Monday, April 15, 2024

పాశం సర్వారెడ్డి ( తొలి తెలంగాణ ఉద్యమకారుడు, అమరుడు )

పాశం సర్వారెడ్డి
(1947- 1969)
( 1969 తెలంగాణ ఉద్యమ నాయకుడు )
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
వ్యాసకర్త : తంగెళ్ళశ్రీదేవిరెడ్డి 

సంకల్పానికి పట్టుదల తోడైతే.... 
పట్టుదల ఆత్మవిశ్వాసంతో బలపడితే .... 
ఆత్మవిశ్వాసం అడుగులు ముందుకు వేస్తె.... 
అదే ఒక పోరాటం ! 
ఈ పోరాటానికి ఊపిరిలూది చావును ముద్దాడిన అమరుడు పాశం సర్వారెడ్డి ! 

పరిచయం : 

పూర్వ పాలమూరు జిల్లా ప్రస్తుత గద్వాల జిల్లా చేనుగొనిపల్లి గ్రామానికి చెందిన భూస్వామి 
పాశం వెంగళ్ రెడ్డి - వెంకట్రామమ్మ దంపతుల మొదటి సంతానం పాశం సర్వారెడ్డి. వీరు 1947లో జన్మించారు. కృష్ణారెడ్డి, రవీందర్ రెడ్డి, సుధాకర్ రెడ్డిలు వీరి సోదరులు. ప్రస్తుతం వీరి కుటుంబంలో మొదటి తరానికి సంబందించి రవీందర్ రెడ్డి భార్య భాగ్యమ్మ ఒక్కరే బతికి ఉన్నారు. 

విద్యార్ధి నాయకుడిగా :

1969 నాటికి ఉస్మానియా విశ్వవిద్యాలయం 
ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు సర్వారెడ్డి. ఇంజనీరింగ్ విద్యార్ధి నాయకుడుగా ఉన్నాడు. రెడ్డి హాస్టల్ లో ఉండేవాడు. విద్యార్థుల సమస్యల గురించి ఎప్పటిటికప్పుడు పోరాటాలు నిరసనలు ధర్నాలు చేసేవాడు. ఇటువంటి సమయంలోనే -
తెలంగాణ ప్రాంతంలో ముల్కి నిబంధనలు అమలులో ఉన్నప్పటికీ స్థానికులను కాదని వలసవాదులకు ఉద్యోగాలు ఇస్తున్నారనే రగడ అంతకంతకు పెరిగింది. ఈ పరిస్థితిలో పెద్దమనుషుల ఒప్పందంను గాలికి వదిలేశారనే ఆగ్రహావేశాలు 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి నిప్పు రాజేశాయి.

ఈ ఉద్యమం తొలినాళ్లలో తెలంగాణ ఉద్యమం ఎందుకు మొదలయ్యింది? పూర్వాపరాలు ఏమిటీ? అనే విషయమై ఆనాటి విద్యార్థుల్లో అవగాహన కోసం పాశం సర్వారెడ్డి స్వచ్ఛందంగా నడుం బిగించాడు. విద్యార్ధి నాయకుడిగా రేయింబవళ్ళు సమావేశాలు నిర్వహించాడు. అనర్గళంగా మాట్లాడటంలో దిట్ట అయిన సర్వారెడ్డి, తన ఉపన్యాసాలతో ఆనాటి విద్యార్ధి యువతని బాగా ఆకర్షించాడు. కానీ 1969 ఉద్యమ చరిత్రలో సర్వారెడ్డి పేరు పెద్దగా కనిపించదు. 

ఉద్యమంలోకి : 

ఖమ్మం జిల్లా పాల్వంచ థర్మల్‌ స్టేషన్‌లో పనిచేసే ఉద్యోగుల్లో ఆంధ్రప్రాంతం వారు ఎక్కువగా ఉండటం వల్ల 1969, జనవరి 5 వ తేదిన అక్కడి తెలంగాణ ఉద్యోగులు పెద్దఎత్తున నిరసనకు దిగారు. జనవరి 10 తేదీ తేదీ నుంచి నిరాహార దీక్షలు మొదలెట్టాలని నిర్ణయం జరిగింది. ఈ దీక్షలు ఉద్యమ స్థాయిని అందుకున్నాయి. ఈ ఉద్యమంలోకి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు చేరారు.వాళ్లలో ఉద్యమావేశంతో కార్యాచరణ ప్రారంభించిన మొదటి వరస నాయకుడు పాశం సర్వారెడ్డి. 

తెలంగాణ రక్షణ సమితి :

ఉద్యమం అనతికాలంలోనే తెలంగాణ అంతటా పాకింది. తెలంగాణ హక్కుల కోసం, పరిరక్షణ కోసం, """తెలంగాణ రక్షణ సమితి"" ఏర్పడింది. ఈ సమితి తెలంగాణ వాదులు అందరికీ ఆదర్శం అయ్యింది. తర్వాత జనవరి 13 వ తేదీన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ""'తెలంగాణ విద్యార్థుల కార్యాచరణ సమితి "" ఏర్పడింది. ఇదే సమయంలో ""తెలంగాణ పరిరక్షణ కమిటీ "" విద్యార్థులకు బాసటగా ఏర్పడి పూర్తి మద్దతును ప్రకటించడం జరిగింది. 

విద్యార్ధి కార్యాచరణ సమితిలో తెలంగాణ విద్యార్ధి లోకం, పెద్దఎత్తున చేరింది. ఇందుకు నాయకుల అండదండలు కూడా అనివార్యం అయ్యాయి. ఈ సమితిలో చురుకైన సభ్యుడుగా ప్రస్థానం మొదలెట్టిన పాశం సర్వారెడ్డి సమితి లక్ష్యాలను ప్రచారం చేయడంతో పాటుగా.... సమితి ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణ మొదలెట్టాడు. 

విద్యార్ధి నాయకుడిగా అప్పటికే తనకంటూ ఒక స్థానం ఉన్న సర్వారెడ్డి, సమితి లక్ష్యాల ప్రచారం కోసం కొన్ని మార్గాలను నిర్దేశించుకున్నాడు. 

1) ప్రత్యేక తెలంగాణ సాధన తమ ఏకైక లక్ష్యంగా 
ప్రతి విద్యార్ధి ముందుకు నడవాలి. 
2)విద్యార్థులు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం కావాలి 
3) ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగించాలి. 
4) ప్రతి విద్యార్ధి ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యేలా చూడాలి. 
5) కరపత్రాలు పంచిపెట్టాలి. 
6) ఉద్యమ లక్ష్యాలు పాటలు కవితలు రూపంలో ప్రచారం జరగాలి. 
7) పల్లెల్లోకి ఉద్యమాన్ని తీసుకెళ్లి ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలి. 

ఇట్లా తెలంగాణ ఆర్థిక పారిశ్రామిక అభివృద్ధి, పోచంపాడు ప్రాజెక్ట్‌ నిర్మాణం, తెలంగాణేతర ఉద్యోగుల్ని తక్షణమే వెనక్కి పంపి ఆ స్థానాల్లో తెలంగాణ నిరుద్యోగులను భర్తీ చేయాలనే సమితి తీర్మానాలను పాశం సర్వారెడ్డి జనాలకు చేరువ చేయడం మొదలెట్టాడు. ఈ క్రమంలో తన సొంత ఊరు కూడా వెళ్ళాలి అనుకున్నాడు. కానీ వెళ్లలేకపోయాడు. 

 నిరసన కార్యక్రమాలు :

కార్యాచరణ సమితి ఏర్పడిన తర్వాత విద్యార్థులు తమ నిరసన కార్యక్రమాలను మొదలెట్టారు. ఏ విభాగానికి ఆ విభాగం తమ నాయకుల సూచనల ప్రకారం కలిసి కట్టుగా ముందుకు నడుస్తున్నది. ఈ పరిస్థితుల నేపథ్యంలో జనవరి 20 తేదిన శంషాబాద్‌లో పాఠశాల విద్యార్థుపై తొలిసారిగా కాల్పులు జరిపారు. ఈ చర్య మీద తీవ్రమైన నిరసన జ్వాలలు మొదలయ్యాయి. ఎక్కడి విద్యార్థులు అక్కడ పోరాటాలు మొదలెట్టారు. 

రైలు రోకోలో అమరత్వం :

ఏప్రిల్ 7 వతేది 1969 
ఉద్యమం తీవ్ర రూపు దాల్చింది. పాశం సర్వారెడ్డి కాచిగూడ రైల్వే స్టేషన్ లో రైలురోకో 
నిర్వహించడం నిమిత్తం విద్యార్ధి సేనతో బయలు దేరివెళ్ళాడు. రైలురోకో నిర్వహించాడు. రైల్వే ఆస్తులను నిరసనలో భాగంగా పాక్షికంగా ధ్వంసం చేసాడు. అప్పటికి ప్రభుత్వం ఉద్యమకారులఫై 
ఎక్కడికక్కడ ఉక్కు పాదం మోపుతున్నారు. ఈ క్రమంలో పాశం సర్వారెడ్డి గుంపు మీద కూడా ప్రభుత్వం కన్నెర్ర జేసింది. 

ఈ సమయంలో పోలీసులు కాల్పులు జరిపారు అని, ఆ కాల్పుల్లో పాశం సర్వారెడ్డి మరణించాడు అని 
వార్త కథనాలు ప్రచురిస్తున్నారు. కానీ సర్వారెడ్డి తమ్ముడు భార్య అందిస్తున్న సమాచారం ప్రకారం.. పోలీసులు ఉద్యమ నాయకుడు సర్వారెడ్డిని పోలీసులు రైల్వే స్టేషన్ లో గదిలో బంధించి పెట్రోలు పోసి తగలబెట్టారు అని తెలుస్తున్నది. 

మొత్తానికి అస్తమించిన ఉద్యమ సూరీడు సర్వారెడ్డిని మరుసటిరోజు గద్వాలకు తీసుకు వచ్చారు. మృతదేహంతో ఊరేగింపు నిర్వహించారు. 

అప్పటికి సర్వారెడ్డికి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. ఈ నిమిత్తం కొత్తబట్టలు కొనుక్కొని వస్తానని చెప్పి వెళ్లి శవమై తిరిగి వచ్చిన సర్వారెడ్డి మృతిని కుటుంబ సభ్యులు బంధువులు మిత్రులు తట్టుకోలేక పోయారు. బంగారు భవిష్యత్తు కోల్పోయిన సర్వారెడ్డి మృతిని భరించుకోలేని స్థానిక ఉద్యమకారులు పట్టణంలో పెద్దఎత్తున ఆందోళనలు చేశారు .

అమరుడితో పాటుగా :

 గద్వాల సుంకులమ్మ మెట్టులో ఉండే శ్రీనివాసాచారి , కిష్టమ్మల మూడో కుమారుడు కొట్టం వేణుగోపాల్. ఏడవ తరగతి చదువుతుండేవాడు. ఉద్యమకారుల స్ఫూర్తితో ఆందోళనలో పాల్గొనేవాడు. ఈ క్రమంలో సర్వారెడ్డి మృతికి నిరసనగా ఏప్రిల్ 8 న గద్వాలలో పోస్టాఫీస్ , సబ్ కలెక్టర్ కార్యాలయం తగులబెట్టడానికి
ఉద్యమకారులు ప్రయత్నం చేసారు. ఈ గుంపులో వేణుగోపాల్ కూడా ఉన్నాడు. పోలీసులు 
లాఠీచార్జి చేశారు. ఉద్యమకారులు మరింత రెచ్చిపోయారు. పోలీసులు భాష్పవాయుగోళాలు ప్రయోగించారు. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. అప్పుడు పోలీసులు ఫైరింగ్ చేయడంతో తుపాకీ గుళ్లకు వేణుగోపాల్ బలయ్యాడు . 

అమరుల విగ్రహాలు :

ప్రస్తుతం పాశం సర్వారెడ్డితో పాటుగా వేణుగోపాల్ 
విగ్రహాలను గద్వాలలో ప్రతిష్టించాలని స్థానికులు నాయకులను అభ్యర్థిస్తున్నారు. తెలంగాణ పునాది రాళ్లుగా ఎందరో అమరులు. అందరికి వందనాలు.
__________________________________________
ఆధారం :
1) సర్వారెడ్డి తమ్ముడు రవీందర్ రెడ్డి గారి భార్య పాశం భాగ్యమ్మ ద్వారా వివరాలు సేకరణ 
2) " పాలమూరు పోరు "వ్యాసం

No comments:

Post a Comment