Monday, April 15, 2024

మద్ది నారాయణరెడ్డి ( గురుకుల పాఠశాలల అధ్యుడు )

మద్ది నారాయణరెడ్డి (1906- 1988)
( భూదాన శీలి - గ్రామ నిర్మాత - గురుకుల పాఠశాలల ఆధ్యుడు )
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
✍️తంగెళ్ళశ్రీదేవిరెడ్డి 

భావి భారత పౌరుల కోసం 
దేశ సౌభాగ్యం కోసం
దేశంలోనే తొలి గురుకుల పాఠశాలకి మార్గం చూపిన మహనీయుడు....! 
దీనజనుల నీడ కోసం
గ్రామాన్ని నిర్మించిన ప్రజా ఋషి....! 
సత్యం ధర్మం నీతి న్యాయం ఆదర్శాలుగా భూదానంతో తరించిన భూమి పుత్రుడు .....! 
మద్ది నారాయణరెడ్డి!!

//వివరాల్లోకి వెళ్తే....//

తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లా, మునుగోడు మండలం వెల్మకన్నె గ్రామం మద్ది నారాయణరెడ్డి సొంత ఊరు . నరసింహారెడ్డి, రుక్మిణమ్మ ( రుక్కమ్మ )దంపతులకు వీరు 1906 ప్రాంతంలో జన్మించారు. రాజ్యంలో సామాజిక రాజకీయ చీకట్లు కమ్ముకున్న పరిస్థితుల్లో నారాయణరెడ్డి పదవ తరగతి వరకు చదువుకున్నాడు. వీరు లోకవ్యవహారంలో లౌకికం ప్రదర్శించడంలో గొప్ప మేధావి. అతడి ఆలోచనే ఒక గొప్ప నిఘంటువు.

స్వాతంత్ర సమర యోధుడుగా , సాయుధ పోరాట వీరుడుగా, భూదాన శీలిగా, గ్రామ నిర్మాతగా, సర్వోదయ ఉద్యమ నిర్మాతగా మద్ది నారాయణరెడ్డి గారి సమున్నత జీవిత విశేషాలు గమనిద్దాం.

//భూదానశీలి నారాయణరెడ్డి //

వీరు స్వతహాగా 400 పై చిలుకు ఎకరాల భూస్వామి. తల్లి తరుపున 120 ఎకరాలు, భార్య తరుపున 100 ఎకరాలు సంక్రమించాయి. తల్లిదండ్రులకి ఒక్కటే కొడుకు కావడంతో మొత్తం 600 ఎకరాలకు కు పైగా భూమి ఉన్న ఆసామీ అయ్యాడు. ఈ మొత్తం భూమిలో _
▪️400 ఎకురాలు వివిధ సందర్భాలు పురస్కరించుకుని వెల్మకన్నె ప్రాంతంలో దానం చేసాడు.
ఇందులో భాగంగా సర్వేల్‌ గ్రామ పంచాయతి కార్యాలయ కోసం 1100 గజాలు విరాళంగా ఇవ్వడం జరిగింది.
ఆచార్య వినోభావే భూదానోద్యమంలో భాగంగా తన కొంత భూమిని పేద ప్రజల కోసం దానం ఇచ్చాడు .
▪️120 ఎకరాలలో " దేవిరెడ్డి గూడెం" గ్రామం నిర్మించాడు.
▪️45 ఎకరాలు సర్వేల్ గురుకుల పాఠశాల కోసం దానం చేశాడు 

మొత్తం 565 ఎకరాలు దానధర్మాలకే పోగా , ప్రస్తుతం వీరి కుటుంబం కోసం 50 ఎకరాలు మిగిలి ఉన్నది.

//దేవిరెడ్డి గూడెం (దేవిరెడ్డి బంగ్లా )గ్రామ నిర్మాత //

నల్గొండ జిల్లా నారాయణ్ పూర్ మండలంలో దేవిరెడ్డి బంగ్లా గ్రామం ఉన్నది. ఈ గ్రామాన్ని దేవిరెడ్డి గూడెం అని కూడా పిలుస్తారు. రెడ్లపేర్లతో తెలుగు ప్రాంతాల్లో వేలకొలది గ్రామాలు ఉన్నాయి. వివిధ కాలాల్లో కొందరు రెడ్లు నిర్వర్తించిన
న్యాయం , కొనసాగించిన ధర్మ పాలన, చేసిన త్యాగాలు, గ్రామ నిర్మాణాలకు దోహదపడ్డాయి. ఈ క్రమంలో మద్ది నారాయణరెడ్డి గారు తన తాత దేవిరెడ్డి గారి పేరు మీద " దేవిరెడ్డి గూడెం " నిర్మించారు.ప్రస్తుతం ఇక్కడ 80 వరకు కుటుంబాలు నివసిస్తున్నాయి.

▪️దేవిరెడ్డిగ్రామం వెనుక కథ

వెలమకన్నె గ్రామానికి చెందిన మద్ది నారాయణరెడ్డి మొదటి నుండి సామజిక సేవలు దానధర్మాలు కొనసాగిస్తూ వస్తున్నాడు. అమ్మమ్మ గారి ఊరుతో కూడా వీరికి అనుబంధం ఉన్నది. వీరి తల్లి రుక్కమ్మ గారు తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు కావడంతో తాతగారి గారి ఆస్తి తన వాటగా 120 ఎకరాలు సంక్రమించింది. ఈ విధంగా సంక్రమించిన భూమిని ఒక ప్రయోజనార్థం ఉపయోగించాలి అనుకున్నాడు.

గ్రామంలో ఇండ్లు లేని పేదలు ఆరుబయట తాత్కాలిక గుడిసెలు వేసుకుని నివసించడం, వారి ఇబ్బందులు, గ్రామాలను వదిలి వెళ్తున్న పరిస్థితులు చూసాడు. వాళ్ళకోసం ఇంటికి ఇంత స్థలాన్ని కేటాయిస్తూ తాత గారు మాతామహులు దేవిరెడ్డి గారి పేరు మీద గ్రామం నిర్మించాలి అనుకున్నాడు. వెంటనే తన సంకల్పానికి శ్రీకారం చుట్టాడు. అదే ఇప్పుడు దేవిరెడ్డి గూడెం.

// రవీంద్రుడి శాంతినికేతన్ ఆదర్శంగా సర్వేల్ గురుకుల పాఠశాల //

మద్ది నారాయణరెడ్డి పశ్చిమబెంగాల్‌లోని రవీంద్రనాథ్ ఠాగూర్‌చే నడపబడుతున్న శాంతినికేతన్‌ను సందర్శించాడు. అక్కడి విద్యార్థులు స్వేచ్ఛ స్వతంత్రంతో పాఠశాలను ఒక ఇల్లుగా అనుభూతి చెందడానికి చూసి పాఠశాల పట్ల ప్రేరణ చెందాడు. తమ ప్రాంతంలో కూడా ఇటువంటి పాఠశాలను ఏర్పాటు చేస్తే బాగుంటుందనే గట్టి నిర్ణయానికి వచ్చాడు . 
పశ్చిమ బెంగాల్ నుండి తిరిగి రాగానే తన ఆలోచనని అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పీవీ నరసింహారావు‌తో పంచుకున్నాడు. అందుకు తన 45 ఎకరాల భూమిని పాఠశాల కోసం దానం చేశారు.
ఆ విధంగా విశాల హృదయుడు మద్ది నారాయణరెడ్డి భూదానంతో సర్వేలు గురుకుల పాఠశాలను 1971వ సంవత్సరం నవంబర్ 23 న 
ముఖ్యమంత్రి పివి నరసింహారావు ప్రారంభించారు.
దేశంలోనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొలి గురుకుల పాఠశాలగా సర్వేలు గురుకుల పాఠశాల చరిత్ర సృష్టించింది.

▪️సర్వేల్ గురుకుల పాఠశాల స్ఫూర్తిగా

 ప్రస్తుతం తెలుగు ప్రాంతాల్లో అనేక సంఘిక, గిరిజన, మైనార్టీ, సంక్షేమ గురుకుల పాఠశాలలు నడుస్తున్నాయి. వీటికి స్ఫూర్తిగా సర్వేల్ గురుకుల పాఠశాలనే నిలిచింది .
 సర్వేల్ గురుకుల పాఠశాల 1971లో ప్రారంభమైన తర్వాత, 1972లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని తాటికొండ, రాయలసీమ ప్రాంతంలోని కొడిహనహళ్లిలో గురుకుల పాఠశాలలు ఏర్పాటయ్యాయి
1983లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సర్వేల్ గురుకుల పాఠశాలను స్ఫూర్తిగా తీసుకొని 
జిల్లాకు రెండు చొప్పున బాల బాలికలకు వేరువేరుగా రాష్ట్రవ్యాప్తంగా గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశారు. కాలక్రమంలో ఇదే స్ఫూర్తి కొనసాగి వందల సంఖ్యలో గురుకుల పాఠశాలల ఏర్పాటు జరిగింది.

▪️పాఠశాల ప్రత్యేకతలు 

 ఈమధ్య కాలంలో గురుకుల పాఠశాలలో హిందూ ధర్మానికి విరుద్ధమైన బోధనలు జరుగుతున్నాయని ఒక వివాదం చెలరేగింది. కొన్ని గ్రూపులు ధర్మానికి విరుద్ధంగా తయారవుతున్నాయని ఆందోళనలు చెలరేగాయి. కాగా ఇక్కడి గురుకుల పాఠశాలకు ప్రత్యేకత ఉన్నది. ఇక్కడి విద్యార్థులకు సంస్కృతం ఒక సబ్జెక్టుగా బోధిస్తారు. భారతీయ సనాతన ధర్మాల గురించి అవగాహన కల్పిస్తారు.

 ▪️పాఠశాల నుండి తయారైన ప్రముఖులు 

1) తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి
2)తెలంగాణ ఈస్ట్ జోన్ ఐజీ నాగిరెడ్డి,
3)బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంక టేశం
4)తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్
5)తెలంగాణ గవర్నర్ కార్యదర్శి సురేంద్రమోహన్, , 6)ఇండియన్ ఎయిర్‌లైన్స్ డీజీఎం శాంతనంది ప్రసాద్,
7)కమిషనర్ ల్యాండ్ రికార్డ్స్ శశిధర్
8)తెలంగాణ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఎండీ మురళీధర్, 9)విశాఖ స్టీల్ డీజీఎం బీయువిఎన్ రాజు,
10)రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ డి.రమేష్,
11) బీహెచ్ఈఎల్ డీజీఎం స్వామి, 
12)తెలంగాణ పోలీస్‌ హౌసింగ్‌ సొసైటీ ఎండీ మల్లారెడ్డి,
13)ఐఆర్‌ఎస్‌ డి.ప్రభాకర్‌రెడ్డి
14)డాక్టర్‌ పెద్ది శ్రీధర్‌రెడ్డి
15)అపోలో ఆస్పత్రిలో చీఫ్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ లింగారెడ్డి (నవజాత శిశువుల నిపుణులు), 16)డి.సంపత్‌కుమారాచార్య (పల్లె ప్రగతి రాష్ట్ర సందర్శకుడు),
మొదలగు వారు ఈ పాఠశాల విద్యార్థులే.

1971 సంవత్సరం నుంచి ఇప్పటివరకు కొన్ని వేల మంది విద్యార్థులు ఇక్కడ నాణ్యమైన విద్యను పొందారు.40 మందికి పైగా ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఆల్‌ ఇండియా సర్వీస్‌లో ఎంపికై దేశ వ్యాప్తంగా సేవలందిస్తున్నారు.500 మంది
దేశ విదేశాల్లో, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు. ఈ విద్యార్థులు ఈ పాఠశాల విద్యా ప్రమాణాలకు నిలువెత్తు నిదర్శనం

▪️నారాయణరెడ్డి స్మృతిలో గురుకుల ఉత్సవాలు 

గురుకుల పాఠశాల ముందు నారాయణరెడ్డి విగ్రహాన్ని 2019 లో ఏర్పాటు చేసారు.
1997 రజతోత్సవాలు జరిగాయి.
2021 లో స్వర్ణోత్సవాలు జరిగాయి

// భారత స్వతంత్ర ఉద్యమంలో....
తెలంగాణ సాయుధ పోరాటంలో....//

మద్ది నారాయణ రెడ్డి అటు భారత స్వాతంత్ర ఉద్యమంలోనూ ఇటు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నాడు. తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాం కు వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్య చేస్తూ పోరాటం చేసినందుకు అరెస్ట్ కాబడ్డాడు. పోరాట వీరుడిగా వరంగల్ జిల్లా జైలులో, గుజరాత్ జైలులో, శిక్షలు అనుభవించాడు. పోరాట చరిత్రల్లో మద్ది నారాయణరెడ్డికి స్థానం దొరకలేదు. బహుశా ఏ పోరాట చరిత్రలో కూడా మద్ది నారాయణరెడ్డి పేరు ప్రస్తావించబడలేదు?

 " బ్రిటిష్ సామ్రాజ్యవాదుల నుండి, నిజాం నిరంకుశ పరిపాలన నుండి, హైదరాబాదు రాష్ట్ర ప్రజలకు విముక్తి సాధించిన యోధులలో ఒకరైన మీ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచి యుండ గలదు.ఇదే మీకు మా భక్త్యంజలి " అనే సన్మాన పత్రము మాత్రం పోరాటానికి సాక్షిగా మద్ది నారాయణరెడ్డి అందుకున్నారు 

▪️వయోజనుల విద్య

 సాయుధ పోరాట కాలంలో జనాల్ని చైతన్యం చేసే క్రమంలో నారాయణరెడ్డి వెల్మకన్నె తదితర గ్రామాల్లో వయోజన పాఠశాలలు స్వయంగా నెలకొల్పి, ఉపాధ్యాయుడు ఏర్పాటు చేసి, వయోజనులకు చదువు చెప్పించాడు. 

//సర్వోదయ ఉద్యమం //

ఇప్పటి స్వచ్చభారత్ లాంటి కార్యక్రమాన్ని 1940 - 1950 మధ్యకాలంలో "పరిశుభ్రత - ఆరోగ్యం " గా
సర్వోదయ ఉద్యమాన్ని మద్ది నారాయణరెడ్డి సొంత ఖర్చులతో కొనసాగించాడు. సర్వోదయ ఉద్యమాన్ని నారాయణరెడ్డి సర్వేల్‌ గ్రామంలో ప్రారంబించాడు. తన సర్వోదయ కార్యక్రమాల్లో ఉద్యోగులను నియమించి వారికి తగిన వేతనాలు చెల్లించి ఇంటింటికి వెళ్లి శుభ్రతను తనిఖీ చేసే బాధ్యతలు అప్పగించాడు .ఈ విధంగా అవిద్య, అనాగరికం , ప్రబలి ఉన్న గ్రామాల్లో స్వచ్ఛత కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి అణగారిన వర్గాల ప్రజ ఆరోగ్యం కోసం మీరు స్వచ్ఛందంగా శ్రమించారు..గ్రామ పరిసరాలు శుభ్రంగా ఉండటంలో కృషి చేశాడు .

// కుటుంబం //

నారాయణరెడ్డి గారి భార్య దశరథమ్మ. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఒక కుమారుడు. కుమారుడు పేరు మాధవరెడ్డి. కోడలు పారిజాతమ్మ. మాధవరెడ్డి దంపతులకు ఇద్దరు కుమారులు. రుక్మారెడ్డి, విజయ్ రెడ్డి.ఒకప్పుడు దానధర్మాలతో విలసిల్లుతూ భూస్వాములుగా వెలుగొందిన  
నారాయణరెడ్డి వారసులు...ప్రస్తుతం మధ్యతరగతి
జీవితం కొనసాగిస్తున్నారు.

//అస్తమయం //

 ఉన్న ఆస్తిని గ్రామం కోసం, గ్రామ ప్రజల కోసం, పాఠశాలల నిర్మాణం కోసం దానం ఇచ్చిన అపర దాన కర్ణుడు మద్ది నారాయణరెడ్డి 1988లో కాలధర్మం చెందారు. వారి కొనసాగించిన ఉద్యమాలు, వారి ఆశయాలు, చిరస్మరణీయం.

--------------------------------------------------------------------
వ్యాసం రాయడంలో సహకారం అందించిన మద్ది నారాయణరెడ్డి కుటుంబ సభ్యులకు, సోదరుడు మన్నే నరసింహారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదములు 🙏🏿

No comments:

Post a Comment