Monday, April 15, 2024

కొండవీడు రెడ్డి రాజుల వారసత్వ ప్రదర్శనశాల

పర్యాటక కేంద్రం - కొండవీడు 
కొండవీడు రెడ్డి రాజుల వారసత్వ ప్రదర్శన శాల 
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
వ్యాసకర్త :డా. తంగెళ్ళశ్రీదేవిరెడ్డి
▪️పరిచయం :
వెయ్యేళ్ల చరిత్ర కలిగిన కొండవీడు వైభవం ఇప్పుడు పర్యాటక ప్రాభావమై వర్ధిల్లుతున్నది. భారతదేశంలో ఎన్నో చారిత్రాత్మక కోటలు ఆనాటి రాచరిక వ్యవస్థకు , పరిపాలనా విధానానికి , చరిత్రకు సాక్షిభూతాలుగా నిలబడి ఉన్నాయి. 
తెలుగు ప్రాంతాల్లో చూస్తే... తెలంగాణలో దేవరకొండ కోట, భువనగిరి కోట, ఖమ్మం కోట, గోల్కొండ కోట,
మెదక్ కోట,వరంగల్ కోట,చంద్రగఢ కోట, 
రాచకొండ కోట ప్రధానంగా కనిపిస్తాయి.
ఆంధ్రప్రదేశ్ లో గమనిస్తే...చంద్రగిరి కోట 
గండికోట,ఆదోని కోట, కొండపల్లి కోట, గుత్తి కోట,గుర్రంకొండ కోట,పెనుగొండ కోట,బొబ్బిలి కోట,
ఉదయగిరి కోట,రాయదుర్గం కోట,బనగానపల్లె కోట,
విజయనగరం కోట, వెంకటగిరి కోట మొదలైన వీటితో పాటుగా కొండవీడు కోట కనిపిస్తాయి.

ప్రస్తుతం మనం కొండవీడును గురించి చెప్పుకుంటే... కొండవీడు కోటకు సంబంధించి మూడు ప్రాంతాలు ప్రధానంగా ఉన్నాయి.
1)కొండవీటి రెడ్డి రాజుల వారసత్వ ప్రదర్శనశాల
2) కొండవీడు గిరిదుర్గం
3) రెడ్డి రాజుల కుల దైవం మూలగురమ్మ ఆలయం

1.కొండవీటి రెడ్డి రాజుల వారసత్వ ప్రదర్శనశాల :
కొండవీడు రెడ్డి రాజుల చరిత్ర అనేక ఆటుపోట్లతో కూడినది. కుటుంబ కలహాలతో శత్రు రాజుల వైరాలతో నిత్యం యుద్ధాలతో కొనసాగినది. అనేక ఒడిదుడుకులతో దాదాపు వంద సంవత్సరాలు పరిపాలన కొనసాగించారు కొండవీడు రెడ్డిరాజులు. ప్రస్తుతం వీరి సాంస్కృతిక వారసత్వ సంపదగా అఖిల భారత రెడ్డిసంక్షేమ సమాఖ్య, శ్రీశైలం వారి ఆధ్వర్యంలో " కొండవీటి రెడ్డి రాజుల వారసత్వ ప్రదర్శనశాల "నిర్మించబడింది.ఇది అధ్యయన, పరిశోధన కేంద్రం.
ఇక్కడ వివిధ కాలాల్లో, వివిధ ప్రాంతాలను పరిపాలించిన వివిధ రెడ్డి రాజుల చరిత్ర , రెడ్ల సంస్థానాల చరిత్ర , రెడ్డి పాలకులకు సంబంధించిన విగ్రహాలు , ఆనాటి శిల్పకళ, ఆనాటి నాణెములు , రెడ్డి రాజుల సంస్కృతి...సాంస్కృతిక చైతన్యానికి సంబంధించిన పెయింటింగులు, వస్తువులు మొదలగునవి భావితరాల కోసం సేకరించి భద్రపరచబడ్డాయి.

 ▪️ఏ విధంగా చేరుకోవాలి
 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పల్నాడు జిల్లా, యడ్లపాడు మండలంలో కొండవీడు పర్యాటక ప్రదేశం ఉంటుంది.. గుంటూరుకు 20 కి.మీ.దూరంలో ఉంటుంది.గుంటూరు నుండి బయలుదేరాక , ఫిరంగిపురం , హౌస్ గణేష్ గ్రామాల నడుమ పంట పొలాల మధ్య " కొండవీడు రెడ్డి రాజుల వారసత్వ ప్రదర్శన శాల " ఒంటరిగా గంభీరంగా కనిపిస్తుంది. ప్రతి శుక్రవారం సెలవు ఉంటుంది.. ప్రవేశ రుసుము పది రూపాయలు మాత్రమే.

▪️కొండవీడు ప్రదర్శన శాల - వివరాలు 

 కొండవీటి రెడ్డి రాజులు రాజధానిగా చేసుకుని పరిపాలించిన కొండవీడు గిరిదుర్గం చేరుకోకముందే, మనకు ప్రదర్శనశాల కనిపిస్తుంది. ఈ ప్రదర్శనశాల భవనాన్ని 30 వేల చదరపు అడుగులతో, మూడు అంతస్తులుగా ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. కొండవీడు అభివృద్ధి కమిటీ ఇక్కడ అంకితభావంతో పనిచేస్తున్నది. ప్రదర్శనశాల ముందు భాగంలో, ఒకవైపు నీలం సంజీవరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మరొకవైపు వరుసగా అవచి తిప్పయ్య శెట్టి, అనవేమారెడ్డి, శ్రీనాథ కవి సార్వభౌముడు, నందీశ్వరుడు, నాయకురాలు నాగమ్మ, గోన బుద్ధారెడ్డి విగ్రహాలను ఏర్పాటు చేశారు.

ఆ తర్వాత విశాలమైన ప్రాంగణంలో విగ్రహాలను సేకరించి ఆరుబయటే ప్రదర్శించారు. వీటిలో చాలా విగ్రహాలు శిథిలమై ఉన్నాయి. వీటిలో కొన్ని విగ్రహాలు కాలక్రమంలో కొన్ని శిథిలమై పోగా.. మరికొన్ని విగ్రహాలు ముస్లిం రాజుల దండయాత్రలో శిథిలమైపోయాయి. ఈ విగ్రహాలు అన్నీ కూడా అతి ప్రాచీనమైనవి. 13, 14, శతాబ్దాలకు చెందినవి. కొండవీడు సమీప గ్రామాల్లోనూ, పంట పొలాల్లోనూ, కొండవీడు కోటలో ఘాట్ రోడ్డు నిర్మిస్తున్న సమయంలోను ఈ విగ్రహాలు లభ్యమయ్యాయి.
ఈ విగ్రహాలు కొన్ని కొండవీడు రెడ్డి రాజుల పరిపాలన కాలంనాటివిగా మరికొన్ని , విజయనగర రాజుల కాలం నాటివిగా పురావస్తు శాస్త్రజ్ఞులు పేర్కొంటున్నారు. విగ్రహాలు ఎవ్వరివి? ఏ కాలం నాటివి? వంటి వివరాలను స్పష్టంగా ప్రతి విగ్రహం ముందు చెప్పి ఉన్నారు. శాసన స్తంభాలు, ద్వార బంధాలు, దేవత మూర్తులు , దేవత గణాలు ఈ విగ్రహాల్లో ఉన్నారు.
ఈ విగ్రహాలకు ఒకపక్కగా ప్రజాకవి యోగి వేమన విగ్రహాన్ని ప్రతిష్టించారు.
వారసత్వ ప్రదర్శనశాల ప్రాంగణంలో ఉన్న  నిలువెత్తు విగ్రహాలను గమనిస్తే....

1. నీలం సంజీవరెడ్డి :
ఆంధ్రరాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా, సంయుక్త మద్రాసు రాష్ట్రంలో మంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, లోక్‌సభ సభాపతిగా,కేంద్రమంత్రిగా,
భారత రాష్ట్రపతిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వివిధ పదవులను అలరించారు.

2. అవచితిప్పయ్య శెట్టి :
ముస్లిం దాడులలో శిథిలమైన మోటుపల్లి ఓడరేవును కొండవీటి రెడ్డి రాజు అనపోతారెడ్డి పునర్నిర్మించి పూర్వ వైభవాన్ని చేకూర్చాడు. నావికులకు వర్తకులకు ప్రోత్సాహాలు ఇప్పించాడు . తద్వారా ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరచి చరిత్రలో చిరస్థాయిగా నిలిచాడు.అవచి తిప్పయశెట్టి ఈవాణిజ్యంలో ప్రముఖపాత్ర వహించాడు. అన పోతారెడ్డి తర్వాత అనవేమారెడ్డి ఆ తర్వాత కుమారగిరి రెడ్డి పాలనకు వచ్చారు శ్రీనాథుడి 'హరివిలాసం' గ్రంథం ప్రకారం కుమారగిరిరెడ్డి కాలంనాటి వసంతోత్సవాలను అవచి తిప్పయ్య శెట్టి నిర్వహించాడు.

3.శ్రీనాథ కవి సార్వభౌముడు :
కొండవీడును 1402 నుండి 1420 వరకు పాలించిన  
పెదకోమటి వేమారెడ్డి ఆస్థానకవిగా, ఆ తర్వాత పాలనకు వచ్చిన రాచవేమారెడ్డి( 1420 - 1424)ఆస్థాన కవిగా కూడా పనిచేశాడు. కొండవీడు పతనం తర్వాత రాజమహేంద్రవరం రెడ్డి రాజుల దగ్గర కూడా ఆస్థాన పండితుడిగా కొంతకాలం పని చేశాడు.

4.అనవేమారెడ్డి
అనవేమారెడ్డి రెడ్డి రాజ్య ఔన్నత్యాన్ని తన విజయాల ద్వారా ప్రతిష్టించాడు.కృష్ణానది ముఖద్వారమైన దివిసీమను జయించాడు.ఇతడి రాజ్యం శ్రీశైలం నుంచి తూర్పు సముద్రం, సింహాచలం నుంచి నెల్లూరు వరకు వ్యాపించింది. ఇతడికి ధూరికాసహాయ ప్రజాపరిచిత, చతుర్విదోపాయ వంటి బిరుదులున్నాయి.

5. నందీశ్వరుడు :
14వ శతాబ్దానికి చెందిన ఈ నంది విగ్రహం కోట గ్రామం,యడ్లపాడు మండలం,గుంటూరు జిల్లాలో లభ్యం అయ్యింది.

6.నాయకురాలు నాగమ్మ :
తొలి మంత్రిణిగా చరిత్ర సృష్టించిన నాయకురాలు నాగమ్మ 12వ శతాబ్దానికి చెందిన శక్తివంతమైన మహిళ. గుంటూరు జిల్లాలోని పలనాడు పాలకుడు నలగామ రాజు పాలనలో మంత్రిగా కొనసాగింది. ఈమె తెలంగాణ రాష్ట్రం పూర్వ కరీంనగర్ జిల్లాకు చెందినది. పలనాడు ప్రాంతానికి సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితుల్లోవలస వెళ్లడం జరిగింది.

6. గోనగన్నారెడ్డి :

గోన గన్నారెడ్డి 13వ శతాబ్దానికి చెందిన వాడు . కాకతీయ సామంత రాజు గోనబుద్ధారెడ్డి కుమారుడు రాణి రుద్రమ దేవికి సైనిక అధిపతి. వర్ధమానపురంను పరిపాలించాడు.

▪️ వారసత్వ ప్రదర్శనశాల లోపలి భాగం :
 వారసత్వ ప్రదర్శనశాల లోపలికి ప్రవేశించగానే మూడు అంతస్తుల్ని మూడు విభాగాలుగా విభజన చేసి, వాటికి పేర్లు కేటాయించి ఉన్న సూచికలు కనిపిస్తాయి. అవి - 

I. పలానాటి నాగమ్మ విభాగము
II. రేచర్ల రుద్రారెడ్డి విభాగం
III. ప్రోలయవేమారెడ్డి విభాగం

//పలానాటి నాగమ్మ విభాగము //

రెడ్డి రాజులకు, రెడ్ల సంస్థానాలకు, రెడ్డి వీరులకు, రెడ్డి నాయకులకు సంబంధించిన విలువైన చారిత్రక సామాజిక రాజకీయ సమాచారం ఈ విభాగంలో పొందుపరచబడి ఉన్నది. వివరాల్లోకి వెళ్తే...
 
1 ) రెడ్డి రాజులు పరిపాలించిన వివిధ ప్రాంతాల్లో దొరికిన 13, 14, 15 శతాబ్దాల కాలం నాటి ప్రాచీన శిలావిగ్రహాలు ప్రదర్శనలో ఉన్నాయి. వీటిలో ద్వార పాలకుల్లో ఒకరైన విజయ, గణేశ, శివ, చాముండేశ్వరి, లక్ష్మి, సీత, లక్ష్మణ, గజలక్ష్మి వీరభద్ర, భద్రకాళి, హిరణ్య కశ్యప సంహారం, శివ ద్వారపాలకులు మొదలగు విగ్రహాలు ఉన్నాయి.
2) రెడ్డి రాజుల కులదైవం మూలాంకురేశ్వరిదేవి కథనాన్ని ఇదే విభాగంలో పొందు పరచి ఉన్నారు.

3) వివిధ ప్రాంతాలను పాలించిన వివిధ రెడ్డి రాజుల వంశక్రమాలు, పట్టికలుగా పరిచయం చేయడం జరిగింది. వీరిలో కాకతీయ సామంత రాజులైన రేచర్ల,చెరుకు, మాల్యాల, విరియాల, గోన,వావిలాల, రెడ్ల వివరాలు ఉన్నాయి. కొండవీటి రెడ్డి రాజుల సామంతులైన కొప్పుల, కోరుకొండ, రెడ్ల వివరాలు ఉన్నాయి. అట్లాగే కొండవీటి రెడ్డి రాజుల వివరాలు ... వారి బంధువులు సామంతులు అయిన కందుకూరి రాజమహేంద్రవరం రెడ్ల వివరాలు ఉన్నాయి. ఈ రాజులు కట్టించిన కోటలు, ఆలయాలు, పరిపాలించిన ప్రాంతాలు చిత్రాలతో సహా ప్రదర్శించడం కూడా జరిగింది.

4) 1364 నుండి 1386 వరకు పరిపాలించిన అనవేమారెడ్డి 1376 లో వేయించిన తామ్ర శాసనాలను ప్రదర్శించడం జరిగింది.

5) పూర్వా మధ్య ప్రాచీన శిలా యుగంలో ఆదిమానవుడు వాడిన రాతి గొడ్డళ్ళను, రెడ్డి రాజుల కాలం నాటి విసుర్రాయి వంటి ప్రాచీన వస్తువులను సేకరించి ఉంచారు. 10 , 18 వ శతాబ్దానికి చెందిన రాతి ఫిరంగి గుండ్లు కూడా ప్రదర్శనలో ఉంచారు. ఇది గుంటూరు జిల్లా పుట్టకోట వద్ద లభ్యమయ్యాయి.

6) 14వ శతాబ్దంలో నిర్మించిన శత్రుదుర్భేద్యమైన గిరిదుర్గం కొండవీడు కోట నమూనాను ఇదే విభాగంలో ప్రదర్శనకు ఉంచారు. కొండవీడు కోటలో ఉన్న పొడవైన ప్రాకారాలు, బురుజులు ముఖద్వారాలు, మండపాలు, ఆలయాలు, చెరువులు ఈ నమూనాలో మనం గమనించవచ్చు..

7) తెలంగాణ ప్రాంతంలో నిజాం ఏలుబడిలో కొనసాగిన మొత్తం 14 సంస్థానాలకు గాను, నాలుగు అతిపెద్ద రెడ్ల సంస్థానాలైన అమరచింత ఆత్మకూరు సంస్థానం, గద్వాల సంస్థానం, వనపర్తి సంస్థానం, దోమకొండ సంస్థానం లను చిత్రాలతో సహా పరిచయం చేయడం జరిగింది.

8) 1866- 68 ప్రాంతంలో రాయలసీమలో సంభవించిన కరువు కాలంలో తన ఆస్తినంతా ధారపోసి ఎంతోమంది ప్రాణాల్ని కాపాడిన మహాదాత
 బుడ్డా వెంగళ్ రెడ్డి వివరాలు పొందు పరిచారు 
అట్లాగే 1857 నాటి మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధానికి పదేళ్ళ ముందే, బ్రిటిషు దుష్టపాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి-- వివరాలను పరిచయం చేశారు.బుడ్డా వెంగల్ రెడ్డి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఈ ఇద్దరినీ రేనాటి సూర్యులుగా పేర్కొంటారు.

II రేచర్ల రుద్రారెడ్డి విభాగం :

 కాకతీయ సామంతరాజు రేచర్ల రుద్రారెడ్డి పేరు మీద ఏర్పాటు చేసిన విభాగంలో పొందుపరచబడిన సమాచారాన్ని ఒకసారి గమనిస్తే వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

1. వారసత్వ ప్రదర్శనశాల రేచర్ల రుద్రారెడ్డి
విభాగంలోకి ప్రవేశించగానే , ఎత్తైన రేచర్ల రుద్రారెడ్డి
 కాంశ్య విగ్రహం దర్శనమిస్తుంది .. కాకతీయ సామ్రాజ్యంలో వీరి పాత్ర ఎంతో కీలకమైనది. వీరి తండ్రి రెండవ కాటచమూపతి. మొదటి ప్రతాపరుద్రుడు వద్ద సర్వ సైన్యాధ్యక్షుడు. వీరి కుమారుడుగా రుద్రారెడ్డి కూడా రాజ్యం రక్షణవ్యవస్థలో సేనానిగా ఉంటాడు. రెండవ ప్రతాపరుద్రుడి తరువాత పాలనకు వచ్చిన మహాదేవుని కుమారుడైన గణపతిదేవుడుని చెరనుండి విడిపిస్తాడు..సేనాధిపతిగా రేచెర్ల రుద్రారెడ్డి తన శక్తియుక్తులు ధారపోసి కాకతీయ రాజ్యాన్ని కాపాడుతాడు. కాబట్టే రుద్రారెడ్డికి 
"' కాకతి రాజ్య సమర్థ "' " కాకతీయ రాజ్య భార దౌరేయ" బిరుదులు ఉన్నట్టు దాక్షారామ ఉప్పరపల్లి శాసనాల ద్వారా తెలుస్తున్నది....

2.రెడ్డి రాజుల కాలం నాటి పందిరి మంచం ఉన్నది. బహుశా ఇది ఆనాటి నమూనా కావొచ్చు.

3.
బెజవాడ గోపాల్ రెడ్డి
(ఆంధ్ర రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రి, ఉత్తమ్ర ప్రదేశ్ మాజీ గవర్నర్ )
కాసు బ్రహ్మానందరెడ్డి
(ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి )
డా. మర్రి చెన్నారెడ్డి
( ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి)
భవనం వెంకట్రామిరెడ్డి
( ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి)
 నేదురుమల్లి జనార్దన్ రెడ్డి
( ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి)
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి
( భారత తొలి స్వాతంత్ర సమరయోధుడు )
రాజ బహదూర్ వెంకటరామిరెడ్డి
( రెడ్డి హాస్టల్ వ్యవస్థాపకులు)ల విగ్రహాలు వరుసగా ఏర్పాటు చేయబడ్డాయి.
డా. మర్రి చెన్నారెడ్డి
( ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి)
భవనం వెంకట్రామిరెడ్డి
( ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి)
 నేదురుమల్లి జనార్దన్ రెడ్డి
( ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి)
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి
( భారత తొలి స్వాతంత్ర సమరయోధుడు )
రాజ బహదూర్ వెంకటరామిరెడ్డి
( రెడ్డి హాస్టల్ వ్యవస్థాపకులు)ల విగ్రహాలు వరుసగా ఏర్పాటు చేయబడ్డాయి.
4..కిరాతార్జునీయం చిత్రమాలికలు ఏర్పాటు చేయబడ్డాయి.

5.. కొండ కింద గోపినాథ ఆలయం నుండి కొండవీడు కోట దృశ్యాన్ని 1788 నాటి మేకంజీ చిత్రం ఉన్నది.

6. గిరిదుర్గం కొండవీడులో శిథిలాలుగా మిగిలి ఉన్న కొండవీటి రెడ్డి రాజుల కాలం నాటి నిర్మాణాలను చిత్రాలుగా ప్రదర్శించారు. వాటిలో
√ కొండవీడు విహంగ వీక్షణం
√ ఘాట్ రోడ్డు నిర్మాణం 
√ వేమన మండపం
√వరాల కొట్టు
√నరసింహస్వామి ఆలయం
√ శివాలయం 
√ తారా బురుజు
√ మిరియాల చట్టు బురుజు
ఇంకా ప్రాకారాలు, ముఖద్వారాలు, మండపాలు, , మొదలగునవి ఉన్నాయి. రెడ్డి రాజుల తరువాత నిర్మించిన మసీదు చిత్రపటం కూడా ప్రదర్శించబడింది.

7. కొండవీడు కోట దిగువ భాగంలో ఉన్న కత్తుల బావి అని పిలవబడే గోపినాథ స్వామి ఆలయం చిత్రాలు ఉన్నాయి.

8. బుడ్డా వెంగళ్ రెడ్డి దానగుణానికి మెచ్చి విక్టోరియా మహారాణి సమర్పించిన బంగారు చేతి కంకణం చిత్రాన్ని, అందుకు సంబందించిన వివరాలను పొందుపరిచారు.

9.వీరగల్లుల చిత్రాలు కూడా గోడ పొడవునా ప్రదర్శించారు. వీరుల గురుతుగా వేయించిన శిలలు వీరగల్లులు. పూర్వం వీరగల్లులు అందరి రాజుల కాలంలో మనుగడ సాగించారు. రెడ్డిరాజుల కాలంలోనూ ఇష్ట దైవాల కోసం, రాజుల కోరికలు నెరవేరడం కోసం, ఆత్మత్యాగం చేసుకునే దురాచారం ఉండేది. ఇటువంటి వారి కోసం రాజ్యంలో "చంపుగుడులు " ఉండేవి. చంపు గుడుల ముందు ఆత్మత్యాగం చేసుకునే వీరుల గురుతుగా రాజులు శిలలు వేయించేవారు. అట్లాగే గ్రామాలను క్రూర మృగాల నుండి దోపిడీ దొంగల నుండి కాపాడుతూ ప్రాణాలు కోల్పోయే వాళ్ళు . ఈ వీరుల గురుతుల్ని కూడా రాజులు శిలలుగా వేయించేవారు.

8) 1949 నాటి శ్రీశైలం రూపురేఖలు, 1950 నాటి అమరావతిలోని అమరేశ్వరాలయం రూపురేఖలు ప్రదర్శించబడ్డాయి.

III ప్రోలయ వేమారెడ్డి విభాగం :

 ప్రోలయ వేమారెడ్డి పేరు మీద ఏర్పాటు చేసిన 
విభాగంలో పొందుపరచబడిన సమాచారాన్ని ఒకసారి గమనిస్తే వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

1) వారసత్వ ప్రదర్శనశాల ప్రోలయ వేమారెడ్డి విభాగంలోకి ప్రవేశించగానే , ఎత్తైన ప్రోలయ వేమారెడ్డి కాంశ్య విగ్రహం దర్శనమిస్తుంది.స్థల దుర్గం అద్దంకిని రాజధానిగా చేసుకుని 1324లో స్వతంత్ర రెడ్డి రాజ్యాన్ని స్థాపించాడు ప్రోలయ వేమారెడ్డి . ఇతడి పరిపాలనా కాలం 1324- 1353 వరకు కొనసాగింది. ఇతడి హయాంలోనే కొండవీడు గిరి దుర్గానికి అంకురార్పణ పలకడం జరిగింది.

2) విభాగం ముఖద్వారానికి ఒకవైపు గోడ మొత్తాన్ని ఆక్రమిస్తూ కొండవీడును 1386 - 1402 వరకు పాలించిన కుమారగిరిరెడ్డి కాలంలో నిర్వహించబడిన వసంతోత్సవాల కాంశ్య చిత్రం కనిపిస్తుంది. వసంతోత్సవాలని తన రాజ్యంలో అంగరంగ వైభవంగా జరిపినందున కుమారగిరి రెడ్డికి " కర్పూర వసంత రాయలు అనే బిరుదు వచ్చినట్టుగా చరిత్ర చెబుతున్నది..

3) మొదటి గోనబుద్ధారెడ్డి కుమారుడైన గోన విఠల రంగనాథుడి కుమారుడు రెండవ గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణం రచిస్తున్నదృశ్యాన్ని కాంశ్య చిత్రంగా ఈ విభాగంలో ప్రదర్శించారు.
4) రేచర్ల బేతిరెడ్డి సతీమణి ఎరుకసాని ఆశ్రమ విద్యాలయానికి భూధానం ఒసంగిన నమునా చిత్రం ప్రదర్శించబడింది.

5) రెడ్డి రాజుల నిర్మించిన, సంరక్షించిన, పోషించిన ఆలయ సమాచార ఉన్నది. వాటిని గమనిస్తే...

▪️రేచర్ల రెడ్డి రాజులు నిర్మించిన ఆలయాల చిత్ర పటాలు ప్రదర్శించారు. వాటిలో - కాకతీయ సామంత రాజు రేచర్ల రుద్రారెడ్డి నిర్మించిన రామప్ప గుడికి సంబంధించిన శిల్పకళ, ఆలయ నిర్మాణ శైలి ప్రత్యేకంగా ప్రదర్శించబడ్డాయి.
√ రుద్రారెడ్డి దంపతులుగా చెప్పబడుతున్న జంట శిల్పాలు
√ రామప్ప గుడిలోని నంది మండపం
√ రామప్ప గుడిలోని రంగ మండపం
√ ద్వారా పాలికగా చెప్పబడుతున్న సుందరి విగ్రహం
√ రామప్ప గుడి ఆలయ శిఖరం
√ రామప్ప గుడిలోని రుద్రేశ్వరాలయం
 మొదలగున్నవి ఇక్కడ ప్రదర్శించబడ్డాయి.

రేచర్ల రాజులే నిర్మించిన ఎలకుర్తిలోని రుద్రేశ్వరాలయం, పిల్లలమర్రి ఆలయంలోని శివపార్వతుల వర్ణ చిత్రం ఉన్నాయి.

▪️ కోరుకొండ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం
▪️ ద్రాక్షారామంలో నిర్మించబడిన భీమేశ్వరాలయం
మొదలగు ఆలయాల సమాచారం ఉన్నది.

6) రెడ్డి రాజులు కాలం నాటివే కాకుండా, పూర్వం వివిధ రాజుల కాలంలో, ఉపయోగించిన రాతి బ్లేడ్లు కత్తులు వంటి ఆయుధాలు ఉన్నాయి. నిజాం,బ్రిటిష్ కాలాల్లో ఉపయోగించిన వెండి రాగి నాణెములు ప్రదర్శించబడ్డాయి.

7)విభాగం ముఖద్వారానికి ఒకవైపు గోడ మొత్తాన్ని ఆక్రమిస్తూ మోటుపల్లి ఓడరేవు కాంశ్య చిత్రపటం కనిపిస్తుంది. ప్రకాశం జిల్లా చిన్నగంజాం మండలంలో చారిత్రాత్మకమైన ఓడరేవు మోటుపల్లి ఉన్నది. కాకతీయుల కాలంలో, కొండవీటి రెడ్డి రాజుల కాలంలో, ఈ ఓడరేవు సముద్ర వ్యాపారానికి, రాజ్యం ఆర్థిక అభివృద్ధికి, ఎంతగానో దోహద పడింది.

8)1386- 1402 వరకు పాలించిన కుమారగిరిరెడ్డి ఆస్థానంలో లకుమాదేవి అనే ఒక నాట్యగత్తే ఉండేది. ఆమె నాట్య ప్రదర్శనను తెలిపే చిత్రం కూడా ఈ విభాగంలో పొందుపరచబడి ఉన్నది.
 ఆమె అద్భుత నాట్యగత్తే. ఆమె ప్రేరణగా కుమారగిరి రెడ్డి నాట్యశాస్త్రం రచించాడు. కుమారగిరిరెడ్డి వేదిక మీద ఆసీనుడై ఉండగా, మండపంలో ఆమె నాట్యం చేస్తున్న దృశ్యం రమనీయంగా ఉన్నది.

9)పెద్ద కోమటి వేమారెడ్డి (1402-1420) ఆస్థానకవిగా.... విద్యాధికారిగా.... పనిచేసిన శ్రీనాథ కవి సార్వభౌముడురచించిన రెడ్డి రాజుల ప్రశస్తిని తెలిపే పద్యాలు తాత్పర్యంతో పాటుగా ఇక్కడ పోస్టర్లుగా ప్రదర్శించారు..

No comments:

Post a Comment