Monday, April 15, 2024

బద్దం ఎల్లారెడ్డి

బద్దం ఎల్లారెడ్డి
(1906- 1978)
(సత్యాగ్రహి - సాయుధ పోరాట స్ఫూర్తి )
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
వ్యాసకర్త : తంగెళ్ళశ్రీదేవిరెడ్డి 

నిజాం నిరంకుశత్వాన్ని నిరసించిన అగ్ని కణం...  
దోపిడీ రాజ్యాన్ని వ్యతిరేకించిన అఖండ చైతన్యం... 
దీనజనుల బతుకుల్లో ఆశా జ్యోతులు వెలిగించిన ప్రచండ తేజం.... 
మట్టి మనుషుల్ని మేల్కొల్పిన మహా సంగ్రామం.... 
జాతి గర్విసున్న ధీటైన వ్యక్తిత్వం... 
అరుణ పతాకం... 
బద్దం ఎల్లారెడ్డి ! 
👉జననం 

పూర్వ కరీంనగర్ సిరిసిల్ల తాలూకా, ప్రస్తుత రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపెల్లికి చెందిన మధ్య తరగతి రైతు, పోలీస్ పటేల్ బద్దం హన్మంతరెడ్డి. మంచితనానికి సహనానికి వీరు మారు పేరు. వీరి భార్య లక్ష్మమ్మ. లచ్చవ్వగా పిలవబడేది. ఈ దంపతుల రెండో సంతానంగా బద్దం ఎల్లారెడ్డి 1906 లో జన్మించారు.  

👉బాల్యం - విద్యాభ్యాసం 

బద్దం ఎల్లారెడ్డి జన్మించే నాటికే ఏడవ నిజాం ప్రభువు మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలనకు వచ్చాడు. రాజ్యంలో
తెలుగు ప్రజల పరిస్థితి దయనీయంగానే ఉంది. అటువంటి పరిస్థితుల్లో సైతం హన్మంతరెడ్డికి తన పిల్లలను చదివించాలని కోరిక. ఈ క్రమంలో ఎల్లారెడ్డి ప్రాథమిక విద్య గాలెపల్లి ఖాన్గి బడిలో కొనసాగింది. తర్వాత మాధ్యమిక విద్య కరీంనగర్ సిరిసిల్లాలో కొనసాగింది. ఉన్నత విద్య హైదరాబాద్ వివేకవర్ధని పాఠశాలలో కొనసాగింది. 

👉 కాకినాడ సత్యాగ్రహం - అరెస్టు 

తెలంగాణలో పరిస్థితులు నిజాం కనుసైగలతో కొనసాగుతుంటే, భారతదేశంలో స్వాతంత్ర్య పోరాటం జరుగుతున్నది. ఇందులో భాగంగా 1930 లో ఉప్పు సత్యాగ్రహం మొదలయ్యింది. తెలంగాణ ప్రాంతంలో ఉన్న యువత భారత స్వాతంత్ర్య సమరం పట్ల ఆకర్షితులు అయ్యారు. తమ ప్రాంతం కూడా భారతదేశంలో విలీనం కావాలనే తపన ఆ యువతలో మొదటినుండి ఉన్నది. 24 ఏండ్ల వయసులో ఉన్న ఎల్లారెడ్డి దేశభక్తుల వరుసలో ఉన్నాడు. 

ఉప్పుసత్యాగ్రహంలో కార్యాచరణలో భాగంగా కాకినాడ సముద్ర తీరంలో సత్యాగ్రహం ఆరంభం అయ్యింది. తెలంగాణ విద్యార్థులు కూడా ఈ కాకినాడ శిబిరానికి బయలుదేరారు. వారిలో రావి నారాయణరెడ్డితో పాటుగా బద్దం ఎల్లారెడ్డి కూడా ఉన్నారు. 

బ్రిటిష్ ప్రభుత్వం సత్యాగ్రహులను ఎక్కడి వాళ్ళను అక్కడ అరెస్టు చేస్తున్నది. అప్పటికే జైళ్లు మొత్తం సత్యాగ్రహులతో నిండిపోగా, అరెస్టు చేస్తున్న వాళ్ళను దూర ప్రాంతాలకు తీసుకెళ్ళి వదిలి పెడుతున్నారు. అట్లా బద్దం ఎల్లారెడ్డి కూడా అరెస్టు చేయబడి, మద్రాసు రాష్ట్రం తిరుచానపల్లి ప్రాంతంలో వదిలేయబడ్డాడు. అయినప్పటికీ ఎల్లారెడ్డి భయపడలేదు. తనకు తోడుగా మరికొందరిని జమ చేసుకున్నాడు. ఒక చిన్న సమూహంగా ఏర్పడ్డాడు. స్వాతంత్య్రం ఆవశ్యకత, బ్రిటిష్ దురాగతాలు, విదేశీ వస్తు బహిష్కరణ వంటి అంశాల పట్ల ప్రజలకు అవగాహన కలిగిస్తూ తన ప్రయాణం మొదలెట్టాడు. 

భీమవరం దగ్గర పోలీసులు ఎల్లారెడ్డిని అరెస్టు చేశారు. కోర్టు వీరికి ఏడు నెలల కారాగార శిక్ష విధించింది. 

👉 గాంధేయవాదిగా 

ఎల్లారెడ్డిని పోలీసులు ఒక్క జైలుకు పరిమితం చేయలేదు. తరుచూ క్యాంపు జైళ్లకు మార్చారు. ఈ క్రమంలో తిరుచానాపల్లి, బళ్ళారి, రాజమండ్రి, జైళ్లలో గడిపాడు. అక్కడ చాలా మంది నాయకులతో ఎల్లారెడ్డికి పరిచయాలు ఏర్పడ్డాయి. వారి పరిచయం ఎల్లారెడ్డిలో దేశభక్తిని మరింత ఇనుమడింపజేసింది. ఇక్కడే పరిపూర్ణ గాంధేయ వాదిగా మారిపోయాడు. 

'సత్యాగ్రహం - జైలు ' ఈ రెండు పరిస్థితుల్లో 1930-31 సంవత్సరాలు ఎల్లారెడ్డి జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. జైలు నుండి బయటకు వచ్చాక గాంధీ అహింసా సిద్దాంతం అనుసరిస్తూ, ఖద్దరు వస్త్రాలు ధరించడం మొదలెట్టాడు. అదే సిద్దాంతాలతో తిరిగి గాలిపెల్లి వచ్చాడు. గ్రామంలో మునుపటి ఎల్లారెడ్డిలా కాకుండా 
గాంధేయ వాదిగా సంచరిస్తూ ప్రజలతో మమేకం అవుతూ ప్రజల్లో జాతీయ భావాలు పెంపొందించడం మొదలెట్టాడు. అంతేకాదు, తన శక్తిమేర సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు. 

👉సేవా కార్యక్రమాలు 

 ఆనాటి సమాజంలో అంటరానితనం అస్పృశ్యత అవిద్య విపరీతంగా ప్రబలి ఉండేవి. ఈ పరిస్థితుల్లో గాంధీజీ తలపెట్టిన హరిజన సేవాసంఘ్, చర్కా ఉద్యమాలను ప్రచారం చేసే బాధ్యతను భుజాలపై వేసుకున్నాడు ఎల్లారెడ్డి. ఈ క్రమంలో తమ గ్రామంలో హరిజనుల కోసం ఒక పాఠశాల నిర్మించాడు. హరిజన హాస్టల్ నిర్మాణం, సహపంక్తి భోజనాలు, వంటి కార్యక్రమాలను తమ గ్రామం మొదలుకుని కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కొనసాగించాడు. 

👉రోజు నాంబా  

ఆరోజుల్లో పోలీసు పటేళ్లు గ్రామాల్లో నిర్వర్తించే ముఖ్య మైన విధి "రోజు నాంబా "
ఈ విధానం ప్రకారం కేటాయించిన గ్రామాల్లో జననాలు, మరణాలు, సముర్తలు, పెండ్లిళ్లు, కాన్పులు, ఇండ్ల నిర్మాణాలు, రాజకీయ వ్యవహారాలు, అన్నీ నమోదు చేసి సంబంధిత పోలీసు స్టేషన్ లేదా ఏలుబడిలో ఉన్న దొర గడికి అందజేయాలి. అక్కడి నుండి సమాచారం ప్రభుత్వానికి వెళ్తుంది. ఈ క్రమంలో ఎల్లారెడ్డి తండ్రి హన్మంతరెడ్డి పోలీస్ పటేలుగా కొడుకు రాజకీయ వ్యవహారాలను కూడా రోజు నాంబాలో పొందుపర్చక తప్పలేదు. ఈ కారణంగా హన్మంతరెడ్డి కుటుంబం సమస్యలకు ఎదురు నిలిచి పోరాడాల్సి వచ్చింది. 

👉ఆంధ్రమహాసభలో 

1934లో గాంధీ హైదరాబాద్ వచ్చాడు . ఈ సందర్భంగా హరిజన సేవాసంఘ్ ఆహ్వానంతో ఎల్లారెడ్డి హైదరాబాద్ చేరుకున్నాడు . అక్కడ రావి నారాయణరెడ్డితో ఉన్న పరిచయం కాస్తా స్నేహంగా చిగురించింది. రావి నారాయణరెడ్డి అదివరకే ఆంధ్రమహాసభలో ఉండటం మూలాన ఎల్లారెడ్డికి సభలు గురించి పరిచయం చేసాడు. 1934 లోనే ఖమ్మంలో మూడవ ఆంధ్రమహాసభలు జరిగాయి. తొలిసారిగా ఎల్లారెడ్డి ఈ సభల్లో పాల్గొన్నాడు. ఎల్లారెడ్డి దేశభక్తుడైన సత్యాగ్రాహిగా అందరికీ విదితం కాబట్టి, గౌరవంగా ఆహ్వానించబడ్డాడు. 

తదుపరి కరీంనగర్ సిరిసిల్లాలో జరిగే నాలుగవ ఆంధ్రమహాసభ నిర్వహణకు కార్యదర్శిగా నియమించబడ్డాడు కాని, మొత్తం బాధ్యతను తానే నిర్వహించిన ఘనత ఎల్లారెడ్డి స్వంతం. 

👉 జేరుబావులీ ఉద్యమం 

నాలుగవ ఆంధ్రమహాసభ నిమిత్తం గాలిపెల్లి, చుట్టుపక్కల గ్రామాల యువకులను సమీకరించి.... ఈ యువకులని దళాలుగా సిద్ధపరచి.... దిగ్విజయంగా ముందుకు నడిపించాడు ఎల్లారెడ్డి. ఈ సభలో రైతుల సమస్యలు ప్రస్తావనకు వచ్చాయి. ఈ స్పూర్తితో జేరుబావులీ ఉద్యమానికి శ్రీకారం చుట్టాడు. 
మోటబావి కింద సాగుచేసే తరి పొలాలను జేరుబావులీ అంటారు. ఈ పొలాల మీద నిజాం సర్కారు పన్ను రద్దు చేసి, రైతులను ఆదుకోవాలి అనేది ఉద్యమం ఉద్దేశ్యం. కానీ ఇది ప్రభుత్వానికి నచ్చలేదు. అందుకే ఎల్లారెడ్డి మీద అక్రమకేసులు బనాయించింది. ఈ పరిస్థితుల్లో కొందరు దగ్గరి బంధువులు జోక్యం చేసుకుంటూ "రాజకీయాలు ఉద్యమాలు మనకెందుకు అంటూ "
ఎల్లారెడ్డిని మందలించారు. కానీ ఎల్లారెడ్డి వినిపించుకోలేదు. ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసాడు. మహాసభల్లో రైతు సమస్యల తీర్మానాలు ఆమోదం పొందేవరకు కృషి చేసాడు. 

👉 జేగార్ రద్దు ఉద్యమం 

ఎల్లారెడ్డి నడిపిన ఉద్యమాల్లో జేగార్ ఉద్యమం కూడా ఒకటి. జేగార్ అంటే వెట్టి. దీన్ని కొనసాగించే పద్దతి బగీలా. ఈ పద్దతిని రూపు మాపి కఠినమైన శ్రమదోపిడిని నివారించే ప్రయత్నం చేయడంలో ఎల్లారెడ్డి పల్లె పల్లె తిరిగి కృషి చేశారు. వాస్తవానికి బగీలా ప్రకారం వెట్టి కిందకు ఒకటి నుండి మూడు ఎకరాల వరకు పొలాలు ఇచ్చేవాళ్ళు. అందుకు కౌలు చెల్లించే అవసరం లేదు.కౌలుకు బదులుగా పనులు చేయాలి. ఈ పద్దతి కొన్నిచోట్ల భయంకరమైన శ్రమదోపిడిలా కొనసాగింది. ఈ క్రమంలో వెట్టి ఒక అడ్డు అదుపు లేని పనివిధానంగా మారిపోయింది. అందుకే వెట్టి రద్దు కోసం ఉద్యమాలు జరిగాయి.
కాగా కొందరు కమ్యూనిస్టు చరిత్ర కారులు వెట్టి గురించి రాసిన సందర్భాల్లో..... " దొరల ఇండ్లల్లో అట్టడుగు వర్గాలు వేతనం లేకుండా పని చేయాలి " ....అనే నిజం మాత్రమే రాశారు. భూములు ఇచ్చిన వివరాలు మాత్రం రాయలేదు. ఒక వర్గాన్ని సమూలంగా భ్రష్టు పట్టించే ఉద్దేశ్యంతో కొందరు కమ్యూనిస్టు చరిత్రకారులు ఉద్దేశ్య పూర్వకంగా ప్రవర్తించడం చారిత్రక తప్పిదం. అట్లాగే బడుగు బలహీన వర్గాలు వెట్టి పేరుతో శ్రమదోపిడీకి గురికావడం బాధాకరం. ఇందుకు ఎల్లారెడ్డి వంటి మహానుభావులు ప్రజల పక్షాన నిలబడటం అభినందనీయం. వెట్టి రద్దు కావడం చారిత్రక విజయం. 

👉 కాంగ్రెస్ నుండి కమ్యూనిస్టు వైపు 

బద్దం ఎల్లారెడ్డి సత్యాగ్రహిగా నికార్సయిన కాంగ్రెస్ వ్యక్తి. తెలంగాణలో ఏర్పడిన ఆంధ్రమహాసభ అనేది ప్రధానంగా తెలుగుభాషాభివృద్ధి - సమాజ వికాసం - దీనజనోద్దారణ - కోసం ఉద్దేశించబడింది. ఈ సభలో ఎల్లారెడ్డి కీలకమైన వ్యక్తిగా కొనసాగడం మొదలయ్యింది. ఈ పరిస్థితిలో 1938లో ఆంధ్రమహాసభను రాజకీయసభగా మార్చాలని ఆలోచన కలిగింది. ఇదే సమయంలో తెలంగాణ ప్రాంతంలో స్టేట్ కాంగ్రెస్ నిర్మాణం అత్యవసరం అని ఆలోచన కూడా నాయకుల్లో కలిగింది. కానీ నిజాం ప్రభుత్వం కాంగ్రెస్ ను నిషేధించింది . అప్పుడు సత్యాగ్రహి ఎల్లారెడ్డి కాంగ్రెస్ నిషేధంపై ఉద్యమం మొదలెట్టాడు. ఇదే సమయంలో వందేమాతరం ఉద్యమం ఆర్యసమాజం ఉద్యమాలు జరిగాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో సహనం కోల్పోయిన నిజాం ప్రభుత్వం కఠిన చర్యలకు పాల్పడింది. ఇందుకు ఎల్లారెడ్డి ఒకటిన్నర సంవత్సరాలు కారాగార శిక్ష కూడా అనుభవించాడు. 

చివరికి గాంధీజీ జోక్యంతో సత్యాగ్రహులు విడుదల అయ్యారు. కాంగ్రెస్ పై నిషేధం కూడా తొలగింది. 1939లో స్టేట్ కార్యవర్గ సభ్యులతో కలిసి ఎల్లారెడ్డి 
గాంధీని కలిసి.... సత్యాగ్రహ ఉద్యమాలు కోసం పునః అనుమతి కోరారు. మతపరమైన విద్వేషాలు అనివార్యమౌతాయని అనుమతులు తిరస్కరించాడు గాంధీ. నిరాశకు గురై వెనుతిరిగి వచ్చిన ఎల్లారెడ్డి సోషలిస్టు భావాల వైపు క్రమంగా మొగ్గు చూపాడు. 

ఎల్లారెడ్డితో పాటుగా ఆంధ్రమహాసభలో ఉన్న యువ నాయకులు రావి నారాయణరెడ్డి, వెదిరె రాజిరెడ్డి, గంగసాని గోపాలరెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల లక్ష్మీనరసింహారెడ్డి తదితరులు సైతం కమ్యూనిస్టు భావజాలం వైపు ఆకర్షితులు అయ్యారు. ఇక అదే సంవత్సరం 1939లోనే తెలంగాణ లో కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావం జరిగింది. పల్లెల్లో ఎర్రజెండాలు రెప రెప లాడాయి. 

👉సాయుధపోరాటవీరుడుగా 

1947 సెప్టెంబర్ 11 న సాయుధపోరాటం ప్రకటించబడింది. ప్రకటన చేసిన రావి నారాయణరెడ్డి, మఖ్దుంమొయిద్దీన్లతో పాటుగా ఎల్లారెడ్డి ఉన్నారు. 

సాయుధ పోరాటంలో భాగంగా 1948 మార్చి 12న ఇల్లంతకుంట పోలీసుక్యాంపుపై గెరిల్లా దళాల తరహాలో ఉద్యమకారుల దాడి జరిగింది. ఈ దాడిలో పోలీసు అమీన్ తో సహా ఆరుగురు పోలీసు మరణించారు. ఈ సంఘటనకు సంఘీభావం ప్రకటిస్తూ గాలిపెల్లిలో బద్దం ఎల్లారెడ్డి జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు. ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్లి ఎల్లారెడ్డిని లక్ష్యం చేసుకుని ఓ కన్నేసి ఉంచారు. 

1948 మే నాటికి సాయుధ పోరాటం ఉగ్రరూపం దాల్చింది. కమ్యూనిస్టు నాయకులపై నిషేధం అనివార్యం అయ్యింది. ఈ పరిస్థితిలో ఎల్లారెడ్డి రహస్య జీవితం గడిపాడు. రహస్యంగా మారువేషాల్లో తెలంగాణ అంతటా పర్యటించాడు. గెరిల్లా దళాలకు దిక్సూచిగా నిలబడ్డాడు. నిర్దేశం చేసాడు. ఈ క్రమంలో భాగంగా 1949 లో నల్లగొండ జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు పోలీసులకు సమాచారం అందింది. స్థావరాన్ని పోలీసులు చుట్టుముట్టి, ఎల్లారెడ్డిని పట్టి బంధించి తీసుకుకెళ్లారు. జైల్లో పెట్టి శారీరకంగా మానసికంగా క్రూరంగా హింసించారు. అయినప్పటికీ ఎల్లారెడ్డిలో ఉద్యమ చైతన్యం అడుగంటలేదు. జైలు నుండే ఉద్యమ స్ఫూర్తిని ధైర్యంగా కొనసాగించారు. 

గాలెపల్లిలో కాల్పులు :

ఎల్లారెడ్డి పేదల పక్షపాతి. సత్యాగ్రాహిగా మొదలుకుని సాయుధపోరాటం వరకు ప్రజలమనిషిగా జీవించాడు. ఇందులో భాగంగా 
పెత్తందార్లు పేదలకు ఇచ్చినట్టుగా రాసివున్న అప్పు పత్రాలను సంపాదించి ప్రజల సమక్షంలో కాల్చివేశారు. ఈ సంఘటన పెద్ద దుమారం రేపింది. నిజాం ప్రభుత్వం కన్నెర్ర జేసింది. ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు ఉద్యమకారులపై నిర్బంధాన్ని అమలు చేశారు. పరిస్థితి చిలికి చిలికి గాలివానై గాలిపెల్లిలో పోలీసులు కాల్పులు జరిపే వరకు వచ్చింది. ఈ కాల్పుల్లో పదకొండు మంది ప్రజలు అమరులయ్యారు. ఇది నిజాం సాగించిన మారణహోమానికి ప్రతీకగా చరిత్ర లిఖియించబడింది. 

👉సొంత భూమిని పంపిణి 

తెలంగాణ ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్యమాలు, ఫలితంగా వ్యవసాయం కుంటుపడి కోరలు చాచిన కరువు, తాండవిస్తున్న పేదరికం, ఆకలి చావులు, ఈ గడ్డు పరిస్థితుల నేపథ్యంలో సొంత భూమిని పేదలకు పంచిన మానవతావాదిగా ఎల్లారెడ్డి ఎందరికో ఆదర్శ ప్రాయుడు అయ్యాడు. వారి బాటలో మిగతా నాయకులు తమ పొలాలను కూడా పేదలకు పంచిపెట్టారు. 

👉పీవీ నరసింహారావుపై విజయం 

తెలంగాణ విలీనం తర్వాత భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం తొలగింది. కానీ తెలంగాణ ప్రాంతంలో తొలిగిపోలేదు. 1951 డిసెంబర్ 5 న బద్దం ఎల్లారెడ్డి జైలు నుండి విడుదల అయ్యాడు. రాజ్యాంగ బద్దంగా తొలి సాధారణల ప్రకటన 1952లో వచ్చింది. కానీ కమ్యూనిస్టులకు ఎన్నికల్లో 
పాల్గొనేందుకు పార్టీ విషయమై సంకటం ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో కమ్యూనిస్టులు వెనకడుగు వేయకుండా పత్రికల ఐక్య వేదిక పీడీఎఫ్‌ ఏర్పాటు చేసుకున్నారు. ఆ వేదిక నుండే ఎన్నికల్లో పాల్గొన్నారు.

పీడీఎఫ్ అభ్యర్థిగా కరీంనగర్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి బద్దం ఎల్లారెడ్డి పోటీచేశాడు. ఈ ఎన్నికల్లో సోషలిస్ట్‌ పార్టీ సభ్యుడు జువ్వాడి గౌతంరావు రెండవ స్థానంలో నిలబడగా, కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేసిన పి.వి.నర్సింహారావును 3 వ స్థానంలో నిలబడ్డాడు. తరువాతి కాలంలో ఈ విజయం 
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుపై విజయంగా నమోదు అయ్యింది. 

👉రాజకీయ ప్రస్థానం 

ఆనాటి సామజిక రాజకీయ పరిస్థితులను అనుసరించి రాజకీయ నాయకుడిగా విశాలాంధ్ర కోసం కృషి చేసిన వారిలో ఎల్లారెడ్డి ఒకరు. 

1958 ఉప ఎన్నికల్లో బుగ్గారం శాసనసభ్యుడు గా ఎన్నికయ్యాడు. 

1964 లో రాజ్యసభకు వెళ్ళాడు. 

1972ఇందుర్తి శాసనసభ్యుడుగా ఎన్నికయ్యాడు. 

1977 లో ఉత్తరాంధ్రలో గిరిజనులపై దాడులు జరుగుతున్నప్పుడు అక్కడి పరిస్థితులను అధ్యయనం చేయడానికి రాష్ట్ర శాసనసభ తరుపున కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. గిరిజనుల సాధక బాధలను దగ్గరుండి తెలుసుకున్నాడు. ఈ సమయంలోనే ఆకస్మాత్తుగా పక్షవాతానికి గురయ్యాడు. ఈ పరిస్థితిలో విశాఖపట్నం తర్వాత హైదరాబాద్ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుని, ఆ గాలెపల్లి చేరుకున్నాడు. స్వగ్రామంలో విశ్రాంత జీవితం గడుపుతూ 1978 డిసెంబర్ 27 న కాలధర్మం చెందారు. 
రెండు సార్లు ఎంపీగా, ఎమ్మెల్యేగా ఎన్నికైన బద్దం ఎల్లారెడ్డి తుదిశ్వాస విడిచేవరకు అట్టడుగువర్గాల మేలుకోరిన ప్రజానేతగా జన నీరాజనాలు అందుకున్నారు. 

👉కుటుంబం 

ఎల్లారెడ్డి సతీమణి కాంతమ్మ. భర్తకు తగిన భార్య. అనుకూలవతి. ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు రాంరెడ్డి, లక్ష్మారెడ్డి. రామలక్ష్మణులుగా ఈ పేర్లు పెట్టుకున్నారు. ఒక కూతురు విజయ ఉన్నారు. 

👉 మహనీయుడి స్ఫూర్తిగా 

ప్రజాబంధువు బద్దం ఎల్లారెడ్డి స్ఫూర్తిగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో "బి.వై.నగర్‌ " పేరుతో కార్మిక క్షేత్రం నిర్మించబడింది. 

కరీంనగర్‌లో బద్దం ఎల్లారెడ్డి భవన్‌ నిర్మించబడింది. .

కరీంనగర్ లో ఎల్లారెడ్డి విగ్రహం 2006 లో ప్రతిష్టించబడింది

కరీంనగర్ జిల్లాకు బద్దం ఎల్లారెడ్డి జిల్లాగా పేరు ఖరారు చేయడానికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం వ్యక్తం చేసింది. కానీ భారత కమ్యూనిస్టు పార్టీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి, వ్యక్తుల పేర్లను జిల్లాలకు సూచించడం సరైనది కాదంటూ పేర్కొనడం మూలాన, ప్రభుత్వ అంగీకారం మరుగున పడిపోయింది. 

మొత్తానికి ప్రజాస్వామ్య భారతంలో నేటితరం నేతలకు బద్దం ఎల్లారెడ్డి స్ఫూర్తిదాయకం అని చెప్పవచ్చు.

No comments:

Post a Comment