Monday, April 15, 2024

కుర్రారం రామిరెడ్డి

కుర్రారం రామిరెడ్డి
( 1920 - 1948)
( తెలంగాణ సాయుధ పోరాట వీరుడు )
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
వ్యాసకర్త : తంగెళ్ళశ్రీదేవిరెడ్డి 

నల్లగొండ గుండె సవ్వడి... 
కుర్రారం ఉక్కు పిడికిలి ... 
పౌరుశాల నడిగడ్డ.... 
త్యాగాల ముద్దుబిడ్డ... 
పాశం రామిరెడ్డి.... 
ఇతడే కుర్రారం రామిరెడ్డిగా చరిత్రలో పేర్కొనబడ్డాడు. 

సాయుధ పోరాటంలో రజాకార్లకు సవాల్ గా నిలిచి, 
రాజాకార్ క్యాంపుల మీద వీరోచిత దాడులు నిర్వహించి, 
ప్రజల కోసం.... గ్రామాల కోసం...తన ప్రాణాలను ఫణంగా పెట్టి,  
బందూకు ఎత్తి గర్జించిన పాశం రామిరెడ్డి పోరాట గాథ సాయుధపోరాట చరిత్రలో పెద్దగా కనిపించదు. వీరు కుర్రారం రామిరెడ్డిగా కొన్ని సందర్భాల్లో మాత్రమే అక్కడక్కడా కనిపిస్తాడు. 

నిజమైన పోరాట వీరులు ఎందుకు మరుగున పడిపోయారు? సాయుధ పోరాటం అనగానే ప్రధానంగా ఒకరిద్దరి పేర్లే ఎందుకు వినిపిస్తాయి? పోరాట స్ఫూర్తిని రగిలించిన గుండెలు ఎందుకు అనామకంగా మిగిలిపోయాయి? ఎవ్వరి చరిత్ర వారే రాసుకోవడం ఇందుకు ఒక కారణమైతే, ఉద్దేశ్య పూర్వక ప్రవర్తనలు కూడా ఇందుకు బాధ్యత వహిస్తున్నాయి అనేది కఠినమైన వాస్తవం !

👉కుర్రారం రామిరెడ్డి జననం :

పూర్వ నల్లగొండ జిల్లా ప్రస్తుత యాదాద్రి జిల్లా భువనగిరి తాలూకా కుర్రారం గ్రామ వాస్థవ్యులైన పాశం పుల్లారెడ్డి జానకమ్మ దంపతులకు మొత్తం ముగ్గురు సంతానం. మొదట చంద్రమ్మ, రాజిరెడ్డిల తర్వాత 1920లో రామిరెడ్డి జన్మించాడు . 

👉కుటుంబ నేపథ్యం :

కుర్రారం గ్రామంలో పాశం రాజిరెడ్డి మోతుబరి రైతు. అడిగిన వాళ్లకు లేదనకుండా బీదసాదలకు అండదండలు అందించి.... దానధర్మాలు చేసి.... మనసును మారాజుగా పేరు గడించాడు. వీరికి పుల్లారెడ్డి నారాయణరెడ్డిలు కుమారులు. 

తండ్రి అడుగుజాడల్లోనే నడిచిన పుల్లారెడ్డి తన మెదటి సంతానానికి తండ్రి పేరే పెట్టుకున్నాడు. కాగా తన రెండవ కొడుకు రామిరెడ్డిని చూడకుండానే ఆనాడు ప్రబలిన ప్లేగు మహమ్మారి వల్ల చనిపోయాడు . భార్య జానకమ్మ అప్పుడు నాలుగు నెలల గర్భవతి. 

నారాయణరెడ్డికి అప్పటికి సంతానం లేకపోవడం వల్ల అన్న పుల్లారెడ్డి పిల్లల్ని తన పోషణలో ఉంచుకున్నాడు. కొంతకాలం తర్వాత తనకు సంతానం కలగడంతో అన్న పుల్లారెడ్డి పిల్లల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసాడు. 

ఇటువంటి పరిస్థితుల్లో రామిరెడ్డి తల్లి జానకమ్మ పిల్లల్ని పోషించుకోవడానికి అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. 

అడిగేవారు లేరు అని , అడగాల్సిన వారు చిన్నపిల్లలుగా ఉన్నారని, నారాయణరెడ్డి ఆస్తి పంపకాల విషయంలో కూడా రామిరెడ్డి కుటుంబానికి చాలా అన్యాయం చేసాడు. 

ఈ పరిస్థితిలో రామిరెడ్డి కుటుంబం నారాయణ రెడ్డితో కూడా పోరాటం చేయవలసి వచ్చింది.  

కుటుంబ పరిస్థితులు ఎంత కలచివేసినా రామిరెడ్డి తల్లి జానకమ్మ ఎక్కడా అధైర్య పడలేదు. తన ఇద్దరు కుమారులు తాత తండ్రుల బాటలో గొప్పగా బతకాలని, విద్యావంతులు కావాలని కలలు కంటూ, ఆనాటి కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించక పోయినప్పటికీ కష్టపడి చదివించాలని ప్రయత్నం చేసింది. 
 
ముఖ్యంగా రామిరెడ్డి పుట్టేనాటికి తెలంగాణలో పరిస్థితులు అగమ్య గోచరంగా ఉన్నాయి. తెలుగు భాష పరిస్థితి, తెలుగు ప్రజల పరిస్థితి, కొడిగట్టిన దీపంలా గాలిలో రెపరెప లాడుతున్న పరిస్థితి. ఇటువంటి గడ్డు పరిస్థితుల్లో పిల్లలకు ముందుగా రామాయణ మహాభారతాల కథను చదువులా చెప్పించింది . ఇట్లా రామిరెడ్డికి బాల్యం నుండే పోరాటం, దుష్ట సంహారం, ఆదర్శం, ఎత్తుగడలు, వంటి విషయాలు పట్ల ఒక ఆలోచన ఏర్పడింది. అందుకే తాను విన్న కథలను తిరిగి ఆటగా ఆడుకునే వాడు. తెలిసి తెలియని భాషలో కథలను నాటకం రూపంలో తోటి పిల్లలతో కలిసి ప్రదర్శిస్తూ అనుభూతి చెందేవాడు. 

👉చదువు - వందేమాతరం ఉద్యమం :

భువనగిరిలో ఏడవ తరగతి వరకు చదివిన తర్వాత హైదరాబాద్ లో తొమ్మిదవ తరగతి వరకు చదివాడు రామిరెడ్డి. ఆ తర్వాత హింసాత్మక సంఘటనల వల్ల సమాజం అతలాకుతలం అయ్యింది. ఈ పరిస్థితుల్లో చదువు ఆపేయాల్సి వచ్చింది. 
ఇదే కాలంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందేమాతరం ప్రభావం విద్యార్థులను ఉత్తేజ పరిచింది. ఈ క్రమంలో విశ్వవిద్యాలయం విద్యార్థులతో కలిసి ఇతర ఎందరో వందేమాతరం పిలుపు అందుకుని తమ చదువులకు స్వస్తి చెప్పి ఉద్యమంలోకి వెళ్ళారు. అప్పటికే జాతీయోద్యమ స్ఫూర్తిని నరనరాన జీర్ణించుకుని ఉన్న రామిరెడ్డి కూడా ఇదే బాటలో నడిచాడు. కాగా తోటి విద్యార్థులు చాలావరకు ఉద్యమంలో సభ్యులుగా భాగస్వామ్యం అయితే, రామిరెడ్డి మాత్రం నాయకత్వ లక్షణాలతో ముందుకు నడిచాడు.   

👉వివాహం - సాయుధపోరాటం :

రామిరెడ్డికి అనసూయాదేవితో 1938లో వివాహం జరిగింది. అప్పటికే మాతృభూమి ఆలోచన రామిరెడ్డిలో వేళ్లూనుకు పోయి ఉన్నది. 
చూస్తే ఒకవైపు భారత స్వాతంత్ర్య పోరాటం జరుగుతున్నది. మరోవైపు తెలంగాణలో పరిస్థితులు రోజురోజుకు మితిమీరుతున్నాయి. నిజాం నియంతృత్వం తెలుగు సమాజాన్ని పట్టి పీడిస్తున్నది. తబ్లిక్ వంటి మతమార్పిడి చర్యలు గ్రామాల్లో ప్రజలను ఇబ్బందులు పెడుతున్నాయి. అట్లాగే వెట్టి చాకిరీ విధానంలో దురహంకారం రాజ్యం ఏలుతున్నది. కొందరు దొరలు నిబంధన ప్రకారం వెట్టి కిందికి పొలాలు ఇచ్చినప్పటికి..... రెట్టింపు పనిని నిర్భబంధంగా చేయించుకుంటూ శ్రమ దోపిడీకి తెగబడ్డారు. తురక రాజ్యంలో హిందూ స్త్రీలకు
లైంగిక హింసలు కూడా విపరీతం అయ్యాయి.
ఈ క్రమంలో అంధ్రమహాసభ నిజాం పాలనను తీవ్రంగా వ్యతిరేకించింది. హిందూ సమాజం దుస్థితి పై, బాల్య వివాహాలు, వితంతు ఆచారాలు, వంటి రుగ్మతలపై, 
వెట్టి చాకిరీ నియమాలపై, తెలుగు భాష అణిచివేతపై 
పోరాటానికి సిద్దమయ్యింది. ఇందుకు చురుకైన యువకుల తోడ్పాటును ఆశించింది. అట్లా అంధ్రమహాసభ రామిరెడ్డికి ఆహ్వానం పలికింది. 
పెళ్లి పిల్లలు సంసారం బాధ్యత ఉన్నప్పటికీ మాతృభూమి స్పృహ రామిరెడ్డిని ముందుకు నడిపించింది. అందుకే ఇక వెనుతిరిగి చూడలేదు. తెలంగాణ ప్రజా చైతన్యానికై నాయకత్వ బాధ్యతను భుజాన వేసుకుంటూ పోరాట వీరుడై కదం తొక్కాడు. 

👉సంతానం :

పాశం రామిరెడ్డికి ముగ్గురు సంతానం. మొదటి సంతానం అమరేందర్ రెడ్డి. వీరు ప్రస్తుతం హైదరాబాద్ హబ్సిగూడలో నివాసం ఉంటున్నారు. తర్వాత ముగ్గురు ఆడపిల్లలు. సుజాత, భారతీదేవి, స్వరాజ్యలక్ష్మి. 

👉ఆయుధ శిక్షణ :

ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో 1946 డిసెంబర్ మాసంలో తెలంగాణలోని పదిమంది కీలక నాయకులను కృష్ణాజిల్లాలోని కొండపల్లి వద్ద సైనిక శిక్షణ పొందడానికి వెళ్లడం జరిగింది. చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్యలు నేతృత్వం వహించారు . తమ్మారెడ్డి సత్యనారాయణ, కొండేపూడి లక్ష్మీనారాయణలు సైనిక శిక్షకులుగా ఉన్నారు. ఆరుట్ల రామచంద్రారెడ్డి, భీమిరెడ్డి నర్సింహారెడ్డి, కోదండరామిరెడ్డి మొదలగు వారితో పాటుగా పాశం రామిరెడ్డి శిక్షణ పొందారు.

👉గెరిల్లా దళాలు :

రామిరెడ్డి స్వతహాగా ధైర్య వంతుడు. తోడుగా బలమైన సంకల్పం వారి స్వంతం. ఈ క్రమంలో రామిరెడ్డి గెరిళ్ళా దళాలను రూపొందించి స్వయంగా శిక్షణలు ఇచ్చాడు. 

దళాలతో కలిసి మొదట నాటు తుపాకులు ఉపయోగించాడు. తర్వాత వివిధ దాడుల్లో అధునాతన ఆయుధాలు సమకూర్చుకున్నాడు. 

1947-48 ప్రాంతంలో పేట్రేగిన నిజాం ప్రయివేటు సైన్యం రజాకార్లను తన దాడులతో బెంబేలు ఎత్తించాడు. చిరుతపులిలా మాటేసి దెబ్బకొట్టే రామిరెడ్డిని ప్రభుత్వం లక్ష్యంగా తీసుకుంది. కనిపిస్తే కాల్చివెయ్యాలని ఆదేశాలు కూడా ఇచ్చింది. 
అయినప్పటికీ పాశం రామిరెడ్డి బెదరలేదు అదరలేదు. తనవైన వ్యూహాలతో ఎత్తుగడలతో విజృంభించాడు. 

వీరోచిత దాడులు :

దళాలతో కలిసి తన పోరాట కాలంలో మొత్తం 21 దాడులు నిర్వహించాడు పాశం రామిరెడ్డి. ఈ దాడుల్లో రాజాకార్ల స్థావరాల మీద 19 దాడులు నిర్వహించాడు. రెండు దాడులు నిజాం ప్రభుత్వానికి 
అనుగుణంగా ఉన్న అధికారులపై నిర్వహించాడు. 

జగదేవపురం దాడి -
కుర్రారం సమీపంలో ఉన్న సల్లూరు వాగు దాడి -
నెమలివాగు దాడి - 
బొందులగుట్ట దాడి -
వాసాలమర్రి దాడి -
వంగపల్లి దాడి -
కొన్నేదాడి -
రాజాపేట సంస్థానంలో దాడి మొదలగునని రామిరెడ్డి నిర్వహించిన దాడులు. 

వాసాలమర్రి దగ్గర తహసీల్దార్ మీద దాడి నిర్వహించి వారితో రక్షణ నిమిత్తం ఉన్న 303 రైఫిల్ స్వంతం చేసుకున్నాడు. ఇదే పాశం రామిరెడ్డి సంపాదించుకున్న మొదటి అధునాతన ఆయుధం. తర్వాత వంగపల్లి రైల్వే పోలీసు స్టేషన్ మీద దాడి నిర్వహించి రెండు రైఫిళ్లు సంపాదించుకున్నాడు. 

👉వందమంది రజాకార్ల హతం 

పాశం రామిరెడ్డి తన వివిధ దాడుల్లో వందమంది రజాకార్లను చంపాడు. వారి వందల ఆయుధాలను ఎత్తుకెళ్లాడు. అందుకే రజాకర్లకు రామిరెడ్డి పేరు చెబితేనే హడలు పుట్టేది. నియంతలైన కొందరు దొరలకు గుబులు పుట్టేది

👉అనసూయమ్మ పెద్దమనసు :

భర్త ఉద్యమ ప్రస్థానానికి అడ్డు తగలలేదు. భర్త ఉద్యమం పేరుతో అడవుల్లో తిరుగుతుంటే పసిపిల్లలైన ముగ్గురు బిడ్డలతో భారంగా దిన దిన గండంగా జీవితం గడిపింది. భర్తను ఇబ్బంది పెట్టడానికి ఎప్పుడు రజాకార్లు తమ ఇంటి మీద దాడి చేస్తారో తెలియని పరిస్థితిలో బంధువుల ఇండ్లల్లో తలదాచుకుంటూ బతికింది. ఎప్పుడు తన భర్త సర్కారుకు పట్టుపడతాడో తెలియదు.... ఎప్పుడు సర్కారు చేతిలో ప్రాణాలు కోల్పోతాడో తెలియదు.... ఇటువంటి పరిస్థితిలో అనసూయమ్మ మనోనిబ్బరంతో బతికి పిల్లలను పెంచి పెద్దచేసింది. 

👉 ఆంధ్రమహాసభలో చీలిక :

పోలీస్ యాక్షన్ తో తెలంగాణ విమోచనానికి సమయం ఆసన్నమయింది. తెలంగాణ భూభాగం భారతదేశంలో విలీనం కావడం కంటే స్వతంత్ర్యంగా కమ్యూనిస్టుల పాలనలో ఉండాలి అనే ఆలోచన ఆంధ్రమహాసభలో ఆరంభం అయ్యింది. అప్పుడు ఆంధ్రమహాసభ రెండుగా విడిపోయింది. 

1) రావి నారాయణరెడ్డి వర్గం. 
వీరు తెలంగాణ భూభాగం భారతదేశంలో విలీనం కావడమే శ్రేయస్కరంగా భావిస్తూ, సాయుధ పోరాటానికి స్వస్తి పలకాలి అనుకున్నారు. 

2) పుచ్చలపల్లి సుందరయ్య వర్గం 
వీరు తెలంగాణ భూభాగం భారతదేశంలో విలీనం కావడం శ్రేయస్కరం కాదని భావిస్తూ, సాయుధ పోరాటాన్ని అడవుల్లో వెళ్లి పునః ప్రారంభించాలి అనుకున్నారు. 

పాశం రామిరెడ్డి రావి నారాయణరెడ్డీ వర్గం వహించాడు.

👉ఆఖరి పోరాటం :

రజాకర్ల నాయకుడు ఖాసింరజ్వి 9 - 3 - 1948 నాడు ఒక ప్రకటన చేసాడు.భారత్ యూనియన్ లో హైదరాబాద్ చేరదని, హైదరాబాద్ స్వతంత్ర్యదేశంగా మనుగడ సాగిస్తుందని ,ఒకవేళ బారత్ సైన్యం తమ ప్రకటనని బేఖాతరు చేస్తూ హైదరాబాద్ లోకి ప్రవేశిస్తే నరమేధం తప్పదు అనేది ప్రకటన సారాంశం. కాగా ఇది లెక్క చేయని భారత్ యూనియన్ సైన్యం  
13- 9 -1948 నాడు హైదరాబాద్ లోకి ప్రవేశించింది.

ఇది తెలిసి రజాకర్లు గ్రామాలపై విరుచుకుబడ్డారు.కనిపించిన వాళ్ళను కనిపించినట్టే కాల్చి పారేయసాగారు.కత్తులతో నరకసాగారు. గ్రామాలకు నిప్పు పెట్టసాగారు. స్త్రీలను చెరచసాగారు. 
పసిపిల్లల కనుగుడ్లు పెరుకుతూ, పేగులు బయటకు లాగుతూ, అమానవీయంగా అమానుషంగా మరణ మృదంగం మోగిస్తూ కరాళ నృత్యం చేయసాగారు. 

ఇట్లాంటి పరిస్థితుల్లో రామిరెడ్డి ...
అదే 13 వ తారీఖు రోజు రజాకర్ల కంచుకోట అయిన శబాషీపురం దగ్గర నాగపురి స్థావరంపై ఆకస్మిక దాడి నిర్వహించాడు.రామిరెడ్డి శక్తి తెలిసిన రజాకరులు అతడిని ఎదుర్కోలేని పిరికి వాళ్ళయి లొంగినట్టుగా నటించారు.తర్వాత గోడ రంధ్రంలోంచి గురి చూసి రామిరెడ్డిని కాల్చే ప్రయత్నం చేసారు . రజాకర్ల దొంగదెబ్బకు రామిరెడ్డి తొడల్లోకి పొత్తి కడుపులోకి తూటాలు దూసుకుపోయాయి.అయినా భయపడని రామిరెడ్డి రజాకర్లని ఎదుర్కునే ప్రయత్నం చేసాడు.

శక్తి కూడదీసుకుని పోరాడుతూ...రజాకార్లను చెదరగొడుతూ..కొడగండ్ల దాకా వెళ్ళాడు.రక్తం దారెంబడి స్రవిస్తున్నా శతృవులకు చిక్కకూడదనే సంకల్పం అతడ్ని భీకరుడిగా మార్చింది.గాయపడీ సైతం పులిలా లంఘిస్తున్న రామిరెడ్డి విశ్వరూపం రజాకర్ల వెన్నులో వణుకు పుట్టించింది.

మొత్తానికి శతృవులకు దొరక్కుండా తనని తాను కాపాడుకున్న రామిరెడ్డి... గాయాలపాలై అక్కడే కొడగండ్లలోనే ఉండిపోయాడు. బయటకు రాలేని వాడై అక్కడే 14, 15, 16, తారీఖు వరకు మూడురోజులు ఉన్నాడు. అక్కడ సరైన చికిత్స దొరకలేదు. దొరికిన నాటు వైద్యం పనిచేయలేదు.

ఒకవైపు ఆరోగ్యం విషమించడం మొదలెట్టింది. మరోవైపు తప్పించుకున్న తన కోసం రజాకార్లు మాటేసి ఉన్నారు. ఆ పరిస్థితిలో శరీరం సహకరించక పోయినప్పటికీ రజాకార్ల కళ్ళు గప్పుతూ మేనాలో అతి కష్టం మీద గజ్వేల్ చేరుకున్నాడు. అక్కడి నుండి కల్లు లారీ ఎక్కి హైదరాబాద్ చేరుకున్నాడు. 

తీవ్రంగా గాయపడి చావుబతుకుల్లో రామిరెడ్డిని భారత యూనియన్ మిలటరి చొరవ తీసుకుని హైదరాబద్ లోని ఉస్మానియా ఆసుపత్రికి చేర్చింది. 

👉తెలంగాణ విమోచనం :

17-9-1948

నిజాం ప్రభువు భారత సైన్యానికి లొంగిపోతూ హైదరాబాదును భారతదేశంలో విలీనం చేసాడు. తెలంగాణ ప్రాంతం స్వతంత్ర్య రాష్ట్రమయ్యిది.ప్రజలు సంబరాలు చేసుకున్నారు. 

👉పాశం రామిరెడ్డి మరణం :

18- 9 1948 

వీరుడు రామిరెడ్డి అమరుడయ్యాడు.అప్పుడు అతడి వయసు కేవలం 28 ఏండ్లు. అతడి కుమారుడు ఏడేళ్ల వయసులో ఉన్నాడు. మిగతా ముగ్గురు ఆడపిల్లలు పూర్తిగా చిన్నవాళ్లు. యుద్ధం ముగించి వీరుడు వెళ్లిపోగా, భార్య అనసూయమ్మ జీవితంలో యుద్ధం మొదలయ్యింది.

👉ఛాయా చిత్రం :

పాశం రామిరెడ్డి సమకాలికులైన ఆరుట్ల దంపతులు, ఆరుట్ల సోదరులు, రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, భీంరెడ్డి నరసింహారెడ్డి తదితరుల ఆనాటి చిత్ర పటాలు ఉన్నాయి. కానీ పాశం రామిరెడ్డి చిత్రపటం మాత్రం లేకుండా పోయింది. వీరు ఎక్కువకాలం అజ్ఞాతంలో ఉండటం వలన కావొచ్చు వీరి చిత్రం దొరకలేదు. వీరి కుమారుడు తండ్రి చిత్రం కోసం చాలా ప్రయత్నాలు కూడా చేసాడు. అప్పట్లో రామిరెడ్డి మీద కేసులు నమోదైన పోలీసు స్టేషన్లలోను, కలిసి చదువుకున్న స్నేహితులతోను, ఉద్యమ సహచరులతోను ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం దొరకలేదు. 

👉జానపదుల పాటల్లో :

కుర్రారం చుట్టు పక్కల ప్రజలు మాత్రం నేటికినీ రామిరెడ్డిని కథల రూపంలో పాటల రూపంలో స్మరించుకుంటున్నారు. కొలనుపాకకు చెందిన విరివింటి గోపాలకృష్ణ అనే పరిశోధకుడు రామిరెడ్డి పాటలను కొంతవరకు సేకరించి పుస్తకం రూపంలోకి తీసుకు వచ్చాడు. ఇంకా మిగిలిన పాటల్ని సేకరించి రికార్డు చేయాల్సిన అవసరం ఎంతయినా ఉన్నది

గోపాలకృష్ణ గారి పుస్తకం నుండి ఉదాహరణగా తీసుకున్న పాటను గమనిస్తే.... పాడటానికి ముందు జానపదులు పాట సందర్భాన్ని వచనంగా చెప్తారు. తర్వాత హుషారెత్తిస్తూ పాటందుకుంటారు. 

జానపదుల వచనం :

కొన్నెదాడి : ఎట్టెట్టా ఉన్నదంటే ఆరుట్ల రాచంద్రారెడ్డి రజాకార్లకు బాగాచురుకు పెట్టిండు కదా ! ఆ రౌడీ రజాకార్లు తప్పకుండా కొన్నెగుట్టకు వస్తారు . కుర్రారం రాంరెడ్డి బాగా చూసిండు . రజాకార్లు యెటైనా వస్తారు గదా ! కొన్నెగుట్టకు మనం ఉంటాం . దగుంటపల్లి
వడ్ల బాలయ్య ఒక తుమ్మకట్టెను తుపాకి లెక్కచేయి . సిబ్బి తీగెలు దెచ్చి ఒక బొమ్మను చేయాలి . నేను తొడిగె అంగీధోతి కట్టాలి . నేను చుట్టే రుమాలు చుట్టాలి . గుండ్లకాడ రెండు పగ్గాల తోని ఈ వైపు ఆ వైపు పట్టుకోవాలి . నాగపురి వైపు తుపాకి చూపించాలి . రజాకార్లు కొన్నెగుట్ట కాడికి వస్తరు . నేను రైఫల్ తో ఢాం అని దెబ్బ యేస్తే , అప్పుడు రెండు పగ్గాలు విడిచి పెట్టాలి . కుర్రారం రాంరెడ్డి మర్గయా అని కేకలు వేయాలి . అప్పుడు కొన్నెగుట్ట యెక్కి రజాకార్లు వస్తరు . 

పాట :
గుట్ట యెక్కే వాండ్ల తీట నేనే పాపుతారామా -
వచ్చిన ఈ రజాకార్లను వట్టిగ తోలోనో రామా -
ఏమంటా మాటాలు అన్నడో దొర రాంరెడ్డి 
బొమ్మను గూడా యేంచిండు దొర రాంరెడ్డి 

చేతులా రైఫల్ గూడా తానే పట్టిండో 
నాగాపురి వైపు చూస్తుండాడే రామ 

వచనము : 
నాగపురి వైపు చూస్తుండగ వీళ్ళ కత వీళ్ళకుంది . రాంరెడ్డి వచ్చడిరస్ యేసిండు ... 
నాగపురి వైపు తుపాకి చూపిస్తుండు ..
 రజాకార్లు రజాకార్లు 
గుంపులు గుంపులు 
మందలు మందలు వస్తావున్నారు . 

పాట :
లారీ మోటార్ల వెనుక వస్తావున్నారా రామా - రయిరయిన బుయబుయన 
వస్తావున్నారా రామా -
లింగంపల్లి కేశవాపురం రానే వచ్చిను రామ 

👉వీరుడికి జోహార్లు🙏

 ప్రజల కోసం ...ప్రాంతం కోసం...అమరుడైన రామిరెడ్డిని మన తెలంగాణ ఉద్యమ కవులు పోరాటవారసత్వపు వరుసలో స్మరించక పోవడం అనేది నిజమైన తెలంగాణ ఉద్యమకారులు ఆలోచించాల్సిన విషయం.
ఏది ఏమైనా పాశం... కుర్రారం రామిరెడ్డి చిరస్మరణీయుడు !
వీరుడై వెలుగై ఆరిపోయాడు.... 
అమరుడై మళ్ళీ వెలిగాడు..... 
జోహార్ కుర్రారం పాశం రామిరెడ్డి 🙏🙏🙏

No comments:

Post a Comment