Monday, April 15, 2024

నాయిని నరసింహారెడ్డి

నాయిని నరసింహారెడ్డి
( 1940- 2020)
( కార్మికనాయకుడు - ఉద్యమనేత )
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
వ్యాసకర్త : తంగెళ్ళశ్రీదేవిరెడ్డి 

ఒక అడుగు ముందుకు వేస్తే 
ఎందరో ఆ జాడను అనుసరిస్తారు.. 
ఒక మాటను హామీగా ఇస్తే 
మరెందరో ఆ వెలుగులను అందుకుంటారు.... 
అతడే నాయిని నరసింహారెడ్డి !


👉పరిచయం : 

12 మే 1940 సంవత్సరం  
నల్గొండ జిల్లా చందంపేట మండలం 
నేరేడుగొమ్ము గ్రామంలో సాధారణ వ్యవసాయ కుటుంబంలో నరసింహారెడ్డి జన్మించాడు. తల్లిదండ్రులు దేవారెడ్డి, సుభద్రమ్మ. 

నరసింహారెడ్డి పెద్దగా చదువుకోలేదు. హెచ్చెస్సి వరకు చదువుకున్నాడు. స్వగ్రామం నేరెడుగొమ్మలోనే నాలుగో తరగతి వరకు చదివి, మాధ్యమిక విద్యను దేవరకొండలోని ప్రభుత్వ పాఠశాలలో పూర్తి చేశాడు. 

 హెచ్ఎస్సి చదువుతున్న రోజుల్లోనే నాయకత్వ లక్షణాలతో తోటి విద్యార్థులను ఆకర్షించాడు నాయిని. దీన జనుల కోసం పనిచేయాలనే సంకల్పానికి అక్కడే బీజం పడింది. 

👉వ్యవసాయంపై మక్కువ :  

చిన్నప్పటి నుండి నాయినికి వ్యవసాయం మీద మక్కువ ఎక్కువ. వ్యవసాయ కూలీలు, పశువులు, పల్లె వాతావరణం నాయినిని బాగా ప్రభావితం చేసేవి.
ఎక్కువ సమయం పంట పొలాల్లో గడిపేవాడు. తండ్రికి వ్యవసాయంలో సహకారం కూడా అందించేవాడు. 

👉తండ్రి ఆదర్శంలో :

నాయిని తండ్రి దేవారెడ్డి సోషలిస్టు భావాలు కలిగినవాడు. తండ్రి నుండే నాయినికి సోషలిస్టు భావజాలం ఒంటబట్టింది. 

దేవారెడ్డి బీదసాదలకు వెన్నుగా నిలిచేవాడు. ఆనాటి నిజాం నియంతృత్వ పాలనను వ్యతిరేకిస్తూ తెలంగాణ సాయుధ పోరాటంలో పనిచేస్తూ ప్రజల తరుపున నిలబడ్డాడు. ఈ క్రమంలో అప్పటి పోలీసులు దేవారెడ్డిని కాల్చి చంపేశారు

దేవారెడ్డి మరణం కుటుంబాన్ని గ్రామాన్ని విషాదంలో ముంచేసింది. నాయిని ఈ సమయంలో ధైర్యం కోల్పోలేదు. కొంత సమయం తీసుకుని 1958 జనవరి 26వ తారీఖున తన 18 ఏండ్ల వయసులో డాక్టర్‌ రామ్‌మనోహర్‌ లోహియా సమక్షంలో నాయిని సోషలిస్టు పార్టీలో సభ్యత్వం పొందాడు. 
తర్వాత తన సోదరుడు రాఘవరెడ్డి ( పెదతండ్రి కుమారుడు )తో కలిసి దేవరకొండలో సోషలిస్టు పార్టీని బలోపేతం చేసే దిశగా తండ్రి అడుగుజాడల్ని అనుసరించాడు. 

👉ఉద్యమ ప్రస్థానం :

1956లో హెచ్ఎస్సి చదువుతున్న సమయంలో 
సోషలిస్టు పార్టీ ఆధ్వర్యంలో కొనసాగిన - 
 "ఇడ్లీ సాంబర్‌ గో బ్యాక్‌ ఉద్యమం " 
"ముల్కి పాలన వ్యతిరేక పోరాటం "  
" ఆంధ్రలో తెలంగాణ విలీన వ్యతిరేక ఉద్యమం " ఈ మూడు ఉద్యమాల్లో క్రియాశీలకంగా పాల్గొన్నాడు.

తర్వాత - 1960లో గోదాముల ముట్టడి కోసం జరిగిన "తాళా తోడో "ఉద్యమంలో పాల్గొన్నాడు. 

1969 లో తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఆవశ్యకతపై అనుభవ పాఠాలు నేర్పింది. ఈ ఉద్యమంలో చురుకైన పాత్రను పోషించాడు నాయిని . 

1975లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో కూడా శక్తి వంచన లేకుండా పాల్గొన్న నాయిని, జైలు శిక్షకు సైతం వెనకడుగు వేయలేదు. 
హెచ్చరికలను ఖాతరు చేయలేదు. బెదిరింపులకు లొంగలేదు. ఫలితంగా 1977లో 18 నెలల పాటు జైలు జీవితం గడిపాడు. 

పౌర హక్కుల సంస్థలు చేపట్టే ధర్నాల్లో అంకితభావంతో సంకల్పంతో పాల్గొనేవాడు. 

👉ఇంద్రవెల్లి ఎరుపు జ్ఞాపకం :

భూఆక్రమణలు, అటవీ వనరుల దోపిడి, వడ్డీ 
వ్యాపారుల, మోసాలకు నిరసనగా గిరిజన రైతు కూలీ సంఘం 1981 ఏప్రిల్ 20న మొదటి మహాసభను ఇంద్రవెల్లిలో జరపడానికి రంగం సిద్ధం చేసుకుంది. కానీ పోలీసుల నుండి సభకు ఆటంకాలు ఎదురయ్యాయి. 
సభకు వస్తున్న ఆదివాసీలపై 423 రౌండ్లు కాల్పులు జరిపారు. కాల్పుల్లో 60 మంది గిరిజనులు అక్కడికక్కడే చనిపోయారు. మరో 66 మంది తీవ్రంగా గాయపడ్డారు. కానీ 13 మంది మా త్రమే మరణించారని ఆనాటి దినపత్రికలు రాశాయి. ఆదివాసీలపై కాల్పులు జరిగిన ప్రాంతానికి నాయిని జార్జి ఫెర్నాండెజ్​ తో కలిసి వెళ్లారు. అక్కడి పరిస్థితులను స్వయంగా పర్యవేక్షించి వాస్తవాలని పారదర్శకంగా వివరించారు. 

👉కార్మిక నాయకుడు :

సోషలిస్టు నాయకుడు బద్రి విశాల్‌ పిత్తి 
నాగార్జునసాగర్ సమావేశానికి ముఖ్య అథితిగా హాజరైన సందర్భంలో హైదరాబాద్ సోషలిస్టు పార్టీ కార్యాలయంలో నమ్మకంగా పని చేయడానికి, నమ్మకమైన ఒక కార్యకర్త కోసం చూసాడు. 
స్థానిక నాయకుడు పాశం రుక్మారెడ్డి నాయిని నర్సింహారెడ్డి పేరును సూచించాడు. అట్లా నాయిని ఆఫీసు ఇంచార్జిగా పని చేయడానికి 1962 వ సంవత్సరంలో తన నివాసాన్ని హైదరాబాద్‌ పాతబస్తీ శాలిబండలోని కోవాబేలాకు మార్చాడు. కార్యాలయం బేగంబజార్‌ లాల్‌గీర్స్‌ మఠంలో ఉండేది  

ఒకవైపు కార్యాలయం బాధ్యతలు , మరోవైపు పార్టీ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొనడం మొదలెట్టాడు నాయిని. ఈ క్రమంలో నగరంలో బీదసాదల కోసం స్వచ్ఛందంగా పనిచేసే అవకాశం కూడా నాయినికి దక్కింది. 

సోషలిస్టు పార్టీ నుండి కార్మికనేతగా అంచెలంచెలుగా ఎదిగిన నాయిని, మొదట సోషలిస్టు పార్టీ జాయింట్‌ సెక్రటరీగా, తర్వాత రాష్ట్ర కార్యదర్శిగా తన సేవల్ని అంకితభావంతో అందించారు. 

కార్మికనేతగా నాయిని ప్రస్థానం ఒక సుదీర్ఘ చరిత్ర. 
వీఎస్‌టీ, గంగప్ప కేబుల్స్, ఐడీపిఎల్, 
మోడ్రన్‌ బేకరి, హెచ్‌ఎంటీ, వంటి పరిశ్రమలలో కార్మిక సంఘం నాయకుడుగా గెలుపొందాడు.
ఆల్విన్, ఐడీపీఎల్, అజాంజాహి మిల్లు, డీబీఆర్​ మిల్లు, సర్​ సిల్స్​ మిల్లు, నిజాం షుగర్స్ తదితర ప్రభుత్వ రంగ పరిశ్రమలను ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మూసివేయడంపై నాయిని తీవ్రంగా మండి పడ్డాడు. ఈ విషయమై కార్మిక నేతగా కార్మికుల తరుపున పోరాటాలు చేశాడు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక మూసిన పరిశ్రమలు తెరుస్తామని ఉద్యమం సమయంలో మాట ఇచ్చాడు. అనుకున్న ప్రకారం కేసీఆర్ ద్వారా వాటిని తెరవాలని ప్రయత్నం చేసాడు. 
కానీ భంగపాటు ఎదురయ్యింది. రెండు సార్లు అధికారంలోకి వచ్చాక కూడా పరిశ్రమలు తెరిచేందుకు ప్రభుత్వం వైపు నుంచి ఏ ప్రయత్నమూ జరగలేదు అనేది కఠినమైన వాస్తవం. 

 కార్మికుల హక్కుల కోసం కార్మికుల సమస్యల కోసం చిత్తశుద్దిగా పనిచేసాడు. ఈ క్రమంలో హమాలీ, తోపుడుబండ్ల కార్మికుల తరుపున అలుపెరుగని పోరాటాలు ఉద్యమాలు చేసి హక్కులు సాధించాడు. 

సికింద్రాబాద్‌ హాకర్స్‌ యూనియన్, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్లకు అధ్యక్షుడిగా కూడా కొనసాగి ఎందరో కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాడు. 

ట్రేడ్‌ యూనియన్‌ లీడర్‌గా నాయిని కార్మికుల పాలిట పెద్దదిక్కు . కార్మికుల సమస్యల కోసమే కాదు, ఆ కార్మికుల సంతోషాల్లోనూ పాలుపంచుకున్నాడు. కార్మికుల కుటుంబాల్లో జరిగే వేడుకలకు స్వయంగా హాజరు కావడమే కాదు, వాళ్ళకు ఆర్థిక భరోసాను కూడా తన శక్తి మేర అందించాడు. 

హైదరాబాద్ రాంనగర్ లో నివసించే 80 ఏండ్ల సయ్యద్ పాషా తన తోపుడుబండి కార్మిక జీవన స్మృతిలో నాయిని సేవల్ని నేటికిని గుర్తుకు చేసుకుంటున్నాడు. 

👉రాజకీయ ప్రస్థానం :

1977లో జనతా పార్టీలో చేరాడు. అక్కడినుండి ప్రత్యక్ష రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. తర్వాత జనతాదళ్, టీడీపి, తెరాస పార్టీల్లో వరుసగా పనిచేసి 
అన్నివర్గాల్లో పేదల పెన్నిధిగా పేరు తెచ్చుకున్నారు. 

హైదరాబాద్‌ నగరం ముషీరాబాద్ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఇక్కడి నుండే ఉద్దండులను ఓడించి రాజకీయాల్లో ""జాయింట్ కిల్లర్ "" గా పేరు గడించాడు. 

1) 1978లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ముషీరాబాద్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్‌ ( ఐ ) పార్టీ తరుపున అప్పటి కార్మికమంత్రి టి.అంజయ్య , రెడ్డి కాంగ్రెస్‌ తరుపున గతంలో కార్మిక మంత్రిగా పనిచేసిన జి.సంజీవరెడ్డిలు అభ్యర్థులుగా బరిలోకి దిగారు. బలమైన ఈ ఇద్దరు అభ్యర్థులను నాయిని ఓడించడం ముషీరాబాద్ రాజకీయ చరిత్రలో ఒక సంచలనం.   

2) 1983లో జరిగిన సాధారణ ఎన్నికల్లో జనతాదల్‌ పార్టీ అభ్యర్థిగా అదే ముషీరాబాద్‌ నుంచి పోటీ చేసాడు. కానీ టీడీపీ అభ్యర్థి శ్రీపతి రాజేశ్వర్ రావు చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇది తొలి ఓటమి. అయినా బాధ పడలేదు. ఓడిన తర్వాత కూడా ప్రజల మధ్య గడిపిన నిజమైన నాయకుడు నాయిని. 

3) 1985లో జరిగిన ఎన్నికల్లో నాయిని గెలుపొందాడు. కాంగ్రెస్‌ ఆర్టీ అభ్యర్థి కె. ప్రకాష్ గౌడు ఓడిపోయాడు.  

4) 1989లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కోదండరెడ్డి చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవి చూసారు. 

5) 1994లో జరిగిన ఎన్నికల్లో నాయిని కోదండరెడ్డి చేతిలో రెండవసారి ఓడిపోయారు. 

6) 1999లో నాయిని వ్యూహాత్మకంగా జనతాదళ్‌ పార్టీని వీడి టీడీపీలో చేరారు

7) 2001 లో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమ పార్టీని స్థాపించడంతో నాయని తెలుగుదేశం పార్టీని వీడి ఉద్యమ పార్టీలో చేరాడు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక నాయకుడుగా కొనసాగాడు. 

8) 2004లో జరిగిన ఎన్నికల్లో ముషీరాబాద్‌ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మిత్రపక్షాల అభ్యర్థిగా నాయిని పోటీచేసి బీజేపీ అభ్యర్థి డాక్టర్‌ కె లక్ష్మణ్‌పై విజయం సాధించాడు. 

9 ) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్‌లో 2005 నుంచి 2008 వరకు సాంకేతిక విద్యా శాఖా మాత్యులుగా పనిచేశారు.

10 ) 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో అంజయ్య సతీమణి టి. మణెమ్మ చేతిలో ఓడిపోయారు.

11)▪️తెలంగాణ మొదటి హోంమంత్రి :

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర మొదటి హోంశాఖ మంత్రిగా తెరాస ప్రభుత్వంలో భాద్యతలు స్వీకరించారు. ముఖ్యంగా రాజకీయాల్లో నాయిని అనుభవం అపారమైనది. అన్ని వర్గాలతో వారికి సత్సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో నాయినికి చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకపోయినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ చలవతో గవర్నర్ కోటా నుండి లెజిస్లేటివ్ కౌన్సిల్ (ఎమ్మెల్సీ ) పదవి పొంది కీలకమైన హోంశాఖతో పాటుగా ఫైర్ సర్వీసెస్, సైనిక్ వెల్ఫేర్, జైళ్లు, తనకు ఎంతో ఇష్టమైన కార్మిక ఉపాధిశాఖల బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. 

2014 నుంచి 2018 వరకు తెరాస మంత్రివర్గంలో మచ్చలేని నాయకుడుగా కొనసాగాడు. 

12 ) వీఎస్టీ లేబర్ యూనియన్ ఇండస్ట్రీస్ సలహాదారుగా కూడా సేవలందించారు.

👉తిరుగుబాటు మనస్తత్వం :

రైతుగా.... తెలంగాణ సాయుధ పోరాట వీరుడుగా.... నాయిని తండ్రి దేవారెడ్డి గారిది మొదటినుండి తిరుగుబాటు మనస్తత్వం. నాయినిది కూడా అదే ధోరణి. ఇచ్చిన మాట కోసం ఎవర్నయినా ఎదుర్కొంటాడు. ఎందాకయినా వెళ్తాడు. ముఖ్యంగా తన జీవితం సగభాగం పోలీసు కేసులతో సతమతమయ్యాడు. కాబట్టి తాను హోంశాఖా మాత్యులుగా ఉన్నప్పుడు సాధారణ పోలీసుశాఖలో, జైళ్ల శాఖలో సంస్కరణలు తీసుకురావాలనేది నాయిని సంకల్పం. ఈ క్రమంలో పోలీసు శాఖలో అధికారిక శాసనంలా పాతుకుపోయిన జులుంను నిర్మొహమాటంగా తోసిపుచ్చాడు. మావోయిస్టుల హింసను పూర్తిగా వ్యతిరేకించాడు. ఈ క్రమంలో ప్రక్షాళన కోసం హోంశాఖతోపాటు లా అండ్​ ఆర్డర్​ శాఖ కావాలని ప్రయత్నం చేసాడు. కానీ విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అధికారాలన్నీ సీఎం కేసీఆర్ ఆధీనంలో ఉండటంతో నాయిని నిస్సహాయుడు అయ్యాడు. అనుకున్నట్టుగా పోలీస్​ శాఖను సంస్కరించలేకపోయినందుకు విపరీతంగా బాధ పడ్డాడు. చేతికి ఆరవ వేలిలా ఉండిపోయానని వాపోయాడు. 

వైఎస్​ రాజశేఖర్ రెడ్డి హయాంలో 2004 నుంచి 2006 వరకు సాంకేతిక విద్యా శాఖా మాత్యులుగా చేసిన పనులను కూడా హోం శాఖా మాత్యులుగా చేయలేకపోయానని నాయిని అసంతృప్తికి గురవ్వడం బహిరంగ సత్యం. 

తెలంగాణ రాష్టానికి అడ్డు తగిలిన వాళ్ళను తెలంగాణ ప్రభుత్వంలో మంత్రులుగా నియనించడాన్ని పూర్తిగా వ్యతిరేకించాడు. నిర్భయంగా నిర్మొహమాటంగా కేసీఆర్​ను ఈ విషయమై ప్రశ్నించాడు కూడా. 

కార్మికుల కోసం జీవితాన్ని ధారపోసిన వ్యక్తి కాబట్టి, తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన కార్మిక వ్యతిరేక విధానాలను పూర్తిగా ఖండించాడు. 
1) ‘' కార్మిక సంఘాలను రద్దు చేయాలి "  
2) కూలీలకు కనీస వేతనాలు అమలు చేయక పోవడం. 
3)సింగరేణి లో ఉద్యోగాలు తగ్గించడం, ఓపెన్​ కాస్టులు పెంచడం.
ఈ విషయాల్లో ప్రభుత్వం నిర్ణయాన్ని ధైర్యంగా నాయిని తోసిపుచ్చాడు. 

👉ఆదర్శం అతడి మారుపేరు 

అభిప్రాయ బేధాలతో వైఎస్‌ రాజశేఖరరెడ్డి కేబినెట్ నుంచి టీఆర్‌ఎస్‌ వైదొలగిన సమయంలో నాయిని అమెరికా పర్యటనలో ఉన్నారు. అయినప్పటికీ నేరుగా తన రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు పంపి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో తన నిబద్ధతను.... తన చిత్తశుద్ధిని....పారదర్శకంగా చాటుకుని అందరికీ ఆదర్శంగా నిలబడ్డాడు. 

👉 బుల్లెట్టు మీదొచ్చే :

1977- 1978 వ సంవత్సరం సాధారణ రాజకీయాల్లో ప్రవేశించినప్పటి నుండి నాయిని బుల్లెట్ మీదనే తిరిగేవారు. ఎమ్మెల్యేగా కూడా నాయిని వాహనం బుల్లెట్టే. చివరకు అధికారిక కార్యక్రమాలకు కూడా బుల్లెట్ మీదనే హాజరయ్యేవారు.
తర్వాత మహేంద్ర జీప్ వాడారు. ఇప్పటికీ ఆ బుల్లెట్, జీప్ వారి వద్దనే జాగ్రత్తగా ఉన్నాయి. 

👉కుటుంబం :

నాయిని జీవితభాగస్వామి అహల్య. ఈ దంపతులకు ఇద్దరు సంతానం. కొడుకు దేవేందర్‌ రెడ్డి, కుమార్తె సమతారెడ్డి. అహల్య గారు నాయిని మరణించిన ఐదవరోజే మరణించడం బాధాకరం. 

👉రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు కోసం 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తూ .... రెడ్ల సమరభేరి సభకు అన్ని రకాల అనుమతులు ఇప్పించాడు. రెడ్ల సభకు విశిష్ట అతిథిగా విచ్చేసి ""రెడ్డికార్పొరేషన్ "" ఏర్పాటుకు సహకరిస్తానని మాట ఇచ్చాడు. మాట తప్పకుండా బుద్వేల్ లో 10 ఎకురాలు 10 కోట్ల రూపాయలు ( అదనంగా 5 ఎకరాలు ఇస్తామన్నారు ) ఇప్పించి తన అంకితభావాన్ని చాటుకున్నాడు. తర్వాత పోలీస్ నియమకాలలో మూడు సంవత్సరాల వయస్సుని తగ్గించి రెడ్ల యువతకు పెద్ద మేలు చేసాడు.  

మరణం :

సెప్టెంబరు 2020 లో కరోనావైరస్ సోకడంతో కుటుంబసభ్యులు పెద్దాయన్ని బంజారాహిల్స్‌లోని సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రిలో చేర్పించారు. నెగటివ్ రిజల్ట్ వచ్చినప్పటికీ ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ సోకడంతో జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో అక్టోబరు 13న చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి దాటాక అక్టోబర్ 22 వ తేదీ 12.25 నిముషాలకు శివైక్యం పొందారు.   

నాయిని చిరస్మరణీయులు 🙏🙏
 _________________________________
___________

ఆధారం : నాయిని ప్రస్థానం

No comments:

Post a Comment