Monday, April 15, 2024

ఎర్రబోతు రాంరెడ్డి -తెలంగాణా విముక్తి పోరాటయోధుడు

ఎర్రబోతు రాంరెడ్డి( 1931- 2018)
(తెలంగాణా విముక్తి పోరాటయోధుడు..)
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
వ్యాసకర్త : తంగెళ్ళశ్రీదేవిరెడ్డి 

జీవితాన్ని ఉద్యమానికి అంకితం ఇచ్చిన త్యాగశీలి ... 
ఉద్యమాన్ని జీవితానికి అనుసంధానం చేసిన ధీశాలి... 
బతకడంలో ధర్మాన్ని 
బతికించడంలో ధైర్యాన్ని 
ప్రదర్శించిన నికార్సయిన పరాక్రమశాలి.... 
ఎర్రబోతు రాంరెడ్డి !
పరిచయం : 

నల్లగొండ జిల్లా అప్పాజి పేట, వాస్తవ్యులు ఎర్రబోతు 
బుచ్చిరెడ్డి, సత్యమ్మ దంపతులకు అక్టోబర్ 10, 1931 సంవత్సరంలో రాంరెడ్డి జన్మించాడు. చిన్నప్పటి నుండి వయసుకు మించిన చురుకుదనంతో ఉండే రాంరెడ్డి గురించి అందరూ " వీడు దేశాన్ని యేలేటట్టు ఉన్నాడు " అనేవాళ్లట. ఆ మాట దేశం కోసం పోరాడటంలో నిజమయ్యింది. 

పాఠశాలకు వెళ్లకముందే మౌఖిక ప్రదర్శించిన రాంరెడ్డి.... తమ సొంత ఊరు అప్పాజీపేటలో నాల్గవ తరగతి వరకు చదివాడు. తర్వాత ఐదవ తరగతి కోసం రాంరెడ్డిని నల్లగొండ పంపించారు. అక్కడ మాల్‌బౌలీ ఉర్ధూ మీడియం స్కూల్‌లో చేర్పించారు. రామగిరి హస్టల్‌లో ఉంటూ ఏడవ తరగతి వరకు అక్కడే చదువుకున్నాడు.   

ఉద్యమం పట్ల ఆకర్షణ :

1947 సంవత్సరంలో ఏడవతరగతిలోకి ప్రవేశించాడు రాంరెడ్డి. అప్పటికి తెలంగాణలో పరిస్థితులు నిజాం వ్యతిరేక పోరాటాలతో అట్టుడుకుతున్నది. ఉద్యమ ఆవశ్యకత గురించి, నిజాం అకృత్యాల గురించి, అప్పటికే ఉద్యమకారులు రోజూ ప్రచారాలు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో పాఠశాలల్లో విద్యార్థులను చైతన్య పరుస్తున్నారు. 

రజాకార్ల దాడులు, పోలీసుల దాడులు, ప్రజల ప్రతిఘటనలతో వ్యవస్థ అల్లకల్లోలంగా ఉన్నది. ఇదంతా ఒక విద్యార్థిగా రాంరెడ్డి కళ్లారా చూస్తూనే ఉన్నాడు. ఆర్యసమాజ్ కాంగ్రెస్ ప్రచారాలు, కమ్యూనిస్టుల ప్రచారాలు, పోటాపోటీగా జరుగుతున్నాయి. ఇది కూడా గమనిస్తున్నాడు. 
 ఈ పరిస్థితిల్లో నల్లగొండ ప్రాంతంలో కమ్యూనిస్టు ఆంధ్రమహాసభ నాయకుల సమావేశాలు పెద్ద ఎత్తున జరిగాయి. కమ్యూనిస్టులకు నల్లగొండ కంచుకోటలా తయారయ్యింది. ఈ క్రమంలో కమ్యూనిస్టుల ఉపన్యాసాలు ఆంధ్రమహాసభ నాయకుడు ధర్మభిక్షం ఉపన్యాసాలు,రాంరెడ్డి మీద ప్రభావం చూపాయి. దీంతో కమ్యూనిజంపై ఆసక్తిని పెంచుకున్నాడు.

మీజాన్ పత్రిక ప్రభావం 

1944 నుండి 1948 వరకు నైజాం ప్రాంతంలో వెలువడిన ధీటైన పత్రిక మీజాన్. అన్నిరకాల వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఆంగ్లం, తెలుగు, ఉర్దూ భాషలలో ఈ పత్రిక వెలువడేది. మూడు సంచికలకు యాజమాన్యంగా వ్యాపారవేత్త గులాం మహమ్మద్ 
వ్యవహరించేవాడు. 
1 ) మిర్జా అబీద్ అలీ బేగ్ సంపాదకుడుగా 
ఆంగ్ల మీజాన్ ఫ్యూడల్ వ్యవస్థకు అనుకూలంగా ఇది నిజాం ప్రభుత్వ చర్యలకు మద్దతు పలుకుతూ వెలువడేది   
2) హబీబుల్లా ఔజ్ సంపాదకుడుగా మీజాన్ 
ఉర్దూ సంచిక రజాకార్లకు మద్దతుగా కథనాలు రాసేది. . 
3)అడవి బాపిరాజు సంపాదకుడుగా మీజాన్ తెలుగు సంచిక నిజాం వ్యతిరేక వార్తలను, ఉద్యమ సాహిత్యాన్ని ప్రచురించేది. ఈ పత్రికలో వచ్చే ఉద్యమ సాహిత్యం ఆనాటి యువతను విపరీతంగా ఆకర్షించింది. ఎందరో విద్యార్థులు మీజాన్ ఉద్యమ సాహిత్యం కోసం అన్నపానీయాలు మానివేసి ఎదురు చూసేవాళ్ళు. రాంరెడ్డి కూడా ఈ వరసలో యువకుడే. ఉద్యమ సాహిత్యానికి ఆకర్షితుడై, అనంతరం చదువు అర్ధాంతరంగా ఆపివేసి ఉద్యమబాట పట్టాడు.

ఉద్యమబాటలో :

1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్యం వచ్చింది. తెలంగాణలో నిజాం వ్యతిరేక ఆందోళనలు జరిగాయి. కమ్యూనిస్టు పార్టీ ప్రజలకు పిలుపు ఇచ్చింది. విద్యార్థులు తరగతులను బహిష్కరించారు. ఎర్రబోతు రాంరెడ్డి ఆ రోజు పాఠశాల నుండి బయటకు వచ్చాడు తర్వాత న మళ్ళీ పాఠశాలకు వెళ్ళలేదు.
 
అప్పటికి ఎర్రబోతు రాంరెడ్డి 16 సంవత్సరాల యువకుడు. ఏడవ తరగతి చదువుతున్నాడు. గొప్ప చదువులు చదవాలని తల్లిదండ్రుల కల. కానీ రాంరెడ్డి సమాజం కోసం తన ఆత్మీయుల ఆశలను కలలని పక్కకు పెట్టేసాడు. ప్రజలు బాగుంటే మనం బాగున్నట్టే అని చిన్న వయసులోనే పెద్ద మాటలు మాట్లాడే వాడు. ఉద్యమ నాయకులని తన తెలివి తేటలతో ఆశ్చర్య చకితులను చేసేవాడు. అందుకే ఉద్యమంలో పనిచేసే వారికి రహస్యంగా మీజాన్‌ పత్రికను చేరేవేసే బాధ్యతను రాంరెడ్డికి అప్పగించింది అధిష్టానం. 

ఊరూరా తిరుగుతూ :

ఉద్యమంలో చేరగానే ఎర్రబోతు రాంరెడ్డి మరింత చైతన్యవంతం అయ్యాడు. తన సహచరులతో కలిసి మీజాన్ పత్రికలతో ఊరూరూ తిరిగాడు. అడవుల్లో తిరిగాడు. అంతటితో మాత్రమే తన బాధ్యత పూర్తయ్యింది అనుకోలేదు. పల్లెల్లో నిజాంకు వ్యతిరేకంగా ప్రచారాలు చేస్తూ ప్రజలను ప్రజలను జాగృత పర్చడంలో కొత్త కొత్త ఆలోచనలకు ఊపిరి పోసేవాడు. 
1) పురాణాల్లో దుష్ట శిక్షణ కథలను ప్రజలకు నాటకాల రూపంలో వినిపించే ప్రయత్నం చేసాడు. 
2 ) నిజాంకు వ్యతిరేకంగా ప్రత్యేకంగా పాటలు రాయించి పాడించేవాడు. 
3) యువకులను సమీకరించి ఉద్యమం గురించి అవగాహనా పాఠాలు భోధించేవాడు. 
4) )రాత్రి పగలు తేడా లేకుండా గ్రామాల్లో తిరుగుతూ 
ఉద్యమ వ్యతిరేక శక్తుల సమాచారం స్వయంగా సేకరించేవాడు. 
5) ధైర్యం కూడగట్టుకుని ఉద్యమ వ్యతిరేక సమావేశాలకు అనుకూలుడిగా హాజరయ్యి రహస్యాలను రాబట్టుకునే వాడు. ఇటువంటి సందర్భాల్లో అవసరమైతే మారు వేషం ధరించేవాడు. 
6) పగటివేషాల వారి గుంపులో ఒకడిగా చేరి కూడా 
సమాచారం కోసం ప్రయత్నం చేసేవాడు. 
7) పాఠశాలలు, వసతి గృహాలు మూసి వేయించి మువ్వన్నెల భారత పతాకాల్ని ఎగురవేసి నిజాంకు వ్యతిరేకంగా నినాదాలు చేయించేవాడు. 
8)తాటి చెట్ల పన్నులు కట్టవద్దని పల్లె పల్లె తిరిగి చెప్పేవాడు 

ఉద్యమ విస్తరణలో :

వయసు చిన్నదే అయినప్పటికీ తనకున్న అపార పరిజ్ఞానంతో మునుగోడు ప్రాంతంలో ఉద్యమాన్ని విస్తరింపచేశాడు. మునుగోడు ప్రాంత దళానికి ఆర్గనైజర్‌గా పనిచేశాడు. 

రజాకార్ల ఇన్‌ఫార్మర్ల హతం :

ఎర్రబోతు రాంరెడ్డి సామాన్యుడు కాదు. సూక్ష్మ దృష్టి ఎక్కువ.పరిశీలన చతురత అతడికి జన్మతా అబ్బిన విద్య. ఈ పరిజ్ఞానం సాయుధపోరాటకాలంలో రాంరెడ్డిని క్షణం తీరిక లేకుండా చేసింది. 
వివరాల్లోకి వెళ్తే...  
పోరాటంలో ఇరు వైపుల నుండి ఇన్‌ఫార్మర్ల సమస్య అనివార్యం అయ్యింది. ఉద్యమకారులుగా ఉంటూ పోరాట వ్యతిరేక శక్తులకు కీలక సమాచారాలని ఎప్పటికప్పుడు చేరవేస్తూ ఉద్యమ ద్రోహులుగా మసులుకుంటున్న వాళ్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఇందువల్ల పోరాటం అనేక ఒడిదుడుకులకు గురికావడం జరుగుతున్నది. 

రాంరెడ్డి తనదైన శైలిలో గమనించి తమ మధ్యలోనే ఉన్న రజాకార్ల ఇన్‌ఫార్మర్లను కనిపెట్టాడు. గ్రామాల్లోకి సంగపోల్లు వచ్చినప్పుడు వెంటనే సర్కారు తరుపు వ్యక్తులకు సమాచారం అందించే గ్రామస్తులను కూడా కనిపెట్టాడు.  

ఇటువంటి పరిస్థితిలో నార్కెట్‌పల్లి మండలం చిన్ననారాయణపురం గ్రామంలో రాంరెడ్డి దళం ఇద్దరు ఇన్‌ఫార్మర్లను కాల్చి చంపింది. ఈ ఘటనలో రాంరెడ్డి పాల్గొనలేదు. కానీ ఆ దళం నాయకుడు కాబట్టి, దాడికి నాయకత్వం వహించాడని అభియోగం మోపుతూ కేసు వేసింది . ఈ కేసులో రాంరెడ్డితో సహా మొత్తం ఆరుగురి పేర్లను నిందితులుగా చేర్చారు. 

ఉరిశిక్ష :

1948 సెప్టెంబర్ 17 నిజాం లొంగుబాటు తర్వాతసైనిక గవర్నర్‌ పాలన కొనసాగింది. కమ్యూనిస్టులు అడవుల్లోకి వెళ్లి మళ్ళీ సాయుధ పోరాటం నిర్వహించారు. ఆనాటి కాలపరిస్థితుల్లో రాంరెడ్డి కరుడుగట్టిన కమ్యూనిస్టుగా ఉన్నాడు. వీళ్ళ ఉద్యమంపై నిర్బంధ ఆంక్షలు పెరిగాయి. గ్రామాల్లో పోరాట వీరుల్ని నిలువరించడానికి భారత పోలీసు క్యాంపులు పుట్టుకొచ్చాయి. నిజాం రాజ్ ప్రముఖ్ గా నియమించబడ్డాడు. కమ్యూనిస్టులు ఎందరో తమ రాజకీయ అవసరాల కోసం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రజలు కూడా ఇక తమ దైనందిక జీవితాన్ని ప్రారంభిస్తూ కమ్యూనిస్టులకు మద్దతు పలకడం ఆపేసారు.

భారత్ లో తెలంగాణ విలీనం తర్వాత అక్కినేపల్లి, షా అబ్దుల్‌పురం గ్రామాలలో జరిగిన అల్లర్లలో దొరలు రజాకార్లు హత్య చేయబడ్డారు. హత్యల కేసులలో మరణశిక్షలు పడ్డాయి. 12 మందిని దోషులుగా గుర్తించి అరెస్టులు చేశారు.

ఈ పరిస్థితిలో ఔరవాణి, బ్రహ్మణ వెల్లంల గ్రామాల మధ్య ఒక వ్యవసాయ క్షేత్రంలో సేద తీర్చుకుంటున్న రాంరెడ్డి ఆచూకీ గురించి పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు వెంటనే దాడి నిర్వహించి రాంరెడ్డిని అరెస్టు చేసి నల్లగొండ సబ్‌జైలుకు పంపింది. తర్వాత ఖమ్మం కాన్సంట్రేషన్‌ క్యాంపునకు పంపింది. 

నల్లగొండలో స్పెషల్‌ ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేసి వారం రోజులపాటు రాంరెడ్డిపై విచారణ కొనసాగించారు. దొంగ సాక్ష్యాలను ప్రవేశపెట్టారు. 
కమ్యూనిస్టు నాయకులపై నిషేదాజ్ఞలు అమలులో ఉన్నాయి. గ్రామాలకు గ్రామాలు వణుకుతున్నాయి. ఈ స్థితిలో రాంరెడ్డి తరుపున డిఫెన్స్‌ లాయర్‌ వాదించే కూడా పరిస్థితి కూడా లేదు. మొత్తానికి రాంరెడ్డికి
ఉరిశిక్ష విధించబడింది. చెంచలగూడ జైలుకు పంపారు. అప్పటికి రాంరెడ్డి వయసు 17 సంవత్సరాలు మాత్రమే. 

సాయుధ పోరాటంలో పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని అన్నాళ్ళు వేధింపులకు గురిచేసిన నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని కొప్పొలుకు చెందిన నంద్యాల శ్రీనివాసరెడ్డికి , ఉమ్మడి నల్గొండ జిల్లా రామానుజాపురంకు చెందిన గార్లపాటి రఘుపతిరెడ్డిని, ఇప్పుడు అక్కినేపల్లి షా అబ్దుల్లాపురం హత్య కేసులో నిందితులుగా పేర్కొంటూ ఉరిశిక్షలు విధించారు. ఈ ఇద్దరు కూడా రాంరెడ్డి సమవయస్కులే.
వీరితో పాటుగా మరో 9 మందికి ఉరిశిక్షలు వేశారు.
 వీళ్ళు కూడా ఖమ్మం కాన్సన్ట్రేషన్ జైల్లో తర్వాత చంచల్ గూడా జైల్లో ఉన్నారు. 

ముఖ్యంగా అప్పటికి గ్రామాలని తగలబెట్టినోళ్లు, ఉద్యమకారులని సజీవంగా దహనం చేసినోళ్లు, బయట దర్జాగా తిరుగుతున్నారు. 

బాలుడి ఉరిశిక్ష కథనాలు :

తెలంగాణ పోరాట వీరులు జైలు జీవితం గడుపుతున్నారని తెలిసి, ఒక అమెరికన్ మహిళా జర్నలిస్ట్ జైలును సందర్శించి ఉద్యమకారులు అందరితో మాట్లాడింది. ఆమె ఎర్రబోతు రాంరెడ్డి విషయంలో ఎక్కువగా స్పందించింది. 

 "బాలుడికి ఉరిశిక్ష " ( Execution of a boy ) శీర్షికతో టైమ్ మాగజైన్‌ కోసం ఒక వ్యాసం కూడా రాసింది. ఇదే సమయంలో జెకోస్లోవేకియా రాజధాని ప్రాగ్‌లో అంతర్జా తీయ యువజనోత్సవాలు జరుగుతున్నాయి. ఆ ఉత్సవాలకు ప్రపంచం నలుమూలల నుండి దాదాపు 
పది వేలమంది హాజరయ్యారు. ఎర్రబోతు రాంరెడ్డి గురించిన కీలకమైన వ్యాసం ప్రచురింపబడిన పత్రికను ప్రదర్శిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. 
బాలుడుకి ఉరిశిక్ష వేయడాన్ని ముక్త కంఠంతో ఖండించారు . ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు జరిగాయి. అన్ని వైపుల నుండి నిరసన సెగలు తగులుతూ ఒత్తిడి పెరగడంతో అప్పటి నెహ్రూ ప్రభుత్వం అప్పీలుకు అవకాశం కల్పించింది.

అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రాంరెడ్డితో పాటుగా మిగతా వారు హైకోర్టుకు
అప్పీల్‌ చేశారు. ముంబై నుంచి లతీఫ్‌, గణేష్‌ అనే లాయర్లను కమ్యూనిస్టు పార్టీ రప్పించింది. 
 
భారతదేశం సౌర్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ప్రకటించబడిన రెండు రోజుల తరువాత, 1950 జనవరి 28న, సుప్రీంకోర్టు ఏర్పాటు చేయబడింది. లండన్ డి.ఎన్.ప్రిట్ బృందం తెలంగాణ సాయుధపోరాట కాలంలో విధించబడిన ఉరిశిక్షలపై భారత సుప్రీం కోర్టులో సుదీర్ఘంగా వాదించింది.  
అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ వరకు విషయం వెళ్ళింది. వారు పూర్వాపరాలు పరిశీలించారు. వారు ఎర్రబోతు రాంరెడ్డి ఉరిశిక్షను రద్దుచేసి యావజ్జీవ కారాగారశిక్షగా మార్చాడు.
అనంతరం ఏడేండ్ల సాధారణ జైలుశిక్షను అనుభవించాడు. ఎర్రబోతు రాంరెడ్డితో పాటుగా మిగతా ఏడుగురు కూడా ఒక వ్యాసం ఫలితంగా ఉరిశిక్షను తప్పించు కోవడం అనేది ఒక చారిత్రక ఘట్టం. 

కుటుంబం : 

ఉరిశిక్ష తప్పించుకున్నాక చుట్టాల అమ్మాయి సక్కుబాయమ్మని పెండ్లి చేసుకున్నాడు రాంరెడ్డి. అప్పటికి పోలీసు లాఠీ దెబ్బలు కారణంగా శారీరకంగా నిర్వీర్యమై ఉన్నాడు అతడు. దాదాపుగా అవిటి వాడయ్యాడు. అయినప్పటికీ మానసిక బలంతో ఆత్మ స్థయిర్యంతో అన్నింటిని అధిగమించాడు రాంరెడ్డి. వీరికి సక్కుబాయమ్మ సరైన జీవిత భాగస్వామి. భర్తని అన్నివిధాలా అర్థం చేసుకున్న అనుకూలవతి. ఈ దంపతులకు భాస్కర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డిలు సంతానం. 

ప్రజల కోసం :

జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత రాంరెడ్డి తన పూర్తి జీవితాన్ని తిరిగి ప్రజలకు పునరంకితం చేయాలి అనుకున్నాడు. ఈ క్రమంలో ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాడు. చోడంపల్లి గ్రామంలో పట్వారీ మొండి వైఖరి దృష్టికి వచ్చింది. రైతుల రికార్డులు ఇవ్వడానికి సదరు పట్వారి సుముఖంగా లేడు. అభ్యర్థనలను నిర్లక్ష్యం చేసాడు. ఈ పరిస్థితిలో ఎర్రబోతు రాంరెడ్డి పట్వారి మీద దాడి నిర్వహించాడు. ఈ కేసులో రాంరెడ్డికి పదకొండు సంవత్సరాలు జైలు శిక్ష పడింది. 

రాజకీయ జీవితం :

జైలు జీవితం తర్వాత అప్పాజీపేట సర్పంచ్‌గా ఏకగ్రీవంగా వరుసగా ఆరుసార్లు ఎన్నికయ్యాడు.

పీడీఎఫ్‌ తరుపున ఏమ్మెల్యేగా పోటీ చేసి కొద్దీ ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

రాంరెడ్డి ఒక వ్యవస్థ. జీవితం పొడవునా ప్రజల కోసం గాయపడుతూ .... జీవితాన్ని కోల్పోతూ వచ్చాడు. పోలీస్‌ దెబ్బలతో ఆరోగ్యం చాలా వరకు దెబ్బతిన్నది. నడుము వంగిపోయింది. అయినప్పటికీ ప్రజాసేవ నుండి తప్పుంచుకోడానికి వెనకడుగు వేయలేదు. బ్రతికి ఉన్నంత వరకు ప్రజాబంధువుగా బతకాలనే కాంక్ష రాంరెడ్డిని ఎప్పటికప్పుడు మానసికంగా పునరుజ్జీవుడిని చేసింది. 

చదువు పెద్దగా లేకపోయినా ఆంగ్ల భాషలో దిట్ట. 
ప్రజలకు అర్థం కానీ న్యాయ, రెవిన్యూ, విషయాలకు తనకున్న ఆంగ్ల పరిజ్ఞానంతో ఆసరాగా ఉన్నాడు. 

మరణం :

సాయుధ పోరాటంలో ఉరిశిక్ష ఖరారై చివరి క్షణాల్లో ఉరిశిక్ష రద్దుచేయబడిన వ్యక్తిగా చరిత్ర సృష్టించిన రాంరెడ్డి తెలంగాణ చరిత్రలో ఒక ధృవతార !
ధైర్యం సాహసం వారికి పెట్టింది పేరు. తెగింపుకు అస్సలైన చిరునామా. పోరాట కాలం నుండి సాధారణ రాజకీయాల వరకు వీరి సేవలు చిరస్మరణీయం. 
వీరు. 2018, నవంబర్ 10 శనివారంరోజున హైదరాబాద్‌లోని కిమ్స్‌లో అనారోగ్యంతోవున్న
మరణించాడు. 
స్ఫూర్తిని మాత్రం మిగిల్చాడు.

No comments:

Post a Comment