Monday, April 15, 2024

భీంరెడ్డి సత్యనారాయణరెడ్డి

భీంరెడ్డి సత్యనారాయణరెడ్డి
(1927-2012)
( స్వాతంత్రోద్యమకారుడు - మాజీ గవర్నర్ )
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
వ్యాసకర్త : తంగెళ్ళశ్రీదేవిరెడ్డి 

నియామకం మనదైనప్పుడు నియమాన్ని ఉల్లఘించకుండా పనిచేయడం... 
గెలుపుకు ఓటమికి సిద్దమై అడుగు ముందుకు వేయడం.... 
విమర్శల్లో మనల్ని మనం పునఃర్నిర్మించుకోవాలి అని భావించడం.... 
మన కారణంగా ఇతరులు లాభం చెందక పోయినా ఫర్వాలేదు కానీ బాధ పడకూడదు - నష్టపోకూడదు అని కోరుకోవడం. .. 
అదే అతడి వ్యక్తిత్వం ! 
అతడు..... భీంరెడ్డి సత్యనారాయణరెడ్డి

🔸పరిచయం : 

 పూర్వ పాలమూరు జిల్లా ప్రస్తుత రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మండలం అన్నారంలో 1927 ఆగస్టు 21 వ తారీఖున జన్మించారు. భీంరెడ్డి నర్సిరెడ్డి, మాణిక్యమ్మ దంపతులు వీరి తల్లిదండ్రులు. వీరిది వ్యవసాయ కుటుంబం. .
వీరి ప్రాథమిక విద్య మొగిలిగిద్ద గ్రామంలో కొనసాగింది. తర్వాత సమీపంలో ఉన్న హైదరాబాదులో వివేకవర్ధిని ఉన్నత పాఠశాల‌, నిజాం కళాశాల, ఉస్మానియా విశ్వవిద్యాలయాల్లో విద్యాభ్యాసం చేశాడు.

🔸ఆగస్టు ఉద్యమం  

ఆగస్టు ఉద్యమంగా పిలవబడే గాంధీ ప్రారంభించిన క్విట్ ఉద్యమం నాటికి సత్యనారాయణరెడ్డి వయసు 14-15 ఏండ్లు. 
1942 ఆగస్టు 8 వ తేదిన బొంబాయిలో గోవాలియా ట్యాంక్ మైదానంలో క్విట్ ఇండియా ప్రసంగం చేస్తూ  
" డూ ఆర్ డై" కి పిలుపునిచ్చాడు గాంధీ. దేశవ్యాప్తంగా యువత ఈ ఉద్యమానికి ఆకర్షితం అయ్యింది. 
అప్పటికి తెలంగాణలో పరిస్థితులు నైజాముకు వ్యతిరేకంగా ఉన్నాయి. కమ్యూనిస్టులు, ఆర్యసమాజ్, కొనసాగిస్తున్న నిజాం వ్యతిరేక కార్యకలాపాలు యువతను విద్యార్థులను పెద్దఎత్తున ఆకర్షిస్తున్నాయి. సత్యనారాయణరెడ్డి నవ యవ్వనంలో నిజాం వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొంటున్నాడు. 
ఇదే క్రమంలో క్విట్‌ ఇండియా ఉద్యమానికి మద్దతుగా జరిగిన సభలోనూ పాల్గొన్నాడు. అరెస్టయ్యాడు. పోలీసుల హింసకు గురయ్యాడు. 

🔸సోషలిస్టుగా :

ఆనాటి సమాజంలో సాంఘిక పరిస్థితులు, పోరాటాలు, ఉద్యమాలు, రాజరికం, ఈ నేపథ్యంలో 
సత్యనారాయణరెడ్డి విద్యార్థి దశలోనే మెల్లగా సామ్యవాద భావాల వైపు ఆకర్షించబడ్డాడు. 

ఆచార్య నరేంద్రదేవ్‌, 'లోక్‌నాయక్‌' జయప్రకాశ్‌ నారాయణ్‌, రామ్‌మనోహర్‌ లోహియాల స్ఫూర్తితో సోషలిస్టు పార్టీలో చేరి, పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో క్రియాశీలంగా పాల్గొన్నాడు.
చురుకైన యువకుడిగా అందరిని దృష్టిని ఆకర్షించాడు. 
సోషలిస్టు నాయకుడిగా చెలామణి అవుతూ నెమ్మదిగా క్రియాశీల రాజకీయాల్లోకి అడుగు పెట్టాడు. 
 
🔸ఉద్యమజీవితం 

1) సాయుధ పోరాట కాలంలో 

తెలంగాణ సాయుధ పోరాటం అనగానే కమ్యూనిస్టుల ఆంధ్రమహాసభ గుర్తుకు వస్తుంది. ఇందుకు ధీటుగా ఆర్యసమాజ్ కూడా పనిచేసింది. ప్రాణాలను ఫణంగా పెట్టి ముందుకు నడిచింది. ఈ సమయంలో ఆర్యసమాజ్ ఆదర్శాలను అమలులో పెట్టిన సత్యనారాయణరెడ్డి యువతను సమీకరించగలిగాడు. ఇదే క్రమంలో నిజాం ప్రభుత్వం నుండి సవాళ్ళను ఎదుర్కున్నాడు. రజాకార్లను నిజాం పోలీసులను తప్పించుకుంటూ దిన దిన గండంగా జీవితం గడిపాడు. పల్లెల్లో తిరుగుతున్నప్పుడు రక్షణ
కోసం మారు వేషం ధరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. 

2) తెలంగాణ ఉద్యమ కాలం 

1969 తెలంగాణ తొలివిడత ఉద్యమంలో పాల్గొన్నాడు. యువతను ఉద్యమం వైపు మళ్లించడంలో చురుకైన పాత్ర వహించాడు. 

2) భూదానోద్యమం :

గాంధీజీ శిష్యుడిగా ఆయన ఆశయాలు, సర్వోదయ సిద్ధాంతాలను ప్రచారం చేయడానికి ఆచార్య వినోబాభావే 1951 ఏప్రిల్‌ 15 వ తారీఖున హైద్రాబాద్‌ శివరాంపల్లిలో నిర్వహించిన సర్వోదయ సమ్మేళనంలో   
తన సందేశాన్ని ఇచ్చాడు. ఆ సభలో వేలాదిగా పాల్గొన్న వారిలో సత్యనారాయణరెడ్డి ఒకరు. 

తర్వాత 1951 ఏప్రిల్‌ 18వ తేదీన వినోబాభావే, 
తెలంగాణ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులు, అదివరకు జరిగిన సంఘటనల ప్రభావం, ప్రజల పేదరికం, ఖాసీంరజ్వీ సైన్యం కొనసాగించిన అరాచకాల ఫలితాలు, వీటన్నిటి నేపథ్యంలో శాంతియాత్ర కోసం పోచంపల్లికి వచ్చాడు. ఇక్కడ భూదాన్ ఉద్యమానికి శ్రీకారం చుట్టబడింది. 
వినోబాభావే చేపట్టిన ఈ భూదానోద్యమంలో సత్యనారాయణరెడ్డి పాల్గొన్నాడు. తాను సొంతంగా సంపాదించిన భూమిలో కొంత భాగాన్ని దానంగా ఇచ్చుకున్నాడు. 

ముఖ్యంగా భూస్వాముల భూదానం వల్ల పేదల జీవితాల్లో వచ్చే మార్పు భావి తరానికి వెలుగు ఇవ్వడం ఎంత వాస్తవమో, ఆ భూముల్ని నిలుపుకోవడం కూడా అంతే అవసరంగా సత్యనారాయణరెడ్డి ప్రచారం చేసాడు. 

🔸ఎమర్జెన్సీలో పత్రికాధిపతిగా :

1975-77 మధ్యకాలంలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఏకపక్షంగా అత్యవసర స్థితిని విధించింది. ఈ సమయంలో 21 నెలల కాలం భారత దేశం అత్యవసర స్థితిని ఎదుర్కొన్నది. ఈ ఎమర్జెన్సీ కాలంలో సత్యనారాయణరెడ్డి పౌర హక్కుల సభల్లో ప్రధానంగా పాల్గొన్నాడు. తన గళాన్ని బలంగా వినిపించాడు. ఈ క్రమంలో 
" మీసా "' చట్టం కింద అరెస్టయి 18 నెలలు జైల్లో ఉన్నాడు.అప్పుడు సత్యనారాయణరెడ్డి వయసు 
47 - 48 ఏండ్లు. పరిపక్వమైన వయసులో ఉన్నాడు. తన జైలు జీవితం వృధా కాకూడదని భావించాడు. తన ఉద్దేశ్యాలు సంకల్పాలు విరామం కోరుకోవడం ఇష్టం లేదు. అందుకే జైలు నుండి పత్రికా నిర్వహణకు శ్రీకారం చుట్టాడు. 

 పత్రికాధిపతిగా:

జైల్లో 'పయామ్‌-ఇ-నవ్‌' అనే హిందీ పత్రిక నడిపాడు. పత్రికలో దేశసమస్యలు, పౌరుల బాధ్యత, వంటి అంశాలను పొందుపర్చేవాడు. పత్రికను జైలులో తోటివారికి చేరవేసేవాడు.

పాడి పంటల మీద అమితమైన ప్రేమ ఉన్న సత్యనారాయణరెడ్డి, వ్యవసాయ సంబంధ పత్రికను తీసుకురావాలని ఆలోచన చేసాడు కానీ, పని ఒత్తిడిలో విరమించుకున్నాడు. 

🔸రాజకీయ జీవితం :

1969-71 వరకు తెలంగాణ ప్రజాసమితి పార్టీ చైర్మెన్‌గా ఉన్నాడు. 

1978లో జనతా పార్టీలో చేరాడు. ఈ పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఎంపికయ్యాడు.

1983లో తెలుగుదేశం పార్టీలో చేరి 1994లో రెండవసారి రాజ్యసభకు ఎన్నికయ్యాడు.ఇట్లా తన జీవిత కాలంలో రెండు సార్లు రాజ్యసభ సభ్యుడుగా పనిచేశాడు. 

1990-93 మధ్యకాలంలో ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా, 1993 నుంచి 1995 వరకు ఒడిషా గవర్నర్‌గా, 1993లో కొంతకాలం పశ్చిమబెంగాల్‌ రాష్ట్రానికి ఇన్‌ఛార్జి గవర్నర్‌గా వ్యవహరించాడు. 

పార్లమెంటుకు చెందిన వివిధ కమిటీలలో వివిధ హోదాల్లో పనిచేశాడు. 

🔸ప్రజాసేవలో 

సొంత ఊరిలో ఆంజనేయస్వామి ఆలయాన్ని కట్టించాడు. 

తన రాజకీయ పలుకుబడితో దళితులకు పక్కా ఇళ్లు మంజూరు చేయించాడు. నేటికీ దళితులు సత్యనారాయణరెడ్డి పేరు చెప్పుకుంటారు. 

తన వ్యవసాయ పొలంలో వచ్చే రాబడిలో సగభాగం వరకు ఉద్దేశ్య పూర్వకంగా ప్రజాసేవకు కేటాయించుకున్నాడు. ఈ క్రమంలో 
ఎందరో పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం స్వంతంగా అందించాడు. ఎందరో పేదల పెండ్లిళ్లకు మంగళసూత్రాలు దానంగా ఇచ్చాడు. 

వ్యవసాయం మీద ప్రేమ ఎంత ఉందో, రైతుల మీద పేద ప్రజల మీద వీరికి అంతే ప్రేమ. ఈ క్రమంలో తన పొలంలో పని చేసే వాళ్ళను కూలీలుగా కాకుండా ఉద్యోగులుగా భావించేవాడు. వారి జీత భత్యాలను బయటి కంటే ఎక్కువ కేటాయించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా కూలీలను ఉద్యోగులుగా పిలిచే రోజు రావాలని ఆశించేవాడు. 
రైతు రాజ్యం కోసం మాత్రం చివరి వరకు పరితపించాడు. 

వాయిదా పద్ధతులు, సోమరితనం, సత్యనారాయణరెడ్డికి అస్సలు నచ్చేవి కాదు. ఆ విధంగా ఎవరయినా కనిపించినా, వాళ్ళు ఎవరయినా సరే వారిమీద తీవ్రంగా మండిపడేవాడు. కష్టం చేసి ఫలితాన్ని ఆశించాలని పదే పదే చెప్పేవాడు. ఈ క్రమంలో తన దగ్గర పనిచేసే ఉద్యోగుల జీతాలను క్రమశిక్షణ ఆధారంగా రెట్టింపు చేసే వాడు.అటువంటి ఉద్యోగులకు అదనంగా కూడా ముట్టజెప్పేవాడు. 

🔸కుటుంబ వివరాలు : 

నిత్యం ప్రజల మధ్య తిరుగుతూ ప్రజలతో మమేకం అవుతూ వీరు పెళ్ళి కూడా చేసుకోలేదు.
ఆజన్మ బ్రహ్మచారిగా జీవించాడు. 

జీవితం చివరి దశలో రాజకీయం, ప్రజాసేవ, ఉద్యమాలు, అన్నింటికీ వద్దనుకున్నా విరామం దొరికింది. భార్యపిల్లలు లేని జీవితం ఒంటరిగా మిగిలింది. ఈ సమయంలో తన అన్న కుమారుడు రామచంద్రారెడ్డి వద్ద శేష జీవితం గడిపాడు. తన జీవితం ఎవ్వరికీ భారం కావొద్దనే ఉద్దేశ్యంతో తనకు వారసత్వంగా సంక్రమించిన భూమిని భాగాలు చేసి, ఒక భాగం రాంచంద్రారెడ్డికి ఇచ్చాడు. మిగతా పొలాన్ని అన్నాళ్లు తనను ఆదరించిన పేదలకు ఇచ్చివేసాడు. 
  
🔸మరణం 

ఊపిరితిత్తుల వ్యాధితో చికిత్స పొందుతూ 2012 అక్టోబరు 6 వ తేదీన తన 85 సంవత్సరాల వయస్సులో సత్యనారాయణరెడ్డి కాలధర్మం చెందారు. 

మనిషి వెళ్లిపోవును - మంచి ఒక్కటే గెలిచి నిలువును
__________________________________________
ఆధారం : 
మహబూబ్‌నగర్ జిల్లా విజ్ఞానసర్వస్వము ( బి.ఎన్.శాస్త్రి)
భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తెలుగు యోధులు,

No comments:

Post a Comment