Monday, April 15, 2024

కల్లూరి భద్రారెడ్డి

కల్లూరి భద్రారెడ్డి
(1928-2015)
( తెలంగాణ సాయుధ పోరాట యోధుడు )
°°°°°°°°°°°°°°
వ్యాసకర్త : తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

ఎదురుంచి నిలబడే దృఢ సంకల్పం...
ప్రశ్నించి పరుగెత్తించే ధీటైన వ్యక్తిత్వం...
ముందుకు నడిచే ఆత్మవిశ్వాసం....
ధైర్యానికి మారుపేరు
పట్టుదలకి అసలు పేరు
కల్లూరి భద్రారెడ్డి...!
👉వివరాల్లోకి వెళ్తే....

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం ధర్మారెడ్డిగూడెంకు చెందిన కల్లూరి కోణారెడ్డి బుచ్చమ్మ 1928 లో దంపతులకు భద్రారెడ్డి జన్మించాడు. వీరిది సామాన్య రైతు కుటుంబం.
ఐదుగురు మగపిల్లలు, ఒక్క ఆడపిల్ల ఉన్న కుటుంబంలో భద్రారెడ్డి ఐదవ సంతానం.
భద్రారెడ్డి మూడు సంవత్సరాల వయసు....వారి తమ్ముడు ఒక సంవత్సరం వయసు ఉన్నప్పుడు తల్లి బుచ్చమ్మ మరణించారు. ఈ పరిస్థితిలో భద్రారెడ్డిని...వారి తమ్ముడిని...సోదరి సత్తెమ్మ చేరదీసి, కన్నతల్లిలా ఆదరించింది.

ఆనాడు జమిందారులు గ్రామాధికారులు గ్రామాలను నిజాం జాగీర్లుగా పాలిస్తున్నారు. ఆ కాలంలో
సర్కారు బడులను ధర్మబడులు అని పిలిచే వాళ్ళు. నెలకు ఒక్క రూపాయి నుండి రెండు రూపాయలు తీసుకునే ఖాన్గి బడులు కూడా అప్పట్లో ఉండేవి. కాగా నిజాం పాలనలో మారుమూల గ్రామాల్లో విద్యా సౌకర్యాలు లేవు. తమ పిల్లలను చదివించాలనే ఆశ ఉన్న పేద నిరుపేద తల్లిదండ్రులకు అవకాశం లేక నానా ఇబ్బంది పడే వాళ్ళు.

భద్రారెడ్డి చదువుకునే 1933 - 38 కాలం నాటికి ప్రజల అవసరాలని పట్టించుకోని దుస్థితి భయంకరంగా కొనసాగుతూ ఉంది. కాబట్టి భద్రారెడ్డిని చదువుకోవడం కోసం నాగపూరిలో ఉండే మేనత్త ఇంటికి పంపించారు. అక్కడ ఉర్దూ మద్యమంలో భద్రారెడ్డి నాల్గవ తరగతి వరకు చదువుకున్నాడు.తర్వాత సొంత గ్రామం చేరుకొని 
 ఖాన్గి బడిలో మరో రెండేళ్లు విద్యాభ్యాసం కొనసాగించాడు. ఆ తర్వాత చదువుకునే స్తొమత లేక
వ్యవసాయానికి అంకితం అయ్యాడు

▪️పేదరికం

భద్రారెడ్డి బాల్యం... యవ్వనం....పేదరికంలో కొనసాగింది. జొన్న గట్కా తప్ప వరి అన్నం రుచి ఎరుగని పరిస్థితి కొనసాగింది. మేనత్త ఇంట్లో తొలిసారిగా వరి అన్నం రుచి చూసి పేదరికాన్ని ఓదార్చుకున్న దయనీయత దాపురించింది. ఈ క్రమంలో కొన్నాళ్ళు వ్యవసాయంలో మోట కొట్టాడు. కొన్నాళ్ళు గొర్రెల కాపరిగా పని చేసాడు. కొన్నాళ్ళు ప్రతిరోజూ ఎనిమిది మైల్లు నడిచి కల్లు మోసే పని అయిష్టంగా బలవంతంగా చేసాడు. ఆ తర్వాత తన సొంత అన్న మరొకళ్ల భాగస్వామ్యంలో నడుపుతున్న కట్టె కార్కానలో రాత పనికి పూనుకున్నాడు.
ఇటువంటి పరిస్థితులే తనలో ఆత్మ విశ్వాసం నింపి, జీవితాన్ని రాటు తేలించి.... తనను తెలంగాణ సాయుధ పోరాటం వరకు నడిపించాయాని.... భద్రారెడ్డే స్వయంగా తన జీవిత చరిత్రలో చెప్పుకున్నాడు.

👉ఉద్యమంలో

1946 వ సంవత్సరం సాయుధ పోరాటానికి పునాది దశ. తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున యువకులు ఆంధ్రమహాసభ వెంట నడిచారు..తమ గ్రామ పట్వారీ 
పరెడ్డి చెన్నారెడ్డి, సోదరుడు మాధవరెడ్డి ప్రేరణతో ఈ 1946లోనే దళంలో చేరాడు. దళాల శక్తివంతం అయ్యింది.

1947 నాటికి శ్రమదోపిడీ, వెట్టిచాకిరీ, అత్యాచారాలు, వంటి సాంఘిక అమానుషాల మీద తిరుగుబాటు తీవ్ర రూపం దాల్చింది. అప్పటికి భద్రారెడ్డి సంఘంలో పూర్తి స్థాయిలో పనిచేయడం మొదలెట్టాడు.

భువనగిరి ప్రాంతంలో రావి నారాయణరెడ్డి ( బొల్లే పల్లి ) ఆరుట్ల రామచంద్రారెడ్డి , ఆరుట్ల కమలాదేవి , ఆరుట్ల లక్ష్మీనరసింహారెడ్డి ( కొలమపాక ) పెండెం వాసుదేవ్ ( భువనగరి ) బద్దం ఎల్లారెడ్డి ( కరీంనగర్ ) గురువారెడ్డి (సిద్దిపేట ) నాయకత్వంలో దళాలు సమిష్టిగా ముందుకు నడుస్తున్నాయి. ఆరుట్ల దళంలో భద్రారెడ్డి చురుగ్గా ఉన్నాడు.తోటి దళ సభ్యులతో కలిసి సమరోత్సాహంతో ముందుకు నడుస్తున్నాడు.

ఉద్యమ కార్యాచరణలో భాగంగా.....
రైతులు చెల్లించాల్సిన భూమిశిస్తు, కట్టాల్సిన అబ్కారి పన్ను, కొలవాల్సిన లేవిగల్లా, ఇవి ఏవీ కూడా సర్కారుకు ప్రజలు ముట్టజెప్పకుండా భద్రారెడ్డి బృందం పల్లె పల్లె తిరిగి ప్రచార కార్యక్రమాలు నిర్వహించసాగింది..

భద్రారెడ్డి యువకుడు. పైగా చైతన్య వంతుడు. గుండెల నిండా ధైర్యంతో ఉన్నాడు. అందుకే చేస్తున్న ఉద్యమ కార్యాచరణకి మరింత పదును పెట్టాడు. తోటి ఉద్యమకారుడు అనుముల వెంకట నరసింహారెడ్డితో కలిసి, నాయకత్వం అండదండలతో పల్లె పల్లెలో " జైత్రయాత్ర " కొనసాగించాడు. గ్రామాల్లో పటేలు , పట్వారీలు ఇండ్లను కార్యాలయాలను ముట్టడించాడు. వాళ్ళు దాచిపెట్టుకున్న దస్తావేజుల్ని లాక్కొని కాల్చివేసాడు.

👉ఆరుట్ల దళంలో

నిజాం వ్యతిరేక ఉద్యమం రోజు రోజుకు బలపడుతున్న క్రమంలో దళాల విభజన జరిగింది. భువనగిరి తాలూకా సంఘం దళనాయకునిగా ఆరుట్ల రాంచంద్రారెడ్డి ఎన్నికయ్యాడు. భద్రారెడ్డి ఆరుట్ల రామచంద్రారెడ్డి నేతృత్వంలోని దళంలో కీలక సభ్యుడిగా ప్రస్థానం మొదలెట్టాడు.

👉నిషేధం

తలనొప్పిగా మారిన ఆంధ్రమహాసభ మీద, దాని ఆధ్వర్యంలో నడుస్తున్న సంఘాల మీద నిజాం ప్రభుత్వం నిషేధం విధించింది. ఆ సమయంలో దళాలు సమూలంగా అజ్ఞాతవాసం అనుభవించాయి.
సర్కారును, దాని అదనపు సైన్యం రజాకార్లను ఎదిరించాలంటే ఉద్యమకారులతో ఆయుధ సామాగ్రీ తగినంతగా లేదు. ఈ పరిస్థితుల్లో భద్రారెడ్డి తన బృందంతో కలిసి...ఎవ్వరూ గుర్తించకుండా తలకు కొప్పేర కట్టుకుని .....వడిసెలు, బళ్లాలు, బాకులు, రాళ్లు నింపిన సంచులతో ప్రాణాలకు తెగించి రహస్యంగా రాత్రులు సంచరించేవాడు.

👉ఆయుధ శిక్షణ - గేరెల్లా దాడులు 

1947 లో బెజవాడ ప్రజాశక్తి కార్యాలయంలో భద్రారెడ్డి మూడు నెలలు గెరిల్లా శిక్షణ పొందాడు.ఆయుధ శిక్షణ పొందిన తర్వాత బాధ్యత మరింత పెరిగింది. ఏ ప్రాంతంలో రజాకార్ల దాడులు ఉంటాయో
ఆ ప్రాంతాలను భద్రారెడ్డి బృందం కనిపెట్టుకుని ఉండేది. దాడులకి ప్రతి దాడులు జరిపేది. గేరెల్లా దాడులతో రజాకార్లను తరిమికొట్టేది. ఈ విషయమై
భద్రారెడ్డి తన జీవిత చరిత్రలో ఈ కింది విధంగా చెప్పుకున్నాడు.

" వడపర్తి జాగీరుదారు రజాకారు దుండుగలలో నెలల తరబడి పోరాటం చేసి గ్రామాలపై బడకుండా కాపాడగలిగితిమి . మాకు నిద్రాహారాలు కూడా సరిగా వుండేవి గాదు . ఏ రోజున ఎక్కడ వుంటామో కూడా తెలియదు . ఈ భయంకర పరిస్థితిలో మా ప్రాణాల కంటే ప్రజారక్షణే ప్రధానమని భావించేవాళ్ళం ... "  

👉ఆయుధాల సేకరణ

నాటు తుపాకులు తమకు అందినప్పటికీ ఆధునిక ఆయుధాల అవసరం అనివార్యం అయ్యింది. ఈ పరిస్థితిలో శక్తివంతమైన ఆయుధాల సేకరణ కోసం భద్రారెడ్డి బృందం ప్రయత్నం చేసింది.

1)వాసాలమర్రి దాడి

Pఅప్పటి మెదక్ జిల్లా మెడిచల్ పరిధిలో ఉన్న వాసాలమర్రి గ్రామంలో లేవి గల్లా వసూలు కోసం వచ్చిన రజాకార్లు ధాన్యాన్ని లారీలకు ఎక్కిస్తున్నారు. భద్రారెడ్డి బృందానికి సమాచారం అందింది. సైదాపురం దళనాయకుడు పిన్నెపురెడ్డి వెంకటరెడ్డి, తుర్కపల్లి దళ నాయకుడు ఆరుట్ల నరసింహారెడ్డి నాయకత్వంలో తోటి ఉద్యమకారుడు దుంబాల రాంరెడ్డితో కలిసి 200 మందిని సమీకరించుకుని భద్రారెడ్డి బృందం వాసాలమర్రి
చేరుకుంది.దాడికి కేశవులు నాయకత్వం వహించాడు. దళాలను చూసి రజాకార్లు పారిపోయారు. తహసీల్దార్, గిర్దావరు, ఇద్దరు జవాన్లు, కచేరి తలుపులు బిగించుకున్నారు. బయటి నుండి ఆంధ్రమహాసభకు జై నినాదాలు మిన్నంటున్నాయి. లోపలి నుండి తహసీల్దార్
తుపాకీ పేలి మల్లయ్య అనే ఉద్యమకారుడు కుప్పకూలాడు. భద్రారెడ్డిలో ఆవేశం పెరిగింది.
దళాలు కూడా ఆగ్రహంతో ఊగిపోయాయి. మళ్ళీ దాడి నిర్వహించారు. కచేరికి నిప్పంటించారు. ఈ సందర్భాన్ని భద్రారెడ్డి చెబుతూ.....

."" కచేరి లోపలున్న తహశీలుదారు ఇంటిలోని దూల మెక్కి వాసాలు విప్పి కప్పుమీద నిల్చి రైఫి లో కాల్చాలనుకున్నాడు . కాని మా జనాన్ని భయంతో అతని చేతుల్లో వణుకు బుట్టి దిక్కు తోచని స్థితిలో నిలబడినాడు . ఈ అదును చూసి నేను ఒక రాయిని తీసికొని సూటి చూసి గట్టిగా విసిరినాను . అంతే అతని చేతిలో తుపాకి కిందపడింది . అది జపాను రైఫిల్ , మాకు ఒక మంచి ఆయుధం దొరికింది . నేను సంతోషంతో గంతులేసినాను . మాలో ధైర్యం మరింత నిండుకుంది ... ""

 2) వంగపల్లి రైల్వేస్టేషన్ పై దాడి

నిజాం సర్కారును వణికించాలంటే రక్షణ దళాలైన పోలీసులను రజాకార్లను భయపెట్టాలి. ఎదురుదాడులకు తమకు ఆయుధాలు కావాలి. ఈ నేపథ్యంలో ఒక పథకం ప్రకారం భువనగిరి పరిధిలోని యాదగిరిగుట్ట సమీపాన గల వంగపల్లి రైల్వే స్టేషన్
ని లక్ష్యంగా ఎంచుకున్నారు.. . ఇందులో భాగంగా ముందుగా భద్రారెడ్డి బృందం...బెజవాడకు వెళ్ళే ప్రయాణీకులుగా ఉపాయంగా వేషాలు మార్చింది. స్టేషన్ చేరుకుంది.. సాయంకాలం ఐదు గంటలు కావొస్తుంది అనగా స్టేషన్ కాపలా జవానులు కల్లు త్రాగడానికి ఊళ్ళోకి వెళ్లారు. స్టేషన్లో ఒక జవాను , స్టేషను మాష్టరు మాత్రమే వున్నారు .భద్రారెడ్డి బృందం ఇదే అదనుగా స్టేషన్ మీద దాడి జరిపింది.
స్టేషన్ మాస్టారుని జవానుని ఇద్దరినీ లౌక్యంగా తాళ్ళతో కట్టివేసి..... వాళ్ళతో ఉన్న మూడు రైఫిల్లు ఎత్తుకు వచ్చింది.. ఈ సంఘటనలో భద్రారెడ్డితో పాటుగా , పిన్నపురెడ్డి వెంకట్ రెడ్డి , దూదిపాల భూపాల్ రెడ్డి, బొప్పిడి శివారెడ్డి, నారాయణరెడ్డి, పసురమడ్ల సాయిరెడ్డి, లెక్కల చంద్రారెడ్డి పాల్గొన్నారు.

👉రజాకార్ల దాడులు - ప్రాణాపాయ పరిస్థితి 

తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రాణాలు కంటే లక్ష్యం ముఖ్యం. ఇందుకు కట్టుబడి దళాలు, సంఘాలు , పనిచేసాయి. భద్రారెడ్డి జీవితం దళంలో చేరాక దినదిన గండం అయ్యింది.
ప్రతిదాడులతో ప్రాణాపాయ పరిస్థితిని ఎదుర్కొంటు ముందుకు నడుస్తున్నాడు.

ఈ క్రమంలో రజాకార్ల....ఆలేరు దాడి,సైదాపురం దాడి, మంగలిగుట్ట దాడి, నాగపురి దాడి భయానకం అయినవి. ఈ దాడుల్లో జరిగిన హింస, సర్కారు తలపెట్టిన ద్రోహం, భద్రారెడ్డిని విచలితుడిని చేసాయి.

సైదాపురం దాడి ఘటనకు సంబందించి రాపోలు కొండల్ రెడ్డి, క్యాసారం ముత్యంరెడ్డిని రజాకార్లు దొంగదెబ్బ తీస్తూ సజీవదహనం చేసారు.

ఆలేరు దాడిలో ఎస్. రెడ్డి, ఆవుల బ్రహ్మయ్య, తదితరులు ప్రాణాలు కోల్పోయారు.

మంగలిగుట్ట దాడిలో ఎడతెగకుండా నాలుగు గంటల సేపు రజాకార్లతో జరిగిన హోరాహోరి పోరాటంలో భద్రారెడ్డి ప్రాణాపాయం తప్పించుకున్నాడు.

నాగపూరి దాడి కూడా అత్యంత భయంకరమైది. ఇదే రజాకార్ల చివరిదాడి. తెలంగాణ విమోచనం 17 / 9/1948 నాడే ఈ దాడి జరిగింది. ఈ దాడిలోనే వీరుడు కుర్రారం రామిరెడ్డి మరణించాడు. భద్రారెడ్డి ఇక్కడ కూడా ప్రాణాపాయం తప్పించుకున్నాడు..

👉బాలవీరులను తయారుచేసిన ఘనత

రజాకార్లు తెలంగాణ అంతటా సృష్టిస్తున్న అలజడులు పాశావికమైనవి.ఈ పరిస్థితిలో తన ప్రాణం ఓ లెక్క కాదు....రజాకార్ల రక్తం కండ్ల జూడాల్సిందే అనే కసి భద్రారెడ్డిలో మునుపటికి మించి రేకెత్తింది. ఇల్లు...వాకిలి... భార్యా...కుటుంబం... అన్నీ మరిచిపోయాడు. ఒకప్పుడు పేదరికాన్ని జయించాలని కలలు కన్న భద్రారెడ్డి.... పోరాట సమయంలో మాత్రం ప్రజల గెలుపు కోసం పరితపించాడు. ఈ పరిస్థితుల్లో 
తెలంగాణ అస్తిత్వ పోరాటంలో భాగంగా బాలవీరులను తయారుచేసాడు.

తెలంగాణ సాయుధ పోరాటంలో ఈ బాలవీరులు కూడా తమ దేశ కర్తవ్యాన్ని చాటుకున్నారు. బాలసంఘంలో ఒకరైన లెక్కల మల్లారెడ్డి పది సంవత్సరాలు కూడా నిండని బాలుడు. ఈ బాలుడి భుజానికి తుపాకీని వేలాడదీసి ప్రభాతవేళ వీధుల్లో జై ఆంధ్రమహాసభ నినాదాలు చేయించాడు.

" తెలంగాణ సాయుధ పోరాట సమయంలో నా భుజానికి తుపాకీ వేసి మా బాల సంఘాన్ని ఊరేగింపు చేసిన తాతగారు మాస్మృతి పథంలో వున్నారు.. " 
అంటూ నేటికీ లెక్కల మల్లారెడ్డి. చెప్పుకుంటాడు.

👉రాజకీయాల్లో

విమోచనం తర్వాత మితవాదులు జనజీవనంలో కలిసిపోయారు. అతివాదులు అజ్ఞతంలో ఉన్నారు. భద్రారెడ్డి అజ్ఞాతం వీడలేదు.కానీ కొన్ని సామజిక రాజకీయ పరిస్థితుల్లో అజ్ఞాతం వీడి కాంగ్రెస్ పార్టీలో చేరాడు.
కాంగ్రెస్ నాయకుడుగా ఆలేరు నియోజక వర్గంలో 
స్వాతంత్ర సమరయోధుల సంఘం ఏర్పాటు చేసుకుని నిర్వాహకుడుగా పనిచేశాడు

ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూఎమ్మెల్యే పోచయ్య గెలుపుకు తీవ్రంగా కృషి చేశాడు.

" నాకు పదవులు వద్దు. నా సేవ కొంత ప్రజలకు అందాలనే సంకల్పంతో రాజకీయంలో ఉన్నాను " అని స్వయంగా చెప్పుకున్న భద్రారెడ్డి, ఎమ్మెల్యే పోచయ్య సహకారంతో ప్రజాసంక్షేమ కార్యలక్రమాలకి శ్రీకారం చుట్టాడు.
ఇందులో భాగంగా....
ఆలేరు నియోజక వర్గంలోని కొన్ని గ్రామాలకు విద్యుత్ సౌకర్యం సాధించాడు.
పేద, నిరుపేద విద్యార్థుల కోసం అవసరమైన చోట్లల్లో సాంఘిక సంక్షేమ వసతి గృహాలని మంజూరి చేయించాడు.

👉పోలీసుగా...జైలు జీవితం 

భద్రారెడ్డి వద్ద సాయుధ పోరాట కాలం నాటి ఆయుధాలు అట్లాగే ఉండిపోయాయి. వాటిని అప్పగిస్తే ఉద్యోగం ఇస్తామని ఆలేరు ఎస్సై..తన సోదరుడి నమ్మబలికాడు. సోదరుడి మాట కాదనలేక ఆయుధాలు అందజేశాడు భద్రారెడ్డి. ఇచ్చిన మాట ప్రకారం పోలీసు ఉద్యోగం వచ్చింది. ఒక నేరచరితుడిని పట్టించినందుకు కొన్నాళ్లకు ప్రమోషన్ వచ్చింది. ఆయుధశాల ఇంచార్జిగా నియమించారు. కానీ ఉద్యమకారుడు దుంపల మల్లారెడ్డి తనకు రివాల్వర్ అడగగా కాదనలేక అక్రమ సరఫరా చేసి , పట్టుబడి, జైలు జీవితం అనుభవించాడు.

👉కుటుంబం

భద్రారెడ్డి వివాహం 16 ఏండ్ల వయసులో 1944లో చుట్టరికం అమ్మాయి అహల్యతో జరిగింది. 
ఈ దంపతులకు మొత్తం ఆరుగురు సంతానం. ముగ్గురు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు.

కూతుళ్ళు - అల్లుళ్ళు

1)గొట్టం అరుణా దేవి / దామోదర్ రెడ్డి
2)బొందుగుల అనురాధ /నరేందర్ రెడ్డి
3)వేముల అరుంధతి /లక్ష్మారెడ్డి

కుమారులు - కొడళ్ళు 
4)కల్లూరి కోణారెడ్డి /అనిత
5)కీ.శే.ఆవాల అచ్యుత రాంచంద్రారెడ్డి
6)కల్లూరి అజయ్ పాల్ రెడ్డి / సునీత

👉భక్తి మార్గంలో

కరుడుగట్టిన ఉద్యమకారుడిగా తర్వాత రాజకీయ నాయకుడుగా.... పోలీసు అధికారిగా... భద్రారెడ్డి జీవితం నిత్య చైతన్యం. చివరిదశలో వీరు పూర్తిగా భక్తి మార్గాన్ని అనుసరించడం జరిగింది. ఒక స్వామీజీ
తన మనవడి ఆరోగ్యం విషయంలో కనబరిచిన మహిమ భద్రారెడ్డిలో ఆధ్యాత్మిక చింతనకు కారణం అయ్యింది. అది మొదలు వారు నిత్య భగవద్గీత పారాయణం మొదలెట్టాడు.

👉పాటగా కల్లూరి భద్రారెడ్డి గారి పోరాట గాథ

 బానిసత్వ విమోచనకు /వీవు పోరాటం చేసినావా తుపాకులను ఎగ్గుపెట్టి /నీవు నైజాముల కూల్చినావా కామరాజు దారిలోన / నీవు ధైర్యముగ నిలిచినావా కల్లూరి కాదు పేరు/ నీవు అల్లూరి అనుచరుడవు పేదవాళ్ళ బ్రతుకులకు /నీవు ఆసరాగా నిలచినావు కొండా కోనల్లోన /నీవు ఆకలికి ఓర్చెనావా
గట్టమీది గుండ్లమండి/నీవు మందుగుండు పేల్చినావా నైజాముల పోలీసుల/ నీవు నాశనమే చేసినావా
నీ ధైర్యానికి మొక్కినాము /నీ దారిలోనే నడుస్తాము

-తమ్మలి శ్రీహరి ( టీచర్ ) 

👉శివైక్యం

 కల్లూరి భద్రారెడ్డి మే 11 / 2015 న సోమాజిగూడలోని దక్కన్ ఆసుపత్రిలో శివైక్యం పొందారు.. 
____________________________________________
ఆధారం :
1)తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కల్లూరి భద్రారెడ్డి జీవితచరిత్ర
పరిశోధకుడు : గొట్టం చంద్రశేఖర్ రెడ్డి( భద్రారెడ్డి మనవడు / కూతురి కుమారుడు )
2)తెలంగాణ సాయుధ పోరాటంలో బాలవీరుడు 
లెక్కల మల్లారెడ్డితో సంభాషణ

No comments:

Post a Comment