Tuesday, April 16, 2024

సింగోటం నరసింహస్వామికి మొక్కిన రజాకార్లు

పటేల్ భైరెడ్డి కృష్ణారెడ్డి, మల్లేపల్లి బుచ్చిరెడ్డిల ధైర్యం

సింగోటం నరసింహస్వామికి మొక్కిన రజాకార్లు

సాయుధ పోరాట కాలంలో రసవత్తర ఘట్టం

వ్యాసకర్త : తంగెళ్ళశ్రీదేవిరెడ్డి 
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
సాయుధపోరాటం అంటే నల్లగొండ, వరంగల్ , కరీంనగర్, ఖమ్మం జిల్లాలు ప్రధానంగా గుర్తుకు వస్తాయి. కానీ పూర్వ పాలమూరు జిల్లాలో కూడా కొంతమేరా పోరాటం జరిగింది. ఇది చరిత్రలో ప్రాముఖ్యత సంతరించుకోలేదు కానీ ఇవి చరిత్రను
మలుపుతిప్పిన సంఘటనలు.
రహస్య రేడియో భాగ్యనగర్ మొదలుకుని, అప్పంపల్లి... ఆత్మకూరు... సంఘటనలు చెప్పుకోదగినవి. అటువంటి సంఘటనే కొల్లాపూర్ దగ్గర సింగపట్నం ఘటన ! ఒకప్పటి సింగపట్నమే నేటి సింగోటం ! 

*********
1947 ఆగస్టు 15...
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది.
బ్రిటిష్ పాలన నుండి భారతదేశానికి విముక్తి కలిగింది.కానీ నిజాం అధీనంలో ఉన్న హైదరాబాద్ సంస్థానము మాత్రం ఇండియన్ యునియన్ కలవలేదు. హైదరాబాదును సర్వ స్వతంత్ర్య దేశముగా ప్రకటించుకున్నాడు నిజాం.

అంతేకాదు...తెలంగాణ ప్రజలను పూర్తిగా తన వైపు తిప్పుకునే ప్రయత్నములో కట్టుదిట్టమైన వ్యూహ రచనలు చేసాడు. తన సర్వ సేనాధిపతి ఖాసీం రజ్వికి సర్వ అధికారాలు కట్టబెట్టాడు. ఇందులో భాగంగా రజాకారులు తమ ఇష్టా రాజ్యాంగ ప్రవర్తించారు. రజాకార్ల వికృత ప్రయత్నలను సింగవట్నం గ్రామ ప్రజలు తిప్పికొట్టారు. ఇది చరిత్రకు ఎక్కని పోరాటం. రజాకార్లను ఎదురించడంలో గ్రామం నుంచి తరిమి కొట్టడంలో .
సింగవట్నం ప్రజల తెగువ సింగమునే గుర్తుకు చేస్తుంది.

▪️గ్రామంలోకి ప్రవేశించిన రజాకార్లు

1948 సెప్టెంబర్ రెండవ వారం....
అనూహ్యంగా
అకస్మాత్తుగా
10 మంది సాయుధులైన రజాకరులు పూర్వపాలమూరు జిల్లా కొల్లాపూర్ దగ్గర సింగపట్నంలోకి ప్రవేశించారు. వాళ్ళ నాయకుడు పేరు ఇబ్రహీం. ఊర్లోకి ప్రవేశిస్తూనే అలజడి సృష్టించాడు. వచ్చింది ఎవ్వరో వేష భాషలు చూసి తెలియగానే ప్రజలు భయ బ్రాంతులకి లోనయ్యారు.

వచ్చిన గుంపు అందరూ కలిసి ఊరు సావిడి లో తిష్ట వేసారు. 

▪️గ్రామ పెద్దలు కృష్ణారెడ్డి, బుచ్చారెడ్డిల జోక్యం

అప్పటికి నల్లగొండ వరంగల్ తదితర ప్రాంతాల్లో సాయుధపోరాటం ఉదృతగా జరుగుతున్న సమాచారం గ్రామానికి చేరి ఉన్నది. ప్రజలు పోరాటం గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ఇట్లాంటి పరిస్థితిలో తమ గ్రామంలోకే రజాకార్ల రాకతో భయాన్ని బాధని ప్రత్యక్షంగా మొదటి రోజు నుండే అనుభవించడం మొదలయ్యింది. 

గ్రామ పటేల్ భైరెడ్డి కృష్ణారెడ్డి, మల్లెపల్లి బుచ్చిరెడ్డిలు రజాకార్లు గ్రామంలోకి ప్రవేశించిన రాత్రే అప్రమత్తం అయ్యారు.ప్రజలకు ధైర్యం అందించారు. రహస్యంగా కృష్ణారెడ్డి ఇంట్లో కొందరు పెద్ద మనుషులు యువకులతో సమావేశం జరిపి " సమయం కోసం సంయమనం పాటించాలి " అంటూ సూచనలు అందించారు.

▪️స్తంభించిన గ్రామం

ఇబ్రహీం మొండిగా కఠినంగా ఉండేవాడు. జులుం చెలాయించే వాడు. తన సమూహంతో కలిసి కనబడ్డ కోళ్లను గొర్రెలను మేకలను తన ఇష్టారాజ్యంగా కోసుకు తినేవాడు. కావాల్సిన వస్తువుల కోసం దుకాణాలు మీద ఎగబడి దోచుకు పోయేవాడు. అప్పుడప్పుడు ఇండ్ల మీద బడి వండిన ఆహారపదార్థాలను ఎత్తుకు పోయేవాడు. కల్లాల్లో గింజలు ఎత్తుకు పోయేవాడు.

సావిడి ముందు దారెంబడి తమ పనుల మీద వెళ్లే వాళ్ళను సైతం ఆకరణంగా పైశాచికంగా కెలుక్కునే వాడు. దాంతో ప్రజలు ఇక సావిడి మార్గం వెళ్లడమే మరిచిపోయారు.

రోజు రోజుకు గ్రామంలో రజాకార్ల ఉనికి ప్రజలకు పెద్ద సమస్యలా పరిణమించింది.దినవారి పనులు దాదాపుగా ఆగిపోయాయి. వారి దారుణాలు తెలిసిందే కాబట్టి స్త్రీలు బాలికలు పూర్తిగా ఇండ్లకి అంకితం అయ్యారు.
తలమీద కొలిమిలా ప్రజలు దిక్కుతోచక విల విల లాడసాగారు.

▪️వంతుల పద్దతి

ఒకరోజు -
రజాకారులు సమయం చూసుకుని.... మరొక అడుగు ముందుకు వేస్తూ గ్రామ పటేల్ బైరెడ్డి కిష్టారెడ్డి ఇంటికి వెళ్లారు. చుట్టుముట్టి భయభ్రాంతులకు గురి చేసారు.

ఇక మీదట తమ అవసరాలను పటేల్ చూసుకోవాల్సిందే అని హుకుం జారీ చేశారు.

తాము అక్కడ ఉన్నన్ని రోజులు తమకు కావలసిన భోజనం, ఆ నిమిత్తం కోళ్లను , పోటేళ్లను వంతుల వారీగా సరఫరా చేయాలని ... ఎవ్వరూ ఎటువంటి అభ్యంతరాలు చెప్పకూడదని.... చెబితే గ్రామ పెద్ద బాధ్యత వహించాల్సిందే అని కఠిన నిబంధనలు విధించారు. 

కృష్ణారెడ్డి మళ్ళీ గ్రామ పెద్దలతో యువకులతో బచ్చారెడ్డితో కలిసి సమావేశం అయ్యాడు. జరిగింది చెప్పాడు. 

" భయపడేది లేదు. ఇది వాళ్ళకు సపర్యలు చేయడం కాదు. అవకాశం కోసం ఎదురు చూడటం " అంటూ మరొకసారి పెద్దమనిషిగా ధైర్యం ఇచ్చాడు.

ఇక ఆ మరునాడు నుండి.....
రజాకార్లు కూర్చున్న చోటుకే గ్రామ దూకాణ దారుల
నుండి సరుకులు,.... గొర్ల కాపరుల నుండి గొర్రెలు,... ప్రజల ఇండ్ల నుండి కోళ్లు....గ్రామ కావలికోర్ల ద్వార సారా, .... రావడం మొదలయ్యింది. ఇక ఆడిందే ఆటగా పాడిందే పాటగా రజాకార్లు జల్సా చేయడం మొదలెట్టారు.

▪️పేట్రేగిన హింస

గ్రామంలో పరిస్థితి చూస్తూ సహించలేక క్రమంగా కృష్ణారెడ్డి బుచ్చిరెడ్డిలు కొందరు యువకులను చైతన్యం చేశారు. పెద్దమనుషుల అండతో యువకులు....మెల్లగా అభ్యంతరం చెప్పే ప్రయత్నం చేసారు. రజాకార్లు ఇది సహించలేక పోయారు.తమ దగ్గర ఉన్న ఆయుధాలతో తీవ్రంగా కొట్టడం హింసించడం చేయడం మొదలెట్టారు.

రజాకారులు చేసే భయంకర హింసలకు చేష్టలకు గ్రామమంతా అట్టుడికి పోసాగింది.
రజాకార్లని ఎట్లా ఎదురించాలో ఆలోచన చేయడం మొదలెట్టింది.

▪️పకడిబంది పథకం

ఇట్లాంటి సమయంలో ....
గ్రామానికి చెందిన గొల్ల బత్తుల శేషమ్మకు తన గొర్రెలు అందించే వంతు వచ్చింది. శేషమ్మ అనుకున్న మాట ప్రకారం శేషమ్మ తన మందలో నుండి గొర్రెను అందివ్వడానికి సిద్ధం అయ్యింది.
శేషమ్మకు చెందిన గొర్ల మందల నుంచి మంచి పొట్టేలును ఒకటి రజాకార్లు ఎంచుకున్నారు. శేషమ్మ పొట్టేలునే అందించింది.

శేషమ్మ మందలో పొట్టేళ్ళు బాగున్నాయని , ప్రతి రోజూ శేషమ్మ మంద నుండే
పొట్టేలు తీసుకుపోవడం మొదలెట్టారు రజాకార్లు.

కృష్ణారెడ్డి , బుచ్చిరెడ్డిలకు ఇదే సరైన సమయంగా ఆలోచన వచ్చింది. శేషమ్మను సిద్ధం చేశారు.

మరునాడు -
యధావిధిగా పొట్టేలు ఎంపిక కోసం రజాకార్లు గొర్రెలు మంద వద్దకు వచ్చారు.
అందుకు గొల్ల శేషమ్మ అడ్డుపడింది.
 
"దినాం నా మందలో ఎందుకు? అవుతాల వారి మందలో పొట్యాళ్లు లేవా ? ఒప్పందంలో ఏం అనుకున్నారో అట్లనే తీసుకపోండి. నా మంద నుండి పొట్యాలు కదలడానికి ఈల్లేదు " అంటూ గట్టిగా అని అడ్డుకుంది శేషమ్మ

▪️ఇబ్రహీం ఉగ్రరూపం

" తమకు అడ్డు చెప్పడమే ఒక పెద్ద పొరపాటు.... పైగా ఎదురుమాట్లాడటం ఏంది? అంటూ రజాకారుల నాయకుడైన ఇబ్రహీంకు కోపంతో ఊగిపోయాడు..

ఒప్పందం ప్రకారం అభ్యంతరానికి బాధ్యత వహించాల్సింది పటేల్ కృష్ణారెడ్డి కాబట్టి, ఇబ్రహీం కృష్ణారెడ్డిని నిలదీసాడు.

పటేల్ కృష్ణారెడ్డి జంకలేదు. బుచ్చిరెడ్డితో కలిసి సంయమనంగా పావులు కదపడం మొదలెట్టాడు. గ్రామ యువకులకు ముందస్తు సమాచారం అందించి సిద్ధం చేసాడు.

▪️పంచాయితీ

 కృష్ణారెడ్డి ఆలోచన ప్రకారం....గ్రామంలో ఇతర గ్రామ పెద్దల సమక్షంలో రజాకార్లు ఉంటున్న సావిడి దగ్గర పంచాయితీ మొదలయ్యింది.శేషమ్మకు భైరెడ్డి కిష్టారెడ్డి, మల్లెపల్లి బుచ్చిరెడ్డి అండగా నిలిచారు.

గ్రామ పెద్దలు భైరెడ్డి కిష్టారెడ్డి, మల్లెపల్లి బుచ్చిరెడ్డి, ఇతర గ్రామ పెద్దలు...అందరి సమక్షములో శేషమ్మ రజాకార్లను నిలదీసింది .

అనుకున్న ప్రకారం యువకులు అప్రమత్తం అయ్యారు. వార్త గ్రామంలోకి దావానలంలా గడప గడపకు చేరింది. ప్రజలు క్షణాల్లో చావిడి వద్ద గుంపులుగా గుమిగూడారు.

మెల్లగా.....మల్లెపల్లి బుచ్చిరెడ్డి
శేషమ్మకు మద్దతు తెలుపుతూ మాట్లాడటం మొదలెట్టాడు. 

"ఈ పంచాయితీ ఏంది? " అంటూ ఇబ్రహీం భరించలేక పోయాడు.
వెంటనే లేచి బుచ్చిరెడ్డిని అడ్డుకుంటూ దుర్భాషలాడటం మొదలెట్టాడు. 

 ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియక అందరూ అప్రమత్తం అయ్యారు. ఇబ్రహీం అంతకంతకు రెచ్చిపోయాడు. 
అంతటితో ఆగకుండా పంచాయితికి కారణమైన శేషమ్మ వైపుకు పిడికత్తితో దూసుకువచ్చాడు.

ఏమాత్రం ఆలస్యం జరిగినా కత్తి శేషమ్మ కడుపులోకి దిగేది. కానీ కాచుకుని ఉన్న పటేల్ బైరెడ్డి కిష్టారెడ్డి ధైర్యం చేసాడు. వేగంగా దూసుకువచ్చిన ఇబ్రహీంను అంతే వేగంగా తన కుడిచేయి అడ్డుపెట్టి ఆపాడు. ఇబ్రహీం కిష్టారెడ్డిని పక్కకు నెట్టేసే ప్రయత్నం చేసాడు. కానీ అందుకు కిష్టారెడ్డి అవకాశం ఇవ్వలేదు. ఇబ్రహీంను బిగ్గరగా ఒడిసిపట్టాడు. ఇద్దరికీ మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో కిష్టారెడ్డి చేతి వేలు కత్తిపోటుకు గురయ్యింది. గాయం బలంగా తగలడం మూలానా రక్తము చివ్వున చిమ్మింది. నెత్తుటితో అక్కడి నేల తడవసాగింది. కిష్టారెడ్డి రక్తాన్ని కళ్లారా చూసిన జనాల్లో ఒక్కసారిగా ఆవేశం పొంగుకు వచ్చింది . అదే అవకాశంగా పటేల్ కిష్టారెడ్డి, మల్లేపల్లి బుచ్చిరెడ్డి, ప్రజలకు అండగా నిలబడ్డారు. తిరుగుబాటుకు సై అన్నారు. సైగ చేశారు.

అంతే..! 
ప్రజలు భయం మరిచిపోయారు. అందరినీ తెలియని ధైర్యం క్షణాల్లో ఆవహించింది. 
ఇక ఆలస్యం చేయలేదు. తమను తామే ఎవ్వరికీ వారే సిద్దపరుచుకుంటూ ఒక్కుమ్మడిగా రజాకారులపై తిరగబడ్డారు.ప్రజల్లో ఒకరిగా పటేల్ కిష్టారెడ్డి, మల్లేపల్లి బుచ్చిరెడ్డిలు కూడా చెలరేగిపోయారు. అందరూ కలిసి రజాకార్లు పక్కకు కదలకుండా చాకచక్యంగా కట్టడి చేశారు.

అదే అదునుగా వెనుకనుండి మిగతా ప్రజలు .. యువకులు...అందుబాటులో ఉన్న గొరు గోయలు , గుతుపలు,కాడిమాన్లు, రోకలిబండలు, గడ్డపారలు, కత్తులు, ఇలపపీటలు, బడిసెలు, కొడవళ్లు మొదలగు వస్తువులను ఆయుధాలుగా పట్టుకు వచ్చారు . ఒకరికి ఒకరు సహకరించుకుంటూ మూకుమ్మడిగా దాడి చేసిన ప్రజలను రజాకార్లు.తప్పించుకోలేక పోయారు 

వందల్లో జమగుడిన ప్రజల్లో సమరోత్సాహం క్షణక్షణానికి రెట్టింపు అయ్యింది. ప్రజలు రజాకార్ల వద్ద ఉన్న ఆయుధాలు మొత్తం లాక్కున్నారు.వాటిలో తుపాకులను ఇరగ్గొట్టి, కత్తులను రాళ్ళతో కొట్టి వంపులు తిప్పి, చేదుల బావిలో పడవేశారు.

అంతటితో ఆపకుండా రజాకార్లను తాళ్ళతో బంధించి..... తీవ్రంగా కొడుతూ....ఊరంతా ఊరేగించారు. దారుల పొడవునా మహిళలు వృద్దులు పిల్లలు రజాకార్లపై కాండ్రించి ఊస్తూ చీత్కరించారు.

▪️నరసింహస్వామికి మొక్కిన రజాకార్లు

ప్రజల చేతిలో బందీలుగా మారిన రజాకార్లను ప్రజలు తమదైన పద్దతిలో సింగపట్నం దేవాలయం వరకు తరుముకు వచ్చారు.. అక్కడికి వచ్చాక పటేల్ కిష్టారెడ్డి, మల్లేపల్లి బుచ్చిరెడ్డి, ముగింపుని రసవత్తరం చేశారు.

రజాకార్లను గుడి ముందు నిలబెట్టారు.
వందలాది ప్రజలు ఆవేశంతో చూస్తుండగా పటేల్ కృష్ణారెడ్డి పెద్దగా అరిచాడు.
" లక్ష్మీ నరసింహాస్వామీ... "
ప్రజల్లో ఉద్వేగం మొదలయ్యింది. రజాకార్లు నిస్సహాయులుగా లోలోపల బుసలు కొడుతూ నిలబడి ఉన్నారు.

కృష్ణారెడ్డి, బుచ్చిరెడ్డిలు రజాకార్ల ముందుకు వచ్చారు.
" మొక్కండి " అంటూ గర్జించారు.
రజాకార్లు మారు మాట్లాడలేదు.
 నరసింహ స్వామికి చేతులు జోడించారు.
అట్లా అక్కడ వెలసిన నరసింహస్వామికి కృష్ణారెడ్డి, బుచ్చిరెడ్డిలురజాకార్ల చేత మొక్కించారు.

తర్వాత రజాకార్లను ఈలలు కేకలతో తరిమి కొట్టారు.

అవిదంగా మొత్తానికి ఆలస్యంగా అయినా సరే సింగపట్నం ప్రజలు తమ ఐక్యతని నిరూపిస్తూ..... తమ శక్తిని రజాకార్లకు రుచి చూపిస్తూ..... ఊరినుండి పారాదోలారు.

▪️భయానక పరిస్థితులు :

రజాకారులను ఎదురించి పారద్రోలిన సింగపట్నం గ్రామ ప్రజల ఘనత ఇప్పటి వరకూ రికార్డు కాలేదు.
పటేల్ కిష్టారెడ్డి, మల్లేపల్లి బుచ్చిరెడ్డి, వీరితో పాటుగా ..... గుండయ్య,వాకిటి చిన్నయ్య , కాకి నర సింహగౌడు , బోనమోని బయ్యన్న, చాకలి దేవయ్య, తెలుగు చిన్నయ్య,గొంది ఈదన్నలు ముందుండి తిరుగుబాటులో పాల్గొన్నారు. వీరితో పాటుగా తెగించి ముందుకు నడిచిన గ్రామ ప్రజలు అందరూ అభినందనీయులు...చిరస్మరణీయులు!

▪️ఇది ప్రజల యుద్ధం

సింగపట్నం ప్రజల తెగువ మరిచిపోలేనిది. యువకులు తెగించి ముందుకు నడవడం... తమ మరుగుతున్న నెత్తురుతో రజాకార్ల అట పట్టించడం చారిత్రకం. నేటి తరానికి ఆనాటి యువత స్ఫూర్తిదాయకం.

కాగా ఆ ఘటన తర్వాత గ్రామంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఏ క్షణం రజాకార్లు కళ్ళుగప్పి ప్రతీకార చర్యగా దాడి చేస్తారో తెలియని పరిస్థితి నెలకొన్నది.
ఈ పరిస్థితిలో పెద్దమనుషులైన పటేల్ కిష్టారెడ్డి, మల్లేపల్లి బుచ్చిరెడ్డిలు గ్రామ ప్రజలతో సమావేశం నిర్వహించారు. గ్రామస్తులని ఒక్కత్రాటి మీదకి తెచ్చారు.

అనుకున్న ప్రకారం గ్రామస్థులు రేయింబవళ్ళు గుంపులుగా గడపసాగారు. 
అందుబాటులో ఉన్న ఆయుధాలతో అప్రమత్తంగా ఉండసాగారు. ప్రాణాలకు తెగించి ఊరి యువకులు గ్రామానికి పహారా కాయశాగారు. 

▪️ఖాసీంరజ్వి కన్నెర్ర :

గ్రామస్తుల సహకారంతో రజాకార్లను పారద్రోలిన
పటేల్ కిష్టారెడ్డి, మల్లేపల్లి బుచ్చిరెడ్డిలపై ఖాసీంరజ్వి
కన్నెర్ర జేశాడు. ఈ ఇద్దరినీ కనిపిస్తే కాల్చివేయాలని ఇబ్రహీం వర్గానికి హుకూం జారిచేశాడు. ఈ క్రమంలో.... పటేల్ కిష్టారెడ్డి, మల్లేపల్లి బుచ్చిరెడ్డిలకోసం ఓ కన్నేసి ఉంచాడు.

విషయం పసిగట్టిన ఇద్దరు పెద్దమనుషులు పొంచిఉన్న ప్రమాదాన్ని అంచనా వేసుకున్నారు. రహస్యంగా గ్రామం వదిలి బ్రిటిష్ పాలనలో ఉన్న కర్నూలు చేరుకున్నారు. బ్రిటిష్ ప్రభుత్వం అధీనంలో ఉన్న కర్నూలులో పెద్దమనుషులు తలదాచుకున్నట్టు తెలిసినా రజాకార్లు ఆచూకీ పట్టలేకపోయారు. అయినప్పటికీ ఆ ఇద్దరి ప్రాణం కోసం ఇబ్రహీం తీవ్రంగా ప్రయత్నం చేసాడు. మొత్తానికి కిష్టారెడ్డి, బుచ్చిరెడ్డీలు తెలివిగా తమ ప్రాణాలను కాపాడుకున్నారు .

1948 సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచనోద్యమం వరకు రజాకార్లు కిష్టారెడ్డి బుచ్చిరెడ్డిల కోసం గాలించారు. ఆ తర్వాత తెలంగాణలో రాజకీయంగా సామాజికంగా పెను మార్పులు సంభవించడం , ఖాసీంరజ్వి లొంగిపోవడం, వంటి పరిస్థితుల నేపథ్యంలో గ్రామాల్లో శాంతియుత వాతావరణం నెలకొన్నది. పెద్దమనుషులు తిరిగి గ్రామాన్ని చేరుకున్నారు.

********
 సమాచారం అందించిన వారు -
పటేల్ బైరెడ్డి కిష్టారెడ్డి కుమారుడు 
బైరెడ్డి బాల్ రెడ్డి గారు.
 సింగపట్నం గ్రామం 
కొల్లాపూర్ ( మండలం)
 నాగర్ కర్నూల్ జిల్లా తెలంగాణ
ఫోన్ : 7702487946

No comments:

Post a Comment