Monday, April 15, 2024

నరసయ్యదాసురెడ్డి ( అవదూత - ఆధ్యాత్మిక గురువు )

నరసయ్యదాసురెడ్డి
(1909 - 1969)
( అవదూత - ఆధ్యాత్మిక గురువు )
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
వ్యాసకర్త : తంగెళ్ళశ్రీదేవిరెడ్డి 

భక్తి భావానికి... 
ముక్తి మార్గానికి.... 
ప్రవచనానికి.... ప్రబోధానికి.... 
నిలువెత్తు దర్శనం..... 
నిజ నిదర్శనం 
నరసయ్యదాసురెడ్డి !

ప్రపంచ చరిత్రలో ఎందరో మహానుభావులు. వాళ్ళల్లో ప్రాపంచిక సౌఖ్యాలను త్యజించి, పరమార్థానికి ప్రతిబింబాలు అవుతూ.... ఐహిక సుఖాలను అశాశ్వతంగా నిరూపిస్తూ... ధార్మిక ధర్మ పథంలో పయనిస్తున్న మహితాత్ములు ఎందరో ! వాళ్ళల్లో నరసయ్యదాసురెడ్డి ఒకరు. వీరు భగవాన్
అనీమీషస్వామిగా ప్రసిద్ధి చెందారు. అనిమిషుడు అంటే రెప్పవాల్చని వాడు అని అర్థం. శ్రీ మహా విష్ణువునకు రెండు కన్నులైన సూర్యచంద్రులు లోకమును ఎల్లవేళల చూచుచుందురు. అనిమిషులకు  దృష్టిప్రతిబంధనము లేదు అనేది వివరణ. 

👉పరిచయం : 

ఉత్తరాంధ్ర విజయనగరం జిల్లా డెంకాడ మండలం నాటి పూసపాటి గజపతి రాజధాని కుమిలి  గ్రామంలో 1909 లో  రైతు కుటుంబంలో నరసయ్యదాసురెడ్డి జన్మించారు. వీరిది పంటరెడ్డి శాఖ.  రెడ్డి రాజ్యం నిర్మించిన కొండవీటి రెడ్డిరాజుల బంధుత్వం ఇక్కడ విస్తరించిందని, ఆ వరసలోనిదే వీరి వంశం అని స్థానికులు చెప్పుకుంటారు.  నీలాపు జగ్గునాయుడురెడ్డి ( జగ్గురెడ్డి ), శ్యామలాంబ వీరి తల్లిదండ్రులు. ఆ కాలంలో మునసబులుగా పనిచేసిన వాళ్ళను నాయుడు పదం జోడించి పిలిచే ఆనవాయితీ ఉండేది. తల్లిదండ్రుల మెదటి సంతానంగా జన్మించిన నరసయ్యదాసురెడ్డి  అస్సలు పేరు  నరసింహదాసురెడ్డి. కాలక్రమంలో నరసయ్యదాసురెడ్డిగా పిలవబడ్డాడు. వీరికి ఒక తమ్ముడు, ఒకచెల్లెలు. 

పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టుగా  నరసయ్యదాసురెడ్డి చిన్నప్పటి నుండి ఆధ్యాత్మిక భావాలను కనబరిచాడు. తోటి పిల్లలంతా ఆడుకోవడమే జీవితంగా ఆనందాన్ని అనుభవిస్తుంటే, నరసయ్యదాసురెడ్డి  మాత్రం  భగవన్నామస్మరణలో ము మునిగితేలాడు. ముఖ్యంగా నరసయ్యదాసురెడ్డి బాల్యం నుండి కొన్ని లక్షణాలు కనబర్చాడు. 

1) దేనిమీద వ్యామోహం లేకపోవడం. 
2) కులం, మతం, ఇల్లు, ఆస్తులు, బంధువులు, కుటుంబం  ఇటువంటి భావనలు ఏ కోశానా లేకపోవడం. 
3) అనుబంధాలు ఆత్మీయతలు పెద్దగా ప్రదర్శించక పోవడం. 
4) తనకంటూ ఒక కొత్త లోకాన్ని సృష్టించుకుని ఎక్కువ సమయం అదే లోకంలో  ఒంటరిగా గడపడం. 
 5) పెళ్లి, పిల్లలు, వంశం, సంపాదన, ఉద్యోగం, అలంకరణ, వీటి గురించి  ఆశ పడకపోవడం 

👉అవధూత :

యుక్తవయసు వచ్చాక కూడా నరసయ్యదాసురెడ్డిలో మార్పు లేదు. సహజంగా వయసు రీత్యా కనబర్చే స్త్రీ వాత్సల్యం, ఆకర్షణ, వంటి లక్షణాలు కూడా వీరిలో కనబడలేదు. ఆధాత్మికచింతన మరింత పెరిగిపోయింది. భక్తికి  సంబందించిన పుస్తకాలు చదవడం, పుణ్యక్షేత్రాలు, దర్శించడం, దీక్షలు చేపట్టడం చేయసాగాడు. కాళికా ఉపాసకులుగా మారిపోయాడు 
ఈ క్రమంలోనే నరసయ్యదాసురెడ్డిలో ఏదో అతీతమైన శక్తి ఉందని సమాజం గుర్తించింది. కుటుంబ సభ్యులు కూడా క్రమంగా నరసయ్యదాసురెడ్డిలో తమ పిల్లవాడిని కాకుండా ఒక భగవత్ శక్తిని చూడటం మెదలెట్టారు. 

ప్రజలు నరసయ్యదాసురెడ్డిని ఎప్పుడైతే మానవాతీతుడు అనుకున్నారో అప్పుడే తమ సమస్యల పరిష్కారం కోసం దర్శించుకోవడం మొదలెట్టారు. వచ్చిన వారిని నరసయ్యదాసురెడ్డి తన ప్రవచనాలతో ఆదరించడం ఆకట్టుకోవడం మొదలెట్టాడు.

కాలం మెల్లగా నరసయ్యదాసురెడ్డిని 
ఆధ్యాత్మిక గురువులుగా మార్చింది. ప్రజలు  నరసయ్యదాసురెడ్డి  మహిమలు గురించి కథలు కథలుగా చెప్పుకోవడం మొదలెట్టాడు. 

👉ద్వాదశ దేవాలయ నిర్మాణం
     వేమన విగ్రహం  :
రాను రాను భక్తులు పెరిగిపోయారు. ఈ పరిస్థితిలో నరసయ్యదాసురెడ్డికి  ఆశ్రమ జీవితం ప్రారంభించాడు. 
రాత్రి పగలు తేడాలేకుండా వచ్చిన భక్తులను ఆదరించడం మొదలెట్టాడు. అందుకే  రెప్పవాల్చని  అనిమిషస్వామిగా ప్రజలు చెప్పుకోవడం మొదలెట్టారు. విరాళాలు కూడా స్వచ్ఛందంగా మొదలయ్యాయి. వచ్చిన ధనంతో ఆశ్రమానికి వచ్చే భక్తులకు భోజన వసతి సదుపాయాలు ఏర్పాటు చేయడం మొదాలెట్టాడు. అంతేకాదు 
1933  లో ద్వాదశ దేవాలయ నిర్మాణానికి పూనుకున్నాడు. ముందు జాగ్రత్తగా ఆలోచన చేసి, తన తదనంతరం, ఆలయ నిత్య ధూపదీప నైవేద్యాలు కోసం సుమారు  200 ఎకరాలు సేకరించాడు కూడా.

కుమిలి  గ్రామంలో ఉన్న ఈ దేవాలయంలో సకల దేవతలను ప్రతిష్టించాడు. సత్యనారాయణ స్వామి .. సూర్య నారాయణస్వామి.. వెంకటేశ్వర స్వామి.. .ఆంజనేయ స్వామి... గణపతి.. .లక్ష్మీ నరసింహస్వామి.... .రాధా రుక్మిణి ఆలయం...  .భద్రకాళి ఆలయం..... .దత్తాత్రేయ ఆలయం .సీతా రామాలయం. నవగ్రహ మండపం. రామాయణ  ఇతిహాసాలు తెలియజేసే చిత్రలేఖనాలు సర్వ మతాలు ఒక్కటే అని తెలియజెప్పే బుద్ధ భగవానుడు.. వీరందరితో పాటుగా వేమన విగ్రహం  ఏర్పాటు చేయడం ఇక్కడి ప్రత్యేకత.

👉శివైక్యం 

ఆజన్మబ్రహ్మచారిగా ఆశ్రమ జీవితం గడిపి  ప్రజల కోసమే జీవితాన్ని త్యాగం చేసిన నరసయ్యదాసురెడ్డి
1969 మే 31న తన అరవై ఏండ్ల వయసులో  శివైక్యం  పొందారు.
ప్రస్తుతం ఆలయంలో వీరు విగ్రహం రూపంలో కొలువుదీరి ఉన్నాడు. 

👉 పుస్తకాలు 

ఆలయానికి సంబంధించి స్థల పురాణం, నరసయ్యదాసురెడ్డి మహిమలు, అంటూ ప్రస్తుతం పుస్తకాలు కూడా ప్రచురింపబడుతున్నాయి. ఈ పుస్తకాలు ప్రకారం నరసయ్యదాసురెడ్డి మహిమలు ఈ కింది విధంగా పేర్కొనబడ్డాయి. 

నరసయ్యదాసురెడ్డి కొందరికి పులి రూపంలో కనపడినట్లు చెబుతుంటారు.  పులి క్రూర జంతువు. కానీ  స్వామి పుట్టిన జాతి రీత్యా ఆవిధంగా దర్శనం ఇస్తుంటాడు అనేది భక్తుల విశ్వాసం. 

అనిమిష భగవాన్ నరసయ్యదాసుగారు ఒకరోజు  సంచారం చేస్తుండగా దాహం వేయడం జరిగింది. అప్పుడు సమీపంలో ఉన్న ఒక బ్రాహ్మణుల ఇంటికి వెళ్లి  త్రాగడానికి నీరు  అడిగారు. అప్పుడు ఆ బ్రాహ్మణ స్త్రీ " అన్య కులస్థుడైన స్వామి వారికి మంచి నీరు ఇవ్వడానికి  నిరాకరించింది. ఒకవైపు స్వామివారికి దాహంతో నాలుక ఎండి పోతున్నది.దాదాపుగా ప్రాణం పోయే పరిస్థితి ఉన్నది.  అందుకే తన బాధను విన్నవించుకుంటూ మరొక్కమారు ఆ స్త్రీ మనసు మార్చే ప్రయత్నం చేస్తూ..... 

 "ఇంట్లో కావాల్సినంత ధనం ఉండి దానం చేయని వాడు, మంచినీరు ఉండి దాహార్తి నాలుక తడపని వాడు, బ్రాహ్మణుడైనా  రాజయినా  స్త్రీ అయినా, పురుషుడైనా, ఏదో ఒకరోజు అటువంటి పరిస్థితిని ఎదుర్కోక తప్పదు. అందుకే మీ మంచిని ఆశిస్తూ మళ్ళీ అభ్యర్థిస్తున్నాను "  అంటూ  వివరించాడు.

" మీరు ఇక్కడే నిలబడండి.  నేను లోపలకు వెళ్లి నూతిలో నుంచి మంచి నీళ్లు తెస్తాను " అని  చెప్పి ఆ బ్రాహ్మణస్త్రీ లోపలికి వెళ్ళింది. 

ఆశ్చర్యం..... బావిలో బకెట్టు వేస్తూ  లోపలికి  చూసేటప్పటికీ బయట ఉన్నా నరసయ్యదాసురెడ్డి  ప్రతిమ బావి నీళ్లలో  కనపడింది. ఒక్కసారిగా ఆమె ఒళ్ళు ఝలదరించింది.వచ్చిన వ్యక్తి సామాన్యుడు కాదు అని అర్థమై పోయింది. ఆమె ఇక ఆగలేదు. పరుగున బయటకు వచ్చి  పాదాలపై పడిపోయింది... ! 

ఇటువంటి  మహిమలు అనేకం వారికి సంబంధించిన పుస్తకాల్లో కనిపిస్తాయి. 

👉జాతి గర్వకారణం 

నరసయ్యదాసురెడ్డి  వంటి మహనీయులు తమ  జాతిలో పుట్టడం చాలా గర్వ కారణం అంటూ స్థానిక రెడ్లు వారి పేరుమీద అనేక ఉత్సవాలను, కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. పోరాటాలు, యుద్దాలు, రాజ్యాలు, వంటి రంగాల్లోనే కాదు,   ఆధ్యాత్మిక రంగంలో కూడా రెడ్ల పాత్రను సుస్థిరం చేసిన మహనీయుడుగా  పరమ పూజ్యనీయుడు
నరసయ్యదాసురెడ్డిని ప్రత్యేకంగా ఆరాధిస్తుంటారు. 
అనీమీషస్వామిగా  ప్రజలకు  సుపరిచితులు అయిన 
నరసయ్యదాసురెడ్డి చిత్ర పటం అక్కడి రెడ్డి కుటుంబాల్లో దాదాపుగా ఉంటుంది. 
____________________________________________
ఆధారం :
శ్రీకాకుళం జిల్లా వాస్తవ్యులు, జాతీయ రెడ్డి జేఏసీ కార్యవర్గ సభ్యలు -
ఆలపాన  త్రినాధ్ రెడ్డి గారి నుండి విషయం సేకరించడం జరిగింది

No comments:

Post a Comment