Monday, April 15, 2024

కడప కోటిరెడ్డి

కడప కోటిరెడ్డి ( 1886 - 1981 )
( భారత స్వాతంత్ర్య సమరయోధుడు )
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
వ్యాసకర్త : తంగెళ్ళశ్రీదేవిరెడ్డి 

కడప కోటిరెడ్డి ! 
కరుడుగట్టిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పారద్రోలడానికి పోరుబాటలో నడిచిన సమరయోధుడు ! నీతి నిజాయితీ నిబద్దత కలిగిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ! అజాత శత్రువు !

సత్యం ఆచరిస్తూ... 
ధర్మంగా ప్రవర్తిస్తూ...
సేవా తత్వాన్ని కొనసాగిస్తూ... 
తారతమ్యం లేకుండా అందర్నీ ప్రేమిస్తూ... 
సమాజంలో పెద్దమనిషిగా కొనసాగే వ్యక్తులు అరుదుగా ఉంటారు. వాళ్ళల్లో కోటిరెడ్డి ఒకరు. అందుకే... 
ఆ రోజులలో వీరిని అందరూ " సత్యహరిశ్చంద్రుడు " అని పిలిచేవారు. 
కోటిరెడ్డి చిన్నతనం నుండి కూడా 
ఉత్తమ ఆలోచనలతో అతి సున్నితమైన మనస్సుతో మెలిగేవారు. ఆనాటి సమాజంలో అంటరానితనం అస్పృశ్యత మూఢనమ్మకాలు విపరీతంగా పేరుకుని ఉండేవి. ఈ పరిస్థితుల్లో ఉన్నత వర్గాల వారు కొంత డాంబికంగా జీవించేవారు. కానీ కోటిరెడ్డి అందరిలో ఒకరిగా మెలుగుతూ "ఇతరులను నొప్పించకూడదు " అనే సూత్రాన్ని ఒంటబట్టించుకుని ప్రవర్తించేవాడు. వారి సమున్నత ఆలోచన విధానానికి స్ఫూర్తి వీరి కుటుంబం... కుటుంబ సభ్యులు !

#వ్యక్తిగతం :  

ఇప్పటి చిత్తూరు జిల్లా, మదనపల్లె తాలూకానారాయణ చెరువు అని పిలవబడే కోటిరెడ్డిగారిపల్లె వీరి స్వగ్రామం.అప్పట్లో ఈ గ్రామం కడప జిల్లాలో ఉండేది. 

వీరి అసలు పేరు కోటిరెడ్డిగారి కోటిరెడ్డి.
వీరి తల్లిదండ్రులు సిద్ధారెడ్డి నాగమ్మ గార్లు. వీరి తాత కోటిరెడ్డి గారు. అదేపేరు తిరిగి కోటిరెడ్డికి పెట్టారు. 

 బాల్యంలోనే భారత రామాయణాలు కంఠస్థము చేసాడు కోటిరెడ్డి . భారతంలోని -

                ఒరులేయని యొనరించిన 
                నరవర! యప్రియము దన మనంబున కగు దా 
                నొరులకు నవి సేయకునికి 
                పరాయణము పరమ ధర్మపథముల కెల్లన్. 

 ఇతరులు ఏ పని చేస్తే మనకు బాధ కలుగుతుందో ఆ పని ఇతరుల విషయంలో చేయగూడదు అనేది ఈ పద్యం భావం. ఈ పద్యాన్ని భావంతో పాటుగా తన జీవితం పొడవునా తన సంతానానికి - సమాజానికి - సందర్భం వచ్చినప్పుడల్లా చెప్పేవాడు. 
తాను జైల్లో ఉన్నప్పుడు కూడా రామాయణం మహాభారతాలు చదివేవాడు. జీవితంలో ఎన్నడూ మద్యపానం చేయలేదు . 

#బారిష్టర్_గా :  

మద్రాసు విశ్వవిద్యాలయం నుండి B.A డిగ్రీ పొందిన తర్వాత, 1911లో ఇంగ్లాండులోని మిడిల్‌ టెంపుల్ నుండి బారిష్టర్ ఎట్ లా పట్టా పుచ్చుకున్నాడు కోటిరెడ్డి. తర్వాత న్యాయవాదిగా జీవితాన్ని ప్రారంభించాడు . మద్రాసులో బారిష్టర్ గా ప్రాక్టీసు ప్రారంభించిన మాటే గానీ ఆ వృత్తిలో ఎక్కువ కాలం నిలబడలేక పోయాడు. కొన్నిసార్లు తనని నమ్ముకుని వచ్చిన బాధితుల తరుపున అబద్దాలు చెప్పాల్సి రావడం కోటిరెడ్డి భరించలేకపోయాడు. తన అబద్దాల వలన న్యాయం ఓడిపోవడం తట్టుకోలేకపోయాడు. అందుకే .... ఆ వృత్తిలో కొనసాగితే జీవితమే అబద్దం అయిపోతుందని భావిస్తూ ఒక సంవత్సర కాలం మాత్రమే ఆ వృత్తిలో ఉండి ఆ తరువాత న్యాయవాద వృత్తి నుండి తప్పుకున్నాడు. 
కడపలో స్థిరపడ్డాడు. కడపలో స్థిరనివాసం ఏర్పరచుకున్నందున కడప కోటిరెడ్డిగా పేరు స్థిరపడిపోయింది. 
ముఖ్యంగా మొదట్లో న్యాయవాద వృత్తిలో చేరినప్పటికీ, ఆ తర్వాత కూడా తనకు ఎంతో ఇష్టమైన రైతు జీవితాన్ని మాత్రం కోటిరెడ్డి వదిలిపెట్టలేదు. 

#స్వాతంత్ర్య_పోరాట_సమయంలో 

1921లో మహాత్మాగాంధీతో కలిసి రాయలసీమ ప్రాంతం మొత్తం పర్యటించాడు. 

1922లో శాసనసభలో ప్రవేశించాడు.

1926లో స్వరాజ్యపార్టీ ఉపనాయకుడిగా ఎన్నుకోబడినాడు. 

1929లో స్వతంత్ర సభ్యుడిగా మద్రాసు శాసనసభకు ఎన్నుకోబడినాడు. 

1931లో తిరిగి ఏకగ్రీవంగా మద్రాసు శాసనసభకు ఎన్నికయినాడు.

మద్రాసు ప్రెసిడెన్సీలో శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలుండేవి. ప్రెసిడెన్సీలో తమిళుల ప్రాబల్యం అధికంగా ఉండేది..
తమిళుల ఆధిపత్యాన్ని నిరసిస్తూ ప్రత్యేక ఆంధ్ర ఉద్యమంలో కీలక పాత్ర వహించాడు. 

తెలుగువారిపై తమిళ పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ ఏర్పాటైన ఆంధ్రమహాసభకు 1929, 1937 లోరెండు సార్లు అధ్యక్షత వహించాడు. ఈ అవకాశం పొందిన మొదటి వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ కాగా రెండవ వ్యక్తి కోటిరెడ్డి. 
1931లో మద్రాసులో జరిగిన ఆంధ్రమహాసభ ప్రత్యేక సమావేశం కూడా ఈయన అధ్యక్షతలోనే జరిగింది

1940లో ఉప్పు సత్యాగ్రహంలో క్రియాశీలకంగా పాల్గొన్నాడు. ఇందుకు జైలుకు కూడా వెళ్లాడు.

గాడిచర్ల హరిసర్వోత్తమరావుతో కలిసి రాయలసీమలో హోమ్ రూల్ ఉద్యమంలో కూడా కోటిరెడ్డి చురుగ్గా పాల్గొన్నాడు.

కల్లూరు సుబ్బారావు, పప్పూరు రామాచార్యులతో కలిసి రాయలసీమ ప్రజా శ్రేయస్సు కోసం పనిచేసాడు. 

కాంగ్రెస్‌కు అనుకూలమైన ప్రెసిడెన్సీ అసోసియేషన్‌లో గుత్తి కేశవపిళ్లెతో కలిసి పనిచేశాడు.  

 భారత రాష్ట్రపతిగా ఎదిగిన రాజకీయ ఉద్దండుడు
నీలం సంజీవరెడ్డికి రాజకీయ గురువు కడప కోటిరెడ్డి. 

 👉సంఘ సంస్కరణలో -

ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రాజాజీ ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసి సంస్కరణల్ని చేపట్టాడు కోటిరెడ్డి. ఈ క్రమంలో భాగంగా మధుర, తిరునల్వేలి, శ్రీరంగం దేవాలయాలలో హరిజనులకు ఆలయ ప్రవేశం కల్పించాడు.

👉 భార్యను ప్రోత్సహిస్తూ - 

కోటిరెడ్డి సతీమణి రామసుబ్బమ్మ. భర్త సహకారంతో స్వాతంత్ర్యోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. మొదటినుండి కోటిరెడ్డికి స్త్రీలంటే గౌరవం. ప్రతిభ, ధైర్యం, ఆలోచించే శక్తి ఉండి కూడా స్త్రీలు వెనకబడి పోవడాన్ని 
వీరి మనసు ఒప్పుకోలేదు. స్త్రీలకు పురుషుడితో సమానహోదా కల్పించాలని తపించాడు. ఈ క్రమంలో తన భార్య రామసుబ్బమ్మకు ఆంగ్ల భాష నేర్పించాడు. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనేందుకు ప్రోత్సాహం అందించాడు. అన్నీ తానై ఆమెను తీర్చి దిద్ది ముందుకు నడిపించాడు. 
ఈ తరుణంలో మదనపల్లి థియసాఫికల్ సొసైటీకి సంబంధించిన శ్రీమతి మార్గరెట్ కజన్ గారి పేరును కూడా చెప్పుకోవాలి. రామసుబ్బమ్మ రాజకీయాలలోకి వీరు రావడానికి మంచి ధైర్యం అందించారు. 

#ఆడకూతుళ్లను_ఆదరిస్తూ_గౌరవిస్తూ 

తర్వాతి కాలంలో తన సంతానం ఆడబిడ్డల చదువు విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాడు కోటిరెడ్డి 
1942 లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలులో ఉన్నప్పుడు వారి కుమార్తె ఇందిరాదేవి ఎస్ఎస్ఎల్‌సి ఉత్తిర్ణత సాధించింది..ఆ విషయము తెలిసి తండ్రిగా ఎంతో సంతోషించాడు. అంతేకాదు ఆడపిల్ల చదువు అంతటితో ఆగిపోవద్దని ఉన్నత చదువుల కోసం ప్రోత్సహించాడు. ఇట్లా మహిళా చైతన్యాన్ని మనసారా ఆహ్వానించాడు కోటిరెడ్డి. 

ఇక పరాయి స్త్రీల మీద గౌరవాన్ని గమనిస్తే... కోటిరెడ్డి లండన్లో చదువుతున్నప్పుడు ఒక్కసారి క్రిస్మస్ వేడుకలకు హాజరు అయ్యాడు. ఈ వేడుకల్లో భాగంగా ఒక మహిళ క్రిస్మస్ ట్రీ దగ్గర నిలుచుంటే , వేడుకలకు వచ్చిన ఒక్కొక్కరు వరుసగా వెళ్లి ఆ మహిళను ముద్దుపెట్టుకునే ఆచారం కాసేపటికి మొదలయ్యింది. కానీ మన కోటిరెడ్డి పరాయి స్త్రీని ముద్దాడటాన్ని ఒప్పుకోలేదు. అది భర్త హక్కుగా భావించాడు. అందుకే 
ఆ ఆచారాన్ని తిరస్కరిస్తూ అక్కడి నుండి బయటకు వచ్చేసాడు. ఈ విషయాన్ని కూడా వారి కూతురు ఇందిరాదేవి పేర్కొన్నారు. 

#ఖాదీ_ఉద్యమంలో

గాంధీ మహాత్ముడు దేశవ్యాప్తంగా ఖాదీ సంఘాలు స్థాపించాడు. రాయలసీమ ప్రాంతానికి సంబంధించి కోటిరెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఖాదీ ప్రచారం అప్పట్లో దేశ వ్యాప్తంగా విస్తృతంగా జరుగుతున్నది. 
ఈ నేపథ్యంలో విజయవాహిని స్టూడియో అధినేత బి. నాగిరెడ్డిగారు గాంధీ గారి ప్రభావంతో తమ గ్రామమైన కొత్తపల్లిలో ఖాదీ బట్టలు నేయించేవారు. కాగా కోటిరెడ్డి గారు ఒకమారు అనివార్యకారణాల వల్ల కొత్తపల్లి గ్రామములో ఉన్న ఖాదీ సంఘానికి ముడిసరుకులు సరఫరా చేయలేకపోయారు. ఇందువల్ల సమస్య లేదు, నష్టం లేదు. అయినప్పటికీ కోటిరెడ్డి భరించలేకపోయాడు. అందుకే తానే స్వయంగా కొత్తపల్లి వెళ్లి శ్రీనాగిరెడ్డి గారికి క్షమాపణ చెప్పారు ఇంతటి సున్నిత మనసు కలిగిన కోటిరెడ్డి తన జీవితంలో ఎప్పుడూ కూడా ఎవ్వరికి అన్యాయం చేయలేదు. స్వార్థ రాజకీయాలకి పాల్పడలేదు. ఈ ఒక్క సంఘటన వారి మనస్తత్వాన్ని తెలియపరుస్తున్నది. 

 #స్వాతంత్య్రం_అనంతరం 

1947 స్వాతంత్ర్యం తర్వాత 1952లో జరిగిన తొలి ప్రజాస్వామిక సాధారణ ఎన్నికల్లో కడప నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు. 

1953 అక్టోబరు 1 న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది.ఆంధ్రరాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా 
అక్టోబరు 1, 1953—నవంబరు 15, 1954
వరకు టంగుటూరి ప్రకాశం పంతులు
పనిచేయగా వారి మంత్రివర్గంలో కోటిరెడ్డి పనిచేశాడు.

1955 లో లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యాడు. 

1957లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు, 1964లో శాసనమండలికి ఎన్నికయ్యాడు. 

రాయలసీమ కరువు సంఘానికి అధ్యక్షుడిగా
వ్యవహరించారు.  

#శ్రీబాగ్‌_ఒడంబడికలో 

ఆంధ్ర మహాసభకు అధ్యక్షుడిగా కొనసాగుతూ... శ్రీభాగ్ ఒడంబడికపై సంతకంచేసి సమగ్ర ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు చేయడానికి మార్గాన్ని సుగమం చేశారు ఇట్లా చిత్తశుద్దిగా శ్రీ బాగ్ ఒడంబడిక రూపుదాల్చటంలో కీలక పాత్ర పోషించాడు.

#నీతికి_కట్టుబడి 

ఆనాటి జస్టిస్ పార్టీ నాయకులు పానగల్ రాజు గారు కోటిరెడ్డి గారిని ప్రభావితం చేసే ప్రయత్నం చేశారు. తమ పార్టీలో చేరమని చేరిన వెంటనే మంత్రిపదవి ఇస్తామని తాయిలాలు ప్రకటించారు. కానీ స్వదేశాభిమాని దేశభక్తుడు అయిన కోటిరెడ్డి ఇందుకు ఒప్పుకోలేదు. 
 బ్రిటిష్ వారికి లొంగి పనిచేసే పార్టీలో చేరడానికి నిర్మొహమాటంగా నిరాకరించారు . 
 
కోటిరెడ్డి మదనపల్లిలో చదువుకునే రోజులలో కూడా ఒక సంఘటన జరిగింది. ఊరి నుండి మదనపల్లికి రైలు ప్రయాణం చేయాల్సి ఉన్నది.ఈ సందర్భంలో రైల్వేస్టేషన్‌కు చేరుకునే సరికి ఆలస్యం జరిగింది. అప్పటికే పట్టాల మీద ఆగివున్న రైలు కదులుతున్నది. టిక్కెట్టు కొనుక్కునే సమయం కూడా లేదు. ఈ పరిస్థితిలో కదులు తున్న రైలు ఎక్కేసాడు. కానీ తరువాత స్టేషన్లో దిగి టిక్కెట్టు తీసుకుని తన నిజాయితీ చాటుకున్నాడు. ఈ విషయం వారి కూతురు ఇందిరాదేవి గారు తన జ్ఞాపకాలలో పేర్కొన్నది. 

 #బతకాలనిఉంది 

జీవితంలో కోటిరెడ్డి ఎప్పుడూ నిరాశ చెందలేదు. అత్యాశ పడలేదు. జీవితాంతం ఎంతో ఉత్సాహంగా ఆనందంగా చలాకీగా జీవించారు. వయసు పెరిగిన తరువాత కూడా కోటిరెడ్డి ఎటువంటి అనారోగ్యానికి గురికాలేదు. తన చివరి రోజుల వరకు కూడా దినచర్యను కూడా తప్పలేదు. ప్రతిరోజూ దినపత్రిక చదివేవాడు. తన కాలం సమాజానికి ప్రస్తుత సమాజానికి వ్యత్యాసం గమనించి, పెరుగుతున్న స్వార్థాన్ని చూసి బాధపడేవాడు.  
 
ఈ పరిస్థితుల్లో ఒకసారి తన కూతురుతో - " అమ్మా ! నాకు ఇప్పుడు ఒక ఆశ ఉంది. ఇంకా పదిహేను సంవత్సరాలు బ్రతకాలని ఆశ ఉంది. ఎందుకంటే శాస్త్రీయ విజ్ఞానంతో మానవాళి ఎంతో అభివృద్ధి చెందింది . భవిష్యత్తులో దేశ ప్రజలు ఇంకా అభివృద్ధి చెందుతారు. గొప్ప సౌకర్యాలు పొందుతారు. ఈ అభివృద్ధిని కళ్లారా చూడాలని ఉంది " అన్నాడు. కానీ సంపూర్ణ అభివృద్ధిని చూడకుండానే వెళ్ళిపోయాడు. 

కొందరే మహానుభావులు - అందరికీ వందనాలు 🙏
__________________________________

ఆధారం : 
1)ఇందిరాదేవి స్వగతం. ( కోటిరెడ్డి కూతురు )
2) " రాయలసీమ ప్రముఖులు " నిరంజన్ రెడ్డి వ్యాసం
3) కడప జిల్లా భారత స్వతంత్ర సమరయోధులు వ్యాసం

No comments:

Post a Comment