Tuesday, April 16, 2024

అనుముల రేవంత్ రెడ్డి( జడ్పిటిసి నుండి ముఖ్యమంత్రి వరకు )

అనుముల రేవంత్ రెడ్డి
( జడ్పిటిసి నుండి ముఖ్యమంత్రి వరకు )
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
చరిత ఛిద్రమైన చోటే చరిత్ర తిరగరాసాడు 
సర్వం కూలిన చోటే సవాళ్లు స్వీకరించాడు ...
శాసించిన కాలం ముందు శాసనమై నిలబడ్డాడు 
నీరసించిన కేతనానికి కొత్త శ్వాసను అందించాడు...
అనుముల రేవంత్ రెడ్డి...!

▪️వివరాల్లోకి వెళ్తే....
 ఉమ్మడి పాలమూరు జిల్లా వంగూర్‌
మండలం కొండారెడ్డిప‌ల్లి వాస్తవ్యులైన అనుముల న‌ర్సింహరెడ్డి, రామ‌చంద్ర‌మ్మ‌ దంపతులకు రేవంత్ రెడ్డి న‌వంబ‌ర్ 08, 1968న జ‌న్మించారు. వీరిది వ్య‌వ‌సాయ కుటుంబం. రేవంత్ రెడ్డి తోబుట్టువులు మొత్తం ఏడుగురు అన్నదమ్ములు.ఒక సోదరి.
 కొండారెడ్డి పల్లెలో ఇప్పటికీ వీరిది ఉమ్మడి కుటుంబం. ఉద్యోగాల రిత్యా...వ్యాపారాల రిత్యా... రాజకీయాల రీత్యా... వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్నప్పటికీ ప్రతి దసరా పండుగకు అందరూ కొండారెడ్డిపల్లెలో కలుసుకుంటారు. గ్రామస్తులతో మమేకమై దసరా పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు.

//అందరి కంటే పెద్దవాడు భూపాల్ రెడ్డి. ఇతడు రిటైర్డ్ ఎస్సై. తండ్రి మరణించడంతో తానే తండ్రి పాత్ర వహించాడు. తమ్ముళ్ల బాధ్యతల్ని స్వీకరించి వాళ్లను చదివించి ప్రయోజకుల్ని చేశాడు. ప్రస్తుతం వీరు దివంగతులు .
//రెండవ అన్న కృష్ణారెడ్డి. వీరు కూడా దివంగతులయ్యారు.
వీరి సతీమణి కొండారెడ్డి పల్లెకు సర్పంచ్ గా పనిచేసింది.
//మూడో అన్న తిరుపతిరెడ్డి. ఇతడు కొడంగల్ కాంగ్రెస్ పార్టీకి తన సేవలు అందించాడు.
//నాల్గొవ అన్న జగదీశ్వర్ రెడ్డి. ఇతడు యూఎస్‌లో స్ధిరపడ్డాడు. 
//ఐదో వాడు రేవంత్ రెడ్డి.
/తరువాత కొండల్ రెడ్డి. హైదరాబాద్ లో వ్యాపారస్తుడు.
//మరో సోదరుడు కృష్ఱారెడ్డి. ఇతడు కూడా హైదరాబాద్‌లో వ్యాపారస్తుడు .ఇతడు బర్కత్‌పుర డివిజన్‌కు టీడీపీ తరపున ఎంసీహెచ్‌ కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓడిపోయాడు.

 ▪️దేశపటంలో కొండారెడ్డి పల్లి :

 రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లి పేరు ఇప్పుడు దేశ పటంలో కనిపిస్తున్నది. ఈ గ్రామంలో తమ పూర్వీకులు నిర్మించిన ఇల్లు పాతబడడంతో ఇంటి స్థానంలో విశాలమైన కొత్త ఇంటిని తమ నాయనమ్మ రంగమ్మ పేరు మీద " రంగమ్మ నిలయం " గా నిర్మించారు.

▪️ చదువు - నాయకత్వ లక్షణాలు

రేవంత్ రెడ్డి తన ప్రాథమిక విద్య ఐదవ తరగతి వరకు కొండారెడ్డిపల్లెలో చదివాడు. తర్వాత తాండ్ర గ్రామంలో చదివాడు. జడ్పీ స్కూల్, ఇంటర్ మీడియట్, వనపర్తిలో చదివాడు. 1983 - 85 సంవత్సరాల్లో ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో గొప్పగా ఆర్ట్ వేసేవాడు..బ్యానర్లు కూడా రాసేవాడు. ఇంటర్ కళాశాలలో CR (Class representative)గా ఉండేవాడు.

ఆ తరువాత ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యం అనుబంధ
ఆంధ్ర విద్యాలయ ( AV )కళాశాలలో ఫైన్ ఆర్ట్స్ లో 1989 - 1992 సంవత్సరాల్లో గ్రాడ్యూయేష‌న్ చదివాడు. ఈ స‌మ‌యంలోనే అఖిల భార‌త విద్యార్థి ప‌రిష‌త్ (ABVP )నాయ‌కుడిగా కొనసాగాడు.విద్యార్థి ఉద్యమాలు నిర్వహించారు. తర్వాత ఎల్.ఎల్.బి డిస్కంటిన్యూ చేశాడు.

AV కళాశాలగా ప్రసిద్ధి చెందిన 
 ఆంధ్ర విద్యాలయ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ వ్యవస్థాపకుడు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు తెలంగాణ పోరాట యోధుడు కొండా వెంకట రంగారెడ్డి గారు. వీరు 1944 లో అప్పట్లో కట్టెలమండి అని పిలవబడే గగన్ మహల్ లో ఒక చిన్న పాఠశాలగా ప్రారంభించి అంచెలంచలుగా అభివృద్ధి చేస్తూ వచ్చారు.. బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెలగోపీచంద్,
ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుభాష్ రెడ్డి ,వంటి ప్రముఖులు ఈ కళాశాలలోనే చదువుకున్నారు.

▪️ప్రేమ - పెళ్లి - కొన్ని ఒడిదుడుకులు : 

సీనియర్ కాంగ్రెస్ నాయ‌కుడు దివంగత జైపాల్ రెడ్డి గారి తమ్ముడి కూతురు గీతారెడ్డిపై తాను విద్యార్థి దశలో ఉన్నప్పుడే మనసు పడ్డాడు. అప్పుడు గీత ఇంటర్మీడియట్ స్టూడెంట్. గీతారెడ్డి కజిన్ కి రేవంత్ రెడ్డి స్నేహితుడు కావడం...అవిధంగా అందరూ కలిసి ఒకానొక సందర్బంగా నాగార్జునసాగర్ విహారయాత్రకు వెళ్లడం.... అక్కడ బోట్ రైడింగ్ లో మొదటిసారిగా పరిచయం జరిగింది. తర్వాత కజిన్ వాళ్ళ ఇంటికి రేవంత్ రెడ్డి తరచు వస్తూపోతూ ఉండటం ...ఈ క్రమంలో పరిచయమే ప్రేమగా మారడం జరిగింది.

గీతారెడ్డి వాళ్ళది మొదటి నుండి స్థితిమంతుల కుటుంబం. తండ్రి హోల్ సేల్ కిరోసిన్ డీలర్. . పెదనాన్న పేరెన్నికయిన రాజకీయనాయకుడు. కానీ రేవంత్ రెడ్డిది సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబం. ఆర్థికంగా పెద్దగా అభివృద్ధి చెందలేదు కాబట్టి గీతారెడ్డి కుటుంబం నుండి వీరి పెళ్లికి అభ్యంతరం ఎదురయ్యింది. ఈ పరిస్థితిలోనే గీతారెడ్డిని పై చదువుల కోసం ఢిల్లీ పంపించారు. అక్కడ ఆమె B.A మ్యాథమెటిక్స్ చదువుకున్నారు.

మూడు నాలుగు సంవత్సరాల ఎడబాటు తర్వాత కూడా ఇద్దరి మనస్తత్వాల్లో మార్పు రాలేదు. ఈ పరిస్థితిలో రేవంత్ రెడ్డి యోగ్యతను గుర్తించి పెద్దలు పెళ్లికి ఒప్పుకున్నారు. పైగా ఇద్దరి సామాజిక వర్గం ఒకటే కావడం మూలాన పెళ్లికి అడ్డంకులు తొలగిపోయాయి.1992లో వీరి వివాహం పెద్దల సమక్షంలో జరిగింది అప్పుడు రేవంత్ రెడ్డి వయసు 24 ఏళ్లు గీతారెడ్డి వయసు 23 ఏళ్లు .  

▪️రాజకీయాలకు ముందు

విద్యార్థి దశలో ఏబీవీపీ నాయకుడిగా కొనసాగిన రేవంత్ రెడ్డి జీవిత లక్ష్యం ప్రత్యక్ష రాజకీయాల్లో ఎదగడం. కానీ డిగ్రీ పూర్తయి బయటికి వచ్చాక ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెంటనే ప్రవేశించలేదు.ముందుగా ఆర్థికంగా నిలదొక్కుకునే ప్రయత్నం చేసాడు. ఈ క్రమంలో 1993 నుండి 2001 వరకు రాజకీయాలతో సంబంధం లేకుండా 8 సంవత్సరాల కాలం వివిధ రంగాల్లో కొనసాగాడు.
//RSS అనుబంధ పత్రిక జాగృతిలో కొంతకాలం జర్నలిస్టుగా పనిచేశారు.
//యాడ్ ఏజెన్సీ నిర్వహించాడు.
// పేయింటింగ్ వర్క్స్ కాంట్రాక్టులు కొనసాగించాడు.
// ప్రింటింగ్ ప్రెస్ నిర్వహించారు.
// 1999 లో జూబ్లీహిల్స్జూబ్లీహిల్స్‌ కోఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు.
// రియల్ ఎస్టేట్ రంగంలో కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్ గా కొంతకాలం కొనసాగారు.

▪️కుటుంబం

 రేవంత్ రెడ్డి దంపతులకు ఏకైక సంతానం నైమిషారెడ్డి. ఈమెకు వివాహం అయ్యింది. అల్లుడు సత్యనారాయణరెడ్డి. ఇతడు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణానికి చెందిన రెడ్డి & రెడ్డి మోటార్స్ అధినేత వెంకట్ రెడ్డి లక్ష్మీపార్వతి దంపతుల కుమారుడు. రేవంత్ రెడ్డికి మనువడు జన్మించాడు. పౌరుషం ఉట్టిపడేట్టుగా
" రుద్రదేవ్ రెడ్డి " అని నామకరణం చేశారు.

▪️స్ఫూర్తినిచ్చిన నాయకులు

"1985 లో విజయవాడలో బిజెపి రాజకీయ సభలో వాజపేయి గారిని చూసి, సభలో వారికి వస్తున్న ఆదరణ చూసి, నాయకుడంటే ఈ విధంగా ఉండాలి... ఈ విధంగా జనం నుండి జేజేలు అందుకోవాలి..అనుకున్నాను. ఆ విధంగా వాజ్పేయి నుండి నేను స్ఫూర్తి పొందాను" అని teluguone కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా పేర్కొన్నారు.

 " వాజ్పేయి తర్వాత బాల్ ఠాక్రేని చూసి స్ఫూర్తి పొందాను.
 ఆయనకు రాజకీయంగా ఏ పదవి లేదు...కానీ రాజకీయ నాయకుల రిమోట్ కంట్రోల్ తన చేతుల్లో ఉంటుంది. ఆ గట్స్ నాయకుడిలో ఉండాలి. నాయకుడు అంటే ఆ విధంగానే ఉండాలి... "అని కూడా teluguone కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా పేర్కొన్నారు.

▪️రాజకీయం ప్రస్థానం

2001లో తెలుగుదేశం పార్టీ నుండి బయటకు వచ్చి తెలంగాణ నినాదంతో ఉద్యమ రథసారథిగా కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించాడు. అప్పటికి రేవంత్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు....కానీ వచ్చే ఆలోచనలో ఉన్నాడు. అందరూ తన పెద్ద మామ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైపాల్ రెడ్డి ప్రోత్సాహంతో కాంగ్రెస్ పార్టీలో ప్రవేశిస్తాడు అనుకున్నారు. కాని అందరి ఆలోచనల్ని తారుమారు చేస్తూ కెసిఆర్ తెలంగాణ నినాదం రేవంత్ రెడ్డిని ఆకర్షించింది. కాబట్టి తెలంగాణ ఆకాంక్షతో 2003 లో టిఆర్ఎస్ పార్టీలో చేరాడు. ఆ విధంగా రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం 2003లో ప్రారంభమైంది.

2004 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ తరఫున కల్వకుర్తి అసెంబ్లీకి టికెట్ ఆశించాడు. కానీ కెసిఆర్ ఎడ్మ కిష్టారెడ్డికి టిక్కెట్టు కేటాయించారు. తర్వాత 2006 జడ్పిటిసి ఎన్నికల్లో కూడా టికెట్ ఆశించి భంగపడ్డ రేవంత్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీని వీడాడు .

2006లో స్థానిక సంస్థల ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా మిడ్జిల్ మండలం నుండి ZPTC సభ్యునిగా ఎన్నికయ్యారు. 

2007లో స్వతంత్ర అభ్యర్థిగా రేవంత్ రెడ్డి శాసనమండలి సభ్యునిగా (ఎమ్మెల్సీ) ఎన్నికయ్యారు . ఈ ఎన్నికతో రేవంత్ రెడ్డి అన్ని రాజకీయ పార్టీల దృష్టిని ఆకర్షిస్తూ వార్తల్లోకెక్కడు..అప్పటినుండే అతడి పేరు క్రమంగా మారుమోగుతూ వచ్చింది .

2007 లోనే తెలుగుదేశం పార్టీలో చేరారు

2009 ఎన్నికల్లో, 2014 ఎన్నికల్లో టీడీపీ తరుపున కొండగల్ నియోజకవర్గం నుండి రెండు సార్లు పోటీ చేసి గుర్నాథ్ రెడ్డి మీద గెలుపొందారు.2014-2017 మధ్య టీడీఎల్పీ ఫ్లోర్‌ లీడర్‌గా పని చేశాడు.

కోడంగల్ ఎమ్మెల్యే గా...

1. వెనుకబడిన కొడంగల్ ప్రాంతంలో ఒకప్పుడు మెట్ట వ్యవసాయం ఎక్కువగా ఉండేది. సన్నకారు, కౌలు, రైతులు ఎక్కువగా ఉండేవారు. విద్యుత్ సమస్య తీవ్రంగా ఉండేది. తాను ఎమ్మెల్యే అయ్యాక 1000 వరకు సబ్ స్టేషన్స్ తీసుకువచ్చి విద్యుత్ సమస్యను పరిష్కరించాడు .
2. ఫ్లోరైడ్ సమస్య, నీటి సమస్య ఉండేది . ఈ సమస్యల్ని కోయిల్ సాగర్ నుండి తాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి కృషిచేసి నీటి సమస్యను పరిష్కరించాడు.
3. విద్యార్థులకు తరగతి గదులు లేక అవస్థ ఉండేది. పాఠశాలల్లో తరగతి గదుల నిర్మాణానికి కృషి చేసాడు.
4. రోడ్డు నిర్మాణాలు చేపట్టాడు.

2017లో టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

2018లో తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. అదే సంవత్సరం కొండగల్ నుండి పోటీ చేసి పట్నం నరేందర్ రెడ్డి (టి ఆర్ఎస్) చేతిలో ఓడిపోయారు.

2019 మేలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజక వర్గం నుండి పోటీ చేసి ఎంపీగా గెలిచారు.

2021లో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.

2023 నాటికి ప్రజాకర్షణ ఉన్న నాయకుడిగా ఎదిగాడు. ప్రజల భాషతో ప్రజలకు దగ్గరైనా కేసీఆర్ కు దీటుగా, అదే ప్రజల భాషలో పంచులు పేలుస్తూ...మాటల యుద్ధంలో కేసీర్ తో పోటీపడ్డాడు.ప్రజల ఆదరాభిమానాలను సంపూర్ణంగా చూరగొన్నాడు. తన తిరుగులేని నాయకత్వంలో నియోజకవర్గాలు పర్యటించి ప్రచారం చేసి ప్రత్యర్థి పార్టీ BRS ను ఓడించి,కాంగ్రెస్ పార్టీకి 65 /119 సీట్లతో తిరుగులేని విజయాన్ని సంపాదించిపెట్టాడు. ఏకగ్రీవంగా సిఎల్పి నాయకుడిగా ఎన్నుకోబడ్డాడు.

▪️విదేశీ రాజకీయ పర్యటనలు

ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థులపై 2009 లో అమానుష దాడులు జరిగాయి. ఈ విపరీత పరిస్థితుల్లో ఆనాటి తెలుగుదేశం పార్టీ నాయకుడిగా నామా నాగేశ్వరరావుతో కలిసి ఆస్ట్రేలియా పర్యటించాడు.మెల్‌బోర్న్‌ లోని భారతీయ విద్యార్థులతో సమావేశమయ్యాడు అక్కడ భారతీయ విద్యార్థుల పరిస్థితిని సమీక్షించాడు ..
ఇందులో భాగంగా అక్కడి విక్టోరియన్ పార్లమెంట్‌ను సందర్శించి, అప్పటి విక్టోరియా ప్రతిపక్ష లిబరల్ పార్టీ నాయకుడు
ఎడ్వర్డ్ నార్మన్ బైలియుతో సమావేశమయ్యాడు

▪️వాదవివాదాలు

రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం వడ్డించిన విస్తరి కాదు.. నల్లేరు మీద నడక కాదు. అడుగడుగునా ఒడిదుడుకులతో
... సవాళ్లతో... అనేక వాద వివాదాలతో ముడి పడి ఉన్నది. ఓటుకు నోటు కేసు రేవంత్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగించింది. టిఆర్ఎస్ తో వైరం రేవంత్ రెడ్డి ని అడుగడుగున ఇబ్బంది పెట్టింది. కూతురి లగ్గం ఉన్నప్పుడే రేవంత్ రెడ్డిని అరెస్టు చేయడం జైలుకు పంపించడం, అతడిని మానసికంగా కృంగదీసింది.. జీవితంలో ఎత్తుపల్లాలను....,రాజకీయంలో ప్రత్యర్థుల ఎత్తుగడల్ని....సడలని ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటూ నిర్భయంగా నిలబడటమే రేవంత్ రెడ్డి విజయ రహస్యంగా మనం చెప్పుకోవచ్చు.

▪️ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి

CR నుండి CM వరకు 

 ఇంటర్మీడియట్ చదివేటప్పుడు సి ఆర్ గా కొనసాగిన రేవంత్ రెడ్డి సీఎం వరకు ఎదగడం ఎంతో గర్వకారణంగా ఉందని స్నేహితులు సగర్వంగా చెప్పుకుంటున్నారు.

ఉమ్మడి పాలమూరు ప్రాంతం నుండి ముఖ్యమంత్రిగా ఎన్నికైన అభ్యర్థుల్లో రేవంత్ రెడ్డి రెండవవాడు. గతంలో హైదరాబాద్ రాష్ట్రానికి రెండవ / చివరి ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణారావు గారు 1952 - 1956 మధ్య కాలంలో పనిచేశారు.

ప్రస్తుతం ఒక సాదాసీదా మధ్యతరగతి రైతు కుటుంబం నుండి వచ్చిన అనుముల రేవంత్ రెడ్డి గారు, ఒక సాధారణ జడ్పీటీసీ స్థాయి నుండి ముఖ్యమంత్రి పీఠం వరకు ఎదగడం అనేది నిజంగానే స్ఫూర్తిదాయకం! తెలంగాణ రాష్ట్ర 2 ముఖ్యమంత్రిగా సీఎం పదవితో రేవంత్ రెడ్డి ఎటువంటి అడ్డుగోడలు లేకుండా పారదర్శకతతో ప్రజా బంధువుగా పరిపాలిస్తాడని ఆశిద్దాం.

వ్యాసకర్త : తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

No comments:

Post a Comment