Monday, April 15, 2024

నిరుపేద రెడ్ల ఎత ( బుర్రకథ )

నిరుపేద రెడ్డోళ్ళ కథ 
(బుర్రకథ )
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
రచన : తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

1▪️కథకుడు :
వినరా భారత వీర కుమారా 
కడగండ్ల కథ చెబుతాను....
నిరుపేద రెడ్డోళ్ళ ఎత చెబుతాను...

▪️వంతలు :
తందానా దేవ నందనానా 2
రెడ్డోళ్లు అంటే పెద్ద కులం అంటారు. కులం పెద్దదైతే కష్టాలు ఉండవా? కష్టాలు అందరికీ సుట్టాలే. మరి ఈ
నిరుపేద రెడ్డోళ్ళ కష్టాలు ఎట్లున్నాయో....
పైన ఢిల్లీ దాక యినబడేట్టు జెప్పాల్సిందే..
తరికిట జం తరి తా

2▪️కథకుడు :
వినరండయా చెవులారా వినరండయా 
కనరండయా కనులరా కనరండయా...

ఆదరణ కరువైన రెడ్డోళ్ళ రోదన 
ఆదెరువు కనరాని ప్యాదోళ్ళ వేదన ...
బతుకంత ముంచెత్తే ఇక్కట్ల యాతన 
శాపమై వెంటాడే కులనీడ వాదన....

వినరండయా చెవులరా వినరండయా
కనరండయా కనులరా కనరండయా
 
▪️వంతలు :
అయ్యో..
తందానా దేవ నందనానా 2
సై జెప్పినవు.....
బాధలు వరదలు అవుతున్నవి.
కలలు కల్లలు అవుతున్నవి. 
పేరు వెనుక రెడ్డి ఉన్నందుకు ఈ కష్టాలు తిష్టేసి- జీవితాలను ఎట్లా ఇబ్బంది పెడుతున్నయో 
అందరికీ అర్థం అయ్యేటట్టు జెప్పాల్సిందే...
తరికిట జం తరి తా

3▪️కథకుడు :
వినరండయా చెవులారా వినరండయా 
కనరండయా కనులరా కనరండయా...

చదువున్న బిడ్డలకు కొలువులు రావంట
పదోన్నతి మాట మరిచిపోవాలంట.....
సర్కారు ' బంధు ' కు అర్హత లేదంట
బువ్వలేకున్నా సరే భూసామి పేరంట.....

వినరండయా చెవులారా వినరండయా
కనరండయా కనులరా కనరండయా

▪️వంతలు
అయ్యో
తందానా దేవ నందనానా 2
సై జెప్పినవు.....
కర్మ తప్పించుకోలేక అవస్థలు పడుతున్న పరిస్థితిని అర్థం చేసుకునేది ఎవ్వరు? ఇదంతా ఆ రాజ్యాంగానికి చెవులు వచ్చి యినబడేట్టు జెప్పాల్సిందే...
తరికిట జం తరి తా

4▪️కథకుడు
వినరండయా చెవులారా వినరండయా 
కనరండయా కనులరా కనరండయా...

బతుకుదెరువు కోసం గాసాలా పాలాయే 
బతికి చెడిన ఆసామి కన్నీళ్ళ వశమాయే....
గంజినీళ్ళు కొరకు దినసరి కూలాయే 
గోడాడు గోస పెరుమాండ్లకెరుకాయే....

వినరండయా చెవులారా వినరండయా
కనరండయా కనులరా కనరండయా

▪️వంతలు
అయ్యో
తందానా దేవ నందనానా 2
సై జెప్పినవు 
పొలాలు ఉండి పెట్టుబడులు లేక ...అయిన అప్పులు తీర్చలేక దరిద్రం అనుభవిస్తున్న రెడ్లు
ఊర్ల నిండా ఉన్నరు. సెంటు పొలం కూడా లేని రెడ్లు కూలినాలి చేసి బతుకులు ఈడుస్తున్నరు . ఈ దయనీయ పరిస్థితిని గుండెలు పగిలేలా జెప్పాల్సిందే...
తరికిట జం తరి తా
 
5▪️కథకుడు
వినరండయా చెవులారా వినరండయా
కనరండయా కనులరా కనరండయా

మధ్యతరగతి రెడ్ల దినదిన గండం
చాలిచాలని బతుకుల ఎడతెగని యుద్ధం....
వెనకబడిన అవస్థకు అగ్రకుల హారం 
ఆగమైన ఆశల నిలువెల్ల గాయం

వినరండయా చెవులారా వినరండయా
కనరండయా కనులరా కనరండయా

▪️వంతలు
అయ్యో
తందానా దేవ నందనానా 2
సై జెప్పినవు...
ఆకలైతే పెద్దపులి పిల్లల్నే తింటుంది అన్నట్టు కులం కుంపటై రెడ్ల జీవితాలను కాల్చుకు తింటున్నది. ఉన్నోన్ని లేనోన్ని ఒక గాట కట్టేసిన ఈ అన్యాయాన్ని తరిమికొట్టేవరకు గొంతు చించుకుని జెప్పాల్సిందే...
తరికిట జం తరి తా
 
6▪️కథకుడు
వినరండయా చెవులారా వినరండయా
కనరండయా కనులరా కనరండయా

పల్లెల్ల రెడ్లకు పగల బుగులాయే 
ఆయినోడు కానోడు పడగ నీడాయే
అడుగడుగు బాధల ముసురు మొదలాయే 
దిక్కులేని గాధ గుండెల్లో నిదురోయే

 ▪️వంతలు
అయ్యో
తందానా దేవ నందనానా 2
సై జెప్పినవు...
బీద సాదలు, వాళ్ళ సాదక బాధలు, కులాల్ని బట్టి
గుర్తించినంత కాలం పేదరెడ్ల జీవితాల్లో వెలుగులు ఉండవు. ఈ ముచ్చట ఏలేటోళ్ళకి తెల్వంది కాదు. అయినా జెప్పాల్సిందే...
తరికిట జం తరి తా

▪️కథకుడు :
బలబలనోయ్ తమ్ముడా మేలు బలనోయ్ తాదానా
▪️వంతలు :
 భళా భళా 

🌹( కథకుడు మాట చెబుతుంటే... వంతలు సై అంటారు )

వెనకబాటు తనం కులాల్లోనే గాదు - సై
ఆస్తులు అంతస్తుల్లో గూడా ఉన్నది -సై
ఇది అన్ని కాలాల సమస్య- సై
దొరలు అన్ని కులాల్లో ఉన్నరు -సై
రాజ్యాలు భోజ్యాలు అందరివి కాదు - సై
పేదరెడ్లను పెద్దరెడ్లను కలిపి చూడొద్దు - సై 
రాజకీయాలకు అతీతంగా - సై
ప్రాంతాలకు అతీతంగా - సై 
రెడ్లంతా ఒక్కటై - సై
నిరుపేదరెడ్ల కోసం - సై
పోరాటం జేయ్యాలే - సై
హక్కులు గెలవాలే - సై
భావితరాలను కాపాడాలే - సై

No comments:

Post a Comment