Monday, April 15, 2024

కదిరి వెంకటరెడ్డి

కళామతల్లి ముద్దుబిడ్డ కదిరి వెంకటరెడ్డి
(1912 -1972) 
[ జనం మెచ్చిన తొలితరం సినిమా దర్శకుడు]
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
కదిలే బొమ్మల వెనుక కనబడని శక్తి 
వినిపించే కథల మాటున వినబడని యుక్తి
అతడే......
నిర్మాత, రచయితగా,
దక్షిణాది అగ్రగణ్యుడైన ప్రపంచస్థాయి
దర్శకుడుగా ఖ్యాతి గడించిన కేవీ రెడ్డి..!
పూర్తి పేరు కదిరి వెంకటరెడ్డి

▪️వివరాల్లోకి వెళ్తే...

అనంతపురం జిల్లా తాడిపత్రి దగ్గర తేళ్లమిట్టపల్లె వాస్తవ్యులు కదిరి కొండారెడ్డి, వెంకటరంగమ్మ దంపతులకు 1912 జూలై 1వ తేదీన కేవి రెడ్డి జన్మించాడు. కదిరి కొండారెడ్డి విద్యావంతుడు. 150 ఎకరాల భూస్వామి. తల్లి వెంకటరంగమ్మ భక్తి పారాయణురాలు నిరంతరం ఆధ్యాత్మిక చింతనలో ఉండేది. కె.వి.రెడ్డి రెండు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే తండ్రి కొండారెడ్డి కాలం చేసాడు. ఈ పరిస్థితిలో వెంకట రంగమ్మ మానసికంగా కృషించిపోయి జీవితం పట్ల వైరాగ్య దశకు చేరుకున్నది. పూర్తిగా భక్తి ప్రపంచంలో లీనమైపోయి బాహ్య ప్రపంచాన్ని మరిచిపోయింది. అప్పుడు పసిపిల్లవాడైన కె.వి రెడ్డిని మేనమామ చేరదీస్తూ తాడిపత్రికి తీసుకువెళ్ళాడు.

 అమ్మమ్మగారింట కె.వి.రెడ్డి బాల్యం ఆనందంగా కొనసాగింది. తండ్రి లేడు అనే వెలితి తప్ప అతనికి ఏ బాధ లేదు. సెలవు దినాల్లో సాయంకాలాల్లో పల్లె స్నేహితులతో కలిసి చెరువుల్లో వాగుల్లో బావుల్లో ఈతలు కొట్టేవాడు. పంట పొలాల్లో చెట్టు పుట్టల వెంట తిరిగేవాడు. చేపలు పట్టుకునే వాడు. స్మశానా లో ఎముకలు సేకరించి పరిశీలించే వాడు. కొండలు ఎక్కడం లోయలు దిగడం అవలీలగా కొనసాగించేవాడు.

▪️ చింతల వెంకటరమణ స్వామి గుడిలో....

 కె.వి.రెడ్డి పసిపిల్లవాడుగా ఉన్నప్పుడు తల్లి వెంకట రంగమ్మ బిడ్డను ఎత్తుకొని చింతల వెంకటరమణ స్వామి గుడికి వెళ్లి, ఇంటికి మాత్రం ఒంటరిగా తిరిగి వచ్చింది. పిల్లవాడు ఏది అని అందరూ కంగారు పడ్డారు. వెంకటరంగమ్మ ఏమాత్రం కంగారు లేనిదై బిడ్డను స్వామివారి హుండీలో వేసానని చెప్పింది. అందరూ హుటాహుటిన ఆలయానికి పరిగెత్తుకు వెళ్లారు. అక్కడ పిల్లవాడు క్షేమంగా ఉన్నాడు. తల్లి వెంకటరంగమ్మ లో ఉన్న ఆధ్యాత్మిక చింతన అదుపు తప్పిపోయింది అని చెప్పడానికి ఈ ఘటన ఒక ఉదాహరణ. ఈ ఘటన జరిగిన రెండు సంవత్సరాలకి తండ్రి కొండారెడ్డి మరణించాడు. దాంతో ఆమె పూర్తిగా వైరాగ్యంలోకి వెళ్ళిపోయింది.

▪️చదువు - ఆటపాటలు:

 చిన్నప్పటినుండి అల్లరి పనులు చేసే కె.వి.రెడ్డి, చదువులోనూ ఆటపాటల్లోనూ ఎప్పుడు వెనకబడలేదు. అతడికి గణితశాస్త్రం పై పట్టు ఉండేది. తనకంటే పెద్ద తరగతుల వాళ్ళకి గణితంలో తలెత్తే సమస్యల్ని సులువుగా తీర్చేవాడు.

 ఇక ఫుట్బాల్ హాకీ ఆటల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండేవాడు.పరుగు పందెం మొదలెట్టాడంటే చిరుత పులిలా దూసుకుపోయేవాడు.

 తాడిపత్రిలో పాఠశాల విద్యను కొనసాగిస్తున్నప్పుడు
 మూల నారాయణస్వామి కె.వి.రెడ్డి ఇద్దరు మంచి మిత్రులుగా ఉండేవారు. 

పాఠశాల విద్య తర్వాత పై చదువుల కోసం కేవీరెడ్డిని మేనమామ మద్రాస్ పంపించాడు. అక్కడ విక్టోరియా హాస్టల్లో ఉంటూ మద్రాస్ ప్రెసిడెంట్ కళాశాలలో డిగ్రీ ఆనర్స్ లో తన చదువును కొనసాగించాడు. పల్లెల్లో అలవాటు పడ్డ కె.వి.రెడ్డి ప్రాణం నగర వాతావరణం తట్టుకోలేకపోయింది. అందుకే సినిమాలు ఎక్కువగా చూసేవాడు. సినిమాల్ని ఒక ప్రేక్షకుడిలా చూస్తున్నప్పుడే, అతనిలోని దర్శకుడు మేల్కొనేవాడు. కాబట్టి సినిమాను సినిమాగా కాకుండా సినిమా నిర్మాణంలో ఉన్న పొరపాట్లు గ్రహించేవాడు..

 ▪️మొదటి సినిమా ప్రయత్నం :

తాడిపత్రికి జై మహమ్మద్ ఎలక్ట్రిక్ బయోస్కోప్ సినిమా వచ్చింది.మిత్రులు 
మూలా నారాయణస్వామి, కె.వి.రెడ్డి ఇద్దరూ కలిసి సినిమా చూసి ప్రేరణ చెందారు. నారాయణస్వామి ఖర్చు భరిస్తానంటే సినిమా తీయడానికి సిద్ధమయ్యారు. తాడిపత్రి పరిసరాల్లో లొకేషన్ చూసుకున్నారు. కానీ ఎందుకనో వారి ప్రయత్నం సఫలం కాలేదు.

▪️వ్యాపారం - ఉద్యోగం:

 డిగ్రీ ఆనర్స్ పూర్తయ్యాక ఉద్యోగ ప్రయత్నాలు చేశాడు కె.వి.రెడ్డి. కానీ సరైన ఉద్యోగం రాలేదు. టీచర్ ట్రైనింగ్ కోసం కూడా ప్రయత్నం చేశాడు. కానీ విఫలమయ్యాడు. అప్పుడు ఎ.ఎ.వి.కృష్ణారావు అనే స్నేహితునితో కలిసి 1936-37 మధ్యకాలంలో
250 రూపాయల పెట్టుబడితో
 "ది స్టాండర్డ్ సైంటిఫిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ కంపెనీ" ని స్థాపించాడు. ప్రయోగశాలలకు ఉపకరించే శాస్త్రోపకరణాలను ఈ కంపెనీ తయారుచేసేది. వ్యాపారం బాగానే కొనసాగినప్పటికీ ఒక ఏడాది కాలం మాత్రమే ఈ వ్యాపారాన్ని కొనసాగించాడు.

 కె.వి.రెడ్డి వ్యాపారం చేస్తున్న తరుణంలోనే
 బాల్య స్నేహితుడు మూల నారాయణరావు రోహిణి పిక్చర్స్ బ్యానర్ పై గృహలక్ష్మి సినిమా నిర్మాణంలో భాగస్వాముడయ్యాడు. సినిమా అంటే ఆసక్తి ఉన్న కె.వి.రెడ్డిని ఆహ్వానించాడు. కె.వి.రెడ్డి తన వ్యాపారాన్ని వదులుకొని రోహిణి పిక్చర్ సంస్థలో క్యాషియర్ గా చేరాడు.

▪️రోహిణి పిక్చర్స్ - వాహిని పిక్చర్స్,:

గృహలక్ష్మి సినిమా తర్వాత నిర్మాతల్లో ఒకరైన హెచ్.ఎం.రెడ్డికి బి.ఎన్.రెడ్డికి మధ్య విభేదాలు వచ్చాయి. ఈ క్రమంలో రోహిణి పిక్చర్ నుండి విడిపోతూ మూలా నారాయణస్వామి, బి.ఎన్.రెడ్డి ఇద్దరు కలిసి స్వంతంగా వాహినీ పిక్చర్స్ సంస్థ ప్రారంభించారు. వాహినికి మూలా నారాయణస్వామి ఛైర్మన్గా , బి. ఎన్. రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్ గా నియమితులయ్యారు. కె.వి.రెడ్డి కూడా వీరితో పాటు వచ్చేసి వాహినీ సంస్థలో ప్రొడక్షన్ విభాగంలో
చేరాడు.1939 నుండి 1942 వరకు ప్రొడక్షన్ మేనేజర్ గా పని చేశాడు.

 ▪️భక్తపోతన సినిమా నిర్మాణం :

 కె.వి.రెడ్డి తొలి సినిమా భక్త పోతనతో 1943 లో ప్రారంభమైంది.క్యాషియర్‌గా గృహలక్ష్మికి పనిచేసిన నాటి నుంచీ , వాహినీ నిర్మించిన వందేమాతరం (1939), సుమంగళి (1940), దేవత (1941) సినిమాలకు ప్రొడక్షన్ మేనేజరుగా పనిచేయడం వరకు, సినిమా నిర్మాణం పట్ల మెళకువల్ని గ్రహించి ఔపాసన పట్టిన కె.వి.రెడ్డి భక్త పోతన సినిమాకి స్క్రిప్ట్ తయారు చేసుకుని వాహిని బ్యానర్ మీదనే సినిమా నిర్మాణానికి పూనుకున్నాడు. వాహిని సంస్థ నిర్మించిన మొదటి మూడు సినిమాలు పెద్దగా విజయం సాధించలేదు కాబట్టి, కొత్తగా దర్శకుడిగా అవతారం ఎత్తుతూ కె.వి.రెడ్డి నిర్మించే భక్త పోతన సినిమా పట్ల కూడా వాహిని సంస్థ తరుపున ఎవరు ఆసక్తి చూపలేకపోయారు. కొత్త దర్శకుడు అని నిర్లక్ష్యం చేశారు. ఈ సమయంలో మూలా నారాయణ జోక్యం చేసుకుంటూ కె.వి.రెడ్డి సినిమా విజయం సాధిస్తే లాభం సంస్థదని , నష్టం వస్తే వ్యక్తిగతంగా తాను భరిస్తానని తేల్చి చెప్పడంతో సినిమా ప్రారంభం అయింది. సినిమా ప్రారంభం తర్వాత కూడా మొదటి ప్రపంచ యుద్ధం రీత్యా కొన్ని అవాంతరాలు ఏర్పడినప్పటికీ , సినిమా విజయవంతంగా పూర్తయి సంస్థకు గొప్ప పేరును లాభాలను తెచ్చిపెట్టింది. ఆ విధంగా కె.వి.రెడ్డి సినిమా ప్రస్థానం ఆరంభమైంది. మొత్తానికి కె.వి.రెడ్డి భక్త పోతన సినిమా విజయం కారణంగా వాహినీ సంస్థ స్థిరపడిపోయింది.

▪️కేవి రెడ్డి సినీ ఆణిముత్యాలు:

మూడుదశాబ్దాల కాలం 1938 నుండి 1971 వరకు కె.వి.రెడ్డి సినీకళామతల్లికి తన సేవలు అందించారు . వీరు దర్శకత్వం వహించిన మొత్తం సినిమాలు పద్దెనిమిది. వీటిలో తెలుగులో 14 సినిమాలు.అట్లాగే తమిళంలో మూడు సినిమాలు, కన్నడంలో ఒక సినిమా ఉన్నాయి. తెలుగు సినిమాల్లో రెండు చారిత్రకాలు, 
నాలుగు పౌరాణికాలు, నాలుగు జానపదాలు, నాలుగు సాంఘికాలు, ఉన్నాయి

🔸 చారిత్రకాలు
భక్త పోతన (1943),
యోగివేమన (1947)
 కె.వి.రెడ్డి తొలి సినిమా భక్తపోతన.

🔸జానపదం
గుణసుందరి కథ (1949),
పాతాళ భైరవి (1951),
జగదేకవీరుని కథ (1961)
సత్య హరిశ్చంద్ర (1964),

🔸సాంఘిక చిత్రాలు
పెద్దమనుషులు (1954),
దొంగ రాముడు (1955)  
 పెళ్లినాటి ప్రమాణాలు(1958)
భాగ్యచక్రం (1968).

🔸పౌరాణికాలు
మాయాబజార్ (1957)
శ్రీకృష్ణార్జున యుద్ధము (1963),
ఉమా చండీ గౌరీ శంకరుల కథ (1968),
శ్రీకృష్ణసత్య (1972)

 ▪️గుణసుందరి సినిమాలో ఎలుగుబంటి నేపథ్యం:

 కె.వి.రెడ్డి తన స్నేహితులతో కలిసి ఒకసారి తాడిపత్రి దగ్గర అడవుల్లో తిరుగుతూ ఉన్న సమయంలో ఒక ఎలుగుబంటి ఆకస్మికంగా వారిపై దాడి చేసింది. కె.వి.రెడ్డి, అతని మిత్రులు దాని మీద తిరగబడుతూ రాళ్ళతో కొడుతూ దాన్ని రెచ్చగొట్టారు. అది కోపంతో విజృంభించింది. పరిస్థితి చేయి దాటి పోవడంతో అందరూ పారిపోయారు. చిన్నవాడైన కె.వి.రెడ్డి భయంతో ఒక దగ్గర నక్కి పోయాడు. పిల్లలంతా పారిపోయారు. ఎలుగుబంటి వెనుతిరిగి వస్తూ కె.వి.రెడ్డిని చూసింది. బాలుడు భయంతో వణికిపోతున్నాడు. ఏడుస్తున్నాడు. ఏమైందో ఏమో ఎలుగుబంటి కొన్ని క్షణాలు కేవీ రెడ్డిని అట్లాగే చూసి, తర్వాత తన దారిన తాను వెళ్ళిపోయింది. ఆ విధంగా కేవీ రెడ్డి ప్రాణాలు దక్కాయి. అంతవరకు కోపంతో బుసలు కొట్టిన ఎలుగుబంటి కె.వి.రెడ్డిపై దాడి చేయకపోవడం నిజంగా విచిత్రం. తన జీవితంలో జరిగిన ఈ సంఘటన ఆధారంగా " జంతువులకు కూడా జాలి, దయ వంటి సుగుణాలు ఉంటాయి " అని తెలియజేస్తూ గుణసుందరి కథ సినిమాలో ఎలుగుబంటి పాత్ర రూపకల్పన చేయడం జరిగింది...

▪️జీవితాల్ని నిలబెట్టిన కేవి రెడ్డి:

ఎన్.టి.రామారావు, ఎస్.వి.రంగారావు, అల్లు రామలింగయ్య వంటి నటుల సినిమా భవితన్యం కె.వి.రెడ్డి సినిమాల కారణంగా నిలదొక్కుకుంది. పింగళి నాగేంద్రరావు, డి.వి.నరసరాజు, కొసరాజు రాఘవయ్య వంటి రచయితల సినిమా భవిష్యత్తు స్థిరపడడానికి కూడా కె.వి.రెడ్డి సినిమాలే కారణం.

▪️ఎన్టీఆర్ ను కృష్ణుడిగా నిలబెట్టిన కె.వి.రెడ్డి :

 కె.వి.రెడ్డి గారి మాయాబజార్ సినిమాలో ఎన్టీ రామారావు కృష్ణుడిగా నటించి, కృష్ణుడు అనే రూపానికి ఒక నమూనాగా గుర్తింపబడ్డాడు. మాయాబజార్ కంటే ముందుగా నిర్మించిన "ఇద్దరు పెళ్ళాలు" " సొంత ఊరు" సినిమాల్లో ఎన్టీరామారావు కృష్ణుడిగా నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోయాడు. పైగా రెండు సినిమాలు పరాజయం పొందాయి. ఈ పరిస్థితిలో కేవీరెడ్డి తన మాయాబజార్ సినిమాలో ఎన్టీ రామారావుకి కృష్ణుడి వేషం ఇచ్చాడు. సెంటిమెంట్గా ఎన్టీరామారావు కృష్ణుడు వేషం వేస్తే మాయాబజార్ సినిమా కూడా పరాజయం అవుతుందేమోనని అందరూ భయపడ్డారు . కానీ అందరి ఊహల్ని ఆలోచనల్ని తారుమారు చేస్తూ మాయాబజార్ సినిమా ప్రపంచ స్థాయి సినిమాగా మిగిలిపోయింది. ఆ విధంగా ఎన్టి రామారావు కె.వి.రెడ్డి కారణంగా కృష్ణుడు అనే ఒక దివ్య రూపానికి ముద్రగా నేటికి చెప్పబడుతున్నాడు.

▪️అటుపోట్లు :

 క్రమశిక్షణ అంకిత భావం తన ప్రత్యేక ఆస్తులుగా చలామణి అయ్యే కె.వి.రెడ్డి, తన జీవితంలో ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు . సత్య హరిశ్చంద్ర (1964), ఉమా చండీ గౌరీ శంకరుల కథ (1968), భాగ్యచక్రం (1968) సినిమాలు పరాజయం పాలవడంతో కె.వి.రెడ్డి దర్శకుడిగా వెనకబడిపోయాడు. అంతవరకు విజయవంతమైన సినిమాల దర్శకుడిగా నిర్మాతలు అతడు ఇంటి ముందు వరుస కట్టేవారు. పరాజయం ఎదురయ్యేసరికి కె.వి.రెడ్డిని పలకరించే వాళ్లే కరువైపోయారు. తాను విజయాలు సాధించి పెట్టిన వాహిని సంస్థ కొన్ని ఆర్థిక సామాజిక కారణాలతో విజయ సంస్థలో విలీనం అయింది. ఈ విజయ సంస్థ ద్వారా కె.వి.రెడ్డి తీసిన సినిమాలు పరాజయం పాలయ్యాయి. కె.వి రెడ్డికి సంబంధించిన సాంకేతిక నిపుణులను విజయా ప్రొడక్షన్స్ లో ఉద్యోగం నుంచి తొలగించడం, తనకు ఇచ్చిన కారును వెనక్కి తెప్పించుకోవడం వంటి అవమానాలను కె.వి.రెడ్డి తట్టుకోలేకపోయాడు కానీ నిర్భయంగా తనని తాను  
సంభాలించుకున్నాడు.

▪️ఎన్టీఆర్ కేవి రెడ్డిల గురుశిష్యుల బంధం _
 శ్రీకృష్ణసత్య సినిమా రూపకల్పన : 

 ఎన్టీ రామారావు కె.వి.రెడ్డిని తన గురువుగా భావించేవాడు. కె.వి.రెడ్డి సినిమా ప్రస్థానం వెనుకబడిపోయిన సమయంలో తన గురువును ఆదరించాలనే సంకల్పంతో ముందుకు వచ్చాడు ఎన్టీఆర్. తన సొంత సంస్థ ద్వారా శ్రీకృష్ణసత్య (1971) సినిమా తీయించాడు. అప్పటికి కె.వి.రెడ్డి ఆరోగ్యం క్షీణించింది.కాబట్టి మునుపటిలా కాకుండా కుర్చీలో ఒక దగ్గర కూర్చుని నటినటులకు సూచనలు ఇస్తూ సినిమా పూర్తిచేశాడు.  
పరాజయాల ముద్రతో తన ప్రస్థానం ముగించాల్సి వస్తుందన్న భయాందోళనల నుంచి కేవి రెడ్డిని బయటపడేస్తూ ....1971లో విడుదలైన శ్రీకృష్ణసత్య సినిమా మంచి విజయం సాధించి పెట్టింది. మళ్లీ విజయవంతమైన సినిమా దర్శకుల జాబితాలో చేరి ఆ సంతృప్తితో 1972లో కె.వి.రెడ్డి శాశ్వతంగా నిష్క్రమించాడు .

▪️కె.వి రెడ్డి కుటుంబం :

 కె.వి రెడ్డికి 9 మంది సంతానం. వారిలో ఐదుగురు ఆడపిల్లలు నలుగురు మగ పిల్లలు.
లక్ష్మీదేవి, సుమిత్రాదేవి, పార్వతీదేవి, గీతాలక్ష్మీ వరలక్ష్మి అనేవాళ్ళు కూతుళ్లు. వీరిలో పార్వతీదేవి కుమారుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రస్తుతం డోన్ నియోజకవర్గానికి వైయస్సార్సీపి పార్టీ తరఫున శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

ఇక శ్రీనివాసరెడ్డి, నరసింహారెడ్డి, రామచంద్రారెడ్డి, కొండారెడ్డి కుమారులు.

▪️ అత్యుత్తమ సినిమాగా మాయాబజార్

2013లో CNN News -18 దేశవ్యాప్తంగా నిర్వహించిన బెస్ట్ మూవీ పోల్ లో ఇప్పటివరకూ వచ్చిన భారతీయ సినిమాల్లో అత్యుత్తమంగా మాయాబజార్ సినిమా పేర్కొనబడింది.

▪️కాలధర్మం:

 కె.వి రెడ్డి భార్య శేషమ్మకు క్యాన్సర్ వ్యాధి సోకింది. భార్య అంటే ఎంతో అభిమానం ప్రేమ ఉన్న కె.వి.రెడ్డి ఈ నిజాన్ని తట్టుకోలేక పోయాడు. మానసికంగా కృంగిపోయాడు. అప్పటికే తనకి రక్తపోటు, చక్కెర వ్యాధి, ఉన్నాయి. కాగా భార్య అనారోగ్య విషయం బయటపడగానే తాను మాత్రలు వేసుకోవడం మానేశాడు. భార్య లేని జీవితాన్ని భరించలేకపోతూ భార్య కంటే తానే ముందు వెళ్లి పోవాలని సంకల్పించుకున్నాడు. అప్పటికి పిల్లలందరు రంగాల్లో వాళ్ళు స్థిరపడిపోయారు. ఇక జీవితంలో ఎటువంటి ఆశలు లేవు. కాబట్టి కఠినంగా నిర్ణయం తీసుకున్నాడు. ఆ విధంగా
 సెప్టెంబర్ 15 , 1972లో ఆకస్మాత్తుగా గుండెపోటుతో ఈ లోకం వదిలి వెళ్ళిపోయాడు. భర్త వెళ్లిపోయిన మూడు నెలలకి భార్య శేషమ్మ కూడా తనువు చాలించింది. ఒక తరం చూస్తుండగానే అదృశ్యమైపోయింది.
____________________________________________
 ప్రపంచం మెచ్చిన దర్శకుడు కె.వి.రెడ్డి వర్ధంతి సెప్టెంబర్ 15 సందర్భంగా ఆత్మీయ నివాళిగా ఈ వ్యాసం

వ్యాసకర్త : తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

No comments:

Post a Comment