Tuesday, April 16, 2024

సంస్థాన మహిళలు చరిత్ర నిర్మాణం

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో....
 సంస్థాన మహిళలు - చరిత్ర నిర్మాణం
( 12 శతాబ్దం నుండి 1947 వరకు )
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
 మహిళా శక్తి అఖండమైనది. అవకాశం ఆదరణ ఉంటే మహిళ తన నారీ శక్తిని నిరూపించుకుంటుంది. తరతరాల చరిత్రలో అణిచివేతకు , దోపిడీకి , గురవుతున్న మహిళలు మాత్రమే కాదు... అణిచివేతల్ని దోపిడీ వ్యవస్థల్ని ఎదిరించిన మహిళ శక్తులు కూడా ఉన్నారు. సమస్త ప్రపంచానికి స్ఫూర్తిని పంచే స్త్రీల విజయ గాథలు మహిళ లోకానికి ఆదర్శప్రాయం.. నాటి నుండి నేటి వరకు మహిళలు తమ తమ రంగాల్లో పరిణతి సాధించి... సామాజిక రాజకీయ చారిత్రక చరితను సృష్టించారు. ఒక సూచనప్రాయంగా కొందరు సంస్థాన మహిళల ఉత్థాన పతనాల వీర విజయ ఘన చరిత్ర తెలుసుకుందాం.

▪️తొలి మంత్రిణి నాయకురాలు నాగమ్మ (12 వ శతాబ్దం )

 స్త్రీ పౌరుషానికి , యుద్ధ భీకరానికి, రాజనీతిజ్ఞతకు , అపరచాణిక్యానికి నమూనా నాయకురాలు నాగమ్మ.. మధ్యయుగ భారతంలో నాగమ్మ అత్యంత శక్తివంతమైన మహిళ. నాగమ్మది కరీంనగర్‌ జిల్లా, పెగడపల్లి మండలం, అరవెల్లి గ్రామం .నెలకొన్న కరువు కాటకాలు...మశూచి మహమ్మారి కారణంగా ఇతడు తన కుటుంబంతో సహా పల్నాడులోని జిట్టగామాలపాడు గ్రామానికి వలస వెళ్లడం జరిగింది .అత్త కొడుకు.. మేనబావతో చిన్నతనంలోనే నాగమ్మకు పలనాడు సీమలోనే వివాహం జరిగింది. ఆ వెంటనే దురదృష్టం వెంటాడి బాలవితంతువు అయ్యింది. అయినప్పటికీ మొక్కవోని విశ్వాసంతో పెరిగి పెద్దదయ్యింది.
పలనాడు ప్రాంతంలో రాను రాను దొంగల బెడద ఎక్కువవుతుంది. దారి దోపిడీలు హత్యలు నిత్యకృత్యం అయిపోతాయి. అస్త్రశాస్త్ర విద్యలు తెలిసిన నాగమ్మ గ్రామంలో యువకుల్ని సమీకరించి దళాలను తయారుచేస్తుంది. తన విద్యల్ని యువతకు కూడా నేర్పించి, తన నేతృత్వంలో దారిదోపిడీలను ఎదుర్కొంటుంది. ఆ విధంగా నాగమ్మ పేరు పరిసర ప్రాంతాల్లో మారుమోగుతుంది.
12వ శతాబ్దంలో పలనాడు ప్రాంతాన్ని హైహయ రాజులు పరిపాలిస్తున్నారు . అనుగురాజు హైహయ వంశస్థుడు...నలగామరాజు , మలిదేవుడు, అనుగురాజు కుమారులు. తండ్రి మరణం తర్వాత విడిపోయి ఎవరి రాజ్యం వాళ్ళు ఏర్పరచుకుంటారు., గురజాలకు రాజైన నలగామరాజుకు నాగమ్మ శాశ్వత మంత్రిణిగా ఉండిపోతుంది. ఆ విధంగా ప్రపంచంలోనే తొలి మహిళా మంత్రిగా నాగమ్మ చరిత్ర సృష్టించింది. రాజ్యకాంక్ష, లింగబేధంతో, అడుగడుగునా నాగమ్మను ఆటంకాలు కలిగించిన బ్రహ్మనాయుడు మాచర్లకు రాజైన మలిదేవుడు వద్ద మంత్రిగా ఉంటాడు. ఈ రాజ్యాల మధ్య క్రమంగా శత్రుత్వం పెరుగుతుంది. శత్రుత్వానికి కారణం రాజ్య కాంక్ష కంటే పంట కారణం ఎక్కువగా కనిపిస్తుంది. శివకేశవ తత్వాలు కూడా యుద్దానికి కారణాలుగానే కనిపిస్తున్నాయి . ఈ నేపథ్యంలోనే సా.శ.1176-1182 మధ్యకాలంలో గురజాల, మాచర్ల రాజుల మధ్య పలనాడు యుద్ధం జరిగింది. యుద్ధంలో నాగమ్మ బ్రహ్మనాయుడుని ఓడిస్తుంది. మలిదేవుడి తలను ఛేదిస్తుంది..యుద్ధం తర్వాత తిరిగి తన స్వగ్రామం కరీంనగర్ జిల్లా అరవెల్లికి వస్తుంది.
ఇక ప్రజలమనిషిగా....
జిట్టగామాలపాడులో నాగమ్మ భక్తుల కోసం శివాలయం నిర్మించింది. శంభుఆలయం కూడా నిర్మించింది.
దాచేపల్లి లో వీరభద్ర ఆలయం నిర్మించింది.
గురజాలలో దూబ చెరువు తవ్వించింది. 
వాగులపై వంతెనలు నిర్మించింది
ఆరెవెల్లిలో నాగమ్మ గుడికి తూర్పు భాగాన నాయకురాలి వాగు, నాయకురాలి మడుగు ఉన్నాయి. అప్పట్లో ప్రజల కోసం నాగమ్మ వాటిని తవ్వించి ఉండవచ్చు లేదా వాటిని వృద్ధి చేసి ఉండవచ్చు. అందుకే నాయకురాలు నాగమ్మ పేరుతో వాటిని పిలుస్తున్నారు.నాగమ్మ సేవలకు పౌరుషానికి ప్రతీకగా దాచేపల్లిలో ఆమె విగ్రహం ఉంది.

▪️తొలితెలుగు కవయిత్రి - కుప్పాంబిక
( 13 వ శతాబ్దం )
                                                    
కాకతీయ సామ్రాజ్యంలో 13వ శతాబ్దానికి చెందిన కుప్పాంబిక తొలి తెలుగు కవయిత్రిగా వెలుగులోకి వచ్చారు. .కుప్పాంబిక రచనలు కాని, వాటిపేర్లు కాని లభ్యం కాలేదు. కృష్ణదేవరాయల ఆస్థాన కవి అయ్యలరాజు తన సంకలన గ్రంథంలో ఉదహరించిన కుప్పాంబిక పద్యాలను పరిశోధకులు ఆధారం చేసుకుంటున్నారు. 

తొలి తెలుగు కవయిత్రిగా వెలుగులోకి వచ్చిన కుప్పాంబిక .... గోన బుద్దారెడ్డి ముద్దుల కూతురుగా . రుద్రమకు చతురంగ బలమై వెన్నంటిన గోన గన్నారెడ్డి సోదరిగా , కాకతీయుల సామంతులుగా బూదపురం రాజ్యాన్ని పాలించిన మల్యాల గుండనాథుడు భార్యగా కుప్పాంబిక వీరశిరోమణి 

13 వ శతాబ్ధంలో భర్త మల్యాల గుండనాథుడు
మరణానంతరం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని బూదపురంలో (బుద్దాపురం) 1270 - 76 ప్రాంతంలో శివాలయాన్ని 'గుండేశ్వరాలయం ' గా నిర్మించింది. 1276లో స్మృతి శాసనం వేయించినది.ఆమె నిర్మించిన ఆలయం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోగా ప్రస్తుతం ఆలయాన్ని రామలింగేశ్వర ఆలయంగా పున:రుద్దరించారు.

తండ్రి నుంచి సాహిత్య వారసత్వం పొందినట్టుగా..., భర్త మల్యాల గుండనాథుని ఆస్థానంలోని ఈశ్వరభట్టోపాధ్యుడు అనే పండితుడి స్ఫూర్తితో సాహిత్యానికి మెరుగులు దిద్దుకున్నట్టుగా పరిశోధకులు భావిస్తున్నారు.ఆ బూదపూరమే ఇప్పటి భూత్పూర్.
 కుప్పాంబిక ప్రజల దాహార్తి కోసం బావులు తవ్వించింది.పశువుల కోసం నీటి కుంటలు ఏర్పాటు చేయించింది. శివభక్తితో లింగాలు పతిష్టించుట, తోటలు వేయించుట, చెఱువులు త్రవ్వించుట, శివ కేశవ బేధం లేకుండా విష్ణు విగ్రహాలను ప్రతిష్టించట, బీద సాదలకు దానధర్మాలు చేయుట, సాధువులకు మఠాలు నిర్మించుట గావించింది.ఈ విధంగా ఆనాడు గొప్ప పజాదరణ పొందిన వనితగా కుప్పాంబిక చరిత్ర సృష్టించింది. స్వర్ణము, రథములు, గుఱ్ఱములు,ఆవులు,
అన్నము, , గృహములు, బట్టలు, నీరు, గొడుగులు, పక్క బట్టలు, అనేకానేక వస్తువులు ధర్మము చేసిన కుప్పాంబిక గోన, మల్యాల వంశముల క్రీర్రి ప్రతిష్టల ఇనుమడింపజేసినది.

▪️హేమారెడ్డి మల్లమ్మ 
( 14 వ శతాబ్దం )
తెలుగు వెలుగుని కీర్తించే మా తెలుగుతల్లికి మల్లె 
పూదండ గేయంలో " మల్లమ్మ_పతిభక్తి " పదం వెనుక కథ చాలా మందికి తెలియక పోవచ్చు. ఆ పుణ్యస్త్రీ ఎవ్వరో కాదు... హేమారెడ్డి మల్లమ్మ !ఒక మానవ జన్మ ! ఒక అవధూత ! 

మల్లమ్మ కన్నీరుగా పూజలందుకుంటున్న ఈ మాహాసాద్వి ఆలయం శ్రీశైలంక్షేత్రానికి సమీపంగా ఉన్నది. శివుడి కోసమే తన జీవితంగా శివ ధ్యానంలో ఊహ తెలిసినప్పటి నుండి బతికింది . ఈమె 14 వ శతాబ్దానికి చెందినదిగా హిస్టరీ_ఆఫ్_శ్రీశైలం వివరిస్తున్నది. మల్లమ్మ పురాణం ప్రకారం శ్రీశైలం క్షేత్రానికి దగ్గర ఉన్న శివపురం అనికూడా పిలవబడే రామపురం గ్రామంలో నాగిరెడ్డి, గౌరమ్మ ( గౌవమ్మ) దంపతులు నివసించేవారు. వీరికి మల్లిఖార్జునుడి ఆశీర్వాదంతో హేమారెడ్డి మల్లమ్మ పుట్టింది.ఎవ్వరూ నేర్పకుండానే, ఎవ్వరూ చెప్పకుండానే ఎవ్వరూ చూపకుండానే, పసితనం నుండే బాలిక శివనామాన్ని జపించడం మొదలెట్టింది. శివా శివా అంటూ శివదేవుడిని పరిసరాల్లో వెదుక్కుంటూ ప్రకృతే శివుడిగా... తన మనసే ఆలయంగా బతకడం మొదలెట్టింది.

తమ సమీప గ్రామమైన సిద్ధపురం భూస్వామి హేమారెడ్డి చిన్న కుమారుడు బారామారెడ్డికి (వరమారెడ్డి)తన బిడ్డను అర్థాంగిగా పంపాలని మల్లారెడ్డి భావించాడు. అనుకున్నట్టుగానే మల్లమ్మకు పెండ్లి నిశ్చయం చేశారు.

ఇహ పరమైన జీవిత సుఖాలకు మల్లమ్మ ఏమాత్రం ప్రభావితం కాలేదు. మల్లమ్మ పూర్తిగా శివభక్తిలో మునిగిపోయింది. కుటుంబాన్ని వదిలి శ్రీశైలం చేరుకొని సర్వసంగ పరిత్యాగినైయై శివుడిని ఆరాధిస్తూ గడపసాగింది. లోకం ఆమె భక్తిని చూసి ఆశ్చర్యపోయింది. కాలక్రమంలో మల్లమ్మ లోకాన్ని కూడా మర్చిపోవడం మొదలెట్టింది. ముక్తికి సమయం ఆసన్నమైనట్టుగా తనను తాను కూడా మర్చిపోయింది..మొత్తానికి శివుడు ఇక ఆమెను కరుణించాడు . ఆమె ప్రార్థనలకు సమాధానం లభిస్తూ దర్శనం ఇచ్చాడు. 
ఆ ఉద్విగ్న సమయంలో మల్లమ్మ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నది. ఆ కన్నీరే ఇప్పుడు మందిరం పశ్చిమ వైపు ప్రధాన ఆలయం నుండి సుమారు 2 కి.మీ. దూరంలో రెండు సహజ శిలల మధ్య ఒక చిన్న నీటి ప్రవాహంగా కనిపిస్తున్నది. ఈ ప్రవాహానికి మల్లమ్మ కన్నీరు అని పేరు. 
ఈ కన్నీరు గురించి పురాణ, జానపద కథనాలు ఉన్నాయి. మల్లమ్మ నివసించిన ప్రదేశం నుండి ఉద్భవించిన రెండు నీటి మార్గాలను ప్రస్తుతం మనం చూడవచ్చు

▪️రెడ్డిరాణి _ అనితల్లి
(15 వ శతాబ్దం )
రాజమహేంద్రవరం రెడ్డి రాజ్య చరిత్రలో చెప్పుకోదగిన కీలకమైన వ్యక్తి రెడ్డి రాణి...అనితల్లి. ఈమె రెడ్డిరాజ్య స్థాపకుడు ప్రోలయవేమారెడ్డి ముని మనవరాలు. వీరుడు పరాక్రమవంతుడు కాటయవేమారెడ్డి కూతురు. 
అనితల్లి భర్త వీరభద్రారెడ్డి.
1423 లో అనితల్లి రాజ్యాధిపతిగా ప్రకటించబడుతుంది. అనితల్లి ముద్రతో వీరభద్రారెడ్డి రాజ్యపాలన మొదలెడుతాడు. తమ్ముడు వీరభద్రారెడ్డికి అన్న అల్లయ వేమారెడ్డి
 కుడి భుజమై సహకరిస్తాడు. అన్నాదమ్ముళ్ల ఈ మైత్రి గురించి శ్రీనాథుడు తన 'కాశీఖండం' లో చెప్పడం జరిగింది.

అనితల్లి వేయించిన కలువచేరు శాసనం ద్వారా రెడ్డి రాజ్యానికి సంబంధించిన అనేక విషయాలు బయల్పడ్డాయి.వీరుడైన భర్త వీరభద్రారెడ్డి వెనుక విజయ హస్తంగా ఉన్న అనితల్లి, 1425 ప్రాంతంలో ఈ కలువచేరు శాసనం వేయించినట్టు చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. కలువచేరు శాసనం రెడ్డి రాజుల చరిత్ర గురించి, కాకతీయుల గురించి, ముసునూరి వంశం గురించి, హిందూ స్వాతంత్ర పునరుద్ధరణ గురించి అనేక అనేక విషయాలను తెలియజేస్తున్నది. రెడ్డి రాజుల చరిత్ర తెలుసుకోవడం కోసం ఈ శాసనం ఒక ప్రామాణిక ఆధారంగా ఉపయోగపడుతుంది. అందుకే చరిత్రకారులు అనితల్లిని " రెడ్డి రాజ్యాల నొసటన మెరిసిన సింధూరంగా " అభివర్ణించారు.

▪️రాణి శంకరమ్మ (18 వ శతాబ్దం )
పాపన్నపేట సంస్థానాధీశులలో రాణి శంకరమ్మ 12వ తరానికి చెందిన మహారాణి. ఈమె గొప్ప ధీశాలి. మరో రుద్రమదేవి. ఈమె భర్త రాజా వెంకట నరసింహారెడ్డి( 1720 - 1760 ). వీరికి పుత్ర సంతానం లేదు. ఇతడి మరణం తర్వాత , అంతఃపుర కుట్రలు జరిగి, అతడి తమ్ముడి రెండవ భార్య లింగాయమ్మ పరిపాలనకు వస్తుంది. 1760 - 1764 మధ్యకాలంలో లింగాయమ్మ సంస్థానాన్ని పాలించింది. ఇదే కాలంలో మహారాష్ట పీష్వాలు నిజాం రాజ్యంపై దండెత్తి వస్తారు. రాణి శంకరమ్మ తన శక్తి యుక్తులతో మహారాష్ట్ర పీష్వాలను ఓడిస్తుంది. ఇందుకు నిజాం ప్రభువు మెచ్చి, రాణి శంకరమ్మను " రాయ్ బాగన్ " అనే బిరుదు ఇచ్చి, సత్కరించి, రాణిగా నియమించాడు. రాయి భాగన్ అంటే ఆడపులి అని అర్థం. ఆ విధంగా 1764లో రాణి శంకరమ్మ పరిపాలనకు వస్తుంది.

రాణి శంకరమ్మ రాజ్యాన్ని పునర్వ్యవస్థీకరించింది..
ప్రజల తాగునీటి సాగునీటి అవసరాల కోసం చెరువులు, బావులు, కుంటలు తవ్వించింది. ఈమె గొప్ప సంస్కరణశీలి కూడా! . దళితుడైన పాపన్నను ప్రధాన తన సైన్యానికి దళపతిని చేసి ప్రతిభకు పట్టం కట్టింది.రాజ్యాన్ని అన్నివిధాలా సమర్ధవంతంగా ముందుకు నడిపించింది.

పుత్ర సంతానం లేకపోవడంతో దోమకొండ సంస్థాన పాలకులకు రాజన్నచౌదరి కుమారుడైన రాజరాజేశ్వరరెడ్డి - రంగవ్వ దంపతుల పుత్రుడు సదాశివరెడ్డిని దత్తత తీసుకుంది. రంగవ్వ ఎవరో కాదు రాణి శంకరమ్మకు స్వయానా చెల్లెలు.

రాణి శంకరమ్మ ప్రజల నివాసం కోసం గ్రామాలను కూడా నిర్మించింది. ఇందులో భాగంగా తన కుటుంబీకుల..ఆత్మీయుల పేరు మీద పట్టణాలు నిర్మించింది. 
తెలంగాణ ప్రాంతంలో ఉన్న సంగారెడ్డి పట్టణాన్ని రాణి శంకరమ్మ తన తండ్రి సంగారెడ్డి పేరు మీద నిర్మించింది. తల్లి రాజమ్మ పేరిట రాజంపేట గ్రామాన్ని నిర్మించింది.తన పేరు మీద శంకరంపేట గ్రామాన్ని నిర్మించింది. కుమారుడు సదాశివరెడ్డి పేరు మీద సదాశివపేట గ్రామాన్ని నిర్మించడం జరిగింది
 తన సైన్యాధ్యక్షుడు మేరెల్లి పాపన్న పేరు మీద పాపన్నపేట నిర్మించింది.
1774 లో శంకరమ్మ మరణించింది.
సామాజిక సంస్కర్త రాణి శంకరమ్మ గాథను నేటికీనీ జానపదులు వీరగాథలుగా చెప్పుకుంటారు పాడుకుంటారు.

▪️రాణి లింగమ్మ ( 18 వ శతాబ్దం)

1725 నుండి 1738 వరకు దాదాపు 13 సంవత్సరాలు రాణి లింగమ్మ గద్వాల సంస్థానాన్ని ఎదురులేకుండా పాలించింది. యుద్ధంలో వీరనారీగా, దానధర్మాల్లో మానవతా మూర్తిగా రాణి లింగమ్మ ప్రఖ్యాతిగాంచింది. తన పాలన కాలంలో తన చతురతతో కర్నూలు పరిధిలోని కొంత భూభాగాన్ని ప్రాంతాన్ని గద్వాల్ సంస్థానం పదిధిలోకి   
వచ్చేలా చేసింది. కవి పండితుల్ని ప్రోత్సహించడంతోపాటుగా తాడితుల్ని పీడితుల్ని ఆదరించింది కరువుకాటకాలేర్పడిన సమయంలో అన్నదానాలు కోసం గంజి కేంద్రాలు నిర్వహించింది.

కర్నూలు నవాబులకు గద్వాల ప్రభువులకు పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే శత్రుత్వం ఉన్నది. కాబట్టి 
 తన రాజకీయ అవసరాల కోసం చాణక్యం ప్రదర్శిస్తూ నిజాం రాజ్యంతో స్నేహ బంధాన్ని కొనసాగించింది . కర్నూలు నవాబులు గద్వాల సంస్థానాన్ని ఆధీనం చేసుకునే ప్రయత్నం ఫలించలేదు..

▪️రాణి ఉషమ్మ ( 18 వ శతాబ్దం )

సిర్నాపల్లి సంస్థానాధీశుల్లో ఒకరైన 
నాలుగవ చెన్నారెడ్డి మరణం తర్వాత అతడి భార్య ఉషమ్మ పాలనా బాధ్యతలు తీసుకుంది. ఈమె వీరనారి. ధైర్య సాహసాలు ఉన్న వనిత.
రాణి ఉషమ్మ వీరత్వం గురించి చెప్పుకుంటే...
1762 - 1803 మధ్య హైదరాబాద్ రాజ్యాన్ని నవాబ్ మీర్ నిజాం అలీఖాన్ సిద్దిఖి అసఫ్ జా ll పాలించాడు.1795 లో మరాఠ పేష్వా మాధవరావు II కు నిజాం ఆలీ ఖాన్ కు యుద్ధం జరిగింది. ఈ యుద్ధం పేరు ఖర్దా ఈ యుద్ధంలో నిజాం ఆలీ ఖాన్
 ఓడిపోయాడు. దైలతాబాద్, ఔరంగాబాద్, సోలాపూర్ లను వారికి అప్పగించి, 3 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాడు.
నిజాం అలీఖాన్ ఖర్దా యుద్ధం జరిపినప్పుడు, రాణి ఉషమ్మ ఆయుధాలు ధరించి స్వయంగా యుద్ధంలో పాల్గొన్నది.
నిజాం ప్రభువుపై నిర్మల్ దుర్గాధిపతి తిరుగుబాటు చేసినప్పుడు కూడా యుద్ధంలో సహకరించింది. 

▪️శీలం జానకీబాయమ్మ ( 19 - 20 శతాబ్దాల కాలం )
బాన్సువాడ మండలం పిట్టం గ్రామానికి చెందిన లింగారెడ్డి కుమార్తె శీలం జానకిబాయమ్మ. 12 ఏళ్ల వయసులోనే సిర్నాపల్లి సంస్థానానికి చెందిన రాజ ప్రతాపరెడ్డి తో వివాహం జరిగింది. వివాహం జరిగిన కొన్నాళ్లకే ప్రతాపరెడ్డి కాలం చేశాడు. ఆ విధంగా 12 ఏళ్ల వయసులోనే పాలనకు వచ్చిన శీలం జానకిబాయమ్మ 1859 నుండి 1920 వరకు 60 ఏండ్లు సంస్థానాన్ని గొప్పగా పాలించింది.

జానకీబాయి పగటి మషాల్ దొరసానిగా ప్రసిద్ధి చెందింది. . పగటి మషాల్ అంటే పగలే దివిటీలు వెలగటం అని అర్థం. పగటిపూట దివిటీలతో పల్లకీలో వెళ్ళడం అత్యున్నతమైన రాజగౌరవం. తెలంగాణలో కొందరు దొరలు కూడా పగటి మషాల్ దొరలుగా కొనసాగారు.

అనుచరులతో కలిసి గ్రామాల్లో పర్యటించి ప్రజల బాధలను స్వయంగా తెలుసుకునేది. ఇందుకు గుర్రంపై బయలుదేరేది.
సంస్థాన పాలనలో లింగన్న పట్వారి కీలక పాత్ర పోషించాడు. తన సిబ్బంది సహాయ సహకారాలతో 
జానకీబాయమ్మ ఆనాటి పాలన విధివిధానాలలో భాగంగా తన ఆధీనంలో ఉన్న గ్రామాల నుండి పన్నులు వసూలు చేసి, నిజాం ప్రభువుకి నిజాయితీగా లెక్కలు అప్పజెప్పేది. ఆ విధంగా నిజాం ప్రభువు అభిమానాన్ని చూరగొన్నది. నిజాం ప్రభు అండదండలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది.ఇందులో భాగంగా 
 -- చెరువులు కుంటలు బావులు, కాలువలు తవ్వించింది. వ్యవసాయాన్ని అభివృద్ధి చేసింది.
ఇందల్వాయి చెరువు, మంచిప్ప చెరువు, జానంపేట చెరువు, నల్లవెల్లి మత్తడి, దోన్కల్ కాలువ, లోలం చెరువు నిర్మించారు.
సిర్నాపల్లి గడితో పాటుగా , పాతగంజ్లోని క్లాక్ టవర్ , నవీపేట గడి, నిర్మించారు.
రఘునాథ ఆలయం, రఘునాథ చెరువు, ఖిల్లా రామాలయం, ఇందల్వాయి రామాలయం, జానకంపేట లక్ష్మీనరసింహస్వామి ఆలయాలను పునరుద్ధరణ చేశారు.
రాజ్యంలో ఒకానొక సమయంలో కరవు ఏర్పడింది. ప్రజలు తిండి గింజలులేక అల్లాడిపోతున్నారు. ఇటువంటి దుర్భర పరిస్థితిలో నిజాం దూతగా ఒక అధికారి పన్ను వసూలుకు సంస్థానంలోకి వచ్చాడు. ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసాడు. జానకీబాయమ్మ అధికారిని బండికి కట్టేసి ఊరు బయటకు పంపించి ప్రజాబంధువుగా నిరూపించుకుంది..
 --- పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతున్న సిర్నాపల్లి జలపాతం జానకిబాయమ్మ నిర్మించినదే.
--- నిజామాబాద్ బోధన్ దగ్గర ఉన్న జానకంపేట గ్రామాన్ని జానకిబాయమ్మ తన పేరిట నిర్మించింది. జనవాసాలకు స్థలాలను కేటాయించింది.
--- నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ అసఫ్ జా Vl 1899 లో హైదరాబాద్-బోధన్ - మీదుగా మన్మాడ్ రైల్వే లైన్‌ను తలపెట్టారు . జానకీబాయమ్మ నిజాం ప్రభువు దగ్గర తన పరపతి ఉపయోగించి రైల్వేలైనును సిర్నాపల్లి, ఇందూర్ మీదుగా మళ్ళించారు , ఫలితంగా 1905 లోనే సిర్నాపల్లికి రైలు సౌకర్య భాగ్యం కలిగింది. ఇందుకు కృతజ్ఞతగా జానకీబాయమ్మ ఇందూరు పేరును నిజాం పేరుమీద " నిజాం బాద్ " మార్చింది. కాలక్రమేనా ఇదే నిజామాబాదుగా మారిపోయింది.
1921లో జానకీబాయమ్మ మరణించింది..

▪️రాణి భాగ్యలక్ష్మిదేవమ్మ
(20 వ శతాబ్దం )
అతిపెద్ద సంస్థానంలో ఒకటైన ఆత్మకూరు సంస్థానం ( అమరచింత ) చరిత్ర పాలనలోను సాహిత్య పోషణలోనూ చెప్పుకోదగింది. పాలించడంలోనే కాదు, సాహిత్యాన్ని పోషించడంలో ఆత్మకూరు సంస్థానం తన ఉదారతను చాటుకుంది. ఈ సంస్థానం పూర్వ పాలమూరు జిల్లా, ప్రస్తుతం వనపర్తి జిల్లాలో ఉన్నది. 

సంస్థానం చివరి పాలకురాలు మహారాణి భాగ్యలక్ష్మిదేవమ్మ. వీరి భర్త శ్రీరాంభూపాల్ గారి మరణం తర్వాత పాలనా బాధ్యతలు స్వీకరించిన భాగ్యలక్ష్మిదేవమ్మ జనరంజకంగా పాలన సాగించింది.ప్రజలను ఆదరించడం.....సాహిత్యాన్ని గౌరవించడం.... రాణీ భాగ్యలక్ష్మమ్మ ప్రత్యేకత !

భాగ్యలక్ష్మి దేవమ్మ దోమకొండ సంస్థానం ఆడపడుచు.ఖర నామ సంవత్సరం ఆశ్వయుజ శుక్ల షష్టినాడు వృషభలగ్నం నందు క్రీ శ. 1891 లో 
దోమకొండ సంస్థానాధీశులు మహాయశవంత్ , రంగమాంబ దంపతులకు జన్మించారు .ముక్కెర వారసుల్లో ఒకరైన సీతారాంభూపాల్ ఏకైక కుమారుడు శ్రీరాంభూపాల్ తో వివాహం జరిగింది. 42 వ ఏటా 1930లో
శ్రీరాంభూపాల్ గారు తనువు చాలించాడు...భర్త శ్రీరాం భూపాల్ మరణం తర్వాత 1934 లో
 భాగ్యలక్ష్మమ్మ పాలనలోకి వచ్చింది. రాజ వ్యవహారాలు చక్కదిద్దడంలో నేర్పరిగా పనిచేసింది. సమర్థులైన అధికారులను నియమించుకుని, సంస్థానంలో విద్య వైద్య సదుపాయాలను మెరుగుపరిచింది.తెలంగాణ సాహిత్య వికాసం క్రమంలో వెలువడిన తొలి సంకలనం ఈ గోలకొండ కవుల సంచిక ప్రచురణలో రాణి భాగ్యలక్ష్మిదేవమ్మ ఆర్థిక సహకారం చెప్పుకోదగింది. ముద్రణ వ్యయం మొత్తం రాణిగారు అందించారు. ఇందుకు సగౌరవంగా ప్రతాప రెడ్డి గారు తన కవుల సంచికను భాగ్యలక్ష్మమ్మ గారికి అంకితం ఇచ్చారు.

హైదరాబాద్ రాష్ట్రంలో క్రమంగా నిజాం వ్యతిరేకత ఉద్యమం అట్టుడికింది. ఆత్మకూరు ప్రాంతంలో కూడా నిజాం వ్యతిరేకత నివురు గప్పిన నిప్పులా మొదలయ్యింది. భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం , ఆ తర్వాత ఆత్మకూరులో స్థానికుల జెండా సత్యాగ్రహాలు, నిజాం వ్యతిరేక ధీక్షలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో భాగ్యలక్ష్మమ్మ అనేక సవాళ్ళను ఎదుర్కోవాల్సి వచ్చింది.

▪️మహారాణి ఆదిలక్ష్మిదేవమ్మ
(20 వ శతాబ్దం )
 గద్వాల సంస్థానాన్ని పాలించిన రాజా చిన సీతారామభూపాలుని భార్య. ఆయన అనంతరం 1946 నుండి 1949 వరకు గద్వాల సంస్థానాన్ని పాలించారు.గద్వాల సంస్థానాన్ని స్వతంత్ర సంస్థానంగా ప్రకటిస్తూ నిజాం నవాబును ఎదురించి పాలించింది. ఎన్నో సవాళ్లను షరతులను నిర్భయంగా ఎదుర్కొంది. కవి పండితులని పోషించింది. ప్రతి ఏటా క్రీడలు నిర్వహించి ఔత్సాహికులను ఆదరించింది.1948లో భారత యూనియన్ దళాలు హైదరాబాదుపై పోలీస్ చర్య తీసుకొనే సమయంలో కీలక పాత్ర వహించింది..కర్నూలు నుండి గద్వాల సంస్థానం మీదుగా యూనియన్ దళాలు హైదరాబాదుకు వెళ్ళడానికి మార్గం సుగమం చేసింది .1949 లో సంస్థానాలు , జాగీర్ధారుల పాలనలు రద్దు కావటంతో సంస్థానపు ఆస్తులతో పాటుగా , గద్వాల కోటను కూడా ప్రభుత్వానికి అప్పగించింది. ఈ కోటలో మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ డిగ్రీ కళాశాల నడుస్తున్నది.. పాలించినంతకాలం ప్రజల మనిషిగా కీర్తి గడించిన మహారాణి ఆదిలక్ష్మిదేవమ్మ ఆగస్టు 18, 1953న మరణించింది.

▪️రాణి సరళాదేవి (20, వ శతాబ్దం )
సరళాసాగర్ ప్రాజెక్టు తెలుసా? 
పూర్వ పాలమూరు జిల్లా ప్రస్తుత వనపర్తి జిల్లా కొత్తకోట మండలం శంకరయ్యపేట గ్రామం దగ్గర కృష్ణానది ఉపనది అయిన చిన్నవాగుపై ఈ ప్రాజెక్టు నిర్మించారు.1947లో అప్పటి వనపర్తి సంస్థానాధీశుడు రాజారామేశ్వరరావు తన తల్లి సరళాదేవి పేరిట ప్రజల అవసరార్థం ఈ ప్రాజెక్టు నిర్మించారు. .1947లో ప్రారంభించబడిన ఈ ప్రాజెక్టు 1959లో పూర్తయింది.
ఆటోమేటిక్ సైఫన్ల టెక్నాలజీ ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. ఆసియాఖండంలో ఈ తరహా టెక్నాలజీ ఉపయోగించిన తొలి నీటిపారుదలప్రాజెక్టు ఇదే.

వ్యాసకర్త : తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

No comments:

Post a Comment