Monday, April 15, 2024

గుణంపల్లి పుల్లారెడ్డి

గుణంపల్లి పుల్లారెడ్డి. (1920 - 2007)
(వ్యాపారవేత్త, విద్యా దాత, జాతీయవాది)
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
వ్యాసకర్త : తంగెళ్ళశ్రీదేవిరెడ్డి 

సామాన్యుడుగా పుట్టి అసామాన్యుడిగా ఎదిగాడు -
జాతీయ భావాల నిండుకుండగా జనాన్ని జాగృతం చేసాడు -.
మంచికి మానవతకు వారధిని కట్టి ఔన్నత్యాన్ని మనసారా నడిపించాడు -
అతడు - గుణంపల్లి పుల్లారెడ్డి. 

👉జననం 

1920 ఆగస్ట్ 12 వ తేదీన సామాన్య మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో పుల్లారెడ్డి జన్మించాడు. 
కర్నూలు జిల్లా గోకవరం గ్రామం వీరి స్వగ్రామం. వీరి తల్లి పుల్లమ్మ , తండ్రి హుస్సేన్ రెడ్డి. 
తెలంగాణ రాయలసీమ గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు కలగడం కోసం.... పిల్లలు బాగుండటం కోసం...ఆయురారోగ్యాలు కోసం... పూర్వం నుండి దర్గాలను మొక్కుకుని ఆ పేర్లు పెట్టుకునే ఆచారం కొనసాగుతున్నది. ఇట్లాంటి ఆచారం ప్రకారం పెట్టబడిన పేరే హుస్సేన్ రెడ్డి. 

👉బాల్యం - విద్యాభ్యాసం 

కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా పుల్లారెడ్డి పెద్దగా చదువుకోలేక పోయాడు. ఐదవ తరగతి వరకు మాత్రమే చదివాడు. ఇట్లగాని బాధ పడుతూ కూర్చోలేదు. తనకు అందుబాటులో ఉన్నంత వరకు పెద్దలతో రామాయణం మహాభారతం భాగవతం కథల్ని చెప్పించుకున్నాడు. ఆ కథల్ని బాగా ఒంటపట్టించుకున్నాడు. 

కొంచం పెద్దవాడయ్యాక, ప్రపంచం తెలిసాక, ఆనాటి సామజిక రాజకీయ పరిస్థితుల్ని క్రమంగా అర్థం చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆనాటి బ్రిటిష్ పాలనలో పోరాటాలు ఉద్యమాలు పుల్లారెడ్డిలో క్రమంగా జాతీయ భావాలకి ఊపిరులూదాయి. 

ముఖ్యంగా చదివింది ప్రాథమిక విద్య మాత్రమే అయినా తెలివితేటలు మాత్రం ఉన్నత విద్యావంతులను మించిపోయి ఉండేవి. లోకజ్ఞానం, లోక వ్యవహారం, ఇవన్నీ పెద్దలను సైతం ఆశ్చర్యంలో ముంచుతుండేవి. ఈ క్రమంలో ఆనాటి పెద్దమనుషులు కొందరు - " ఈ పిల్లవాడి నాలుక మీద సరస్వతి నడయాడుతుంది " అని కితాబులు ఇచ్చేవారట. ఇది భవిష్యత్తులో నిజమై సరస్వతి కృపతో విద్యాలయాలు స్థాపించే స్థాయికి ఎదిగారు. 

సమాజం నుండి... మనుషుల నుండి... జీవిత పాఠాలను నేర్చుకున్న పుల్లారెడ్డి, పసి తనంలోనే ఏది మంచి? ఏది చెడు? అని గ్రహించే పరిజ్ఞానం తన సొంతంగా బతికే వాడట . అది చూసిన పెద్దలు " వీడు సామాన్యుడు కాదు. రాజ కళ ఉట్టిపడుతుంది " అని మెచ్చుకునేవారట. అది నిజమే అయ్యింది. అసామాన్యుడుగా అంచెలంచెలుగా ఎదిగాడు. అందరి గౌరవాభిమానాలను చూరగొంటూ రారాజులా బతికాడు. 

👉 చిన్నాన్న ప్రభావం :

పుల్లారెడ్డి తెలివితేటలను గుర్తించిన వాళ్లలో చిన్నాన్న 
కసిరెడ్డి వెంకటరెడ్డి ఒకరు. వీరు పుల్లారెడ్డిని గుర్తించి, ఆ పై పొగిడి వదిలి పెట్టలేదు. చేయూత అందించాడు. ఆదరించి ముందుకు నడిపించాడు. స్వతహాగా నిజాయితీ పరుడైన పుల్లారెడ్డి, మరో నిజాయితీ పరుడైన బాబాయి అండదండలతో పదునెక్కాడు. 

వెంకటరెడ్డి కర్నూలులో ఉండేవాడు. వీరు పుల్లారెడ్డిని తనతో పాటు కర్నూలు పట్టణానికి తీసుకెళ్లాడు. నగరానికి కొత్త కాబట్టి పుల్లారెడ్డిని మొదట తన వద్దనే పనికి కుదుర్చుకున్నాడు. అప్పుడు పుల్లారెడ్డిది నూనూగు మీసాల వయసు. ఈ సమయంలోనే నారాయణమ్మతో పుల్లారెడ్డి వివాహం జరిగింది.

👉భార్య - సంతానం 

భార్య నారాయణమ్మ గొప్ప సాధ్విమణి. భర్త అడుగుజాడల్లో నడవడం మాత్రమే కాదు, భర్త దాన గుణాలను మనసారా ఒప్పుకుంటూ తన ఒంటిమీది నగలను కూడా తీసి ఇచ్చిన పుణ్య మూర్తి. ఈ దంపతులకు ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 

పుల్లారెడ్డి కుమారుడు జి.రాఘవరెడ్డి ప్రస్తుతం విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 

👉వ్యాపార రంగంలో 

కాలక్రమంలో సొంతంగా స్థిరపడాలనే ఆలోచనతో పుల్లారెడ్డి 25 రూపాయలు అప్పు చేసి కర్నూలులో చిన్నగా టీ దుకాణం తెరిచాడు. అదే రోజుల్లో మజ్జిగ అమ్మడం కూడా మొదలెట్టాడు. వ్యాపారం కొద్దోగొప్పో కలిసొచ్చింది. కానీ పెద్దగా లాభసాటిగా అనిపించలేదు. పెట్టుబడికి సరిపోతూ వచ్చింది. అంతేకాదు భవిష్యత్తులో టీ వ్యాపారం పుంజుకుంటుంది అనే నమ్మకం కలగలేదు. అందుకే ఈ రెండూ వదిలిపెట్టి బట్టల దుకాణం తెరిచాడు. ఊరూరా తిరిగి దుస్తులు అమ్మకం మొదలెట్టాడు. బట్టల వ్యాపారం బాగానే అనిపించింది. కాబట్టి వ్యాపారాన్ని విస్తరించాలనే కోరికతో మరో వ్యక్తితో కలిసి రెడిమేడ్ దుస్తుల వ్యాపారం మొదలుపెట్టాడు. 
కానీ కలిసిరాలేదు. వ్యాపారంలో పెద్దఎత్తున నష్టాలొచ్చాయి.

అయినప్పటికీ పుల్లారెడ్డి నిరాశ చెందలేదు. మరో వ్యాపారం చేయాలనీ నిర్ణయించుకున్నాడు. ఈ పరిస్థితిలో మరోసారి పుల్లారెడ్డికి చిన్నాన్న ప్రోత్సాహం అందించాడు. 

చిన్నాన్న సహకారంతో 1948లో కర్నూలులో చిన్నగా మిఠాయి అంగడి తెరిచాడు. ఈ సమయంలోనే వ్యాపారంలో అవలంభించాల్సిన సూత్రాలను
చిన్నాన్న కసిరెడ్డి వెంకటరెడ్డి బోధించాడు. 
తన చిన్నాన్న చెప్పిన ఆరు సూత్రాలను జీవితాంతం పాటించాడు. తన ఉద్యోగులు కూడా అదే బాటలో నడవాలని ఆశించాడు. అందుకే నేతి మిఠాయిల తయారీలో అగ్రగామిగా ఎదిగాడు. 

1- నీవు తినేదే నీ పనివాళ్ళకు పెట్టు.
2- వ్యాపారానికి కావలసిన ముడిసరుకులు నీవే కొని తెచ్చుకో. ఇతరులను పంపించకు.
3 - మిఠాయి చేసిన తరువాత రుచి చూసి బాగుంటేనే అమ్ము బాగాలేకపోతే అమ్మకు.
4 - ధనికుడికైనా దరిద్రుడికైనా ఒకటే ధరకు అమ్ము.
5 - తూకంలో ఒక తులం ఎక్కువైనా పరవాలేదు కాని తక్కువ కాకుండా చూసుకో.
6- పాకశుద్ధి ఎంత అవసరమో వాక్శుద్ధి కుడా అంతే అవసరం కనుక అబద్దం ఆడకు.

👉మిఠాయిల తయారీ :

మిఠాయి దుకాణం ప్రారంభించాక మిఠాయిలు తయారు చేయడం కోసం ఓ మనిషిని పెట్టుకున్నాడు. 
కానీ అతడు తయారు చేసిన మిఠాయిలు పుల్లారెడ్డికీ నచ్చలేదు. దీంతో కొన్ని నెలలు మిఠాయిల తయారీలో శిక్షణ తీసుకుని, ఆ తర్వాత తానే స్వయంగా మిఠాయిలు తయారు చేసి అమ్మకం మొదలెట్టాడు. ఈ క్రమంలో కొనుగోలు దారులకు రుచికరమైన మిఠాయిలు అందించాలనే తలంపుతో మిఠాయిల తయారీకి స్వచ్ఛమైన నెయ్యితో పాటుగా నాణ్యమైన ముడిసరుకులు ఉపయోగించాడు. ఇది పుల్లారెడ్డికి కొన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టింది. .   

ఇతర మిఠాయి దుకాణాల్లో కంటే పుల్లారెడ్డి దగ్గర ధరలు ఎక్కువగా ఉన్నాయని కొనుగోలుదారులు మిఠాయిలు కొనడం మానేసారు. ఈ పరిస్థితిలో కొనుగోలుదారులను స్వయంగా కలిసి నాణ్యతను వివరించడం మొదలెట్టాడు పుల్లారెడ్డి. అట్లాగే కొత్త కొనుగోలుదారులకు కూడా కొంటున్నపుడే నాణ్యత గురించి చెప్పుకొచ్చాడు. ఇదంతా పుల్లారెడ్డికి చాలా కష్టంగా ఉండేది. అయినప్పటికీ ఓర్చుకున్నాడే తప్ప, నాసిరకాలు వాడి... ధరలు తగ్గించి.... ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేయలేదు.  

కాలక్రమంలో కొనుగోలుదారులు పుల్లారెడ్డి నిజాయితీని అర్థం చేసుకున్నారు. రుచికరమైన మిఠాయిల కోసం వరస కట్టడం మొదలెట్టారు. నాణ్యమైన మిఠాయిల గురించి ఒకరి ద్వారా ఒకటికి మెల్లగా ప్రచారం కావడం మొదలయ్యింది .  

కర్నూలులో పుల్లారెడ్డి మిఠాయిలు అమ్ముతున్న కాలంలోనే ఆంధ్రరాష్టానికీ కర్నూలు పట్టణమే రాజధాని అయ్యింది . ఇది పుల్లారెడ్డి వ్యాపారానికి ఒకరకంగా కలిసి వచ్చింది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ నోటా ఈ నోటా మిఠాయిల నాణ్యత గురించి రాజ్‌భవన్‌ వర్గాలకు తెలిసింది. ఇంకేముంది? నిత్యం రాజకీయ అథితులతో కోలాహలంగా ఉండే రాజ్‌భవన్‌కు మిఠాయిలు సరఫరా చేసే అవకాశం వచ్చింది. మిఠాయిలు రుచి చూసిన నాయకులు తిరిగివెళ్తూ మిఠాయిలు కొనుక్కొని పోవడం కూడా మొదలెట్టారు. అట్లా పుల్లారెడ్డి మిఠాయిల వ్యాపారం బాగా రాణించసాగింది. ఉద్యోగుల్ని పెట్టుకునే స్థాయి కూడా మొదలయ్యింది. ఇక పుల్లారెడ్డి వెనుతిరిగి చూడలేదు. మిఠాయిల వ్యాపారంలోనే స్థిరపడాలని అనుకున్నాడు. 

👉మిఠాయిల దుకాణాల విస్తరణ 

అక్టోబరు1- 1953 నుండి నవంబర్ 1- 1956 వరకు
రాజధానిగా కర్నూలు కొనసాగింది. తర్వాత 
1956 నవంబరు 1వ తేదీన హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగుభాష మాట్లాడే తెలంగాణ ప్రాంతాన్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రాంతాన్ని కలిపి విశాలమైన ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుచేస్తూ రాజధానిగా హైదరాబాద్ నగరాన్ని నియమించారు. ఈ క్రమంలో రాజ్‌భవన్‌ కర్నూల్ నుండి హైదరాబాద్ కు మారింది. అప్పుడు పుల్లారెడ్డి హైదరాబాద్‌లోనూ ఒక మిఠాయిల దుకాణం పెట్టాలని నిశ్చయించుకున్నాడు. 

అనుకున్న ప్రకారం 1957లో ఆబిడ్స్ స్టేషన్ రోడ్డులో మిఠాయిల దుకాణం ప్రారంభించాడు. నమ్మకమైన ఉద్యోగుల్ని నియమించుకున్నాడు. అయితే అప్పట్లో హైదరాబాద్ నగరంలో తెలుగు వారికి తెలుగు భాషకు ప్రాధాన్యత లేదు. ఉత్తర భారతీయుల మిఠాయిలకు బాగా గిరాకీ ఉండేది. వాళ్ళ దుకాణాలే నగరమంతా ఉండేవి. వారికి తోడుగా ముస్లింల దుకాణాలు ఉండేవి. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో హైదరాబాద్‌లో పుల్లారెడ్డి ప్రారంభించిన మిఠాయిల దుకాణం మొట్టమొదటి తెలుగు దుకాణం. 

నిజాం ప్రభుత్వం అంతం అవ్వడంతో తెలుగు జాతి మెల్లగా ఊపిరి తీసుకుంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో పుల్లారెడ్డి మిఠాయిలకు కొనుగోలుదారులు ఏర్పడ్డారు. 

క్రమ క్రమంగా పుల్లారెడ్డి వివిధ ప్రాంతాల్లో కొత్త దుకాణాలు ప్రారంభించడం మొదలెట్టాడు. నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూ వచ్చిన పుల్లారెడ్డి, ప్రతిచోటా విజయం సాధించాడు. 

👉 సామజిక సేవలో - 

1970 ప్రాంతంలో సమాజం కోసం సేవ చేయాలనే ఆలోచన కలిగింది. అప్పటికి వ్యాపారరంగంలో బాగా రాణించి ఉన్నాడు. కానీ ఆలోచనను వెంటనే అమలు చేయలేదు. ఎందుకంటే సేవా కార్యక్రమాలు మొదలెట్టాక వనరుల లేమితో ఇబ్బంది పడకూడదని భావించి ముందస్తుగా పరిస్థితులను చక్కదిద్దుకున్నాడు. 

1975లో " జి.పుల్లారెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ " ఏర్పాటు చేశారు.ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు మొదలెట్టాడు. 

మొదట తన మాతృభూమి కర్నూలు జిల్లాలో హీనస్థితిలో అరకొరా సదుపాయాలతో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను తన స్వంత డబ్బులతో అభివృద్ధి చేశారు. 

1984-85 లో జి.పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలను
స్థాపించాడు. 

1994 -95లో జి.పుల్లారెడ్డి ఫార్మసీ కళాశాలను స్థాపించాడు. 

1997లో భార్య పేరు మీద మహిళల కోసం జి.నారాయణమ్మ ఇంజనీరింగ్ కళాశాలను స్థాపించారు. 

అనాథ పిల్లలకు, పేదపిల్లలకు, 
విద్యనందించేందుకు " విజ్ఞానపీఠం" ఆశ్రమాన్ని ప్రారంభించి, వారికి చదువుతో పాటుగా వసతి సదుపాయాలను ఏర్పాటుచేశాడు. 

చారిటబుల్ ట్రస్ట్ తరపున ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఉపకార వేతనాలను కూడా ఇవ్వడం మొదలెట్టాడు. 

విద్యావ్యాప్తి కోసం తనవంతు కృషి చేస్తూ ప్రాథమిక, మధ్యమ, ఉన్నత పాఠశాలలను ఆయా ప్రాంతాల్లో స్థాపించాడు. 

కొన్ని చోట్ల డిగ్రీ కళాశాలలను స్థాపించారు.

పుల్లారెడ్డి సేవలు క్రమక్రమంగా విస్తరించాయి. ఈ క్రమంలో ప్రస్తుతం పుల్లారెడ్డి వారసులు
ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవల్ని మరింత విస్తృతపరిచారు. 

👉ఉద్యోగులను ఆదరిస్తూ 

కాలక్రమేణా పుల్లారెడ్డి మిఠాయిల దుకాణ శాఖలు పెరిగాయి వందల మంది ఉద్యోగులు పని చేయడం మొదలెట్టారు. విదేశాలకు సైతం మిఠాయిలు ఎగుమతి అయ్యే స్థాయి చేకూరింది. ఈ మొత్తం బాధ్యతలో ఉద్యోగుల పనితనం కూడా ప్రముఖమైనది కాబట్టి, ఉద్యోగులను తన సొంతమనుషుల్లా చూసుకుని వారికి ఇళ్లు కూడా కట్టించి తన ఉదారత చాటుకున్నాడు పుల్లారెడ్డి. 

👉హిందూ జాతీయ భావజాలం 

చిన్నప్పుడు నుండే రామాయణ మహాభారత గాథలు వినడం ద్వారా ధర్మం త్యాగం ఆదర్శం వంటి ఉత్తమగుణాలు పట్ల ప్రేరణ చెందాడు. బాల్యంలో పొందిన స్ఫూర్తి ద్వారా యుక్త వయసులో హిందుత్వ భావజాలంపై అభిమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌(ఆర్ఎస్ఎస్) విధి విధానాలు పట్ల ఆకర్షితుడు అయ్యాడు.

1974లో ఆర్ఎస్ఎస్‌లో సర్ సంఘ్ ఛాలక్ గా నియమించబడ్డాడు.  

1980లో విశ్వ హిందూ పరిషత్‌ హైదరాబాద్ శాఖ అధ్యక్షుడుగా కొనసాగాడు. 

సంస్కృత భాషా ప్రచార సమితి అధ్యక్షునిగా ఎన్నుకోబడ్డాడు. 

విశ్వ హిందూ పరిషత్ జాతీయ కోశాధికారిగా నియమించబడ్డాడు. 

 భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితికి సుదీర్ఘకాలం అధ్యక్షుడిగా అంకితభావంతో పనిచేశాడు 

 హిందూ ఆలయాల అభివృద్ధికి తానే స్వయంగా విరాళాలు ఇవ్వడమే కాదు సేకరించాడు కూడా. 

ఎన్ని బాధ్యతలు నిర్వర్తించినా కూడా ఎక్కడా మచ్చ లేకపోవడం పుల్లారెడ్డి నిజాయితీకి నిదర్శనం. 

👉విశ్వహిందూపరిషత్ కోశాధికారిగా 

పుల్లారెడ్డి గారు విశ్వహిందూ పరిషత్ కోశాధికారిగా కొనసాగుతున్న సమయంలో అయోధ్యలో రామజన్మ భూమిపై వివాదం కొనసాగుతున్నది. ఈ విషయమై విశ్వహిందూ పరిషత్ కేసు వేసి నడిపిస్తున్నది. అయితే కేసు కీలకమైనది. గెలవాలనే తపన ప్రాణం కంటే మిన్నగా ఉన్నది. కాగా కేసు వాదించడానికి ఇరవై ఐదు లక్షలు సమీకరించాల్సిన పరిస్థితి వచ్చింది పరిస్థితిలో VHP ఢిల్లీ కార్యాలయంలో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి. నాయకులు అందరిలో ఆందోళన మొదలయ్యింది. రాముడే ముందుకు నడిపిస్తాడని.....ఆర్థిక సంకటం తొలగిస్తాడని.....అందరూ భావించారు.  

లక్ష రూపాయలు సేకరించడమే కష్టంగా ఉన్న ఆ పరిస్థితి వున్నది. ఇట్లగని కేసు వదులుకోలేరు. అది భవిష్యత్తుకు వర్తమానానికి మాత్రమే కాదు, యావత్తు హిందూ సమాజానికే ఒక సవాల్. మరి ఏం చేయాలి? ఎవ్వరిని ఒప్పించాలి? ఈ గందరగోళంలో VHP కోశాధికారిగా ఉన్న పుల్లారెడ్డి దగ్గరికి VHP నేత అశోక్ సింఘాల్ వచ్చాడు పుల్లారెడ్డి ఇంట్లోనే సమాలోచనలు జరిపారు. 

పుల్లారెడ్డి అస్సలే దాతృత్వం ఉన్న మనిషి. రామయ్యకు కష్టం వచ్చింది అంటే ఊరుకుంటాడా? అందుకే ఆలస్యం చేయలేదు. ఇంట్లోకి వెళ్లి చేతిలో రెండు లక్షల రూపాయలు నగదు తీసుకువచ్చి అశోక్ సింఘాల్ చేతిలో పెట్టారు అంతటితో ఆగలేదు. 
" సాయంత్రానికి మరో పది లక్షలు సమకూరుస్తాను. . ఆ తర్వాత మిగతావి సమకూర్చుదాం" అని సింఘాల్ జీ కి భరోసా కూడా ఇచ్చారు. 

కేసు ఆషామాషీ కాదు. ధర్మాన్ని నిలబెట్టాల్సిన రామజన్మభూమికి సంబందించినది.  
గెలిచే వరకు వాదించవలసిందే.....  
గెలిపించే పోరాడవలసినదే ...
గెలుపుకోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధం కావలసిందే...
అనేది పుల్లారెడ్డి సంకల్పం. అందుకే....
 " నేను కోశాధికారిగా ఉండగా మాత్రమే కాదు, నేను బతికి ఉండగా కేసు ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడనీయను. రామయ్య కేసును అంతరాయము కలగనీయను. అవసరం అనుకుంటే ఎర్రమంజిల్లో ఉన్న నా ఇంటిని అమ్మివేస్తాను. లక్షల రూపాయల విలువచేసే నా భార్య నగలు కూడా అమ్మి వేస్తాను అంటూ " అశోక్ సింఘాల్ చేతుల్ని పట్టుకుని ధైర్యం కూడా ఇచ్చాడు. ఆ సమయంలో పుల్లారెడ్డి భార్య నారాయణమ్మ కూడా అక్కడే ఉంది. 

 ఆ పుణ్య దంపతుల విశాల హృదయానికి, ధర్మ సంకల్పానికి, దాతృత్వానికి అశోక్ సింఘాల్ కు నోట మాట రాలేదు.కన్నీటి పర్యంతమయ్యాడు.సమాలోచన కోసమే ఇంత దూరం వచ్చాడు. కానీ రాముడే కరుణించినట్టు పుల్లారెడ్డి ప్రత్యక్షంగా కనిపించాడు. 

" పుల్లారెడ్డి..... భరతమాతకు నీవంటి కుమారులు జన్మించినందుననే ఇంకా శిరస్సు ఎత్తి ఉన్నతంగా నిలిచి ఉన్నది. నాకు ఇప్పుడు సంపూర్ణ నమ్మకం కుదిరింది. మనకు అపజయం లేదు ...మనం ఓడిపోయితలదించుకునే పరిస్థితి రాదు. "అంటూ పుల్లారెడ్డిని ఆలింగనం చేసుకున్నారు . 

ఇది పుల్లారెడ్డి మహనీయతకు ఒక నిదర్శనం.పుల్లారెడ్డి వంటి ఎందరో త్యాగధనుల పుణ్య ఫలితంగా రామజన్మభూమిలో దేవాలయం నిర్మించాలనే కల సాకారం జరిగింది. 

👉పురస్కారాలు 

పుల్లారెడ్డి సేవలు దాన ధర్మాలు స్వచ్చమైనవి. నిజాయితితో కూడుకున్నవి. హృదయపూర్వకమైనవి.

 వీరి సేవలకు మెచ్చి ప్రఖ్యాత ఉడుపి పెజావర్ పీఠం వారు 1991 లో "దానగుణ భూషణ "బిరుదు ప్రదానం చేసింది.

1992లో జమ్నాలాల్ బజాజ్ పురస్కారం కూడా పుల్లారెడ్డి అందుకున్నారు. 

 👉మార్గదర్శి 

"పడిపోతే ఓడిపోయినట్టుకాదు... లేచి నిలబడాలని అర్థం ! చేతకాకపోతే ప్రయత్నించాలని ఉపదేశం ! " అని చాటిచెప్పిన పుల్లారెడ్డి జీవితం కొత్తగా వ్యాపారరంగంలోకి అడుగుపెట్టాలనుకునే నవతరానికి ఒక అడుగుజాడ !
ముఖ్యంగా జీవితంలో ఎన్నికష్టాలు ఎదురైనా కూడా నమ్మకాన్ని నిజాయితీని కష్టపడే తత్వాన్ని వదిలిపెట్టలేదు పుల్లారెడ్డి. అందుకే మనిషిగా మహోన్నతుడై ఎదిగాడు.

వ్యాపారవేత్తగా, ధర్మ ప్రచారకుడిగా, విద్యా దాతగా వారి చరిత్ర అజరామరం. తాను నష్టపోయినా పరవాలేదు అనుకుంటూ ఎదుటి వారి బాగును ఆశించిన పుల్లారెడ్డి వంటి వ్యక్తులు నూటికో కోటికో ఒక్కరు ఉంటారు. 

👉చిరస్మరణీయుడు 

నేడు పుల్లారెడ్డి మిఠాయిలు తెలియని తెలుగు సమాజం లేదు.... 
ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన మిఠాయిల రుచికి తిరుగులేదు.... 
తియ్యందనాన్ని సృష్టించిన తేనెల మనసు 
జి. పుల్లారెడ్డి అందరివాడు. ఆదర్శప్రాయుడు. ఎంత ఎదిగినా ఒదిగి జీవించిన నిరాడంబరుడు. సుగుణాన్ని ఇంటిపేరుతో ఇముడ్చుకుని, దానగుణంతో ధరిత్రిని పులకింపజేసిన పునీతుడు. వీరు మార్చి 7 వ తేదీ 2007 న శివైక్యం పొందారు. 

ఒక తార రాలింది.... 
వేల తారల అడుగుజాడై మిగిలింది.... 
తరతరాల వెలుగై ప్రసరించింది.... 
జయం జయం

No comments:

Post a Comment