Monday, April 15, 2024

కృషి పండిట్ - చల్లా రామకృష్ణారెడ్డి

చల్లా రామకృష్ణారెడ్డి
( 1948- 2020)
( కవి,రచయిత,నటుడు,రాజకీయనాయకుడు)
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
వ్యాసకర్త : తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

సాహిత్యం ఊపిరిగా
సినిమా అభిరుచిగా
వ్యవసాయం ఆత్మగౌరవంగా 
రాజకీయం తన ప్రతిష్టగా 
వెరసి
ఓ విలక్షణ జీవనశైలిని కొనసాగించిన బహుముఖీయ ప్రజ్ఞాశాలి చల్లా రామకృష్ణారెడ్డి!

#వివరాల్లోకి_వెళ్తే :

కర్నూలు జిల్లా కోవెలకుంట్ల తాలూకా అవుకు మండలం ఉప్పాలవాడుకు చెందిన చిన్నపురెడ్డి నారాయణమ్మ దంపతులకు 1948 జులై 27 వ తేదీన మొదటి సంతానంగా చల్లా రామకృష్ణారెడ్డి జన్మించాడు. వీరిది భూస్వామ్య పెత్తందారీ కుటుంబం.తండ్రి చిన్నపురెడ్డి కాలం నుండి కూడా వర్గ పోరు నడిచింది. ఈ క్రమంలో అటుపోట్లు ఎదురుకుంటూ జీవితానికి ఎదురీదుతూ .....ధీటైన వ్యక్తిత్వంతో సామాజికంగా రాజకీయంగా తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. ఒక్క రెడ్డి వందమందికి సమానమనే జనశృతికి వీరు ప్రత్యక్ష ఉదాహరణ.

#కృషి_పండిట్

రామకృష్ణారెడ్డి అగ్రికల్చర్ బి ఎస్సీ చదివాడు. వ్యవసాయం అంటే విపరీతమైన మక్కువ. జీవితంలో వ్యవసాయానికి సంబంధించి ఒక గొప్ప కళాఖండం రూపొందించాలినేది ఆశయంగా ఉండేది. ఆశ నెరవేరలేదు కానీ, వ్యవసాయంలో తనదైన ముద్ర వేసాడు. ఆదర్శ రైతుగా రైతే రాజుగా వ్యయసాయం కొనసాగించాడు. వ్యవసాయంలో వీరి కృషికి ఫలితంగా జాతీయ స్థాయిలో అరుదైన #కృషి_పండిట్ అవార్డును గౌరవాన్ని సంపాదించుకున్నాడు.

#కవిగా
 
మంచి కళాభిరుచి చల్లా స్వంతం! వీరి కవిత్వాల్లో జీవితసత్యాలు కఠినంగా కనిపిస్తాయి.అనుభూతి సెలయేళ్ల పరవళ్లు అలవోకగా ధ్వనిస్తాయి. తాత్వికత ఓ సందేశమై దొర్లుతుంది.సరళ శైలిలో విస్తృతార్థాన్ని ఇచ్చే పదాల పొందిక వీరి ప్రత్యేకత. 

▪️సామజిక కవిత్వం

"జీవితం నేర్పే పాఠాలు ఇలలో ఏ గురువు నేర్పలేడు "
అని భావిస్తూ....సమాజంలో సంఘటనలకు స్పందిస్తూ.....కవిత్వాలు రాసే అలవాటు వీరికి ఉన్నది.

2019 షాద్నగర్ దిశ ఘటనకు స్పందిస్తూ

క్రూర మృగాళ్ల వికృత దాహానికి
లేత పడచు ప్రాణంబు అగ్నికీలల్లో భస్మమయ్యె ...... అయ్యో ప్రియ ... !! ( ప్రియారెడ్డి )
ఈ భూమండల భూపాలుడనేనైతే
మృగాళ్ల జాతి సమస్తాన్ని శిరస్చేదం చేసద గాక ..
అంటూ ధర్మగ్రహం వ్యక్తం చేసాడు.

2020 కరోనా నేపథ్యంలో వలస కూలీల గురించి స్పందిస్తూ......
గమ్యమెక్కడో గతి ఏమిటో
దిక్కు తోచని దిశగా సాగిపోతోంది...
బొబ్బలెక్కిన పాదాలనుఈడ్చుకుంటూ
ఆకలి కడుపులను మాడ్చుకుంటూ
గుండె బరువుగా
మండే కళ్ళలో కారే కన్నీటిధారలతో
ఎటో సాగిపోతోంది....
దిక్కు తోచని దిశగా....
చింపిరిజుట్టు .. శుష్కించిన దేహం
వెళ్ళిపోతోంది
తలపై మోయలేని బరువుతో
వంగిన మోకాళ్లపై భారం వేసి వెళ్లిపోతోంది
నిరుపేద భారతం మార్గమేమిటో
గమ్యమెక్కడో తెలియని దిశగా -
 అంటూ ఆవేదన వ్యక్తం చేసాడు.

" భవిష్యత్తంటే రాబోయే
  కాలమనే కాదు ,
రేపటికోసం నిన్ను నీవు 
తీర్చిదిద్దుకొమ్మనే ఓ హెచ్చరిక ... !! "

" నీ అద్భుత విజయ రథయాత్రకు చక్కటి ఇంధనం నీపై నీకున్న అచంచల విశ్వాసం ఇదే ..... నీ అనూహ్య విజయపథానికి తొలి గమ్యం " 

"మనిషి మాట్లాడితే భావం అర్థమౌతుంది ..
మనసు మాట్లాడితే జీవితమే అర్థమౌతుంది"

"కాలం పెట్టే పరీక్షలు నెగ్గితే ...... జీవితం పరమానందభరితం ఓడితే ..... దారం తెగిన గాలిపటం చందమే .. గెలుస్తావో ఓడుతావో నీ ఆత్మవిశ్వాసమే నీకు ఆయుధం .."

 వంటి కవితాత్మక సందేశాలను వీరు ప్రతి రోజూ తన సందేశాలుగా వినిపించేవాడు.

▪️అనుభూతి కవిత్వం -రాధకు_ప్రేమతో

రాజకీయంగా రాణిస్తూనే కవితాసేద్యాన్ని నిరాటంకంగా కొనసాగించాడు రామకృష్ణారెడ్డి.. అనుభూతి కవిత్వంగా "రాధకు ప్రేమతో " శీర్షికతో రాసిన కవితలు అక్షర తూనిరాలు! 
 90 వ దశకంలో వార్త ఆదివారం అనుబంధంలో ఈ అనుభూతి కవితలు రాయడం మొదలెట్టి .... ఆ పరంపరని 2020వరకు కొనసాగిస్తూ వచ్చాడు.రాధ ఒక ఊహాసుందరి.ఆమెను రామకృష్ణారెడ్డి అక్షరంతో ఆరాధించాడు.

 రాధ ! నాకు తెలుసు
నీ నిత్యనివాసమే నా ప్రణయ సామ్రాజ్యమని 
అక్కడ నేనేమి చేసినా స్వర్గమే దిగివస్తుందని

 ఇళ్ళంతా సుగంధ పరిమళాలు చిలకరించాను
నేలపై గులాబీరేకులు పరిచాను
రంగురంగుల పూలతోరణాలు కట్టాను
నేనే కాదు 
పున్నమి వెన్నెల మల్లెల పానుపు
మధుర ఫలరసాలు ... చల్లని గాలి
ఎదురు చూస్తున్నాయి నీకోసం రాధ ... !!
నా ఇంటికి ఎప్పుడొస్తావు .. !!

వంటి కవిత్వాలు రాజకీయ రణక్షేత్రంలో కరుకుగా కనిపించే హృదయలోతుల్లోని సున్నితత్వాన్ని... ప్రేమతత్వాన్ని ఆవిష్కరిస్తున్నాయి...

▪️పల్లె ఒడిలో - ప్రకృతి బడిలో :

వీరు గొప్ప ప్రకృతి ఆరాధకుడు! వీరికి పుట్టి పెరిగిన ఊరుపై ఎనలేని మమకారం....! తన పంటపొలాల మీద అపారమైన అభిమానం.... ! ఈ రెంటి నేపథ్యంలో  
""నా ఊరే నా లోకం - నా ప్రజలే నా ప్రపంచం "" అని చెప్పుకున్నాడు . అంతేకాదు.... " నా పొలం బాటే నా విహార యాత్ర "" అని చాటుకున్నాడు.
ఊరుచుట్టూ ప్రజల చుట్టూ అక్షరం తోడుగా అలసిపోకుండా సంచరించాడు. అందుకే....సామజికంగా రాజకీయంగా ఒక స్థానం లభించిన తర్వాత కూడా రాజధానికి మకాం మార్చకుండా సొంత గడ్డ నుండే రాజకీయాలు నడిపాడు.

కన్నతల్లి పల్లెతల్లి నేలతల్లి
పోషించి పెంచిన దేహం ...
కొండ గాలి..పైర గాలి
శ్వాసించి పెరిగిన దేహం ...
కొండ..గుండు
వంక..వాగు
చెట్టు..పుట్ట.....
తిరిగి తిరిగి పెరిగిన దేహం ...
ఎందుకు అలసి పోతుందని
శ్వాస ఆగేదాక ...
ఆ గగనకీర్తి నాది కాదు
నేల - నీరు - గాలిది...

ఈ కవితలో అభిమాన ధనంతో నిండిన కవితా హృదయాన్ని దర్శించవచ్చు.

▪️తాత్వికత :

చల్లా రామకృష్ణారెడ్డికి దైవ భక్తి ఎక్కువ. ఈ భక్తిలోంచి జీవితాన్ని దర్శిస్తూ తాత్వికతను కూడా పలికించాడు.

 "జీవితం ఓ ఆట గెలవచ్చు ...ఓడొచ్చు..
రాజైనా ....నిరుపేదైనా..
ఆట ముగిసే వరకు ఆడాల్సిందే"

"ఆహ్లాదకరమైన ప్రకృతిలో బాహ్యసౌందర్యము కన్నా ఆత్మసౌందర్యము వెదుకు నీకు మనోల్లాసము కలుగుతుంది"

వంటి తాత్విక భావనలు ప్రకటించడంలోనూ వీరు దిట్ట.

#ఫాక్షన్_ముద్ర 

" ఫ్యాక్షన్ పాపం నాది కాదు, అందుకు నేను పునాదులు వేయలేదు.ఫ్యాక్షన్ని నేను పెంచి పోషించలేదు. అది అనివార్యంగా కొనసాగింది. నా జీవితాన్ని గాయపరచింది. నేను నా తండ్రిని కోల్పోయాను. తెలియని వాళ్ళు నన్ను ఫ్యాక్షన్ లీడర్ గా అభివర్ణించారు.. " అంటూ అనేక మార్లు బహిరంగంగా వాపోయాడు . మరి ఫ్యాక్షన్ అసలు చరిత్ర ఏమిటీ?
▪️ రాయలసీమలో పాలేగార్ల సంస్కృతి నడిచింది.
పాలెగార్ అంటే మండలాధిపతి. పాలెగార్ల వద్ద శిస్తులు పన్నులు వసూలు చేయడానికి అధికారులు ఉండేవారు. కాలక్రమంలో ఈ అధికారులు పెత్తందారులయ్యారు.
చల్లా వారి కుటుంబం కూడా ఇలాంటి పెత్తందారీ కుటుంబం. పెత్తందారుల్లో కూడా చిన్నా పెద్ద వర్గాలు ఉండేవి.చల్లా రామకృష్ణారెడ్డి తండ్రి చిన్నపరెడ్డి ఆ ప్రాంతంలో పెద్ద పెత్తందారుడు. అట్లాగే పెద్ద వ్యవసాయదారుడు కూడా.
వీరి సొంత గ్రామము అవుకు పక్కన ఉప్పలపాడు. పక్కనే కొండమనాయినిపల్లె. ఈ పల్లె వాస్తవ్యుడు చెందిన ఆకుల నర్సిరెడ్డికి చిన్నపరెడ్డికి మధ్య కాలక్రమంలో ఆధిపత్య పోరు ఏర్పడింది. ఇదే క్రమంలో మరోవైపు పక్క ఊరు చెన్నంపల్లికి చెందిన బిజ్జం సత్యంరెడ్డికి చిన్నపరెడ్డికి మధ్య కూడా ఆధిపత్య పోరు నడిచింది .

1976- 1977 ప్రాంతంలో అవుకు అమిన్ గా పనిచేసిన గంగన్న నర్సిరెడ్డి పక్షం వహిస్తూ చిన్నపరెడ్డి వర్గాన్ని అదుపుచేసే ప్రయత్నం చేశాడు.  
1977 మే నెలలో ఒక కేసును ఆసరా చేసుకుని చల్లా చిన్నపరెడ్డిని , అతని కుమారుడు రామకృష్ణారెడ్డిని కోయిలకుంట్ల సబ్ జైల్లో పెట్టారు .

జైలులో బాంబుదాడి జరిగింది. ఇక చనిపోవడం ఖాయం అనుకున్న చిన్నపురెడ్డి తన కుమారుడిని కంభళ్లు చుట్టి ప్రత్యర్థుల దృష్టి మరల్చాడు.బాంబు దాడిలో గాయపడిన చిన్నపరెడ్డి కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చనిపోయాడు.రామక్రిష్ణారెడ్డి బతికి బయటపడ్డాడు

చిన్నపరెడ్డి మరణం తర్వాత 1980-81 ప్రాంతంలో చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబం ఉప్పలపాడు వదిలి అవుకులో స్థిరపడింది.

ఈ పరిస్థితుల్లో అనివార్యంగా అక్కడ ఫ్యాక్షన్ పురుడు పోసుకుంది. కొంతకాలానికి చిన్నపరెడ్డి హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న ముగ్గురు వ్యక్తులు చంపబడ్డారు.రామకృష్ణారెడ్డి కొద్ది రోజులు జైలుకు వెళ్ళాడు కానీ కేసు నిరూపించబడలేదు.

#రాజకీయరంగంలో

1983లో టీడీపీ ఆవిర్భావం జరిగింది. రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. సీమలో ఆధిపత్య పోరుకి పార్టీలు వేదిక అయ్యాయి. ఈ సమయంలో ప్రత్యర్థి బిజ్జం వర్గం కాంగ్రెసులోనే ఉండటం మూలాన,
చల్లా రామకృష్ణారెడ్డి టీడీపీలో చేరారు. ఇది ప్రత్యక్ష రాజకీయ ప్రవేశం.

1983 - 2020 వరకు మూడు సార్లు ఎమ్మెల్యేగా(1983-1999-2004) వివిధ నియోజక వర్గాల నుండి గెలుపొందారు. మరణించే నాటికి ఎమ్మెల్సీగా కొనసాగారు.
ముఖ్యంగా సీమ ప్రాంతంలో ఎన్నికలు అంటే అది కొదమ సింహల పోరు! గెలిచినా ఓడినా ఒకటే విలువ! తోడుగా ఫాక్షన్ పంజా. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఓటమి అనేది వెనకడుగు కాదు. ఎవ్వరి బలాబలాలు వాళ్లకి ఉంటాయి.

▪️1983 ఎన్నికల్లో టిడిపి నుండి పోటీచేసి 
పాణ్యం ఎమ్మెల్యేగా గెలిపొందారు. నిత్యం ప్రజలతో మమేకమై రోడ్లు, తాగునీరు, విద్యుత్ వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దఎత్తున శ్రీకారం చుట్టారు.

▪️1989లో డోన్‌ అసెంబ్లీ స్థానం పోటీ చేసి ఓటమి పాలయ్యారు.అయినప్పటికీ ప్రజల మధ్యే తిరిగారు.

▪️1991లో నంద్యాల పార్లమెంట్‌ అభ్యర్థిగా టిడిపి నుండి బరిలో నిలిచి, కాంగ్రెస్ అభ్యర్థి గంగుల ప్రతాపరెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు.కానీ నిరాశ చెందలేదు.

▪️1994లో కోవెలకుంట్ల అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి సిట్టింగ్‌ ఎమ్మెల్యే చేతిలో ఓడిపోయారు.

▪️1999ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందారు.

▪️2004 ఎన్నికల్లో కోవెలకుంట్ల నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి విజయం సాధించారు
భారీ మెజార్టీతో విజయం సాధించారు.

▪️2009లో ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి టికెట్‌ రాకపోవడంతో టీడీపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థి బీసీ జనార్దనరెడ్డిని ఒంటి చేత్తో గెలిపించారు.

ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వంలో ఏపీ సివిల్‌ సప్లయీస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా పనిచేశారు. అనంత‌రం 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆ పదవికి, పార్టీకి రాజీనామా చేసి.. వై‌సీపీలో చేరారు.

#జీవిత_కల_హోమంత్రి

చల్లా రామకృష్ణారెడ్డి మంచి వాగ్ధాటి ఉన్నవాడు. పంచ్ లతో జనాన్ని ఆకర్శించగలడు. వ్యూహ ప్రతి వ్యూహాలు ప్రదర్శించగలడు. అన్నీ ఉన్నా 
అమాత్యుడు అనిపించుకోవాలానే తన ఆశయం నెరవేర్చుకోలేక పోయాడు.రాజకీయాల్లో చెప్పుకోదగిన క్యాబినెట్ పదవులు చేపట్టక పోయినా రాష్ట్ర స్థాయిలో అందరికీ సూపరిచితమైన వ్యక్తి చల్లా రామకృష్ణారెడ్డి.మంత్రి పదవి అతడికో లెక్కకాదు. పదవి లేకపోయినా అంతటి శక్తి ఉన్నవాడే.కానీ రాజకీయ ఎత్తుగడలో అదృష్టమో తెలియదు కానీ, అన్నివిధాలా అర్హుడు అయినప్పటికీ మంత్రి కాలేక పోయాడు.
ఎన్టీఆర్ హయాంలోనే మంత్రి అవుతానని ఆశపడ్డాడు కానీ ఎన్టీఆర్ కర్నూల్ జిల్లా నుండి ఎవరిని మంత్రి వర్గంలోకి తీసుకోలేదు .

#నటుడుగా

▪️వీరికి సినిమాలపై కూడా విపరీతమైన మక్కువ. 1987లో సీటు రాలేదు. కొంత విరామం దొరికినట్టయ్యింది. అందుకే తన మక్కువను నెరవేర్చుకునే ప్రయత్నానికి శ్రీకారం చుడుతూ తానే రచయితగా నిర్మాతగా జంద్యాల దర్శకత్వంలో ‘సత్యాగ్రహం’. సినిమాలో కథానాయకుడుగా నటించాడు. సరిత కథానాయిక.
సినిమాకు పాటలు, శ్రీశ్రీ, వేటూరి రాశారు.సంగీతం రమేష్ నాయుడు సమకూర్చారు.
హాస్యబ్రహ్మ బ్రహ్మానందం కూడా ఈ సినిమాలో నటించాడు. బ్రహ్మానందంకు ఇది తొలి సినిమా. కానీ ఆ తర్వాత వచ్చిన "ఆహా నా పెళ్ళంటా "సినిమాను బ్రహ్మానందం తొలి సినిమాగా చెబుతుంటారు.
సత్యాగ్రహం చిత్రం బాక్సాఫీస్ దగ్గర పెద్దగా విజయవంతం కాలేదు గాని, మంచి సందేశాత్మక చిత్రంగా పేరు తెచ్చుకుంది.

▪️కొండవీటి కంబైన్స్ పతాకంపై కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో "సై సైరా చిన్నపరెడ్డి" సినిమాలో కథానాయకుడుగా చేసాడు. కానీ ఈ సినిమా అర్థంతరంగా ఆగిపోయింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మరణం తర్వాత జన్మించిన మహాయోధుడు సై సైరా చిన్నపరెడ్డి. ఈ కథ వెలుగులోకి రావలసిన అవసరం ఉంది.

#జనం_కోసం

చల్లా రామకృష్ణారెడ్డి రాజకీయ నాయకుడి హోదాలో మాత్రమే కాదు, వ్యక్తిగతంగా పదవి ఉన్నా లేకపోయినా ప్రజలకు చేదోడు వాదోడుగా ఉన్నాడు.పల్లెల్లో జనాలకు తానో పెద్దమనిషిగా ముందుండి ధైర్యం అందించాడు.తనను నమ్మిన వాళ్ళను బలమై బలగమై నడిపించాడు.నిరుపేద కుటుంబాలను ఆర్థికంగా ఆదుకున్నాడు.
గుడులు గోపురాలకు స్థల దాతగానే కాదు, గుడి నిర్మాతగా కూడా వ్యవహారించాడు. నేటికీ పండిన పంటలో ఒక వంతు నిరుపేదలకు కేటాయించబడుతుంది. ప్రతి పండుగకు పేదలకు వస్త్ర దానం ఉంటుంది.

#కుటుంబం 

చల్లా రామకృష్ణారెడ్డి ఇంట్లో అందరికీ పెద్దన్న. వీళ్ళు మొత్తం నలుగురు అన్నాదమ్ముళ్లు. అందరూ అవుకులోనే నివసిస్తారు. చల్లా సతీమణి శ్రీదేవి. ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు.... భగీరథరెడ్డి, విఘ్నేశ్వర్ రెడ్డి. ఇద్దరు కూతుళ్లు..... బృంద, పృథ్వీ.

#శివైక్యం

 డిసెంబర్ 13 వ తేది 2020 న కరోనాతో బాధ పడుతున్న చల్లా... అపోలో ఆస్పత్రిలో చేరారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ జనవరి 1,2021 న తెల్లవారు జామున శివైక్యం పొందారు.

"జనజీవన సమాజంలో సింహంలా ఒక దశాబ్దం జీవించు చాలు " అని చెప్పుకున్న చల్లా రామకృష్ణారెడ్డి సింహంలాగే జీవించి వెళ్ళిపోయాడు.

No comments:

Post a Comment