Monday, April 15, 2024

పాకాల యశోదారెడ్డి

పాకాల యశోదారెడ్డి ( 1929-2007)
(తెలంగాణ భాషోద్యమ రచయిత్రి )
°°°°°°°°°°°°°°°°°°°°°°°
వ్యాసకర్త : తంగెళ్ళశ్రీదేవిరెడ్డి 

అక్షర జాబిల్లి... 
మాండలికపు సొగసుల సిరిమల్లి... 
సాహిత్య ప్రక్రియల పాలవెల్లి.... 
పాకాల యశోదారెడ్డి !
తెలంగాణ ప్రాంతీయ మాండలికాన్ని తన రచనల్లో శాశ్వతంగా బతికించిన కన్నతల్లిగా యశోదారెడ్డి పేరు సాహిత్య చరిత్రలో చిరస్మరణీయం. 

ఒకప్పటి పాలమూరు జిల్లా...ప్రస్తుతం నాగర్‌కర్నుల్ జిల్లా బిజినేపల్లిలో సామాన్య రైతు కుటుంబంలో 1929, ఆగష్టు 8 న యశోదారెడ్డి జన్మించినది. వీరి తండ్రి కాశిరెడ్డి, తల్లి సరస్వతమ్మ. 
యశోదారెడ్డి పుట్టిన కొన్నాళ్లకే తల్లి సరస్వతమ్మ మరణించింది. ఆ తల్లి మరణం ఆ కుటుంబ వాతావరణాన్ని పూర్తిగా మార్చేసింది. కాశిరెడ్డి విరక్తిలో మునిగిపోయాడు. ఈ పరిస్థితిలో పసిగుడ్డు యశోదారెడ్డి బతుకు ఒక ప్రశ్నగా మారిపోయింది. బతుకులో ఒక ఖాళీని ఏర్పడింది. విషాదం గాఢంగా అలుముకు పోయింది. అప్పుడు బంధువు రుక్మిణమ్మ యశోదమ్మను చేరదీసింది. ఎచ్చమ్మ అని పిలవబడే మన యశోదమ్మకు రుక్మిణమ్మ అండదండలు వెచ్చని ఒడిని పంచాయి అని చెప్పవచ్చు. 
 
👉సరస్వతీ ముద్దుబిడ్డ :

చిన్నతనం నుండి చురుకుగా కనిపించేది 
యశోదారెడ్డి. కానీ ఆనాటి సమాజం మాత్రం అంధకారం అనాగరికంలో మగ్గుతుండేది. ఆడపిల్లలు అవిద్యలో కూరుకుపోయి ఇంటి నాలుగు గోడలకు పరిమితమై జీవించేవారు. ఇటువంటి పరిస్థితుల్లో యశోదారెడ్డికి చదువుకోవాలనే కోరిక ఉండేది. కానీ సంఘంలో పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి. కాగా
అప్పటి నగర కొత్వాల్ రాజబహద్దూర్ వెంకట్రామిరెడ్డి ఆదర్శ భావాలతో సంస్కరణాభిలాషిగా ఉన్నత సమాజం కోసం కృషిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో వెంకట్రామిరెడ్డి ప్రోత్సాహం యశోదమ్మను ముందుకు నడిపించింది. అట్లా యశోదమ్మ అక్షరాభ్యాసానికి శ్రీకారం చుట్టి భవిష్యత్తులో వాగ్దేవి ముద్దుబిడ్డగా ఎదగడానికి రెడ్డి గారి చొరవ బాగా ఉపకరించింది. 

తన మూడవ తరగతి వరకు పాలమూరులో చదివి ఉన్న యశోదమ్మ, తన ఉన్నత పాఠశాల విద్యకై వెంకట్రామిరెడ్డి ద్వారా హైదరాబాదు నారాయణగూడ మాడపాటి హనుమంతరావు బాలికల ఉన్నత పాఠశాలలో చేరింది. పల్లెల నుండి నగరానికి చదువుకునేందుకు వచ్చే బాలికల కోసం వెంకట్రామిరెడ్డి గారు నగరంలో వసతి గృహాన్ని ఏర్పాటు చేసారు. ఈ గృహంలోనే ఉంటూ యశోదారెడ్డి చదువును కొనసాగించారు. 

అప్పట్లో తెలంగాణలో ఉర్దూ ప్రాబల్యం కొనసాగుతున్నది. తెలుగు భాషకు, తెలుగు చదువుకు, తెలుగు పత్రికలకు అనేక ఆటంకాలు ఉన్నాయి. ఈ పరిస్థితిలో తెలుగు మాధ్యమంలో మాడపాటి హనుమంతరావు పాఠశాల ఒకే ఒక్కటిగా ఉండేది. ఈ పాఠశాలలో మన యశోదారెడ్డి ఉత్తమ విద్యార్థినుల్లో ఒకరుగా ఉండేది. ఈ పాఠశాల నుండి విజయవాడలో ఆంధ్రా మెట్రిక్ పరీక్షను ప్రత్యేక అనుమతితో రాసిన నలుగురు యువతుల్లో యశోదారెడ్డి ఒకరుగా ఉండటం విశేషం. 

వెంకట్రామిరెడ్డి ప్రోత్సాహంతోనే కళాశాల విద్యను కూడా కొసాగించింది. గుంటూరు ఏ.సి. కళాశాలలో చేరి ఇంటర్ మొదటి సంవత్సరం కొనసాగించింది. తర్వాత హైద్రాబాద్ ఉమెన్స్ కాలేజీలో రెండో సంవత్సరం కొనసాగించింది. 

కళాశాల చదువుతున్నప్పుడే ఉన్నత విద్యలు చదవాలని పట్టుదల కలిగింది. ఆడపిల్లకు చదువెందుకు అంటూ మూఢత్వం సమాజంలో  
 స్వైర విహారం కొనసాగిస్తున్న పరిస్థితి యశోదారెడ్డి ఆలోచనకు ఒక సవాలుగా మారింది. అయినప్పటికీ ఆమె వెనుతిరిగి చూడలేదు. పట్టుదలకు తోడుగా ఆత్మస్థయిర్యం నిలువగా ప్రయివేటులో డిగ్రీ పట్టా పొందినది. 

ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగు, సంస్కృత భాషలలోవరుసగా పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేసింది.

"తెలుగులో హరివంశాలు" అంశంగా ఎంచుకుని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండే పరిశోధన చేసి డాక్టరేట్ పట్టాను పొందడం జరిగింది. 

ఆమెలో ఉన్న విద్యా పిపాస అనితర సాధ్యం. ఈ నేపథ్యంలో ఇంకా చదవాలి... ఇంకా ఏదో తెలుసుకోవాలి అనే తృష్ణతో తహతహ లాడుతూ జర్మన్ భాషలో భాష శాస్త్రానికి సంబంధించి డిప్లొమా పూర్తి చేసింది. 

1976లో ఉత్తరప్రదేశ్ అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం నుండి డి.లిట్ పట్టా అందుకుంది. 

తెలుగు, హిందీ, ఉర్దూ, కన్నడ భాషల్లో యశోదారెడ్డి గొప్ప ప్రావీణ్యం సంపాదించుకుంది. జర్మన్ భాషలో మాత్రం మంచి పట్టు సంపాదించుకుంది.

👉వివాహబంధం 

18 సంవత్సరాల వయసులో 1947లో పి.టి. రెడ్డిగా సుపరిచితులైన ప్రముఖ చిత్రకారుడు పాకాల తిరుమలరెడ్డితో యశోదారెడ్డి వివాహం జరిగింది. పి.టి.రెడ్డి స్వగ్రామం కరీంనగర్ జిల్లా మానకొండూరు సమీపంలోని అన్నారం. 

నిజాం పాలనలో తెలంగాణలో తెలుగు సమాజం పూర్తిగా అణగారిన పరిస్థితిలో ఉంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో ఆడపిల్లలు చదువుకునడమే ఒక సాహసం. అట్లాంటిది ధైర్యంగా సొంత వ్యక్తిత్వంతో కనిపించడం ఒక చరిత్ర. ఈ క్రమంలో యశోదారెడ్డి పాఠశాలలో వేదిక ఎక్కి దృఢ చిత్తంతో ప్రసంగం చేసింది. అది చుసిన పి.టి.రెడ్డి ఆమె పట్ల ఆకర్షితుడయ్యాడు. ప్రేమ అనే భావనతో ఆమెకు దగ్గరయ్యాడు. స్వతహాగా కళాభిరుచి కలిగిన యశోదారెడ్డి అతడి మనసును అర్థం చేసుకుంది. అతడి యోగ్యతను కూడా గుర్తించింది. అతడు తన జీవితానికి సరైన జోడుగా భావించింది. అందుకే జీవితంలో ఒక్కటై ఆదర్శ దంపతులుగా మిగిలారు. 

వీరి బంధం ఎంత గొప్పగా కొనసాగింది అంటే తిరుమల్రెడ్డి గీసే అనేక చిత్రాలకు భార్యగా యశోదారెడ్డి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. వివిధ సందర్భాల్లో ఏర్పాటు చేసిన పి.టి. రెడ్డి చిత్రకళా ప్రదర్శనకు ఆమె ఒక సాధారణ కార్యకర్తగా పని చేస్తూ వీక్షకులకు అవగాహన కలిగించేది. 

👉పుత్ర శోకం 

1948 సంవత్సరంలో యశోదారెడ్డికి పండంటి మగబిడ్డ జన్మించాడు. కానీ విధి వక్రించింది. తాను పసిగుడ్డుగా ఉన్నప్పుడే తల్లి మరణం సంభవించినట్టుగా... పుట్టిన ఆరు నెలలకే పుట్టిన బిడ్డ మరణించాడు. యశోదారెడ్డి ఆ విషాదాన్ని తట్టుకోలేక పోయింది. అప్పటికి ఇంటర్ వరకు చదివి ఉన్న యశోదారెడ్డికి భర్త ప్రోత్సాహం అందివ్వగా ప్రయివేట్ గా డిగ్రీ చదివింది. 

👉వృత్తి - ప్రవృత్తి 

1955 సంవత్సరంలో హైదరాబాద్ కోఠి మహిళా కళాశాలలో అధ్యాపకురాలిగా తన ఉద్యోగ జీవితం ప్రాంభించింది. వృత్తి ధర్మాన్ని అంకితభావంతో కొనసాగిస్తూ రీడర్ గా ప్రొఫెసర్ గా తన పనితనాన్ని నిరూపించుకుంది. 

ఇదే క్రమంలో కత్తికి రెండు వైపులా పదును చూపిస్తూ మరోవైపు తన రచనా వ్యాసంగాన్ని ప్రవృత్తిగా కొనసాగిస్తూ వచ్చింది . 1951లో సుజాత పత్రికలో వీరి మొదటి కథ ‘ విచ్చిన తామరలు ’ ముద్రించబడింది. ఈ కథ సరళ గ్రాంధికంలో రాయబడింది.  

పదవి విరమణ నాటికి ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ఆచార్య పదవిలో ఉండి అక్కడి నుండే 1989లోఉద్యోగ విరమణ చేసారు

👉యశోదారెడ్డి రచనలు 

యశోదారెడ్డి గొప్ప రచయిత్రి, కవయిత్రి, విమర్శకురాలు, పరిశోధకురాలు. 
తొలితరం రచయిత్రిగా తన ప్రస్థానాన్ని మొదలెట్టి మూడు తరాల సమాజాన్నీ కళ్లారా చూసింది. ఆయా కాలాల్లో సమాజంలో సంభవించిన మార్పులనూ గమనించింది.  

పల్లెటూరు తన రచనా వ్యాసంగాన్ని విశ్వవిద్యాలయంగా పల్లె ప్రభావాన్ని తన కథల్లో స్పష్టంగా చూపెట్టింది. ఆమె ప్రతి కథ ఒక సజీవ సాదృశ్యం. కళ్ళముందు పాత్రలు కనబడుతూ.... ఆ పాత్రల మధ్య జీవిస్తున్న అనుభూతి పాఠకుడికి ప్రత్యక్షముగా కలుగుతుంది. 

తను జీవితాల్లో నుండి,తన అనుభవాల్లో నుండి కథల్ని సృష్టించిన యశోదారెడ్డి తెలంగాణ మాండలిక భాషను ఔపాసన పట్టారు. మాండలిక భాషను అనుసరించారు. సంపూర్ణ తెలంగాణ మాండలిక భాషకు అక్షర రూపం అందిస్తూ కథా ప్రపంచంలో ఒక కొత్త ఒరవడిని పరిపూర్ణంగా ఆవిష్కరించారు. ఇట్లా తెలంగాణ మాండలిక భాషా పరిరక్షణకు ఆమె జీవితకాల సేవల్ని అందించింది. 

కథలు : 

ఆమె కథలు జీవన సారాలు. ఆ కథల నిండా 
తెలంగాణ భాష, యాస, సంస్కృతి, స్వాతంత్య్రానంతర సామాజిక జీవితం స్పష్టంగా కనిపిస్తాయి. అట్లాగే 
తెలుగు జాతీయాలు, ప్రచారంలో ఉన్న సామెతలు, పదబంధాలు, నుడికారాలు, పలుకుబడులు సాగులుగా కనిపిస్తాయి. యశోదారెడ్డి మొత్తం వందకు పైగా కథలు వ్రాసారు. వాటిలో 63 కథలు మాత్రమే పుస్తక రూపంలో వచ్చాయి. ఇవి మూడు కథా సంపుటాలుగా గ్రంథాలయాలను చేరాయి. 

1)మావూరి ముచ్చట్లు (1973) 
ఈ కథా సంపుటిలో 1920-40 నాటి తెలంగాణ గ్రామీణ జీవన విధానాన్ని గ్రామీణ సంస్కృతిని చిత్రీకరించిన పది కథలు చోటుచేసుకున్నాయి.   
50 వ దశకం ప్రారంభంలో ఈ కథలు అన్నింటిని ఆకాశవాణి ద్వారా " మహాలక్ష్మి ముచ్చట్లు " అంటూ శ్రోతలకు వినిపించడం జరిగింది. ఈ క్రమంలో వేల మంది అభిమానులను సంపాదించుకున్నారు యశోదారెడ్డి.  

2)ఎచ్చమ్మ కథలు (1999) 
ఈ కథాసంపుటిలో కథలు 1950-70 నాటి తెలంగాణ సంస్కృతికి సంప్రదాయాలకు అద్దం పట్టాయి.తన పేరుతోనే తాను చూసిన జీవితాలను ఈ సంపుటిలో ఆవిష్కరించారు.ఈ కథల్లో పాలమూరు జిల్లా మాండలికం జీవనదిలా ప్రవహించింది. ఈ ఎచ్చమ్మ కథల సంపుటిలో ఇరవై ఒక్క కథలు వేటికవే సాటిగా ఉన్నాయి. 

3) ధర్మశాల (2000) 
1980-1990 నాటికి తెలంగాణ సమాజంలో వచ్చిన పెను మార్పులు తెలంగాణ ప్రజల జీవితాల్లోకి ఏ విధంగా చొచ్చుకు పోయి ప్రభావం చుపించాయో 
తెలియజేసే కథలు ఈ కథాసంపుటిలో ఉన్నాయి. 
వ్యవహారిక తెలుగు భాష ఈ సంపుటిలో కథలకు జీవగర్ర. 

ఈ సంపుటిలో 1) ధర్మశాల (2) దారా (3)నిప్పుతో చెలగాటం (4) బరిబత్తల బొమ్మ (5)పరిత్యక్త (6) సంకుదేవుడు (7) రాజు గారి ఒక్కనాటి ప్రచారం (8)పేరులో ఏముంది (9)ఎదల్లో పొరలు (10)
దేవుడు న్నాడా (11) సౌభాగ్యవతి (12) ఊరి అవతల బావి (13)కలకల్లకాలేదు (14) అందిన కందిరీగ (15) సీతమ్మగారి సీమ ప్రయాణం (16) మాధవీలత నవ్వింది (17) అకాయ్ చేసిన పెళ్లి
(18)రంగడి ప్రయోజకత్వం (19) ప్రమీల చచ్చిపోయింది (20) గుళ్లో గంటలు 
(21)తియ్యటి తీగెలు (22) దిబ్బరొట్టె
 (23) రూమ్ నెంబర్ త్రీ’
(24)సంది వంటి మొత్తం 
 24 కథలున్నాయి. 

కవితలు : 

'ఉగాదికి ఉయ్యాల '
'భావిక '
అనేవి యశోదారెడ్డి కవితా సంపుటాలగా వెలువరించారు.
 మలేషియాలో జరిగిన తెలుగు సమ్మేళనంలో కవయిత్రిగా పాల్గొని పలువురి మన్ననలు పొందింది. 

ఇతర రచనలు :

ద్విపద వాజ్మయం
ప్రబంధ వాజ్మయం
భారతీయ చిత్రకళ
భాగవత సుధ వీరి ఇతర రచనలు. అట్లాగే 
డాక్టర్ ఎం.కులశేఖరరావుతో కలిసి
" కావ్యానుశీలనం " కూర్చారు. ఆళ్వార్‌స్వామి, సి. నారాయణరెడ్డిలతో కలిసి
" చిరుగజ్జెలు " రూపొందించారు 

పరిశోధనా గ్రంధాలు :

ఆంధ్ర సాహిత్య వికాసం, పారిజాతాపహరణం పర్యాలోచనం, ఎఱ్ఱాప్రగడ, కథాచరిత్ర 

పీఠికలు :

యశోదారెడ్డి తలపెట్టిన ప్రతి అక్షర యజ్ఞం సమగ్ర ఫలితాన్ని అందించింది. ఇది ఆమె కృషి...పట్టుదల ! ఈ వరుసలో పారిజాతాపహరణం - ఉత్తర హరివంశం 
తెలుగు సామెతలు - ఆంధ్ర క్రియా స్వరూపమణి దీపిక
వంటి గొప్ప పుస్తకాలకు సంపాదకత్వం వహించింది. వాటికి విలువైన పీఠికలను రాసింది. 

👉తెలంగాణ పదాలు 

యశోదారెడ్డి కథలు జీవితాన్ని చూపిస్తాయి. జీవిత రహస్యాలను వివరిస్తాయి. అనుభూతిని మిగులుస్తాయి. ఆనాటి సమాజాన్ని కళ్లారా చూడాలి అనుకునే వాళ్లకు ఆమె కథలు వాహకాలుగా పనిచేస్తాయి. 

ముఖ్యంగా వ్యవసాయం, వృత్తి పనులు, పండుగలు పబ్బాలు, మానవ సంబంధాలు, గ్రామీణ ఆచారాలు యశోదారెడ్డి కథల్లో కనిపిస్తాయి. 
వ్యవసాయానికి సంబందించి ఎడ్లు పగ్గాలు, పలుపులు, మెడదుత్తలు, బండి, కందెన, మొదలగునవి ఆమె కథల్లో కనిపిస్తాయి. పీర్ల పండుగ, బతుకమ్మ పండుగ, ఆ పండుగల చుట్టూ పెనవేసుకున్న ఆచారాలు కనిపిస్తాయి.  

శైలి :

 ‘మ్యానరికం’ అనేది కథ పేరు. తెలంగాణ జానపదుల వ్యవహారంలో మ్యాననరికంగా పలుకబడుతుంది.యశోదారెడ్డి ఈ పలుకుబడినే తన కథా శీర్షికగా పెట్టుకోవడంతో జీవద్భాషకు ఆమె అందించే స్థానాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ కథలో ఒక సాధారణ ఆడపిల్లను ముస్తాబుచేసే ఘట్టం చిత్రించబడింది.  

 ‘‘ఇంగ బోజనాలయినాక తీరువాటంగా కమలమ్మ గూసోని లక్ష్మీని పిల్చి ముందల గూసోవెట్టుకుని రొండు జడలిడ్సి పాపితీసి ఊదునూనె మెరుగు వెట్టింది. ఒంటి జడేసింది. పూలగొట్టంతోటి జడనిండా పూలు గుచ్చింది. చెవులకు గున్నాలు వెట్టింది. చేతులకు కాకరకాయ గొలుసులు వెట్టింది. మొకానికి పోడరు ఏసింది. కాట్కె కడకల్లుల దాటంగ దీర్చి సాదుసుక్క వెట్టింది " అంటూ సహజంగా గ్రామీణ భాషలో చెప్పుకుంటూ పోవడంలో సమాజం పట్ల ఆమెకు ఉన్న లోతైన అవగాహనను పాఠకుడు అర్థం చేసుకోవచ్చు. 

👉పదవతరగతికి పాఠ్యాంశం

తెలంగాణ ప్రభుత్వం ప్రచురణలో యశోదారెడ్డి రచించిన " కొత్తబాట " కథ పదవతరగతి పాఠ్యాంశంగా బోధించబడటం గర్వకారణం. విద్యార్థులకు తెలంగాణ యాస భాష పరిచయం చేసే నేపథ్యంలో వీరి కథకు పెద్దపీట వేయడం జరిగింది 

👉ప్రతిభా మూర్తికి పదవులు - ప్రశంసలు 

యశోదారెడ్డి బహుముఖీయ ప్రజ్ఞాశాలి ! ఆమె నడిచే గ్రంధాలయం. ఒక విజ్ఞాన గని ! తెలంగాణ సజీవ భాషను మాత్రమే కాదు, తెలుగు ప్రామాణిక సాంప్రదాయ బాషా విశిష్టతను కాపాడటంలో ఆమె 
ప్రయత్నం....ప్రయాణం....కొనియాడదగినవి. 

తెలుగు ప్రాచీన సాహిత్యంపై ఆమె సాధించిన పట్టు అసామాన్యం. ఈ క్రమంలో ప్రాచీన సాహిత్యంపై చేసిన అనర్ఘళ ప్రసంగాలు పండితుల ప్రశంశల్ని అందుకున్నాయి. 

ఆకాశవాణిలో తెలంగాణ మాండలికంలో ప్రసంగం చేసిన తొలి రచయిత్రిగా సాహిత్య చరిత్రలో ఆమె ఒక పుటను సంపాదించుకుంది.  

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాషాసంఘం అధ్యక్షురాలుగా పని చేసిన తొలి మహిళగా తన సేవల్ని నిర్విఘ్నంగా కొనసాగించింది. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ -
లలిత కళా అకాడమీ - సంగీత అకాడమీలలో గౌరవ సభ్యురాలిగా పనిచేసి తన సేవానిరతిని చాటుకుంది. 

కళాసక్తి , సాహిత్యాభిలాష, ఈ రెండు అభిరుచులతో ఆంధ్ర సారస్వత పరిషత్ జానపద కళా సాహిత్య సంస్థల్లో కూడా ఆమె తనదైన ఆత్మీయ అనుబంధాన్ని కొనసాగించింది. 

👉కాలధర్మం 

విలక్షణ రచయిత్రిగా అందరి ఆదరాభిమానాలను చూరగొన్న యశోదారెడ్డి చివరి కోరిక - తన భర్త 
 పి.టి.రెడ్డి వేసిన వెయ్యికి పైగా పెయింటింగులు, శిల్పాలతో ఒక మ్యూజియం రూపొందించాలనేది.కానీ ఆమె కోరిక.... కల... నెరవేరకుండానే యశోదారెడ్డి 2007, అక్టోబర్ 7 న హైదరాబాదులో మరణించారు.

No comments:

Post a Comment