Monday, April 15, 2024

డాక్టర్ పెరుగు శివారెడ్డి

డాక్టర్ పెరుగు శివారెడ్డి
( 1920- 2005)
( ప్రముఖ నేత్ర వైద్యుడు )
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
వ్యాసకర్త : తంగెళ్ళశ్రీదేవిరెడ్డి 

అతడి మనసుకు కూడా నేత్రాలు ఉండేవి......
అతడి పలకరింపు కూడా కన్నులు తొడిగి ఆప్యాయంగా పలకరించేది...... 
అతడి ఉదారత వేల కన్నుల వెలుగై విరాజిల్లేది... 
ధనం ఉన్నవాడు కాదు, మెరుగైన కంటి చూపు ఉన్నవాడే ధనవంతుడిగా భావిస్తూ..... కంటి రోగులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ.....చేపట్టిన వృత్తికి అదనపు విలువలు సంపాదించి పెట్టిన వ్యక్తి డా. పెరుగు శివారెడ్డి !

కంటి డాక్టర్ శివారెడ్డిగా తెలుగు ప్రజలకు పరిచయమైన  
శివారెడ్డి ఇప్పటికీ సందర్భం వచ్చిన ప్రతిసారి జనం నాలుకలపై నానుతూనే ఉన్నాడు. 

▪️జననం :

సెప్టెంబర్ 12 - 1920
కర్నూలు జిల్లా దిన్నెదేవరపాడు లో జన్మించారు.
వీరి తండ్రిపేరు పెరుగు హుస్సేన్ రెడ్డి. పి.హెచ్.రెడ్డిగా చెలామణి అయ్యారు. పూర్వం పిల్లలు ఆరోగ్యం బాగాలేక పోయినా, పిల్లలు పుట్టక పోయినా దర్గాలకు మొక్కుకుని దర్గా పేర్లు పెట్టుకునే వారు. ఇప్పటికీ పల్లెల్లో ఈ ఆచారం కొనసాగుతుంది. ఈ క్రమంలో పి.హెచ్.రెడ్డి గారు 
దర్గా దగ్గర జన్మించటంతో వారికి ఆ పేరు పెట్టడం జరిగినది.కానీ వారి పూర్తి పేరు తెలిసిన వాళ్ళు తక్కువే. 

▪️వైద్య పట్టా - వృత్తి :

1946లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి ఎం.బి.బి.యస్. డాక్టరు పట్టాను పొందారు. తర్వాత నేత్రవైద్యం ప్రత్యేక కోర్సుగా తీసుకుని 1952లో
ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎం.యస్. పట్టాని స్వీకరించారు

తన జీవితకాలంలో అధికారికంగా మూడు దశాబ్దాల పాటు నేత్ర వైద్య చికిత్సను కొనసాగిస్తూ.....నేత్ర వైద్యానికి సంబంధించి కీలకమైన పరిశోధనలు చేశారు. తన జీవితంలో 500 మందికి పైగా పోస్ట్ గ్రాడ్యుయేట్లకు శిక్షణ అందించి తీర్చి దిద్దారు. 

▪️పేదదేశాల్లో ఉదారత :

నేత్ర వైద్యుడి హోదాలో శివారెడ్డి అనేక దేశాలు పర్యటించాడు. ఇందులో చెప్పుకోదగిన అంశం ఏమంటే వారి పర్యటనలో అత్యంత పేద దేశాలు కూడా ఉన్నాయి. అక్కడి నిరుపేదలకు ఉచితంగా చికిత్స అందివ్వడం శివారెడ్డి ఘనత. ధనిక దేశాల్లో పర్యటించినప్పుడు వచ్చిన గౌరవ పారితోషికాలను వీరు పేదదేశాల్లో ఖర్చుపెట్టి ఉదారతను చాటుకోవడం ప్రశంసనీయం. 

▪️మాతృభూమి సేవలో :

అమెరికా అకాడమీ ఆఫ్ ఆప్తల్మోలజీ వారు ఆహ్వానించి శివారెడ్డి ప్రతిభకు గౌరవాన్ని ప్రకటించారు.

చైనా లోని సన్-యట్ సెన్ యూనివర్శిటీ ఆఫ్ మెడిసన్ సంస్థకు విజిటింగ్ ప్రొఫెసర్ గా ఎన్నికయ్యారు. 

ఇట్లా వృత్తి ధర్మాన్ని కొనసాగిస్తూ వివిధ దేశాలు తిరుగుతున్న సందర్భంలో విదేశీ మిత్రులు కొందరు తమ తమ దేశాల్లో , స్థిరపడి సంపాదించుకోవాల్సిందిగా సలహాలు ఇచ్చారు. ముఖ్యంగా అమెరికామిత్రులు తీవ్రంగా బలవంతం చేశారు. డాలర్ స్వప్నాలు వివరిస్తూ స్వర్ణ సౌధాలు గురించి ఆశలు పెట్టారు. కానీ శివారెడ్డి ఎవ్వరి ఒత్తిడికి తలొగ్గలేదు. దేశాన్ని వదిలిపెట్టి పోవడానికి ఇష్టపడలేదు. దేశసేవలో తృప్తిని వెదుక్కుని భావితరాలకు ఆదర్శంగా నిలిచాడు. 

▪️వివిధ హోదాల్లో :

1949-53 సంవత్సరాల్లో మద్రాసు మెడికల్ సర్వీసెస్ లో అసిస్టెంట్ సర్జన్ గా పనిచేశారు. 

1953-56 సంవత్సరాల్లో ఆంధ్ర మెడికల్ కాలేజి, కింగ్ జార్జి హాస్పిటల్ విశాఖపట్టణంలో ఆఫ్తాల్మోలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా, అసిస్టెంట్ సర్జన్ గా 
తనవైన సేవలు అందించారు. 

1958 - 61 సంవత్సరాల్లో ఉస్మానియా మెడికల్ కాలేజీ, హైదరాబాద్ సరోజినీ ఐ హాస్పటల్ ఆహ్వానం మీద అక్కడ సూపరిండెంట్ గా, అఫ్తాల్మాలజీ ప్రొఫెసర్ గా పదవీ బాధ్యతలు నిర్వహిచ్మారు
 
1961-75 తర్వాతి కాలంలో రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులో చేరారు. 

1978-81 కాలంలో అప్తాల్మాలజీ డైరక్టరుగా పనిచేసారు. 

1975 - 78 మధ్య కాలంలో పోస్టు గ్రాడ్యుయేషన్ స్టడీస్ కు ప్రొఫెసరుగా కొనసాగారు. 

ఉస్మానియా మెడికల్ కాలేజీ అఫ్తాల్మాలజీ విభాగానికి ఎమెరిటన్ ప్రొఫెసర్ గా కొనసాగారు. 

ఆంధ్రప్రదేశ్ స్టేట్ అఫ్తాల్మోలాజికల్ అసోషియేషన్ అధ్యక్షులుగా పనిచేసే కాలంలో కొత్త ప్రమాణాలకు పునాదులు వేశారు.  

ఆల్ ఇండియా అఫ్తాల్మోజాలికల్ సొసైటీ అధ్యక్షులుగా కొనసాగుతూ దేశ వ్యాపితంగా తన ముద్రను నిరూపించుకున్నాడు. 

ఆసియా ఫసిఫిక్ అకాడమీ ఆఫ్ ఆఫ్తాలజీ ఉపాధ్యక్షులుగా పనిచేసి తెలుగు ప్రాంతానికి అదనపు గౌరవాన్ని తీసుకొచ్చాడు. . 

ఇండియన్ నేషనల్ ప్రోగ్రాం ఫర్ ప్రివెన్సన్ ఆఫ్ బ్లయిండ్‌నెస్ గౌరవ సభ్యులుగా....., ఇంటర్నేషనల్ ఏజన్సీ ఫర్ ఫ్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్‌నెస్ గౌరవ సభ్యులుగా... పదవులను నిర్వహిస్తూ " గుడ్డితనం లేని దేశం తన స్వప్నంగా " ఆకాక్షించారు. 

 ఇట్లా జీవితంలో ప్రతి అడుగులో కృషి పట్టుదలతో అంకితభావాన్ని కనబరుస్తూ... క్రమశిక్షణకు మారుపేరుగా కొనసాగుతూ.... ఉన్నత స్థాయికి అంచెలంచెలుగా ఎదిగాడు.

▪️సరోజినీ కంటి ఆసుపత్రి ఎదుగుదలలో :

ఈనాడు కంటి జబ్బులు వస్తే చాలు మొదటగా గుర్తుకు వచ్చేది హైదరాబాద్ సరోజినీదేవి కంటి ఆసుపత్రి. ఈ ఆసుపత్రికి ఇంత పేరు రావడానికి కారకులు శివారెడ్డి. సరోజినీ ఆసుపత్రి డైరెక్టరుగా కొనసాగుతున్న కాలంలో 
ఆసుపత్రిని అన్ని సౌకర్యాలతో ముందుకు నడిపించాడు. ఎక్కడ లోటు కనిపించినా వెంటనే చర్యలు తీసుకునే వాడు. 
"తోట పచ్చగా ఉంటే సరిపోదు... పండు తీయగా ఉండాలి " అని నమ్ముతూ ఆసుపత్రిలో సదుపాయాలు మాత్రమే కాకుండా పని చేసే వైద్యులు మొదలుకుని సిబ్బంది వరకు అంకితభావంతో పని చేసేట్టుగా జాగ్రత్తలు తీసుకున్నాడు. 

ఇట్లా - దేశంలోనే కంటి ఆసుపత్రులలో ప్రఖ్యాతమైనదిగా ఉన్న సరోజినీదేవి కంటి ఆసుపత్రికి ఘనతను తీసుకురావడంలో శివారెడ్డి కృషి ఎంతో ఉన్నది. రాజీపడని మనస్తత్వం, వెనకడుగు వేయని సారథ్యం, తిరుగులేని వైద్య నైపుణ్యం, అన్నీ తానై నడిపించగలిగే ఆత్మ స్థయిర్యం, అందరినీ ఒక త్రాటి మీదకి తీసుకు వచ్చే మార్గదర్శకత్వం శివారెడ్డి విజయానికి మూల సూత్రాలు !

▪️రాష్ట్రపతికి చికిత్సకులుగా :

శివారెడ్డి పనితనం , పట్టుదల, కారణంగా దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతికి గౌరవ నేత్ర చికిత్సకులుగా నియమితులయ్యారు. ఇది శివారెడ్డి ప్రావీణ్యానికి దొరికిన అరుదైన గౌరవం. 

▪️గవర్నర్ సలహాదారుడుగా :

ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సలహాదారుగా కూడా శివారెడ్డి కొనసాగాడు. 

▪️క్యాంపుల సంప్రదాయం, :

పల్లెల్లో ప్రజలు కంటి సమస్యలతో పెద్ద ఎత్తున బాధపడు
తున్నారని శివారెడ్డి గ్రహించాడు. ముఖ్యంగా ఆరోజుల్లో తాలూకా స్థాయిలో సైతం కంటి వైద్యులు అందుబాటులో లేరు. పల్లెల్లో నేటికిని వైద్య సదుపాయాలు లేని పరిస్థితి ఉన్నది. ఇక ఆనాటి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రోడ్లు సరిగ్గా ఉండేవి కాదు...., రవాణా సౌకర్యం ఉండేది కాదు..., తోడుగా కంటి వైద్యం గురించి ప్రజల్లో అవగాహన ఉండేది కాదు. ఈ పరిస్థితిలో చికిత్స తెలియక , చికిత్స అందక, ఎంతమందో శాశ్వతంగా చూపులు కోల్పోయారు. నిర్లక్ష్యం ఇట్లాగే కొనసాగితే దేశం అంధకారం అవుతుందని ముందు జాగ్రత్తగా ఆలోచించి ఊరూరా క్యాంపులు నిర్వహించే సంప్రదాయానికి శ్రీకారం చుట్టాడు . దాదాపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అన్ని పల్లెల్లో కంటి క్యాంపులు నిర్వహించాడు. ఈ నేపథ్యంలో ప్రజలకు మంచి అవగాహన కలిగించాడు. 

కాగా - 
క్యాంపుల్లో చాలామంది పల్లె ప్రజలు తమ వద్ద డబ్బు లేదని శివారెడ్డితో మొరపెట్టుకొనేవారు. ఈ పరిస్థితిలో
ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించారు..ఉచిత చికిత్స ఇవ్వడంతో పాటు అవసరమైన మందులు కూడా ఉచితంగా యిచ్చేవారు. ఉచితంగా ఆహారం కూడా పెట్టేవాడు. నాణ్యమైన అద్దాలు కూడా యిచ్చేవారు. 

క్రమంగా శివారెడ్డికి కొన్ని సంఘ సేవా సంస్థలు సహకరిస్తూ వచ్చాయి. సంస్థల సహకారంతో క్యాంపులు ఎక్కువగా నిర్వహించడం మొదలెట్టాడు. ముఖ్యంగా రోగులకు ఖర్చుపెట్టే విషయంలో శివారెడ్డి ఎప్పుడూ కూడా విరాళాలు ఆశించలేదు. అవసరం అయినచోటల్లా వెనక ముందు ఆలోచన లేకుండా సొంత డబ్బు చాలా ఖర్చు చేశారు.కాబట్టే తనకు పెద్దగా ఆస్తులు లేకుండా పోయాయి. 

మొత్తానికి భారతదేశంలో ఈ తరహాగా ఐ క్యాంఫులు నిర్వహించి చికిత్స అందివ్వడంలో ఆద్యుడుగా శివారెడ్డి చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో దాదాపు 500 పైగా క్యాంపులు, మూడు లక్షల కంటి ఆపరేషన్లు చేశాడు. 

సర్వేంద్రియాణాం నయనం ప్రధానం కాబట్టి కంటి సమస్యలు విజృంభించకుండా మొబైల్ సర్వీస్ కూడా ప్రారంభించారు. 

▪️ఐ బ్యాంక్ ఏర్పాటు :

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా వ్యాపారవేత్త టి.ఎల్.కపాడియా ఆర్థిక సహాయముతో 1964లో 
టి. ఎల్. కపాడియా ఐ బ్యాంకును నెలకొల్పారు. 

▪️ఆసుపత్రుల ఏర్పాటులో 

నేత్ర వైద్యం అందరికీ అందుబాటులో ఉండాలని భావిస్తూ విశాఖపట్నం, వరంగల్, కర్నూలులలో ప్రాంతీయ నేత్ర వైద్యశాలల యేర్పాటుకు కృషి చేశారు. పేద ప్రజలకు ఈ వైద్యం అందుబాటులోకి తేవాలనేది వీరి ప్రధాన సంకల్పం. ఈ క్రమంలో 1990లో కర్నూలులో కూడా నేత్ర వైద్యశాల
స్థాపించబడినది. శివారెడ్డి కృషికి చిహ్నంగా ప్రభుత్వం కర్నూల్ కంటి ఆసుపత్రిని శివారెడ్డి పేరున స్థాపింపబడటం గర్వకారణం. 

▪️సలహాదారుడుగా :

 మెగాస్టార్ చిరంజీవి తన పేరున స్థాపించిన చిరంజీవి నేత్ర వైద్యశాల స్థాపనకు ముందు శివారెడ్డి సలహాలను సూచనలను తీసుకోవడం ఇక్కడ గుర్తించాల్సిన విషయం. 

▪️గిన్నిస్ రికార్డు :

రెండు లక్షల యాభై వేలకు పైగా కంటి శుక్లాల ఆపరేషనులు విజయవంతంగా పూర్తి చేసాడు. అత్యధిక కంటి శుక్లాల ఆపరేషనులు చేసిన డాక్టరుగా గిన్నీస్ ప్రపంచ రికార్డు సాధించాడు. 

▪️గ్రంథ రచయితగా :

 శివారెడ్డి తనదైన రంగంలో గ్రంథ రచనలు చేశారు. దేశ, విదేశీ ప్రత్రికల్లో గొప్ప సైంటిఫిక్ ఆర్టికల్స్ అనేకం రాసారు. 
అంతర్జాతీయ సమావేశాలలో రెండొందలకు పైగా పత్ర సమర్పణలు చేశారు. 

అంతర్జాతీయ మెడిసన్ జర్నల్స్ లో దాదాపు 30 పరిశోధనా పత్రాలను వెలువరించారు.
 "Text book of Ophthalmology for Under graduates" గ్రంథ రచనకు శివారెడ్డి సహ రచయితగా వ్యవహరించారు. 

 ▪️Gordia Reddy :

1973 లో జర్మనీలో మ్యూనిచ్ నగరంలో జరిగిన ఇంటర్నేసహ్నల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఆఫ్తాల్మోలజీలో శివారెడ్డి ఒక క్రిమిని కనుగొన్నాడు. ఈ క్రిమి అరుదైన అకసేరుక జీవి. తర్వాతి కాలంలో జర్మనీ దేశం పరిశోధకుడిగా శివారెడ్డిని గుర్తించి గౌరవిస్తూ క్రిమికి శివారెడ్డి పేరు మీదనే Gordia Reddy అని నామకరణం చేశారు.

▪️సాంఘిక సేవా కార్యక్రమాలు :

అళాసాగర్ సాంస్కృతిక సంస్థకు అధ్యక్షులుగా కొంతకాలం ఉన్నారు. 
1985 నుండి భారతీయ విద్యాభవన్ కు ఛైర్మన్ గా పనిచేశారు.  
సిబిఐటి బోర్డులో ఉన్నత పదవులను అలంకరించారు.  

▪️విరమణ విశ్రాంతి కాకూడదు :

 పదవి విరమణ చెందాక కూడా శివారెడ్డి విశ్రాంతి తీసుకోలేదు. తన ఎనభై ఏండ్ల వయసు వరకు.... అంటే విరమణ తర్వాత రెండు దశాబ్దాల పాటు కంటి క్యాంఫులు నిర్వహిస్తూ తన సహృదయతను చాటుకున్నాడు. 

కంటి శుక్లాల ఆపరేషనులలో దిట్టగా పేరు పొందిన శివారెడ్డి ప్రముఖుల్ని ఆకర్షించాడు. కాబట్టి 
దేశంలో అత్యున్నత హోదాలలో కొనసాగిన ప్రముఖులు అందరూ తమ కంటి చికిత్స కోసం శివారెడ్డి వైద్యం వైపు మొగ్గు చూపారు. ప్రముఖులు ఎందరికో కి చికిత్స చేసి చూపు కల్పించిన ఘనత శివారెడ్డి సొంతం !
 
▪️ఆస్తులు లేవు :

చిన్న ఉద్యోగం చేస్తూ లక్షలు కోట్లు అడ్డదారిలో దండుకునే వాళ్ళు నేడు చాలామంది ఉన్నారు. కానీ శివారెడ్డి అక్రమ డబ్బు సంపాదన పట్ల మక్కువ చూపలేదు. కాబట్టే నేడు శివారెడ్డి సంపాదించిన ఆస్తులు ఏమీ లేవు. సంపాదించిన పేరు మాత్రమే వారి తరగని తరతరాల ఆస్తి. 1956 లో హైదరాబాదులో ఒక ఇల్లు నిర్మించుకున్నాడు. ఇది ఒక్కటే శివారెడ్డి ఆస్తి. 

▪️వారసులు :

కుటుంబ వారసులు చుస్తే - శివారెడ్డికి ఒక్కరే కూతురు. అల్లుడు కూడా కంటి డాక్టర్. హైదరాబాద్ హిమాయత్ నగర్ లలితా నిలయంలో 
#డాక్టర్_శివారెడ్డి_ఐ_హాస్పిటల్ పేరిట ప్రస్తుతం ఆసుపత్రి నిర్వహించబడుతున్నది. 

ప్రస్తుతం దేశ, విదేశాలలో శివారెడ్డి శిష్యులు వందల్లో అఫ్తాల్మోజిక్ సర్జన్లుగా కీర్తి ప్రతిష్ఠలు పొందుతున్నారు.వీళ్లంతా శివారెడ్డి వృత్తి వారసులు. 

▪️అవార్డులు - గౌరవాలు :

భారత ప్రభుత్వం నుండి 1971లో పద్మశ్రీ, 1977లో పద్మభూషణ్ పురస్కారాలు శివారెడ్డిని అలరించాయి. 

 1980లో వెంకటేశ్వర యూనివర్శిటీ వారిచే డి.ఎస్.సి. (Hon.Cau) పొందారు. 

1981 లో అమెరికన్ అకాడమీ ఆఫ్ అఫ్తాల్మోలజీ వారి గెస్ట్ ఆఫ్ హానర్ గా గౌరవం పొందారు. 

1981 లో డాక్టర్ బి.సి.రాయ్ నేషనల్ అవార్డు పొందారు 

 లక్ష కాటరేక్ట్ ఆపరేషన్లు పూర్తిచేసిన సందర్భంగా దేశ ప్రధానిచే మెమెంటో బహూకరణ జరిగింది. 

1985 లో ఆసియా-పసిఫిక్ అకాడమీ ఆఫ్ అఫ్తాల్మోలజీ వారి జీన్ రిజాల్ మెడల్ (ఆసియా - పసిఫిక్ అకాడమీ ఆఫ్ ఆఫ్తాల్ మొకజీ వారిచే) ఆడెన్ వాలా ఓరేషన్ గోల్డ్ మెడల్ స్వీకరించారు. 

▪️ మరణం :

 నేత్రవైద్య రంగానికి చుక్కానిగా దారిచూపి సేవలందించిన శివారెడ్డి.... 2005 ఆగస్టులో తన 85 ఏండ్ల వయసులో పార్కిన్‌సన్స్ వ్యాధికి గురయ్యాడు. ముసలితనంలో కూడా ఉరకలేసే సేవా తత్వాన్ని కలిగిన శివారెడ్డి అనారోగ్య కారణంగా స్తబ్దుగా మారిపోయాడు. అదే సంవత్సరం సెప్టెంబరు 6 వ తేదీన మంగళవారం నాడు గుండెపోటుతో మరణించారు. 

▪️చిరస్మరణీయలు :

భారతదేశం కార్నియల్ గ్రాప్టింగ్ రంగంలో ఘనకీర్తి సాధించడానికి ప్రధాన కారణం శివారెడ్డి ప్రతిభ ! ఈ విధంగా వృత్తి ధర్మంలో గెలిచి నిలిచిన శివారెడ్డి నేత్ర వైద్యానికి పెట్టింది పేరు ! భవిష్యత్తరాలకు స్ఫూర్తిదాత ! తెలుగు జాతి గర్వకారణం ! సదా స్మరణీయం !

No comments:

Post a Comment