ని గడిపిన  ఒక పరిపూర్ణ   వ్యక్తి  మన  గోపాలరెడ్డి!  20 వ శతాబ్ది  మొదటి పాదంలో  జన్మించి చివరి వరకు జరిగిన అన్ని సామజిక సాంకేతిక రాజకీయ ఆర్థిక  నాగరిక పరిణామాలు అన్నిటినీ దర్శించగలిగాడు. తన జీవితాన్ని ముందు తరాలకు ఆదర్శంగా తీర్చిదిద్దుకో గలిగాడు. తానే ఒక పుస్తకంగా తన మస్తిష్కాన్ని పదును పెట్టుకోగలిగాడు.

కోళ్ల పందాలు

కోళ్లు కాదు కొదమ సింహాలే
°°°°°°°°°°°°°°°°°°వివరణ*తంగెళ్ళశ్రీదేవిరెడ్డి
కుక్కుటశాస్త్రం... !
ఇది కోళ్ల పందాలు గురించి వివరిస్తున్నది. ఈ శాస్త్రం ప్రకారం జాతిని బట్టి పందెం కోళ్లు ఆరు రకాలు. అవి 👇
1-సితావా
2-డేగ
3-నెమలి
4-కాకి
5-పర్ల
6-రసంగి
వీటిలో ఏ జాతి కోడి మరే జాతిపై ఉసిగొల్పితే విజయం వరించి తీరుతుందో శాస్త్రం స్పష్టంగా తెలియజెప్తుంది. పందెం రాయుళ్లు ఆ ప్రకారమే కోళ్ల జాతిని కొట్లాటకై ఎంపిక చేసుకుంటారు. జాతి ఆధారంగా కోళ్ల రంగులు కూడా ఉంటాయి.
   కోళ్ల పందాలు కూడా మూడు రకాలు. అవి 👇
1-కత్తికట్టి పందెం
2-విడికాలు పందెం (డెంకీ పందెమ్)
3-ముసుగు పందెం (  ఈ పద్దతిలో
ఎవ్వరు ఏ కోడిని తెస్తారో ఎవ్వరికీ తెల్వకుండా ముసుగు వేసి తెస్తారు.బరిలో కోడిని ఒదిలేదాకా ఎవరిది  ఏ కోడోఎవ్వరికీ  తెలియదు )
ఎవ్వరి వీలును బట్టి వాళ్ళు పందెం పద్దతిని ఎంపిక చేసుకుని అనుసరిస్తారు.
    సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు, ఈ శాస్త్రం ప్రకారం పందెం రాయుళ్లు పుంజుల్ని సవరిస్తారు. నువ్వా నేనా అంటూ వినోదం ముసుగులో కదనభూమిని సృష్టిస్తారు.పుంజుల తరుపున తామే మీసం మెలివేస్తారు. తొడలు చరుస్తారు. ప్రేక్షకుల వెన్ను జలదరింపజేస్తారు. లక్షలు చేతులు మారేలా బెట్టింగుల పేరుతో వాతావరణాన్ని వేడిక్కిస్తారు.
     అవును ! ఇదంతా కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండగ వేళా షరా మాములుగా కనిపించే అంశం ! ప్రభుత్వం జారీచేసే నిషేదాజ్ఞలు ఇక్కడ బేఖాతరు అవుతాయి. రాజకీయ నాయకుల  బడా బాబుల జోక్యం ప్రత్యక్షంగా వేడి పుట్టిస్తుంది.
    కోళ్ల కాళ్లకు కత్తులు కట్టి ' సై 'అంటూ ఉసిగొల్పగానే అవి కొదమసింగాలై పోరు మొదలెడతాయి. ఎవ్వరి పుంజు గెలుస్తుందో చివరి వరకు కూడా అర్థం కాక, పందెం రాయుళ్లు లోలోపలే బెంబేలు ఎత్తిపోతుంటారు. ప్రేక్షకుల ఈలలు చప్పట్లు అరుపులు ఇవన్నీ పౌరుషాన్ని రగిలిస్తుంటాయి.
    ఓడిపోయిన కోడిని "కోజ " (కోశ ) అంటారు. ఇది సంబంధిత పందెంరాయుడికి పెద్ద అవమానం. ఈ క్రమంలో ఘర్షణలు సైతం అనివార్యం అవుతున్నాయి.చెప్పాలంటే కోడి పందెం ఒక పరువు... ఒక ప్రతిష్ట... ఒక కీర్తి... ఒక కిరీటం ! అందుకే గెలుపు కోసం అహర్నిశలు శ్రమిస్తూ కోళ్లకు శిక్షణ అందిస్తారు. లక్షలు ఖర్చు పెడుతూ బలమైన పౌష్టికాహారం సమకూరుస్తారు. ఈ నేపథ్యంలో కోళ్లకు వైద్య చికిత్సలు చేయిస్తారు. బలం శక్తి కోసం మాత్రలు ఇస్తారు.
అయితే పందానికి కొన్ని రోజుల ముందు కోళ్లకు తిండిని తగ్గిస్తారు. ఆకలితో కసిని రేకెత్తిస్తారు.
    పందానికి ముందు సమయం, తిథి, నక్షత్రం, చూసుకుంటారు.అవిఘ్నం కోసం గణపతిని పూజిస్తారు. దృష్టి దోషాల నివారణ కోసం నల్ల కోడిని బలిస్తారు.
    ఇటీవల కాలంలో కోడి పందాలు సంప్రదాయం ఇతర ప్రాంతాల్లోను మొదలైనప్పటికీ కృష్ణ... ఉభయ గోదావరి జిల్లాల పైనే అందరి దృష్టి ఉంటుంది. మొత్తానికి కోళ్ల పందెం అంటే ఒక హిసాయుత జూదం ! మూగజీవాల అరణ్య రోదన !