Tuesday, April 16, 2024

కాసారపు అప్పయ్యగౌడ్ ( తెలంగాణ పోరాట వీరుడు )

కాసారపు అప్పయ్యగౌడ్ 
( తెలంగాణ పోరాట వీరుడు )
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
వ్యాసకర్త : తంగెళ్ళశ్రీదేవిరెడ్డి 

ఊరు కోసం.... ఊరును నమ్ముకున్న ప్రజల కోసం.... ఊపిరి బిగబట్టి.... చావుకు ఎదురొడ్డి.... రజాకార్ సైన్యంతో నయానో బయానో తేల్చుకోడానికే సిద్దమైన 
జగిత్యాల పౌరుషం కాసారపు అప్పన్న గౌడ్. 
పరిచయం :

నిజాం పాలనలో రజాకార్ వ్యవస్థ కొనసాగించిన అకృత్యాలు గ్రామాలను వణికిస్తున్న సమయంలో, 
గ్రామాల్లో యువత ధైర్యం కూడగట్టుకుంది. జనాలను సంఘటితం చేసింది. రజాకార్ మూకలను తరిమి కొట్టడానికి తెగించి ముందుకు నడిచింది. 

సంగపోళ్ళు, అడవులు, గెరిల్లా పోరాటాలు, ఇవి మాత్రమే సాయుధ పోరాటాన్ని నడిపించలేదు. ఆర్యసమాజ్ కాంగ్రెస్ నేతృత్వంలో కూడా నిజాం వ్యతిరేక పోరాటాలు పెద్దఎత్తున జరిగాయి. కాగా ఆంధ్రమహాసభ సారధ్యంలో జరిగిన సాయుధపోరాటం స్ఫూర్తిగా గ్రామాల్లో పెద్దఎత్తున యువజన సంఘాలు స్వయంసేవా సంఘాలుగా ఏర్పడి ఆత్మస్థయిర్య పోరాటాలు జరిపాయి. ఇటువంటి పోరాటంలో ముందు వరసలో నిలబడి రజాకార్ల అంతు చూసిన ఉక్కు గుండె మన కాసారపు అప్పయ్య గౌడు. 

జననం : 

జగిత్యాల వాస్తవ్యులు కాసారపు లక్ష్మీరాజం గౌడు, లసుమమ్మ దంపతులకు 1920 ప్రాంతంలో అప్పయ్య గౌడు జన్మించాడు. వీరు మొత్తం నలుగురు అన్నాదమ్ముళ్లు. జగిత్యాల పోచమ్మవాడలో కాసారపు వీరి నివాసం. ఆ వాడలో లక్ష్మీరాజం గౌడు 
అందరికీ ఆప్తుడు. నీతి, న్యాయం, ధర్మం, కొనసాగిస్తూ 
జీవించేవాడు. తండ్రి లక్షణాలను పుణికిపుచ్చుకున్న అప్పయ్యగౌడు చిన్న వయసులోనే ప్రజా సంబధాలు కొనసాగిస్తూ అందరివాడుగా పేరు పొందాడు. 

పోరాటం : 

 రజాకార్లు మానవ మృగాలుగా గ్రామాల మీద పడి ధనాన్ని ధాన్యాన్ని దొంగిలించడంతో పాటుగా, స్త్రీల మానప్రాణాలను హరించేవాళ్ళు. అప్పయ్యగౌడ్ ఈ పరిస్థితిని భరించలేకపోయాడు. ఏదో ఒకటి చేయాలి అనుకున్నాడు. చేసే వరకు నిద్ర పోరాదని కంకణం కట్టుకున్నాడు. అనుకున్నాక ఆలస్యం చేయలేదు. గ్రామంలో యువకులనంతా సమీకరించుకుని వాళ్ళల్లో తిరుగుబాటు చైతన్యం గట్టిగా నూరిపోశాడు. వీళ్లల్లో ముస్లిం యువత కూడా ఉండటం స్వయంగా కత్తులు బరిసెలు కొడవళ్లు వంటి ఆయుధాల్ని తయారుచేయించాడు. అందరికీ తానే పెద్దదిక్కులా ముందు నిలబడి యుద్ధ నైపుణ్యం నేర్పించాడు. 

ముఖ్యంగా రజాకార్లు ఏ సమయంలో గ్రామాల్లోకి ప్రవేశిస్తారో తెలియని పరిస్థితి ఉండేది. రజాకార్ల దాడులకు పగలు రాత్రి తేడా ఉండేది కాదు. ఈ పరిస్థితిలో అప్పయ్య గౌడ్ రజాకార్ల రాకను గమనించడం కోసం తమ సంఘాన్ని రెండు మూడు జట్లుగా విడదీసి గస్తీ నిర్వహించేవాడు. రాజకార్లు వస్తున్నారు అనే సమాచారం అందగానే అప్పయ్యగౌడు ఆ మార్గాన్ని తన సంఘంతో కలిసి నిర్బంధం చేసేవాడు. అప్పయ్యగౌడు ఇటువంటి సమయంలో ఆగ్రహోదగ్రుడై కరవాలం ఎత్తి ముందు వరసలో నిలబడేవాడు. సహచరులు సైతం అప్పయ్యగౌడు ఉగ్రరూపాన్ని చూసి భయపడేవాళ్లు. 

రాన్రాను రాజాకార్లకు అప్పయ్యగౌడు తలనొప్పిగా 
తయారయ్యాడు. అప్పయ్యగౌడును మట్టుపెట్టాలని 
ప్రయత్నం కూడా మొదలెట్టారు. అయినప్పటికీ అప్పయ్యగౌడ్ భయపడలేదు. తన ప్రాణం ఉన్నంత వరకు ప్రజల కోసం పాటుపడతానని ప్రతిజ్ఞ చేసాడు. అంతేకాదు, తాను మరణించే సమయం ఆసన్నయితే రజాకార్లను ఒకరిద్దరినయినా వెంట తీసుకుపోతానని కూడా శపథం పూనాడు. 

ప్రజలకు ఆశ్రయం : 

జగిత్యాల పోచమ్మవాడలో 1940 లో అప్పయ్య గౌడు ఇల్లు నిర్మించబడింది. సాయుధపోరాటం కాలంలో రజాకార్ల నుండి తప్పించుకోవడానికి స్త్రీలు పసిపిల్లలు ఆ ఇంట్లో తలదాచుకునేవాళ్ళు. ప్రజల కోసమే ఇల్లు నిర్మించారేమో అన్నట్టుగా ఆ ఇల్లు కూడా అప్పయ్యగౌడుతో పాటుగా జనాలకు నీడై నిలబడింది. 

రాజాకార్లు గ్రామాలకు గ్రామాలను తగులబెడ్తున్నారు. వ్యతిరేకుల ఇండ్లను తగులబెడ్తున్నారు. ఈ క్రమంలో అప్పయ్యగౌడ్ వాళ్ళ ఇంటికి కూడా రజాకార్ల వల్ల ముప్పు ఉందేమో అని చుట్టుపక్కల ప్రజలు సందేహించారు. అయినప్పటికీ కూడా అప్పయ్యగౌడు వెనకడుగు వేయలేదు. ఆ సమయంలో ఒకమాట అన్నాడు.. 

" ఇంటిని తగలబెడితే పెట్టనీ. రాయి రాయి లోంచి కత్తి పుట్టుకొస్తది. రజాకార్లను తలో దిక్కు తరిమికొడతది "

మామ్లాలో మానవీయత :

అప్పయ్యగౌడ్ సాయుధపోరాటం నేపథ్యంలో మాత్రమే ప్రజల కోసం ఆలోచించలేదు. స్వతహాగా మానవీయత పుష్కలంగా ఉన్న మనిషి. పేదప్రజల కోసం తన వంతు సహకారం అందివ్వాలి అని తపించిన వ్యక్తిత్వం. అందుకే తాటి, ఈత వనాలు, గుత్తకి తీసుకుని నిరుపేదలైన మాల, మాదిగ, దూదేకుల, సాలెలు తదితర కులాలకు కూడా అందులో వాటా ఇచ్చి ఆదుకునే వాడు. గీతపని తమ కులవృత్తి కావొచ్చు కానీ ఆ వృత్తి వల్ల ఇతరులు కూడా లబ్ది పొందడంలో తప్పు లేదని భావించిన ఉదాత్తుడు. 

సమాలోచనలు :

అప్పయ్యగౌడ్ ఇంట్లో పోరాటానికి సంబందించి సమాలోచనలు జరిగేవి. కమ్యూనిస్టు పార్టీ నాయకులు, కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అక్కడికి వచ్చేవాళ్ళు. వ్యూహాలు పన్నడంలో, సమస్య ఎదురైనప్పుడు తిప్పికొట్టడంలో, శత్రువును మాయజేయడంలో అప్పయ్యగౌడు దిట్ట. అందుకే వారి ఇల్లు సమావేశాలకు కూడా నెలవు అయ్యింది. 

అప్పయ్య గౌడ్ పై దాడి :

అప్పయ్యగౌడుపై రజాకార్లకు లక్ష్యం పెరిగింది. అదునుచూసి దెబ్బకొట్టాలని ప్రయత్నం చేసారు. ఇందులో భాగంగా ఒకరోజు దాడి చేయాలని పన్నాగం పన్నారు. అది అప్పయ్యగౌడుకు తెలిసింది. ఎదురుదాడికి సిద్ధం అయ్యాడు. అది గమనించిన తల్లిదండ్రులు భయంతో అప్పయ్యగౌడును ఇంట్లో బంధించి తాళం వేశారు. ఇంట్లో ఎవ్వరు కూడా లేరు అనే భ్రమను కలిగించారు. అయినప్పటికీ వ్యూహాత్మకంగా రజాకార్లు ఇంటి పైకి వచ్చారు అప్పుడు అప్పయ్యగౌడు ఇంటి పైకప్పుకు ఉన్న గుణ పెంకులు మెల్లగా పగలగొట్టుకుని ఇంటి పైకి వచ్చి కర్ర దింపడం మొదలుపెట్టాడు. అదిచూసిన రజాకార్లు భయపడి పరుగు పెట్టారు

అప్పయ్య గౌడు పాటలు :

పోరాట కాలంలో ప్రజలను జాగృతం చేయడం కోసం అప్పయ్యగౌడు మేలుకొలుపు గీతాలు పాడించేవాడు. పాటలు ఎందరికో స్ఫూర్తి దాయకం అయ్యాయి కూడా. కాగా ప్రజలను మేలుకొలిపిన అప్పయ్యగౌడు కృషిని అభినందిస్తూ కూడా అదే సమయంలో జనాలు పాటలు పాటలు కట్టుకుని పాడేవాళ్లు. ఈ పాటల్ని సేకరించాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులపై ఉన్నది. 

స్వాతంత్ర్య సమరయోధుల వేతనం తిరస్కరణ :

తెలంగాణ విమోచనం తర్వాత తెలంగాణ భూభాగం భారతదేశంలో భాగం అయ్యింది.తర్వాత తెలంగాణ పోరాట వీరులకు ఉద్యమకారులకు గౌరవ వేతనాలు 
ప్రభుత్వం తరుపున ప్రకటించడం జరిగింది. ఇందుకు పోరాటంలో పాల్గొన్న వారి పేర్లను ప్రాతాలవారిగా
నమోదు చేసే కార్యక్రమం కూడా మొదలయ్యింది.ఈ గురుతర బాధ్యత రావి నారాయణరెడ్డి, పీవీ నరసింహారావు వంటి పలువురు నాయకుల నేతృత్వంలో కొనసాగింది. అనివార్యంగా పోరాటంలో పాల్గొనని ఎందరో పేర్లు కూడా సమరయోధుల వరుసలో నమోదు చేయబడ్డాయి అనేది వాస్తవం. ఈ నేపథ్యంలో కాసారపు అప్పయ్యగౌడు గారికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యులుగా ఉన్న 
పీవీ నరసింహారావు నుండి పిలుపు వచ్చింది. పీవీ వద్ద పనిచేస్తున్న హయగ్రీవాచారి అప్పయ్యగౌడు పూర్తి వివరాలు కోరడం జరిగింది. కానీ అప్పయ్యగౌడ్ తిరస్కరించాడు. 
" నా ప్రాంతం కోసం నేను కొట్లాడాను. నా ప్రజల కోసం నేను కొట్లాడాను. కూలీ కోసం ఆశపడి నేను కొట్లాడలేదు. నాకు గుర్తింపు రావాలన్న కోరిక కూడా లేదు. కొట్లాడిన అనే తృప్తి మిగిలింది చాలు. నాకు ఏ పింఛన్ వొద్దు. కష్టం జేసుకుని బతుకుత. శక్తి ఉంది కాబట్టి పేదోళ్ళకి కూడా బత్కు అందిస్తా " చెప్పి అక్కడి నుండి తిరిగివచ్చేసాడు. 
ఇది అప్పయ్యగౌడు తెలంగాణ పౌరుషానికి, నిస్వార్థానికి, నిదర్శనం.. 

""సర్దార్ పటేల్ ""నిజమైన మొనగాడు :

భారత స్వతంత్ర పోరాటం జరిగినప్పుడు తెలంగాణ ప్రాంతం నుండి కూడా గాంధీ సిద్ధాంతాలను పాటిస్తూ 
యువత ముందుకు నడిచింది. ఈ క్రమంలో నెహ్రు ఆశయాలను గౌరవించింది. కాగా అప్పయ్యగౌడ్ మాత్రం తన ఉద్దేశ్యం ప్రకారం సర్దార్ వల్లభాయ్ పటేల్ ను నిజమైన మొనగాడుగా అభివర్ణించేవాడు. నెహ్రూ కాకుండా పటేల్ ప్రధాన మంత్రి అయితే దేశ పరిస్థితి మెరుగ్గా ఉండేదని ముక్కుసూటిగా చెప్పుకొచ్చేవాడు. 

కుటుంబం : 

కాసారపు అప్పయ్య గౌడ్ భార్య చంద్రమ్మ. 94 సంవత్సరాలు. ఆమె నేటికిని జీవించి ఉన్నారు. ఆనాటి స్మృతులను నేటికీ నెమరు వేసుకుంటూ ఉంటారు. ఈ అనుభవాలను కుటుంబ సభ్యులు రికార్డు చేస్తే చరిత్రకు ఎన్నో నిజాలు దొరికే అవకాశం ఉన్నది. 

అప్పయ్యగౌడు కుమారుడు సంజీవ్ గౌడ్ వాణిజ్య పన్నుల శాఖ అధికారిగా పదవి విరమణ పొంది వున్నారు. తండ్రి బాటలో వీరు కూడా తెలంగాణ కోసం తనదైన కార్యాచరణ కొనసాగించాడు. స్వతహాగా కవిహృదయం కావడంతో మలి విడత తెలంగాణ ఉద్యమ సమయంలో " తెలంగాణం " పేరుతో ఉద్యమ కవితా సంపుటి వెలువరించాడు ప్రభుత్వ అధికారిగా ఉండి తెలంగాణ ఉద్యమానికి అనుకూలంగా పుస్తకం ప్రచురించినందుకు ప్రభుత్వం కన్నెర్ర జేసింది. అయినప్పటికీ వీరు భయపడలేదు. ప్రాంతీయ అభిమానాన్ని ప్రకటించుకోడానికి.. అభిప్రాయాన్ని వ్యక్తం చేసుకోవడానికి.... ఉద్యోగం అడ్డు కాదు అని ధైర్యంగా నిలబడి, తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నాడు. 

ఆదర్శం :

గీత కార్మికుల కోసం, వారి జీవితాలు బాగుపడటం కోసం, అదే క్రమంలో ప్రజల కోసం అహర్నిశలు శ్రమించిన అప్పయ్య గౌడ్ చిరస్మరణీయుడు. 

తన కుమారుడిని ఎక్సయిజ్ శాఖలో ప్రభుత్వ ఉద్యోగం వచ్చినప్పటికి... 
" అది మన కులవృత్తి మీద దెబ్బకొట్టి, వృత్తి మీద ఆధారపడి బతికే వాళ్ళకు పెద్ద బాదయ్యింది. ఆ బాధ నుండి నీవు లాభ పడతావా? " అంటూ కొడుకు ఉద్యోగాన్ని నిరాకరించిన సంఘటన అప్పయ్యగౌడు అంకిత భావానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 

1999 సెప్టెంబర్ 1 న అప్పయ్యగౌడ్ కాలధర్మం పొందారు. వారి పోరాటపు అడుగుజడలు మాత్రం పదిలంగా ఉన్నాయి.

No comments:

Post a Comment