Saturday, April 20, 2024

అలిశెట్టి ప్రభాకర్( కవి -చిత్రకారుడు )

అలిశెట్టి ప్రభాకర్
( కవి -చిత్రకారుడు )
°°°°°°°°°°°°°°°°°°°°
వ్యాసకర్త : తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

తను వ్రణమై - అక్షర రణమై
తను క్షయమై - కవితలమయమై
తను మృతమై - పదముల కృతమై
అతడు.... అలిశెట్టి ప్రభాకర్!


#వివరాల్లోకి_వెళ్తే.....

చెదిరిన గీతై...మిగిలిన రాతై
అలసిన మాటై...ఆగని పాటై
సాహిత్యంలో పరిచయం అవసరం లేని పుట ! తెలంగాణ రాష్ట్రం జగిత్యాలలో 1954 జనవరి 12 న చినరాజం , లక్ష్మమ్మ దంపతులకు అలిశెట్టి జన్మించాడు. వీరు మొత్తం తొమ్మిది మంది తోబుట్టువులు కాగా వారిలో ఏడుగురు అక్కా చెల్లెళ్ళు, ఇద్దరు అన్నదమ్ముళ్ళు.

అలిశెట్టిది నిరుపేద కుటుంబం.తండ్రి చినరాజం కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఆకస్మికంగా మృత్యువాత పడ్డాడు. 
అప్పుడు అలిశెట్టి వయసు 11 ఏండ్లు. తండ్రి మరణంతో బాల్యం గాయపడింది.

తల్లి నీడలో కరీంనగర్లో పదవతరగతి వరకు చదువుకున్నాడు. ఇంటర్మీడియట్ కోసం సిద్దిపేట వెళ్ళాడు. కానీ చదువును కొనసాగించలేక పోయాడు. కుటుంబ కారణాల వలన తిరిగి సొంతూరు జగిత్యాల చేరుకొన్నాడు. కుటుంబ పోషణ కోసం తల్లికి సహకారం అందిస్తూ జీవన పోరాటం ఆరంభించాడు.

#ఫోటో_గ్రాఫర్_గా

చిన్నప్పటినుండి అలిశెట్టికి కళల మీద మక్కువ. అట్లా ఫోటోగ్రఫీ మీద ఆసక్తి ఏర్పడింది. తన అభిరుచి మేరకు సిరిసిల్లలో "రాం ఫోటో స్టూడియో" లో ఫోటోగ్రఫీ నేర్చుకొని, అందులో మెళకువలు ఔపాసన పట్టిన తర్వాత జగిత్యాలలో తన సొంత ఇంట్లో సొంతంగా " పూర్ణిమ ఫోటో స్టూడియో " ప్రారంభించాడు..1975 ప్రాంతంలో ఈ స్టూడియో పురుడు పోసుకుంది. అప్పుడు అలిశెట్టి వయసు 19 ఏండ్లు మాత్రమే.

జగిత్యాలలో స్టూడియో బాగా నడుస్తుంది. అలిశెట్టి ఫోటోగ్రఫీ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో కరీంనగర్‌లో 1979లో " శిల్పి ఫోటో స్టూడియో " ప్రారంభించాడు.

ఆ తర్వాత 1983 లో హైదరాబాద్లో 
"చిత్రలేఖ ఫోటో స్టూడియో " తెరిచాడు. తనలోని కళకు, తన అభిరుచిని జోడించి మంచి ఫోటో గ్రాఫర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 

#చిత్రకారుడిగా -

పెన్సిల్ తో బొమ్మలు గీయడం అనేది అలిశెట్టికి బాల్యం నుండి ఉన్న ఒక అలవాటు. చిన్నప్పుడు దేవుళ్ళ బొమ్మలు, ప్రకృతి, జంతువులు, పక్షులు, 
విపరీతంగా గీసేవాడు. తర్వాత పత్రికల్లో వచ్చే బొమ్మల్ని అచ్చు తీసినట్టుగా చూసి గీసేవాడు. ఆ తర్వాత క్రమంగా సినీ నటులు అలిశెట్టి బొమ్మల్లో కనిపించసాగాయి. మొదట ఒక అభిరుచిగా అలవాటుగా బొమ్మలు గీసిన అలిశెట్టి కళ క్రమంగా జీవం పోసుకుంది. మంచి చిత్రకారుడిగా పదిమందికి ప్రచారం అయ్యింది. అట్లా తెలిసిన కవులు, రచయితలు, తమ కవితలకు కథలకు బొమ్మలు గీయించుకోవడం మొదలెట్టారు. అలిశెట్టి ప్రతిభ క్రమంగా పత్రికా రంగాన్ని తాకింది. పండుగలు పర్వదినాల సమయంలో ఆయా పత్రికలకు బొమ్మలు గీసే అవకాశం వచ్చింది.అట్లా చిత్రకారుడిగా కూడా అలిశెట్టి జీవితాన్ని ప్రారంభించాడు.ఈ జీవితం నుండే అతడి ప్రయాణం మెల్లగా సాహిత్యం వైపుగా సాగింది.

#కవితలకు_ప్రేరణ

అప్పట్లో జగిత్యాల సాహితీ మిత్రదీప్తి ఆయా సందర్భాల్లో కవితల పోటీలు నిర్వహిస్తూ ఔత్సహికులను ప్రోత్సహించేది. ఈ క్రమంలో మిత్రదీప్తి 
 నిర్వహించిన కవితల పోటీలకు వివిధ ప్రాంతాలనుండి కవులు ఉత్తరాల ద్వారా తమ కవితలను పంపేవారు. వచ్చిన వందలాది కవితలను చదివే అవకాశం, కవితల గురించి చర్చించే అవకాశం అలిశెట్టికి దక్కింది. ఇట్లా అలిశెట్టిలో నిక్షిప్తమై ఉన్న కవితా శక్తిని మిత్రదీప్తి తట్టిలేపింది.

#దిక్కారం_తెలిసిన_సంస్కార_కవి 

అలిశెట్టిది ధిక్కార ధోరణి. సంఘంలో పేరుకుంటున్న రుగ్మతలు, సమాజంలో పెట్రేగుతున్న అసమానత, మానవీయతను కాలరాస్తున్న హింస, రాజకీయాల్లో విజృంభిస్తున్న అనైతికం, శోకతప్త జీవితాలు, విధివంచితులు అలిశెట్టి కవిత్వాల్లో కనిపిస్తారు.

1975 లో "పరిష్కారం " శీర్షికతో అలిశెట్టి రాసిన కవిత
ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ప్రచురింపబడింది.

ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే అలిశెట్టి నైజం. నిజాయితీ నిబ్బరం నిర్భయం అతడి కలంలో సిరాచుక్కలు. తలదించని అక్షరం అతడి ప్రాణం. ఊహా కవిత్వాలకు అభూత కల్పనలకు అలిశెట్టికి ఆమడదూరం. వాస్తవాన్ని
చంతాడంత వివరించకుండా ఒక్క వాక్యంలోనే అనంతమైన అర్థాన్ని అందివ్వడంలో అలిశెట్టి దిట్ట. వీరి భాష ఎంత సరళంగా ఉంటుందో ..... దాని వెనక అర్థం అంత కఠినంగా ఉంటుంది.

ఆర్ద్రతా హృదయాల కన్నీళ్లు తుడవడమే కాదు, వంచకులను దిక్కరించడం కూడా బాగా తెలిసిన కవి అలిశెట్టి.అంతే కాదు ఆయా వృత్తిల్లో బాధ్యతల్ని బలంగా గుర్తుకు చేయగల నేర్పరి కూడా.

"తను శవమై ఒకరికి వశమై
తను పుండై ఒకరికి పండై 
తను ఎడారై ఎందరికో ఒయాసిస్సై"
అంటూ వేశ్యల జీవితంలో వేదనను ఎంతో హృద్యంగా వినిపించగలిగాడు. వేశ్యల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఈ పదాలు నేటికిని ఉదాహరణలు అవుతున్నాయి. బాగా పరిశీలిస్తే అక్షరాలతో సముద్రాలు సృష్టించడం అలిశెట్టి ప్రత్యేకతగా అర్థం అవుతుంది.

#కవితా_సంకలనాలు 

1) ఎర్ర పావురాలు (1978)

1978 సెప్టెంబరు 9న విప్లవాత్మాకమైన చారిత్రాత్మకమైన సంఘటనకు జగిత్యాల వేదిక అయ్యింది. అది సుమారు అరకోటి ప్రజానీకం భూస్వామ్య వ్యవస్థ మీద విరుచుకుపడిన విప్లవోద్యమ సందర్భం. అనాటి ‘జైత్రయాత్ర’లో
నల్లా ఆదిరెడ్డి,మల్లా రాజిరెడ్డి,గద్దర్,అల్లం నారాయణ,
ముప్పాల లక్ష్మణ్‌రావు [గణపతి] శీలం నరేష్, లలిత, మల్లోజుల కోటేశ్వర్‌రావు [ కిషన్‌జీ] సాహు, కైరి గంగారాం, గజ్జెల గంగారాం, పోశాలు, అంగ ఓదెలు, నారదాసు లక్ష్మణ్‌రావులతో పాటు వేలాది మంది కదం తొక్కారు. జన సైన్యాన్ని ముందుకు నడిపించారు. ఈ జైత్రయాత్ర రష్యా గోడలపైన కూడా నినాదమై చోటు సంపాదించుకుంది.ఈ నేపథ్యంలో అలిశెట్టి తన అక్షరాలను ఎర్ర పావురాలుగా ఎగురవేశాడు. విప్లవ నాదమై ఎందరినో రగిలించాడు.
ఈ సంపుటిలో మొత్తం 46 కవితలు ఉన్నాయి.
బూడిద

సౌందర్య సౌధం కాలిపోయి
మిగిలిపోయిన బూడిద
ఆనాటి చరిత్ర....
ఆ బూడిదలో పొర్లే గాడిదల్లా
మనకెందుకు
ఇంకా అవే జ్ఞాపకాలు.....
వద్దు వద్దు
అది వసూలుకాని పద్దు
దాన్ని అసలే కోరద్దు
వెదురు బొంగుల్లాంటి
ఈ బ్రతుకులకే ఆ రంగు హంగులెందుకు ?
నీ ముందున్న కాలం
ఇనుమును నీ శ్రమతో కరిగించి
చక్కని శైలిలో మలుచుకో
సాధ్యమైనంత వరకూ

2)మంటల జెండాలు (1979)

 ఇది రెండవ కవితా సంపుటి. ఇందులో కవితలు అన్నీ కూడా అగ్ని పతాకలే. ఈ సంపుటిలో మొత్తం 34 కవితలు ఉన్నాయి 

3)చురకలు (1981)

కేవలం 18 పేజీల్లో వేసిన 80 ద్విపదల సంకలనం. వెల ఒక రూపాయి మాత్రమే. సాహిత్యంలో ఒక కొత్త ఒరవడి సృష్టించిన చురకలు తర్వాతి తరం కవులకు మార్గదర్శకం అయ్యింది.

న్యాయాన్ని ఏ కీలుకి ఆ కీలు
విరిచే వాడే వకీలు.....

అనేది చురక. నిజంగా కవిలో ఎంత లౌకికం? మరెంత
లోతైన దృష్టి?! 

4)రక్త రేఖ (1985)

ఈ సంపుటీలో 38 కవితలు ఉన్నాయి.

5)ఎన్నికల ఎండమావి (1989)

▪️ఎన్నికల్లో 
ఓట్లడుక్కునే చిప్ప
టోపీ...

ప్రగతి వెంట్రుకలు
మొలవని బట్టతల
శంకుస్థాపన రాయి....

నాయకుడు
వాడు ముందే వానపాము
మరి ముడ్డెటో మూతెటో

▪️ఐదేళ్లకోసారి అసెంబ్లీలో మొసళ్లూ
పార్లమెంట్​లోకి తిమింగలాలూ
ప్రవేశించడం పెద్ద విశేషం కాదు
జనమే ఓట్ల జలాశయాలై
వాటిని బతికించడం విషాదం'

అంటూ సూటిగా వ్యాంగ్యంగా అక్షర బాకుల్ని
దింపిన కవి అలిశెట్టి.

6)సంక్షోభ గీతం (1990)
14 కవితల సమాహారం.
7)సిటీ లైఫ్ (1992)

1982 లో హైదరాబాదులో అలిశెట్టి కుటుంబం స్థిరపడింది. నగరజీవితాన్ని కళ్లారా చూసి.....అక్కడి కష్టాన్ని సుఖాన్ని మనసారా అనుభవించి....ఆ తర్వాత హైదరాబాద్ నగరంపై మినీ కవిత్వం రాశాడు. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆరేళ్ళ పాటు వరుసగా ఈ కవితలు "సిటీ లైఫ్ " శీర్షికతో వచ్చాయి. ఈ సంపుటిలో 417 కవితలు ఉన్నాయి.

కాసుకో కోసుకో రాజకీయమా !
ప్రజలు పనసతొనలు
మీరు కత్తిమొనలు !! 

#విమర్శలు

వాస్తవం చెప్పాలంటే బతికి ఉన్నప్పుడు రాని గుర్తింపు అలిశెట్టికి చనిపోయాకే వచ్చింది. రాయడం వచ్చిన వాళ్ళే కాదు, రాయడం తెలియని వాళ్ళు కూడా అప్పట్లో అలిశెట్టి కవిత్వం గురించి విమర్శలు చేశారు. దీర్ఘ కవితలు రాయలేడని, చిన్న వాక్యాలతో సరిపెట్టుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. కానీ సూక్ష్మంలో బ్రహ్మాండాన్ని మోసిన ఆ కవితల విలువ ఆనాడు విమర్శకులు గుర్తించలేక పోయారు. ఏమైతేనేం.....ఎదురుదాడిని ఎదురుకుంటూ దీర్ఘ కవితలు కూడా రాసి తన ప్రతిభను నిరూపించుకున్నాడు అలిశెట్టి.

#భాగ్యంతో_అనుబంధం 

అలిశెట్టి భార్య భాగ్యలక్ష్మి. ఎంతో ఇష్టపడి ఆమెను పెళ్ళి చేసుకున్నాడు ధనానికి పేదరాలైనా గుణానికి శ్రీమంతురాలు భాగ్యలక్ష్మి. తాను క్షయ బారిన పడి
మరణశయ్య మీద ఉన్నప్పుడు ఆమె చేస్తున్న సేవలు తలుచుకుంటూ రాసుకున్న కవితల్లో " నా భాగ్యం " అంటూ ఆ ఇల్లాలు కనిపిస్తుంది. హృద్యమైన ఆ కవితలు వారి అనురాగానికి అనుబంధానికి మధ్యన ఆర్ద్రతను ఆవిష్కరిస్తాయి.

మరణం నా చివరి చరణం కాదని ప్రకటించుకున్న అలిశెట్టి తనను సమీపించిన మృత్యువును పసిగట్టాడు. అయినా భయపడలేదు. ఒకవైపు మృత్యువుతో యుద్ధం చేస్తూనే మరోవైపు చావు ఎప్పుడు తనతో కారచాలనానికి చేయి అందించినా అందుకోవడానికి సిద్దపడి ఉన్నాడు. చివరి చరణం కాదని ఎంత నిర్భయంగా ప్రకటించుకున్నాడో అంతే ధీటుగా మరణం తర్వాత కూడా అక్షరమై శ్వాసించాడు.

మృత్యువు తనతో కొట్లాడుతున్నప్పుడు
 " పర్సనల్ లైఫ్" అంటూ తన హృదయాన్ని ఆవిష్కరణ చేసాడు. తనలో భావాలకు బాధకు అక్షర రూపాన్ని అందిస్తూ తనని తాను ఓదార్చుకున్నాడు. పిరికితనంతో ఏడ్వడం తెలియని కవి, ఏడుపు జీవితాలను ధైర్యంగా ఓదార్చే కవి, కనిపించని కన్నీళ్లతో కన్నీటి వీణ మీటాడు.

తెర వెనక లీలగా
మృత్యువు కదలాడినట్టు
తెరలు తెరలుగా దగ్గొస్తుంది ..
తెగిన తీగెలు
సవరించడానికన్నట్టు
గబగబా పరిగెత్తుకొచ్చి నా భాగ్యం
గ్లాసెడు నీళ్ళందిస్తుంది.....

అంటూ తన చివరి రోజుల్లో పరిస్థితిని చెప్పుకున్న కవి, ఎవ్వరికి చెప్పకుండా ఆతర్వాత కొన్నాళ్ళకు అక్షరాన్ని ఆయుష్షును వదిలి ఒంటరిగా వెళ్ళిపోయాడు.

‘‘కలగా పులగంగా కలసిపోయిన రోజుల్లో
ఇంచుమించు ఒకే కంచంలో
ఇంద్రధనస్సుల్ని తుంచుకుని తిన్న రోజుల్లో
మా గుండెల్లో సమస్యలు మండని రోజుల్లో
సిగరెట్‌ పీకలాంటి నన్ను
సిగలో తరుముకొని
గాజు కుప్పెల్లాంటి నా కళ్ళలోనే
ఆశల అగరొత్తులు వెలిగించుకుందే తప్ప
తులతూగే ఐశ్వర్యమో
తులం బంగారమో కావాలని
ఏనాడూ ప్రాధేయ పడలేదు''

అంటూ అనుకూలవతి ఐన తన భాగ్యాన్ని తలుచుకున్న కవిలో వేల వేదనలు కనిపిస్తాయి. ఈ ఒక్క కవిత చాలు భాగ్యం మీద ప్రభాకర్ కు ఉన్న అంతులేని ప్రేమనురాగాలను అర్థం చేసుకోవడానకి.

#వెంటాడిన_పేదరికం

దిక్కార స్వరాన్ని వినిపించిన ధీటైన కవి, పీడితుల కంఠ స్వరమై నినదించిన కవి, ఆర్తుల ఆకలి కేకై దోపిడీ దారుల మీద తిరగబడిన కవి, తన జీవితంలోనూ జీవితం తర్వాత కూడా పేదరికాన్ని అనుభవించాడు. ప్రపంచ తెలుగు మహాసభల ప్రాంగణంలో అలిశెట్టి బొమ్మ చోటు చేసుకోవడం ఎంత భాగ్యమో.....ఆ భాగ్యం ధన రూపేణా తన జీవితానికి నోచుకోక పోవడం బాధాకరం. బతికినంత కాలం నిజాల్ని నిగ్గుతెలుస్తూ సమాజాన్ని మేలుకొలుపుతూ బతికాడే తప్ప ఏనాడు సంపాదన కొరకు ఆరాట పడలేదు.
అలిశెట్టి మరణం తర్వాత జీవిత భాగస్వామి భాగ్యలక్ష్మి జీవితంలో యుద్ధం మొదలయ్యింది.
తెలుగు విశ్వవిద్యాలయంలో కాంట్రాక్టు అటేండర్ గా ఉద్యోగం చేయడమంటే ఆమె ఆర్ధిక పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 

కుటుంబానికి సరిపడ ఆస్తులు సమకూర్చక పోయినా, తరతరాలు గర్వపడే గౌరవాన్ని గుర్తింపుని సమకూర్చిన అలిశెట్టి ..... ఒక్క తన కుటుంబానికే కాదు, తెలుగు సాహితీ ప్రపంచానికే గర్వ కారణం.

#కుటుంబం

అలిశెట్టికి భార్యా ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమారుల చదువుల కోసం భార్య భాగ్యలక్ష్మి పడిన కష్టాలు అక్షర కోటిశ్వరుడు పై నుండి తిలకించి ఉంటే మాత్రం మళ్ళీ బతకడం కోసం భగవంతుడికి దరఖాస్తు కచ్చితంగా పెట్టుకునే వాడు.

 #సినిమారంగాన్ని_కాదంటూ 

తన కళ సమాజం కోసం, సమాజాన్ని మేల్కొల్పడం కోసం, సమాజాన్ని ఆలోచింపజేయడం కోసం అనే నిబద్ధతకు కట్టుబడిన కవి అలిశెట్టి. వృత్తి ప్రవృత్తి రెండిటిని రెండు భుజాలపై మోసిన కవి, తన కవిత్వాన్ని అమ్ముకోవడానికి ఇష్టపడలేదు. సినిమా రంగం నుండి పిలుపు వచ్చినప్పుడు సున్నితంగా అవకాశాన్ని తోసిపుచ్చాడు. సినిమా అంటే వ్యాపారం. అక్కడ నిజాయితీకి కట్టుబడి సమాజం కోసం మాత్రమే రచనలు చేసే అవసరం లేదు. వ్యాపార దృష్టికి కట్టుబడి కలానికి సంకెళ్లు వేసి కలను సృజంచాల్సి వస్తుంది. ఇక్కడ మన నైజానికి విలువలేదు. ఏం చెబితే అదే రాయాలి. ఇష్టాఇష్టాలతో పనిలేదు. అందుకే సినిమా రంగాన్ని అనిశెట్టి వదులుకున్నాడు. లేదంటే లక్షలు గడించే వాడు. కానీ
అందరికీ ధనం తీపి అయితే.... అలిశెట్టి మాత్రం ఆ ధనానికి విలువ లేదని నమ్మాడు. అందుకే 
చివరి వరకు చిత్రకారుడిగా, ఫోటో గ్రాఫర్‌గా జీవితాన్ని కొనసాగిస్తూ కవిగా ఎదిగాడు. తన వృత్తి ప్రవృత్తిలను చివరి శ్వాస వరకు ప్రేమించాడు.

#కవితా_సంపుటాలు (మరణం తర్వాత )

ధ్వంసమౌతున్న మానవీయ విలువలు.... మసిబారుతున్న సామజిక విలువలు.....
వీటి గురించి బాధ పడిన విశాల తత్వం , రాజీ ఎరుగని మనస్తత్వం, ఇదే అలిశెట్టి జీవితం. ఇటీవలి కాలంలో వీరి కవితలు మొత్తం రెండు సంపుటాలుగా వెలువడ్డాయి.
1)సిటీ లైఫ్
2)అలిశెట్టి ప్రభాకర్ కవిత్వం 

#పరలోకాలకు

1993 జనవరి 12న తన 37 వ ఏటా అలిశెట్టి పర లోకానికి ప్రయాణం అయ్యాడు. ఏ రోజైతే జన్మించాడో అదే రోజు మరణించడం యాదృచ్చికం. బతికి వున్నింటే మరిన్ని అద్భుతాలు సృష్టించే వాడు అని సాహితీకులం దుఖిస్తున్నది కానీ... 
కొంచెంలోనే జీవితకాల అద్భుతాన్ని సొంతం చేసుకున్న అనితరసాధ్యం అనిశెట్టి. తనదైన శైలిలో కవితలు రాసి, తనదైన వ్యక్తిత్వాన్ని చివరి వరకు నిలుపుకుని, జనాల్లో ఆలోచనా దృక్పథాన్ని..... సంస్కరణ దృష్టిని ...... విప్లవాగ్నిని..... సామాజిక చైతన్యాన్ని.... సాహిత్యభిలాషను...పరిపూర్ణంగా పెంపొందించిన అతి కొద్ది మంది కవుల్లో అలిశెట్టి ఒకడు. వారి దివ్య స్మృతి చిరస్మరణీయం.

మరణం నా చివరి చరణం కాదు
మౌనం నా చితాభస్మం కాదు
మనోహరాకాశంలో విలపించే చంద్ర బింబం నా అశ్రుకణం కాదు
సిద్ధాంత గ్రంథ సారమేదీ వడబోయకున్నా 
సిద్ధార్థుడు వదిలి వెళ్లిన ఈ రాజ్యమ్మీద
నెత్తుటి ధారలు కడిగేందుకు
కవిత్వం నాకవసరమై ఆయుధమె నిలిచింది ....!!!!

No comments:

Post a Comment