Monday, April 15, 2024

రెడ్ల కులగురువు భక్త మల్లారెడ్డి ( కుంటి మల్లారెడ్డి)

రెడ్డి కులగురువు - భక్త మల్లారెడ్డి చరిత్ర
Note -
తెలుగు ప్రాంతాల్లో, ఎక్కువగా ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో నివసించే ' భిక్షగుంట' రెడ్లు రెడ్ల కుల గురువు మల్లారెడ్డి వారసులుగా.. సంతతిగా చెప్పబడుతారు . వీరు రెడ్ల కుల గోత్రాలని వివరిస్తారు. ఇక్కడ బిక్షగుంట అనేది మల్లారెడ్డి బిరుదు. వీరికి ఒక కాలు, ఒక హస్తం లేనందున రెడ్లను ఆశ్రయించి వాళ్ల నుండి గురుదక్షిణ ఒక సంభావనగా తీసుకునేవారు. ఇది వ్యవహారంలో బిచ్చంగా మారిపోయి బిక్షగుంట పేరు స్థిరపడింది. ఈ రెడ్లు శ్రీశైల క్షేత్రంలో కుంటి మల్లారెడ్డి సేవా సమితి నడుపుతున్నారు. వీళ్ళు సాధారణ రెడ్ల సామాజిక వర్గంలోకి వస్తారు.

తెలంగాణ ప్రాంతంలో రెడ్ల ఆశ్రిత కులంగా రెడ్ల వంశ చరిత్ర చెబుతూ వంశరాజా పేరుతో గ్రామాలు తిరిగే పిచ్చగుంట్ల / బిక్షగుంటలు వేరు. బిక్షగుంట్ల రెడ్లకు పిచ్చిగుంట్ల తెగలకు ఏ సంబంధం లేదు. కాగా వంశరాజా
తెగలు తమను పిచ్చిగుంట్ల అని కాకుండా మల్లారెడ్డి వంశరాజాగా గుర్తించాలని కోరుకుంటున్నారు. రెడ్ల కుల గురువు మల్లారెడ్డి కి ఈ పిచ్చిగుంట్లకి సంబంధం ఏమిటి అని పరిశీలిస్తే.... పూర్వం శ్రీశైల మార్గంలో అడుక్కుతింటున్న పిచ్చిగుంట్ల వాళ్ళని కుంటి మల్లారెడ్డి చేరదీసి రెడ్ల ఆశ్రిత కులంగా నిర్ణయించాడు అని తెలుస్తుంది. ఈ విధంగా పిచ్చిగుంట్ల వాళ్లు రెడ్ల ఆశ్రితకులంగా మారి వారి కుల గోత్రాలను వివరిస్తున్నారు.

▪️పరిచయం :
సనాతన ధర్మాలకు పుట్టినిల్లయిన భారతదేశంలో"కులాలు - కులదైవాలు - కులగురువులు " అతి ప్రాచీనమైన సంప్రదాయం. ఈ క్రమంలో రెడ్లు మల్లారెడ్డి స్వామిని తమ కులగురువుగా ఆరాధిస్తున్నారు. ఎరుకలు బిల్లాలు ఏకలవ్యుడిని కుల గురువుగా కొలుస్తున్నారు. కుల దైవాల పరంగా చూస్తే కురువలు బీరప్పను, జాలరులు గంగమ్మ తల్లిని, కోమట్లు కన్యకాపరమేశ్వరిని, మాదిగలు మాతంగిని , యాదవులు శ్రీకృష్ణుడిని తమ వాడిగా భావిస్తూనే కొమురవెల్లి మల్లన్న దేవుడిని తమ కులదైవాలుగా ఆరాధిస్తున్నారు.

 కులాలు - కుల వంశచరితలు 

కులంతో పాటుగా కులాచారాలు కులగోత్రాలు ఉపకులాల మనుగడ కూడా అనివార్యంగా కొనసాగుతున్నది. ప్రముఖ చరిత్రకారుడు మల్లంపల్లి సోమశేఖర శర్మ రాసిన " కులాలు - కుల సంఖ్యలు " వ్యాసం కులాల పుట్టుపూర్వోత్తరాల గురించి అనేక అంశాలను చర్చించింది. ఈ క్రమంలో 
భారతీయ వ్యవస్థలో కులం అనేది ఒక అస్తిత్వంగా నిర్ణయించబడి చలామణి అవుతున్నది.రాజ్యాంగ బద్ధంగా కూడా భారతీయ సమాజపు గోడలు కులం ఇటుకలతో నిర్మించబడ్డాయి. ఇక్కడి బతుకుల్ని కులాలు శాసిస్తున్న తరుణంలో మేము కులాలు వదిలేశాం అని చెప్పుకోవడం తమని తాము మభ్యపెట్టుకోవడం మాత్రమే !

కుల రాజ్యాలు ఉన్నాయి. కుల రాజ్యం కోసం పోరాటాలు జరుగుతున్నాయి. రెడ్డి కులం నుండి 12వ శతాబ్దం నుండే నాయకి నాగమ్మ ద్వారా పాలన విభాగంలో భాగస్వామ్యం ఉన్నది. తర్వాత కాకతీయుల కాలంలో సామంత రెడ్డి రాజ్యాలు ఉన్నాయి. తర్వాత కులం పేరుతో పాలనా సంప్రదాయానికి అంకురార్పణ పలుకుతూ కొండవీడును మన రెడ్డిరాజులు పాలించారు. 
ప్రోలయ వేమారెడ్డి 1325 నుంచి 1353 వరకు
అనపోతారెడ్డి 1353 నుంచి 1364 వరకు
అనవేమారెడ్డి 1364 నుంచి 1386 వరకు
కుమార గిరిరెడ్డి 1386 నుంచి 1402 వరకు
పెదకోమటి వేమారెడ్డి 1402 నుంచి 1420 వరకు
రాచవేమారెడ్డి 1420 నుంచి 1424 వరకు

కులవ్యవస్థ అనేది హక్కులతో అధికారాలతో ముడిపడి విడదీయరానిదిగా ఉన్నది.ఈ పరిస్థితుల్లో కులసంఘాలు ఏర్పడుతున్నాయి. ఈ సంఘాలు తమ ఉనికిని, ప్రాముఖ్యతను కాపాడు కోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కులం గొప్పతనం చెప్పడానికి, ప్రాచీనమైన కులం ఉనికిని ప్రచారం చేసుకోవడానికి సమయం వెచ్చించబడుతున్నది కూడా. 

కులం అనేది జీవితంతో ముడిపడి ఉన్న క్రమంలో కుల నిఘంటువుల్లా కొన్ని తెగలు ఆయా కులాలతో అనుసంధానం అవుతూ అనుబంధంగా మారిపోవడం జరిగింది . వీళ్ళనే మనం ఆశ్రిత కులాలు అంటాము. రెడ్డి కుల పురాణాలను రెడ్ల ఆశ్రిత కులం పిచ్చికుంట్ల వారు ప్రచారం చేస్తున్నారు.

భక్త మల్లారెడ్డి కథ

రెడ్ల కుల గురువు భక్త మల్లారెడ్డి గురించి తెలుసుకునే ముందు హిందూ ధర్మ శాస్త్రాల్లో చెప్పబడిన ఏడు రకాల గురువులు గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది .
1. సూచక గురువు - విద్య నేర్పేవాడు.
2. వాచక గురువు - కుల, ఆశ్రమ ధర్మాలను బోధించేవాడు
3. బోధక గురువు - మహామంత్రాలను ఉపదేశించేవాడు
4. నిషిద్ధ గురువు - వశీకరణ, క్షుద్ర తంత్ర విద్యల్ని నేర్పేవాడు
5. విహిత గురువు - విషయ భోగముల మీద విరక్తి కలిగించేవాడు
6. కారణ గురువు - జీవబ్రహ్మైక్యాన్ని బోధించేవాడు
7. పరమ గురువు - జీవాత్మ, పరమాత్మ ఒకటే అని ప్రత్యక్షానుభవాణ్ని కలిగించేవాడు.

ఈ క్రమంలో భక్త మల్లారెడ్డి వాచక, కారణ, పరమ గురువుగా తన మానవ జన్మని కొనసాగించాడు.

రెడ్డి కుల పుణ్య పురుషుడు,రెడ్డి కుల గురువు ..... 
రెడ్ల కులగోత్రాలకు ఆధారం..భక్త మల్లారెడ్డి ! ఇందు గురించి పూర్వకాలం నుండి అనేక జానపద కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. 

జానపదులు మల్లారెడ్డిని కుంటి మల్లారెడ్డి అని, భక్త మల్లారెడ్డి అని, శివ భక్త మల్లారెడ్డి , పిచ్చి మల్లారెడ్డి,భిక్ష మల్లారెడ్డి అని రకరకాలుగా పిలుస్తారు.అతడికి కుడి కాలు,ఎడమ చెయ్యి లేనందువల్ల కుంటిమల్లారెడ్డి అని, భక్తి ధ్యానంలో మునిగి ఉండేవాడు కాబట్టి భక్త మల్లారెడ్డి అని, అపారమైన శివభక్తి పారాయణుడు కాబట్టే శివ భక్త మల్లారెడ్డి అని, తనలో తానే గుణుకున్నట్టుగా భగవన్నామస్మరణతో పాటుగా ... రెడ్ల కుల గోత్ర శాఖల్ని చదువుకునే వాడు కాబట్టి పిచ్చి మల్లారెడ్డి అని పిలిచారు.ఇక భిక్ష మల్లారెడ్డి అని ఎందుకన్నారో పరిశీలిస్తే ....ఇందుకు రెండు కారణాలు ఊహించవచ్చు.

మొదటి కారణం ప్రకారం.....కొందరు వ్యాసకర్తలు మల్లారెడ్డి చరిత్రను వక్రీకరిస్తూ....మల్లారెడ్డి రెడ్లను యాచించాడు అని రాశారు. తల్లి శపించింది అని రాశారు. కానీ మల్లారెడ్డి యాచించలేదు. తల్లి శపించలేదు. రెడ్ల వంశ చరిత్రలని మాత్రమే తల్లి ఆనతో రెడ్ల ఇండ్లకు తిరిగి ప్రచారం చేసి మహనీయుడిగా మిగిలిపోయాడు. ఇండ్లకు వెళ్లి గోత్రాలు చెప్పి శాఖలు చెప్పి ధర్మానికి కొనసాగించాడు కాబట్టి రెడ్లు అతనికి కానుకలు ఇవ్వడాన్ని కొందరు " యాచక " గా రాయడం పొరపాటుగా జరిగింది. బిక్ష మల్లారెడ్డి అంటే బిక్షం ఎత్తిన వాడు అని కాదు , కుల గోత్రాలు చెప్పినందుకు ప్రతిఫలం స్వీకరించిన వాడు అని మాత్రమే అంతేకాదు ....మల్లారెడ్డి భిక్ష ఎత్తలేదు. గోత్రాలను కాపాడి రెడ్లకు భిక్ష పెట్టాడు అనేది వాస్తవం.

 రెండవ కారణం ప్రకారం.. మల్లారెడ్డి భార్య పేరు బుచ్చమ్మ ( బిచ్చమ్మ ). కాబట్టి భార్య పేరు చేరుస్తూ బిచ్చ అనే పేరుని ' భిక్ష 'గా రాసి ఉండవచ్చు 

 రెడ్డి కుల గోత్ర నామాల చరిత్ర , శాఖల వివరాలు, మల్లారెడ్డి కారణంగానే భద్రపరచ బడ్డాయి., రెడ్లకు పెండ్లిళ్ళు పేరంటాలకు సంప్రదాయాన్ని నిర్ణయించాడు. కాబట్టి, వీరు రెడ్ల కులగురువుగా వాసికెక్కాడు.

మల్లారెడ్డి 'రెడ్డి' కులస్థుడు.ఇది జగద్విదితం. కాగా సాదర శాఖకు చెందిన రెడ్డిగా కొందరు పేర్కొంటున్నారు కానీ ఇందుకు ఆధారాలు లేవు . ఇది అస్పష్టమైన సమాచారం మాత్రమే. భక్త మల్లారెడ్డి శివ భక్తుడే .... శ్రీశైలంలో వెలసిన మల్లిఖార్జునస్వామి స్వరూపానికి వీర భక్తుడు.

"మల్లారెడ్డి రెడ్ల కుల గురువు. వీరు శివుడిని ఆరాధించారు కాబట్టి రెడ్ల కుల దైవం శివుడు " అని కొందరి విమర్శకులు భావిస్తున్నారు. . ఈ క్రమంలో వైష్ణవాన్ని స్వీకరించిన రెడ్లు ఉన్నప్పటికీ ....శివుడి ముందు కూర్చునే నందిని రెడ్డికి ప్రతీకగా చెప్పుకుంటారు అనేది గమనించాల్సిన విషయం.
 " నిలబడితే రెడ్డి కూర్చుంటే నంది" అనేది జననానుడి. ఈ నేపథ్యంలో కొంత విశ్లేషణ అవసరం. వివరాల్లోకి వెళ్తే.....మల్లారెడ్డి కాలం గురించి స్పష్టత లేదు. కాగా 14వ శతాబ్దానికి చెందిన కొండవీటి రెడ్డి రాజులు తమ రాజముద్రగ నందిని స్వీకరించారు. అంతకుముందే 11వ శతాబ్దానికి చెందిన నాయకురాలు నాగమ్మ గొప్ప వీరశైవాన్ని అనుసరించింది.

రెడ్డి కుల మూల పురుషుడు ఆదిరెడ్డి.
ఈ ఆదిరెడ్డి వంశం వాడే మల్లారెడ్డిగా చాలా జానపద కథలు ప్రచారంలో ఉన్నాయి. 
ఆదిరెడ్డికి ఏడుమంది కొడుకులు.వీరి వంశాలు అభివృద్ధి చెందుతూ రెడ్డి కులం విస్తరించింది. ఈ వంశక్రమంలోని వాడే భక్త మల్లారెడ్డి అనే సమాచారం జానపదాల్లో మనకు నిక్షిప్తమై కనిపిస్తుంది.. మరి కొన్ని జానపద కథల్లో ఆదిరెడ్డికి 10 మంది కుమారులు అని, , 12 మంది కుమారులు అని కూడా ఉన్నది. కానీ దృష్టికి వచ్చినంత వరకు ఈ జానపద కథలు మొత్తం సంతానం పేర్లు చెప్పలేదు.ముగ్గురు పేర్లు మాత్రమే పేర్కొంటున్నాయి.  

ఆదిరెడ్డి వంశస్తుడు భక్త మల్లారెడ్డి

 ఆదిరెడ్డి కథ కూడా అస్పష్టమైనది. 1920లో నిజాం రాజ్యంలో కులాలు తెగల గురించి పరిశోధన చేసిన సయ్యద్ సిరాజుల్ ఉల్ హసన్ అనే చరిత్రకారుడు కూడా జన బాహుళ్యంలో ప్రచారంలో ఉన్న ఆదిరెడ్డి కథ గురించి ప్రస్తావించాడు. ఈ అస్పష్టమైన కథకు మించి ఆదిరెడ్డి జీవితానికి సంబందించిన ఎటువంటి ఆధారాలు లేవు అనే అభిప్రాయం వెలిబుచ్చాడు.. జానపదులు చెప్పుకునే ఈ కథను రెడ్ల మూలానికి ఒక ఉదాహరణగా మాత్రమే తీసుకోవచ్చు అని చెప్పాడు.

 ముఖ్యంగా జాతి చరిత్రలకు, దేవాలయ చరిత్రలకు, రాజ్య చరిత్రలకు , నిర్దిష్టమైన చరిత్రతో పాటుగా జానపద కథలు కూడా ప్రచారంలో ఉంటాయి. ఈ క్రమంలో రెడ్డి జాతి చరిత్రకు చారిత్రక ఆధారాలతో పాటుగా జానపద గాథలు కూడా ఆధారాలుగా ఉన్నాయి. ఉదాహరణకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. వారు ఉపయోగించిన కత్తి, వారి నివాస గృహములు, వారి వంశస్థులు ఉన్నారు. అయినప్పటికీ జానపదగాథల్లో ...
 " రెడ్డి ఎత్తిన కత్తి.... నెత్తురు అంటిన కత్తి..... నెత్తురు సుక్క మొక్కయ్ మొలిసి....పూసెను పూలగుత్తి....! అదిగదిగదిగో ఎర్రనిపూలు..... పూలు పలికేను ఉయ్యాల నరసింహారెడ్డి పేరు.... " అని పాడుకుంటారు. ఇక్కడ నిజంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కత్తికి ఉన్న నెత్తురుతో పూల చెట్టు పెరగలేదు. ఆయన కత్తికి అంత శక్తి ఉంది అనేది జానపదుల ఊహ. ఈ ఊహా శక్తికి వాళ్ళు అతిశయోక్తిని జోడిస్తున్నారు . కాబట్టి జానపదులు పాడుకునే పాటల్లో పాఠాంతరాలు ఉంటూ అవి వాస్తవికతను నిక్షిప్తం చేసుకుని ఉంటాయి. అట్లాగే తెలంగాణ ప్రాంతంలో సమ్మక్క సారక్క శక్తి దేవతలకు కూడా ఎటువంటి శాసన చారిత్రక ఆధారాలు లేవు. జానపదులు పాడుకునే పాటలే ఆధారాలుగా ఉన్నాయి. ఈ క్రమంలో మౌఖికంగా ఒక తరం నుండి మరొక తరానికి వ్యాప్తి చెందే జానపదుల గాథలు కూడా చరిత్ర నిర్మిస్తాయనేది వాస్తవం.

ఆదిరెడ్డి కథ కూడా జానపదులు పాడుకునే గేయసాహిత్యం నుండే వ్యాప్తి చెంది ఉన్నది. అయితే రెడ్ల మూల పురుషుడు ఆదిరెడ్డి కాలం గురించి ఏ విధమైన సమాచారం లేదు స్పష్టత లేదు. దేవతాశక్తులకు ముడిపడి ఈ కథ కొనసాగుతుంది . ఆదిరెడ్డి కథను గమనిస్తే..... ఆదిరెడ్డి భార్య ఆది లక్ష్మమ్మ. ఈ దంపతులకు మర్రిచెట్టు కింద ఒక కుమారుడు జన్మిస్తాడు. ఈ బాలుడి పేరు పిల్లలమఱ్ఱి భేతిరెడ్డి . పుట్టిన అయిదవ ఏట నుండి తండ్రికి వ్యవసాయంలో సహాయపడతాడు. ఇంటిని పంట పొలాలని కాపు కాస్తాడు. భేతిరెడ్డికి యుక్త వయసు వచ్చాక పిగుల్ల లక్షమ్మతో వివాహం జరిపిస్తారు 
వీరి సంతానంగా ఉత్తమరెడ్డి - సత్యంరెడ్డి, బుచ్చారెడ్డి ( బచ్చరెడ్డిలేదా భక్షిరెడ్డి )అనే ముగ్గురు కుమారుల పేర్లు మాత్రమే జానపదులు ప్రత్యేకంగా చెప్పుకుంటారు . కానీ ఈ దంపతులకు 12 మంది సంతానం ఉంటారు. ఉత్తమారెడ్డి, సత్యమారెడ్డి,భక్షిరెడ్డిలతో పాటుగా అనవేమారెడ్డి, అనుములు బొమ్మిరెడ్డి,ధర్మాత్ముడు 
తంగిళ్ళ మాచిరెడ్డి, నాటకుడు నారాయణరెడ్డి, సదాశివరెడ్డి, సాంబరెడ్డి, శివారెడ్డి, అప్పిరెడ్డి, గోనబుద్దారెడ్డిలు ఉంటారు. ఒకే తండ్రి కుమారులైనప్పటికీ వారి పేరు ముందు ఇంటి పేరు చేర్చి ఉన్నది. ఇది వారి గుణగణాలను బట్టి చేర్చిన అదనపు పేర్లు.

ఉత్తంరెడ్డి భార్య పెదమంగమ్మ. వీరికి వీరనాగిరెడ్డి, బాలనాగిరెడ్డి, సాంబశివారెడ్డి, సదాశివరెడ్డి అని నలుగురు కొడుకులు,అమ్మోజమ్మ అనే కూతురు ఉండేది.
సత్యంరెడ్డి భార్య చినమంగమ్మ. వీరికి ఎడమ హస్తము కుడి పాదము లేని మల్లారెడ్డి అనే కొడుకు, తిమ్మాజమ్మ అనే కూతురు ఉండేవారు. 
 బుచ్చారెడ్డి భార్య వనమాదేవి. వీరి నివాసం దేవగిరి పట్టణం.

 సత్యం రెడ్డి కొడుకు మల్లారెడ్డి గొప్ప శివభక్తుడు. మల్లన్న పేరు మీదే మల్లారెడ్డి పేరు పెట్టబడినవాడు . అతడికి కుడి కాలు,ఎడమ చెయ్యి లేనందువల్ల కాలక్రమంలో కుంటిమల్లారెడ్డి అయ్యాడు. దొంతిరెడ్డి వెంగళ్ రెడ్డి కుమార్తె బిచ్చమ్మతో మల్లారెడ్డి వివాహం జరిగింది.

మల్లారెడ్డికి సహజంగా శివదేవుడి కృపతో అబ్బిన పరిజ్ఞానం కారణంగా రెడ్ల గోత్రాలు శాఖలు చెప్పేవాడు. వివరించేవాడు. వీటిని తనలో తాను వల్లెవేసుకునే వాడు కూడా ! ఇది చూసే వాళ్లకు పిచ్చితనంగా కనిపించేది. కాబట్టి భక్త మల్లారెడ్డిని కొందరు పిచ్చి మల్లారెడ్డి అని కూడా రాశారు. . మల్లారెడ్డి కుంటి తనం + గోత్రాలు తనలో తాను చదువుకునే వాడు కాబట్టి, ఆ తీరును పిచ్చితనంగా భ్రమిస్తూ భావిస్తూ పిచ్చి మల్లారెడ్డి అనేవారు అని అవగాహన చేసుకోవచ్చు. 

తల్లి మంగమ్మ కొడుకు మల్లారెడ్డి భవిష్యత్తు గురించి అలోచించింది. అవిటివాడుగా ఏ పని చేసుకోలేడేమో అని భావించింది. పైగా రేయింబవళ్లు రెడ్ల గోత్రనామాలను తనలో తాను చదువుకుంటున్నాడు కాబట్టి, ఇతర పనుల మీద కంటే తెలిసిన పని మీదే అతడికి గురి కుదురుతుందని నిర్ధారించుకుంది. అందుకే... రెడ్ల ఇండ్లకు వెళ్ళి గోత్ర నామాలు.... వంశ చరిత్రలు..... చెప్పి రెడ్లను ఉన్నతిని ప్రచారం చేసి కాపాడమని...రెడ్ల వంశచరితలకు ఆద్యుడుగా మిగలమని ఆదేశించింది. ఈ క్రమంలో శివ భక్త మల్లారెడ్డి తల్లి ఆజ్ఞ ప్రకారం రెడ్ల ఇండ్లకు మాత్రమే వెళ్లి రెడ్ల శాఖలను,వారి గోత్ర నామాలను, వాటి పుట్టుపూర్వోత్తరాలను, సంప్రదాయాలను రాగయుక్తంగా గొంతెత్తి పాడేవాడు. వారి గోత్ర చరిత్రను వివరించి చెప్పేవాడు. ఇందుకు మెచ్చి రెడ్లు గోదానం, భూదానం, వస్త్ర దానాలను చేస్తుండగా వాటిని సంభావనగా స్వీకరించే వాడు. ఇట్లా మల్లారెడ్డి ఊరూరూ తిరిగేవాడు. అన్ని ప్రాంతాల రెడ్లను ఆశ్రయించేవాడు.
 
ఆశ్రిత కులాన్ని నిర్ణయించిన భక్తమల్లారెడ్డి :-

భక్త మల్లారెడ్డి భద్రపరిచిన కుల గోత్రాలను శాఖలను రెడ్ల ఆశ్రిత కులం పిచ్చిగుంట్ల వారు వివరిస్తుంటారు. ఈ పిచ్చిగుంట్ల వారు పూర్వం యాచన చేస్తూ బతికేవారని పాల్కురికి సోమనాధుడు(1160 -1240 ) పండితారాధ్య చరిత్రలో పర్వత ప్రకరణంలో ఈ విధంగా వర్ణించాడు.

వీవంగ చేతులు లేవయ్య .. నడచి
పోవంగ కాళ్ళును లేవయ్య - అంధ
కులమయ్య పిచ్చుకుంటుల మయ్య
దాన మొసగరే ధర్మాత్ములార.
అని వర్ణించాడు.

ఈ విధంగా పన్నెండవ శతాబ్దంలోనే పండితారాధ్య చరిత్రలో పిచ్చికుంట్ల పదం వినిపించింది.
పిచ్చికుంట్ల వారు శ్రీశైలం వెళ్లే భక్తులను యాచించేవారు అని తెలిసింది. మల్లారెడ్డి శ్రీశైలం మల్లిఖార్జునుడి భక్తుడు కావడం ఇక్కడ గమనించాల్సిన విషయం. శ్రీశైల మార్గంలో యాచిస్తున్న పిచ్చిగుంట్లను మల్లారెడ్డి చేరదీస్తూ....ఆదరిస్తూ.... రెడ్ల కుల గోత్రాలు చెప్పేందుకు వాళ్ళని ఆశ్రితకులంగా నిర్ణయించి ఉండవచ్చు అనేందుకు ఇక్కడ బలమైన సందర్భం కనిపిస్తున్నది.

జానపదులు మల్లారెడ్డిని త్యాగమయుడిగా కీర్తిస్తుంటారు . మల్లారెడ్డి తన ఆడపడుచులను కాపాడి, తర్వాత రాయల ద్వారా ప్రాపకం పొందినట్టుగా కూడా కొన్ని జానపద కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడ రాయలు అంటే బహుళ లోక ప్రచారం పొందిన కృష్ణదేవరాయలు అనుకోవడానికి వీల్లేదు. రాజా అనే
 పదాన్ని రాయలు అనే అర్థంలో కూడా జానపదులు గ్రహించి ఉండవచ్చు. 

 భక్త మల్లారెడ్డి మహిమలు : 

నిత్యం శివుని కొలుస్తూ తలుస్తూ శివుని కృపతో లక్షా 85 ఇండ్లపేర్లు , లక్షా 85 గోత్రములు , 101 వంశముల పేర్లు రెండు తానకములు , మూడు పద్యములు , ఒంటబట్టించుకున్నాడు. ముఖ్యంగా మల్లారెడ్డి 101 వంశముల పేర్లు ఒంటబట్టించుకున్నాడు అని చెప్తున్నసప్పటికి....మల్లారెడ్డి చరిత్రలో 36 రెడ్ల శాఖలు మాత్రమే కనిపిస్తాయి.. ఇవి మాతృకలు. మిగతా శాఖలు అంతఃశాఖలుగా చేపట్టిన వృత్తి, చేసిన ఉద్యోగం, నివసించిన ప్రదేశం, తదితర కారణాలవల్ల ఏర్పడ్డాయి అనేది ఇక్కడ అర్థం అవుతున్నది. కాగా ఇక్కడ ఆ 36 శాఖలు ఏవి అనడానికి స్పష్టత లేదు. భక్త మల్లారెడ్డి చరిత్రలో పొందుపరచిన శాఖలు స్వయంగా భక్తమల్లారెడ్డి సూచించినవి అని చెప్పడానికి ఆధారం లేదు. ఇందులో రచయిత జోక్యం కూడా అయి ఉండవచ్చు. ఏది ఏమైనా భక్త మల్లారెడ్డి కుల శాఖ మాతృకులకు ఆద్యుడు.

రెడ్ల శాఖలు అనేవి రెడ్ల జీవనవిధానాన్ని తెలియజెప్తాయి . కాబట్టి శాఖల మనుగడ అనివార్యంగా సూర్య చంద్రులు ఉన్నంత కాలం కొనసాగుతుందని వాణి పలికాడు. అంతేకాదు రెడ్ల శాఖలను, గోత్రాలను, ఇంటిపేర్లను చిరస్థాయిగా ఉండేట్టు రాగి శాసనములు వేయించి , శ్రీశైల పాతాళగంగలో భద్రపరచినారని కూడా కథనాలు ఉన్నాయి.

▪️మల్లారెడ్డి నిర్ణయించిన రెడ్ల ఆశ్రితకులం
బిక్షగుంట్లు / పిచ్చిగుంటలు చెప్పే రెడ్లకథలు ఈ కింది విధంగా ఉంటాయి

▪️బిక్షగుంట్లు చెప్పే రెడ్లగాథలు

రెడ్ల ఆశ్రిత కులం బిక్షగుంట్లలో గంట, తమక, మంద, పిత్తి, తొగర అనే ఉపజాతులున్నాయి. వీళ్లంతా రెడ్ల కుల వంశ చరిత్రలు చెప్తూ తిరుగుతుంటారు.కర్ణాటకలోనూ పిచ్చుకుంటుల వాళ్లున్నారు. వీరిని థావనకుంట్లు, ఎద్దుకుంట్లు, గంటకుంట్లు అని పిలుస్తారు. వీరంతా ఏ ప్రాంతంలో ఉన్నా శ్రీశైలం మల్లిఖార్జున స్వామి ఆరాధకులుగా ఉన్నారు. 
బిక్షగుంట్ల ఒక కళారూపం ! వీరు ప్రత్యేకంగా తమ భాద్యతగా రెడ్ల వంశ చరిత్రను తెలిపే పురాణాలను గానం చేస్తూ రెడ్డి కుల గోత్రాలను వల్లిస్తుంటారు. వీరు చెప్పే రెడ్ల పురాణం ఆసక్తి దాయకం. 1995 లో ఈ కులం పేరును వంశరాజా అని మార్చారు. వీరు బీ.సి.ఏ గ్రూపులోని 18 వ కులంగా ప్రభుత్వం పరిగణిస్తున్నది. భక్త మల్లారెడ్డిని తమ ఆరాధ్య దైవంగా గురువుగా సేవిస్తున్న పూజిస్తుంటారు ఈ బిక్షగుంట్లు 

▪️కథ చెప్పేవిధానం :
రెడ్ల కథ చెప్పడానికి కథకులు ముగ్గురుంటారు. అందులో ఒకరు ప్రధాన కథకుడు కాగా మిగిలిన ఇద్దరు వంతలు పాడతారు. ప్రధాన కథకుడి వేషధారణ గమనిస్తే... 
రెడ్డి వీరులను అనుసరిస్తూ వేషం ఉంటుంది. పెద్ద తలపాగా తలపాగ ధరించి, నొసటన విభూతి ధరించి, ఒక చేతిలో కత్తి మరొక చేతిలో డాలు పట్టుకుని, జరీఅంచు పంచెతో మెరిసిపోతుంటారు. , కాళ్ళకు గజ్జెలు కూడా కట్టుకుని ఉంటాడు. మిగిలిన ఇద్దరు మాత్రం శివుని ఢమరుకాలు ధరించి కథకుడిని అనుసరిస్తుంటారు. పిచ్చికుంట్ల వారి కథా విధానం ఎక్కువగా గద్యరూపంలో ఆసక్తికరంగా కొనసాగుతుంది. 

పిచ్చికుంట్ల వారి దగ్గర ఒక రాగి శాసనం ఉంటుంది. రెడ్ల వంశ నామాలను గోత్రాలను , శాసనంలో చూసుకుంటారు. పిచ్చికుంట్ల వారికి చదువు రావాల్సిన అవసరం లేదు. శాసనంలో సంకేతార్థాలు మాత్రమే రాసి ఉంటాయి. ఆ సంకేతాలను పిచ్చికుంట్ల వారు అర్థం చేసుకుంటారు. 

తెలుస్తున్న మరొక ముఖ్య విషయం ఏమిటంటే పిచ్చికుంట్ల వాళ్ళల్లో రెడ్ల తెగలకు సంభందించి కుల విభజన ఉంటుంది. ఉదాహరణకు - మోటాటి రెడ్లకు సంబందించిన పిచ్చికుంట్ల, గూడాటి రెడ్లకు సంబందించిన పిచ్చికుంట్ల, పెడకంటికి సంబందించిన పిచ్చికుంట్ల, ఇట్లా ఏ తెగకు సంబంధించి ఆ రకం పిచ్చికుంట్ల వారు ఉంటారు. ఇందువల్ల పిచ్చికుంట్ల వాళ్ళు కూడా తమకు సంబందించిన రెడ్ల చరిత్రను సులువుగా అధ్యయనం చేయగలరు. తమ తరాలకు కూడా సులువుగా నేర్పించగలరు. లేదంటే అనంతమైన రెడ్ల వంశ చరిత్ర తెలుసుకోవడం చాలా కష్టమైన పని. 

▪️మల్లారెడ్డి గాథ : 
భిక్షగుంట్లు లేదా పిచ్చుగుంట్ల రెడ్ల ఇంటి ముందు మల్లారెడ్డి పురాణాన్ని ఆరు రాత్రులు చెపుతారు. ఈశ్వరుని ప్రార్ధనతో కథ ప్రారంభమై ఈశ్వరున్ని ప్రార్థించడంతో ముగుస్తుంది. ఈ ఆరు రాత్రులందు కథను ఆరుఘట్టాలుగా విభజించి చెబుతారు.
 
1) మొదటిరోజు 
రెడ్లపుట్టుక - అందుకు గల కారణాలు - కుంటిమల్లారెడ్డి జననం -విద్యాభ్యాసం - మొదటిఘట్టంలో వినిపిస్తారు. 

2) రెండవరోజు 
ఢిల్లీ నవాబు ఒకరు దేవగిరి పట్టణం అడవుల్లోకి వేటకై వస్తాడు. దప్పిక అవుతుంది. ఆ దప్పిక తీర్చుకోవడం కోసం రెడ్ల ఇంటికి వస్తాడు. అక్కడ అన్నాదమ్ముళ్ల పిల్లలు అమ్మోజమ్మ, తిమ్మోజమ్మలను చూసి మోహిస్తాడు. పెళ్లిచేసుకోవాలి అనుకుంటాడు. ఇందుకు రెడ్డి పెద్దలను అడుగుతాడు. అప్పుడు కుంటి మల్లారెడ్డి కల్పించుకుని ముహుర్తాలు చూసుకుని పెళ్లికి సిద్ధమై రావాల్సిందిగా చెప్పి పంపిస్తాడు. ఈ కథని రెండవఘట్టంగా వినిపిస్తారు. 

3) మూడవరోజు 
కుంటి మల్లారెడ్డి కార్యరంగంలోకి దిగుతాడు. నవాబు బారి నుండి తమ ఆడబిడ్డలని కాపాడటానికి దేవగిరి పట్టణవాసులందరినీ ఏకం చేస్తాడు. 24 వేల బండ్లు కట్టిస్తాడు. శివుడి మీద భారం వేసి ఆడపడుచులని తీసుకుని దక్షిణాదిశ బయలుదేరి కాసేరు నది దాటి సాగిపోతాడు. 
మల్లారెడ్డి పన్నాగం గమనించి వెంబడిస్తాడు నవాబు.కానీ కాసేరు నదిని దాటలేక చనిపోతాడు.ఈ కథను మూడవఘట్టంగా వినిపిస్తారు. 

4)నాల్గవరోజు 
అమ్మోజమ్మ తిమ్మోజమ్మలు మనస్తాపం చెందే కథను కరుణారసంగా నాల్గవఘట్టంగా వినిపిస్తారు. 

5) ఐదవరోజు 
పెడకంటి రెడ్ల ప్రస్తావన వస్తుంది. వారికి తాళిబొట్టు లేకపోవడం గురించి చెప్తారు. ఇదే కథను జానపదులు మరొకరకంగా చెప్పుకుంటారు.

జానపదుల కథ : ఒక రాజు ఉంటాడు. ఆతడు రెడ్డి గారి అందమైన ఇద్దరు ఆడబిడ్డలపై కన్నేసి వారిని వశపర్చుకోవటానికి ప్రయత్నం చేస్తాడు. ఇది గమనించిన రెడ్డి గారు తన బిడ్డలను వెంట తీసుకుని తమ కుటుంబంతో సహా పెద్దవాగు దాటి తప్పుంచుకుని వెళ్లిపోయే ప్రయత్నం చేస్తాడు. ఈ పరిస్థితిలో బండి ఇరుసు విరిగి పోతుంది. అపుడు రెడ్డిగారు భయపడకుండా తన చేతులతో చక్రాలకు ఊతమిస్తాడు. చేతులు నలుగుతున్నా కూడా పట్టించుకోకుండా బండిని వాగు దాటిస్తాడు. అట్లా రాజు బారి నుండి తమ ఆడబిడ్డల మానప్రాణాలను రెడ్డిగారు కాపాడుకుంటాడు. 
అంటే.... 
ఒక రెడ్డి తలచుకుంటే ఎంతటి సాహసానికైనా... మరెంతటి త్యాగానికైనా.... సిద్దపడతాడు అనే అర్థం ఇక్కడి కథలో ఇమిడి ఉంది. ఈ సాహసాన్ని ఆ రాజుగారు తన పరివారంతో ప్రస్తావిస్తూ - 

"వీరు పెడమనుషులురా ! ఎవ్వరికీ భయపడరు.ఎవ్వరికి లొంగిపోరు . అవసరమైతే తమ ప్రాణాలను అడ్డుపెట్టి తమ వారిని కాపాడుకుంటారు '' అన్నాడట. ఇక్కడ -

పెడ = విపరీతం, పెద్ద, మొండి అర్థాలు వస్తాయి. 

ఎడాపెడా వాయించడం, పెడార్థాలు, ఎడమొహం పెడమొహం ఇవన్నీ విపరీతం అని అర్థం. ఈ క్రమంలో మొండిగా ప్రవర్తించిన ఆ రెడ్డిగారి సంతతి కాలక్రమంలో 
 పెడకంటి రెడ్డిగా స్థిరపడింది అనేది కథనం. 

6)ఆరవరోజు 
ఎట్టకేలకు అందరూ క్షేమంగా రాయలవారి పట్టణమైన అనేగాం చేరి అక్కడ భూములను పొందటం ఆరో ఘట్టంగా వివరిస్తారు.

రాయలవారి ఆజ్ఞ ఇస్తాడు. ఆదరిస్తాడు. రాయల కృపతో అక్కడ సొంతంగా ఒక పట్టణం నిర్మించుకుంటారు. పొందిన భూముల్లో పంటలు పండిస్తారు. ఆ తర్వాత కుంటి మల్లారెడ్డి తపస్సుకై శ్రీశైలం వెళ్లిపోతాడు
 ఇదంతా ఆరవఘట్టంలోనే చెబుతారు.

▪️ పలానాటి వీరచరిత్ర
పిచ్చికుంట్లవారు చెప్పే కథల్లో ప్రధానమైన కథగా వీరోచితమైన 'పల్నాటి వీర చరిత్ర'' పేరును కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వీరు చెప్పే కథలలో శృంగార, వీర, కరుణ రసాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది.
పెదకోమటి వేమారెడ్డి (1400-1420)ఆస్థానకవి శ్రీనాథ మహాకవి పలనాటి వీర చరిత్ర రచించాడు.
 ఈ పలనాటి వీరచరిత్రను పిచ్చిగుంట్ల వారు తమదైన శైలిలో చెప్తూ రెడ్ల ప్రాపకాన్ని గొప్పగా కీర్తిస్తుంటారు.
 
▪️వీరగాథలు
తెలంగాణ ప్రాంతంలో రాములమ్మ, బాలనాగమ్మ, కామమ్మ, సదాశివరెడ్డి, పర్వతాల మల్లారెడ్డి, హరిశ్చంద్రుడు వంటి కథలు చెబుతారు.  
రాయల సీమలో కుంటి మల్లారెడ్డి కథను ప్రత్యేకంగా గానం చేస్తారు. నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో పల్నాటి వీరగాథను, కాటమరాజు కథను చెబుతారు. 
ఒకప్పుడు కోస్తా జిల్లాల్లో కాపువారికి, కమ్మవారికి, కూడా వీళ్ళు గోత్రాలను చెప్పి యాచించేవారని బిరుదురాజు రామరాజు అభిప్రాయపడ్డారు.

రెడ్ల మిరాసి గ్రామాలు
రెడ్ల వంశ చరితల్లి చెప్పే పిచ్చగుంట్ల వారు తమ మిరాసి గ్రామాలను అల్లుళ్లకు కానుకగా ఇచ్చుకుంటారు. ముందుగా రెడ్ల పురాణాలు చెప్పడానికి హక్కు గ్రామాలను ఎంచుకుంటారు ఈ హక్కు గ్రామాలను మిరాసి గ్రామాలు అంటారు.. గ్రామాలను ఎంచుకోవడం అనేది పూర్వం నుండి కొనసాగుతున్న పద్దతి. ఎవ్వరికి ఎన్ని గ్రామాలు అనేది కులపెద్దల ఆధ్వర్యంలో కేటాయించబడుతుంది. ఈ క్రమంలో పిచ్చగుంట్ల వాళ్లు ఇంటిల్లిపాది తమ హక్కు గ్రామాలలో శివరాత్రి మొదలుకొని వర్షాలు మొదలయ్యేవరకూ సంచరిస్తారు.గ్రామంలో మొదట ముఖ్యమైన రెడ్డిని కలుస్తారు. వారి ఆతిథ్యము స్వీకరిస్తారు. కథ చెప్పడం పూర్తయ్యాక పశువులను ధాన్యాన్ని బంగారం వెండి వస్తువులను, డబ్బును కానుకలుగా స్వీకరిస్తారు. 
ముఖ్యంగా కథ చెప్పడంలో పిచ్చకుంట్ల వారు మంచి లౌక్యం పాటిస్తారు. మోటాటి రెడ్లకు మోటాటి వంశ చరిత్ర మాత్రమే చెప్తారు. పాకనాటికి పాకనాటి కథ మాత్రమే చెప్తారు. ఇట్లా రెడ్లల్లో ఉన్న అన్ని తెగల గురించిన సమాచారం మల్లారెడ్డి వాళ్ళ దగ్గర భద్రంగా ఉంటుంది.

▪️భక్తమల్లారెడ్డి వారసుల వివరణ :
మేము భక్త మల్లారెడ్డి వంశానికి చెందిన వాళ్ళం అని చెప్పుకుంటున్న వెంకటసుబ్బారెడ్డి గారు శ్రీశైలంలో మల్లారెడ్డి స్వామి వారి సేవా సంఘం నడుపుతున్నారు. వీరి వివరణ ప్రకారం.... 
" అనాదిగా మేము మల్లారెడ్డి వాళ్ళము. కానీ ఈ పేరు మరుగున పడిపోయింది.ఇప్పటికీ మా మల్లారెడ్డి రెడ్లు కేవలం రెడ్ల కుటుంబాలను మాత్రమే ఆశ్రయిస్తారు. ఈ సందర్భంగా రెడ్లు సంభావన ఇస్తారు.. మేము కుంటిమల్లారెడ్డి నిజమైన వారసులం . కానీ వాస్తవం తెలియక చరిత్రలో తప్పులు తడకలతో నింపేశారు. రెడ్ల మూల పురుషుడు ఆదిరెడ్డి వారసుల్లో ఒకరైన పిల్లలమర్రి భేతిరెడ్డి రెండవ కుమారుడు సత్యంరెడ్డి కొడుకు కుంటి మల్లారెడ్డి. వీరు దొంతిరెడ్డి వెంగళ్ రెడ్డి కుమార్తె బిచ్చమ్మ గారిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతుల సంతానమే మల్లారెడ్డి రెడ్లు . కానీ ఈ వాస్తవం మరుగున పడిపోయింది రెడ్ల తెగలకు గురువులుగా ఈ మల్లారెడ్డి వారసులు కొనసాగుతున్నారు. మల్లారెడ్డి స్వయంగా తన వారసులని గురువులుగా నియమించడం జరిగింది. ఉదాహరణకు - మోటాటి రెడ్లకు మోటాటి మల్లారెడ్డి వారే వంశ చరిత్ర చెప్తారు. 
ఏ తెగవారు ఆ తెగకు వంశనామాలు చరిత్ర తెలియజెప్తారు. మా పేరువెనుక కూడా రెడ్డి ఉంటుంది. మేము ఇతర రెడ్లతో కూడా వియ్యం అందుకుంటాం.. "

✍️తంగెళ్ళశ్రీదేవిరెడ్డి
 _____________________________
ఆధారం : 
1) ప్రకాశం జిల్లా పుల్లలచెరువు గ్రామ రంగస్వామి అనే జానపదుడితో ముఖాముఖీ. 
2) అబ్బు గోపాలరెడ్డి గారి వ్యాసం -తెలుగు విశ్వవిద్యాలయం 
3) పెడ : బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903 
4) పెడ : తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979 
5) జానపదవిజ్ఞాన సర్వస్వం
6) అఖిల భారత రెడ్ల కులగురువు కుంటిమల్లారెడ్డి స్వామి సేవా సంఘం - శ్రీశైలం వారి వివరణ
7) డా: బి. రామ రాజుగారు వారి జానపద సాహిత్య గ్రంథం
8)డా :తంగిరాల సుబ్బారావు గారు జానపద కళోత్సవాల సంచిక

వ్యాసకర్త : తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

No comments:

Post a Comment