Monday, April 15, 2024

రట్టడి నుండి రెడ్డి వరకు

రట్టడి నుండి రెడ్డి వరకు 
°°°°°°°°°°°°°°°°°°°°°°°

వర్తమాన పరిస్థితుల్లో  రెడ్డి పదం చుట్టూ అనేక వాదాలు వివాదాలు విమర్శలు కొనసాగుతున్నాయి. రెడ్డి అంటే ఒక అహంకారానికి  దుర్మార్గానికి  అరాచాకానికి ప్రతీకగా చిత్రిస్తున్న వాళ్లు ఎక్కువయ్యారు. భారత స్వాతంత్య్రం మొదలుకొని  ఇటు తెలంగాణ సాయుధ పోరాటం...అటు తమిళ పెత్తరికాన్ని నిరసిస్తూ ఆంద్రోద్యమం వరకు రెడ్ల త్యాగాలు పోరాటాలు అనివార్యంగా ఉన్నాయి.

▪️సమాలోచన :

ముఖ్యంగా నిజాం కాలంలో నాయకులుగా ప్రతినాయకులుగా కూడా రెడ్లు తమ ఆధిపత్యాన్ని కొనసాగించారు.ఈ క్రమంలో  భూస్వామ్య వ్యవస్థలో అట్టడుగు జనాలు ఆగమై పోతున్నారని పోరాటం ప్రారంభించి మట్టి మనుషులులను మారణాయుధాలుగా మలిచింది రెడ్లే ! ఆ మట్టి మనుషులకు తమ వేల ఎకరాలను దానం ఇచ్చింది రెడ్లే !

అట్లాగే -
తమ దొరతనానికి  అనుచరులుగా బతికిన బడుగు వర్గాలకు ఆయుధాలు చేతికిచ్చి  అసాధ్యులుగా ముందుకు నడిపించింది రెడ్లే ! తమను నమ్ముకున్నోళ్లకు   భూములు రాసిచ్చి ఆర్థికంగా ఆదుకుని నిలబెట్టింది కూడా రెడ్లే !

మరి - 
ఇప్పుడు రెడ్డి వర్గం చుట్టూ ముండ్ల కంచెలు ఎందుకు 
పెరుగుతున్నాయి? 
రెడ్ల త్యాగాలను  కీర్తిస్తే శత్రుత్వం ఎందుకు మొదలవుతున్నది?  
రెడ్డి పదం  వినబడితే  అక్కసు ఎందుకు కక్కబడుతున్నది? 
పేరు వెనుక రెడ్డి  ద్వేషాన్ని ఎందుకు రగిలిస్తున్నది? 

యుద్ధనీతిలో మంచికి చెడుకు వారధులుగా బతికిన రెడ్లు ఇప్పుడు కేవలం నియంతృత్వానికి ప్రతీకగా ఎందుకు  దూషించబడుతున్నారు !?  త్యాగాల చరిత్రలు ఎందుకు మరుగున పడుతున్నాయి !? 

▪️ఉద్దేశ్య పూర్వక కుట్రలు

Yes... ఉద్దేశ్య పూర్వక కుట్రలు జరుగుతున్నాయి. ఉదాహరణకి కట్టమంచి రామలింగారెడ్డి గురించి రాయాల్సి వస్తే కట్టమంచి వారు అని మాత్రమే ఎందుకు రాస్తున్నారు.? గోన బుద్దారెడ్డిని బుద్ధభూపతిగా  ఎందుకు రాస్తున్నారు..? రాజబహదూరు వెంకట్రామరెడ్డిని వెంకట్రాముడుగా ఎందుకు రాస్తున్నారు?

అంతేకాదు - ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, సై సైరా  చిన్నపరెడ్డి,  వంటి  స్వతంత్ర సమరయోధుల  జయంతి  వర్ధంతి  వేడుకలకు  రెడ్లు మాత్రమే నివాళులు ఎందుకు అర్పుస్తున్నారు..? వీళ్ళు  రెడ్ల కోసం  పోరాటం చేసారా?  సాయుధ పోరాటంలో పాల్గొన్న ఎందరో స్త్రీలకు  గుర్తింపు ఎందుకు లేదు? బందూక్  ఎత్తిన ఆరుట్ల కమలాదేవికి  ప్రాముఖ్యత ఎందుకు లేదు?సాయుధ పోరాటానికి కావాల్సిన ఆయుధాలు సరఫరా  చేసిన  ఆండాళమ్మ గురించి  ఎంతమందికి  తెలుసు?

అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన
పూలే  అందరివాడు  అయినప్పుడు, దీన జనుల కోసం పనిచేసిన తెలుగుప్రాంతానికి చెందిన రెడ్డి వీరులు అందరి  వాళ్ళు ఎందుకు కాలేకపోతున్నారు ?
 
రాజరికం, దొరతనం, ప్రజాస్వామ్యం ఈ మూడు కాలాల్లో 
రెడ్లు నియంతలా? దోపిడీ దారులా? రెడ్లల్లో మంచి చెడు రెండూ ఉన్నాయి. ఒక్క రెడ్లల్లోనే కాదు అందరిలో ఈ భేదం ఉన్నది. కానీ రెడ్లల్లో చెడును.... అందరిలో  మంచిని.... ఈ సమాజం ఎందుకు పరిగణలోకి తీసుకుంటున్నది? 

▪️అందరిలో  దొరలు

అప్పుడు ఊరికి ఒక్కడే దొర. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో కులాలకు అతీతంగా అన్ని వర్గాల్లోంచి అవతరించి అడుగడుగున కనిపిస్తున్న దొరల గురించి ఎవ్వరూ ఎందుకు మాట్లాడట్లేదు? అంటే వీళ్ళు నిరసించేది దొరతనాన్ని కాదా... సామజిక వర్గాన్ని మాత్రమేనా? 

సమాజాన్ని నడిపించిన రెడ్లు ఇప్పుడు చాలా వరకు చితికి పోయారు. అయినప్పటికీ వారి పేరువెనక రెడ్డి పదం వారి అస్తిత్వాన్ని ఇబ్బందుల్లో పడవేస్తున్నది. అంబేద్కర్ బొమ్మను తన ఆరాధకుడిగా చూపెడుతున్న వారు అభ్యుదయ వాదులుగా ఎందుకు కొనియాడబడుతున్నారు?  అదే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బొమ్మను అభిమానంతో పెట్టుకుంటే కులగజ్జిగా ఎందుకు ఎత్తి  చూపబడ్తున్నారు !? 

లోపం ఎక్కడ ఉంది? చూసే చూపుల్లో ఉందా? ఆలోచించే మెదళ్లలో ఉందా? భావించే మనస్తత్వంలో ఉందా? అట్టడుగు బడుగు బలహీన వర్గాలు అంటే కులాలు మాత్రమేనా? ఆర్ధిక అసమానతలు కావా? కాకూడదా? 

రెడ్డి సామాజిక వర్గం చుట్టూ ఇన్ని వివాదాలు నెలకొన్న ఈ నేపథ్యంలో అస్సలు ఈ రెడ్లు ఎవ్వరు?  రెడ్డి పదానికి అంత శక్తి ఎందుకున్నది? నిజంగానే రెడ్డి పదం శక్తి వంతమైనదా? ఇదే నిజమైతే రెడ్లల్లో పేదలు నిరుపేదలు ఎందుకు ఉన్నారు? అస్సలు రెడ్డి పదాన్ని ఒక హోదాగానో ఒక దర్పంగానో భావిస్తూ ఆ క్రమంలో ఆ పదాన్ని ఎందుకు 
అహంకారానికి సూచికగా భావిస్తున్నారు !?

▪️ఇతిహాసాల్లో

ఇతిహాసాల్లో రెడ్ల ప్రస్తావన లేదంటూ , శూద్రులు బ్రహ్మణుల  వైశ్యుల ప్రస్తావన మాత్రమే  ఉందంటూ 
కొందరు ప్రశ్నిస్తున్నారు. మరి కొందరు  రెడ్లు శూద్రులు అంటున్నారు. ఈ విషయమై  అనేక  వాద వివాదాలు జరుగుతున్నాయి.
ఈ శూద్రులు పదం ఆధారంగా   రెడ్ల ఉనికిని గురించి  ఆలోచన చేస్తే రెడ్లకు శూద్రులు పదానికి  సంబంధం అనేక సందేహాలను  కలిగిస్తున్నది.శూద్రులు అనే పదం  సూదరి  అనే పదంగా  ప్రస్తుతం అపభ్రంశం  పొంది చెలామణిలో ఉన్నది. సూదరోళ్లు అనే పదం  తెలంగాణ ప్రాంతంలో మనం  గమనించవచ్చు. అట్లాగే కాపోళ్ళు అనే పదాన్ని  కూడా  మనం  గమనించవచ్చు. ఈ కాపులు ఎవ్వరు అనేదే ఇప్పుడు కావాల్సిన చరిత్ర.

ఇతిహాసాల్లో రెడ్డి పదం కనబడదు. కానీ క్షత్రియులు పదం  కనిపిస్తుంది. క్షాత్రధర్మం పాటించిన లేదా అనుసరించిన వర్గాల్లో రెడ్డి, వెలమ , కమ్మ వర్గాలు ఉన్నాయి. ఇందుకు ఉదాహరణగా పలనాటి యుద్ధం లో బ్రహ్మనాయుడు, నాయకి నాగమ్మలు కనిపిస్తారు.

తెలుగు ప్రాంతాల్లో రెడ్లు, మహారాష్టలో కుంభిలు, గుజరాత్ లో పటేళ్లు, క్షత్రియ ధర్మం  వహించిన వర్గాలు. దక్షిణ భారతంలో  మాత్రమే  రెడ్లు ఎందుకు కనిపిస్తారు అనేది అపరిపక్వమైన  ప్రశ్న.. 

తెలుగు ప్రాంతాల్లో మాత్రమే వినిపించే కుమ్మరి కమ్మరి  వడ్రంగి మాదిగ  మంగలి  పేర్లు ఇతర  ప్రాంతాల్లో   వినబడవు. శూద్రులు క్షత్రియులు బ్రాహ్మణులు వైశ్యులు  ఇవే ప్రామాణిక పదాలు.

▪️ రెడ్ల_పూర్వచరిత్ర - చారిత్రక ఆధారాలు 

రెడ్డి మూలం రాష్ట్రకూటులతో ముడిపడి ఉన్నట్టుగా చరిత్ర చెబుతున్నది.సురవరం ప్రతాపరెడ్డిగారు ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేసారు. అయినప్పటికీ రెడ్ల పుట్టు పూర్వోత్తరాలు గురించి చరిత్రకారులు పరిశోధకుల్లో ఇప్పటికీ భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ   ఒక సమయంలో వారు యోధుల కులం - సాగు కులం అనేది నిర్వివాదాంశం ! 

ఏడవ  శతాబ్దంలో రాష్ట్ర కూటులు దక్షిణ భారతానికి వచ్చారు అని చరిత్ర చెప్తున్నది. ఈ క్రమంలో  యోధులైన రాష్ట్ర కూటులే  గ్రామాధికారులుగా చెలామణి అవుతూ జనవ్యవహారంలో రట్టగుడులుగా పిలవబడ్డారు అనేది పరిశోధకుల నిర్దారణ. 

క్రీ. శ. 1065 వ ప్రాంతములో రట్టగుడులు  రడ్డిగా మారి, ఆతర్వాతే క్రమంగా రెడ్డిగా మారిపోయారు అని మెదక్ జిల్లా ములుగు గ్రామము వద్ద లబించిన కల్యాణి చాళుక్యులకు సంబందించిన శాసనం తెలియజేయుచున్నది.  ఈ ములుగు  శాసనము ప్రకారము కదిరడ్డి మినిరడ్డి అనే పేర్లు తెలుస్తున్నాయి. వీరిని  గ్రామపెద్దలుగా  చరిత్ర కారులు అంచనా వేస్తున్నారు. 

8 - 10 శతాబ్దాలలో రాష్ట్రకూటులు మధ్య  ఉత్తర భారతదేశంలో తమ రాజకీయ విస్తరణని  విస్తృతంగా గావించారు. ఈ నేపథ్యంలో తమ  ఆధ్వర్యంలో  బంధువులు స్నేహితులు శ్రేయోభిలాషులకు రాజ్యల బాధ్యతలని అప్పగించారు. ఇదే క్రమంలో తమ వ్యూహ ప్రతి వ్యూహాలతో బాదామి చాళుక్యుల రాజ్యాలను వీరు జయించి దక్షిణభారతంలో రాజ్య విస్తరణ చేసిన రాష్ట్ర కూటులు  తెలుగునేలమీద తమ శౌర్య పతాకను  రెపరెపలాడించారు.

ఈ క్రమంలో -
మొదట్లో గ్రామాధికారులుగా పనిచేసిన రాష్ట్రకూటుల సంతతి ఆ తర్వాత కాకతీయుల కాలంలో సైనికాధికారులుగా సామంత రాజులుగా పని చేసారు.ఇనగాల బమ్మిరెడ్డి,రేచెర్ల నామిరెడ్డి,బేతిరెడ్డి  రుద్రిరెడ్డిలు సైనికాధికారులుగా పని చేసినట్లు శాసన ఆధారాలు ఉన్నాయి. 

ఈ రడ్డిలు లేదా రెడ్డిలు ఉత్తరభారతదేశం మహారాష్ట్ర నుంచి వచ్చినవారు.   మహారాష్ట్ర మహారట్ట  నుండి వచ్చింది. అట్లాగే రాష్ట్రకూటుల్లో రాష్ట్ర పదం పలకడంలో
రట్ట అయ్యింది. ఈ రట్ట పదం లట్ట కూడా అవుతుంది.

 “లట్టలూరు పురవరాధీశ్వర” అని ప్రస్తుతించడంలో  లట్టలూరు అనేది మహారాష్ట్రలోని లాతూరు ప్రాంతం. ఆ ప్రాంతం నుంచి వచ్చిన వారే రట్టలు. ఈ రట్టలు కాలక్రమంలో  రడ్డిలుగా మారి రెడ్డిలు అయ్యారు. 

లాతూరు రట్టలు తిరె  భాష మాట్లాడుతారు కాబట్టి తిరెవారు అని కూడా అంటారు. వారి తిరె భాషలో మరాఠీ భాష ఎక్కువగా మిళితమై ఉంటుంది. 

రట్టలు  ఉత్తర భారతం నుండి దక్షిణ భారతదేశానికి వచ్చి మొదట ఉత్తర తెలంగాణలో ఉనికి చాటుకున్నారు  వారి ఉనికిని సూచిస్తూ ఊర్లు కూడా ఏర్పడ్డాయి. కరీంనగర్ దగ్గర తిరెపల్లి (5 కి.మీ.) తిరెవెల్లి (25 కి.మీ.) గ్రామాలు ఈ విధంగా
ఏర్పడిన గ్రామాలే.

ఈ విధంగా తెలంగాణాలో ఆధిపత్యం చెలాయిస్తూ రెడ్డి కులజులు ప్రవేశించారని అర్థమవుతుంది. ఇది మొదలు తెలంగాణా శాసనాల్లో లో రెడ్డి కులస్థులు చాలా మంది కన్పిస్తారు.

▪️రచ్చబండ నుండి రెడ్డి వరకు

రట్టొడులు పంచాయితీ  తీర్పులు చెప్పిన  స్థలం  రట్టడం . ఇదే కాల క్రమంలో  రచ్చబండ  అయ్యింది.రట్టొడులు పంచాయితీలు చెప్పేవిధానం  కాలక్రమంలో రెడ్డిగం అయ్యింది. పంచాయితీ  సమయంలో ధరించే  పెద్ద తలపాగా పంచకట్టు  దుస్తుల సంప్రదాయం నేటికిని కొనసాగుతున్నది.

▪️దక్షిణ భారతీయులే రెడ్లు

రెడ్లు ఉత్తరాది నుండి వలస వచ్చిన  వాళ్లుగా చెప్తున్నదరిమిలా , నవీన  పరిశోధనలు  ఈ వాదన  కొట్టిపడేస్తున్నాయి. రెడ్లు ఉత్తరాది వాళ్ళు కాదు  అంటూ.... రాష్ట్రకూటులతో  సామాజిక రాజకీయ  సత్సంబంధాలు  ఏర్పర్చుకున్న  వర్గాలు రెడ్లు అంటూ కొత్త చరిత్రకు  శ్రీకారం చుడుతున్నాయి.

✔️దక్షిణాది రెడ్ల రూపు రేఖలకు  ఉత్తర భారతీయులకు ఎక్కడా పోలిక కుదరడం లేదు.
✔️రెడ్ల ఆహారపు అలవాట్లు  ఉత్తర భారతదేశస్తుల ఆహారపు అలవాట్లకు  పోలిక కుదరడం లేదు
✔️ 10 - 11 వ శతాబ్దంలో రాజ్యాధికారంలో  భాగస్వామ్యం వహించిన  నాయకి  నాగమ్మ నుండి,  13 - 14 శతాబ్దాల్లో రాజ్యాధికారం సాధించి  రాజ్య స్థాపన  చేసిన  కొండవీటి  రెడ్డిరాజుల  వరకు శైవమతం  ఆచరించారు. శివుడిని  రుద్రం కాలభైరవం వంటి  వివిధ  రూపాల్లో శివుడిని  ఆరాధించారు. ఇది దక్షిణాది ఉనికిని బలంగా  నిరూపిస్తున్నది.

▪️కాకతీయుల కాలంలో

కాకతీయ  పాలకుడు మొదటి ప్రతాపరుద్రుడి కాలంలో  భూస్వామ్య వాదులలో కొందరు రెడ్డిలు ఉన్నారు.  ఈ సమయంలో  రెడ్డీలు తమ ఆధిపత్యం కోసం భూస్వామ్య వ్యవస్థను  రూపొందించారు.  వారిలో ప్రముఖంగా మునగాల రెడ్లను  ముందు వరసలో  చెప్పుకోవచ్చు. 

మునగాలకు పశ్చిమాన రెండు మైళ్ళ దూరంలో ఉన్న తడవాయిలో   మునగాల జమీందారి వ్యవస్థకు సంబంధించి  రెండు శాసనాలు కనుగొనబడ్డాయి-

ఒకటి -  క్రీ.శ 1300 నాటిది.
రెండవది - క్రీ.శ 1306 నాటిది.

మునగాల రెడ్డి ముఖ్యులు కాకతీయ రాజవంశానికి భూస్వామ్యవాదులు అని తెలుస్తుంది.  ఈ శాసనాలు మునగాల అన్నయ్యరెడ్డిని కాకతీయ పాలకుడు ప్రతాప రుద్ర అధిపతిగా ప్రకటించాయి.

ఈ నేపథ్యంలో  రెడ్ల మూలాలు రాష్ట్రకూటులతో ముడిపడి ఉన్నాయనే వాదనకు బలం చేకూరుతున్నది.
పాలనాధికారులు చేపట్టిన రట్టలు  రెడ్లుగా అవతరించారని అర్థం అవుతున్నది. పాలనాధికారాలతో ఈ సమూహం ఒక బలమైన శక్తిగా  ఎదిగి పోయిందని కూడా అర్థం అయ్యింది. 

▪️ బిరుదుగా_రెడ్డి

జన్మతాః సిద్దించిన శక్తి యుక్తులు, శౌర్య ప్రతాపాలు కారణంగా  ఆధిపత్య ధోరణి అనివార్యంగా అలవర్చుకున్నారు. ఈ క్రమంలో భూస్వామ్య వ్యవస్థను సృష్టించారు. సామజిక అధిపతులుగా పైచేయి ప్రదర్శించారు. రైతులుగా సాగుదారుల సమాజాన్ని సుస్థిరం చేశారు. దానం దయ బుద్దులతో రక్షకులుగా అండదండల్ని కొనసాగించారు. అన్నదాతలుగా పేరు గడించారు. ఈ గుణగణాలతో    సమూహ ప్రజల  యజమానులుగా ఏక ఛత్రాధిపత్యం గావించారు !

ఈ క్రమంలో -
కాకతీయులు స్వతంత్ర పాలకులుగా మారిన తరువాత, 
వారి పాలనలో ఉన్న వివిధ అధికారులకు ముఖ్యలకు   రెడ్డి అనే బిరుదును ఉపయోగించినట్లు తెలుస్తున్నది. 
 కాకతీయ యువరాజు ప్రోలరాజు (1052 -1076 ) ను కూడా ఒక శాసనం లో "ప్రోలారెడ్డి" అని పిలుస్తారు.   అట్లాగే పనితనంతో ఏమాత్రం తేడా వచ్చినా రెడ్డి బిరుదును వెనక్కి తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నయని కూడా అంటారు. 

మహదేవపూర్‌లో ప్రతాపగిరికోట ఉన్నది  ఈ కోటను ముచ్చ నాయకుడు కట్టించాడు. ఈ ముచ్చనాయకుడి పేరు   రామగుండం మండలం అడవిసోమనపల్లి శాసనంలో  ముచ్చరెడ్డిగా  రాయబడింది.   రామేశ్వరీ పేరుతో ఉన్న దేవతకు   పన్నప (భూదానం) చేసిన  వివరాలని తెలియజెప్పే శాసనం ఇది.  

కాకతీయ రాజు మొదటి ప్రతాపరుద్రుడుగా పిలవబడే రుద్రదేవుడు ( క్రీ. శ. 1158-1195) చేతిలో క్రీ.శ. 1159లో జగ్గదేవుడు ఓడిపోతాడు. ఓటమి తర్వాత జగ్గదేవుడు తనను తాను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా  తనను శత్రురాజులు  ఎవ్వరూ గుర్తు పట్టకుండా  అజ్ఞాతం వహిస్తూ తన పేరును జగ్గారెడ్డిగా మార్చుకుని ఉంటాడు అని పరిశోధకులు భావిస్తున్నారు. రెడ్డి పదం పాలనకు పర్యాయపదం గా అర్థమౌతున్న సందర్భంలో జగ్గదేవుడు కూడా తన పేరుని పాలనను సూచించే క్రమంలోకి మార్చుకుని ఉంటాడు  అనేది పరిశోధకుల  వాదన.ఇతడే నాయకురాలు నాగమ్మ తండ్రి అయ్యిఉంటాడు అనేది కూడా ఒక వాదన

ఈ విధంగా కాకతీయులు రెడ్డి పదాన్ని బిరుదుగా స్వీకరించి సమర్థులకు అభిననందన పూర్వకంగా 
అందించారు. 
 
▪️అసఫ్ జాహీల కాలంలో 

నిజాం కాలానికి వచ్చేసరికి రెడ్డి ఒక జాతి వాచకంగా స్థిరపడి ఉన్నది.  వీరి కాలంలో  రెడ్లు  సంస్థానాధీశులు, జమీందారులు,  దొరల పేరుతో పాలనా పగ్గాలను స్వీకరించడం జరిగింది.  

ఈ నేపథ్యంలో అసఫ్ జాహీలు  బిరుదులుగా ప్రత్యేక పదాలని ఎంచుకున్నారు. ఈ క్రమంలో సంస్థానాధీశులు  రావు ,   భూపాల్,  సవాయ్, వంటి గౌరవ  బిరుదులు పొందారు. దొరలు మాత్రం  దేశముఖ్ ,  దేశాయ్, వంటి గౌరవ బిరుదులు పొంది  పాలన కొనసాగించారు. 

మొత్తానికి  రెడ్డి  పదం సమర్థత అనే అర్థంలో ఒక బిరుదుగా పాలనకు మారుపేరుగా కొనసాగింది.

▪️ రెడ్డిపదం_తొలగించిన_నాయకులు 

రెడ్డి అంటే పాలకుడు, కాపు , వంటి  అర్థం వస్తున్న నేపథ్యంలో -  కొందరు రెడ్లు రెడ్డి పదాన్ని  అధిపత్యానికి  సూచికగా  భావించి  తొలగించడం  విచారకరం. ఆధిపత్యం  అంటే  అహంకారం కాదు, పాలకులు  / నడిపించే వాళ్ళు / సారథులు / అధిపత్యంలో  ఉంటారు.

ఈ క్రమంలో -
పుచ్చలపల్లి సుందరరామిరెడ్డి సుందరామయ్యగా  .... భవనం వెంకట్రామిరెడ్డి  భవనం వెంకట్రాంగా .....
ముద్దసాని కోదండరామిరెడ్డి కోదండరాంగా  .  కొండపల్లి సీతారాంరెడ్డి కొండపల్లి  సీతారామయ్యగా మారిపోయారు .ఎందుకు? మేము పాలకులు కాదు అని ఈ పెద్దమనుషులు పరోక్షంగా ప్రకటించుకున్నారా? లేకా 
రెడ్డి పదాన్ని వృత్తి ధర్మానికి కాకుండా అసమానతకు ప్రతీకగా తీసుకున్నారా? 
పాలించేవాడు / సమర్థ పాలకుడు వంటి  అర్థాన్ని విపరీత కోణంలో మహానుభావులు చూడటం పొరపాటా?  గ్రహపాటా? 

 ▪️వృత్తిధర్మంమే_రెడ్డి  

మొత్తానికి  రెడ్డి పదం కులం కంటే ముందుగా  అది క్షత్రియ వృత్తి ధర్మం మాత్రమే. ఇది చారిత్రక ఆధారాలతో స్పష్టంగా అర్థం అవుతున్నది. అట్లాగే శౌర్య ప్రతాపాలు వారి అనాది గుణం అని కూడా అర్థం అయ్యింది. 

కాలక్రమంలో కులాలు ఏర్పడిన తర్వాత రెడ్డి సమూహం ఒక కులంగా సమాజంలో స్థిరపడింది. కాగా నేటికిని రాయలసీమ ప్రాంతంలో గ్రామాధికారులను రెడ్డి అని సంబోధిస్తుంటారు. ప్రస్తుత పరిస్థితులని అనుసరించి ఈ గ్రామాధికారులది రెడ్డి తెగ కాకపోయినా రెడ్లుగానే పిలవబడుతుంటారు.సీమలో ఈ రెడ్డి సమూహాలు తర్వాతి తరంలో రెడ్లుగా స్థిరపడిపోతున్న సందర్భాలు ఉన్నాయి. కానీ రాష్ట్రకూటుల నుండి వచ్చిన రెడ్లకు, ఇటువంటి రెడ్లకు సంబంధం లేదు. 

రాష్ట్రకూటులతో ఆరంభమైన రెడ్డి సంప్రదాయం తర్వాత అన్ని తెగలకు విస్తరించింది. రెడ్డి సమూహం ఈ క్రమంలో 
వివిధ వర్గాలుగా విడిపోయింది. వీటినే మనం తెగలు లేదా శాఖలుగా చెప్పుకుంటున్నాం. రెడ్ల కుల గురువు కుంటి మల్లారెడ్డి స్వామి 36 రెడ్డి తెగలు మాత్రమే సూచించాడు.  కానీ ఇప్పుడు 50 పైగా తెగలు రెడ్లల్లో కనిపిస్తున్నాయి. అంటే 36 మినహాయించి మిగతా తెగలు 
మధ్యలో పాలనాధికారం వల్ల ఏర్పడ్డవి కావొచ్చు  లేదా రెడ్ల తెగల్లోనే  చీలికలు  ఏర్పడి అంతశాఖలుగా అవతరించినవి  కావొచ్చు. 
మొత్తానికి వ్యాసం  ఆధారంగా కూడా రెడ్డి పదం పాలనా దక్షతకు పర్యాయ పదం అని అర్థం చేసుకోవచ్చు.  అంటే వృత్తివాచకమే  తర్వాత జాతి వాచకమైందనేది వాస్తవం !
ఈ రెడ్డి పదం గురించి ఇకనైనా కొందరు  అభ్యుదయ వాదం ముసుగేసుకుని విషం చిమ్ముతూ చేస్తున్న  విమర్శలు మానుకోవాలి

వ్యాసకర్త : తంగెళ్ళ శ్రీదేవిరెడ్డి
__________________________________

#ఆధారాలు : 
1)ఆంధ్రదేశ చరిత్ర  - సంస్కృతి -1
బి. ఎన్. శాస్త్రి 
2)శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారి జీవితం -రచనలు 
3)తెలంగాణ చరిత్ర -
డా. సుంకిరెడ్డి నారాయణరెడ్డి 
4)The Rise and Decline of Buddhism in India, K.L. Hazara, Munshiram Manoharlal, 
5) ఆంధ్రుల సాంఘిక చరిత్ర 
సురవరం ప్రతాపరెడ్డి 
6) చరిత్ర కారులతో మౌఖిక సంభాషణ..
7)The History of Andhra Country, 1000 A.D.-1500 A.D.
8) అఖిల భారత రెడ్ల కులగురువు కుంటిమల్లారెడ్డి స్వామి సేవా సంఘం - శ్రీశైలం వారి వివరణ

No comments:

Post a Comment