Monday, April 15, 2024

హేమారెడ్డి మల్లమ్మ

హేమారెడ్డి మల్లమ్మ 
( ఆధ్యాత్మిక స్ఫూర్తి )
°°°°°°°°°°°°°°°°°°°
వ్యాసకర్త : తంగెళ్ళశ్రీదేవిరెడ్డి 

మహిమాన్వితం..మహాదేవం...
పావనచరితం... పవిత్రం.... 
పుణ్యభరితం... పులకితం.. 
అలౌకికం... ఆధ్యాత్మికం... 
హేమారెడ్డి మల్లమ్మ ! 
తెలుగు వెలుగుని కీర్తించే మా తెలుగుతల్లికి మల్లె 
పూదండ గేయంలో #మల్లమ్మ_పతిభక్తి పదం వెనుక కథ చాలా మందికి తెలియక పోవచ్చు. ఆ పుణ్యస్త్రీ ఎవ్వరో కాదు దైవచింతనకి దైవిక స్వరూపానికి ప్రతిరూపమైన ఆధ్యాత్మిక తేజం ! హేమారెడ్డి మల్లమ్మ !ఒక మానవ జన్మ ! ఒక అవధూత ! 

మల్లమ్మ కన్నీరుగా పూజలందుకుంటున్న ఈ మాహాసాద్వి ఆలయం శ్రీశైలంక్షేత్రానికి సమీపంగా ఉన్నది. 
మల్లిఖార్జునుడి పేరులోని భావాన్నే తన పేరులో ఇముడ్చుకున్న మల్లమ్మ అచ్చంగా శివభక్తురాలు ! 

శివుడి కోసమే తన జీవితంగా శివ ధ్యానంలో ఊహ తెలిసినప్పటి నుండి బతికింది మల్లమ్మ. ఈమె 14 వ శతాబ్దానికి చెందినదిగా #హిస్టరీ_ఆఫ్_శ్రీశైలం వివరిస్తున్నది. 
#మల్లమ్మ_చరిత్ర 

జననం - బాల్యం : 

పురాణాల ప్రకారం శ్రీశైలం క్షేత్రానికి దగ్గర ఉన్న శివపురం అనికూడా పిలవబడే రామపురం గ్రామంలో నాగిరెడ్డి గౌరమ్మ ( గౌవమ్మ) దంపతులు నివసించేవారు. వీరు భూస్వాములు. దీన జనుల పట్ల దయగల హృదయ పూర్వకమైన జంట. అందరికీ పెద్దదిక్కుగా మెలుగుతూ తమ ఉదారతను చాటుకుంటూ ఉండేవారు. 
ధనం ధాన్యం కొదవలేని ఈ దంపతులకు సంతానం మాత్రం కలగలేదు. దీంతో పిల్లా పాపలతో తన ఇల్లు కళకళలాడాలని తమ వంశం వృద్ధి చెందాలని కోటి కలలు కన్న ఈ దంపతులకు నిరాశ మిగిలింది. జనాలు కూడా నాగిరెడ్డి దంపతుల పరిస్థితికి బాధపడేవారు ఈ పరిస్థితిలో వారు శ్రీశైలం మల్లికార్జున స్వామిని నమ్ముకున్నారు. మల్లిఖార్జునుడిని దర్శించుకుని చిత్తశుద్దిగా ప్రార్థనలు చేశారు.

అయినప్పటికీ నాగిరెడ్డి దంపతులకు కోరిక నెరవేరలేదు. రోజురోజుకు ఆ దంపతులకు బాధ రెట్టింపు అయ్యింది. అయినా శివపూజ వదలలేదు. వారి హృదయపూర్వక భక్తికి సంతోషించిన శివుడు, కొన్నాళ్ల తర్వాత నాగిరెడ్డికి కలలో కనిపించి -
" ఒక గొప్ప శివ భక్తురాలు...లీలా స్వరూపిణి... మీకు కూతురుగా జన్మించబోతున్నది " అని దీవించాడు. 

మేల్కొన్న నాగిరెడ్డికి ఏమి అర్థం కాలేదు. కల కల్ల అవుతుందా? నిజమౌతుందా? తెలియని సందిగ్ధంలో మునిగిపోయాడు. శివుడిని మరింతగా ప్రాధేయపడటం మొదలెట్టాడు. శివుడి స్వప్న దర్శనం తర్వాత నాగిరెడ్డిలో ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. 

స్వప్నం సాకారం దాలుస్తూ మరి కొన్నాళ్ళకు గౌరమ్మ గర్భం దాల్చింది. అనుకున్నట్టుగానే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మల్లిఖార్జునుడి ఆశీర్వాదంతో పుట్టింది కాబట్టి ఆ బిడ్డకు వారు మల్లమ్మ పేరుతో నామకరణం చేశారు. 

ఎవ్వరూ నేర్పకుండానే, ఎవ్వరూ చెప్పకుండానే ఎవ్వరూ చూపకుండానే, పసితనం నుండే బాలిక శివనామాన్ని జపించడం మొదలెట్టింది. శివా శివా అంటూ శివదేవుడిని పరిసరాల్లో వెదుక్కుంటూ ప్రకృతే శివుడిగా... తన మనసే ఆలయంగా బతకడం మొదలెట్టింది. 

తోటి పిల్లలతో ఆడుకున్నప్పుడు కూడా, తింటున్నప్పుడు కూడా, నిదురిస్తున్నప్పుడు కూడా, మల్లమ్మ శివుడి ధ్యాస వదిలిపెట్టలేదు. దృఢ చిత్తంతో శివుడే లోకంగా ప్రవర్తిస్తూ వచ్చింది.  

యవ్వనం - వివాహం :

చూస్తుండగానేమల్లమ్మకు యుక్త వయసు వచ్చింది. అప్పుడు కూడా శివుడే శ్వాసగా దినక్రమం కొనసాగింది. వివాహం పట్ల ఆసక్తి లేనిదై కనిపించసాగింది. ఈ పరిస్థితిలో నాగిరెడ్డి దంపతులు కొంత కలవరపడ్డారు. అయినప్పటికీ అంతా శివమహిమ అనుకుంటూ భారాన్ని శివుడిపై వేశారు. శివుడి ఆశీర్వాదం కోరుకుంటూ మల్లమ్మకు పెండ్లి ప్రయత్నాలు కూడా మొదలెట్టారు. 

ఈ క్రమంలో తమ సమీప గ్రామమైన సిద్ధపురం భూస్వామి సంపన్నుడు మంచి మనసున్నవాడు ప్రజలమనిషి హేమా రెడ్డి చిన్న కుమారుడు బారామారెడ్డి    
తన బిడ్డను అర్థాంగిగా పంపంచాలని మల్లారెడ్డి భావించాడు. ఇతడిని జానపదులు వరమారెడ్డి అని కూడా అంటారు. మొత్తానికి అనుకున్నట్టుగానే అన్నీ అనుకూలించి హేమారెడ్డి చిన్న కుమారుడుతో మల్లమ్మ కు పెండ్లి నిశ్చయం చేశారు. 

మల్లమ్మ వివాహం ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగింది. కాగా వివాహం తరువాత కూడా ఆమె శివుడి ధ్యాసను వదిలిపెట్టలేదు. ఇదే క్రమంలో అప్పటికే సంపన్న కుటుంబమైన హేమారెడ్డి ఆదాయం సంపదలు మల్లమ్మ రాక తర్వాత మరింత వృద్ధి చెందడం మొదలయ్యింది. అయినప్పటికీ కోడలి విపరీత శివభక్తి 
అత్తింటి వాళ్ళకు కొంత ఇబ్బందిని కలిగించింది. 

ఇహ పరమైన జీవిత సుఖాలకు మల్లమ్మ ఏమాత్రం ప్రభావితం కాలేదు. తనకు తెలిసిన శివుని ఆరాధన మాత్రమే తన జీవితంగా కాలం గడపసాగింది. ఈ క్రమంలో మల్లమ్మకు ఇక అత్తింటి సాధింపులు మొదలయ్యాయి. అయితే ఇక్కడ అత్తింటి వాళ్ళకు మల్లమ్మ మీద వ్యక్తిగత కోపం లేదు. ఆమె శివభక్తి మీదే అందరికీ విసుగు. ఈ నేపథ్యంలో అత్త, బావ, మల్లమ్మకు 
అడ్డంకులను సృష్టించడం మొదలెట్టారు. ఆమెలో శివభక్తిని అంతమొందించి, సంసారాన్ని నిలబెట్టాలని శతవిధాలా ప్రయత్నం చేస్తూ ఆమె ఆరాధనలకు భంగం కలిగించడం మొదలెట్టారు. కానీ ప్రతి ప్రయత్నాలలో వారు విఫలమయ్యారు. 

చివరకు శివుడు ఆ కుటుంబానికి తనదైన లీల చూపించాడు. 
" మల్లమ్మ జన్మ సంసారం పిల్లలు వంటి బాంధవ్యాల కోసం కాదు. శివుడిలో లీనమై భవిష్యత్తు తరాలలో భక్తజనులను అలరించడానికి " అని స్పృహ కలిగించాడు. ఇక అది మొదలు అత్తింటి వారు మల్లమ్మలో మహాత్మ్యాన్ని దర్శించారు. శివునికి ఆమె అంకితభావాన్ని అంగీకరించారు. 

మల్లమ్మ మహిమ :
మల్లమ్మ పూర్తిగా శివభక్తిలో మునిగిపోయింది. కుటుంబాన్ని వదిలి శ్రీశైలం చేరుకొని సర్వసంగ పరిత్యాగినైయై శివుడిని ఆరాధిస్తూ గడపసాగింది. లోకం ఆమె భక్తిని చూసి ఆశ్చర్యపోయింది. అటు పుట్టింటిలో సంపదకు కొదవలేదు. ఇటు అత్తింటిలో కొదవలేదు. అన్ని ఉన్నప్పటికీ అన్నీ వదిలేసుకొని శివుడిలో భాగమై పోయిన మల్లమ్మ సాక్షత్తూ దేవీ స్వరూపమని కూడా లోకం భావించడం మొదలెట్టింది. ఈ క్రమంలో పేరెన్నికైన మామగారి పేరే ఇంటిపేరుగా ఆమెను అందరూ హేమారెడ్డి మల్లమ్మగా పిలవడం మొదలెట్టారు. 

కాలక్రమంలో మల్లమ్మ లోకాన్ని కూడా మర్చిపోవడం మొదలెట్టింది. ముక్తికి సమయం ఆసన్నమైనట్టుగా తనను తాను కూడా మర్చిపోయింది. 
 
ప్రగాఢ మల్లమ్మ శివభక్తి పరాయణురాలై ఆశ్రమ జీవితం గడుపుతూ పాడిని అభివృద్ధి చేసినట్టుగా కూడా కథలు ఉన్నాయి. ప్రతి నిత్యం ఆవుపాలతో శివుడిని అభిషేకించినట్టుగా చెప్తారు. మల్లికార్జున స్వామి ఆలయం వెనుక ఉన్న ఆవుల పాక ఆనాటి మల్లమ్మ గొప్ప భక్తికి ప్రతీకగా చెప్పుకుంటారు. ఈ క్రమంలో ఆవు పేడ నుండి పవిత్ర బూడిదను తయారు చేసేదిగా చెప్తుంటారు. 
 
మొత్తానికి శివుడు ఇక ఆమెను కరుణించాడు . ఆమె ప్రార్థనలకు సమాధానం లభిస్తూ దర్శనం ఇచ్చాడు. 
ఆ ఉద్విగ్న సమయంలో మల్లమ్మ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నది. ఆ కన్నీరే ఇప్పుడు మందిరం పశ్చిమ వైపు ప్రధాన ఆలయం నుండి సుమారు 2 కి.మీ. దూరంలో రెండు సహజ శిలల మధ్య ఒక చిన్న నీటి ప్రవాహంగా కనిపిస్తున్నది. ఈ ప్రవాహానికి మల్లమ్మ కన్నీరు అని పేరు.
ఈ కన్నీరు గురించి పురాణ, జానపద కథనాలు ఉన్నాయి. మల్లమ్మ నివసించిన ప్రదేశం నుండి ఉద్భవించిన రెండు నీటి మార్గాలను ప్రస్తుతం మనం చూడవచ్చు

మల్లమ్మ ఆలయం :

మల్లమ్మ పేరు మీద ఇటీవలి కాలంలో ఆలయం నిర్మించారు. ఈ ఆలయాన్ని కర్ణాటక వీరశైవరెడ్డి సమాజ్ నిర్మించారు, 2010 సంవత్సరంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కొనిజేటి రోశయ్య శుభావిష్కరణ గావించారు. ఈ ఆలయం మల్లికార్జున స్వామి ఆలయం నుండి అర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 
హేమారెడ్డి మల్లమ్మ సినిమా :

1946 వ సంవత్సరంలో కన్నడలో హేమారెడ్డి మల్లమ్మ చిత్రం నిర్మించారు. ఎస్. సౌందర్య రాజన్ దర్శకత్వం వహించగా గుబ్బి వీరన్న చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో బి. జయమ్మ , హొన్నప్ప భగవతర్, వీరన్న, సి. బి. మల్లప్ప ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి చిత్తూరు వి. నాగయ్య సంగీతం సమకూర్చారు. ఈ కథను జనాలు బాగా ఆదరించారు. 
ఈ తర్వాత హేమారెడ్డి మల్లమ్మ కథ ఆధారంగా తిరిగి కన్నడ, తెలుగు, భాషల్లో సినిమాలు నిర్మించబడ్డాయి. 
__________________________________
ఆధారం :
1) హేమారెడ్డి మల్లమ్మ ఆలయ కథ  
2) శ్రీశైలం క్షేత్రంలో భిక్షగత్తెగా బతుకుతున్న మల్లదేవమ్మ అనే వృద్ధురాలు చెప్పిన జానపద కథ. 
3) శ్రీశైల పురాణం గురించిన వ్యాసాలు

No comments:

Post a Comment