Monday, April 15, 2024

పద్మశ్రీ కృష్ణారెడ్డి ( చిత్రకారుడు )

కళాకోవిదుడు పద్మశ్రీ కృష్ణారెడ్డి
(1925 - 2018 )
( భారతీయ చిత్ర /శిల్పకారుడు )
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
 వ్యాసకర్త : తంగెళ్ళశ్రీదేవిరెడ్డి 

చతుషష్టికళల్లో చిత్రకళ ఒకటి ! ఇది దృశ్యకళ ! ఆలోచనకు నైపుణ్యాన్ని జోడించి ఒక అర్థాన్ని అందించే ఈ కళ అందరికి సాధ్యం కాదు..

మనిషి ఆశాజీవి ! ఈ క్రమంలో ప్రాచీన కాలం నుండి తన దైనందిక జీవితంలో సంతోషాన్ని... కొత్తదనాన్ని.... వెదుక్కుంటూ అందుకు వివిధ మార్గాలను అనుసరించాడు. వీటిలో కొన్ని ప్రయోజనం ఆశించి కొనసాగించాడు. మరి కొన్ని సౌందర్యదృష్టితో కొనసాగించాడు. ఈ నేపథ్యంలో చిత్రకళ అనేది ప్రయోజనాన్ని అందిస్తూనే సౌందర్యాన్ని కూడా ఒలికిస్తున్న కళ !

ముఖ్యంగా వివిధ కాలాల్లో మనిషి తన మానసిక ఉల్లాసం కోసం ఏ విధంగా తన ప్రయత్నం కొనసాగించినా అదంతా ప్రతిభకు నైపుణ్యానికి సంబందించినవి కావడం విశేషం. వీటినే కాలక్రమంలో కళలుగా వీటిని వర్గీకరించి 64 కళలుగా వివరించడం జరిగింది. ఈ కళల్లో కొన్ని కళలు మాత్రమే ప్రాచుర్యంలో ఉండగా అందులో చిత్రకళ ఒకటి ! 

చిత్రకళను మరింత అందంగా... అద్భుతంగా అత్యాధునికంగా... తీర్చిదిద్దిన ప్రతిభావంతుడు 
ఎన్. కృష్ణారెడ్డి ! 

అత్యంత ప్రాచీనమైన భారతీయ చిత్రకళకు ఆధునిక హంగులు అద్దాడు. పురాతన కళకు సొగసులు అద్దే ప్రింట్‌ మేకింగ్‌ విధానంలో విస్కోసిటీ పద్దతికి పునాదులు వేసాడు. ఈ విధానంలో తనదైన ప్రయత్నానికి ప్రయోగాత్మకతతో ఊపిరి పోసాడు. తనదైన సృజనాత్మకతతో జీవం అందించాడు. మొత్తానికి తనకు అబ్బిన కళలో కొత్త పోకడలు సృష్టించి చిత్రకళను విభాగానికే విలువ పెంచాడు !

👉జననం - బాల్యం :

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం నందనూరు వీరి స్వగ్రామం. 15/7/1925 లో వీరు ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. 
బాల్యం నుండే కృష్ణారెడ్డి సౌందర్యదృష్టి ఎక్కువ ! వాకిళ్ళలో వేసే చిత్రకళలో భాగమైన ముగ్గులను చూసి అనుభూతి చెందేవాడు. ముగ్గుపిండితో ఆడుకుంటూ ప్రయోగాలు చేసేవాడు. సంక్రాంతి సమయంలో ఇతర పర్వదినాల్లో ముగ్గుల్లో ఉపయోగించే రంగు పొడులను చూసి మురిసి పోయేవాడు. రంగులను ఉపయోగించడం వల్ల రెట్టింపు అయ్యే రంగవల్లుల అందాలు కృష్ణారెడ్డిని విపరీతంగా ఆకర్షించేవి. ఈ సందర్బంగా ఒక సాధారణ కళ అసాధారణ కళగా ఏవిధంగా రూపాంతరం చెందగలుగుతుందో తనకు తెలియకుండానే తనలో మెదిలే ఆలోచనల ద్వారా క్రమంగా తెలుసుకోవడం మొదలెట్టాడు. 

కాగితాల మీద బొమ్మలు వేయడం కూడా కృష్ణారెడ్డికి చిన్నతనం నుండి అలవాటుగా ఉండేది. దేవుళ్ళ బొమ్మలు ఎక్కువగా గీసేవాడు. ఈ క్రమంలో అది వరకే ఎవ్వరో గీసిన బొమ్మల్ని చూసి గీసేవాడు. ఈ పద్దతిలో ఉన్నవి ఉన్నట్టుగా కాకుండా చిత్రాల ఆకారాన్ని మాత్రమే అనుసరిస్తూ గీయడంలో తనదైన సృజనాత్మకతని ఉపయోగించేవాడు . దీనితో చూసి గీసిన బొమ్మే అయినా ఆ రెండు బొమ్మలు వేర్వేరుగా ఉండేవి. ఉదాహరణకు నాలుగు గీతాలతో ఉన్న భాగాన్ని ఆరు గీతలకు పొడిగించడం....కిరీటం ఆకృతిని మాత్రమే తీసుకుని అలంకరణ గీతల్ని మార్చడం... పొడవైన జుట్టును కుదించడం వంటివి. 

తర్వాత మెల్లమెల్లగా స్వయంగా బొమ్మలు గీసే ప్రయత్నం మొదలెట్టాడు. ఈ క్రమంలో తన ఊరి పంటపొలాలను, బడిని, గుడిని కాగితంపై గీతల రూపంలో గీసేవాడు. 

👉పోస్టర్ల రూపకల్పన :

అది - 
1942 వ సంవత్సరం -
 కృష్ణారెడ్డి పాఠశాల వయస్సులో ఉన్న సమయం ! దేశనాయకులతో మమేకమై పాఠశాల మొదలుకుని విశ్వవిద్యాలయాల వరకు విద్యార్థులు స్వాతంత్ర్య ఉద్యమంలో ఉధృతంగా పాల్గొంటున్న సమయం..! బ్రిటిష్ పోలీసులు భారతీయులు ఎక్కడి 
వాళ్లను అక్కడ ఉక్కుపాదంతో అణిచి వేస్తున్న సమయం ! ఈ సమయంలో కృష్ణారెడ్డి 
బ్రిటిష్ ప్రభుత్వ విధి విధానాలపై నిరసన వ్యక్తం చేసాడు. క్విట్‌ ఇండియా ఉద్యమం తీవ్ర రూపు దాల్చి భారతదేశం స్వరాజ్య కాంక్షతో అట్టుడుకుతున్న ఈ రోజుల్లో కృష్ణారెడ్డి ధైర్యంగా కదం తొక్కాడు. తన వంతు దేశభక్తితో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టర్లను రూపొందించి వాటిని బహిరంగ ప్రదేశాలలో అతికించి సాహసమే చేసాడు. ఫలితంగా రెండుసార్లు అరెస్టు అయ్యి జైలుకు వెళ్ళడం జరిగింది.

👉చిత్రకళ అభ్యాసం :

కృష్ణారెడ్డి పదహైదు సంవత్సరాల వయసులో 
వున్నప్పుడు పాఠశాల వార్షికోత్సవాలు జరిగాయి. ముఖ్య అతిథిగా కట్టమంచి రామలింగారెడ్డి వచ్చారు. వారికోత్సవంలో భాగంగా పాఠశాలలో నిర్వహించిన చిత్రలేఖనం పోటీలో విజేతలను కట్టమంచి వారు ఎంపిక చేయాల్సి వచ్చింది. ఆ సందర్బంగా కృష్ణారెడ్డి గీసిన రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ చిత్రాన్ని చూసి కట్టమంచి వారు మంత్రముగ్ధుడై పోయాడు. చిత్రంలో తొణికిసలాడుతున్న జీవకళకు పరవశించిపోతాడు. 
వెంటనే ఆ చిత్రానికి మొదటి బహుమతి ప్రకటించాడు. అంతేకాదు కృష్ణారెడ్డిని స్వయంగా పిలిపించుకుని ప్రశంసించాడు. ఆ సమయంలోనే చిత్రకళ చదవాల్సిందిగా కృష్ణారెడ్డిని ప్రోత్సహించాడు.

కట్టమంచి వారు అంతటితో ఆగలేదు.ఆ వెంటనే కృష్ణారెడ్డిలో ఉన్న చిత్రకళా వైభవాన్ని గురించి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌కు లేఖ రాసాడు. విశ్వభారతి విశ్వవిద్యాలయంలో కృష్ణారెడ్డి వంటి ప్రతిభావంతులకు ఆర్థిక పరిస్థితులకు అతీతంగా తప్పనిసరై ప్రవేశాన్ని కల్పించి ప్రోత్సహించాలని కోరాడు. ఇది కృష్ణారెడ్డి చిత్రకళ గొప్పతనం ! 

కృష్ణారెడ్డి కుటుంబం ఆర్థికంగా వెనుకబడి ఉన్నది. అయినప్పటికీ కుటుంబ సభ్యులు వెనుకడుగు వేయలేదు. వ్యయ ప్రయాసలకు ఓర్చుకుంటూ చిత్రకళ నేర్చుకోవాడనికి కృష్ణారెడ్డిని కలకత్తా పంపించారు. కానీ విశ్వభారతి కళాశాల ప్రిన్సిపల్‌ నుండి కృష్ణారెడ్డికి నిరాశ ఎదురయ్యింది. కట్టమంచి వారు ఠాగూర్‌కు రాసిన లేఖను చదివిన తర్వాత కూడా కళాశాల రుసుములు చెల్లించలేని విద్యార్థులకు ప్రవేశం ఇవ్వమని తేల్చి చెప్పేసాడు. 

దిక్కుతోచని పరిస్థితిలో కృష్ణారెడ్డి బయటకు వచ్చేసాడు. కళాశాల ఆవరణలో దిగాలుగా తిరగసాగాడు. ఆ సమయంలో కళాశాల అధ్యాపకుడు నందలాల్‌ బోస్‌ గారు కృష్ణారెడ్డిని గ్రహించి విషయం తెలుసుకున్నాడు. కృష్ణారెడ్డిలో ప్రావీణ్యానికి వెంటనే పరీక్ష నిర్వహిస్తూ..... ఎదురుగా చెట్టు మీద ఉన్న చిలుకను చిత్రం గీయాల్సిందిగా
ఆదేశించాడు. అందుకు పెన్సిల్‌, కాగితం, అందించాడు.  

కృష్ణారెడ్డి ఆలస్యం చేయలేదు. కొన్ని క్షణాలు ఆ చిలుకని తదేకంగా చూసి, ఆ తర్వాత తన ప్రతిభకు పదును పెట్టాడు. చిత్రంలో ఆ చిలుక మాత్రమే కాదు , చిలుక వాలిన కొమ్మ, ఆ కొమ్మ ఆకులు, ఆచెట్టు చుట్టూ పరిసరాలను అద్భుతంగా చిత్రించాడు. ఆ చిత్రాన్ని చుసిన నందలాల్ బోస్ ఆశ్చర్యపోయాడు. ఆర్థిక వెనుకబాటు తనం కళాకారుడిని వెనక్కి నెట్టకూడదని నిర్ణయించుకున్నాడు. వెంటనే ప్రిన్సిపల్ తో మాట్లాడి కృష్ణారెడ్డికి కళాశాలలో ప్రవేశం ఇప్పించాడు. కళాశాల రుసుమును తానే భరించుకుని కృష్ణారెడ్డిలో ఉన్న కళను బతికించాడు. అంతేకాదు నందలాల్‌ బోస్‌ కృష్ణారెడ్డికి అన్నివిధాలా అండదండలు అందించాడు
ఇట్లా కృష్ణారెడ్డి 1941 నుంచి 47 వరకు అక్కడ చిత్రకళ అభ్యసించాడు.చిత్రకళలో ఆరితేరి గ్రాడ్యుయేట్‌ పట్టా పొందాడు. 

ముఖ్యంగా చిన్నతనంలో ఉన్నప్పుడే కృష్ణారెడ్డిలో ఉన్న చిత్రకళ ప్రతిభను ఊరంతా గుర్తించి ప్రశంసించడం మొదలెట్టింది. అందుకు కృష్ణారెడ్డిలో ఉత్సాహం మొదలయ్యింది. ఇంకా ఏదో గీయాలనుకున్నాడు. కొత్తగా గీయాలనుకున్నాడు. ఇట్లా అతడిలో ఆరంభం అయిన ఉత్సాహం చూసి కుటుంబం ప్రోత్సాహం అందించింది.ఊరి ప్రజలు కూడా వెన్నుతట్టారు. అందరి ఆదరాభిమానాలు కృష్ణారెడ్డిని ముందుకు నడిపించాయని కూడా చెప్పవచ్చు.  

👉చిత్రకళలో అర్థాలు :

బొమ్మలు గీయడం అంటే ఒక చెట్టు, ఒక పుట్ట, ఒక పువ్వు, ఒక మనిషి అన్నట్టుగా కాకుండా ప్రతి దృశ్యంలోనూ ఒక అర్థాన్ని ఇమడ్చాలి. 
ప్రకృతి మనిషితో మాట్లాడ్తున్నట్టుగా బొమ్మలు గీయాలి. బొమ్మ గీయడం మొదలెట్టినప్పుడు విభిన్నంగా ఆలోచించడం మొదలెట్టాలి. ఇవన్నీ 
తన గురువు ద్వారా కృష్ణారెడ్డి తెలుసుకున్నాడు. తర్వాత తానే స్వయంగా మెళకువల్ని సృష్టించుకున్నాడు. 

👉" విస్కోసిటీ " పద్ధతి :

చిత్రం గీతలతో ఏర్పడుతుంది. రంగులతో పరిపూర్ణం అవుతుంది. చిత్రాలు చరిత్ర వివరించడంలో కీలక పాత్ర వహిస్తున్నాయి కూడా. అతి పురాతన భారతీయ చిత్రాలు ఇందుకు నిదర్శనం. మానవునికి చరిత్ర గురించి తెలియక ముందే పూర్వ మానవుడు రాతిపై చిత్రాలు చిత్రీకరించటం జరిగింది. క్రీ.పూ 5500 లోనే మధ్య ప్రదేశ్ లోని రాయ్‌సేన్ జిల్లాకి చెందిన భీంబేట్కాలో రాతిని చిత్రపటంగా మలిచిన దాఖలాలు ఉన్నాయి. అయితే రాతితో చెక్కే శిల్పం వేరు, రాతి మీద చిత్రించే చిత్రం వేరు. రాతి మీద గీత చిత్రకళను అత్యున్నతంగా నిలబెట్టింది. ఇది మేకింగ్ విధానం కిందకు వస్తుంది. కృష్ణారెడ్డి ఈమేకింగ్ విధానంలో కొత్త పద్ధతులకు శ్రీకారం చుడుతూ కనిపెట్టబడిన విధానమే విస్కోసిటి ! ఈ విధానం ద్వారా చిత్రకళా ప్రపంచం వీరిని
 #మాస్టర్‌_ఆఫ్‌_ఇంటాగ్లియో_ప్రింట్‌_మేకర్‌గా గుర్తించి గౌరవించింది. 

ఈ విస్కోసిటి ప్రింట్‌ మేకింగ్‌ విధానం కృష్ణారెడ్డికి చరిత్రలో ప్రత్యేక స్థానం ఇచ్చింది. ఈ విధానంలో వెలకట్టలేని ఎన్నో అపురూప ప్రింట్‌ చిత్రాలను సృష్టిస్తూ చిత్రకళకు ఒక కొత్త ప్రపంచాన్ని తయారు చేసాడు. భారతీయ కళారంగానికి అంతర్జాతీయంగా కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెట్టాడు. దేశవిదేశాల్లో అభిమానుల్ని శిష్యుల్ని సంపాదించుకున్నాడు. 

అతి తక్కువ రంగులు మాత్రమే ఉపయోగించి ప్రింట్‌ మేకింగ్‌ కళలో ఎన్నో రంగుల ప్రింట్‌ చిత్రాలు తీసే పద్ధతి విస్కొసిటీకి ఆద్యుడుగా కృష్ణారెడ్డి పేరును చిత్రకళా ప్రపంచం నేడు స్మరించుకుంటున్నది. ఇది తెలుగుజాతి గర్వకారణం. 

ఈ పద్దతిలో మొదట జింక్‌ మెటల్‌ ప్లేట్‌ తీసుకుంటారు. ఈ ప్లేట్ ఒక ఆధారం. దీని మీద కావలసిన చిత్రాన్ని డ్రాయింగ్‌ వేస్తారు. ఇది మొదటి దశ. 
ఆ ఆకృతిని మొనదేలిన సూదులతో గుచ్చుతారు. తర్వాత దానిని ఆసిడ్ లో ముంచినప్పుడు సన్నని గీతలు కనిపిస్తాయి. ఈ గీతల్లో కావాల్సిన రంగులు నింపుతారు ఇది రెండవ దశ. 
తరువాత ప్రింట్‌ తీస్తే సరైన ఆకృతిలో ప్రింట్‌ చిత్రం వస్తుంది. ఇది మూడవ దశ. 
ముఖ్యంగా ఈ జింక్‌ ప్లేట్‌ని ఒక శిల్పంలా అవసరమైన రకరకాల లోతుల్లో చెక్కి 
రంగులు నింపి ప్రింట్‌ తీస్తారు. నింపిన రంగులు అన్నీ కలిసిపోయి రంగు రంగుల ప్రింటులు వస్తాయి. 

ఇట్లా సాదారణ చిత్రకళ లో మాదిరిగా ఒక డ్రాయింగ్ షీట్ ఉపయోగించి గాని, కాన్వాస్ పై కుంచె ఉపయోగించి గాని, చిత్రాలు వేయడం వేయడం కుదరని బిన్నమైన ప్రక్రియ ప్రింట్ మేకింగ్ .!

👉 ప్రింట్‌ మేకింగ్‌ కళ - వివరాలు :

ఈ కళ అసాధారణమైనది. 1964వ సంవత్సరంలో ప్రింట్ కౌన్సిల్ అఫ్ అమెరికా వారు ప్రింట్ మేకింగ్ అని పేరు పెట్టడం జరిగింది

ఈ ప్రింట్‌ మేకింగ్‌ పద్ధతిని 15వ శతాబ్దం నుండి పుస్తక ప్రచురణకు ఉపయోగించేవారు. లిపిని... బొమ్మలను.... ఒక చెక్కపై పద్దతి ప్రకారం చెక్కి, ఆతర్వాత వాటిమీద సిరా పూసి ప్రింటులు తీసేవారు. 
తర్వాత ఫొటోగ్రఫీ వాడుకలోకి వచ్చింది. ఫోటోగ్రఫీలో ప్రింటులు కావాల్సినన్ని తీసే అవకాశం ఉన్నది. దీనితో ప్రింట్ మేకింగ్ పద్ధతి వెనుక బడింది. 

ప్రింట్‌ మేకింగ్‌లో ఒకటి లేదా రెండు రంగులు వాడగలుగుతారు. అంతకన్నా ఎక్కువ రంగులు వాడలేరు. ప్రింట్ కళలో ఇది పెద్ద లోపంగా కృష్ణారెడ్డి తెలుసుకున్నాడు. కాబట్టే తనదైన ప్రయత్నం చేస్తూ లోపాన్ని అధిగమించే ప్రయోగానికి శ్రీకారం చుట్టి విజయం సాధించాడు. తక్కువ రంగులు ఉపయోగించి ఎక్కువ రంగుల్ని చూపెట్టడం ఈ కళ ప్రత్యేకతగా మార్పు తీసుకు వచ్చాడు. 

ఈ విషయాన్ని జీవితానికి జోడిస్తూ....ఈ కళ కేవలం చిత్రాలకే కాదు జీవితానికి కూడా పరోక్షంగా పాఠాలు నేర్పుస్తుందని కృష్ణారెడ్డి అభిప్రాయపడ్డాడు. ఈ క్రమంలో - ఉన్నంతలో సర్దుకు పోయే తత్త్వం, అణకువతో మెలగడం, ఆడంబరాలు త్యజించడం , వంటి సులక్షణాలు ఈ కళ ద్వారా తెలియకుండానే అలవడతాయని కృష్ణారెడ్డి వ్యక్తం చేసేవాడు. అట్లాగే ఉత్సహం చెతన్యం పొదుపు వంటి లక్షణాలను కూడా ఈ కళ నేర్పిస్తుందని వారు వివరించేవారు. 

 👉కృష్ణారెడ్డి చిత్రాలు :

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వందలాది మ్యూజియాలు... గ్యాలరీల్లో కృష్ణారెడ్డి కళాఖండాలు ప్రదర్షింపబడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా గౌరవాన్ని పొందుతున్నాయి. కీర్తి ప్రతిష్టను సముపార్జిస్తున్నాయి. ఎందరో చిత్రకారులకు అడుగుజాడగా ఆదర్శంగా నిలుస్తున్నాయి. 
విభిన్నతకు మారు పేరుగా దేశవిదేశాల్లో కృష్ణారెడ్డి చిత్రకళ ఉదాహరించబడుతున్నది. 

వారి విస్కోసిటి చిత్రాలు గమనిస్తే.... అదొక కొత్త రంగుల ప్రపంచం ! జీవిస్తున్న ప్రపంచానికి అనుబంధంగా నిర్మించబడిన సుందర లోకం ! ఇక్కడ బొమ్మలు మాత్రమే కాదు బొమ్మలు వినిపించే కథలు కూడా విశ్వం అంచులదాకా వినిపిస్తూ కనిపిస్తాయి.

వీరు ఎన్నో చిత్రాలు గీశారు. సమాజంలో సంఘటనలకు స్పందిస్తూ.... సమాజాన్ని నిర్వచిస్తూ.... ప్రపంచాన్ని ఒక చోట కుదిస్తూ.... ప్రపంచం చుట్టూ విహరిస్తూ..... వీరి చిత్రాలు అభిమానులను అలరించాయి. ముఖ్యంగా చిత్రాలు గీయడంలో విషయం ఏదైనప్పటికీ ప్రత్యేకతను ప్రకటించుకోవడం కృష్ణారెడ్డి ప్రత్యేకత ! సాధారణ బొమ్మలు వేసినా కూడా అసాధారణత కృష్ణారెడ్డి నైజం.. ! ఉదాహరణకు పక్షి బొమ్మ గీస్తే అది బొమ్మగా కాదు, నిజమైన పక్షి ఎగురుతుంది అనే భావన ప్రస్ఫుటంగా కలిగించేవాడు. చేప బొమ్మ గీస్తే దాని కదిలే శక్తి స్పష్టంగా కనిపించేలా జాగ్రత్త పడేవాడు.  

చిత్రకళలో వీరి ఒక అనుభవాన్ని గుర్తుచేసుకుంటే.. వీరు ఒకసారి తన కూతురుతో కలిసి సర్కస్‌కి వెళ్లడం జరిగింది. అక్కడ క్లోన్‌ వేషధారి కృష్ణారెడ్డి మనసులో నాటుకు పోయాడు. ఫలితంగా ఆలస్యం చేయకుండా క్లోన్‌ సిరీస్‌ చిత్రాల పరంపర ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టాడు.

కృష్ణారెడ్డి అభిప్రాయం ప్రకారం ప్రతి మనిషిలో ఒక క్లోన్‌ దాగి ఉండటం జరుగుతుంది. కానీ కొందరిలో బహిరంగంగా ఉండి సహజంగా బయటకు కనిపించడం జరుగుతుంది. మరి కొందరిలో అంతర్గతంగా దాగి... ప్రేరేపిస్తే తప్ప బయటకు కనిపించడం జరగదు. ఇదేమైనప్పటికీ... కృష్ణారెడ్డి క్లోన్ సిరీస్ నవ్వుల ప్రపంచాన్ని నిర్మించింది. 

చిత్రకళకు ముందు మెదిలే ఆలోచన ఔత్సాహికులకు ఒక పాఠ్యాంశం వంటిదని...ఆ ఆలోచన చుట్టూ పరిభ్రమించే జ్ఞాపకాలు, ఆలోచనను కళ వైపు నడిపించే విశ్వాసం చిత్రకారుడికి ఇంధనంలా పనిచేస్తాయని కృష్ణారెడ్డి అభిప్రాయం. 

👉శిల్పకారుడుగా - నిరంతర విద్యార్థిగా :

కృష్ణారెడ్డి శిల్పకారుడు కూడా !  
1947 నుండి 1949 వరకు మద్రాస్‌ కళాక్షేత్రంలో ఆర్ట్స్ విభాగాధిపతిగా పనిచేసాడు.ఇక్కడ కృష్ణారెడ్డి మీద ప్రఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి ప్రభావం పడింది. ఈ ప్రభావంతో 1949లో లండన్‌కి వెళ్లి, స్లేడ్‌ స్కూల్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్‌లో హెన్రీ మోర్‌ అనే ప్రఖ్యాత శిల్పకారుడి వద్ద శిల్పం నేర్చుకున్నాడు.

ఇదే సమయంలో చిత్రకళ శిల్పకళ రెండు రంగాల్లో ప్రతిభకు మరింత పదును పెట్టాడు.  

1950లో పారిస్‌ చేరి కాన్‌స్టాంటిన్‌ బ్రాంక్యూసీ అనే మరో శిల్పకారుణ్ణి కలిశాడు. తరువాత అనే కళాకారుడితో పరిచయం ఏర్పరచుకున్నాడు. ఇక్కడ శిల్పానికి మరింత మెరుగులు నేర్చుకున్నాడు.

1965 నుంచి పారిస్‌లోని ‘అటులియర్ 17’ స్టూడియోకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. 

విస్కాన్సిన్ విశ్వవిద్యాలయంలో ఆర్ట్ విభాగానికి ప్రొఫెసర్‌గా కూడా పనిచేశాడు.

స్టాన్లీ విలియం హైటర్‌ అనే ప్రింట్‌ మేకింగ్‌ కళాకారుడి వద్ద ఎంగ్రేవింగ్‌ కళను నేర్చుకున్నాడు.

బ్రేరా అకాడమీలో మారినో మారిని వద్ద శిష్యరికంచేసి ప్రింట్‌ మేకింగ్‌ కళలో కొత్తదనానికి బాటలు వేసుకున్నాడు. 

పారిస్‌లోని ప్రఖ్యాత 'హెటర్‌ అటిలియన్‌ 17' అనే ఆర్ట్‌ స్టూడియోకి అసోసియేట్‌ డైరెక్టర్‌గా, ఆ తరువాత డైరెక్టర్‌గానూ పనిచేశాడు ఇక్కడ కృష్ణారెడ్డి తనదైన కళలో మహత్తర ప్రయోగాలు చేశాడు.

👉ఔత్సాహికులకు వర్కు షాపు :

కృష్ణారెడ్డి ప్రయాణం అలుపెరుగనిది. ఈ క్రమంలో తాను కనుగొన్న విస్కోసిటీ పెయింటింగ్స్‌ పద్ధతి గురించి దేశ విదేశాల్లో వర్క్‌షాపులు నిర్వహించాడు. 

వివిధ ప్రాంతాలను ప్రత్యేకంగా ఎంచుకుని కళా ప్రదర్శనలు ఇచ్చాడు.ఔత్సాహికులు అందరికి శిక్షణ ఇచ్చాడు. వాళ్ళని ధీటుగా తీర్చిదిద్దాడు. కళను నమ్ముకున్న ఎందరికో జీవనోపాధి కలిగించాడు.

 విస్కోసిటి ప్రింట్‌ మేకింగ్‌ విధానం గురించి ప్రత్యేక ఉపన్యాసాలు కూడా ఇచ్చాడు. తన ఉపన్యాసాలు ద్వారా ఎందరికో ఆసక్తిని రేకెత్తించాడు. ముఖ్యంగా 
ప్రింట్‌ మేకింగ్‌ గురించి పుస్తకం రచించాడు. 'కృష్ణాస్‌ కాస్మోస్‌' పేరుతో మోనోగ్రాఫ్‌ కూడా రచించబడింది. 

వీరి విస్కోసిటి పద్దతిని దృష్టిలో ఉంచుకుని అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు కృష్ణారెడ్డిని విశిష్ట అథితిగా ఆహ్వానం పలికాయి కూడా. 

👉కుటుంబం :

వీరు న్యూయార్క్‌లో స్థిరపడ్డారు. వీరికి భార్య, కుమార్తె ఉన్నారు. వీరి భార్య జుడీబ్లమ్‌ రెడ్డి.

👉జీవితచరిత్ర :

డెనిస్‌ ఎల్‌. ఫోర్బ్స్‌ అనే రచయిత కృష్ణారెడ్డి జీవిత చరిత్రను రాశారు

👉గౌరవ కళాకారుడు :

రంగుల ముద్రణలో నూతన ముద్రణా ప్రక్రియలను ప్రవేశపెట్టి ప్రపంచ చిత్రకళకు మార్గదర్శకుడు కృష్ణారెడ్డి సదా స్మరణీయులు

 వీరి కళను గుర్తిస్తూ భారత ప్రభుత్వం 1972లో 'పద్మశ్రీ' పురస్కారంతో గౌరవించింది. 
1980 లో శాంతినికేతన్ విశ్వభారతి విశ్వ విద్యాలయం నుండి ‘గగన్ అబానీ’ పురస్కారాన్ని అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ చేతుల మీదుగా అందుకున్నారు.
1980 లోనే తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వీరిని గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. 
1997లో అఖిల భారత లలిత కళల సంఘం నుండి కళారత్న పురస్కారం అందుకున్నారు. 
జాతీయ అంతర్జాతీయ సంస్థలు విశ్వవిద్యాలయాలు నుండి మరెన్నో విశిష్ట పురస్కారాలను కూడా అందుకున్నారు. 
కళను ప్రపంచానికి అంకితం చేస్తూ ఈ గొప్ప కళాకారుడు తన తొంబై మూడవ ఏటా 22 /08 2018న న్యూయార్క్ లో మరణించారు. 
కళ మిగిలింది.... 
కళాకారుడిని బొమ్మల్లో బతికించింది...

No comments:

Post a Comment