Monday, April 15, 2024

సురవరం ప్రతాపరెడ్డి

సురవరం ప్రతాపరెడ్డి 
( తెలంగాణ వైతాళికుడు )
(మే 28, 1896 - ఆగస్టు 25, 1953). 
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
వ్యాసకర్త : తంగెళ్ళశ్రీదేవిరెడ్డి 

సంఘ సంస్కర్తగా, పత్రికా సంపాదకుడుగా, రాజకీయ నాయకుడుగా, కవిగా, పరిశోధకుడుగా, పండితుడుగా, కథకుడిగా, నాటకకర్తగా, విమర్శకుడిగా, బహుభాషావేత్తగా, బహుముఖీయ ప్రజ్ఞ కలిగిన వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి !

👉షోరాపురమే సురవరం -

సురవరం వారి ఇంటి పేరు మొదట ''ఏమిరెడ్డి' వారు. 300 సంవత్సరాల క్రితం గుల్బర్గా దగ్గర ఉన్న షోరాపూర్ ప్రాంతం నుండి జీవనోపాధి కోసం వలస పూర్వ పాలమూరు జిల్లాకు వచ్చారు. ఇట్లా వీరి వంశస్తులు కొందరు వట్టెం గ్రామంలో, మరికొందరు ఇటిక్యాలపాడులో స్థిరపడ్డారు. షోరాపూర్ నుండి వచ్చిన ఏమిరెడ్డి వారిని స్థానికులు షోరాపురం వారుగా వ్యవహరించారు. ఈ షోరాపురమే కాలక్రమంలో జన వ్యవహారంలో సూరాపురం వారుగా వాడుకలోకి వచ్చింది. షోరాపురం సంస్థానాన్ని మొదటి నుండి కూడా తెలుగు ప్రజలు సురపురంగా పిలవడం పరిపాటి. ఇట్లా ఏమిరెడ్డి
వారు సురపురం నుండి సురవరంగా మారిపోయింది. కాగా ఏమిరెడ్డి ఎవ్వరు అని ప్రశ్నించుకుంటే వాళ్ళ వంశంలో గొప్పగా బతికి
కీర్తి ప్రతిష్టలు తెచ్చుకున్న పూర్వీకుల్లో ఒకరుగా 
భావించబడుతున్నారు. 

👉 సురవరం వారి జననము -

దుర్ముఖి నామ సంవత్సరం, అధిక జ్యేష్ట మాసం, బహుళ పాడ్యమి, 1896- మే నెల 28 నాడు బోరవెల్లి గ్రామంలో అమ్మమ్మ గారి ఇంట జన్మించారు. అక్కడే ఏడు సంవత్సరాలు వచ్చే వరకు ఉన్నారు.  
ప్రతాపరెడ్డి తల్లి రంగమ్మ. తండ్రి నారాయణరెడ్డి. తాత పాపిరెడ్డి, ముత్తాత అచ్చిరెడ్డి ( అచ్చన్న ). అచ్చన్న తండ్రిగారు షోరాపురం నుండి వలస వచ్చారు. 
ప్రతాపరెడ్డి మొదటి పేరు తాత గారి పేరైన పాపిరెడ్డి. కానీ ఎందుకో ప్రతాపరెడ్డిగా మార్చబడింది. 

👉విద్యాభ్యాసం -

పడిన ప్రతిసారీ లేచి నిలబడాలి సంకల్పానికి సురవరం వారి చదువు గొప్ప ఉదాహరణ. 

వీరి మొదటి గురువు తండ్రి నారాయణరెడ్డి గారే. తండ్రి వద్ద ఎక్కాలు, పెద్దబాలశిక్ష పూర్తి చేశారు.
1904 లో పినతండ్రి రామకృష్ణారెడ్డి చొరవతో కర్నూలు ఏ బి యమ్ మిషనరీ పాఠశాలలో నాలుగవ తరగతిలో చేరాడు. అప్పట్లో నాలుగో తరగతి కూడా పబ్లిక్ పరీక్షలు ఉండేవి. మన ప్రతాపరెడ్డి నాలుగోతరగతి బోల్తా కొట్టాడు. 1905లో మళ్ళీ నాలుగే చదివాడు. 
1906లో ఫస్టు ఫారంలో చేరాడు. 
1912లో స్కూల్ ఫైనల్ లో చేరాడు. కానీ లెక్కల పరీక్షలో బోల్తా కొట్టాడు. 1913 లో మళ్ళీ పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించాడు. 1913 లోనే హైదరాబాద్ నిజాం కళాశాలలో ఇంటర్లో ప్రవేశించి సైకాలజీ సబ్జెక్ట్ లో బోల్తా కొట్టాడు. 1917లో ఉత్తీర్ణత సాధించాడు. తర్వాత మద్రాసు వెళ్ళి బి. ఏ. లో చేరి 1920లో పట్టభద్రుడు అయ్యాడు. 1922లో ఎఫ్. ఎల్. పరీక్షకు చదివి, 1924లో బి. ఎల్. పట్టా పొందాడు. 

👉వివాహం -సంతానం -

ఆటుపోట్లను సుడిగుండాలను కల్లోలాన్ని తట్టుకుని నిలబడ్డ మహాసముద్రం సురవరం -

1916లోనే మేనమామ కూతురు పద్మావతిదేవితో ప్రతాపరెడ్డి వివాహం జరిగింది. వీరి వివాహం ఒక చిన్న గాధ ! పసితనంలోనే ఇద్దరికీ పెండ్లి చేయాలని పెద్దలు నామకరణం చేసుకున్నారు. కాగా పెళ్ళి సమయానికి ప్రతాపరెడ్డి తల్లికి వధువు పక్షం వారి పెట్టిపోతల విషయంలో అంగీకారం కుదరలేదు. అయినప్పటికీ ప్రతాపరెడ్డి వినిపించుకోలేదు. పద్మావతినే పెళ్లిచేసుకుంటానని పట్టుపట్టాడు.పద్మావతి కూడా ప్రతాపరెడ్డినే చేసుకుంటానని వర్తమానం పంపింది. ఇద్దరి మధ్య ప్రతాపరెడ్డి స్నేహితుడు వెంకటరెడ్డి సహాయకుడిగా నిలబడ్డాడు. అట్లా చిన్న చిన్న అడ్డంకులు వచ్చినప్పటికి ఇరువురి వివాహానికి చివరికి పెద్దలు ఒప్పుకోక తప్పలేదు. 

ప్రతాపరెడ్డికి మొత్తం పది మంది సంతానం. ఆరుగురు అబ్బాయిలు, నలుగురు అమ్మాయిలు.
అధిక సంతానం కారణంగా కాబోలు పద్మావతిదేవి ఆరోగ్యం 1938లో క్షిణించింది. దీనికి తోడు ఇద్దరు కుమారులు 1939లో ఒకరి తర్వాత ఒకరు మరణించారు. బిడ్డల మరణం ఆమెను మానసికంగా తీవ్రంగా కృశింపజేసింది. ఇది చాలదు అన్నట్టు కాలం మరింత కక్ష గట్టింది. 1944 లో ప్రతాపరెడ్డి ఆరోగ్యం దెబ్బతిన్నది. అయినప్పటికీ అన్నింటిని ఎదుర్కుంటూ మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిచాడు ధైర్యశాలి ప్రతాపరెడ్డి.

👉 గాంధీ సత్యాగ్రహ ప్రభావం -

మద్రాసులో చదువుకుంటున్న రోజుల్లోనే మహాత్మాగాంధీ సత్యాగ్రహ ఉద్యమం పట్ల ప్రతాపరెడ్డి ఆకర్షితుడు అయ్యాడు. అహింసా సిద్దాంతం, ఖద్దరు వస్త్రధారణ, మద్యపాన నిషేధం, సంస్కరణలని అణువణువునా ఒంటబట్టించుకున్నాడు. 
ఇదే దశలో చారిత్రక పరిశోధనాత్మక విమర్శనాత్మక వ్యాసాలు రాయడం మొదలెట్టాడు. పినాకిని - కళ - రెడ్డిరాణి మొదలుగు పత్రికల్లో వీరి వ్యాసాలు రావడం మొదలయ్యింది. 
ఇట్లా దేశ సేవ - సాహిత్య సేవా సంకల్పం ప్రతాపరెడ్డికి రెండు నేత్రాలుగా మారిపోయాయి. కానీ ఉద్యోగ కాంక్ష మాత్రం ప్రతాపరెడ్డిలో లేదు. చివరకు తాను చదివిన న్యాయవాద వృత్తిని కొనసాగించడం కూడా సురవరం వారికి ఆసక్తి లేదు. 

👉కులమతాలకు అతీతంగా -

కొత్వాల్ వెంకట్రామిరెడ్డి సూచనల మేరకు 1924లో రెడ్డిజన వసతి గృహానికి కార్యదర్శిగా పనిచేశాడు ప్రతాపరెడ్డి. తర్వాత యాదవ సంఘానికి - గౌడ సంఘానికి - ముదిరాజు సంఘానికి కార్యదర్శిగానూ పనిచేసి అరమరికలు లేకుండా సేవలు అందించాడు . 

👉 కాపులెవ్వరు? 

తెలుగు ప్రాంతాల్లో రెడ్లను వ్యక్తిగతంగా పిలవడంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో సంబోధన చేస్తారు. పటేలా, దొరా, రెడ్డీ, అని పిలుస్తారు. అదే రెడ్డి కులాన్ని చెప్పడంలో చాలా ప్రాంతాల్లో కాపోళ్ళు అంటారు. 

ఈ కాపుల గురించి రాజా సదాశివరెడ్డి, మెతుకు సంస్థానాధీశులు గొప్ప విమర్శనాత్మక రచనకు పూనుకుని మధ్యలోనే మరణించడంతో శేషభాగాన్ని సురవరం పూర్తి చేశారు. 
కాపులంటే రక్షకులు, సంరక్షకులు, కృషీవలురు ! కాపోళ్లుగా చెప్పే రెడ్ల కులాలు అందరూ ఒక్కటే ! పాకనాడు, పలనాడు, వెలనాడు, కమ్మనాడు వంటి రెడ్ల తెగలు మొత్తం మర్రిచెట్టు 
ఊడలు మఱ్ఱిచెట్టుకే సంబంధం వంటివి అని చెప్పాడు. ముఖ్యంగా రెడ్ల తెగలు ఆయా ప్రాంతాలను పనిని సూచిస్తాయి. కానీ ఈ కాలం రెడ్లు తమలో తాము శాఖల ఆధారంగా కృత్రిమ బేధాలని సృష్టించుకుని ప్రవర్తిస్తున్నారు అని కూడా చెప్పాడు. కాపులెవ్వరు అంటూ రెడ్ల పుట్టుక గురించి సశాస్త్రీయంగా రాసిన పుస్తకం ఇప్పటి వరకు ముద్రణకి నోచుకోలేదు. ముద్రణ అత్యవసరం. 

 👉గోలుకొండ పత్రిక స్థాపన -

1925లో గోలుకొండ పత్రిక స్థాపించాడు. ప్రజాహిత కార్యక్రమాలకు పత్రికా ప్రచురణ ప్రధాన ఆవశ్యకం కాబట్టి, ఇందుకోసం ఏడుగుగురు పెద్దమనుషుల నుండి ఏడువేల రూపాయల విరాళాలు సేకరించాడు. ఈ విరాళాలతో మద్రాసు వెళ్ళి ప్రచురణ యంత్రం, టైపు పెట్టెలు కొనుక్కొచ్చాడు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రతాపరెడ్డికి కొత్వాల్ వెంకట్రామిరెడ్డి తన సహకారం అందించాడు. 

మొదట్లో రెడ్డి హాస్టల్ భవనంలో పత్రిక ప్రారంభించాలనుకున్నాడు. కాగా పత్రిక పేరును మొదట #ఆంధ్రమాత అనుకున్నాడు. కానీ అందుకు అనుమతి లభించలేదు. అందుకే #గోలకొండ అని మార్పు చేయడంతో అనుమతులు లభించాయి. 

మొత్తానికి ద్వైవార పత్రికగా గోలుకొండ పత్రిక ట్రూప్ బజారులో ఒక చిన్న భవనంలో స్ధాపంచబడింది. మెదట్లో అంతంత మాత్రం నడిచింది పత్రిక.అంతే కాదు , ఆర్థిక పరిస్థితి కారణంగా కొన్నాళ్ల వరకు పత్రికను ఒంటిచేత్తో నడిపాడు. తానే సంపాదకుడుగా, ఉప సంపాదకుడుగా, ప్రూఫ్ రీడర్ గా, గుమస్తాగా, చప్రాసీగా మేనేజరుగా వ్యవహరించాడు. 
ఇటువంటి పరిస్థితుల్లో భార్య అనారోగ్యం , కొడుకుల వియోగం కారణంగా, పత్రికకు సెలవు పెట్టి ఇటిక్యాలపాడు వెళ్ళాడు. ఇటువంటి కష్టకాలంలో కొండా బాలకృష్ణారెడ్డి పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్నాడు. పత్రిక తాత్కాలిక బాధ్యతలు సమ్మతం కాదని, పత్రికపై పూర్తి అజమాయిషీకి ప్రవర్తించాడు. ఇది సహించని సిబ్బంది తిరిగి ప్రతాపరెడ్డిని రావలసిందిగా కోరారు. కొత్వాల్ వెంకట్రామిరెడ్డి సహాయ సహకారాలతో ప్రతాపరెడ్డి తిరిగి గోలకొండ పత్రిక బాధ్యతల్ని భుజ స్కందాలపై వేసుకున్నాడు. 

ఇట్లా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ కొనసాగిన గోలకొండ పత్రిక క్రమంగా నిజాం పాలిట సింహ స్వప్నంగా మారింది. దోపిడీవ్యవస్థను గడగడలాడించింది. తెలుగు ప్రజల గుండెకాయగా మారింది. 

1947 ప్రారంభంలో పత్రిక దినపత్రికగా మారింది. అప్పటికి వాటాదార్ల సంఖ్య పెరిగింది.దొరలు, దేశ్ముఖ్ లు, సంస్థానాధీశులు, వాటాలు పుచ్చుకున్నారు. వీరిలో వనపర్తి రాజా రామేశ్వరరావు, గద్వాల ప్రభువులు, పింగళి వారు కూడా ఉన్నారు. 
ఈ క్రమంలో వనపర్తి రాజా ఆధ్వర్యంలో రెడ్డిదొరలు సమావేశమై 1948లో ప్రతాపరెడ్డిని గోలకొండ పత్రికా బాధ్యతల నుండి తొలగించారు. ఆ స్థానంలో నూకల నరోత్తమరెడ్డిని నియమించారు. వీరు తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా కూడా 
పనిచేసారు. 
నరోత్తమరెడ్డి సంపాదకత్వంలో 1968 వరకు కొనసాగిన గోలకొండ పత్రిక, ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆగిపోయింది. 

👉వకాలతు వృత్తి -

ప్రతాపరెడ్డి స్వభావానికి వకీలు వృత్తి అసలు సరిపోదు. కానీ జీవితం అడుగడుగునా తండ్రిలా వెన్నంటి ముందుకు నడిపించిన పినతండ్రి రామకృష్ణారెడ్డి గారికి మాత్రం ప్రతాపరెడ్డిని వకీలుగా చూడాలని కోరిక ఉండేది. అందుకే కష్టపడి వకీలు చదువు చదివించాడు కూడా. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వివాదాలు, అలకలు అడుక్కోవడాలు కూడా జరిగేవి. మొత్తానికి అత్యవసరమైన కేసులు మాత్రమే పినతండ్రి కోరిక మేరకి వాదించి గెలిచేవాడు. చివరకు పినతండ్రి గారే ప్రతాపరెడ్డిని అర్థం చేసుకుని పత్రికాధిపతిగా ఆదరించాడు. 

👉రాజకీయనాయకుడుగా -

ప్రతాపరెడ్డి రాజకీయ గురువు మాడపాటి హనుమంతరావు.
సురవరం వారికి రాజకీయాలపై కూడా పెద్దగా ఆసక్తిలేదు. కానీ సన్నిహితుల ఒత్తిడితో 1952లో జరిగిన తొలి ఎన్నికలలో వనపర్తి శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రముఖ న్యాయవాది వి.రామచంద్రారెడ్డి పై పోటీ చేసి విజయం సాధించాడు .కానీ రాజకీయ ఎత్తుగడల కారణంగా అర్హతలు ఉన్నప్పటికీ మంత్రి పదవి రాలేదు అందుకే...''ఈ రాజకీయపు చీకటి బజారులో నేను, నా వంటివారు ఏమియును పనికి రారు" అని స్పష్టంగా పేర్కొన్నాడు.

👉సాహిత్యమే ఊపిరిగా -

సురవరం వారిలో నిద్రాణమై ఉన్న సృజనాశక్తిని తొలిసారిగా తట్టిలేపిన వారు కొత్వాల్ వెంకట్రామిరెడ్డి కాగా, అందుకు సానబెట్టి ముందుకు నడిపించింది మాడపాటి హనుమంతరావు గారు. 

1)సురవరం రచించిన మొట్టమొదటి గ్రంధం
పేరు బూత్పి. ఇది ఆంగ్ల అనువాద గ్రంధం. 1915 రచించబడింది. అముద్రితం. కాగా పిల్లలకు తెలియక దీన్ని ఇటిక్యాలపాడులో మిఠాయి కొట్టువాడికి పొట్లాల కోసం అమ్మేసారు. ఇప్పుడు ఇది ఒక స్మృతి మాత్రమే. 
2) రెండవ రచన 'శుద్ధాంతకాంత '. ఇది కూడా అముద్రితం. 1917లో రచించబడింది. ఇందలి కొన్ని పద్యాలు మాత్రం ముట్నూరి కృష్ణారావు కృష్ణాపత్రికలో అచ్చయ్యాయి. 
3)1921లో 'ఉచ్చల విషాదం ' నాటకం రచించాడు. ఇది 1939లో గోలకొండ పత్రికలో అచ్చయ్యింది. వారి పినతండ్రికి అంకితం ఇవ్వబడింది. 1924లో భక్త తూకారం నాటకం రాసాడు. 
4) అట్లాగే గ్రామజన దర్పణం, ఎల్లోరాశిల్పము, పూనా వ్యవసాయ ప్రదర్శనం, కర్నూలు రాజుల వంశావళి, నిజాం రాష్ట్ర పాలనము, గ్రంధాలయోద్యమం, మద్యపానం, ప్రాథమిక స్వత్వములు 
 &
హిందువుల పండుగలు, హైందవ ధర్మ వీరులు లేదా పోలీలు, సంఘోద్ధరణం, ప్రతాపరెడ్డి కథలు, 
మొగలాయి కథలు   
&
రాజబహద్దూర్ వెంకటరామిరెడ్డి జీవిత చరిత్ర, 
&
చంపకీ భ్రమర విషాదము, హరిశర్మోపాఖ్యానం, హంవీర సంభవం, ఆంధ్ర లిపి సంస్కరణము, యువజన విజ్ఞానం, రామాయణ విశేషాలు రచించాడు. 

సురవరం వారి గ్రంథాలలో 
'గోల్కొండ కవుల సంచిక" సవాళ్ళను స్వీకరిస్తూ ఆత్మగౌరవ పతాకగా ఆవిష్కరించబడినది. నిజాం రాష్ట్రంలో కవులు పూజ్యులు అనే నిందావాక్యాన్ని సవాలుగా తీసుకొని 354 కవులకు చెందిన రచనలు, జీవితాలతో కూడిన గ్రంథాన్ని ప్రచురించి గ్రంథరూపంలోనే సమాధానమిచ్చిన వైతాళికుడు ప్రతాపరెడ్డి. ఇందులో అత్యధికంగా పూర్వ పాలమూరు జిల్లాకు చెందిన 97 కవుల వివరాలున్నాయి.

 ఆంధ్రుల సాంఘిక చరిత్ర సురవరం వారి చివరి రచన. ఇది గొప్ప పరిశోధనాత్మక రచన. ఈ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించడమే కాకుండా ఆంధ్ర పండిత విమర్శకుల ప్రశంస పొందింది. 

సురవరం 'ప్రతాపరెడ్డి కథలు' నిజాం కాలం నాటి ప్రజల జీవితాన్ని ఉన్నదున్నట్లుగా చిత్రించినయి. 

👉ఆంధ్రమహాసభ అధ్యక్షుడుగా -

నిజాం పాలనలో తెలుగు భాషకు, తెలుగు సంస్కృతికి జరుగుతున్న ఆన్యాయాన్ని సహించలేక తెలంగాణ ప్రజలు ఆంధ్రమహాసభను స్థాపించారు. 
1930 నుండి 1945 వరకు 12 ఆంధ్ర మహాసభలు నిర్వహించారు. 1930లో జోగిపేటలోప్రథమాంధ్ర మహాసభ జరిగింది.ఆంధ్రమహాసభ మొట్టమొదటి అధ్యక్షుడుగా ప్రతాపరెడ్డి వ్యవహరించారు. నిజాం పాలనపై వ్యతిరేకత తీవ్రంగా ఉన్నప్పటికీ సాంఘిక సమస్యలే తీవ్రమైన చర్చకు వచ్చాయి. బాల్యవివాహాలు, వితంతు వివాహాల మీద మహాసభ తీర్మానాలు చేసింది.

****
నమస్తే సదా వత్సలే మాతృభూమి 🙏
విశాల హృదయులు -
నిరాడంబరులు -
1953లో కాలధర్మం చెందారు. 
సురవరం వారు సదా స్మరణీయులు 🙏🙏🙏🙏
__________________________________

ఆధారం : శ్రీ సురవరం ప్రతాపరెడ్డి రచనలు -జీవితం

No comments:

Post a Comment