Tuesday, April 16, 2024

మల్లు స్వరాజ్యం

మల్లు స్వరాజ్యం
 ( 1931 - 2022)
( సాయుధ పోరాట వీరురాలు )
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
వ్యాసకర్త : తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

గుండె ధైర్యం తోడు నిలవగా
నిండు గౌరవం వెంటరాగా
యుద్ద రథమై నువ్వు కదలగా
తల్లీ స్వరాజ్యమా వందనం.....
పౌరుషాగ్ని పెల్లు భికగా
ఆత్మగౌరవం సెగలు గక్కగా
 పోరు యావ పొంగి పొరలగా
అమ్మా మహోజ్వలితమా వందనం..

దూసిన దళమై...నిరసన గళమై ...విముక్తి కోసం.. అస్తిత్వం కోసం...బరిసెల్ ఎత్తి..బాకుల్ ఎత్తి... బందూకుల్ ఎత్తి...
తెలంగాణ సాయుధ పోరాటంలోకి దుంకిన యోధురాలు మల్లు స్వరాజ్యం !

▪️కుటుంబనేపథ్యం 

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామంలో 1931లో జన్మించింది. కాగా నల్లగొండ జిల్లా సూర్యాపేట తాలూకా కరివిరాల వీరి స్వస్థలం.
పోరాట స్పూర్తి కలిగిన నల్లగొండకు చెందిన ప్రముఖ సాహితీవేత్త, తెలంగాణా యోధుడు, పార్లమెంటేరియన్ భీమిరెడ్డి నరసింహారెడ్డి ఈమె సోదరుడు. 
భూస్వామ్య కుటుంబంలో పుట్టి అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పాటుబడిన ఈ తోబుట్టువుల పేదల పాలిటి పెన్నిధులు ! 

తన అన్నతో పాటు తెలంగాణ సాయుధ పోరాటంలో పాలుపంచుకొని అసమాన దైర్యసాహసాలు ప్రదర్శించిన స్వరాజ్యం, ఆనాడు ఎందరో మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. స్త్రీలు గడప దాటడమే పాపంగా వున్న రోజుల్లో వూరూర తిరిగి పాటలు పాడుతూ ఉపన్యాసాలు ఇస్తూ ప్రజల్లో చైతన్యం కోసం పాకులాడింది. 

▪️పాట_పాడితే_గుండెలు_ఆదరాల్సిందే 

      పోరాటకాలంలో వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనులను మేల్కొల్పింది. జానపద బాణీల్లో పాటలు రాసి స్వయంగా పాడి గ్రామాలలోని ప్రజలను ఆకట్టుకున్నది.
      భారతి భారతి ఉయ్యాలో
      మా తల్లి భారతి ఉయ్యాలో
      నైజాము రాజ్యాన ఉయ్యలో
      నాజి పాలనలో ఉయ్యాలో
      భూస్వాములందరూ ఉయ్యాలో
      భూమంతటిని చెరబట్టి ఉయ్యాలో ......
 వంటి పాటలు ఆమె వ్వక్తిత్వానికి..పోరోట పటిమకు..వీరత్వానికి...ప్రతిఘటనా తీవ్రతకు నిదర్శనం !

 ఆనాటి ఉద్యమకారుడు నీలరపు ఎర్రయ్య స్వరాజ్యం గురించి మాట్లాడుతూ..
'' వంగుతూ లేస్తూ బొడ్డెమ్మ ఆడటంలో మగవాళ్ళం కూడా స్వరాజ్యంతో పోటీ పడలేక అలసిపోయేవాళ్ళం. ఆమెకు మాత్రం అలసట ఉండేది కాదు. గంటల తరబడి బొడ్డెమ్మ ఆడుతూ పాటలు పాడేది.చిరుత లాగా చలాకీగా ఉండేది '' అంటూ ఆనాటి స్మృతుల్ని గుర్తుకుచేసుకునడంలో స్వరాజ్యం చైతన్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. 

▪️పోరాటమే_ఊపిరిగా 

1945-48 సంవత్సరాల్లో గెరిళ్ళా దళాలతో వీరోచిత సాయుధ పోరాటాల్లో క్రియాశీలక పాత్ర పోషించి... నైజాం సర్కారును గడగడలాడించింది. 
తిరుగులేని శక్తియై ముచ్చెమటలు పట్టించింది. రజాకార్ల ఆగడాలు ఎదుర్కుంటూ...నిలువరిస్తూ...ఎదురిస్తూ... సింహనాదమై వణిిస్తూ ...ధీశాలిగా నిలిచింది. ఈ క్రమంలో కొంత కాలం అజ్జాతంలో వుండిపోయింది. 
ఈమె పోరాటాల ధాటికి తట్టుకోలేక 1947-48లో ఈమె ఇంటిని పూర్తిగా దగ్ధం చేశారు. ఆమెను పట్టుకున్నవారికి బహుమతి ఇస్తామని కూడా అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. 

▪️వివాహం 

సాయుధ పోరాటం అనంతరం వీరి వివాహం ఉద్యమ సహచరుడు మల్లు వెంకట నరసింహారెడ్డి గారితో జరిగింది.

1954 మే నెలలో హైదరాబాద్‌ ఓల్డ్‌ ఎమ్మెల్యే కార్వర్ట్స్‌లోని దేవులపల్లి వెంకటేశ్వరరావు నివాసంలో వీరి నిరాడంబరంగా వివాహం జరిగింది. 

 బద్దం ఎల్లారెడ్డి, చండ్ర రాజేశ్వరరావు, దేవులపల్లి వెంకటేశ్వరరావులు పెళ్ళి పెద్దలుగా ఉన్నారు. 
ఎటువంటి ఆర్భాటాలు లేకుండా కేవలం దండలు మార్చుకుని పెళ్లిచేసుకున్నారు

 మల్లు వెంకట నరసింహారెడ్డి గొప్ప సాయుధ పోరాటయోధుడు . ఆదర్శప్రాయుడు. విశాల దృక్పథం ఉన్నవాడు. రాజకీయంగానూ వీరికి మంచి తోడ్పటును...గొప్ప అండదండలను..అందించాడు. పుట్టింటి మెట్టింటి అండదండలతో ప్రజా బంధువుగా మన స్వరాజ్యం అలుపెరుగక శ్రమించగలిగింది.

▪️రాజకీయ_ప్రస్థానం 

వీరి రాజకీయ ప్రస్థానాన్ని గమనిస్తే ...సాయుధ పోరాటం అంతమైన ముగిసిన తర్వాత రాజకీయాలలో ప్రవేశించింది.
రెండు సార్లు శాసనసభకు ఎన్నికై ప్రజాసేవను నిర్విగ్నంగా కొనసాగించింది. నల్గొండ జిల్లా తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి 1978, 1983లలో రెండు పర్యాయాలు సి.పి.ఐ.(ఎం)పార్టీ తరఫున ఎన్నికైంది. రాష్ట్ర మహిళా సంఘం ప్రధాన కార్యదర్శిగానూ పనిచేశారు.

 ▪️పత్రికారంగంలో 

 వామ పక్షభావాలతో స్త్రీల ఆధ్వర్యంలో మొదలైన పత్రిక 'చైతన్య మానవి' సంపాదకవర్గంలో ఒకరుగా తనవైన సేవల్ని అందించింది

▪️సంతానం 

వీరికి ఇద్దరు కుమారులు గౌతమ్‌ - నాగార్జున . 
ఒక కుమార్తె కరుణ.
కూతురు కరుణ 2009లో 'ప్రజారాజ్యం ' పార్టీ తరఫున నల్గొండ లోకసభ స్థానంలో పోటీచేసి ఓడిపోయింది.

 ▪️జీవితచరిత్ర 
 ప్రస్తుతం 90 ఏళ్ల వయసున్న స్వరాజ్యం జీవితకథ #నామాటే_తుపాకి_తూటా’ పుస్తక రూపంలోకి వచ్చింది.  
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ వారు ఈ ఆత్మకథను ప్రచురించారు. రచయిత్రులు విమల, కాత్యాయని స్వరాజ్యం జీవిత వివరాలను కథనం చేశారు. 
జీవితకథ ఆధారంగా స్వరాజ్యం అనుభవాలను కొన్నింటిని పరిశీలిస్తే.... 

👉మా నాన్న వంటి భూస్వాములకు ఇంకా పెద్ద జాగీర్దార్లతో పోటీ ఉండేది. ఫలానా దొరల ఆడపిల్లలు గురుకులంలో చదువుతున్నారు, మనం కూడా వాళ్ల సాంప్రదాయంలో నడవాలె, వాళ్లంత పెద్దగా ఎదగాలె అనేటువంటిది ఉండేది. రేప్పొద్దున ఏమయినా జరిగితే– పురుషులు సమయానికి లేకపోవడమో, చనిపోవడమో జరిగితే, స్త్రీలు గూడా జమీందారీ నిర్వహించేట్టుగా తయారు కావాలనేది ఉండేది... అట్లా ఇంటి దగ్గరనే పంతుల్ని పిలిపించి ఆడపిల్లలకు చదువులు చెప్పించిన్రు... చదువు, ఈత, గుర్రపుస్వారీ వంటివి నేర్చుకున్నా.’’

‘‘ఒక రోజున ఎల్లమ్మ అనేటామె వడ్లు దంచుతూ కళ్లు తిరిగి పడిపోయింది. నేనక్కడే కాపలాగా ఉన్నానప్పుడు. దబదబ నీళ్లు తీసుకపోయి తాపించినా. ఆకలైతున్నదని ఆమె చెప్పంగనే అన్నం తీస్కొచ్చి తిన్పించినా. దంచుతున్నవాళ్లు అందరూ మాక్కూడా ఆకలైతున్నది అన్నం పెట్టమని అడిగిన్రు. ఇంట్లో చూస్తే అంత అన్నం లేదు. బియ్యం తీసుకోని నానపెట్టుకుని తింటమన్నరు. మంచిది, తినమని చెప్పినా. 
ఆ తర్వాత ఈ సంగతి తెలిసి మా చిన్నాయనవాళ్లు తప్పు పట్టిన్రు. ‘‘అది చిన్నపిల్ల, ఏమనకండి’’ అని మా అమ్మ నాకు సపోర్టుగా నిలబడ్డది. 
అది నాకు చాలా స్ఫూర్తిని అందించింది. అప్పటికి మా అన్నయ్య (భీమిరెడ్డి నరసింహారెడ్డి) హైదరాబాదులో చదువుకుంటున్నడు. నాకప్పటికి ఆంధ్రమహాసభ ఉద్యమం గురించి ఏమీ తెల్వదు.’’

‘‘ఆ రోజుల్లో బాగా చదువుకున్న ఆడవాళ్లు కూడా స్టేజిల మీదికెక్కి మాట్లాడ్డానికి వెనకాడుతుండిరి. నేను ఉపన్యాసాలిస్తుంటే, బాగా చదువుకున్న దాన్నేమోనని అనుకునేవాళ్లు. బి.ఏ. చదివిన్నని అనుకున్నరట. నిజానికి నా చదువు నాలుగో, ఐదో తరగతులు, అంతే. నా వయసు కూడా పద్నాలుగు, పదిహేనేళ్లకు ఎక్కువ లేదు. ‘ఆంధ్రదేశపు ముద్దుబిడ్డ’ అని పేరు పెట్టిన్రు నాకు.

నేను ఉపన్యాసం ఇస్తుంటే పార్టీ నిధుల కోసమని నా మీదకు డబ్బులు ఎగజల్లేటోళ్లు. రూపాయి నోట్ల దండలేసేటోళ్లు.’’ 

‘ఒకసారి మా దళం రాత్రిపూట ఒక అడవిలో పడుకున్నం. వెన్నెల రాత్రుల్లో పోలీసుల దాడులు ఎక్కువగా జరిగేవి. అందుకే వెలుతురు పడకుండా చీకటిగా ఉండే చోటు చూసుకొని రక్షణ తీసుకునేవాళ్లం. ఈ రోజు రాత్రి మేము పడుకున్న ప్రదేశంలో గుడ్డెలుగు ఉన్నట్టున్నది. అది దాని జాగా అయ్యుండొచ్చు, ఒక రకమైన వాసనొస్తున్నది... 

అది నా దగ్గరకు వచ్చి గుంజుతుంటె మెలకువయ్యింది. ఇదేదో ఉన్నట్లే ఉన్నదనుకొని కప్పుకున్న దుప్పటి తీసి దాని మీద ఇట్ల పడేసిన. 
మీద గుడ్డ పడేసినా, కొర్రాయి చూపించినా ఆగిపోతదని కొయ్యోళ్లు చెప్తుంటే వింటుండేదాన్ని. మొకాన గుడ్డ పడంగనే తిక్కలేసినట్లయి ఇసురుకుంటనే పైకి లేచేటందుకు ప్రయత్నం చేస్తున్నది. దాని కాళ్లను మెసలరాకుంట పట్టుకొని వెనక్కి తోసిపారేసిన. బోర్ల పడ్డది... నేను వెంటనే తప్పించుకున్న. ఇంకొకసారి అడవిలో పోతుంటె పులి ఎదురొచ్చింది. నేనిక ఒక గడ్డ మీదెక్కి నిలబడ్డ. ఎటు కదిలితే ఏమయితదోనని అట్లనే నిలబడ్డ. ఆడనే నిలబడి చూస్తున్నదది. కొంత సేపటికి అది ముందుకు అడుగు వేయబోంగనే నేను తుపాకి తీసుకొని పక్కకు పేల్చిన... దానితో భయపడి వెనక్కుమళ్లి ఉరికింది.’’

▪️ స్ఫూర్తిదాయక_మహిళ 

మల్లు స్వరాజ్యం గారు తన విశ్రాంత దశలో సైతం సభలు సమావేశాల్లో పాల్గొన్నారు. తొంబై ఏండ్ల వయసులోనూ ఆమెలో అదే ఆవేశం కనబర్చింది .

▪️కాలధర్మం

కొద్దిరోజులుగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న స్వరాజ్యం..... హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 19 మార్చి 2022 శనివారం సాయంత్రం మృతి చెందారు.

సార్థక నామధ్యేయురాలు స్వరాజ్యం స్మృతికి అరుణారుణ వందనాలు

No comments:

Post a Comment