Tuesday, April 16, 2024

కొండా వెంకటరంగారెడ్డి

కొండా వెంకట రంగారెడ్డి (1890 - 1970)
(స్వాతంత్ర్య సమరయోధుడు-తొలితరం రాజకీయ నాయకుడు) 
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
తెలుగుజాతి గర్వకారణమై
ఉద్యమాల పోరు పతాకమై 
నిజాం నిరంకుశత్వంపై కన్నెర్ర జేసిన
తెలంగాణ జీవగర్ర ....
కొండా వెంకట రంగారెడ్డి ( K V రంగారెడ్డి )

హైదరాబాద్ లో భాగంగా ఉన్న రంగారెడ్డి జిల్లా వీరి స్మృత్యర్ధం ఏర్పడిందే..ఈ స్మృతిని స్మరిస్తూ వివరాల్లోకి వెళ్తే.....
ఆనాటి తెలంగాణకు చెందిన తొమ్మిది జిల్లాలలో ఒకటిగా ఉన్న హైదరాబాదు జిల్లా చేవెళ్ళ తాలూకా,మొయినాబాదు మండలం, పెద్దమంగళవారం వీరి స్వగ్రామం.. ఆంధ్ర ప్రదేశ్ అవతరణకు పూర్వము హైదరాబాదు జిల్లాను అత్రాఫ్‌ బల్దా అని కూడా పిలిచేవారు.. పెద్ద మంగళారం గ్రామానికి చెందిన మోతుబరి రైతు కుటుంబంలో విరోధినామ సంవత్సర మాఘ శుద్ధ చతుర్థి డిసెంబరు 12, 1890న రంగారెడ్డి జన్మించాడు.వీరి తండ్రి కొండా చెన్నారెడ్డి, తల్లి బుచ్చమ్మ గారు. రంగారెడ్డి గారికి ఒక సోదరుడు నారాయణరెడ్డి, ముగ్గురు చెల్లెళ్ళు . వారు వరుసగా శంకరమ్మ , రాజమ్మ, నాగమ్మ గార్లు.

 రంగారెడ్డి గారి తాత ఎల్లారెడ్డిగారు. వీరికి లక్ష్మారెడ్డి, చెన్నారెడ్డి, చంద్రరెడ్డి, వీరారెడ్డి, వెంకటరెడ్డి ఆను అయిదుగురు కుమారులు ఉండేవారు. వీళ్ళు అందరూ కలిసి ఉమ్మడి కుటుంబంగా జీవించేవాళ్ళు.
ఊరి పటేలుగిరి (గ్రామ మునసబు) కొనసాగిస్తూ . వ్యవసాయము ముఖ్యవృత్తిగా జీవించేవాళ్ళు.

" మేము గూడాటి రెడ్లము. శైవ మతస్థులము. మత గురువు బ్రహ్మశ్రీ హరిదాసు వారణాసి రామయ్యగారు.. " అని వెంకట రంగారెడ్డి గారు తన స్వీయ చరిత్రలో స్వయంగా చెప్పుకున్నారు.

▪️బాల్యం - విద్యాభ్యాసం

1. ప్రాథమిక విద్య

ఆనాటి అత్రాఫ్ లబ్ద ( హైదరాబాద్ పరిసర ప్రాంతాలు )నిజాం సొంత ఖర్చులకు మాత్రమే కేటాయించబడినందున పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలు లేకుండెను.ఆ విధంగా ప్రజలకు చదువుకునే అవకాశం లేకుండెను. స్తోమత కలిగిన వాళ్లు మాత్రం సొంతంగా గురువును నియమించుకొని లేదా హైదరాబాద్ కు పంపించి తమ పిల్లల్ని చదివించేవారు. రంగారెడ్డి తండ్రి చెన్నారెడ్డికి తన పిల్లల్ని చదివించుకోవాలి అనే బలమైన కోరిక ఉండేది. ఇందుకు హైదరాబాదుకు పంపుదమన్నా ఆర్థిక పరిస్థితి సహకరించేది కాదు.

ఇటువంటి పరిస్థితిలో స్వంత ఖర్చుతో ఒక ఉపాధ్యాయుని నియమించి, గ్రామంలో వీధిబడి పెట్టించాడు. అక్కడ తెలుగు అంకెలలో లెక్కలను, 
పెద్ద బాలశిక్ష, సుమతి, వేమన శతకములు, ఉర్దు, ఫారసీ భాషలను రంగారెడ్డి అభ్యసించాడు.   

2. మధ్యమిక విద్య

తర్వాత మేనత్త కుమారుడు లచ్చిరెడ్డి తోడుగా 1906 లో హైదరాబాదుకు పంపించారు. కాగా విద్యార్థులకు అవసరమైన వసతి గృహం హైదరాబాదులో లేకుండెను. అందుకే నాంపల్లిలో నెలకు రూ. 5/- చొప్పున రెండుగదులు అద్దెకు తీసుకుని, వంటవాడితో సహా అక్కడ ఉంచారు. పట్టణం వాతావరణం అలవాటు లేక వంట వాళ్ళు వచ్చిన వారు వచ్చినట్లే పారిపోవడం మొదలెట్టారు. ఈ పరిస్థితి వల్ల రంగారెడ్డికి చాలా ఇబ్బంది ఏర్పడింది. అప్పుడే హైదరాబాదులో ఒక వసతి గృహం అవసరం అనే ఆలోచన రంగారెడ్డి మెదడులో తటస్థించింది.

ముఖ్యంగా రంగారెడ్డి హైదరాబాదు చేరుకునే సమయానికి 16 సంవత్సరాల వయస్సు ఉన్న బాలుడు. కాగా గ్రామంలో చదువుకున్న చదువు ప్రభుత్వ ప్రమాణాలకు సరిపోదు కాబట్టి, అక్కడ ఈ పాఠశాలలో చేరేందుకు కనీస ఆంగ్ల ప్రవేశం లేదు కాబట్టి రంగారెడ్డిని లచ్చిరెడ్డిని ఒకటవ క్లాసులో కూర్చోబెట్టారు. రంగారెడ్డి ఇబ్బంది పడ్డాడు. అయినప్పటికీ చదువుకోవాలనే ఆశతో ఇబ్బందిని అధిగమించాడు. ఆంగ్లం నేర్చుకుని ఆరవ తరగతికి ప్రమోషన్ పొందాడు.

తర్వాత మధ్యమిక విద్య పరీక్షల్లో యోగ్యత సాధించడం కోసం మౌల్వీమహమ్మదు ఖాసిం సాహెబు అను ఒక ఉపాధ్యాయుని ఏర్పాటు చేశాడు. తండ్రి చెన్నారెడ్డి.. రంగారెడ్డి - లచ్చిరెడ్డి . ఇద్దరికి కలిపి రూ 10 లు అడ్వాన్సుగాను, పరీక్షలో ఉత్తీర్ణులైన తరువాత రూ.25 లు ఇచ్చునటుల ఒప్పందము చేసుకున్నారు.
మౌల్వి నేర్పించిన విద్య వలన మిడిల్ స్కూల్ ప్రవేశం సాధించాడు రంగారెడ్డి. కానీ మౌల్వి గారు మిగతా 25 రూపాయలు అడగలేదు. తనదారిన వెళ్ళిపోయాడు. 1907 లో రంగారెడ్డి మాధ్యమిక విద్య పూర్తయింది.

 తర్వాత కాలంలో రంగారెడ్డి గారు క్యాబినెట్ మినిస్టర్ అయిన తర్వాత మౌల్వి గారి ఆచూకీ తెలుసుకొని ఇంటికి పిలిచి 250 రూపాయలు గురుదక్షిణగా ఇవ్వబోయాడు కానీ మాల్వి గారు తిరస్కరించారు. తన శిష్యులు ఎదుకుటయే తనకు గురుదక్షిణగా చెప్పుకున్నాడట. ఈ విషయాన్ని రంగారెడ్డి గారు తన స్వీయ చరిత్రలో చెప్పుకున్నారు.

3.వాకాలత్ విద్య ( వకీలు )

లా విద్యార్థుల కోసం మౌల్వీ ఇబ్రాహింఅరీ సాహెబు అనే వకీలు హైదరాబాదు కోకాతట్టిబజారులో ఒక ప్రయివేటు తరగతులు నిర్వహించేవాడు. ప్రతిరోజు సాయంత్రము 5_30 గంటల నుండి రాత్రి 8 గంటలవరకు తరగతులు ఉండేవి. రంగారెడ్డి ఆ తరగతులకు ప్రతినిత్యం హాజరై న్యాయ శాస్త్రం గురించి గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాడు.

▪️వకీలు వృత్తి :

 1909 లో మూడవ గ్రేడు వకీలుగా తన న్యాయవృత్తిని ప్రారంభించాడు రంగారెడ్డి. కానీ ఆనాటి సీనియర్లు జూనియర్లకు ప్రతిఫలం ఇచ్చే వాళ్ళు కాదు..పైగా పని నేర్చుకునే అవకాశం కూడా కల్పించేవారు కాదు. ఇటువంటి పరిస్థితుల్లో తండ్రి చెన్నారెడ్డి తమకు తెలిసిన ఒక సీనియర్ లాయర్ వద్ద రంగారెడ్డిని చేర్పించాడు. కానీ అతని దగ్గర రికార్డులు సరిగ్గా ఉండకపోవడంతో రంగారెడ్డి గారికి అక్కడ కుదరలేదు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్లకుండా తన స్వశక్తిని నమ్ముకొని పనిచేయడం ప్రారంభించాడు.

ఈ క్రమంలోనే సమాజాన్ని పీడిస్తున్న రెండు సమస్యలను అది దగ్గర నుండి చూసాడు.
1. స్త్రీల సామాజిక న్యాయపరమైన సమస్యలు
2. సమాజంలో పేరుకొని ఉన్న అస్పృశ్యత

, ▪️ రాజ బహదూర్ వెంకట రామారెడ్డి గారితో పరిచయం :

హైదరాబాదు జిల్లాలోని ఎనికపల్లి గ్రామ జాగీర్దారు నవాబ్ రజాబ్ అలీబేగు ఉండేవారు. అతడు తన సొంత పనుల నిమిత్తం 20 వేలు రూపాయలు అవసరమై తన జాగీరు రైతు రామిరెడ్డి అనే రైతును జమానతు అడిగాడు. రామిరెడ్డి అందుకు తిరస్కరించాడు .. ఎందుకు ఆగ్రహించిన జాగీర్దారు రామిరెడ్డి ఆస్తిపాస్తులను లాగుకొని, గ్రామమునుండి వెళ్లగొట్టే ప్రయత్నం చేశాడు. జాగిర్దార్ దౌర్జన్యాన్ని గురించి రామిరెడ్డి పోలీసులకు విన్నవించుకున్నాడు. ఈ రామిరెడ్డి ఎవరో కాదు రంగారెడ్డి గారికి ఈ సమీప బంధువు. మధ్యతరగతి వాడు. తన ఆస్తిపాస్తులు అన్ని అమ్మినా కూడా 20,000 రానివాడు. రంగారెడ్డి అతడికి న్యాయం చేయాలని సంకల్పించాడు.

ఆ సమయంలో బహద్దరు వెంకటరామారెడ్డిగారు (రాజాబహద్దరు బిరుదు తరువాత వచ్చినది) హైదరాబాదు జిల్లాకు పోలీసు సూపరింటెండెంటుగా ఉన్నారు. రాజాబహద్దరుగారు ఒక వాయిదా తేది (పేషి) పెట్టి ఇద్దరు కక్షిదారులను పిలిచాడు.. ఆ వాయిదాకు రామిరెడ్డి పక్షాన రంగారెడ్డి వెళ్ళాడు. రామిరెడ్డి తో కలిసి గారుకలిసి ఒక జట్కా (గుర్రపుబండి) లో వెళ్లడం జరిగింది.. జాగీర్దారు మాత్రం తన ఇద్దరు హైకోర్టు వకీళ్లు బ్యారిస్టరు డిసౌసాంటా మౌల్వీ ఇబ్రాహిం ఫారోఖి (ఆ రోజులలో వీరిద్దరు సుప్రసిద్ధులైన హైకోర్టు లీడింగు వకీళ్ళు) తో కలిసి ముగ్గురు ఒక మోటారులోవచ్చారు..

ఈ సందర్భాన్ని రాస్తూ రంగారెడ్డి గారు తన స్వీయ చరిత్రలో " ఆ కాలములో హైదరాబాదులో మోటార్లసంఖ్య చాలా చాలా తక్కువగా ఉండేది.మోటారు పోతున్నదంటే రోడ్డుమీదికి జనులు పరుగెత్తుకొనివచ్చి ఆశ్చర్యముగా చూసేవారు. మోటారులో వచ్చేవారు చాల గొప్పవారని భావించేవారు." అని చెప్పారు.

 ఉభయ పార్టీలు మలక్ పేటలో ఉండే రాజాబహద్దరు వారి ఆఫీసులోకి వెళ్లారు. అప్పుడే రాజ బహదూర్ వెంకట్రామారెడ్డి గారిని రంగారెడ్డి గారు తొలిసారిగా చూశారు.

 కేసు మళ్లీ వాయిదా పడింది. జాగిర్ధర్ తన మనుషులతో వెళ్లిపోయాడు.వాళ్ళు వెళ్లిపోయాక రాజాబహద్దరుగారు రంగారెడ్డి నుండి కేసు వివరములు తెలిసికొని " రామిరెడ్డిగారి ఆస్తిపాస్తులను రక్షిస్తాను. భయపడకండి' అని అభయం ఇచ్చాడు. అంతేకాదు, ప్రతి శుక్రవారము సెలవు కనుక సాయంత్రము తమ ఇంటికి రావలసిందిగాను , అక్కడ జరిగే రాజకీయ సామాజిక కార్యక్రమాల ద్వారా అనుభవాన్ని పెంపొందించుకోవాల్సిందిగాను, చెప్పాడు. ఆ విధంగా రాజ బహదూర్ వెంకట్రామిరెడ్డి గారికి రంగారెడ్డి గారికి కాలక్రమంలో సాన్నిహిత్యం ఏర్పడింది.

ఈ సందర్భాన్ని రంగారెడ్డి గారు తన స్వీయ చరిత్రలో చెబుతూ 
" రాజాబహద్దరుగారు కొంతకాలము కోర్టు ఇనస్పెక్టరుగా పని చేసినందున వకాలతులో కూడ వారికి కొంత అనుభవం ఉన్నది..వారు 
 విద్యా ప్రియులు, ఉర్దు, ఫారసీ భాషలలో విద్వాంసులు. వక్తలు, రాజకీయ తంత్రజ్ఞులు, విద్యార్థులంటే. ప్రజాసేవా కార్యములంటే చాల అభిమానము. పోలీసు ఉద్యోగములో నున్నను ధైర్యముతో ప్రజాహిత కార్యకర్తలకు ఎంతో సహాయము చేసెడివారు." అని పేర్కొన్నాడు.

▪️శాసనసభ సభ్యత్వము

 నిజాం ప్రభుత్వంలో మజ్లీసే వజేఖా వానిన్( Lagislative Council ) పేరుతో శాసనసభ ఉండేది.అందులో 21 మంది సభ్యులుండేవారు. వీరిలో 10 మంది నామినేషన్తో ఎన్నుకోబడేవారు. ఇద్దరు రాష్ట్రం మొత్తంలో ఉన్న సుమారు 3 వేల మంది వకీళ్ళ, ఆడ్వొకేటుల ఓటు వల్ల ఎన్నుకోబడేవారు.ఒక హైకోర్టు న్యాయమూర్తి అధ్యక్షతలో ప్రతి 2 సంవత్సరముల కొకసారి ఎన్నుకోబడేవారు..1936వ సంవత్సరపు ఎన్నికలలో పోటీచేసి కె.వి రంగారెడ్డి గారు ఎన్నుకోబడ్డారు. ఎన్నిక తర్వాత తన మనసులో ఉన్న అభిప్రాయాలను ఆశయాలను అనుసరించి , 24 చిత్తు శాసనములను, సవరణ శాసనములను ప్రవేశ పెట్టాడు 
  1. స్త్రీలకు వారసత్వపుహక్కు ,
2, వర్ణాంతర వివాహము చేసికొంటే వారి సంతానము సక్రమ సంతానంగా భావించుట 
3. బాల్య వివాహ నిరోధము.
4. విధవ వివాహము 
5. అస్పృశ్యతా నివారణము.
6. జాగీర్ల రద్దు (Abolition of Jagirs)
 7. ఉద్యోగాల నియామకం కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ (Public service commision) స్థాపన, . 8 అప్పుల వసూళ్లలో దౌర్జన్యము చేయరాదు
వంటి సాధారణ ప్రజలకు న్యాయము చేకూర్చే శాసనములను ప్రవేశపెట్టాడు.

▪️ రెడ్డి జన సంఘం సంయుక్త కార్యదర్శిగా..
      రెడ్డి బోర్డింగ్ కార్యదర్శిగా... 

విద్యార్థిదశలో వసతి గృహం లేక తాను ఎదుర్కొన్న ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని 1910లో దూర ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థుల సౌకర్యము కొరకు హైదరాబాదులో ఒక వసతిగృహమును స్థాపించే ప్రయత్నం చేసాడు. ఇందుకు నెలకు రూ. 10లు ఫీజు వసూలు చేయాలని నిర్ణయించుకున్నాడు.. అనుకున్న ప్రకారం ప్రకటన ఇచ్చుకున్నాడు కానీ విద్యార్థులు ఎవరూ రాలేదు ముగ్గురు మాత్రమే 30 రూపాయలతో వచ్చారు. అప్పటికి రంగారెడ్డి గారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉండటంతో వసతి గృహం ఏర్పాటు ఆలోచన విరమించుకున్నాడు... కానీ మనసులో మాత్రం ఆ ఆలోచన తొలిగిపోలేదు. తన ఆర్థిక పరిస్థితి నిలదొక్కుకుంటే సగం ఖర్చులు తాను భరించుకొని, వసతి గృహం ఏర్పాటు చేయాలనుకున్నాడు..కానీ అందుకు కూడా పరిస్థితులు సహకరించలేదు.

//రెడ్డి హాస్టల్ బాధ్యత నిర్వహణలో భాగస్వామ్యం...//

1918 వ సంవత్సరములో వనపర్తి సంస్థానా దీశులు శ్రీ రాజారామేశ్వరరావుగారి కూతురు వివాహం జరిగింది ( రాజ బహదూర్ వెంకట్రామారెడ్డి స్వీయ చరిత్రలో 1916 అని పేర్కొనబడింది). ఈ సందర్భములో వెంకట్రామారెడ్డి ఆధ్వర్యంలో 
 హైదరాబాదులో విద్యార్థుల కోసం ఒక వసతి గృహమును ప్ర్రావంభించాలని నిర్ణయింపబడింది.
ఇందుకు విరాళాలు కూడా అక్కడే ప్రకటించారు.

రూ 26,000లు. గద్వాల సంస్థానాదీశులు.
రూ. 25,000లు శ్రీ పింగిలి వేంకటరామారెడ్డి గారు. రూ. 10,000 లు. మరికొందరు అభిమానులు..

హైదరాబాదు జాంబాగు బస్తీలో "రెడ్డి బోర్డింగ్" ఆను పేరుతో 1918 వ సంవత్సరములో అద్దె ఇంట ఒక వసతిగృహము స్థాపింపబడింది., దీనికి రాజాబహద్దరు వేంకటరామారెడ్డిగారు జనరల్ సెక్రెటరీగా, భోలక్ పూరు రంగారెడ్డి. కిషన్ గార్లు సంయుక్త కార్యదర్శులుగా ఏర్పడ్డారు. . కాని ఆరు నెలల్లోనే ఇద్దరు కార్యదర్శులు విరమించుకొన్నారు. అప్పుడు రాజాబహద్దరుగారు కేవి రంగారెడ్డి గారిని పిలిచి పిలిచి - " విద్యార్థుల కొరకు వసతి గృహం నీ సంకల్పం కాబట్టి నీవు రెడ్డి జనసంఘమునకు సంయుక్త కార్యదర్శిగాను, రెడ్డిబోర్డింగుకు కార్యదర్శిగాను పనిచేస్తే బాగుంటుంది " అని సూచించారు.. అందుకు వెంటనే సమ్మతించిన రంగారెడ్డి అందుకు పదవులను 1919 నుంచి 1929 వరకు పది సంవత్సరములు ఆ పదవుల్లో కొనసాగాడ. తరువాత జరిగిన ఎన్నికల ననుసరించి రెడ్డి జనసంఘమునకు కోశాధిపతిగాను. ఉపాధ్యక్షుదుగాను, అధ్యక్షుడుగాను, కార్యనిర్వాహక వర్గ సభ్యుడుగాను విరామం ఎరుగక పనిచేశాడు.

 తన బాధ్యతలు స్వీకరించిన వెంటనే హాస్టల్ ఫీజు విషయంలో ఒక లోపాన్ని గమనించాడు రంగారెడ్డిగారు....హాస్టల్ ఫీజు 20 రూపాయలు. ఇంత భారాన్ని పేద విద్యార్థులు మోయలేరు. రాజులు, దేశ్ముఖ్ పిల్లలు హాస్టల్లో చేరడానికి ఎక్కువగా వస్తున్నారు.. ధనవంతుల పిల్లలకు హాస్టల్ లేకపోయినా అద్దె ఇళ్లల్లో ఉండగలరు. అందుకే కార్యవర్గ సభ్యులతో మాట్లాడి 20 రూపాయల ఫీజును 12 రూపాయలకు తగ్గించ గలిగాడు. తగ్గిన ఫీజులతో పేద నిరుపేద మధ్యతరగతి పిల్లలు హాస్టల్ కి ఎక్కువగా రావడం మొదలెట్టారు. ఆ విధంగా పేద పిల్లలు ఎటువంటి పెద్ద భారం లేకుండా చదువుకోసాగారు.ఈ ఘనత కె.వి రంగారెడ్డి గారికి దక్కుతుంది.

తర్వాత రంగారెడ్డి గారు రెడ్డి జనసంఘమునకు సంయుక్త కార్యదర్శిగా కొనసాగుతున్న సమయంలోనే, సంఘం ఆధ్వర్యంలో. అనేక జనహిత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబడింది.అందులో భాగంగా 
జాంబాగులో బాలుర పాఠశాల స్థాపించబడింది.

" రెడ్డి బోర్డింగ్ " కాలక్రమంలో రెడ్డి హాస్టల్ గా మారిపోయింది.

▪️ గ్రంధాలయోధ్యమంలో 

1918 వ సంవత్సరములో శ్రీ కృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయ జీవితకాల సభ్యుడిగా రంగారెడ్డి నియమించబడ్డాడు. ఈ నియామకంతో ప్రజాహిత కార్యక్రమాల్లో రంగారెడ్డి బాధ్యత పెరిగింది. తర్వాత బాల సరస్వతీ భాష నిలయం, శ్రీ వేమన ఆంధ్రభాష నిలయం, ఆంధ్ర సారస్వత పరిషత్తు,మద్ది నారాయణరెడ్డి నిర్వహించిన సర్వోదయోద్యమం,దక్షిణ భారత హిందీ ప్రచార సభ, మొదలగు సంస్థల అభివృద్ధిలో కీలక పాత్ర వహించాడు.

 తెలంగాణలో రాజకీయ సామాజిక పరిస్థితుల కారణంగా 1921 వ సంవత్సరము నవంబరు 21 వ తేది నాడు "ఆంధ్ర జన సంఘము" స్థాపించబడింది. బూర్గుల రామకృష్ణారావు, నందమూల నరసింగరావు, మందముల రామచంద్రారావు, మొదలగు వారు జనాల్లో చైతన్యం కోసంగ్రంధాలయ ఉద్యమంలో ప్రవేశించారు..ఇందులో రంగారెడ్డి భాగస్వామ్యం కూడా ఆరంభమయింది. అందరూ కలిసి తెలంగాణలో అనేక ప్రాంతాల్లో గ్రంథాలయాలు స్థాపించారు... ఈ క్రమంలో వకాలత్ వృత్తికంటె ప్రజాహిత కార్యములలో రంగారెడ్డి గారికి శ్రద్ద మరింత ఎక్కువయింది.

▪️ఆంధ్రమహాసభ అధ్యక్షుడిగా....
1930 లో " ఆంధ్ర జన సంఘము " పేరు " ఆంధ్ర మహాసభ " గా మార్చబడింది. మహాసభ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఒకచోట మహాసభ నిర్వహించడం కూడా ఆరంభం అయ్యింది.. ఒక్కో ఆంధ్ర మహాసభకు ఒక్కో ఉద్దండులు నాయకత్వం వహిస్తూ వచ్చారు.అయితే ఏ ఆంధ్ర మహాసభ అధ్యక్షులు కూడా తమ అధ్యక్షకాలములో శాసనసభ సభ్యులుగా లేకుండిరి. ఐదవ ఆంధ్రమహాసభ అధ్యక్షుడనయిన రంగారెడ్డి మాత్రము శాసనసభ సభ్యత్వమునుకల్గి ఉన్నారు.

 కె.వి రంగారెడ్డి గారు అధ్యక్షత వహించిన 'ఐదవ ఆంధ్రమహాసభకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి..

అవి -. ఏ ఆంధ్రమహాసభకూడా జాగీరు గ్రామాలలో జరుగలేదు. ఎందుకంటే జాగీరు ' దార్లు సభలకు అనుమతి ఇవ్వలేదు . కాని 1936 లో 
ఐదవ ఆంధ్ర మహాసభ మహారాజా సర్ కిషన్ ప్రసాద్ జాగీరు ఐన షాద్నగర్ లో జరిగింది.. అంతేకాదు సభముగిసిన తర్వాత మరునాడు ఆంధ్ర మహాసభ ముఖ్యకార్యకర్తల నందరికీ జాగీర్దార్ విందుభోజనం కూడా పెట్టాడు.

తర్వాత 1940వ సంవత్సరములో మల్లాపురమున జరిగిన 7వ ఆంధ్ర మహాసభకు ఆహ్వాన సంఘాధ్యక్షుడుగా రంగారెడ్డి గారు కొనసాగాడు . ఈ సభకు మందు మూల రామచంద్రారావు అధ్యక్షుడిగా కొనసాగాడు
ఆ తర్వాత . 1943వ సంవత్సరంలో హైదరాబాదులో జరిగిన 10వ ఆంధ్రమహా సభకు కూడా కొండా వెంకట రంగారెడ్డి గారు అధ్యక్షుడుగా కొనసాగాడు .

▪️సత్యాగ్రహోద్యమం 

తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, మూడు ప్ర్రాంతాలు ఒక్కటిగా హైదరాబాదు స్టేటు కాంగ్రెసు ఏర్పడినప్పటికీ సభ్యులలో కొన్ని రాజకీయ అభిప్రాయ భేదములవల్ల రెండు గ్రూపులు ఏర్పడెను. 1.స్వామి రామానంద తీర్థ గ్రూపు
2. రెండవది రంగారెడ్డి, రామకృష్ణారావుల గ్రూపు,

 రంగారెడ్డి గ్రూపులో తెలంగాణ. కర్ణాటక కార్యకర్తల సంఖ్య ఎక్కువగా ఉండేది. . మహారాష్ట్ర కార్యకర్తల సంఖ్య తక్కవగా ఉండేది. అట్లాగే స్వామిజీ గ్రూపులో మహారాష్ట్ర కార్యకర్తల సంఖ్య ఎక్కువగాను తెలంగాణ, కర్ణాటక కార్యకర్తల సంఖ్య చాలా తక్కువగను ఉండేది..రంగారెడ్డి గ్రూపులో అందరూ కాంగ్రెసు వాదులే. కానీ స్వామిజీ గ్రూపులో మార్క్సిస్టు సిద్ధాంతము ఆచరించే వాళ్ళు ఉన్నారు..

 కాంగ్రెస్ వాదుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాన్ని అనుసరించి సత్యాగ్రహోద్యమం ఆరంభమైంది. ఇందులో భాగంగా రంగారెడ్డి గారు నల్గొండ, వరంగల్ జిల్లాలోని గ్రామాల్లో పర్యటించి సత్యాగ్రహోద్యమం గురించి యువతని తట్టి లేపడం జరిగింది. వేలాదిగా తరలివచ్చిన యువత సత్యాగ్రహోద్యమం చేపట్టారు.తరువాత రాష్ట్ర మంతటా సత్యాగ్రహోద్యమము ఆరంభమయ్యింది..నిజాం పోలీసులు సత్యాగ్రహవాదుల్ని ఎక్కడికక్కడ అరెస్టు చేసి జైలుకు పంపారు. స్వామి రామానంద తీర్థ, రామకృష్ణారావు గార్లు, వీరితో కొండా వెంకటరంగారెడ్డి అరెస్టయ్యారు.2 నెలల 10 రోజులు తర్వాత డాక్టరు చెన్నారెడ్డి, బి. రామకృష్ణారావు, స్వామి రామానందతీర్థ, రాంకిషన్ ధూత్, వీరితో పాటుగా రంగారెడ్డిగారు జైలు నుండి విడుదలయ్యారు.

 ▪️కమ్యూనిస్టులపై ఆరోపణలు ( బహుశా కొందరు )

 తెలంగాణ సాయుధ పోరాటం అంటేనే కమ్యూనిస్టుల పోరాటం గుర్తుకు వస్తుంది. అయినప్పటికీ కమ్యూనిస్టుల పోరాటం గురించి అనేక వాద వివాదాలు ఉన్నాయి. వెంకట రంగారెడ్డి గారు కూడా కమ్యూనిస్టుల గురించి కొన్ని ఆరోపణలు... చేసి ఉన్నారు. వాటిలో కొన్ని యధాతథంగా ----

1. " మమ్ము జైలులో పెట్టిన తరువాత రజాకార్ల (ముస్లిం స్వచ్ఛంద సేవకుల) అరాచక చర్యలు, దౌర్జన్యాలు, హత్యలు మితి మీరిపోయినవి. ఇంతేగాక. రాత్రిళ్ళు కమ్యూనిస్టుల అత్యాచారాలు పగలు రజాకార్ల అత్యాచారాలు ప్రబలి రాష్ట్రములో శాంతి భద్రతలు లేకుండా పోయెను. కనుక. తెలంగాణ ప్ర్రాంతమువారు బెజవాడ. ఏలూరు బందరు, తెనాలి, మొదలగు ఆంధ్ర పట్టణాలకును. కర్ణాటక ప్ర్రాంతము వారు బళ్లారి, మైసూరు వగయిరా ప్ర్రాంతములకును, మహారాష్ట్ర ప్ర్రాం తము వారు బొంబాయి, నాగపూరు ప్రాంతములకును వలసపోయిరి.. " అని సత్యాగ్రహవాదుల అరెస్టు తరువాత తెలంగాణలో నెలకొని ఉన్న పరిస్థితుల గురించి కొండా వెంకటరెడ్డి గారు స్వయంగా తన స్వీయ చరిత్రలో రాసుకున్నారు.

2. " కాంగ్రెస్ వారి ఉద్యమము అహింసాయుతముగా నడచినందున వారు ప్రజలను బాధపెట్టలేదు. సత్యాగ్రహముచేసి జైళ్లకు వెళ్ళారు. రజకార్లు కమ్యూనిస్టులను అణచవలెనని, కమ్యూనిస్టులు రజాకార్లను అణచవలెనని దౌర్జన్యములకు దిగే వారు. రజాకార్లకు ప్రభుత్వము, ప్రభుత్వ ఆనుయాయుల మద్దతు ఉన్నందున వారు తమ దౌర్జన్యకాండను పగలే జరిపేవారు. కమ్యూనిస్టులకు ప్రభుత్వపు అండదండలు లేనందువల్ల పగలంతా తమ అభిమానుల ఇండ్లలోను, ఆడపులలోని గుహలలోను రహస్యముగా ఉంటూ రాత్రులందు తమ దౌర్జన్యచర్యలను జరిపేవారు. అందువల్ల ప్రజలు కమ్యూనిస్టులను రాత్రి దొంగలని రజాకార్లను పగటిదొంగలని వ్యవహరించే వారు.

3. శ్రీ రావి నారాయణరెడ్డి తెలంగాణా కమ్యూనిస్టులకు గొప్ప నాయకుడు. ఆయన పెద్ద అన్న కమ్యూనిజానికి వ్యతిరేకి.., శ్రీ రావి నారాయణరెడ్డికి ఆయన పెద్ద అన్నకు పరస్పరం మైత్రిఉండెను. అయినప్పటికి ఆయన పెద్దఅన్నను కమ్యూనిస్టులు చంపివేసినారు.

కమ్యూనిస్టులు -- ఉద్యమకాలములో పరిసర రాష్ట్రాలకు భయపడి వెళ్లిపోయిన ప్రజల భూములను, ఆస్తులను, పశువులను ప్రజలకు పంచిపెట్టినారు. గొర్రెలను, తమ ప్ర్రాబల్యముకల గ్రామాలకు తీసుకొని వెళ్లి కోసుకొనితినేవారు. పోలీసుచర్య జరిగి నిజాంప్రభుత్వము అంతరించి ప్రజాప్రభుత్వము ఏర్పడిన తర్వాత ప్రభుత్వము ప్రత్యేక ఉద్యోగులను నియమించి కమ్యూనిస్టులు పంచిన భూములను పశువులను తిరిగి ఆసలుదార్లకు ఇప్పించినారు. ప్రభుత్వము ఈ విధముగా పరిష్కారము చేయించి. ఇప్పించకముందే చాలావరకు భూములు. పశుపులు అసలు దార్లకు లభించినవి.
" షారాజ్ పేటలోని నా ఆరువందల ఎకరాల భూములు నేను ప్రభుత్వ ఉద్యోగులవద్దకు వెళ్లే అవసరములేకుండానే తిరిగి నాకు లభించినవి.. " 

రజాకార్లు, కమ్యూనిస్టుల దౌర్జన్యములను గురించిన పైసంఘటనలను నాకు జ్ఞాపకమున్న వాటిలో కొన్ని మాత్రమే చదువరులకు మచ్చు చూపించుటకై ఈ ప్రకరణములో వ్రాసినాను

▪️భుదానోద్యమం :

 ఆచార్య వినోబాభావే భూదానోద్యమాన్ని ప్రారంభించిన తర్వాత, 1951 ఏప్రిల్ 18 వ తారీకున వేదిరే రామచంద్రారెడ్డిగారు 100 ఎకరాల భూమిని దానం చేయడానికి ముందుకు వచ్చాడు. తాను దానం చేసిన భూమి పంపిణీ కోసం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశాడు. ఆ ట్రస్టులో నిజాయితీ గల వ్యక్తులను సభ్యులుగా తీసుకున్నాడు. అందులో మొదటి పేరు కొండా వెంకటరెడ్డి గారిదే ఉన్నది.

1. కొండా వెంకటకంగా రెడ్డి (తెలంగాణ కాంగ్రెసు కమిటి అధ్య క్షులు)
2. శ్రీ కె. మైనయ్య హరిజన్ (మాదిగ)
3. శ్రీ రామస్వామి హరిజన్ (మాల)
4. శ్రీ వెదిరె రామచంద్రారెడ్డి (భూదాత)
 5. శ్రీ జి. రామారెడ్డి (పోలీస్ పటేల్).

▪️ప్రత్యేక తెలంగాణ ప్రదేశ్ స్థాపనకు ప్రయత్నము

1955వ సంవత్సరములో కేంద్ర ప్రభుత్వము రాష్ట్రముల పునర్వి భజనము కొరకు సభ్యులతో ఒక కమిటీ ( States Reorganisation Committee.) ఏర్పాటు చేసింది.
1. S. ఫజల్ ఆలీ అధ్యక్షడు.
2. H. N. కుంజ్రూ _ సభ్యుడు.
3. K. M. పణిక్కర్ సభ్యుడు

ఆ కమీషన్ వారు మొత్తము రాష్ట్రాలలో పర్యటించి. 
హైదరాబాద్ చేరుకొని సేకరణ చేశారు. అప్పటికే కొండా వెంకటరంగారెడ్డి గారు తెలంగాణ b ప్రాంతాన్ని ఆంధ్ర ప్రాంతంలో విలీనం చేయకూడదు అని ప్రచారం చేస్తున్నారు. అదే విషయాన్ని కమిషన్ ముందు విన్నవించుకున్నాడు. కాగా రామానంత తీర్థ గారు మాత్రం తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర ప్రాంతంలో విలీనం చేయాలని విన్నవించుకున్నారు. ఈ విధంగా కొండా వెంకటరంగారెడ్డి గారు 1955వ ప్రాంతంలోనే తెలంగాణ వాదానికి నిలువెత్తు ప్రతీకగా నిలబడ్డారు.

తెలంగాణ స్వయంప్రతిపత్తి కోసం ఆనాడు యువత ప్రాణాలర్పించడాన్ని రంగారెడ్డి తట్టుకోలేకపోయారు. అందుకు తీవ్రంగా స్పందిస్తూ తన మంత్రి పదవికి రాజీనామా చేశాడు . 1956 ఫిబ్రవరి 26న రాష్ట్ర విలీన సమయంలో పెద్ద మనుషుల ఒప్పందంలో కీలక సభ్యుడిగా వ్యవహరించాడు.

▪️రాజకీయ ప్రస్థానం

నిజం ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా పనిచేస్తున్న సమయంలో మహిళలకోసం వారసత్వ హక్కులు సాధించి పెట్టారు.

1952 - 56 వరకు బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా మంత్రి మండలి ఏర్పాటయింది. ఈ మంత్రి మండలి లో కొండా వెంకట రంగారెడ్డి గారికి
 ఎక్సైజ్ , కస్టం, అటవీ శాఖలు కేటాయించారు.

1956లో ఆంధ్రప్రదేశ్‌ అవతరణ అనంతరం నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలో హోం, రెవెన్యూ శాఖలు నిర్వహించారు.రెవెన్యూ మంత్రిగా ఎన్నో విప్లవాత్మక భూ సంస్కరణలు తీసుకు వచ్చారు.కౌలుదారుల హక్కుల చట్టాన్ని రూపొందించి, భూమికోసం జరిగినపోరాటాల్లో దున్నే వాడికే భూమి అనే గొప్ప నినాదాన్ని నిజం చేసాడు.

1959 నుండి 1962 వరకు దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉపముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వర్తించారు. 

▪️కుటుంబం

వెంకటరంగారెడ్డి భార్య తుంగభద్రమ్మ. ఈ దంపతుల కుమారుడు కొండా మాధవరెడ్డి.

కొండా మాధవరెడ్డి (1923–1997) బొంబాయి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిగాను, హైదరాబాదు హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిగాను, ఢిల్లీలోని చిన్నరాష్ట్రాల సమాఖ్యలో సభ్యుడుగాను, అనేక జాతీయ న్యాయవాద సంఘాలలో సభ్యుడుగాను, , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా, సాంఘిక, సామాజికసంస్థలలోనూ సభ్యుడుగాను, కీలక బాధ్యతలు నిర్వర్తించాడు.

మాధవరెడ్డి భార్య జయలతాదేవి. ఈ దంపతులకు నలుగురు సంతానం. వారు - 
మీరారెడ్డి, గౌతమిరెడ్డి, శైలజ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి .

 కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రస్తుతం చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

▪️మర్రిచెన్నారెడ్డితో బంధుత్వం

 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రెండుసార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, కొండావెంకటరంగారెడ్డి గారికి స్వయాన మేనల్లుడు.

▪️రంగారెడ్డి కాలధర్మం

గులామీ కీ జిందగీ సే
మౌత్ బెహతర్ హై !

బానిసత్వం కంటే మరణమే మేలు అని గట్టిగా నినదించిన కె.వి రంగారెడ్డి.... 
1970, జూలై 24 న రంగారెడ్డి కాలధర్మం చెందారు.
షాబాద్‌ చౌరస్తాలో కొండా వెంకటరంగారెడ్డి విగ్రహం ఏర్పాటు చేశారు.

▪️ కె.వి.రంగారెడ్డి పేరు మీద ఏర్పడిన " రంగారెడ్డి జిల్లా "

1.నిజాం నియంతృత్వాన్ని నిర్భయంగా ఎదిరించిన నైజం --
2. 1955 లోనే ప్రత్యేక తెలంగాణ వాదాన్ని గట్టిగా వినిపించిన తెగువ ----
3. అత్రాఫ్- ఎ - లబ్ద పరిధిలో పాఠశాలల ఏర్పాటుపై నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ, తండ్రి చెన్నారెడ్డి పాఠశాలను నెలకొల్పగా, దాన్ని అభివృద్ధి చేసి పేదలకు చదువు అందించిన ఉదారత ---
4. స్త్రీ ఆస్తి హక్కుల కోసం కృషి -
5. అస్పృశ్యత అంటరానితనం హరిజనోద్ధారణ లక్ష్యంగా పనిచేయడం -
6. జాగీర్దారి వ్యవస్థను ఎదిరించడం--
7. రెవెన్యూ మంత్రిగా భూ సంస్కరణలు చేపట్టి
 తున్నే వాడిదే భూమి నినాదాలు పటిష్టం చేయడం --

మొదలగు కారణాలు రంగారెడ్డి ధీటైన వ్యక్తిత్వానికి నమూనాలుగా నిలబడ్డాయి. వీటన్నిటి నేపథ్యంలో కేవీ రంగారెడ్డి కొనసాగించిన సేవల స్మృత్యర్థం వారు పుట్టి పెరిగిన హైదరాబాద్ జిల్లాలో గ్రామీణ ప్రాంతాలను విడదీసి 1978లో కె.వి రంగారెడ్డి జిల్లాగా నామకరణం చేసారు.అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి హయాంలో ఏర్పడిన ఈ జిల్లా 
రంగారెడ్డి స్మృతికి అంకితం చేయబడింది. కాగా జిల్లా పేరులో కాలక్రమంలో కేవీ తొలగిపోయి రంగారెడ్డి జిల్లాగా పిలవబడుతున్నది.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో రంగారెడ్డి జిల్లా ఒకటిగా ఉన్నది. రంగారెడ్డి జిల్లాకు ఒక స్వరూపం లేదు. హైదరాబాదు జిల్లా చుట్టూ నలువైపుల ఆవరించి ఉన్నది . హైదరాబాదు నగరమే ఈ జిల్లాకు కూడా పరిపాలనా కేంద్రంగా కొనసాగుతున్నది.
▪️ రంగారెడ్డి జిల్లా " కె.వి.రంగారెడ్డి పేరు మీద ఏర్పడినది...

1.నిజాం నియంతృత్వాన్ని నిర్భయంగా ఎదిరించిన నైజం --
2. 1955 లోనే ప్రత్యేక తెలంగాణ వాదాన్ని గట్టిగా వినిపించిన తెగువ ----
3. అత్రాఫ్- ఎ - లబ్ద పరిధిలో పాఠశాలల ఏర్పాటుపై నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ, తండ్రి చెన్నారెడ్డి పాఠశాలను నెలకొల్పగా, దాన్ని అభివృద్ధి చేసి పేదలకు చదువు అందించిన ఉదారత ---
4. స్త్రీ ఆస్తి హక్కుల కోసం కృషి -
5. అస్పృశ్యత అంటరానితనం హరిజనోద్ధారణ లక్ష్యంగా పనిచేయడం -
6. జాగీర్దారి వ్యవస్థను ఎదిరించడం--
7. రెవెన్యూ మంత్రిగా భూ సంస్కరణలు చేపట్టి
 తున్నే వాడిదే భూమి నినాదాలు పటిష్టం చేయడం --

మొదలగు కారణాలు రంగారెడ్డి ధీటైన వ్యక్తిత్వానికి నమూనాలుగా నిలబడ్డాయి. వీటన్నిటి నేపథ్యంలో కేవీ రంగారెడ్డి కొనసాగించిన సేవల స్మృత్యర్థం వారు పుట్టి పెరిగిన హైదరాబాద్ జిల్లాలో గ్రామీణ ప్రాంతాలను విడదీసి 1978లో కె.వి రంగారెడ్డి జిల్లాగా నామకరణం చేసారు.అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి హయాంలో ఏర్పడిన ఈ జిల్లా 
రంగారెడ్డి స్మృతికి అంకితం చేయబడింది. కాగా జిల్లా పేరులో కాలక్రమంలో కేవీ తొలగిపోయి రంగారెడ్డి జిల్లాగా పిలవబడుతున్నది.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో రంగారెడ్డి జిల్లా ఒకటిగా ఉన్నది. రంగారెడ్డి జిల్లాకు ఒక స్వరూపం లేదు. హైదరాబాదు జిల్లా చుట్టూ నలువైపుల ఆవరించి ఉన్నది . హైదరాబాదు నగరమే ఈ జిల్లాకు కూడా పరిపాలనా కేంద్రంగా కొనసాగుతున్నది.

వ్యాసకర్త : తంగెళ్ళశ్రీదేవిరెడ్డి 
___________________________________________

No comments:

Post a Comment