Monday, April 15, 2024

పాటగాడు - నల్లగొండ గద్దర్.... నర్సన్న ( కాసాల నర్సిరెడ్డి....)

పాటగాడు - నల్లగొండ గద్దర్.... నర్సన్న 
( కాసాల నర్సిరెడ్డి....)
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
వ్యాసకర్త : తంగెళ్ళశ్రీదేవిరెడ్డి 

కడుపార నన్ను గన్న 
నా కన్నతల్లివమ్మా.... 
కాసాల ఆశిరెడ్డి ఇంటి దీపమైనవమ్మా 
నీ ఋణము తీరదమ్మా నా తల్లి భద్రమ్మ.... 
నిలువెత్తు గాయాలున్న నవ్వేటి పూలకొమ్మ.... 
నీ గర్భ గుడిలో నన్ను 
పది నెలలు దాచినావు... 
నీవు తిన్న తినాకున్నా 
నన్ను గార్వంగా పెంచినావు.... 

అంటూ అమ్మ మీది ప్రేమను హృద్యంగా ఒలికించిన ఆ గళంలో వేల స్వరాల వీణలు. కోటి సుధల బాణీలు ! 

గల గల పారేటి గంగమ్మ తల్లంటి చంద్రమ్మ కడుపులో జన్మించినావయ్యా.... 
నిరుపేద రైతన్న మల్లారెడ్డిఇంట ముగ్గురన్నల తోడ పుట్టిన నా అయ్యా.... 
మట్టితో సావాసము 
చెట్టూపుట్టలే నీ నేస్తము... 
పుట్టినూరే స్వర్గము 
భద్రమ్మ తోటిదే నీ లోకము.... 
నిప్పులాంటి గుణము 
నిండు హుందాతనం 
నీతికి నివేపుడు నిలువెత్తు రూపము.... 

అంటూ కన్నతండ్రి మీద అభిమానాన్ని మమకారాన్ని గౌరవాన్ని ఏకకాలంలో మనసారా చాటుకున్న ఆ గొంతులో వాగ్దేవీ గలగలలు... అద్భుత పద జలపాతాలు.. ! 

అతడు 
కాసాల నర్సిరెడ్డి ! అలియాస్ నల్లగొండ గద్దర్ ! 
మధ్యతరగతి రైతు బిడ్డ ! మట్టిని నమ్ముకుని ఆ మట్టిలోనుంచే మహా వృక్షంగా ఎదుగుతున్న ఉద్యమ 
నడిగడ్డ !

పాటకు ప్రాణం పోస్తూ.... ఆ ప్రాణానికి ఊపిరి అందిస్తూ.... తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పర్చుకుని 
లక్షల అభిమానులను సంపాదించుకున్న ఈ పాటగాడు.... ఇప్పుడు ఒక ట్రెండు ! ఆ గొంతే ఒక బ్రాండు ! 

👉పరిచయం :

వాస్తవానికి ఆ గొంతుకు పరిచయం అవసరం లేదు. ఆ గొంతును సవరించుకున్న వ్యక్తికి ప్రచారం అవసరం లేదు. కానీ వ్యక్తిగత ప్రపంచాన్ని గమనిస్తే.... సాయుధ పోరాట చరిత్రలో మందుగుండులా దూసుకు పోయిన నల్లగొండ జిల్లా చండూరు మండలం గుండ్రపల్లి గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో మే నెల 3, 1976లో జన్మించాడు. కాసాల ఆశిరెడ్డి భద్రమ్మ దంపతులకు రెండవ సంతానం నర్సిరెడ్డి. వీరు మొత్తం నలుగురు అన్నాదమ్ముళ్లు. 

👉చదువు - వృత్తి 

తన గళానికి సరస్వతి కటాక్షం మెండుగా పొందిన నర్సిరెడ్డి, తన అక్షరానికి మాత్రం ఆ కటాక్షం పొందలేకపోయాడు. ఇంటర్ మీడియట్ వరకే చదువుకున్నాడు. తర్వాత జీవన పోరాటంలో చిన్న చిన్న ఉద్యోగాలు చేసాడు. ఆ తర్వాత డ్రైవింగ్ రంగంలో అడుగుపెట్టి ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గర 15 సంవత్సరాలు పనిచేశాడు. ప్రస్తుతం డ్రైవింగ్ రంగాన్ని వదిలి వ్యాపారరంగంలో అడుగుపెట్టాడు. నల్లగొండ ప్రాంతంలో రియల్ ఎస్టేట్, హోటల్ వ్యాపారాల్లో రాణిస్తున్నాడు. 

👉పాటే.... ప్రవృత్తి 

ఆ గొంతులో ఉద్యమ తీవ్రత ఉవ్వెత్తున ఎగిసిపడ్తుంది... 
విప్లవ ఢంకా గుండెలు అదిరేలా మోగుతుంది.....
లాలిత్యం పలకరిస్తుంది.. 
ఆర్ద్రత అలరిస్తుంది..... 

పాటకు తగిన భావాల్ని పలికించడంలో నర్సిరెడ్డి దిట్ట. చెప్పాలంటే అతడొక పాటల గుట్ట ! జీవన గమనంలో ఎక్కడ ఉన్నా, ఏ పని చేసినా, పాటను మాత్రం నర్సిరెడ్డి వదలలేదు. గుండె సవ్వడిగా కొనసాగింది. అంకితభావం అతడికి మారుపేరు కాబట్టి సాధన అతడిని ఋషిని చేసింది. అందుకే ఇప్పుడు వేల గుండెల్ని ఆ గొంతు కదిలిస్తున్నది. 

👉 ప్రేరణ 

యుద్ధనౌక.... మాటే తూటాగా వెలువడే ఉద్యమ బాట... పాట... గద్దర్.... నర్సిరెడ్డికి మొదటి ప్రేరణ. 
గద్దర్ అంటే ఎవ్వరో తెలియని చిన్నతనం నుండే గద్దర్ పాటలకు ఆకర్షితుడు అయ్యాడు. టేపురికార్డర్ లో క్రమం తప్పకుండా గద్దర్ పాటలు వినడం మొదలెట్టాడు. 
ఏ సంగీత పరిజ్ఞానం లేకున్నా సహజసిద్ధంగా అలవడిన గాత్రంతో మెల్లగా పాడటం మొదలెట్టాడు. ఆ పాడటంతో గద్దర్ తీరును అనుసరించడం మొదలెట్టాడు. అట్లా నర్సిరెడ్డి గొంతు పాఠశాల స్థాయినుండి గద్దర్ ను ఆకళింపు చేసుకున్నది. 

తర్వాత వందేమాతరం శ్రీనివాస్, విమలక్క, గోరెటి వెంకన్న వంటి ఉద్యమ గొంతుకల్ని కూడా అనుసరించాడు. ఇదే క్రమంలో సుద్దాల అశోక్ తేజ రాసిన ఆణిముత్యాల్లాంటి పాటల్ని ఏరికోరి పాడి ప్రజలకు మరింత చేరువగా తీసుకొచ్చాడు. ముఖ్యంగా తన గాత్రం తనకు ఉన్నప్పటికీ.... తనకంటూ ఒక శైలి ఉన్నప్పటికీ.... నర్సిరెడ్డి గద్దర్ శైలిలో ఎక్కువగా ఒదిగిపోయాడు. అందుకే నల్లగొండ గద్దర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 

👉నల్లగొండ గద్దర్ 

భారత దేశం భాగ్యసీమరా....
సకల సంపదలకు కొడవలేదురా... 
అంటూ అన్నీ ఉండి అభివృద్ధి ఫలాలను అందుకోలేక పోతున్న భారతదేశం పరిస్థితి గురించి గద్దర్ పాడిన పాటను నర్సిరెడ్డి అప్పట్లో గొంతెత్తి పాడేవాడు. అదివిని అందరూ గద్దర్ అంటూ ప్రశంసించే వాళ్ళు. ఈ క్రమంలో మెల్లగా పాఠశాల వివిధ కార్యక్రమాల్లో కూడా పాడటం మొదలెట్టాడు. ఎప్పుడు ఎవ్వరు పిలిచారో తెలియదు గానీ, ఇట్లాంటి కార్యక్రమాల్లోనే భాగంగా " నల్లగొండ గద్దర్.... నర్సన్న ఇప్పుడు పాడుతాడు " అంటూ వేదిక మీదకు ఆహ్వానించడం మొదలెట్టారు. అదే పేరు నర్సిరెడ్డికి ఇప్పుడు ఒక గుర్తింపు.... ఒక కీర్తి.... ఒక ఘనత.... అయ్యింది. 

👉తెలంగాణ ఉద్యమంలో 

తెలంగాణ ఉద్యమంలో నర్సిరెడ్డి గొంతు ఒక ఊతం అయ్యింది. పాటతో పల్లె పల్లెను తట్టిలేపాడు. పాటనే బందూకుగా పేలుస్తూ గుండె గుండెలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించాడు. తెలంగాణ ఉద్యమం తర్వాత సైతం రాజకీయ సామాజిక పరిస్థితులకు స్పందిస్తూ అతడు పాడుతూనే ఉన్నాడు. 

ఉద్యమగీతాలే ఊపిరి :

నీ బస్సు కదలకుంటే 
మా బతుకు సాగదంట... 
నీ హారను వినకుంటే 
మా ఊరు మూగబోదా 

అంటూ తెలంగాణ ప్రభుత్వంలో ఆర్టీసీ సమ్మె సమయంలో ఉద్యమానికి అండగా నిలుస్తూ నర్సిరెడ్డి పాడిన గేయం, కార్మికులను ముందుకు నడిపించింది. ప్రజలను ఆలోచింపజేసింది. ఈ పాట అప్పట్లో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. 

👉అతడు పాడితే ఓటమి లేదు 

నర్సిరెడ్డి ఇప్పటి వరకు దాదాపు 500 పై చిలుకు పాటలు పాడాడు. 10 సినిమాలకు కూడా తన గాత్రం అందించాడు. ఎక్కువగా రాజకీయ నాయకులకు పార్టీ పరమైన పాటలు పాడిన నర్సిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎక్కువ సంఖ్యలో పాడాడు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే.... నర్సిరెడ్డి ఏ నాయకుడికైతే తన గొంతును అందించాడో ఆ నాయకుడు ఇప్పటి వరకు ఓడిపోలేదు. ఓడిపోయే పరిస్థితి ఉన్నప్పటికీ గెలిచాడు. 
వైస్సార్ గురించి నర్సిరెడ్డి పాటలు జనాల గుండెల్లో మారుమోగుతున్నాయి. 

👉ప్రజల పక్షం 

నర్సిరెడ్డిది ప్రజల పక్షం. ప్రభుత్వ తప్పిదాలను, నిర్లక్ష్యాన్ని, నిర్మొహమాటంగా ఎత్తి చూపుతాడు. అయినప్పటికీ....

ముగ్గేసి పువ్వేసి ఓ సందమామ 
ఓటెవరికేస్తావే ఓ సందమామ 
మాయగాళ్లు వస్తారే ఓ సందమామ 
మాటలే జెప్తారే ఓ సందమామ.... 
అంటూ టీఆరెస్ సర్కారుపై విరుచుకుపడిన నర్సిరెడ్డి - 

గల గల పారేటి గంగమ్మ తల్లిని 
నల్లరేగళ్ళకు మళ్లించినాడమ్మా.... 
కాళేశ్వరముతోటి లక్షల ఎకురాలు 
కళ కళ లాడించే మన పెద్ద రైతన్న.... 
ఎట్లుండే మన పల్లెలు 
గతమంతా నెర్రబారిన నేలలు.... 

అంటూ అదే టీఆరెస్ ప్రభుత్వం తీరును అనివార్యంగా కొనియాడాడు. ఇక్కడ విచిత్రం ఏమంటే.... ఇదే పాటను ఇప్పుడు మన నెటిజన్లు సర్కారుకి వ్యతిరేకంగా విమర్శగా వెటకారంగా ఉపయోగించుకుంటున్నారు. 
నీళ్లు నగరాలను పల్లెలను ముంచెత్తి ఇబ్బంది పెడ్తున్న సమయాల్లో ప్రభుత్వ నిర్లక్షాన్ని దుయ్యబడుతూ తయారైన వీడియోల్లో ఈ పాట ఉంటున్నది. 

👉సాయుధ పోరాట చరిత్ర పాటలుగా 

తెలంగాణ చరిత్రలో సాయుధ పోరాటం ప్రపంచంలో వేలాది ఉద్యమాలకు ఆదర్శంగా నిలిచింది. నిజాం నియంతృత్వానికి ఎదురునిలిచిన ఈ పోరాటం మహాభారతంలో కురుక్షేత్రం వంటిది. ఈ పోరాటంలో ఎందరో రెడ్లు తమ ఆస్తులను పేదలకు పంచిపెట్టి, ఆ పేదలను పెకిలించలేని పలుగురాళ్లుగా తీర్చిదిద్దారు.
ఇదే క్రమంలో మరెందరో కులమతాలకు అతీతంగా సాయుధ వీరులు ప్రాణాలకి తెగించి పోరాటంలో ముందుకి నడిచారు. ఇటువంటి అందరు వీరుల త్యాగాన్ని స్మరిస్తూ నర్సిరెడ్డి గొంతుకనుండి వెలువడిన 
పాటలు చరిత్రను విస్తృత పరిచాయి. 

👉భవిష్యత్తు పాటల కోటలో 

ఎవ్వరి అండదండలు లేకుండా స్వతహాగా ఎదిగిన 
నర్సిరెడ్డి భవిష్యత్తు పాటల కోటలో పాగా వేస్తాడని ఆశించవచ్చు. 
మొత్తానికి ప్రతిభ వృధా కాదు అని చెప్పడానికి గొప్ప ఉదాహరణ నర్సిరెడ్డి !

No comments:

Post a Comment