(భారతీయ సినీ నేపథ్య గాయని)
•••••••••••••••••••••••••••••••
కోయిలకే స్వరాలు నేర్పించి...
మాటలతో మధురిమలు సృష్టించి..
శృతిలయలే ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసలుగా జీవించిన
ఏడు దశాబ్దాల స్వరాభిషేకం..
శిష్ట్లా శ్రీరామమూర్తి జానకి..!
భారతీయ సినీ నేపథ్య గాయనిగా ఎస్. జానకి గారిది ప్రత్యేకమైన స్వర చరిత్ర! ఆమెను అభిమానులు ప్రేమగా "గానకోకిల" అని పిలుచుకుంటారు. ఆమె తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు దాదాపు 17 భాషల్లో 50 వేలకు పైగా పాటలు పాడారు. స్వర వైవిధ్యం ఆమె స్వంతం. పసిపిల్లల గొంతు నుండి ముసలివారి గొంతు వరకు, ఎలాంటి పాత్రకైనా ఆమె తన స్వరంతో ప్రాణం పోయగలిగారు.
దండాలు సామి దండాలు
దండిగ తెచ్చాము దండలు పూలదండలు
ఎవ్వరికుంటది నీ గొప్ప మనసు
ఎవ్వరికి అది తెలవని దినుసు
దండాలు సామి దండాలు
దండిగ తెచ్చాము దండలు పూలదండలు
పాటలో..యవ్వన స్త్రీ, పురుష బాలిక,ముసలి,నాలుగు రకాల వైవిధ్యమైన గొంతుల్ని పలికించిన జానకి తీరు అత్యంత ఆశ్చర్యకరం.
🚩వివరాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా, రేపల్లె మండలం పల్లపట్ల గ్రామానికి చెందిన శిష్ట్లా శ్రీరామమూర్తి, సత్యవతి దంపతులకు 1938 ఏప్రిల్ 23 వ తేదీన జానకి జన్మించారు. శ్రీరామమూర్తి గారు ఉపాధ్యాయుడిగా, ఆయుర్వేద వైద్యుడిగా సేవలందించేవారు. ఆయన ఉద్యోగ బాధ్యతల రీత్యా కొంతకాలం కుటుంబంతో కలిసి తెలంగాణ సిరిసిల్లలో జీవించారు.
🚩సంగీత ప్రయాణం
మూడేళ్ల ప్రాయం నుంచే జానకి సంగీతం నేర్చుకున్నారు. బాల్యం నుండే వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.. నాదస్వర విద్వాంసులు పైడిస్వామి, మరికొందరు సంగీత విద్వాంసుల వద్ద ఆమె శాస్త్రీయంగా శిష్యరికం చేసి సంగీతంలోని ఒరవడులను వంటబట్టించుకున్నారు.
ప్రముఖ రంగస్థల నటుడు, నాటకాలలో హాస్య పాత్రలను పోషిస్తూ.. ఏకపాత్రాభినయ ప్రక్రియలో ఎన్నో ప్రయోగాలు చేసిన ప్రసిద్ధ 'ఫన్ డాక్టర్' వైద్యుల చంద్రశేఖరం గారు మొదట ఆమెకు ప్రోత్సాహం అందించారు. అతడు రంగస్థలంపై నటిస్తూ మధ్య మధ్యలో వేషం మార్చుకునే సమయంలో, ప్రేక్షకులకు ఉల్లాసం కలిగించడం కోసం ఆమెను ఒక పాట పాడించేవారు. లతా మంగేష్కర్ సుశీల వంటి ప్రముఖ గాయనీమణులు ఆలపించిన సినిమా గీతాల్ని ఆమె విరామ సమయంలో పాడేది. ఆమె పాట పూర్తయ్యేలోపు అతడు వేషం మార్చుకొని వేదిక మీదికి వచ్చేవాడు. ఈ విధంగా కొన్నాళ్లు గడిచాక చంద్రశేఖరం గారి కుమారుడు రాంప్రసాద్ గారు జానకిలో అసాధారణ ప్రతిభను గుర్తించాడు.
"ఆమె నాటక విరామ సమయంలో ప్రేక్షకుల వినోదం కోసం ఒకటి అర పాటలు పాడేది కాదని.. భారతీయ చలనచిత్ర సీమకు అవసరమైన గాయని అని.." భావించాడు. ఇదే ఆమె జీవితాన్ని చారిత్రాత్మక మలుపు తిప్పింది.
కొడుకు రాంప్రసాద్ సలహా మేరకు చంద్రశేఖర్ గారు మద్రాస్ ఏవిఎం స్టూడియోకి తన దగ్గర ప్రతిభావంతురాలైన ఒక గాయని ఉన్నట్టుగా ఉత్తరం రాశారు. ఆవిధంగా ఆమె తన 19వ ఏట 1957లో సినీ ఇండస్ట్రీకి కేంద్ర బిందువైన మద్రాస్ నగరంలో అడుగుపెట్టారు. అక్కడ ప్రతిష్టాత్మక 'ఏవిఎమ్ స్టూడియో' లో గాయనిగా 'విధియిన్ విలయాట్టు' అనే తమిళ సినిమాతో తన కెరీర్ ను ప్రారంభిస్తూ తొలి అవకాశాన్ని దక్కించుకున్నారు.ఈ తర్వాత ఆమె మకాం శాశ్వతంగా చెన్నైకి మారడమే కాకుండా, భారతీయ సినీ సంగీత చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయానికి నాంది పలికింది. కాలక్రమంలో గాయనిగా..స్వర కర్తగా.. తనకంటూ ఒక ప్రత్యేకతని సంపాదించుకున్నారు.
ఎస్. జానకి గారు తమ ఏడు దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, పి. బి. శ్రీనివాస్, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఏ. ఎమ్. రాజా, కే. జే. యేసుదాస్,రాజ్‌కుమార్ (కన్నడ నటుడు/గాయకుడు), మనో (నాగూర్ బాబు),హరిహరన్, ఉదిత్ నారాయణ్, ఎస్. పి. చరణ్ వంటి మూడు తరాలకు చెందిన దిగ్గజ గాయకులతో కలిసి వేలాది అద్భుతమైన గీతాలను ఆలపించారు.కేవలం మగ గాయకులతోనే కాకుండా పి. సుశీల, వాణీ జయరామ్, ఎల్. ఆర్. ఈశ్వరి వంటి సమకాలీన మహిళా గాయనీమణులతో కలిసి కూడా జానకి గారు ఎన్నో పాటలు, భక్తి గీతాలు జానపదాలు పాడారు.
🚩నివాసం
కొంతకాలం క్రితం శంషాబాద్ శ్రీశైలం రోడ్డులో ఓ విల్లా కొని, అక్కడే కొన్నాళ్ళు నివసించారు. ఇక్కడి నుండే ఆమె హైదరాబాద్ రవీంద్రభారతి, త్యాగరాయగానసభ, శిల్పకళావేదిక, తెలుగు విశ్వవిద్యాలయం,ఎన్టీఆర్ కళామందిరంలో జరిగిన అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
🚩పురస్కారాలు- తిరస్కారాలు
'దక్షిణ భారతదేశ నైటింగేల్'గా ' జానకి అమ్మ' గా
గౌరవించబడిన జానకి గారు అనేక సత్కారాలు సన్మానాలు పొందారు.ముఖ్యమైన కొన్ని గౌరవలను గమనిస్తే...
•4 జాతీయ చలనచిత్ర పురస్కారాలు అందుకున్నారు.
•కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, వంటి రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలను 28 గెలుచుకున్నారు.
•1997 లో ఫిల్మ్‌ఫేర్ దక్షిణ జీవిత సాఫల్య పురస్కారం పొందారు.
•మైసూరు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు
•తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నుండి కళైమామణి పురస్కారం అందుకున్నారు.
•కర్ణాటక ప్రభుత్వం నుండి రాజ్యోత్సవ ప్రశస్తి పురస్కారం & డాక్టర్ రాజ్‌కుమార్ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు.
•నంది అవార్డులతో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాల గౌరవాలను అందుకున్నారు.
•2013లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ అవార్డును, దక్షిణాది కళాకారులకు తగిన గుర్తింపు లభించడం లేదని ఆమె సున్నితంగా తిరస్కరించారు.
🚩జానకి ఎవర్ గ్రీన్ సాంగ్స్
జానకి అమ్మ పాడిన వేలాది పాటల్లో నేటికిని శ్రోతలను అలరిస్తున్న పాటలు ఎన్నో ఉన్నాయి. మచ్చుకు కొన్ని పాటలు ...
*సిరిమల్లె పువ్వా...
(పదహారేళ్ల వయసు -1978 )
*గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రనా.. ఎందువలన?
(సప్తపది 1981))
*ఆకాశం ఏనాటిదో..
(నిరీక్షణ -1982)
*మౌనమేలనోయి...
( సాగర సంగమం -1983)
*తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు...
( శ్రీ వారికీ ప్రేమలేఖ -1984)
*కుకుకూ కోకిల రావే...
(సితార - 1984)
వయ్యారాలు సింగారాలు...
(అగ్ని పర్వతం -1985)
*ఈ దుర్యోధన దుశ్శాసన...
(ప్రతిఘటన -1985)
*కీరవాణి చిలకలా ..( అన్వేషణ - 1985)
*అరె ఏమైంది ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరింది...
(ఆరాధన 1987)
*యమహో నీ యమ యమ అందం...
జగదేకవీరుడు అతిలోకసుందరి (1990)
తెలంగాణ సాంస్కృతిక సారథి, ప్రముఖ కవి, రచయిత మామిడి హరికృష్ణ గారు ఆమె పాడిన పాటల పాటల పల్లవులను కవితాత్మకంగా వాడుతూ రాసిన విధానం చదువరులను పాత మధురాల్లోకి తీసుకెళ్తుంది.
ఒక పడమటి సంధ్యా రాగం!
నీలి మేఘాలలో గాలి కెరటాలలో
ఆమె పాడిన పాట ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉంది..
పగలే వెన్నెలను మరపించి
మేఘమా దేహమా మెరవకే ఈ క్షణం అని
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచిన ఆమె
మనసు పలికే మౌన గీతం ఆలాపించి
ఏకాంత వేళా ఏకాంత సేవలు చేసి
ముద్దుగారే యశోద ముంగిట
జిలిబిలి పలుకులు చిలిపిగ పలికింది..
అందాలలో అహో మహోదయాన్ని
స్వాతి ముత్యపు జల్లులలో తడిపేసి
గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన సందేహాలను గొంతు నిండా పులిమింది...
ఆ తూరుపు ఈ పశ్చిమం సంగమించిన ఈ శుభవేళ
ఆకాశంలో ఆశల హరివిల్లులు పూయించి
నెమలికి నేర్పిన నడకలకు
ఎదలో లయను కలిపి
ఘల్లు ఘల్లున గుండెను జల్లనిపించింది...
అలక పానుపు ఎక్కిన చిలిపి గోరింకను
మౌనమేలనోయి ఈ మరుపు రాని రేయి అని మందలించి
చుక్క లాంటి అమ్మాయికి సిరిమల్లె పువ్వు అందించింది...
అందుకే, ఆకాశం ఏనాటిదో
ఆమె స్వరం ఆనాటి నుండి ఎదిగింది...
ఈ దుర్యోధన దుశాసన దుర్వినీత లోకాన్ని
మాటే మంత్రంగా మనసే బంధంగా మారింది..
🚩గాయనిగా విరమణ
2016 లోనే ఇకపై సినిమాలు, కచేరీలలో పాడబోనని అధికారికంగా ప్రకటించి, గాన ప్రస్థానానికి విరామం ఇచ్చారు. ఆమె తన 60 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు పలుకుతూ, చివరిగా 2016 లో '10 కల్పనకళ్' అనే మలయాళ చిత్రంలో "అమ్మా పూవినో ప్రాణనాయ్" అనే జోలపాట పాడారు.
🚩 కుటుంబం
జానకి గారిది ప్రేమ వివాహం. తన కెరీర్‌ను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన 'ఫన్ డాక్టర్' వైద్యుల చంద్రశేఖరం గారి కుమారుడైన రాంప్రసాద్ గారినే ఆమె 1959లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు.
1959లో వీరి వివాహం జరిగింది.. ఈ దంపతుల ముద్దుల కొడుకు - మురళీకృష్ణ ! జానకి ఒక గాయనిగా ఉన్నత స్థానానికి ఎదిగి, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం వెనుక ఆమె భర్త, అత్త, సహకారం..ప్రోత్సాహం.. ఎంతో ఉన్నాయి.
అత్తగారు శకుంతలాబాయి జానకి అవకాశాలకు
ఎటువంటి ఇబ్బంది రాకుండా ఇంటిని, మనవడి బాగోగులని చూసుకునేది. జీవితం హాయిగా సాగిపోతున్న తరుణంలోనే 1997లో రాంప్రసాద్ గారు కాలం చేశారు.
కొడుకు మురళీకృష్ణ..భరతనాట్యం కళాకారుడు. శ్రుతిలయలు, వినాయకుడు, మల్లెపువ్వు వంటి చిత్రాల్లో నటించారు. వీరికి మలయాళం, కన్నడ భాషలపై మంచి పట్టు ఉన్నది.మలయాళంలో సురాజ్ వెంజరమూడు హీరోగా రూపొందిన
'కూలింగ్ గ్లాస్ ' చిత్రానికి కథను అందించారు.
ప్రముఖ కూచిపూడి, భరతనాట్యం రెండింట్లోనూ నిష్ణాతురాలు..దూరదర్శన్ 'ఏ' ఆర్టిస్టు..ప్రతిష్టాత్మక 'కలైమామణి' అవార్డు పొందిన కళాకారిణి.. ఉమ గారిని మురళీకృష్ణ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు అమృతవర్షిణి,అప్సర, అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కాగా పెద్ద కుమార్తె అమృతవర్షిణి 2023లో మరణించింది(?)ఈ విషాదం తడి ఆరకముందే 2026 జనవరిలో అనారోగ్యంతో బాధపడుతూ కర్ణాటక రాష్ట్రం మైసూరులో మురళీకృష్ణ మరణించారు. మరణించేనాటికి భార్య ఉమాతో విడిపోయి ఉన్నారు.
🚩 మూగబోయిన స్వరం
సినీ సంగీత సామ్రాజ్యంలోనే కాకుండా ప్రైవేటుగా భక్తి ఆధ్యాత్మిక గీతాలు.. జానపద గేయాలు ఆలపించిన జానకి గారు..11 జులై, 2026 న గుండెపోటుకు గురై మైసూర్ ఆసుపత్రిలో
కాలధర్మం పొందారు.
సమాచారం : డా. తంగెళ్ళ శ్రీదేవిరెడ్డి