Monday, April 15, 2024

నర్రా బాలసిద్దారెడ్డి

నర్రా బాలసిద్దారెడ్డి
( 1928 - 2011)
( సాయుధ పోరాట వీరుడు )
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
వ్యాసకర్త : తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

తోడేళ్ళకు ఎదురునిలవాలంటే సాహసానికి స్నేహితుడై ఉండాలి...
హైనాలను తరిమికొట్టాలంటే ధైర్యానికి చుట్టరికమై
ఉండాలి...
ఆవును...
కాలాంతకులపై కదం తొక్కాలంటే తానే ఒక ఆయుధమై ఉండాలి..
అతడు....
వేల చేతులు చాచిన చీకట్లను చీల్చి చెండాడిన మహోజ్వల స్వప్నం ....
నర్రా బాలసిద్దారెడ్డి....

👉వివరాల్లోకి వెళ్తే....

మెదక్ జిల్లా కొండపాక మండలం బందారం గ్రామానికి చెందిన సిద్దారెడ్డి...రాజమ్మ దంపతులకు 1928 లో బాల సిద్దారెడ్డి జన్మించాడు.వీరిది వ్యవసాయక రైతు కుటుంబం. వీరు జన్మించే నాటికి తెలంగాణ నిజాం చీకటి పాలనలో మగ్గుతున్నది. పెత్తందారీ వ్యవస్థ గ్రామాలపై కొరడాలు ఝలిపిస్తున్నది.
ఒకవైపు భారత స్వాతంత్ర్య పోరాటం వీరుల స్ఫూర్తి పంచుతూ....మరోవైపు తెలంగాణ వెనకబాటు తనం అస్తిత్వానికి ఆత్మగౌరవ పాఠాలు నేర్పుతూ...సమాజంలో ఒక నవ శకానికి నాంది పలుకుతున్న కాలం బాల సిద్దారెడ్డి బాల్యం! ఈ క్రమంలో యుక్త వయసు వచ్చేనాటికి ఒక ధ్యేయం అతడిలో రూపు దాల్చింది. అదే..... సమరోత్సాహం!

👉రజాకార్ ఆగడాలు,- గ్రామరక్షణ దళం 

1947 - 1948 కాలం తెలంగాణను చిగురాటాకులా వణికించింది. రజాకార్ వ్యవస్థ గ్రామాలపై పంజా విసురుతూ వికృత విహారంతో అట్టుడికించడం మొదలయ్యింది.
పండించిన ధాన్యానికి భద్రత లేదు. స్త్రీల మాన ప్రాణాలకు రక్షణ లేదు. పసి పిల్లలకు భవిష్యత్తు భరోసా లేదు. ఎటు చూసినా రజాకార్ కరాళ కేళి... విలయ తాండవం...!
ఈ పరిస్థితుల్లో బందారం గ్రామంలో ఒక గ్రామ రక్షణ
పుట్టుకొచ్చింది. రజాకార్ శక్తుల నుండి అన్నివిధాలా గ్రామాన్ని రక్షించడం కోసం యువత నడుం బిగించింది.
దళమై దాష్టికాలను అడ్డుకోవడం కోసం ఎదురు నిలిచింది. ఈ దళాన్ని ముందుండి నడిపించిన పద్దెనిమిదేళ్ల యువకుడు.... నర్రా బాలసిద్దారెడ్డి.

👉చుట్టు పక్కల గ్రామాలకు భద్రత

బందారం గ్రామంలో ఆవిర్భవించిన గ్రామ రక్షణ దళం క్రమంగా చుట్టుపక్కల పది గ్రామాల వరకు పనిచేయడం మొదలెట్టింది. ఆయా గ్రామాల యువకులు కూడా బందారం దళానికి వెన్నుదన్నుగా నిలబడ సాగారు. ఈ క్రమంలో దళం శక్తి పెరిగింది. కానీ ఆయుధ శక్తి తగినంతగా లేదు.

వడిసెల రాళ్లు, గుత్పలు, కర్రలు, దళం ఆయుధాలుగా ఉన్నాయి. అప్పటికే రజాకార్ల వద్ద నాటు తుపాకులతో పాటుగా ఆధునిక ఆయుధాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో రజాకార్లను ఎదుర్కొని నిలబడాలంటే సిద్దారెడ్డి దళానికి ఆయుధాలు తప్పనిసరిగా అవసరం అయ్యింది.

ఇందుకు బందారం గ్రామంలో కమ్మరి వీరయ్య సిద్దారెడ్డి దళానికి సహకారం అందించాడు. రహస్యంగా నాటు తుపాకులు తయారు చేసి అందించాడు.

👉దళాన్ని బలోపేతం చేసిన ఘనత

రజాకార్లకు వ్యతిరేకంగా గ్రామ దళాన్ని నడిపించడం అంటే ప్రాణాలపై ఆశ వదులుకుని సమరంలోకి దిగడమే. ఎప్పుడు ఎవ్వరు ఏ దిశ నుండి దాడులు నిర్వహిస్తారో తెలియదు. క్షణ క్షణం అప్రమత్తతే జీవితం. ఈ పరిస్థితుల్లో దళం బలోపేతం కోసం గ్రామాల్లో యువతను సిద్ధం చేయడం, దాడులు తిప్పికొట్టడంలో శిక్షణ ఇవ్వడం, రజాకార్లను పసిగట్టి సమాచారం చేరవేయడం, ఎత్తుగడల్లో యువతతో పాటుగా మహిళల సహకారాన్ని తీసుకోవడం, వంటి
బాధ్యతలను ఆదేశించడంలోనే కాదు, నిర్వహించడంలోనూ బాలసిద్దారెడ్డి అవిశ్రాంతంగా శ్రమించాడు.

👉కమ్యూనిస్టు పార్టీ ప్రభావం 

తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులు, ఆర్యసమాజ్ వర్గాలు, కాంగ్రెస్ శ్రేణులు ఎవ్వరి దారుల్లో వారు తమ పోరాటాన్ని కొనసాగించి రజాకార్లను ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో బాలసిద్దారెడ్డి కమ్యూనిస్ట్ ప్రభావంతో పోరాటం నడిపించాడు.

నిజాం నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ రజాకార్లను తుదముట్టించడమే లక్ష్యంగా .....భైరాన్ పల్లి సంఘటన ప్రేరణగా.....తెగించి ఉద్యమంలో పాల్గొన్న
సిద్దిపేట - సిరిసిల్ల దళం నాయకుడు 
ఎడ్ల గురువారెడ్డి సహచర్యంలో బాల సిద్దారెడ్డి పోరాట పాఠాలు అభ్యసించాడు.

కొలనుపాక కొదమసింహాలు ఆరుట్ల సోదరులతోనూ బాల సిద్దారెడ్డి సైద్దాంతిక సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నాడు..

భైరాన్ పల్లి, బెక్కల్లు,కూటిగల్లు ఘటనలు
బాల సిద్దారెడ్డికి ప్రేరణనందించాయి.

👉భూ పంపిణి

అంటరాని తనం, వెనకబాటు తనం, పేదరికం, ఇవన్నీ ఆనాటి సమాజంలో తీవ్రంగా ప్రబలి ఉన్న సామాజిక రుగ్మతలు.ఈ పరిస్థితుల్లో ఉద్యమం సాగించి, పేదలకు..హరిజనులకు భూమి పంపకాలు చేయించాడు. ఇది వారి ఉద్యమ జీవితంలో ఉదాత్తమైన ఘటన.

ప్రభుత్వ బాంచరాయి భూములు రెండు వందల ఎకరాలను తన పర్యవేక్షణలో హరిజనులకు పంచిపెట్టడం ద్వారా ఎందరో అట్టడుగు జీవితాలకు ఆసరా దొరికిందని వేరే చెప్పక్కరలేదు.

👉కుటుంబం

బాల సిద్దారెడ్డి భార్య రత్నమాల. అందరూ రత్నమ్మ అని పిలిచేవాళ్ళు. ఈ దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె.

👉 నిర్దేశకుడు

దళం నడిపించడంలో బాలసిద్దారెడ్డి తెలివి తేటలు
ఎదురులేనివి. చూస్తే......ఒక్క ఆలోచనతో వందమందిని కదిలించే బాలసిద్దారెడ్డి అస్సలు చదువుకోలేదు. పోరాటం తర్వాత పార్టీ ప్రోత్సాహం తో విశ్రాంత ఉద్యోగి నర్సింహులు సహకారం తో చదవటం,రాయటం నేర్చుకున్నాడు

తాను పెద్దగా చదువుకోకపోయినా - "" పుస్తకాలు చదవడం మాత్రమే కాదు.. పుస్తకాలు రాయాలి కూడా "" అంటూ ఎందరినో సాహిత్యం వైపు ప్రేరేపించిన ఘనత బాలసిద్దారెడ్డి సొంతం. వీరి మాటలని ఆదర్శంగా తీసుకుని తెలంగాణ బతుకు చిత్రాలను యథాతతంగా మాగాణాల్లో చిత్రీకరించిన రచయితల్లో వీరి కుమారుడు నందిని సిధారెడ్డి ఒకరు కావడం విశేషం..
కవి రచయిత, సామాజిక ఉద్యమకారుడు . తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షుడు,
""నాగేటి సాల్లల్ల నా తెలంగాణ.. నా తెలంగాణ’'' అంటూ తెలంగాణ ఆర్తిని...ఆకాంక్షను... సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పిన దార్శనికుడు - 
నందిని సిద్దారెడ్డి గారి గురించి ఈ సందర్బంగా ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

👉కాలధర్మం

తాను అడుగు ముందుకు వేసి
అందరిని ముందుకు నడిపించి..
తాను ప్రాణాలకు తెగించి
అందరి ప్రాణాలకు తాను అడ్డుగా నిలిచి....
అదర్శంగా
అందరివాడుగా
జీవించినంత కాలం నిండుగా నిరాడంబరంగా బతికిన
యోధుడు బాల సిద్దారెడ్డి 2011 లో ఈ ప్రపంచంతో
సెలవు తీసుకున్నాడు.
వారి అడుగుజాడలు చిరస్మరణీయం 🙏🏿
____________________________________________

[ నర్రా బాలసిద్దారెడ్డి గారి వివరాలు అందించిన, వారి కుమారుడు తెలంగాణ కవి నందిని సిద్దారెడ్డిగారికి ప్రత్యేక కృతజ్ఞతలు ]

No comments:

Post a Comment