Monday, April 15, 2024

పట్కూరి.బసంత్ రెడ్డి

ఎడారి దీపం - పట్కూరి.బసంత్ రెడ్డి 
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
✍️తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

ఎడారి దేశాల్లో
ఎండమావుల తలాపున
గుండెలవిసేలా ఏడ్చి ఏడ్చి ఇంకిపోయిన కన్నీళ్లకు కనుచూపు మేరలో ఓ కారుణ్యం....
ఎదురు చూసి చూసి ఇంకెవ్వరూ రారని అనాధై పోయిన జీవితాలకు దరిదాపులో ఓ శరణ్యం ...
దిక్కులేక అలసి సొలసి ఇకఇంతే అని ఆగమైపోయిన
బతుకులకు నేనున్నాను అంటూ ఓ బాంధవ్యం 
అ.. త.. డు...
పట్కూరి బసంత్ రెడ్డి !

▪️నేపథ్యం 

తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం, మనోహరాబాద్ గ్రామానికి చెందిన పాట్కురి తుక్కన్న - నర్సవ్వ దంపతులకు 10 మే, 1975 న మూడవ సంతానంగా బసంత్ రెడ్డి జన్మించాడు.వీరిది మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం.తిరుపతిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, వీరి సోదరులు.
గంగాజమున బసంత్ రెడ్డి సహచరి.

వెనుకబడిన ఆర్థిక పరిస్థితుల మూలంగా బసంత్ రెడ్డి పెద్దగా చదువుకోలేదు. 10 తరగతి మాత్రమే పాసయ్యాడు. ఈ పరిస్థితుల్లో సరైన ఉద్యోగం రాక కొన్నాళ్ళు వ్యవసాయం చేసాడు. కానీ కరువు వెంటాడింది. ఈ పరిస్థితిలో కష్ట కాలాన్ని ఎదురిస్తూ పెట్టుబడులు పెట్టి వ్యవసాయాన్ని నడిపించుకోలేక....ఉన్న ఊర్లో బతుకుదెరువు మృగ్యమై... కాలానికి ఎదురీదుతూ భార్యా పిల్లలను వదిలి 1996 సంవత్సరంలో గల్ఫ్ దేశం వెళ్ళాడు. ఈ ప్రయత్నంలో భాగంగా ముందుగా పనికోసం బొంబాయి వెళ్ళాడు. అందుకు ప్రయాణ ఖర్చులు కూడా లేక ఆర్మూర్ సంతలో కూరగాయలు అమ్ముకుని వచ్చిన డబ్బులతో తన ప్రయాణం కొనసాగించాడు. తర్వాత అక్కడి నుండి గల్ఫ్ వెళ్ళాడు.

గల్ఫ్ లో సాధారణ భవన నిర్మాణ కార్మికుడుగా పనిచేస్తూ అక్కడే ఆరు సంవత్సరాలు నివసించాడు. ఆ ఆరేండ్ల కాలంలో - 
ఏజెంట్ల మోసానికి గురై... గల్ఫ్ దేశాల్లో చిక్కుకుని... నా అనే వారు లేక ఆకలిదప్పులతో అలమటిస్తూ... సొంత దేశం చేరడం కోసం సొమ్మసిల్లేలా రోదించే ఎందరో అభాగ్యుల రోదనల్ని ప్రత్యక్షంగా చూసాడు. చలించిపోయాడు. అప్పుడే అక్కడి బాధితుల కోసం ఏదో చేయాలి అని కంకణం కట్టుకున్నాడు. 
ఆ సంకల్పమే ఇప్పుడు అతడిని ముందుకు నడిపిస్తున్నది.

▪️గల్ఫ్ బాధితుల భగవంతుడు :

కులం లేదు...
మతం లేదు....
ప్రాంతం లేదు....
బాధితుల బాధ ఒక్కటే అతడికి వినిపిస్తుంది. బాధితుల కన్నీరు ఒక్కటే అతడికి కనిపిస్తుంది. అందుకే - బాధితుల పాలిట ఆపన్నహస్తమై సాగుతున్నాడు. సేవ ఒక్కటే మార్గంగా గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న కార్మికులను స్వచ్ఛందంగా వారి సొంత గూటికి చేరుస్తున్నాడు. అందుకే బసంత్ రెడ్డిని 
కార్మికులు తమ ప్రత్యక్ష దైవంగా భావిస్తుంటారు.

" బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడ బతుకులను కోల్పోయిన కార్మికులకు సహాయం చేస్తూ....నిస్సహాయులైన కార్మికులు యజమానుల మధ్య సమస్యలను పరిష్కరిస్తూ...ఎన్నో కుటుంబాలను నిలబెట్టిన బసంత్ రెడ్డి సదా స్మరణీయుడు " అంటూ ప్రజలు ఏక కంఠంతో కీర్తించడం ఒక గొప్ప సత్కారాన్ని మించిన గౌరవం.

▪️తెలంగాణ గల్ఫ్ సంక్షేమ సంఘం :

గల్ఫ్ నుండి హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన బసంత్ రెడ్డి తన సేవాభావాన్ని ఆచరణలో పెట్టాడు. ఈ క్రమంలో కొంత మంది సహాయ సహకారాలు తీసుకుని
ఒక టీంగా ఏర్పడి తెలంగాణ గల్ఫ్ సంక్షేమ సంఘం ఏర్పరిచాడు. సంఘం అధ్యక్షుడుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి, కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుని గల్ఫ్ బాధితులకు సేవలందించడం ప్రారంభించాడు.

బసంత్ రెడ్డి నిర్విరామ కృషి , అంకితభావం, సంకల్పం, వీటి సమన్వయ ఫలితంగా, గత ఐదు సంవత్సరాల నుండి సుమారు 400 మంది వరకు విజయవంతంగా వారి కుటుంబాలకు తిరిగి వచ్చారు.
వీళ్ళంతా తమ దేశాన్ని ఊరిని తమ వారిని ఇక చూడాలేమో అని ఆశలు వదులుకున్నవాళ్లు. ఇట్లాంటి వాళ్ళల్లో కొత్త ఆశల్ని చిగురింప జేస్తూ బసంత్ రెడ్డి తీసుకున్న చొరవ నిజంగా ఒక ఘన చరిత్ర. అంతేకాదు ....గల్ఫ్ దేశాల్లో చనిపోయి దిక్కులేని శవాలుగా పడివున్న మృతదేహాలను సైతం బసంత్ రెడ్డి సొంత ఊళ్లకు చేర్చాడు. ఇంతకన్నా మానవీయత ఉంటుందా? ఇంతకన్నా సేవ ఉంటుందా? ఇది బాధితుడికి బసంతుడికి ఉన్న ఎన్నాళ్ళ అనుబంధం? మరెన్నాళ్ళ ఋణానుబంధం?

▪️ఎడారి జీవితాలు - న్యాయపరమైన పోరాటం : 

ప్రస్తుతం వేలాది కార్మికులు ఎడారి దేశాల్లో అల్లాడుతున్నారు. మాతృదేశాన్ని దాటుకుని వెళ్లిన వాళ్ళ జీవితాలు అరణ్య రోదనగా మిగిలిపోతున్నాయి. దిక్కుతోచని పరిస్థితుల్లో అక్కడి " భారత రాయబార కార్యాలయాలు " పెద్ద దిక్కుగా కనిపిస్తాయి. కానీ అక్కడ సరైన స్పందన
లభించనప్పుడు జీవితాలు అగమ్యగోచరంగా తయారవుతాయి. ఈ క్రమంలో పట్టించుకునే నాథుడు కరువై అక్కడ భారతీయ / తెలుగు ప్రజలు అనుభవిస్తున్న నరకయాతన వర్ణనాతీతం. 
ఇట్లా గల్ఫ్ దేశాల్లో అవస్థలు పడుతున్న కార్మికులు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం సమగ్ర విధానం రూపొందించాలని బసంత్ రెడ్డి న్యాయపరమైన పోరాటం కూడా చేస్తున్నారు.

▪️GTWACA : 

గల్ఫ్ బాధితులకు .....గల్ఫ్ లో పనిచేస్తున్న కార్మికుల కుటుంబాలకు....సహాయం చేసే ఎజెండాతో ముందుకు వెళ్తున్న ఇటువంటి సంస్థలు భారతదేశంలో లేక పోవడం గమనించవలసిన విషయం.ఈ నేపథ్యంలో బసంత్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని గల్ఫ్ దేశాలలో అంతర్జాతీయ ప్రతినిధులను నియమించడం జరిగింది ఈ ప్రతినిధులు స్థానిక భారతీయ కార్యాలయాలతో సన్నిహిత సమన్వయంతో పని చేస్తారు. GTWACA 
ఏర్పడిన తరువాత, కష్టాల్లో ఉన్న ప్రతి భారతీయ గల్ఫ్ కార్మికుడిని ఆడుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. .  

▪️గల్ఫ్ దేశాల్లో తెలుగువాళ్ళు

ప్రస్తుతం గల్ఫ్ దేశాలలో దాదాపు 90,00,000 మంది భారతీయులు నివసిస్తున్నారు.అందులో 6,00,000 మందికి పైగా కార్మికులు తెలంగాణ కార్మికులు ఉండగా , వాళ్ళల్లో నిజామాబాద్ కరీంనగర్ జిల్లాలకు చెందిన కార్మికులు ఎక్కువగా
ఉన్నారు.

▪️సేవకు గుర్తింపు :

గల్ఫ్ బాధితుల సంక్షేమం కోసం బసంత్ రెడ్డి చేసిన ప్రయత్నాలను సేవలను సహకారన్ని తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. జాతీయ అంతర్జాతీయ వార్త మాద్యమాలు బసంత్ రెడ్డి సేవల్ని కొనియాడుతూ కథనాలు రాశాయి. ఈ క్రమంలో వివిధ ప్రతిష్టాత్మక పురస్కారాలు బసంత్ రెడ్డి ని అలరించాయి.

- 2015 సంవత్సరంలో ప్రొఫెసర్ జయశంకర్ జాతీయ పురస్కార గ్రహీతగా ఎంపిక అయ్యాడు.

- 2016 సంవత్సరంలో " డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశిష్ట సేవా పురస్కార్ " అవార్డును అందుకున్నారు

-2017 సంవత్సరంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు చేతుల మీదుగా " ఉత్తమ సామాజిక కార్యకర్త " పురస్కారంతో సత్కారం జరిగింది . 

 ▪️గల్ఫ్ దేశాలు - బసంత్ రెడ్డి చెప్తున్న నిజాలు :

ఇరాక్, కువైట్,బైరన్ దుబాయ్, ఖతార్, ఓమన్, సౌదీ అరేబియా, యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్
దేశాల్లో ఏజెంట్లచే మోసగించబడి అవస్థలుపడుతున్న తెలుగు ప్రాంతానికి చెందిన కార్మికుల కష్టాలను స్వయంగా బసంత్ రెడ్డి మాటల్లో వింటే కఠినశిలలు సైతం కరిగిపోతాయి -

" పల్లెల్లో జనాలు పేదరికంలో మగ్గిపోతూ నాలుగు రాళ్ళు సంపాదించుకుందామని కలలు కంటారు. నకిలీ ఎజెంట్ల మాయ మాటలు నమ్ముతారు. అప్పులు తెచ్చి లక్షల రూపాయలు వాళ్ళ చేతుల్లో పెడుతారు . దూరపు కొండలు నునుపు అన్నట్టు గల్ఫ్ దేశాల్లో సంపాదన గురించి గొప్పగా ఊహిస్తారు. తీరా అక్కడికి వెళ్ళగానే ఏజెంట్ మోసం అర్థమై పోతుంది. 
ఇంకేం చేస్తారు? ఉన్నా లేకున్నా ఊర్లో హాయిగా బతికిన జీవితాలు రోడ్డు మీద పడతాయి. పని లేక పస్తులు ఉంటూ మసీదుల్లో పడుకుంటూ.... ఇండ్లల్లో దొరికిన పని చేసుకుంటూ .... దుర్భర పరిస్థితిని అనుభవిస్తుంటారు. రోడ్ల మీద అట్టముక్కలు ఏరుకుంటూ... కొకకోలా సీసాలు ఏరుకుంటూ... బిచ్చగాళ్ల కంటే హీనంగా బతుకుతుంటారు.
కొందరు కార్మికుల పరిస్థితి చూస్తే వివిధ ఆరోపణల కింద గల్ఫ్ జైళ్లలో వేలాది మగ్గిపోతుంటారు. మరి కొందరు కార్మికులకు సరైన జీతాలు ఉండవు.వేధింపులకు గురవుతుంటారు.ఇండ్ల అద్దెలు చెల్లించుకోలేక ఎందరో వీధుల్లో నివసిస్తుంటారు. ఇంకొందరు కార్మికులతో కొన్ని యజమాన్యాలు వెట్టిచాకిరి చేయిస్తూ మానసిక శారీరక హింసలకు గురించేస్తున్నారు.

ఒక వాస్తవం ఏమంటే.... గల్ఫ్ దేశాలు గురించి, అక్కడి సంపాదన గురించి లేనిపోని కట్టుకథలు ఎవ్వరూ ఊహించవద్దు. గల్ఫ్ దేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పనులు ఉండవు. నైపుణ్యం ఉంటేనే పని ఉంటుంది...! గల్ఫ్ రావాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ విషయం గుర్తించుకోవాలి. దళారీలు చెప్పే మాయమాటలు నమ్మవద్దు.. " 

దయచేసి బసంత్ రెడ్డి గారు చెప్తున్న ఈ మాటలు గుర్తించుకోండి. పైసా పైసా దాచుకున్న మొత్తాన్ని దళారీల చేతిలో పెట్టకండి. అప్పుల పాలు అవ్వకండి.

▪️చిన్నప్పుడే వికసించిన హృదయ సంస్కారం :

 బసంత్ రెడ్డి 10 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు భూమయ్య తోటి విద్యార్థిగా ఉండేవాడు. ఒకరోజు భూమయ్య చిరిగి పోయిన చొక్కా చూసి తోటి పిల్లలు ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. అంతటితో ఊరుకోక చిరిగిన చొక్కాను మరింత చింపుతూ ఆటవిడుపు చేయసాగారు. భూమయ్య ఏడుస్తున్నా ఇబ్బంది పడుతున్నా పిల్లలు వినిపించుకోలేదు. ఈ పరిస్థితి బసంత్ రెడ్డి చూడలేక పోయాడు. వెంటనే తన చొక్కా విప్పి భూమయ్యకు ఇచ్చి, భూమయ్య చొక్కా తాను ధరించాడు. నేను ఉన్నాను అంటూ భూమయ్యకు భరోసా ఇచ్చాడు.అది చూసి తోటి పిల్లలు ఒక్కసారిగా ఆగిపోయారు.

ఇప్పటికీ బసంత్ రెడ్డి ఇదే మనస్తత్వంతో ఉన్నాడు. తోటి వారికి సహాయం చేస్తూ " మన మనిషి " అనిపించుకుంటున్నాడు ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ , అందరి వాడుగా అందరిలో కలిసిపోతున్నాడు.

▪️గల్ఫ్ కార్మికులపై అధ్యయనం : 

గల్ఫ్ దేశాల్లోని వలస కార్మికుల సమస్యలు అత్యంత దారుణమైనవి. మనసు పెట్టి చూస్తే అవి మరణాన్ని చూపెడుతాయి. ఈ సమస్యలపై అధ్యయనం చేసేందుకు పట్కూరి బసంత్ రెడ్డి మరో ప్రయోజనానికి శ్రీకారం చుట్టాడు. ఈ నిమిత్తం గల్ఫ్ తెలంగాణ అధికార ప్రతినిధిగా దుబాయ్ పర్యటనకు వెళ్ళడం కూడా జరిగింది. అధ్యయనం తర్వాత అక్కడి సమస్యలు గురించిన సమగ్ర సమాచారంతో భారత రాయబార కార్యాలయ అధికారులతో చర్చలు, సమస్యల పరిష్కారం దిశగా ప్రయత్నాలు, ఇవన్నీ ఎందరో దయనీయ కార్మికుల జీవితాల్లో వెలుగులను నింపే ప్రయత్నంగా వేరే చెప్పవలసిన అవసరం లేదు.

▪️అందరి ఆశీస్సులతో :

" సల్లంగా ఉండాలి బిడ్డా " అంటూ గల్ఫ్ కార్మికుల కుటుంబాలు బసంత్ రెడ్డిని గుండెల నిండుగా ఆశీర్వదిస్తున్నాయి.
కార్మికుల ఆశజ్యోతిగా .... శ్రేయోభిలాషిగా ... బసంత్ రెడ్డి గురించి వార్త పత్రికలు కథనాలు ఎన్ని ప్రచురించినప్పటికీ....కార్మికుల ముఖంలో చిరునవ్వులే బసంత్ రెడ్డి
సేవకు నిజమైన దీవెనలు...

No comments:

Post a Comment